[డా. బి. మల్లయా చారి గారి ‘తెలుగు సాహిత్యంలో ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం – పరిశీలన’ అనే సిద్ధాంత గ్రంథాన్ని ధారావాహికగా అందిస్తున్నాము.]
4వ అధ్యాయం – తెలుగు సాహిత్యంలో ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం
ఆ తరువాత భారతమాత కడుపున జన్మించిన మణిరత్నం ఝాన్సీరాణి ఘనతను ఈ క్రింది పద్యంలో ప్రశంసించారు.
“మదినూహించెద ఝాన్సీలక్ష్మిఘనతన్ మాతృత్వమున్ బిడ్డనిన్
బదిలమ్మొప్పగ గాచుకొంట, బరిలో బాల్గొన్న చందమ్ము
కదనమ్మందున గాళియై నిలిచి రంగత్పంచ కళ్యాణిపై
చదలంటన్ విహరించు నైపుణియు నాస్వాతంత్ర్య దీక్షాస్పదన్”
ఆ క్షణాన రాణి లక్ష్మీబాయి రౌద్రము, శౌర్యము అనుపమానం, సాహసంతో అపరకాళికలా వీపున బాలునితో తన గుర్రాన్ని దూకిస్తూ చండికలా విజృంభించింది. ఈ వీరనారి శైర్యము తరతరాలకు ప్రేరణనిస్తూ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయిందని ఈ పద్యంలో పేర్కొన్నాడు.
“వెలిగించరా వీర! వీరమంగళ పాండ్యు
తేజన మ్మెల యించు దీపమొకటి
వెలిగించవే తల్లి! వీర ఝాన్సీ రాణి
దీవ్యత్కధను దెల్పు దీపమొకటి
కల్పించవోయమ్మ! కట్టబ్రహ్మణ దీప్తి
దిగ్దంతులురియంగ దీపమొకటి
నిలబెట్టుమా చెల్లి! పులిబిడ్డ అల్లూరి
తెల్గువీరుని పేర దీపమొకటి
అహమదుషహా కుమారసింహవరు బేర
ఘనుడు లోక మాన్యతిలకు గారి పేర
దీపములు వెల్గించుడో పాపలారా
మహిత భారత స్వాతంత్ర్య మందిరాన!”
భారతదేశ స్వాతంత్ర్య కోసం విద్రోహులగు తొల్లదొరల మీద విరుచుకు పడిన విప్లవమూర్తి వీర మంగళపాండే గురించి, వీర పాండ్య కట్టబ్రహ్మణ్న వీరత్వం గురించి, తెలుగు వీరుడు అల్లూరి సీతారామరాజు గురించి మరియు లోకమాన్య బాలగంగాధరతిలక్ గురించి పై పద్యంలో స్మరించారు.
“స్వారాష్ట్రాభ్యుదయమ్ము గల్గి బహుధాసంపన్నమై భారత
క్ష్మారాజ్య ప్రతిభైక సంపదలు విశ్వంబంత వెల్గొందనా
శ్రీరమ్యాకృతి కన్నుగుబెట్టననియే జెప్పంగ బాశ్ౘ్ాత్యులా
పారావారము దాటి వచ్చిరిటకుం వ్యాపార మార్గమ్మునన్”
1757 ప్లాసీ యుద్ధం తరువాత బ్రిటిష్ వారి తరుపున ఈస్టిండియా కంపెనీ పరిపాలన ప్రారంభమైంది. తెల్లవారు వర్తకం కొరకు మన దేశంలో అడుగు పెట్టే నాటికి భారతదేశం సమృద్ధిగా ఉండేది. ఏ గ్రామానికాగ్రామం వ్యవసాయంతో పాడిపంటలతో కావలసినంత తిండి, బట్ట, విలాసవస్తువులు, రత్నాభరణాలను ఎగుమతి చేయగల ఉచ్చస్థితిలో మన దేశం ఉంది. ప్రపంచంలోకెల్లా సంపన్న దేశాన్ని ప్రపంచంలో కెల్లా నిరుపేద దేశాల సరసకు అతి తక్కువ వ్యవధిలో జయప్రదంగా దిగజార్చారు.
