[డా. బి. మల్లయా చారి గారి ‘తెలుగు సాహిత్యంలో ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం – పరిశీలన’ అనే సిద్ధాంత గ్రంథాన్ని ధారావాహికగా అందిస్తున్నాము.]
4వ అధ్యాయం – తెలుగు సాహిత్యంలో ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం
సైనిక సహకార పద్ధతి, రాజ్య సంక్రమణ సిద్ధాంతాలు, యుద్ధకుతంత్రాలై జడలు విప్పి తెల్ల భూతం. స్థానిక రాజులు, జాగిర్దారులు, జమీందారుల సహకారం బ్రిటీష్ వారికి నూతన స్ఫూర్తినిచ్చింది. వీరిని అనుకూలంగా మార్చుకొని దోపిడి చేశారు. వీరికి వ్యతిరేకంగా మంగళపాండేతో పాటు అనేక మంది సిపాయిలు ఎదురు తిరిగి తుపాకులు ఎక్కుపెట్టి తిరుగుబావుట ఎగురవేశారు. మహాసంగ్రామం సల్పి బ్రిటిష్ వారికి ఎదురుతిరిగారు.
“ధూర్తులు తెల్లవారు తొలుదొల్త గలట్టి తుపాకి తూటలన్
పూర్తిగ మార్చివేసి పయిపూతగ నింపిరి యాలకొవ్వు క
క్కుర్తిగ పంది కొవ్వుల నిగూఢత నయ్యది నొవ్వజేసె ము
మ్మూర్తుల హిందు ముస్లింల మూలబలమ్ముల నన్నిచోటులన్”
హిందువులకు తల్లివంటి ‘గోవు’, ముస్లింలకు అపవిత్రమైన ‘పంది’ కొవ్వు సిపాయిల తూటాలకు రుద్ది తూటా వెనుక భాగాన్ని నోటితో కొరికి లోపలి పొడిని బారల్‌లోకి పంపాలి. అలా చేస్తే తమ మత ఆచారాలు మైలపడతాయని భావించారు. కేవలం తమను బలవంతంగా మతమమార్పిడి చేయడానికే ఆంగ్లేయులు ఈ పని చేస్తున్నారని భావించారు. మొదట ఆంగ్లేయులు ఇదంతా వట్టి బూటకము వదంతి అని బుకాయించినా చరిత్ర సిపాయిల అనుమానాలు నిజమేనని నిర్ధారించింది. 1857 తరువాత మన దేశంలో మిలటరీ అధికారి వెలువరించి Mutiny of Bengal Army గ్రంథంలో ఎన్‌పీల్డు పరిశోధనలో ఇది వాస్తవం అని రుజవైంది. తప్పనిసరి పరిస్థితుల్లో కిరస్తానీ మతంలోకి లాగేయాలన్నదే తెల్లవారి దురుద్దేశ్యమని స్పష్టంగా తెలుస్తుందని కవి భావించారు. ఈ పద్యంలో హిందువులతోపాటు ముస్లింలను కూడా క్రైస్తవులుగా మార్చేవారిని వివరించారు.
“బలసి తూటాలు బందూకు బలముతోడ
విర్రవీగుచునున్న గర్వితుల నెదర
చేతబందూకు లేకున్న శివునికైన
దొరలదుష్కృత్య మెదిరింప దరమె ధరణి.
కొవ్వు తూటాలు వాడంగ గొరుకవలసి
వచ్చుటది పెద్దగా తిర్గుబాటు రేగె
ధాత్రి వణకెను స్వాతంత్ర్య తరణి దోచె
తొలుత భారత భూమిపూఐ వెలుగుజిమ్మె
చీకటెప్పుడుండదు వెల్గు రేక విరియు
తథ్యమనినదెఱగు జనతకనువిప్పి
జాగృతముగాగ – దొరగుండె జారుచుండ
తెరలి గుమికూడి బాటిల్సు తెరచిరంత”
“భూమి నాతల్లి! నేనామెపుత్రుడ నను
వేదభాష్యమ్ముదలచుడో విజ్ఞులార
తల్లిదాస్యమ్ము బాపంగ ధర్మఖడ్గ
మును ధరింపుడింక అమృత పుత్రులార!
తల్లి భరతమాత! తనయులము మనము!
జాతియెకటి! మనకు నీతి యొకటి
దాస్య శృంఖలముల దరగుటేలక్ష్మమ్మ
రక్త తర్పణమ్మె రాచబాట!”
పద్దెనిమిది వందల యాభైయేడు నల్లసూర్యుడు ఉదయానికి తెరతీసిన ఘనప్రతీక తెల్లపాలన అంతానికి ఎగరేసిన జయపతాక! తెల్లదొరల అహంకారానికి మంగళపాండే అగ్రహోదగ్రుడైనాడు తోటి సిపాయిలలో స్వాతంత్ర్య జ్వాలను రగిలించసాగాడు. వారందరిలో తిరుగుబాటును ప్రోత్సహిస్తూ అనల పతాకాన్ని ఎగురవేశాడు. భరతమాత ఆత్మగౌరవం నిలపడం కోసం ఓ సైనికులారా ధర్మ ఖడ్గమును ధరింపండి. మనం భరతమాత తనయులం. మనజాతి యెకటే, మనకు నీతి ఒకటే, ఈ తెల్లదొరల భరతం పడదాం అంటూ మంగళపాండే ఆవేశంతో ఊగిపోయాడు.
“హిందువెవండు ముస్లిమననెవ్వడు భారత మాత బిడ్డలే
యందరు భేదభావముల కాన్పదమెక్కడ! అన్నదమ్ములై
ముందుకు దూకి తీరవలె మూర్ఖ శిఖామణి తెల్లవాని యీ
సందున లేక త్రోలవలె జాతికి దాస్యము బాపగావలెన్”.
