[డా. బి. మల్లయా చారి గారి ‘తెలుగు సాహిత్యంలో ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం – పరిశీలన’ అనే సిద్ధాంత గ్రంథాన్ని ధారావాహికగా అందిస్తున్నాము.]
4వ అధ్యాయం – తెలుగు సాహిత్యంలో ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం
4.2. ఝాన్సీరాణి (పద్యకావ్యం) కావ్యకర్త పరిచయం (విశ్వనాథ):
కవి సామ్రాట్టు, జ్ఞానపీఠం పురస్కార గ్రహీత ప్రక్రియలన్నింటిలోనూ ప్రజ్ఞా పాటవాల్ని ప్రదర్శించిన ప్రతిభామూర్తి విశ్వనాథ సత్యనారాయణ. మల్లాది రామకృష్ణశాస్త్రి అభివర్ణనలోనే చెప్పాలంటే ‘దేశం పట్టనంత కవి’గా ప్రశంసించబడిన సంప్రదాయకవి విశ్వనాథ. తన పసి వయసులోనే కవితారచన ఆరంభించారు. తనలోని సాహితీలతకు నిత్యం నీరుపోసి పెంచుకున్నారు. తొలుత కొడాలి ఆంజనేయులుతో కలిసి జంట కవితా సాధన చేశారు. ఈ నేపథ్యంలో హంపీ క్షేత్రం వంటి మంచి రచనలు అంకురించాయి. వేయిపడగలు నవలా రచనతో ఆయన సాహితీ జీవితం కొత్త మలుపు తిరిగింది. సంస్కృత సాహిత్యంతోనూ ఆయనకు లోతైన పరిచయం ఉందని ఝాన్సీరాణి పద్యకావ్యాలు రుజువు చేసింది. కావ్యాత్మను పసిగట్టడంలో విశ్వనాథ మహాదిట్ట.
ఝాన్సీరాణి కావ్య పరిచయం:
ఈ పద్యకావ్యంలో తొమ్మిది ఆశ్వాసాలున్నాయి. దీన్ని ధర్మవరపు వెంకట సుబ్బయ్యగారికి అంకితమిచ్చారు. ఈ పద్యకావ్యం నాల్గు రోజల్లో వ్రాసానని కవి చెప్పుకున్నారు. ఇంచుమించు ప్రతి ఆశ్వాసంలోను 50 పద్యాలు, (8-9 అశ్వాసాలు 38-21 పద్యాలు) కొన్ని అశ్వాసాలు (ఉదా:-1,2,5,6,7) రెండేసి ఖండాలుగా అంటే సుమారు 25-25 పద్యాలుగా రచింపబడ్డాయి. మిగిలిన వాటిలో ఆ విభాగం లేదు. ఎందుకో బహుశా తొందర వల్ల జరిగిందేమో, ఎందుకంటే ప్రతి అశ్వాసమూ 1- అని ప్రారంభింపబడడం – దాదాపు అన్నీ (8-9 తప్ప) ఏబదేసి పద్యాలుండడం వల్లా 25 తర్వాత 2 (ద్వితీయ ఖండం) అని వ్రాయడం మర్చిపోయి వుండవచ్చుననుకోవడం వల్లా – అలా అనుమానించవలసి వస్తున్నది. ఏమయినా ఒక విభాగ దృష్టి స్పషంగా కన్పిస్తున్నది.
ప్రతి అశ్వాసమూ ఒక ఋతువర్ణనాత్మక సీసపద్యంతో ముగియడం చూడతగ్గ విషయం. అంటే ఆలోచించ తగ్గది. ఈ రెండు విషయాలు కవి నిర్మాణ దృష్టిని సూచించేవి. ఆ నిర్మాణంలో ఒక ప్రమాణముంది. ఆ ప్రమాణమే కావ్య నిర్మాణ సూత్రం. అది లేనివాడు కవి కాడు. కావ్యానికొక మూర్తి ఉంటుంది. అది మలచబడి – చెక్కబడి-నిర్మింపబడ్డదా? లేక ఏదో వ్రాయబడ్డదా? కాబట్టి ఆ మూర్తి నిర్మాణంలో ప్రమాణ ముండాలి.
(భారతీయ శిల్పంలో ఆయా మూర్తులకు దైవ-మానవ-రాక్షసాది జాతుల మూర్తి నిర్మాణంలో నిర్దిష్ట ప్రమాణమున్నట్లు – కొన్నిచోట్ల శాస్త్ర ప్రమాణం కావచ్చు. కొన్ని చోట్ల స్వతంత్ర ప్రతిభ కావచ్చు. స్వతంత్ర ప్రతిభ అనకూడదు. నిజానికీ ప్రతిభ స్వతంత్రం కనుక-) కావ్యం ఒకచోట ప్రారంభమై మరొకచోట అంతమౌతున్నది కదా? ఎందుకు? ఎక్కడో ఒకచోట కాక తప్పదు కనకనా! (ఇలా అనేవాడు కవీ కాడు, విమర్శకుడు కాడు) అరిష్టాటిల్ అన్నాడు- ‘కథలో లేక కథకు ఒక ప్రవాహదశ-పాటు (Magnitude) వుండాల’ని. అంటే ప్రారంభాంతాలకు ఒక నిర్దిష్ట ప్రమాణముందన్నమాట. నాటకశిల్పంలో నాందీ భరత వాక్యాల మథ్య కావ్యముండాలన్న నియమంగానీ – ప్రారంభం బీజం – అంతం ఫలాగమమన్న నియమంగానీ ఆ ప్రమాణ వ్యంజకాలు.
భూమిక: ఇది చరిత్రకు తాత్త్వికార్థం చెప్పిన కావ్యం కనుక ఆ చరిత్ర తత్త్వ విచారణ ఆవశ్యకమౌతున్నది. “సరళరేఖ-వృత్తం గణితశాస్త్ర ప్రసిద్ధాంశాలు. విశ్వ గమనం సరళరేఖగా ఉన్నదనడం, భౌతిక దృష్టి. వృత్తగతి అనడం తాత్త్విక-శాస్త్రీయ దృష్టి. కళలోనూ ఇంతే. సరళ రేఖల్లో చిత్ర శిల్పాదులుండవు. వృత్తాలు-కోణాలే కళా సూత్రాలు. వృత్తం కంటకి ఆనందహేతువైనట్లు సరళరేఖలు కావు. ఎందుకంటే సరళ రేఖలో విశ్రాంతి స్థానం బిందువులేదు. మనస్సుకేది విశ్రాంతి స్థానమో అదే ఆనంద బిందువు. కావ్యంలోనూ బీజం ప్రారంభం కాగా అదే పరిణమించి కార్యంగా-అంత్య బిందువుగా రూపొందడం వల్ల కావ్యం ఎక్కడ బయలుదేరిందో అక్కడకే చేరుకొంటున్నది. బీజం వృక్షమై మళ్ళీ బీజం కావడంతో సృష్టి ఒక సుడి తిరుగుతున్నది. ఇదే నృత్యం-నాట్యం. భ’రత మహర్షి అలంకార శాస్త్రమనక నాట్య శాస్త్రమని ఎందుకన్నాడు? విశ్వమంతా వృత్తగతే కనక-కాలమూ, దేశంతో పాటే వృత్తాకారగమనం చేస్తున్నది. కనక-నాట్యం. నాట్యమంటే ఫర్తనాదుల సుష్టి. చందోవృత్తం-ఆనందం ఒకసారి గిఱ్ఱున సుడి తిరగడం. ఇందుకే సృష్టిని ‘నర్తక’మని వేదమన్నది. కాబట్టి వృత్తం సౌందర్యం. సత్య చలనమే సౌందర్యం కనక చరిత్రకూ ఈ తాత్త్వికార్థం చెప్పక తప్పదు.