“వచ్చిరి వేనవేలు పెరవారు – పరాసులు, ఆంగిలేయులున్
డచ్చిజనమ్ములీ యెడకు – డబ్బులు దండుకొనంగ దానిచే
బిచ్చపు గూటివానికొక భిక్షుకుడెప్పుడు గిట్టనట్లునై
హెచ్చెను మచ్చరమ్ము ధరణీశుల జీల్చిరి దేశమంతటన్”
పోర్చుగీసు, డచ్, ఇంగ్లీషు, ఫ్రెంచి మొదలైన ఐరోపా వారు వర్తకం కోసం భారతదేశానికి వచ్చి, భారతదేశంలో భూభాగాలను సంపాదించాలనే కోరికతో డబ్బులు దండుకోవడంతో ఒక బిచ్చగాడికి మరొక బిచ్చగాడికి గిట్టనట్లు ఈ దేశాల మధ్య శత్రుత్వం ప్రారంభమయి చివరకు భారతదేశాన్ని ముక్కలు చేసారు. తల్లిని బిడ్డను వేరు చేసినట్లు అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసిన తెల్లదొరలను నిందించాడు.
“చేరిన వెంటనే ప్రభుల జిత్తము కెక్కుచు మెచ్చులాడి, వ్యా
పారము జేసి కొంటకయి పట్టెడు చోటొకచో నొసంగుడం
చారయ విన్నపాల్ సలిపి, యాచన జేసి యనంతరమ్ము దా
వారికి వీరికిన్ రవరవల్ గలిపించిరి కుట్రబుద్దులై”
ఇంకా అనేక వర్తక కేంద్రాలను నెలకొల్పుకోవడానికి మొగలు పాలకుడు అనుమతి పొందిన దగ్గరనుండి ఆంగ్లేయుల మోసము, వంచన పెద్దపెట్టున ప్రారంభమైనాయి. మరాఠాలపై శిక్కులకు, శిక్కులపై మరాఠలకు ఇరువురిపైకి రాజపుత్రులను ఇలా ఒకరిపై ఒకరికి తమ సైన్యాలను అండగా పంపి యావత్ దేశాన్ని కబళించే ప్రయత్నంలో చేయని మోసం లేదు. అధిక ఆదాయము వచ్చే రాజ్యాలను కబళించాలన్న ఆలోచన తప్ప నీతి, న్యాయం, ధర్మం, తెల్లవారికి ఏ కోశానా లేవని కవి తెల్ల దొరల కుతంత్రాలను ఈ పద్యంలో వివరించాడు. వార్ని నయవంచకులుగా చిత్రించారు.