హిందువులు, మహ్మదీయులు అనే భేదం లేకుండా ఐక్యంగా తిరుగుబాటులో పాల్గొండి. మనము భారతమాత బిడ్డలం అన్నదమ్ములవలె దేశానికి స్వాతంత్ర్య సాధనకై కంకణం బద్దులై కదలండని సెగలు కక్కుతున్న అగ్ని పర్వతంగా బద్దలయి భగ్గుభగ్గుమన్నాడు.
“క్రొవ్వుతూటాలు నోటితో గొఱుకబోము
వాడమేమైనగాని – ఈ పాడు పనికి
బాలుపడమంచు దొలుత జవానులంత
ప్రతిఘటించె ‘డమ్ డమ్’ నగరమ్మునందు
ఆయుధాగార ప్రతినిధియైన కతన
వారి భావమ్ము “బేంటిన్” సిఫార్సు చేసె
చక్రవర్తుల మీ ప్రపంచమున కేమ
టంచు గర్వించు దొరలు పట్టించు కొనరు
పట్టెడన్నమ్ము కొఱకు సిపాయి యగుచు
బతుకు నమ్ముకొనిన నల్లవాడు మనల
నెదిరి నిల్చునే కల్ల! వాడేమి చేయు?
వాని బెదిరింపులెంత! నిర్వాక మెంత?
రాణ రవియస్త మించని రాజ్య చక్ర
వర్తులము మేమటన్న గర్వమ్ము బలిసి
యేరు పట్టించు కొనకున్న వీరులంత
విప్లవించంగ దలపెట్టె బెద్దపెట్టు
పాలనమ్మున నసురుడై బలిసియున్న
తెల్లదొర రావణునకీడు – తిండి యందు,
కుంభక్ణుని సరిజోడు – కుట్రలందు,
వాని సరిలేడెవండు ప్రపంచమందు
రెచ్చిపోయిన సైనికుల్ కచ్చపట్టి
పెట్టెమంట ‘అంబాల’ శిబిరములకును
కలిసి నిల్చె ‘బర్హంపూరు’ కాల్పలమ్ము
క్రొవ్వు తూటాల నిరసించి కోపగించి
తిట్టిపోసిన ‘మిచ్చేవు’ తెల్లదొరను
ఇట్ట వాయించి నోరు మూయించినారు
చేయునదిలేక దొరగారు శిబిర మందు
జేరి తలదాచుకొనిరి దారిగనక!”
పంది, గోవుల కొవ్వును నోట కొరకటమన్న ఊహే హిందూ, ముస్లిం సిపాయిలకు దుర్భరమైన మహాకూపంలో పడిపోతున్నట్టు తోచి తెల్లదొరలపై ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దాంతో బాక్‌పూర్‌లో పబ్లిక్ బిల్డింగులనూ, ఆఫీసర్ల బంగళాలను గుర్తు తెలియని సిపాయిలు తగులబెట్టారు.
“రేపు పెరేడ్‌లో బుద్దిగా తూటాలను తీసుకున్నారా సరే లేదా మిమ్మల్ని బర్మాకో, చైనాకో తోలేస్తాం” అని బెదిరించారు. అది సిపాయిల పుండు మీద కారం చల్లినట్లయింది. అదే అర్ధరాత్రి 1857 ఫిబ్రవరి 26న అంతా కలిసి ఆయుధాగారం ఉన్న డమ్‌డమ్ నగరమందు తిరగబడ్డారు. మంగళపాండే “అంతా బయటకు రండి! మనం మతం కోసం, మన ధర్మం కోసం చండాలపు తూటాలను కొరికితే మనమూ భష్ట్రులమవుతున్నాము. తెల్లదొరల బెదిరింపులకు భయపడకుండా కదలిరండి” అని వీరావేశంతో అన్నాడు.
కొంతమంది సిపాయిలు, రెచ్చిపోయి అంబాల శిబిరమునందు, బర్హంపూర్ నందు క్రొవ్వు తూటాలను నిరసించిన వారిని ఎదిరించిన 85 మందిని కఠిన కారాగార శిక్ష విధించారు. మంగళపాండేతో పాటు సిపాయిల మనస్సులో మబ్బులు కమ్ముకున్నాయి.
“ఏను భారతీయుడ! వేదమేను! గంగ
పొలము నాది! అణువణువు నెలవునాకు
బలము హిమగిరి! స్వచ్ఛంద పథము నాది!
ఏనుమాధవుడను సుమ్ము! మానవుడను!
పాహిమామ్మని ప్రార్థించు పక్షినైన
ప్రాణమిచ్చిరి మవారు – ప్రభులు గూడ
శరణనుచు గోరియర్థించు శత్రునైన
కాచి రక్షించినారు భూకాంతులిచట
రాఖిగట్టిన శాత్రపు రాణి హితము
గోరు పురుషోత్తములు వేలకొలదికలరు
పగర పట్టపు రాణి చేబడిన గాని
పాడి దప్పరు మా ఛత్రపతులు ధాత్రి
ముగురు మూర్తుల జక్కగా ముగుదయెకతె
లాలలాడించి జోలలుయ్యాలలూపె
ఒక పతివత్ర సప్తాశ్వునొక్కమాటు
కట్టివేసియు పిదప దా గరుణజూపె”
బ్రిటిషువాడ్ని మట్టుబెట్టే ప్రయత్నంలో ప్రాణాలను తృణప్రాయంగాపెట్టి ఎందరెందరో మహావీరులు, యోధులు, పీషాలు, సామాన్యులు సిపాయిలు పోరాడిన మహా సంగ్రామం 1857 బ్రిటిష్ సామ్రాజ్యాదిపత్యాన్ని కూలద్రోసే నేపథ్యంలో ఎందరో వీరులు ప్రథమ స్వాతంత్ర్య సమర ఘట్టంలో పాల్గొన్నారు. వీరిలో తిరుగుబాటుకు శంఖమూదీ భరతమాత స్వేచ్ఛా కోసం స్వతంత్య్ర సమరం చేసిన త్యాగమూర్తి విప్లవ వీరుడు మంగళపాండే బ్రిటిష్ అదికారులపై సింహగర్జన చేసాడు.