గత 18-19 శతాబ్దం అవగాహనకు – సృష్టి సరళరేఖావగతిగానే కన్పించడం వల్ల చరిత్ర అంటే ఒకనాటి సంఘటనగానే వ్యాఖ్యానించుకోక తప్పలేదు. దేశగతమైన-కాలబద్ధమైన ఒక సంఘటన పూర్వాపర సంఘటనలకు కార్య-కారణత్వాలు పొందుతున్నదని భావించడం జరిగింది. అంటే భూతం వర్తమాన కారణం. ఇది భవిష్యత్ కారణం. ఈ కారణ కార్యవాదం భౌతికమూ-త్రిమానబద్ధమూ (Three dimensional) ఆధునికుల శాస్త్రీయ దృష్టికిది ఆనలేదు-అశాస్త్రీయమైనందువల్ల. ‘We can no longer say the past creates the present, past and present no longer have any objective meaning, Since the four dimensional continuous cannot longer be sharply divided into past, present and future. If we still wish to think of the happenings in the phenomenal world are governed by the casual law, we must suppose that these happenings are determined in some substratum of the world which lies beyond the world of phenomena.’. (Sir James Jeans)
కేవలం చారిత్రకవాదులు భౌతిక కారణ కార్యవాదులు. కాని ఇదే సంపూర్ణ సత్యం కాదు. ఈ ప్రత్యేక సంఘటన ఒక దేశ కాల బద్ధంగా జరిగినందువల్ల అది మొత్తం విశ్వగతితో సమైక్యం పొందక తప్పదు. ఈ ప్రత్యేక ఘట్టాన్ని ప్రత్యేకంగా వ్యాఖ్యానించడం కాక దానికి వెనక ఉన్న మహా దేశ కాలాల చట్రంలో పెట్టిచూస్తే దాని ఉనికిలోని యథార్థ సత్యం తెలుస్తుంది. కావ్యంలో ప్రత్యంశం పూర్వాపర సమన్వయం సంపాదించడం పేరే శిల్పమంటే. ఇందుకే విమర్శకుడు అఖండకావ్య సృష్టినే వ్యాఖ్యానిస్తాడు తప్ప ఎక్కడికక్కడే చూడడు. ఈ దృష్టి అనగా ఖండదృష్టి-కువిమర్శ. పూర్ణసత్యం కానందున. కాబట్టి మహా దేశ కాలమాన చట్రంలో ఒక ప్రత్యేక సంఘటనను బంధించి చూస్తే ప్రత్యేకత పోయి పూర్వాపర సమన్వయం పొందుతుంది. అంటే ప్రతి ప్రత్యేక సంఘటన దానంతటది కారణత్వమూ-కార్యత్వమూ పొందుతూ ఆ మహా దేశ కాల స్థితిలో ఇది ఒక ప్రతీకగా మిగులుతుందే తప్ప వ్యక్తిగా మిగలదు. విశ్వదృష్ట్యా ప్రతి సంఘటనా కారణ-కావ్య స్వరూపం. ఈ దృష్టిని ఆర్థర్ ఎడ్డింగ్‌టన్ Symmetrical relation అన్నాడు (In A Short History of Religion and philosophic Thought in India – by Swamy Krishnanada). పై గ్రంథంలో స్వామి కృష్ణానందగారు ఇలా అన్నాడు: Arthur Eddington introduces a distinction causation which is the commonsense meaning of the relation of cause and effect in which there is the notion of the temporal antecedence of cause to the effect and that he calls causality which is the Symmetrical relation of the totality of events in the universe, which is a complete system of reciprocally connected events. Whitehead holds a similar view when he considers reality to be of the nature of an organismic process. Here the three dimensional or spatio-temporal view of history gives way to the truth of a universal situation, which though it may appear as extra-mental to individual observing centres, is involved in the very constitution of the observers, and hence incapable of observation at all. (P. 48-49.)
కాబట్టి విశ్వగతి ప్రతి సంఘటనకు మథ్య పరస్పర సంబంథంతో బందితమై వున్నది. దేనికది ప్రత్యేకంగా చూడడం అశాస్త్రీయం. ఒక గొలుసులో ప్రతి లంకె పూర్వాపర బంథన సూత్రమైనట్లు, ప్రతి సంఘటనా కాలంతో దేశంతో బందితం. కాబట్టి ఆ ప్రత్యేక సంఘటన ఒక విశ్వగతి ప్రతీక తప్ప రాశి నుండి వేరు చేసిన ముక్క కాదు. రాశిదృష్టి శాస్త్రీయమైనట్లుగా ఇతరం కాదు. Causation among things is to be understood as the individualistic reading of the consequences of an indivisible consciousness appearing as the witness of objects which have it has their existence and content. The function of this universal principle as an unbroken continuum appears, where it is manifest in individuals, as the law of causal relation. The dynamic self-expression of the absolute in the world of objects involves among them a living connection which appears in this manner. Causation has a meaning in the empirical world, but is meaningless to the absolute. The mechanistic senses of man cannot observe the teleological purpose hidden in the Universe, an aim towards which all evolution is directed. (P.49-50)
జీన్స్ అన్న చివరి మాటల్లో భౌతిక సంఘటన ఒక అతీత ప్రపంచంలో సునిశ్చితమై వుండాలన్నమాట ఈ కావ్య పీఠికా వ్యాఖ్యాన సూత్రం. ఈ దృష్టితో ఈ కావ్యంలోని చరిత్ర ఒక విశ్వ బృహద్గతితో సమైక్యం పొందిన ఒక చారిత్రక సంఘటనగా కవి వ్యాఖ్యానించడం ఒక ‘బృహన్మతి’ (బృహస్పతి) (మతిదివిషదురున్‌నను – అని కవి తనను గుఱించి చెప్పుకొన్న మాట) ప్రజ్ఞా వికాసం. అందుచేత ఝాన్సీరాణి అపజయం కూడా ఒక ప్రముఖ ఘట్టమై విశ్వసామూహిక గతితో సమైక్యమై పోవడంచేత అపజయానికి ప్రాధాన్యం లేకుండా పోయింది. అంతేకాదు జయాపజయాలు రెండూ విశ్వగతి సూత్రాలే తప్ప – వెలుగు చీకట్లలాగా -తదన్యం కాదని సునిశ్చితమైనవి. అంటే చారిత్రక సంఘటనకు తాత్త్వికార్తకల్పన చేయడం జరిగింది. ఇందుకే కాలమాన సూత్రం మీద కథ ప్రవర్తించింది. (వేయిపడగల్లో గణాచారి కాల సూత్రం. అంటే కవికి మహాదేశకాల దృష్టి ఒకటున్నది. అది సంఘటనా ప్రేరకమని-జయాపజాలు ఆ ప్రేరణశక్తి యొక్క విలాసమని కవి దృష్టి).