“విశ్వమోహన కళావిభవమ్ము సృష్టించు
శిల్పి హస్తద్వయి చిన్నవోయె;
వసుధ వాసినిగాంచి పనమీరు చేనేత
వస్త్రనైపుణ్యమ్ము భంగపడియె;
పల్లీయ సౌభాగ్య మల్లీసకములైన
చేతివృత్తుల చేవచితికి పోయె;
భారత విజ్ఞాన పఠన పాఠనమెల్ల
బానిస చదువౌచుపాడు వడియె;”
బ్రిటిష్ పరిపాలన ప్రారంభమైన నాటినుండి తెల్లవారి దోపిడి నిరాఘాటంగా సాగిందని చెపుతూ విశ్వమోహన కళా విభవమ్ము సృష్టించు చేతివృత్తుల, కళాకారుల చేతులు వ్రేళ్ళు నరికివేసి ఉత్పత్తిలో నాణ్యత లేకుండా దేశవాళీ వస్తువుల మార్కెట్ కొల్లగొట్టబడింది. దాంతో వృత్తులకు ఆదరణలేక తయారయిన వస్తువులకు గిట్టుబాటు ధరలేక ఎగుమతులు పడిపోయి వివిధ వృత్తులవారు ఉపాధిలేక అనేకమంది చేతిపనివారు చితికిపోయి పేదరికంలో మగ్గిపోయారని, ఆగ్గిపెట్టెలో పట్టేంత సిల్కు వస్త్రాలను తయారు చేసే వస్త్ర నైపుణ్యము గిరాకీలేక నీచస్థితి లోనికి వెళ్ళిపోయి, పాడిపంటలతో వ్యవసాయంతో కళకళలాడే పల్లీయ సౌభాగ్యులు ఆర్థికంగా చితికిపోయాయి. తెల్లవారి కసాయి పాలనవల్ల సిపాయిలలో అలజడి మొదలైంది. ఇలా ఎంతకాలం ఈ దౌర్జన్యాలను భరించాలని భారతీయ ప్రజలలో ఆవేదన మొదలైంది. ఏదో ఒకటి చేసి మన మతాన్ని, ధర్మాన్ని సంరక్షించుకోవాలి అని అంతరంతరాళాల్లో భారత ప్రజానీకం సన్నద్ధమవుతుంది. విస్సోటనానికి సిద్ధమవుతున్నది. అయితే దానికి నాంది ఎవరు?
“అతడు భారతీయ సిపాయి – అతని సాటి
లేడెవండు స్వాతంత్ర్య చరిత్రలందు
తొలిగ భారత దాస్య శృంఖలలడుల్చి
తల్లిఋణమును దీర్చిన తనయుడతడు
అగ్ని పర్వతమ్మతడు మమాప్రభంజ
నమ్ము, స్వేచ్ఛా విహంగమ్ము – నవ్యపధము
తరుణ విప్లవ జ్యోతి – స్వాతంత్ర్య దీప్తి
ధాత్రి మంగళ పాండే యుదాత్త మూర్తి!
ఉత్తర భారత దేశ
మ్ముత్తమ సుతునొక్కనిగనె నోజ; పూర్ణున్
మిత్తినెదిర్చియు దేశపు
మత్తుడిగించిన మహాత్ము మంగళ పాండేన్”
భారత కదన రంగాన కొదమ సింహాలై ఎందరో వీరయోధులు భారతమాత దాస్య శృంఖాల విముక్తికై పోరు సల్పి తల్లి ఋణమును తీర్చిన భారతి తనయులెంతమందో ఉన్నారు. వారిలో భారతీయ సిపాయి ప్రథమ స్వాతంత్ర్య చరిత్ర యందు తొట్ట తొలిగా ప్రాణత్యాగం చేసిన గొప్పవీరుడు, దేశభక్తుడు విప్లవమూర్తి, మహనీయుడు, కార్యశూరుడు విప్లవం ద్వారా చైతన్యాన్ని కలిగించిన వీరయోధుడు, ప్రతి మనిషి గుండెలో స్వాతంత్ర్య జ్వాలలు మండించిన విప్లవవీరుడు అతడే మంగళపాండే.
“సిపాయిలం మేం సిపాయిలం/ పోరాడి సాధించే
మాతృభూమి వారసులం!/కులం మతం చిచ్చురేపి
రెచ్చగొట్టి విందు చూసే/తెల్లదొరల పాలిట మృత్యువులం
వరీ సైనికులం! మా ఒకే కులం!!
దత్తతలకు అడ్డుపడిన/డల్హౌసి సిద్ధాంతం
పులిబోనులో చిక్కుకున్న/అనురాగపు బాంధవ్యం!!
కర్షకుడు సైనికుడు/కవి పండిత వారసులు
బ్రిటీషోడి హయాములో/అతివృష్టికి సూచికలు!!
తెలుగోడికి, తెల్లోడికి/జీతములో వ్యత్యాసము
బలవంతపు మతమార్పిడి/బైబిలుకు పీటవేసి పోటు పొడిచే దొరగాడికి
‘జీహీదు’ ప్రకటించిన/మహ్మదీయ వారసులు
కలతపడ్డ తెలుగుగడ్డ/కన్నబిడ్డల ఆక్రందనలు!