“కమ్మనికైత సాధనముగా ధరియించిన పోతరాజు ప
ద్యమ్ముల దానమాడిన పధమ్మిది, మాధపు పొందుగోరిరా
ధమ్మ తపమ్ముగొన్న వసుధాస్థలి, తీయని వేణుగాన లౌ
ల్యమ్మున వెఱ్ఱులెత్తన మహారసవాహిని భారతమ్మనన్
కాలికి నందె వేసి కవికాంతుని పల్లకి మోసె తానులో
కాలకు మార్గదర్శకుడుగా దెనుగుంబతి కృష్ణరాయుడీ
నేల, విచారమౌనుగన నేటికి మీ పరిపాలనమ్మునన్
మూలబడెన్ కవీంద్రుల కలమున్ గళమున్ దలవంచుకొన్నవై
అక్షరలక్షలిచ్చి కొనియాడిన భోజుని సాహితీ సభా
ధ్యక్షుడు కాళిదాస మహితాత్ముని సుందర కావ్య సృష్టిలో
నక్షయమైన సంస్కృతికి, హానిఘటిల్లెను స్వేచ్ఛలేక, మీ
రాక్షస పాలనమ్మున గులాముగ జీవన మీడ్వఖిన్నతన్
అసమానాద్భుత దానవైభవ మమావ్యాసంగ దీక్షాధ్వగో
ల్లసితాభ్యర్థి జనాంతరంగ సుమనోహ్లాదైక చిత్తుండు క
ర్ణ సమానుండెవడీ ధరిత్రినన బేర్గన్నట్టి దేశమ్ము, మీ
వినపుంబుద్ధి కతమ్ము భాగ్యముడుగన్ భిక్షార్ధియై నిల్చెడున్
పాడుయు బంటయున్ బ్రతుకు బాసటగా దనియించు నట్టి మా
కోడెలు నాలమందలు గుమిగూడిన సుందర పల్లెసీమలీ
నాడుకనంగారావు, బహునాయకమై అదికార కాంక్షరా
పాడిన కాలమయ్యె, దమపాలన జాతి నశాంతి ముంచెడున్”
భారతదేశ చరిత్రలో దేశ ముక్తి కాంక్షించి ఎందరో వీరులు అసమాన త్యాగాలు చేసిన స్వతంత్య్ర వీరులు ఉన్నారు. పృథ్వీరాజ్ చౌహన్, రాణాప్రతాపుడు, శివాజీ, వీరపాండ్య కట్టబొమ్మన, ఝాన్సీ లక్ష్మీబాయి, మంగళపాండే, తాంత్యాతోపే, నానాసాహెబ్, పీష్వా, కుమారసింగ్, అమర్‌సింగ్ మొదలైనవారు ఉన్నారు. వీరితో పాటు భారతమున ఉత్తమ సాహిత్యాన్ని సృష్టించి కవులెందరో వున్నారు. వీరిలో తెలుగులో భాగవతకర్త పోతన, భక్తిసాహిత్యాన్ని రచించారు. ఇంకా ఎంతోమంది దేశ సంస్కృతిని, సంపదను కీర్తిస్తూ దేశభక్తిని ప్రభోదించే గీతాలు రచించి దేశీయుల చైతన్యాన్ని ఉజ్జీవింపచేశారు. ఆ తరువాత సంస్కృతంలోను, తెలుగులోను, ఇతర దక్షిణాది భాషలలోనూ కవుల నాదరించి ఆంధ భోజుడిగా ఖ్యాతిపొందిన శ్రీకృష్ణదేవరాయులు సాహిత్య చరిత్రలో ప్రజా హృదయంలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నాడు.
అదేవిధంగా ఒకటవ శతాబ్దంలో భోజుని ఆస్థానమున ప్రసిద్ధ సంస్కృత కవి కాళిదాసు తన కావ్య సృష్టితో భారతీయుల మదిలో చిరస్మరనీయుడైనాడు. అటు సంస్కృత భాషను మృత భాష అని మన దేశ భాషలను అణగద్రొక్కి రాక్షస పాలన చేసారు తెల్లదొరలు అని మనం భారతీయులమని, ఈ దేశమే మన తల్లి అని ఆసేతు శీతాచలం భారతమాత అనే గాఢభావం అణువు అణువున రూపొందాలని, పాహిమామ్మని ప్రార్థించు పక్షినైన ప్రాణమిచ్చిన కాపాడారు. ప్రభువులు కూడ శరణ అన్న వారిని శత్రువైన వారిని రక్షించిన భారతదేశం మహోన్నతమైందని, భారతమాతనే ముగురమ్మల మూల పుటమ్మగా భజిస్తూ గానం చేసారని, మాత, గోమాత, భూమాత మాకు సమమని.
“అనుచు గర్జించె పాండె సింహమ్ము నిలచి
తెల్ల దొరలకు మొగములు వల్లెనయ్యె
తల్లి భారతి గుండియ తనిసివోయె
పాండె పెదవుల జిఱునవ్వు తనిసివోవ”
ఈ ఖండికలో అబ్బరాజు శ్రీనివాసమూర్తి గారు మంగళపాండే ఆంగ్లేయుల దౌర్జన్యాన్ని, వారి అహంకారాన్ని, అధికార మదాంధతను ఏ విధంగా ఎదిరించి తిరుగుబాటు చేసాడో వర్ణించాడు.