చతుర్ముగ పర్యంతమైన మహాకాల విషయం ప్రతి నవలలోను, కావ్యంలోను కవి ప్రస్తావించడం ప్రసిద్ధమే. ఈ కావ్యంలో పీఠికంతా కాలవర్ణనే. కనక ఒక చిత్రాన్ని-కావ్యనాటక సంఘటన, సన్నివేశాదులను-దేశకాల నేపథ్యంలో బందించి చూస్తేనే కావ్యార్థబోథ జరుగుతున్నది. (మద్రాసు బీచిలో “కార్మిక విజయ” మన్న శిల్పమున్నది కదా! దాన్ని చూడడమెలాగ?! దగ్గరగాపోయి చూస్తే అదొక బొమ్మగానే, వ్యక్తిగానే గోచరిస్తుంది. అది శిల్పి దృష్టిని వ్యక్తీకరించదు. దూరంగా రోడ్డు కీవలకు వచ్చి ఆకాశం నేపథ్యంగా చేసికొని చూస్తే ఆ వాతావరణాని కనుకూలంగా ఆ శిల్పి ఆ శిల్పాన్ని ఎలా మలిచాడో తెలుస్తుంది. ఇది కళాదృష్టి. కావ్యంలో నాటకీయత అంటే ఆ నేపథ్యానికి ఆ సంఘటనను అలా ఒదిగించడమే.) అలాగే చారిత్రక సంఘటనను కూడ మహా కాలప్రవాహంలో సమన్వయ దృష్ట్యా చూడడమే యథార్థ దృష్టి. ప్రతిసంఘటన ఒక మహత్ ఘటన (Cosmic event). ప్రతి వ్యక్తి ఒక మహద్వక్తి (Cosmic being) తత్ప్రతీక. ఇదే తత్త్వదృష్టి ఇదే పురాణదృష్టి కవిదృష్టి, కేవల చరిత్రకారుల దృష్టికాదు.”
ఈ కావ్యం:
“విశ్వాథారము కాల మేనమయ మానిర్భూతమౌ దత్కళా
శశ్వల్లక్షణ మానహిల్లు, ఘటనా సర్వస్వమం దంబుజా
తాశ్వేతంబులకున్ మొయిళ్ళకు వియన్మథ్యస్థలీ యాత్రలో
నాశ్వాపాతము పండు వెన్నెల ప్రభాహారిచ్ఛటల్ తెచ్చెడున్.”
అన్న పద్యంతో ప్రారంభమై-
“అథమ పరివంచనా ప్రథమావతార
మూర్తి గ్రీష్ముండు చనుదెంచె మొదటజనుల
నిస్సహాయుల జేసి మండించి మండి
పిదప బడమటి గాలితో బిచ్చలించి.” అన్న
పద్యంతో అంతమౌతోంది. ఈ ప్రారంభాంతాలు ముడివేస్తే ఆ కాలం గ్రీష్మం. బాధపడక తప్పదు. ఆ గ్రీష్ముని పేరు ఆంగ్లేయుడు – వాని ప్రభుత్వం. దీని దుశ్శేష్టలను ప్రతిఘటించిన స్వాతంత్య్ర యోధురాలు మరణించడం కాల ప్రభావం. అదంత శక్తిమంతం. ఇది కావ్య సూత్రం.
దీన్ని గూర్చి కవి వ్రాతలివి – ఝాన్సీ లక్ష్మీబాయి దేశ స్వాతంత్య్రానికై పోరాడిన వీరవనిత. ఆమె మరణించింది. ఆమె చేసిన మహాప్రయత్నం విఫలమైంది. దీనికి కారణం కాలం పరమేశ్వర స్వరూపం. పరమేశ్వరుణ్ణి నిందించాలి. యిలా జరిగినందుకు – అందు వలన ఆ కథ కనుగుణంగా కాలవర్ణన చేశాను.
4.2.1. కథాంశం-కావ్య ప్రత్యేకత :
2వ ఆశ్వాసం: లక్ష్మీబాయి వారణాసిలో జన్మించడం, తల్లిదండ్రుల వృత్తాంతం. నానాసాహెబ్ దగ్గర ఖడ్గవిద్య నేర్వడం, వారి స్నేహం, ఆంగ్లేయుల దుశ్చేష్టలు చూచి బాధపడడం.
- నగరోత్సవవేళ ఆంగ్లేయాదికారి తన గుఱ్ఱబ్బండిని జనంమీదుగా తోలించడం. అది చూచి లక్ష్మీబాయి వాడికి బుద్ధి చెప్పడం. ఈ విషయం చూచిన ఝాన్సీరాజు గంగాధరరావు మంత్రి ఆమెకూ రాజుకూ వివాహ ప్రయత్నం చేయడం. వివాహం జరగడం.
- రాణికి సుతోదయం. అతడు మరణిచండం. దత్తత స్వీకారం. డల్హౌసీ సిద్ధాంతాన్ననుసరించి ఇది చెల్లదని-రాజ్యం ఆంగ్ల సామ్రాజ్యంలో విలీనం కావాలని ఆంగ్లేయులనడం. రాజ ప్రతినిది దత్తత స్వీకారోత్సవములో పాల్గొనడం.
- రాజు మరణించడం-దత్తత చెల్లనేరదని ఆంగ్లేయులు పట్టుబట్టడం. రాణి ఆంగ్లేయుల నెదిరించడం.
- భారతీయులకు ఆంగ్లేయులకు కల్గిన వైషమ్యాలు-పరస్పర హింస.
- రాణి యుద్ధ ప్రకటన.
8-9. యుద్ధం-రాణి మరణం.