ఆవుకొవ్వు పందికొవ్వు/పూతపూసి తాటానిచ్చి
రెచ్చగొట్టి చిచ్చురేపి/అసహనానికి గురి చేసిన
రాజకీయ చదరంగం/ తెల్లదొరల పాలిట – సృష్టించెను భీభత్సం!
భగభగమని మండుతూ/సింహంలా గర్జిస్తూ
తిరగబడి హతమార్చిన సహనశీలి శూరుడు
‘మంగళ్‌పాండే’ అనే రౌద్రశీలి వీరుడు!”
పై రెండు రచనలు 1857 తిరుగుబాటును జ్ఞాపకం చేస్తూ, మనలో చైతన్యాన్ని రగులుకొలుపుతూ ఒక రాజీలేని పోరాటాన్ని అందించి విప్లవజ్యోతి స్వాతంత్ర్య దీప్తిని మంగళ్‌పాండే గొప్పదనాన్ని మనముందుంచాయి. ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం చిరస్మరణీయమైనది.
మంగళ్‌పాండే అమరత్వం సందేశాన్ని అబ్బరాజు శ్రీనివాసమూర్తి అరుణోదయం ఖండికలో మహమ్మద్ ఇడ్రీస్ – 1857 శంఖారావం కవితలో ఆవిష్కరించారు. ఈ రెండు 1857 అజేయపాత్ర నిర్వహించిన మంగళపాండేను ప్రధానంగా చేస్తూ అతన్ని ఉన్నతోన్నతంగా నిలిపాయి.
“సీమదొర కామదాహంపు బాముకాటు
మాడ్చిమసిచేసి మాసంబు మంటగలప
ఊడబెరికి కినచెంగల్వ కాడవోలె
పనాడు పడినట్టి యేటి శవమ్మునేడు!
కన్న కడుపట్లు నిలువునా కాలిపోగ
ఆశలడుగంట గుండియలవిసిపోవ
గోడు గోడున బిట్టు గగ్గోలు వెట్టి
ఉసిగ బరువెత్తి, నదిదూకె ముసలితల్లి!”
“ప్రత్యూషమ్మున స్నానమాడి శుచి సుప్రాభాత కైంకర్యమున్
అత్యంతమ్మగు భక్తి శ్రద్ధమెయి సంధానించి, గోశాలకున్
నిత్యార్చ్యా విధి దీర్పగాగజని సాన్నిధ్యమ్మునన్ ధేనువున్
బ్రత్యక్షమ్ముగ గాంచలేక వ్యధతోవత్సమ్ముదోపింపగన్”
“రక్షకులైన భటాలియె
భక్షకులైన తరి యేరుపాలింతురిలన్
కుక్షింభరిత్వమొక్కటె
సాక్షమ్మొకొ పాలకులకు సామర్థ్యమనన్”
“నాతిమానభంగమ్మును, వైచికి వధ
వత్స మనువులుబాయుట, వనితలమృతి,
కుటిల రాజకీయము నిరంకుశతయున్ను
వహ్నికాజ్యమ్మువోసిన భంగియమ్యె
అబలకైనట్టి అన్యాయ మాపజాల
నింక నీకర్మ సాక్షిత్వమేలయంచు
నెత్తు రోడెడి కంట గన్నీరు వెట్టి
కాలమేఘమ్మునన్ దాగె కర్మసాక్షి!”