“కొవ్వుపూతల తూటాల కొరికి కాల్చు
డింక – సైనిక శాసనమేరు ధిక్క
రించరాదు – బ్రదుకు మదినెంచి మసలు
కొనుడటంచదికారి వాకొనుట జూచి
ధర్మబాహ్మ మౌసేత, విధర్మిజులుము
బ్రతుకు దాస్యమ్ము, దొరల కార్పణ్యగుణము
బాకు దూయంగ నా రాత్రి ప్రాణమెఱియ
బూని కనుమూయ దమ్యె ప్లాటూను దళము
క్రమ్ము కొన్నట్టి తిమిరమ్ము రాలిపోవ
అరుణ కిరణాల సైనికుల్ తిరుగబడిరి
ఎఱ్ఱబావుటా రివ్వున నెగురవేసె
కాలపురుషుండు గగన భాగమ్మునందు
పదియు నాల్గువందల నలుబదియునాఱు
నెంబరుగల సిపాయి పాండే ఘనుండు
తెల్లదొరల దూర్మార్గమ్ము డిల్లసేతు
నంచు నిర్ణీత బుద్ధియై నాత్మ నిలిచె
తల్లి భారతి మదిని చింతలనడంప
బిడ్డ లేకమ్ముగా నిలబడ్డ వేళ!
మార్చి ఇరువది తొమ్మిది – మగతనమ్ము
జూపిన ప్రథమ స్వాతంత్ర్య శుభదినమ్ము!
నిలవలేడయ్యె సమయమ్ము నిలుపదయ్యె
గుండె కొలిమిన భావాలు గప్పనంగ
లోడు చేసిన గన్ను సైదోడు నుండ
దూకె పాండె పెరేడ్ గ్రౌండు దుమ్మురేగ”
చండాలపు తూటాలను తాకేదిలేదని 19వ పటాలం మంగళపాండేతోపాటు అందరు డ్రిల్లులో ఖండితంగా చెప్పారు. కర్నల్ మిచెల్ వారి ఆవేదనకు ఆగ్రహ తీవ్రతను అర్థం చేసుకుని నేర్పుగా వారికి నచ్చ చెప్పవలసింది పోయి సిపాయిల మీద నిప్పులుకక్కాడు. 31న రెజిమెంటు 5వ కంపెనీలో 1446 నెంబరు సిపాయి మంగళపాండే బిగ్గరగా అరుస్తూ ఒక చేతిలో తూటాలు ఇంకో చేత తల్వార్ బూరా ఉంది అందరినీ రమ్మని ఆ తరువాత ఆవేశంలో ఎఱ్ఱబావుటా రివ్వున ఎగురవేసి బ్రిటిషు అదికారులపై రంకెవేయసాగాడు. 1857 మార్చి 29 ఆదివారం బరక్‌పూర్‌లో మంగళపాండే పేరెడ్ సందర్భంలో మేజరుపై కాల్పులు జరిపి, రండి సోదరులారా! తెల్లదొరల దురహంకారానికి తిరగబడమని సైనికులను కోరాడు.
“భారత మాత పుత్రలెట పందలుగారు, రణాంగనమ్మునన్
దీరత విక్రమించు రవితేజులు సింహ పరాక్రముల్, భళీ
శూరత విప్లవించుడిదె సోదరులార! స్వతంత్రపౌరులీ
ధారుణివెల్గ నాత్మ బలిదానమొనర్పతుపాకి బట్టరో”
భారతమాత పుత్రులెవ్వరు పిరికిపందలు కారు. సూర్యతేజంతో పరాక్రమించండీ సైనికసోదరులారా! ప్రాణానికి తెగించి తుపాకి పట్టుడో అని కేకపెట్టాడు.
“‘మారో’! మారో ఫిరంగికో! మారో భాయి!
అంచు గర్జించె పాండె క్రోధాగ్ని జిమ్ము
ప్రళయ రుద్రుండు మంగళపాండె నాడు
బ్రద్దలైన మహాగ్ని పర్వతమెవాడు!
‘పట్టుడా నల్ల కుక్కకను! వాయి నొక్కి
పట్టి బంధించ మామెప్పు బడయ గలరు!
ఒక సిపాయికింత పొగరె! బిఉర్విబ్రతుక
గలడె! తెల్లదొరనెదర్చి గంజి త్రగి’
అనెనో! లేదో! ఢాం అని తూట అతని గుండె
దూసుకొనిపోయె పాండె బందూకునుండి
పిల్లరాలినట్టుగ కేక బెట్టి పడుచు
మూల్గె ‘హ్యూసను దొర’ నెత్రు ముద్దయగుచు
మాతృద్రోహులు కాకుడు
ఈ తల తెగిపడిన కాని యెదుగుగ నిలుడీ!
ఆ తల్లి పదపద్మమ్ముల
మీతనువులు పూలుజేసి మెప్పును గనుడీ!
ఎవడు వచ్చునో చూచెద్! ఇటకు వచ్చి
బ్రదికి పోవునే యెకడైన! రాక పొదె
వాని తల! తెల్లదొరగాడెవడండొ! చూతు
నని విజృంభింంచె మంగళుడట్టె నిలిచి
సార్జెంట్ మేజర్ హ్యూసన్
గర్జించుచు వచ్చి మట్టి గఱచెన్ – ఆపై
తర్జించి లెఫ్టినెంట్ బేంక్
నిర్జింతునటంచు వచ్చి నిర్జింపబడెన్
తలతెగి మొండెము వేరై
బొల బొలమని నెత్రు జిమ్మె భువిపై నాపై
విల విల లాడెను దొరబా
బుల గుండెలు పాండె రూపు బొడగాంచినచో
తెల సైనికుడొక్కడు మం
గళ పాండెను జంప బందుకన్ గురి పెట్టన్
కలనూహింపనిరీతిలో
పులియైతెగ వేసెపాండు పుటకున్ వానిన్
కస్సని కత్తి దూసి దొర కంఠము వ్రేటున నేలరాల్చగా
ఠస్సలు జారె తెల్ల దొరపటాళికి, చిత్రము నోటిమాటలే
తుస్సనె! నాల్కలెండె! దొరదోపిడి కాలము చెల్లనంచు తే
జస్సము పేతు పాండెగని సైనికులెల్ల దలంచిరప్పుడున్
అంగరక్షక పటలి వెన్నంటి రాగ
నిప్పు కన్నుల క్రోధమ్ము గుప్పురనగ
పట్టి బంధించి పాండ్యాను మట్టుబెట్ట
వచ్చె ‘కల్నలు హీలరా’ ప్రాంతమునకు
పాండె కెదురుగ తుపాకుల బారుచేయు
నాజ్ఞజేసెను కల్నల్ దురాగ్రహమున
తూటదట్టించి చేత బందూకు పట్టి
నిర్భయమ్ముగ నిలిచె నిర్ణేతవోలె!