3వ ఆశ్వాసం: వర్ష ఋతు వర్ణన. ఇది రాజు రాణి వివాహానంతర విహార వర్ణనకు-వారి శృంగార రసానికి పోషణకనుగుణంగా చేయబడింది. శృంగారానికీ వర్షఋతు వర్ణన ఉద్దీపనంగా వర్ణింపబడి శృంగారం ధ్వనింపబడడం పరమౌచితీమంతంగా ఉంది.
4వ ఆశ్వాసం: శరదృతువు కేదారస్యలక్ష్మి వర్ణనా ముఖముగా చేయబడడం. తల్లిగా మారిన (ఝాన్సీ) లక్ష్మి వర్ణనలో పర్యవసింప చేయటం ధ్వనిత రమణీయాంశం. ఇక్కడ ఆంగ్లేయుల ప్రతిఘటన వుంది గదా! ఈ వర్ణన కుదురుతుందా? అన్న ప్రశ్న కవికే కలిగి ఉండేవి. కాకపోతే చివరి పద్యానికి ముందున్న పద్యం ఇలా వ్రాయబడటం జరగదు.
“పైకి శరదా తపములు జాల్వారినట్లే
లేత నవ్వులజిగి పిసాళించు చుండ
వెస ఫరంగి తాంబూలము స్వీకరించె ”
ననటం తర్వాత శరద్వర్ణన కనుకూల కథాంశ సంవిథానం చేయటమే. ఇంతే కాక, శరదృతు వర్ణనలో-
“అనయ పథజన నేత్రకుట్టన నిమిత్త
మైన పీష్కలన మేచి యూహలకు నూహ
సొగసు సంపాదనము సేయుచున్నదదిగో
శరదమలమూర్తి కేదార సస్యలక్ష్మి”
అనయపథజనులు ‘దొంగ వర్తకుల గుంపు’- ఆంగ్లేయులని థ్వనించటమే ప్రస్తుతాంశం.
5వ ఆశ్వాసం: హేమంత వర్ణన మిక్కడ పంటచేను నాశన హేతువుగా వర్ణితం కావటం-ఆంగ్లేయులు దత్తత స్వీకారం చెల్లనేరదని ఝాన్సీని తమ పాలనలోనికి గ్రహించడం ప్రస్తుతాంశం.
6వ ఆశ్వాసం:
“రైతులొక్కొక్క డొక్కొక్క దాపు పొందె
చెప్పనొకరీతిగాని శైశిరము వలన”
-అన్నశిశిర వర్ణన ఆంగ్లేయులు భారతీయులను హింసించిన ప్రస్తుతాంశ వర్ణన. వారు పెట్టిన బాథలు
“అదివరకు చంపియెఱుగని యతడొకండు
చంపుటెట్లుండునో చూడ జంపెనొకని”
-ఇత్యాది పద్యాల్లో వర్ణింపబడటం చూచుకోవచ్చు.
7వ ఆశ్వాసం:
“వచ్చిన వసంతమది గ్రీష్మవైభ’వమ్ము
ప్రాణ బాధావహమ్మును భాంత్రిదమ్ము
నర్థ మెరుగని జనము తాపాపనోదనమ్ము
కృత ప్రయత్నమ్ము తప్త శరీరమయ్యె.”
ఇక్కడ ఆంగ్లేయుల పరిపాలనారీతులను ప్రతిఘటించిన రాణి తాంతియాతోపీ సాయంతో సేనలను సమీకరించడం విషయం. దత్తత స్వీకారోత్సవ మన్న వసంతం గ్రీష్మవైభవంగా మారి అది భాంత్రిదమై పోతున్నది. భారతీయ ప్రయత్నం వ్యర్థమన్న ఆగామి కథా సూచన.
8-9 ఆశ్వాసాలు:
ఏకాశ్వాసమే కాని కల్పిని-కాంచన గంగను రాణి ఓడిపోవడం 8-లో చెప్పి, 9-లో ఆమె గ్వాలియరులో మరణించుట మన్న విషయం చెప్పటం కోసం – ఈ ఏర్పాటు కోసం రెండుగా కథ విభక్తమైనది. కాబట్టి 9-చివర గ్రీష్మవర్ణన వచ్చింది. 2-7 ఆశ్వాసాంతాలు వసంత వర్ణనాంతాలు. ఎందుకని? మొదటిది రాణి జన్మించినప్పటిది. రెండవది ఆమె జన్మకారణం ఆంగ్లేయులను ప్రతిఘటించటమే కనక ఆ సందర్భంగా వచ్చిన వర్ణన.
2వ ఆశ్వాస ఋతువర్ణనలో-
అది నవదశా చైత్రమాసాపరాహ్ణ
జరఠలుఠదా తపమ్ములు సందడించె – నన్న చోట
‘నవదశ’ మాటలోని -నవ-ఆశ్వాస విభాగ సూచకంగా రావడం విచిత్రమైన మాట. ఎందుకంటే, పైన వ్రాసినట్లు 8-9 ఆశ్వాసాలు కలపి ఏకాశ్వాసంగా చేయవచ్చు. కాని కవి అలా చేయలేదు. (వేయిపడగల్లో-37-అధ్యాయాలుగా వ్రాసినట్టు-ఇది నాట్య శాస్త్రాధ్యాయ సూచన. నాట్యం మోక్షవిద్యగా గిరిక ద్వారా కవి చెప్పడం స్పష్టమే కనుక అధ్యాయ సంఖ్య ప్రతీకార్థం కలదే. ఈ విషయానికి నాట్యశాస్త్ర పీఠిక- బరోడా ప్రతి – చూడాలి.) కాబట్టి నవదశ-కథావిభాగ సూచకమే. అయితే నవాత్మకంగా కథ నెందుకు మలచాలి? రామాయణ కల్పవృక్షంలో ప్రతి కాండ ఐదేసి ఖండాలుగా చెక్కబడడం పంచసంది విషయ సంబంథంగా-ఆధ్యాత్మ విద్యా సంబంధంగా చూడదగ్గ విషయం. అలాగే ఇక్కడ? ఈ ప్రతీకార్థ దృష్టి కవికున్నది-అనటానికి వేయిపడగల అథా్యయ సంఖ్య-పంచ ఖండాల విషయం సాక్ష్యం.