“ఒకనాడు ఉదయానే దేవలయమునకు ఠాకూరు, మాతనర్చించడానికి వెళ్ళడం జరిగింది. నిత్యార్చనకు క్షీరమందించే ధేనువు గోశాలలో అగపడలేదు. దూడ కన్నీరుపెడ్తోంది. గుడి ప్రక్కనున్న కోనేరులో ‘ధరణి’ శవమై అగుపించింది. రేపోమాపో బిడ్డకు పెండ్లి జేసి పంపించగలననే ఆనందంతో నున్న తల్లి, కూతురుకు జరిగిన ఘోరాన్ని భరించలేక ఆత్మాహుతి చేసికొన్నది. కన్నుకు జరిగిన ఘాతుకం, తల్లి ఆత్మహత్య దేవాలయగోవు తెల్ల దొరల విందులో భక్ష్యమైపోవడం ఊరు ఊరంత కన్నీరుమున్నీరుగా దుఃఖించింది”.
ఇంటింట చీకటే, ప్రతికంట కన్నీరే నాడు తెల్లదొరల దుష్ఠ్కార్యాలకు అంతులేదు. స్త్రీలను బలవంతం చేసి అత్యాచారం జరిపేవారు. తెల్లవాళ్ళ కసాయి కృత్యాలకు బలైపోయి అనేక మంది స్త్రీలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ విధంగా స్త్రీలు ఘోరాతి ఘోరంగా అవమానింపబడ్డారు.
“పదములంటిన మంగళ పాండెజూచి
కనులకానంద బాష్పాలు తొనుకులాడ
గ్రుచ్చియెత్తెను తండ్రి – వాకులకు మించు
క్రొత్తరూపమ్ము దలపింప కొడుకు పలికె
పుట్టితి భారతోర్వర బ్రపూర్ణ దయాంబుధులైన తండ్రికే
బట్టిగ! భద్రకాళి పదపద్మ మిళిందమనైన భక్తితో
ముట్టి ప్రతిజ్ఞసేతు, గనుమూయను పుట్టిన గడ్డకెన్నడో
పట్టిన దాస్య భూతమును బట్టి కలంచెద, మట్టు బెట్టెదన్!
అనుమానింపకు తండ్రి! లక్ష్యము శివాయత్తము, ఈ యజ్ఞమం
దణుమాత్రమ్మును జంకు జూపుదునె! మీ యాశీస్సులన్ గొందు, బ్రా
హ్మణధర్మమ్మను వీడి క్షాత్రమును సైన్యంబందుజేకొందు నా
తను రక్తమ్మును ధారవోసెదను స్వాతంత్య్రమ్ము సిద్ధింపగన్”
ఎంతకాలం ఈ దౌర్ౙన్యాలను భరించాలి అంటూ మంగళపాండే ఆవేదనతో రగలిపోతూ తండ్రి పాదాలను తాకి ముల్లును ముల్లుతో తీయాలని తెల్లదొరలను ఎదిరించడానికి సైన్యంలో చేరతానని అనగానే తథాస్తు అని దీవించాడు. నిదుర మబ్బుల్ని తరిమికొట్టి నిజాల చరిత్ర నిప్పు కణాల మీద నడక సాగించాడు. భగభగమని మండుతూ సింహంలా గర్ౙిస్తూ తిరగబడిన రౌద్రశీల మంగళపాండే.