రక్త సిందూర విరాజిత ఫాల భా
గము త్రినేత్రమునౌచు కాంతులీన,
తీవ్ర క్రోధోదీప్త దీర్ఘ మహాశ్వాస
భుజగ పూత్కారమై భుస్సనంగ,
అరికంఠలుంటన వ్యాపార దక్షమౌ
బందూకు శూలమై పగరదునుమ
జాగ్ర న్మహాధర్మ సంరక్షణాసక్తి
శంకరు రూపుగా సంఘటింప
దాస్య విచ్ఛేదనోదాత్త ధర్మదీక్ష
త్రిపుర రాక్షస సంహార తేజమెసగ
ఉగ్రనరసింహుడగుచు మహోగ్రరీతి
తాండవించెను మంగళ పాండె శివుడు”
ప్రళయ రుద్రుడైన మంగళపాండే తెల్లవాడు కనిపిస్తే కాల్చేయండి అంటూ మహా ఆవేశంతో పేరేడ్ గ్రౌండ్‌కి పరుగులు తీసాడు. వాణ్ణి పట్టుకోకుండా అలా చూస్తారేమిటి అని జేమిందారు ఈశ్వరీ పాండేని గద్దించాడు. ఒక సిపాయికి ఇంత పొగరా! ఆయుధాలు లోడ్ చేయించండి అంటూ సార్జంట్ మేజర్ హ్యూసన్ హెచ్చరిస్తుండగానే మంగళపాండే తల్వార్‌తో లెఫ్టినెంట్ బాఘ్ హ్యూసన్ ఇద్దరు దొరలనూ పై లోకానికి పంపేసాడు. అంతలో షేక్ పుల్తూ అనే ముస్లిం సిపాయి మంగళపాండే నడుమును గట్టిగా వాటేసుకున్నాడు. చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు బితుకుబితుకుమన్నారు ఆ తెల్లదొరలు. మన స్వేచ్ఛా, స్వాతంత్ర్య కోసం విద్రోహులగు శత్రువుల మీద విరుచుకుపడదాం అని మైదానంలోకి ఉరికాడు. ఆ అరుపులు గర్జనలు విని సార్జంట్ మేజర్ హ్యూసన్ ముందుకు వచ్చి మంగళపాండేను నిర్భందించవలసినదిగా సైనికులకు ఆజ్ఞాపించాడు. సైనికులెవరు కదలలేదు. ఇంతలో మంగళపాండే పేల్చిన తూటా దెబ్బకు హ్యూసన్ నేలకూలాడు. మరో ప్రక్క భాగ్ రంగంలోకి దూకాడు. పాండే మరల తుపాకి దట్టించి తన కత్తి తీసుకొని ముందుకురికి భాగ్ తల నరికివేశాడు. మంగళపాండేను తాకితే ప్రాణాలు దక్కవని మిగిలిన సిపాయిలు హెచ్చరించారు. త్రిపురాసుర సంహారం చేసిన ముక్కంటిగా మారి ఒక్కొక్కరినీ ఏరివేయసాగాడు. అతని భీషణ రూపం తెల్లవారికే భయం కలిగించింది. తుపాకీ చేతబట్టి బరిలో నిల్చిన వీర పాండేను చూచి తెల్లదొరలు పరుగులు తీశారు. మంగళపాండేను తాకితే ప్రాణాలు దక్కవని మిగిలిన సిపాయిలు హెచ్చరించారు. మంగళపాండేను నిర్భందించండి అని కల్పల్ వ్హీలర్ ఆజ్ఞాపించాడు. అతడ్ని వెంట్రుకనైనా తాకమని సిపాయిలు తిరస్కరించారు.
“అమ్మా భారతి! నతిగై
కొమ్మా! క్షమియించుమమ్మ! కోపింపకుమా!
ఇమ్మేని సుమము నీ పా
దమ్ముల గయిసేయనిమ్ము! ధన్యుడనగుదున్
అని భావించుచు వీరమంగళుడు దానాత్మార్పణాబుద్ధియై
దనబందూకునుగుండె జేర్చుకొని మాతా! వందన! మ్మంచు ఠా
మ్మని ప్రేల్చెన్నది పాండె ప్రాణములకున్ హానిన్ వినా ఘోరమై
ఘనదేహమ్మున రక్త ధారలెగయంగాజేసె నొక్కుమ్మడిన్
ప్రాణ మాత్రావ శిష్టుడై త్రాణ దొఱగి
నెత్రుమగుడున ముద్దగా నేలబడిన
దేశభక్తుని స్వాతంత్ర్య దీక్షితునట
పట్టి బంధించె దర్పాన తుట్టెపురుగు
కాలమెదురయ్యె – సింహమ్ము కట్టబడియె
పాలకుని కంట వెలిగె గర్వము-పాలి!
తునకు నంధకారమ్ము పాదుకొన-తల్లి
భారతికి గన్నులే తడి యారవయ్యె!”