సృష్టి నవాత్మికగా అర్షభావముంది. జన్మ-వికాసం-మరణం-ఈ పరిణాత్మకమైన విశ్వం నవాత్మకం. అష్టతత్త్వాలు అష్టమూర్తులు-పరిణామాత్మక, కక్ష ప్రపంచ విషయం. చలనశీలం. దాని కాథారమైన తత్త్వం నవమతత్త్వం. ఈ కథలో ప్రథమాశ్వాసమంతా నాంది. రాబోయే 8 ఆశ్వాసాలు కథ-జగద్విషయం కాగా మొదటి ఆశ్వాసం భవిష్యత్కథాధార సూత్రంగా సుసంఘటితమైనది. ఇలాగే చివరి ఆశ్వాసంలో చివరి గ్రీష్మ వర్ణన పద్యం మొత్తంమీద అంతర్గతంగా వున్న కథా సూత్రాన్ని ధ్వనిస్తూ ప్రస్తుతోపయోగం పొందుతున్నది. రాణితో ఆంగ్లేయులు చేసిన యుద్ధం-1857 మార్చ్ 23. ‘ఝాన్సీ’ దగ్గర, 1857 ఏప్రిల్ 25 ‘కల్పి’ దగ్గర జరిగాయి. అంటే గ్రీష్మకాలం. కాబట్టి చరిత్ర కాంశం-కావ్య సూత్రంతో-వ్యష్టి సమష్టితో సమన్వితమౌతున్నది.
ఆశ్వాసాంత ప్రతి ఋతువర్ణనా ఇంతే. కాల సూత్రాన్ని వ్యంజించటమే గాక ప్రస్తుత కథాంశాన్ని సూచిస్తుంది.
- ఆశ్వాసాంతం – వసంత ఋతువు
- ఆశ్వాసాంతం – వర్షం
- ఆశ్వాసాంతం – శరత్తు.
- ఆశ్వాసాంతం – హేమంతం.
- ఆశ్వాసాంతం – శిశరం.
- ఆశ్వాసాంతం – వసంతం.
- ఆశ్వాసాంతం – లేదు.
- ఆశ్వాసాంతం – గ్రీష్మం.
ఈ క్రమానికి-కథా క్రమానికి సమన్వయమున్నది ఇది వ్యష్టి శిల్పం.
ప్రథమాశ్వాసము:
మొదటి ఆశ్వాసం ఎక్కడా కథ వుండదు. ఈ ఆశ్వాసంలో అన్నీ ప్రతీకలే. అవి రాబోయే కథలోని పాత్రలు. దానికివి భావరూపాలు. ఇవే అక్కడ పాత్రలుగా రాబోతూ ఉన్నవి. కాబట్టి బీజరూపాలు. అది ఎట్లాగో పరిశీలిద్దాం.
“విశ్వాధారము కాల, మేనమయ మా విర్భూతమౌఁ దత్కళా
శశ్వల్లక్షణ మావహిల్లు ఘటనాసర్వస్వమం దంబుజా
తశ్వేతంబులకున్ మొయిళ్ళకు వియన్మథ్యస్థలీయాత్రలో
నాశ్వాపాతము పండువెన్నెల ప్రభాహారిచ్ఛటల్ తెచ్చెడున్
శుష్కసితమేఘముల కబ్బుఁ బుష్కలత్వ
మమృతసస్యోపరి ప్రభుత్వాతశయము
నవ్యసస్యేందిరా నిదానంబులైన
ధర్మవర్షి మేఘంబు లథఃకరించి”.
వర్షాహేఘం x శుష్కసితమేఘం (2వ పద్యం)
శ్వేతాబ్దం x తెలిమొయిళ్ళు (1వ పద్యం)
మొదటిది భారతీయ భావనకు – రెండవది ఆంగ్లేయ భావనకు – లేక ఆంగ్లేయ జాతులకు ప్రతీకలు. కాని కాలమహత్త్యం చేత వానికి లేని గొప్పదనం వీటికి వస్తున్నది ఎలా? మానవ జీవితంలోని వైచిత్రి ఇదే. ఇది వ్యామోహ లక్షణం.
2వ పద్యం ద్వారా ఈ క్రింది పద్యం వైచిత్రిహేతువు చెప్పబడింది.
“సతతవినీల మేఘపరిషత్తులు మిన్నులఁ గొల్వు దీర్చి సం
గతమధుదానథారల జగంబును దన్పంగ ధర్మరాజులై
కృతకము లీ మొగిళ్ళగమి కింసఖముల్ చని శ్రేష్ఠులట్లయా
చితముగ వెన్క వెన్కఁ బడి జీవనమున్ నిలఁబెట్టుకొన్నవై”.
చంద్రగిరి పాలకుల కాలంలో మొదటిసారిగా పాశ్చాత్యులు చెన్నపట్టణంలో కోట కట్టుకోవడానికి అనుమతి పొందడం – చంద్రగిరిలో చర్చ్ కట్టుకోవడాని కనుమతి పొందటం చారిత్రక సత్యం. వెంకటపతిరాయలు తన ఆస్థానంలో క్రీస్తు బొమ్మను పెట్టుకొన్నట్లూ చరిత్ర చెప్పిన సత్యమే. వీరు దానధారల జగత్తును తడిపిన మేఘాలు. నాడు వెన్క వెన్క కొదిగిన ఉల్లి మొయిళ్ళు వారు. ఇలా చారిత్రక సత్యాలను దూరదూరాల్లో సూచిస్తూ సాగుతుంది మొదటి ఆశ్వాసం. ఎక్కడా కథ వుండదు. అంతా ప్రతీకామార్గాన ధ్వనించడమే.
ఆత్మ వస్తువు స్వచ్ఛమే అయినా వికారం పొందడం సృష్టికారణం. ఆ వికృతి పోను పోనూ అధర్మంగా వికసించి చతుర్యుగ పర్యంత మహాకాలంగా వృద్ధి పొందుతున్నదట! ఇందులో కృతత్రేతలు ధర్మరూపాలు. ద్వాపరం ధర్మాధర్మాలకు సమబలం కాగా కలి కేవల అథర్మరూపమౌతున్నదట. ఇది 19వ పద్య భావం.
అర్థమేమిటి? ఎందుకు చెప్పినట్లు?
శ్రీకృష్ణదేవరాయల వారన్నారు-
“అలసతఁ బరున్న మనుజుండు కలియుగంబు
ద్వాపరంబెన్న కూర్చున్నవాడు – త్రేత
ఉత్థితుడు, మఱియాయి, కృతమటన్న
సముచిదమనోక్తి ఋగ్బ్రాహ్మణమున వినమె.”