“ప్రజల ధనమాన ప్రాణ సంరక్షణమ్ము
ప్రభుత్వ బాధ్యతకాగ నిరంకుశముగ
కుంపిణీ వారు దేశమ్ము గొల్లగొట్టి
బిచ్చకత్తెను జేసిరి యిచ్చమెయిని
చేతి వృత్తులు చితికెను స్వేచ్ఛయుడిగె
బ్రతుకు బాటలు గతి దప్పె, భారమయ్యె
కూడు కఱవయ్యె సంఘమ్ము కుమిలిపోయె
పాడు పాలన దేశాన్ని కాడుసేసె
జాతి తనువాదనమఱుచెను, చావురాని
బ్రతుకు వెళ్ళబోయంగ పరాయి పొంత
పొట్టకూటికి దలనిడి కట్టుబాని
సలుగ చేరినారెందరో సైన్యమందు
కొందరేయెండ కాగొడుగకులను బట్టి
జీతగాండ్రుగ దొరకొల్వు జేరుకొనిరి
మాతృదేశమ్ము సంస్కృతిన్ మంట గలిపి
కట్టెగొట్టడ దలదూర్చు కాలమద్ది”
1857 తిరుగుబాటుకు బ్రిటిష్ వారి దోపిడియే ప్రధాన పునాదిగా ఉంది. 1854 జులై 11వతేదిన కామన్స్ సభలో బ్లాకిట్ నాటి రైతుల దీన స్థితిని కళ్ళకు కట్టినట్లుగా వివరించారు. “విధింపబడిన పన్నులు అతిదుర్భరమైనవి కావడం వల్ల దైర్భాగ్యులైన రైతులు పస్తులతో అలమటిస్తూ భూమిపై చాపచుట్టుగా కూలిపోయారు. భూములు తాకట్టు పెట్టుకోవాల్సి రావటంతో అడుక్కు తినే వాళ్ళుగా మారారు” అని తెలిపాడు. ఇంకా బ్రిటిష్ వలస విధానం నాడు దేశంలోని చేతి వృత్తులను నాశనం చేసి, చేతి వృత్తులు కోల్పోయిన ప్రజలు పక్షులైనారు. ఈ కాల్చే ఆకలి, కూల్చే వేదనే భారతీయ రైతాంగాన్ని ఈ తిరుగుబాటులో పాల్గొనేలా చేసింది. దెబ్బతిన్న వ్యవసాయదారులు, చేతివృత్తుల వారు అందరూ తిరగబడ్డారు. కారల్‌మార్క్స్ తిరగబడిన సిపాయిల్ని యూనిఫామ్ ధరించని రైతులుగా అభివర్ణించాడు. ఈ కవి ఉదయ రాగము ఖండికలో సిపాయిలు జాతిమత కులవర్గాలు లేక భారతీయులు చాల మంది సైన్యంలో చేరారు. యూరోపియన్ సైనికులకు కష్టపడకుండానే ప్రమోషన్లు భారతదేశ సైనికులకు ఎంత కష్టపడినా పదోన్నతి రావటం జరగదు. ఈ తరుణంలో 1824లో బర్మాలో యుద్ధమొచ్చింది. సిపాయిలు రామన్నారు. కంపెనీ పెరేడ్ పెట్టించి పటాలము మొత్తం (దాదాపు 410 మంది) నిరాయుధీకరణ చేసి వెనకనుండి కాల్పులు జరిపించి చంపించింది. పారిపోయిన వారిని పట్టుకొని ఉరితీసింది. లేదా కాల్చి చంపింది.
సిపాయిలలో అలజడి మొదలైంది. కంపెనీ కోసం పోరాడేది మనం. యుద్ధంలో చనిపోయేది మనం. యుద్ధంలో క్షతగాత్రులైతే కంపెనీ ఆదుకోదు. ఇంత యుద్ధం చేసి ఇన్ని తుపాకులు పేల్చేది ఎవరి మీద? మన ప్రజలు మన రాజుల మీదనే. దానికి ప్రతిఫలం ఏమిటి? ఆంగ్లేయులకు అధికారం, భారతీయ సిపాయిలకు ‘కోర్టు మార్షల్’, సీతారామ్ అనే సిపాయి తన ఆత్మకథలో ఇలా వ్రాశాడు. “యూరోపియన్ అధికారికి 16 రూపాయలు లంచమివ్వని కారణంగా పెరెడ్‌లో ప్రతిరోజు కొట్టేవాడు”. ప్రతిరోజు మనసును గాయపరచే తిట్లు చివాట్లు, ఎంతకాలం ఈ దౌర్జాన్యాలను భరించాలి. సిపాయిలందరిలో ఆవేదన మొదలైంది. కొంతమంది సైనికులు భారతీయ సంస్కృతిని మంటగలిపి తెల్లదొరల అడుగులకు మడుగులొత్తి పదొన్నతులు పొందారు.