అమ్మా భారతి నీ బిడ్డడు శత్రువులకు లొంగడు నన్ను క్షమింపుమమ్మ కోపింపకుమమ్మ నీ పాదముల దగ్గర చేరనివమ్మ. నేను ధన్యుడగుదును అని భావించాడు. విద్రోహుల చేతుల్లో చావటం ఇష్టంలేని మంగళపాండే తుపాకి తనవైపు తిప్పి కాల్చుకున్నాడు. కిందపడిన పాండేను బంధించి తీసుకుపోయారు.
1857 ఏప్రిల్ 6న 34వ రెజిమెంట్ ఆధ్వర్యంలో సిపాయి మంగళపాండేపై రెండు అభియోగాలు వినిపించి నేరం ఒప్పుకుమ్మంటూ అని అడిగారు. రెండింటిలోనూ నేరం ఒప్పుకునేది లేదని మంగళపాండే తిరస్కరించాడు. సిపాయిని చేతులు కట్టేసి ఈడ్చుకొచ్చి ఉరికంభం ఎక్కించి మెడకు తాడు తగిలించారు. మిగిలిన సిపాయిలందరూ నివ్వెరపోయి నీళ్ళు నిండిన కళ్ళతో సహచరుడికి మౌనంగా కడపటి వీడ్కోలు ఇస్తుండగా. ‘తిరగబడిన వాడికి ఏ గతి పడుతుందో బాగా చూడమ’ని జనరల్ హియర్సే బిగ్గరగా అరుస్తుండగా ఉరికి సిగ్నల్ ఇచ్చాడు. బలిపీఠమెక్కిన మొదటి ధర్మవీరుడి శరీరం గాలిలో వేలాడింది. ఉరి బిగిసింది. మంగళపాండే ప్రాణం ఆకాశానికి ఎగిసింది. John Kaye అన్నట్టు తిరుగుబాటులో The first blood has been shed (మొదటి నెత్తురు చిమ్మింది). వీర మంగళుని శిరస్సును కన్నీటిలో తడిపివేసింది భారతమాత! (చివరలో) మహాశక్తివంతమైన బ్రిటిష్ సామ్రాజ్య మదగజాన్ని నిర్భయంగా ఎదిరించి నిబ్బరంగా ఉరికంభమెక్కి ధర్మంకోసం ప్రాణం వదిలిన లక్షలాది స్వాతంత్ర్యయోధులకు ఎనలేని స్ఫూర్తినిచ్చిన అమరవీరుడు మంగళపాండే గురించి కావ్యకర్త అబ్బరాజు శ్రీనివాసమూర్తి ఈ ఖండికలో ఆ మహావీరుని గొప్పదనాన్ని కీర్తించారు.
“మంగళుని వంటి మహితాత్ము మరణశిక్ష
నమలు జరుపంగనేవాడు సుముఖుడగును
దొరకడొక తలారియు నాడు బరకు వూరు
నందు-దొరతలగొట్టి నట్లయ్యె నిజము
గట్టయత్నము జేసి పైకమ్ము జల్లి
కుటిల చిత్తుల ముగుర నాక్రూరకర్మ
కంచు ‘కలకత్త’ నుండి రప్పించి మురిసె
నేచి పగగొన్న దొర తెల్ల త్రాచుపాము
భువన శ్రేయార్థమై పవికాగ తనయెమ్ము
దీరత నొసగు దదీచి యనగ,
ఉరగుల రక్షింప గరుడునిమేతయౌ
విద్యాధరకుమార వీరుడనగ
పాపుల కరుణించి బ్రతుకును సిలువపై
వారు వోసిన క్రీస్తు ప్రభువనంగ,
పరజాతి కుట్రలో నురితాట్ర దవిలిన
కట్టబొమ్మన జగజ్జెట్టియనగ
మాతృభారత సావిత్రి మంత్ర జపము
తనువు మనముల వెలుగంగ దనకు దానె
పూలచెండుగ నురిత్రాడు ముద్దుగొనుచు
పాండె నిలబడె చెరసాల గుండెలదర!
నల్ల జాతికి స్వాతంత్ర్య మొల్లదగద
టంచు తెల్లదొరలు పంతగించునాడు
బ్రదుక నొల్లని యొకపుట్టుబానిసీడు
బ్రతుకు ముగియించె స్వాతంత్ర్య పథము కొఱకు!
ఓసీ ఏప్రిల్ యెన్మిది
నీసిగ దెగనరక! నిట్టనిలువుగ గుండెల్
కోసితివి మంగుళనియురి
దీసి! క్షమింపదు చరిత్ర! దేశ ప్రజయున్!”
మంగళపాండేకి ఉరిశిక్ష నిర్ధారించిన తరువాత ఎంత గాలించినా తలారి దొరకకపోతే చివరి నిమిషంలో కలకత్తా నుండి నలుగురు దళిత కులాల నేటివులను పట్టుకొచ్చారు. మిగతా అన్ని ట్రూపుల సమక్షంలో 1857 ఏప్రిల్ 8 ఉదయం 6 గంటలకు ఉరితీశారు. ఈ రకంగా భారత చరిత్ర రంగస్థలిపై మెరుపులా మెరిసి మాయమయ్యాడు మంగళపాండే.
ఊరకపోవదెన్నడు మహోజ్వల మూర్తుల రక్తతర్పణ
మ్మూరకపోవదెచ్చట మహోద్యమనేతల కార్య శూరత
ల్లూరక పోవదెప్పుడు మహోన్నతలక్ష్య పధానుగమ్యమౌ
భారత జాతి యాశయము-పండి ఫలించె స్వతంత్రదేశమై
మంగళుడాదిగా భరత మాత పదమ్ముల వారు వోసిరు
ప్పొంగెడు వేడి నెత్తురులు, పోటరులైన యువకుల్ మరెందరో!