బ్రాహ్మణాలు వేద ప్రతీకార్థ వివరణ గ్రంథాలు. కాలం మానవగతికి-మనోగతికి (అది వృత్తి. ఇది ప్రవృత్తి. ఇది దానికి మూలం) ప్రేరణ సూత్రం. సంకేతం. చతుర్యుగాలు ప్రతీకా దృష్టిమీద చెప్పబడ్డ విషయం. దానికి భౌతిక వాచ్యార్థం లేదు. మానవ మనః ప్రవృత్తి బాహ్య చేష్టగా పరిణమిస్తున్నది. ఇందుకే మానవుడు మనస్సునకు బందీ. వాడు అస్వతంత్రుడు. కాల నియతికి లొంగిపోతున్నాడు. ఆ మానవ ప్రవృత్తిని కాల రూపంలో చెప్పిన పద్యం పైది. ఈ దృష్టితో విశ్వనాథ పద్యం చూడాలి. ఎందుకీ భావన ఇక్కడకు తెచ్చినట్లు? ప్రస్తుత యుగమూ-భారతీయుల ఓటమీ-పాశ్చాత్యుల గెలుపూ-ఒకటే నన్న భావి కథా సూచన కోసం చేయబడ్డ వర్ణన. కావ్యములా ఎందుకు ముగిసిందో హేతు కల్పన చేయడం. ఇది ఐతిహాసిక కవి లక్షణం తప్ప ప్రబంధకవి లక్షణం కాదు. అంటే భారతాదుల్లోనే ఈ విషయాలు చూడదగ్గవి. విశ్వనాథ ప్రబంధకవి కాడు. అందుకే ఆయన పద్యం ప్రబంధ పద్యం లాగా గేయం కాదు. పాఠ్యం. మంతవ్యం.
మృతి భయము లేదు ధర్మాని కితరమునకు
మృతి భయము తక్క వేఱు లేదెంత యైన
సాహసము చేయు థర్మంబు సమయ మొకడు
తన కననుకూల మౌటచే దగ్గుగాని
ధర్మం=అమృతం. అధర్మం=మృతి. ఇవి వేద ప్రతీకలు. అది నిత్యము. సామూహికము. ఇది అనిత్యం. ఏకదేశం. వ్యష్టి. అది సమన్వయ సూత్రం. ఇది విచ్ఛేద-విభాజన సూత్రం. అది ప్రత్యేకాంశలన్నింటినీ ఏకోన్ముఖం చేసే జ్ఞాన శక్తి. ఇది కేంద్ర బిందువును చెల్లాచెదరు చేసి సమష్టిని విచ్ఛేదించి వ్యష్టిగా తీర్చే అజ్ఞానశక్తి. ఇదే దేవతా-దైత్వభావ సంఘర్షణగా చిత్రించవలసి వచ్చింది. ఇది పురాణ ప్రతీకం. పురాణం ధర్మ స్వరూపం-ప్రతీక. వైరం అధర్మబావ ప్రతీక. (పురాణ విద్యా విషయం వేరుగా చూచుకోదగ్గది)
ఇలా సాగిన నాంది చివరి పద్యం స్రగ్ధర. చాలా చిత్రమైన పద్యం.
“శత్రురక్తం సంధ్యాచ్చవి కాగా- అది కల్పించిన వ్యక్తి నిజయశ-
చ్చంద్రికలు దిగంత వ్యాప్తి పొంది సురజనులకు తృప్తిహేతువైనది.”
ఈ భావమెంత సుశ్లిష్టమో వివరించ నక్కరలేదు. కర్త లేని పద్యం. అధ్యాహారం చేసుకోవాలి. ఎవరు?- ప్రస్తుతం ఝాన్సీ లక్ష్మీబాయి. చరిత్రలో-కాలఘటనలో- ప్రాచీనులు- అర్వాచీనులు ఎందరో? అంతా దేవతా మూర్తులే. స్వాతంత్య్ర-ధర్మ-సముపార్జనలో అసువులొడ్డిన అమరవీరులంతా కర్తలే. ఈ పద్యానికి-భావానికి. ఆ సంధ్యాకాంతి-యశచ్చంద్రికా- శివమూర్తి చిహ్నాలు. కాలసూత్ర విథాత లక్షణాలు. ఇవే 1-41 పద్యంలో వివృతమైనది.
బహుఖండంబుల-చంద్ర శకలానందంబుగా మౌళిపై
విహరింపంగను జేయు శ్రీ శివు కృపావిర్భూతి మౌగ్ధ్యంబహో!
నహియించున్ బహుదేవతా హృదయ సంధ్యాచంద్రికా వల్లరిన్-
అన్నచోట సంధ్యాతాండవమూర్తి వర్ణన ధ్వనిస్తూ-అదంతా ఆయన కృపా మౌగ్ధ్యంగా చిత్రించాడు. నీకు కాలం రెండుగా కన్పిస్తున్నా-వానికి లేదు. క్రీడానృత్యమే.
(ఇక్కడ కృపామౌగ్ధ్యమన్నమాట తిక్కన్న గారిది.
బలమత్తాకృతియైన-అజాత శత్రుని కృపామౌగ్ధ్యంబ
చాలంగ, వారలకేలా నయవిక్రమోచిత విచార క్లేశముల్ సంజయా!
ఈ పద్యం విశ్వనాథచేత అనేక సభల్లో శిల్పిభూమిగా వ్యాఖ్యాతం కావడం వల్ల ఆ మాట అనుకోకుండా ఇక్కడ చోటు చేసుకోవటం మాట అలా వుంచి ఎంత అందంగా పొసగిందో చూడదగింది.)
భగవత్ కృపామౌగ్ధ్యంచేత అజ్ఞానం జ్ఞానమై అధర్మం ధర్మమైన సంగతి – అది రాజ్యపాలన చేయడం ఎలా సంభవమైనదో ప్రథమాశ్వాస ద్వితీయ ఖండవస్తువు. ఇది ప్రస్తావన వంటిది. ఇందులో పులి-దేని వాహనమైన మృగేంద్రం. దేని ఆజ్ఞచేత ఝాన్సీ లక్ష్మీబాయిగా పుట్టినదని చెప్పబడింది. దేవి ఈ అధర్మాన్ని సహించలేక పులి నాజ్ఞాపించిందట. అది లక్ష్మీబాయిగా జన్మించినదట. దేవి కోపాన్ని చూచిన శివుడు నవ్వుకొన్నాడట. ఎందుకు? కాలధర్మవేత్త కనుక. ఇది తెలిసీ దేవి కోపం వహించటాన్ని చూచీ అది జయించదన్న సూచనగా. ఈ కల్పన భావ్యర్థ సూచకయే గాక-లక్ష్మీబాయి స్వభావ పవిత్ర క్రౌర్యానికీ-సూచనమౌతున్నది.
ఈ ఖండం పులి వర్ణనతో ప్రారంభ’మై పులిగర్జనతో ముగుస్తుంది. ప్రథమాశ్వాస ప్రథమ ఖండాంతంలోని స్రగ్ధరలోని విషయానికీ పులి కర్త.
ఇలా నాందీ ప్రస్తావనలుగా సంతరించబడ్డ ప్రథమ-ద్వితీయ ఖండాలు భవిష్యత్కథా ప్రపంచానికి బీజస్థానం. దేవతా-కారణ-లోకం. ఇదే భౌతిక ప్రపంచంగా పరిణమిస్తూ-కావ్యంగా ద్వితీయశ్వాసం నుండి అవతరిస్తూంది.