“ముందు చూపున బారకువూరు చేరె
చేరె మిలిటరీ – బందూకు చేతబట్టి
రాజసముగ ‘వందేమాతరం’ జపించి
స్వేచ్ఛకై ‘హరిః ఓమ్’ అనె వీరపాండె
మాఱువేషాల భాషల తీరు మార్చి
ప్రజల చైతన్య దీప్తుల బడయ, నేల
నాల్గు చెరగుల దిరిగి రానాడు – వేల
కొలది దేశభక్తులు ప్రాణములు తెగించి
జనపదముల చైతన్యమ్ముజాలు వారె
మిలిటరీ క్యాంపులుత్సాహ జలదులయ్యె
జాతి మొత్తమ్ము స్వేచ్ఛకై సంఘటించి
విప్లవించగ నదనుకై వేచి చూచు
పూవుతోడ రొట్టె పుష్పసందేశమ్ము
దాచి కొన్నదగుచు దనరసాగె
బాసిసీని బతుకు బ్రద్దలు సేయంగ
చేయిజేయి గలిపి సిద్ధపడిరి
పంపినట్టి రొట్టెకు మరి వందజేర్చి
గ్రామ గ్రామమ్మునకు గొన్ని ప్రేమబంస
నాదరమున మాతృపద ప్రసాదమనుచు
కనులకద్దుకొనిరి సత్ప్రగాఢభక్తి
రొట్టెలందించు సందేశమట్టె ప్రజల
గుండెలను జేరె! స్వేచ్ఛకై కోర్కెలెగసె
ఎఱ్ఱ తామర పువ్వును నెదల హత్తి
కొనుచు దల్లిపదములంచుదనిసినారు
నీచ దాస్యమ్ము బోద్రోల నిశ్చయించి
వేలకొలది సిపాయీలు విప్లవించి
పోరనుత్సాహపడిరి – ప్రభుత్వమునకు
ఎఱ్ఱతామర పువ్వు కనెఱ్ఱయమ్యె!”
సుఖనిద్రలో కలలు కంటున్న దేశ ప్రజలకు కలిగిందొక ఉలికిపాటు. అదే ప్రథమ భారత స్వాతంత్య్ర సమరంగా నిలిచిపోయిన ఆనాటి సిపాయిల తిరుగుబాటు తరగని సంపదకు చెరగని ప్రతీక భారతదేశం. తరతరాల సంస్కృతిని నిలపాలని స్వదేశీ నినాదాన్ని జాతి రక్తంలో ఎక్కించి చరిత్రలో ఎరగని రీతిలో యుద్ధభేరి మ్రోగించారు. అది తెల్లదొరల పీఠాన్ని తడబడింపజేసిన గంభీర పొరాటమది. సిపాయిలం మేం సిపాయిలం, పోరాడి సాధించే మాతృభూమి వారసులం అంటూ జాతి మతాలు పక్కకు పెట్టి ఒక్కటే సమైక్య పోరాటం చేశారు.
అది 1857 మార్చి 29 ఆర్‌పూర్‌లో ‘బర్మా నుండి యూరోపియన్ రెజిమింట్ వచ్చింద’నే వార్త విని ఆవేశంతో మంగళపాండే ఊగిపోయాడు. మిగిలిన సైనికులు ఎంత చెప్పిన తమాయించుకోలేకపోయాడు. ఒక చేత్తో కత్తి, ఒక చేత్తో తుపాకి తీసుకుని “ఎవ్వండురా పసుల కొవ్వులో ముంచిన తూటాల నెల మన నోట ముట్టుమనెను? కొవ్వెక్కి నోడెవడురా? మదమెక్కినోడెవరురా? సోదరులారా లేవండి! ఎందుకు వెనుకాడుతున్నారు? మీ దర్మం మీద ఒట్టు! రండి ముందుకు దూకండి! మన స్వాతంత్య్రం కోసం విద్రోహులగు శత్రువుల మీద విరుచుకుపడదాం” అని ఆవేశంలో ఉద్భోదిస్తూ మైదానంలోకి ఉరికాడు.