సంగర మార్గమే తమకు సాధనమంచుదలంచివారు సా
రంగుల పారదోలగ స్వరాజ్యము జేకొన విప్లవమ్మునన్
స్వాతంత్ర్యమ్మది జన్మహక్కని మహాశంఖమ్ము బూరించె నీ
జాతిన్ మేకొన లోకమాన్యుడిట, స్వేచ్ఛాభావ సందీప్తమై
ఏతామెతైను దేశభక్తికి బ్రజాభీష్టమ్ము! దాస్యమ్మునీ
చేతన్ మట్టగ నుద్యమించిరి జగజ్జెట్టీలుగా నాయకుల్
వీరపంజాబు సింహమ్ము దీరవరుడు
లాలలజపతిరాయ్‌పైన లాఠి చార్జి
కాజ్ఞయిచ్చిన దొరపైన నాగ్రహించి
కాల్చి చంపె భగత్సింగు ఘనుడు నాడు
వందేమాతర మనగా
చిందుల్ తొక్కెను పరంగి చేష్టలు దక్కన్
మందేరాజ్యమ్మనిబల్,
చిందుల్ వేసిరి స్వరాజ్య సేవకులంతన్
బాపుజీ నాయకత్వమ్ము భారతీయ
జనతకొక క్రొత్త విద్యుత్తు సంపదింప
గాలిపాంచజన్యము నూదె! నేలనిదుర
విడిచె! నరుని మూడవ కంట వెలుగు జిమ్మె!”
భారతదేశ చరిత్రలో 1857 ప్రజా తిరుగుబాటు ఒక మహోజ్వల ఘటన, ఒక మైలురాయి. ప్రపంచ చరిత్రలో అత్యంత న్యాయమైన, ఉదాత్తమైన, ఆవశ్యకమైన పోరాటాలలో ఒకటని అందరూ అంగీకరించాలి. ఎంత భయంకరమైన అత్యాచారాలైనా ఈ ఆశయాన్ని ఓడించలేవు. ఇది న్యాయమైన ఆశయం. పవిత్రమైన ఆశయం, ఉజ్వలమైన ఆశయం.ప్రపంచంలో నిజాయితీగల ప్రతి మనిషీ ఈ విషయంలో తీసుకోవలసిన నిర్ణయం ఒక్కటే. భారతీయుల న్యాయబద్ద పోరాటానికి తోడ్పడటమే అని బ్రిటిస్ విప్లవకారుడు ఎర్నెస్ట్ జోన్స్ 1857 సెప్టెంబర్ 5న వ్రాసిన ‘భారతీయుల పోరాటం’ అనే వ్యాసంలో ప్రకటించాడు. ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో మదమెక్కిన శ్వేతగజకుంభాన్ని పిడికిలితో పగులగొట్టిన మహోజ్వల మూర్తుల రక్త తర్పణం ఊరకపోదు. మన ధర్మాన్ని, సంస్కృతిని సంరక్షించుకొనుచు, స్వదేశాన్ని కాపాడుకొనేందుకు ఆశయంతో మంగళపాండే వంటి కార్యశూరులు ఈ మహా సంగ్రామాన్ని ప్రారంభించినట్లు తెలుస్తుంది. అందుకే ఇది స్వతంత్ర మహా సంగ్రామం.
కులమును, మతమును ప్రక్కనపెట్టి హిందూ ముస్లిములు ఏకమై సిపాయిలతో చేతులు కలిపి తెల్లదొరలపై ధ్వజమెత్తి స్వతంత్య్ర మహోద్యమం అంటూ పోరాటాన్ని సాగించారు. మంగళపాండే బలిదానం బ్రిటిషు వాడిపై క్రౌర్యం కట్టలు తెంచుకొంది. మంగళపాండే ధీరత్వాన్ని, స్ఫూర్తిని యువకులు ఎందరో ఆదర్శంగా తీసుకొని విప్లవాన్ని సాగించారు. ఆరక్‌పూర్‌లో మంగళపాండే పేల్చిన తొలి తూటా ప్రతిధ్వని ప్రకంపనాలై దేశం అంచుల్ని తాకి కొత్త శక్తుల్ని పుట్టించి తెల్లపాలన అంతానికి జయపతాక ఎగురవేసింది. స్వాతంత్ర్య నా జన్మహక్కని మహాశంఖం పూరించి జాతిని మేల్కొల్పిన లోకమాన్య బాలగంగాధరతిలక్, పంజాబ్ సింహంగా పేరుగాంచిన లాలాలజపతిరాయ్‌పైన బ్రిటిష్ దొర లాఠి చార్జి చేసినపుడు అతనిని కాల్చి చంపిన భగత్‌సింగ్ మొదలైన వారు సాతంత్య్రవీరులు. అలాగే బాపూజీ నాయకత్వంలో భారతీయులు విజయం సాధించి మనదేశం, స్వతంత్య్రమైన దేశంగా ఎర్రకోటపై జాతీయ పతాకం ఎగురవేయడం మనందరికీ తెలిసిన విషయమే.
“బాపు, జహ్వరు, వల్లభభాయ్, పఠేలు,
హిందువీర సావర్కారు, హెడ్గవారు,
బాబు రాజేంద్ర, కృపలాని, భావెఋషియు,
దాసు, నేతాజి, లాల్‌బహద్దరు, మొరార్జి
జయ ప్రకాషజాద్, గఫర్, రాజాజి, ఘనులు,
టంగుటూరి సింహమ్ము, పట్టాభి, రంగ,
అయ్యదేవర, వేంకటప్పయ్య, బులుసు
సాంబమూర్తి, శ్రీరాములు, సత్యమూర్తి
గొల్లపూడి శాస్త్రియు, నడింపల్లి ప్రభృతు
లుద్యమించిరి స్వాతంత్ర్యయుద్యమమున
ధీరురాలు సరోజినీదేవి, దుర్గ
బాయి, అమృతకౌర్ మున్నగు వనితలెల్ల
ముందు దూకిరి స్వాతంత్ర్య భూమి కొఱకు
బాపు వెను వెంట సంగ్రామ పధమునందు
అడుగునడుగునందునైక మత్యము జూపి
మేలు కొలిపి కేలు గేలు పట్టి
జాతి నడిచె వెంట! శాంత్యహింసల మధ్య
మూడు కాళ్ళ తాత ముందు నడువ!