ద్వితీయాశ్వాసం:
“ఆ పుతి యెందుఁ బుట్టు టనునట్టి విచారణ హైమశైలక
న్యావదనీరజాతములయందునఁ జూపు నిగుడ్చెఁ దల్లి యుం
దోవక హస్త నీరజముతోఁ దల రాచుకొనంగ నంగుళి
వ్యావృత సాధువాశ్శిశిరయై స్పృశియించెను వేల్పుగంగయున్ ”.
“ఆ పులి యెందు బుట్టుటను నట్టి విచారణ”తో కథ మొదలు. పార్వతీ దేవి హస్తకముమలంతో తల రాచుకొన్నదట. అక్కడ గంగ తగిలింది. దేవి పులిని ఆజ్ఞాపించింది భాగీరదీతీరంలో కాశిలో పుట్టుమని ఈ కల్పన చమత్కారంగా ఉంది. విశ్వనాథ రచనలో బాహ్యదృష్టి కాక్షేపణగా కనిపించే అంశమొకటుంది. ఉదాహరణకు కవి రచన ఇలా ఉంటుంది. “ఆ కొండ ఆ ఊరికి తూర్పున చెరువు కెగువగా నున్నది. అది అక్కడే ఏల ఉండవలయును? ఉండవలయును గనుక ఉన్నది” అంటే ఏమిటర్థం? ఉండవలయును గనుక-ఈ వాక్యార్థం-ప్రకృతిలో-కాలంలో – ఏది ఎక్కడ వుండాలో అది అక్కడే వుంటుంది. అంటే విశ్వఘటన, ఒక నిర్మాణాత్మకమైన మహా నాటకం తప్ప అర్థంలేని కొకిబికి కవి రచన కాదు. విశ్వభ’మ్రణం యాంత్రిక మనుకొన్నమాట 19వ శతాబ్ధిమాట. 20వ శతాబ్ధి మాట-ఒక మహా మనస్సుచేత అది నియంత్రితమౌతున్నదే తప్ప లక్ష్యరహిత గమనం కాదు. ఒక మహా విజ్ఞాన శాస్త్రవేత్త అంటున్నాడు – “పూర్వ శతాబ్దాల్లో సృష్టి స్వచ్ఛందమనుకున్నాం కాని ఆలోచిస్తే ఒక బృహన్మనస్సు వెనకవుండి దీన్ని నడిపిస్తున్నట్లు తోస్తుంది.” (సర్ జేమ్స్ జీన్స్)
ఇదే ‘కవిర్మనీషీ’-అన్న మంత్రార్థం. కవి మనీషి-ప్రజ్ఞావంతుడు కనుక. ఏది ఎక్కడ వుండాలో దాన్ని అక్కడే సంఘటిస్తున్నాడు కనుక. కాల దేశాదిష్ఠానంగా విశ్వమొక సంఘటన తప్ప అఘటన కాదు. ఇందుకే ఒక మనస్తత్త్వ శాస్త్రవేత్త అన్నాడు. ఏదీ accident కాదు. నీకు కావచ్ౘ్ు. దాని పరమార్థం తెలియదు కనుక. తెలిసిన ఆ బృహన్మనస్సున కది Incident -సంఘటన. సన్నివేశం. ఈ కావ్య శబ్ద జాలానికి మూలతత్త్వ మది. జగత్తును నాట్యంగా-నాటకంగా చూస్తే ప్రతిదీ సత్‌ఘటన-సత్ నివేశం.
ఇది విశ్వనాథపై వాక్యార్థం.
“పతికాఠిన్యము గంగకైన రుచియింపం బోదటం చర్థమై
ధృతిమై వాహనమున్ భగీరథను తాతీరమ్మునన్ జన్మసం
గతి గాంచన్ వచియించె నద్రిసుత గంగాతీరమందుం బురా
న్వితమై యెన్నియొ దేవతాంశములు జన్మించెన్ స్వతంత్రద్యుతుల్.
పరమశివమూర్తి నఖశిఖాస్పర్శముగను
నెచట మన్నింటె జాహ్నవి నచట వార
ణాసి వసియించె నొక బ్రాహ్మణప్రభుండు
“నప్ప” యాఖ్యుఁడు “పీష్వా” కులాంబుదిశశి.
ఆ “పీష్వాకులు” నాశ్రయించి మను శౌర్యాంభోది యొక్కండుమో
రోవంత్వాఖ్యుఁడు విప్రయోద్ధ దిషణారూక్షుండు పాలాక్షత
న్వీపాదాంబుజభావనాత్త భుజపాండిత్యుండు మాతృక్షితి
వ్యాపన్నస్థితి గుండెలో వెలుఁగు దీపంబై ప్రతారించఁగా.
ఆ రుచిరస్వతంత్రమతి కంగన చెంగున దూఁకు లేడికన్
జీరలు కన్తుదల్ వెలుఁగుచిమ్ములఁ గూర్చిన చానపేరు భా
గీరథి యాత్మలన్ గృతయుగీనులు వారల గర్భవీచికా
పూరమునందు లక్ష్మియయి పుట్టెను పార్వతివాహనం బొగిన్.
ధృతి నీ భారతదేశ సంగత వరాదీనత్వనిర్మూలనో
ద్ధత బాహావరిదీప్తమౌ పురుష సంతానంబు వాంచింపఁగా
సుత జన్మించె నటంచు భిన్నపడుచాక్షోణీసురుం డాయుధా
యతనంబందునఁ గత్తి డాళ్ళొరసి తీవ్రారాన మేపారినన్.
మ్రోగిన భేరికానినదముల్ ఘటియిల్లెను నంత నప్ప పీ
ష్వాగృహమందుఁ బంజరనిబద్ధము వ్యాఘ్ర మొకండు చండగ
ర్జాగురురావయై యెసంగ నంతన మందెను విప్రయోర్థ త
న్వీగురుతేజ మీ శిశువు ప్రీతమహేశ్వరిమూర్తి కావలెన్”.
లక్ష్మిబాయి పుట్టింది సనాతన బ్రాహ్మణ కుటుంబంలో. ఆమె తండ్రి మోరోపంతుబాజీ మరాఠా బ్రాహ్మణుడు. అతడి తండ్రి, తాతలు పీష్వాల కింద సైనిక కమాండర్లుగా పనిచేసిన వారే. కాని మెరోపంతు కాలానికి పీష్వాల పవరూ అంతగా లేదు. అదే సమయంలో పీష్వా (రెండో) బాజీరావు చిన్నతమ్ముడు చిమ్నాజీ పేష్వా ఆస్థానంలో దివానుగా మెరోపంత్ పని చేస్తున్న కాలంలో వారణాసిలో భాగీరదీబాయిని పెళ్ళి చేసుకొన్నాడు. మెరోపంత్ తాంబే, భగీరదీబాయి దంపతులకు 1835లో ఝాన్సీలక్ష్మిబాయి జన్మించింది. ఆమె పేరు మణికర్ణిక. అందరూ ‘మను’ అనేవారు. వారి కుటుంబం వారణాసి వదలి చిరూర్ చేరింది. మనును అందరు ముద్దుగా ‘చబేలీ’ అని పిలిచేవారు.