“తీయరా తల్వార్! పేల్చరా బందూకు? ఫట్ ఫట్” అంటూ రైఫిల్‌ను లేపుతూ “హరి ఓం! హరిఓం!” అంటూ వందేమాతరం జపించాడు. ఈ మహాసమర సందేశాన్ని వేగముగాను, ప్రభావవంతముగాను అందరికి చేరవేయడానికి ఎర్రకమలము, రొట్టెలు (చపాతీలు), ఉత్తమమైన సాధనంగా ఉపయోగించిన మంగళపాండే దానిని హృదయానికి హత్తుకుని తన దళములోని మిగిలిన సైనికులకు అందజేసాడు. ఈ అద్భుత యుద్ధనీతి కారణంగా యావత్తు దేశం మహా సంగ్రామం కొరకు ఎదురు చూడనారంభించారు.
తెల్ల దొరల పాలిట మంగళపాండే భీభత్సాన్ని సృష్టించాడు. క్రోధాగ్నుల్ని పుక్కిలించిన తీవ్రపోరాటంలో అతడు భగభగమని మండుతూ సింహంలా గర్జిస్తూ తిరగబడ్డాడు.
“అణువణువున చైతన్య మంగలించి
జాతి రక్తమ్మునన్ జేవ సంపదించె
కాలమందించు సరిక్రొత్త కానయనగ
అర్కుడుదయించె స్వేచ్ఛా విహారియగుచు
దివికమలపు బ్రతిబింబము
భువి వెలసిన దిద్ది సంఘమూర్తికి స్ఫూర్తిన్
భవితవ్యమ్మొనగూర్చగ
యువతకు నందించు తేజ ముజ్వల యశమున్”
“ధర్మ రక్షణార్ధమ్ము చేత ధరింయింపు
డయ్య శస్త్రమ్ము – శాంతి నిత్యమ్మునెగడు,
హింసననుభవించుటయ అహింసకాదు
నిష్క్రియత మహానేరమ్ము – నియతియుడుగు.
గుండె ద్రవియింప మనతల్లి కుమిలిపోవు
తన్ను దారెఱుగ, సుంతతపనలేక
ఐకమత్యమ్ములేని, ధర్మైక్యబుద్ధి
లేని సుతులగంటి నటంచు లేబరమున”
అనెడు సందేశమంది జనాళి గుండె
గూట నిండుగ భద్రపరచి కొనిరి, ఎఱ్ఱ
తామర భారతాంబగ మది దలచి గౌర
వమ్ము నెరపెను దేశ దేశమ్ము నాడు”
భారతదేశం స్వేచ్ఛ కోసం, బానిస బతుకులు మనకొద్దని, ఫిరంగి మోతలు, మారుమ్రోగగ యుద్ధబూమి దద్దరిల్లగ మొదటి తూట తానే పేల్చి యుద్ధ శకటమై ఉదయించాడు మంగళపాండే. అంచనాల్లో పొరబాటువల్ల ప్రణాళికల్లో తడబాటు వల్ల కొందరి వెన్నుపోటు వల్ల సిపాయిలు తిరుగుబాటు చేసారు. 1857 తిరుగుబాటు స్వేచ్ఛాగ్నుల్ని రగిల్చి విప్లవ మర్యాండుల్ని మొలిపించింది. ఈ కోవలో జనించిన విప్లవమూర్తి మంగళపాండే. ఇతడు బ్రాహ్మణ కులానికి చెందినా, క్షత్రియ ధర్మాన్ని స్వీకరించి, మంచి యువ సైనిక వీరుడుగా తయారైనాడు.
తన ప్రాణం కన్న ధర్మాన్నధికంగా ప్రేమిస్తూ నిర్మలమైన జీవనంతో యుద్ధరంగాన్ని ప్రచండ శౌర్యంతో బాసించే తేజస్వియగు మంగళపాండే హృదయం స్వదేశ స్వేచ్ఛా భావనతో ఉప్పొంగిపోయింది.
(సశేషం)