ఉద్యమమ్ము లెన్నొయుర్వి విజృభింంచె
మాతృదేశ భక్తి మల్ల చఱుప
తెల్లపులుల ప్రభుత పల్లటీల్ గొట్టంగ
వీక చచ్చిదొరలు తోక ముడిచె
ఘనుడు పింగళి వెంకయ్య కార్యదీక్ష
చిన్నెలొలికిన నాటి మువ్వన్నెజెండ
రాట్నము బదులు ధర్మ చక్రమ్ము నిలుప
నదియె జాతి పతాకయై యందగించె
భారతాంబకు నుదుటి సిందూరమగుచు
నింపు గులికెడు కెంపుల యెఱ్ఱకోట
పైన రెప రెప లాడె మువ్వన్నె జెండ
పండుగాయెలే! ఆగష్టు పదియునైదు!
నాటి తరములు త్యాగ మీనాటి యువత
మఱువ కుండంగ దేశ నిర్మాణమందు
భక్తి భావాన సేవించు భాగ్యమునకు
బిడ్డలందరని దీర్చి దీవింపవమ్మ!
మంగళము! దివ్య భారత మాత! మంగ
ళమ్ము! సుప్రజాస్వామ్య దేశమ్మ జయము
జయము! శాంతి సంధాత ప్రజ్ఞా సమేత
వందనము తల్లి! పాదాభివందనమ్ము!”
బ్రిటిషు విధానాలకూ, సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా ప్రజల్లో పెల్లుబికిన అసంతృప్తికి పరాకాష్టగా 1857 తిరుగుబాటు ప్రజ్వరిల్లింది. అది ఆకస్మికంగా సంభవించిన ఘటన కాదు. దీర్ఘకాలంగా ప్రజల మనస్సులో గూడుకట్టుకున్న అసంతృప్తి వ్యతిరేకత ఒక్కసారిగా బద్దలైంది. ఈ మహా సంగ్రామం రెండు సంవత్సరాలు సాగింది. తిరుగుబాటులో నిజమైన మహాపౌరులు సిపాయిలే. వీరిలో అనేకమంది గొప్ప ధైర్యసాహసాలు ప్రదర్శించి వీరోచితంగా పోరాడి చివరకు ప్రాణాలర్పించారు. ఈ తిరుగుబాటు భారతీయుల హృదయాలలో పోరాట పటిమను, ధైర్యాన్ని నింపినది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వారా ఆజాద్ హిందు ఫౌజ్ నిర్మాణానికి ప్రేరణ నిచ్చింది. ఈ సమరమే 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రజలు అనుసరించిన పద్ధతులన్ని 1857 సమర పద్ధతులే. సిపాయిల తిరుగుబాటుతో ప్రారంభమైన మొట్టమొదటి స్వాతంత్ర్య సమరం ఈనాటికీ యిస్తుందొక ప్రతిఘటన సంకేతం.
ప్రథమ భారత సంగ్రామం భవిష్యత్తుకు బాటలు వేసింది. జాతీయోద్యమానికి పునాదిగా నిలిచింది. క్విట్, క్విట్ ఇండియా అంటూ గర్జిస్తూ మువ్వన్నెల పతాకాన్ని ఎర్రకోటపై నిలిపింది.
గాంధీ, నెహ్రూ, వల్లభభాయ్, హిందు వీరసావర్కారు, బాబు రాజేంద్రప్రసాద్, కృపలాని, నేతాజీ, లాల్‌బహద్దుర్ శాస్త్రి, రాజాజీ, టంగుటూరి ప్రకాశం, పట్టాభిసీతారామయ్య, బులుసు సాంబమూర్తి, పొట్టి శ్రీరాములు, నడింపల్లి మొదలైన నాయకులు మరియు సరోజినీదేవి, దుర్గాబాయి, అమృతకౌర్ మున్నగు వనితలు బాపూజీ వెంట నడచి సాతంత్య్ర ఉద్యమమున సమర ఉత్సాహంతో పాల్గొన్నారు. ఆంగ్లేయులతో పోరాటం చేయాలనే ఆకాంక్షకు విత్తనం వేసింది 1857 మహా సంగ్రామమే. అనేకమంది నాయకులకు, విప్లవకారులకు ప్రేరణ ఈ మహా సమరమే అని చెప్పాలి. స్వతంత్రం వచ్చిన తరువాత గోవా విముక్తి పోరాటానికి పాండిచ్చేరి విముక్తి పోరాటానికి ప్రేరణ నిచ్చింది 1857 సమరమే.
ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆ నేతల తలపులే జాతి జనుల హృదయాల్లో దేశభక్తిని రగిలించే చిరు దీపికలు. భారతమాత మెడలో నిలిచిన పూలహారంలా మంగళపాండే వీరుడై, అమరుడై నిలుస్తాడు. బ్రిటిష్ సామ్రాజ్యదిపత్యాన్ని కూలత్రోసే నేపధ్యంలో ప్రాణాలర్పించిన ఎందరో వీరులకు, స్వాతంత్ర్య సమర యోధులకు వందనం, అరుణ వందనం. ప్రతి భారతీయుడు దేశభక్తుడిగా మారి నాయకులు ప్రాణత్యాగం చేసి మనకు పంచిఇచ్చిన స్వాతంత్ర్యన్ని ఎల్లవేళలా కాపాడుకుందాం.
“మంగళము! దివ్యభారత మాత! మంగ
ళమ్ము! సుప్రజాస్వామ్య దేశమ్మ జయము
జయము! శాంతి సంధాత ప్రజ్ఞా సమేత
వందనము తల్లి! పాదాబివందనమ్ము!”
(సశేషం)