“అన్నప్రాశనవేళ లక్ష్మియట రత్నానేకముల్ తాళసం
వన్నంబుల్ బహుగ్రంథముల్ వదలి యాపై నున్న ఖడ్గంబుగై
కొన్నన్ భూసురయోధుఁ డీ శిశువు నాకుం గీర్తి తెచ్చున్ ధరా
నన్నాప త్తతి చీల్చు నంచుఁ దలఁచెన్ సంతోషరేఖాస్యుఁడై
పిల్లకు ఖడ్గవిద్య కఱపింపఁగ నచ్చట వారణాసిలో
వల్లయుఁ గాక యే వెసులుబాటును లేక ఫరంగి గుండియల్
జల్లన నెచ్చటన్ గరిడిశాలలు నిల్వఁగనీయకున్కిఁదా
నుల్లమునం దుపాయముల నూహ పొనర్చుచు నుండెఁ దండ్రియున్.
శ్రీ సర్వంబు పరంగిజాతి కొన “బాజీరావు పీష్వా” భృతి
గ్రాసుండై వరిశిష్ట భోగములతో గంగా స్రవంతీతట
వ్యాసక్తంబయి పోల్చు పట్టణము బ్రహ్మావర్తమున్ క్షాత్రల
లక్ష్మీసంసక్త గుణాళితో నదివసించెన్ శిష్టతేజస్కుఁడై.
మరి యా తండ్రియు నంత కూఁతు గొని బ్రహ్మావర్త మేఁగెన్ ధరా
వరు నాస్థాన మదెల్ల లక్ష్మి చురుకున్ బ్రాభాతనీ రేరుహా
దర భాగాననహాసవల్లి సముదాత్త ప్రోజ్జ్వలద్భావబం
ధరముల్ మెచ్చెను ముద్దుబిడ్డయి సభాభావంబు పాలించుచున్.
భాసురమూర్తి యొక్కరుఁడు బాలకుఁ డచ్చట లక్ష్మితోడ సా
వాసము కట్టె నిద్దఱును బట్టిన కత్తిని దింపకుండ న
ధ్యాసము చేయుచున్ గడప నాతఁడు కొంచెము పెద్దవాఁడు చం
డాసి కళావిశారదుఁడు న్నయుఁ జెల్లెలుగా మెలంగుచున్.
“నానాసాహె” బతండు శ్రీపతివలెన్ నాళీకపత్రాక్షుఁడున్
నూనాన్త్రున్బలె సర్వమోహన కళాసూక్ష్మాంతరంగుండు న
క్షీణోత్సాహుఁడు వానియందునను బాజీరావు పీష్వా ప్రియం
బూనున్ వీఁడె యనంతరుం డగునటం చుర్వీజనుల్ చెప్పికోన్”.
లక్ష్మిబాయి అన్నప్రాశన సమయంలో ఒకచోట రత్నాలు మరోచోట తాళపత్ర గ్రంథాలు ఎన్నో వస్తువులను వదలి అక్కడ ఉన్న ఖడ్గమును తీసినవేళ తండ్రితోపాటు అక్కడున్న వారందరు కన్నవారికి దేశానికి కీర్తి తెస్తుందని సంతోషించారు. మనుకి నాలుగో ఏటే తల్లిపోయింది. అప్పటికి మోరేశ్వర్ (మోరోపంత్) వయసు కొంచెం అటూ ఇటూగా 25 ఏళ్లే. అయినా వెంటనే మళ్లీ పెళ్లి తలపెట్టక తల్లి, తండ్రి తానే అయి బిడ్డను పెంచాడు. చిమ్మాజీ అప్పా మరణించాక బాజీరావు పిలిస్తే బిరూరుకు మకాం మార్చాడు. అక్కడే మను పెరిగింది. బాజీరావుకు ఆమె అంటే ఇష్టం. ‘చబేలి’ అని ముద్దుగా పిలుస్తూ ఆ పిల్లకు తన పెంపుడు కొడుకు నానాసాహెబ్‌తో బాటు సైనిక శిక్షణ ఇప్పించాడు. గుర్రపుస్వారీ నేర్పించాడు. కర్ర, కత్తిసాములు సాధన చేయించాడు.
అదీ సంగతి! అలా వచ్చిందన్నమాట లక్ష్మీబాయికి సైనిక నైపుణ్యం; అనంతర కాలంలో ఆమెకు వచ్చిన సైనిక కీర్తికి చిన్నప్పుడు ఆమె పొందిన తర్ఫీదే కారణం అనుకుంటున్నారా? అలా చెప్పడానికీ వీల్లేదు. గొప్పతనం తర్ఫీదులో ఉంటే లక్ష్మీబాయి కంటే నానాసాహెబ్ ఎన్నోరెట్లు పరాక్రమవంతుడై ఉండాలి. ఎంతైనా అతడు రాచబిడ్డ. ఆ పిల్ల వట్టి రాజాశ్రితుడి కుమార్తె. కాబట్టి అయ్యవార్లు అతడి మీదే ఎక్కువ శ్రద్ధ చూపించి ఉండాలి. మణికర్ణిక నానాకు సహాధ్యాయి కూడా కాదు. అతడి కంతే కనీసం పన్నెండేళ్లు చిన్నది. నానాసాహెబ్, అతడి అన్నకొడుకు రావుసాహెబ్‌లు సాము గరిడీలు చేస్తుంటే కళ్లు విప్పార్చుకుని చూస్తుండేది.
ఓరోజు వాళ్లు పట్టపుటేనుగునెక్కి దర్జాగా వెళుతూంటే తననూ ఎక్కనిమ్మని మణికర్ణిక అడిగింది. వాళ్లు పట్టించుకోలేదు. మను ఏడ్చింది. తండ్రి వచ్చి ఓదార్చి “నీ ముఖాన ఏనుగెక్కే రాత లేదమ్మా. నువ్వు మామూలు గృహస్థుడి ఇంట పుట్టావాయె” అన్నాడు. ఆ పిల్లకు రోషం వచ్చి “పెద్దయ్యాక నాకు ఇలాంటి ఏనుగులు పది ఉంటాయిలే” అంది. వీటితోపాటు ద్వితీయాశ్వాసంలో లక్ష్మిబాయి ఆంగ్లేయుల దుశ్చేష్టులు చూచి బాధపడటం మొదలైన విషయాలు ఇందులో వివరించడం జరిగింది.
(సశేషం)

