[డా. బి. మల్లయా చారి గారి ‘తెలుగు సాహిత్యంలో ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం – పరిశీలన’ అనే సిద్ధాంత గ్రంథాన్ని ధారావాహికగా అందిస్తున్నాము.]
4వ అధ్యాయం – తెలుగు సాహిత్యంలో ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం
4.2. ఝాన్సీరాణి (పద్యకావ్యం) కావ్యకర్త పరిచయం (విశ్వనాథ):
పంచమాశ్వాసము:
“ఆకొడు కట్టై యీ కొడు
కాకారము చూడ సంశయగ్రస్తుండై
భూకాంతునకును జింతా
వ్యాకులతను వ్యాధి యిమ్మడై ముమ్మడియై.
ఇదివరకె యీ మహామారి యెన్ని యెన్నో
రాజ్యములు మ్రింగినది తన రాజ్యమునకు
వంతు వచ్చిన దిపుడు తప్పదు ధరిత్రి
రమణునకు గుండులోఁ బెద్దరాయి పడియె.
లక్ష్మి శౌర్యాబ్ధి యాంగ్లేయులను నెదిర్చి
సర్వకార్యంబు నలుపుఁగాని
భావివంశాంకురము నిల్పుత్రోవఁ బోదు
పేరునకు నైన నిల్పెడు పెరిమఁ గనదు.
తన యనంతర కథ యెల్ల ధరణిపతికిఁ
గనులముం దాడి ముందుకుఁ జనిన గోయి
వెనుకకుం జన్న నూయిగా వివృతనయనుఁ
డదియు నొక వ్యాధిగా నయి యటమటించి.”
శిశువు పోయిన దిగులుతో గంగాధరరావు జబ్బు పడ్డాడు. జబ్బుపడిన సమయంలోనే తమ వంశానికి చెందిన దామోదరరావును దత్తత తీసుకొన్నాడు. దత్తత స్వీకారాన్ని తరువాత ఆంగ్లేయులు అంగీకరించరేమోననే అవమానంతో ఝాన్సీలోని కంపెనీ వారి ఏజెంటును స్థానిక సైనికాధికారులను దత్తత స్వీకారోత్సవానికి ఆహ్వానించాడు. తన తరువాత దామోదరరావును తమ వారసుడిగా గుర్తించమని అతనికి యుక్త వయస్సు వచ్చే వరకు అతని తరుపున లక్ష్మీబాయి రాజ్య వ్యవహారాలు చూచుటకు అంగీకరించవలసినదిగా కోరుతూ ఒక విజ్ఞాపనను అందజేశాడు.
“దత్తుఁడైన తనయుఁ దనయునిగాఁగ నం
గీకరించమేము, క్షితిని వదలి
రాణి పోవలయు, రమణ నస్మద్దత్త
భృతీని గొంచుఁ దాను బ్రతుకవలయు.
ఇది మారాజ ప్రతినిధి
దలించిన యాజ్ఞ, దీని కొని తానున్
వదలి చనవలయు, నచటి దు
ముదారునకును నధికారమున్ వదలవలెన్.
ఈనేలన్ వహియించు మా ప్రభువు తా నింగ్లాండునందుండి మా
సేనాధ్యక్షుఁడు నేఁటినుండియును ఝాన్సీరాజ్యకార్యంబులన్
దానై చూచుచు రాణి కీఁదగిన భత్యంబున్ మ ఱింకెవ్వొ యీ
లోనన్ నిర్ణ య మాచరింతుము సమాలోచించి శీఘ్రంబుగన్.
న్యాయముగాఁగఁ గోట విడినన్ సరి, వీడక యున్న మేము సే
నాయుతిగాఁగ వచ్చి ధర నాక్రమణంబును జేయఁగావలెన్
మాయెడ మీకు మీయెడల మాకును గల్గిన పూర్వగౌరవ
న్యాయతి సాధురీతి వ్యహారము చేయుట మంచి దిర్వురన్
అప్పుడు దత్తత యప్పుడే
చెప్పెను దా నచటనుండి సేనాపతి, మీ
రప్పుడు విన్నది లేదు, మ
రప్పుడు మీరాజు నున్కి నడుగము మేమున్.
అనవసరంబుగాఁగఁ గలహంబులకున దిగు టేల యంచు మే
మును నపు డూరకుంటిమిని, భూపతి మాచెలికాఁడు తీరిపో
యెను, ధర కెట్లు రా జగునొ యెవ్వఁడొ, రాణికి వారి ఠీవికిం
దనరెడు గొప్పకుం దగినదాని భృతిన్ మఱి యిత్తు మెప్పుడున్.
చాన యొకర్తు భూభరణశక్తిని గల్గుట యెంచరానిదిన్
గూన యెవండొ దేహమున క్షోణిపునెత్తురు లేనివాఁడు రా
జ్యానికి నర్హతం గనుట యన్నది విన్నది కాదు మా ధరా
స్థానములందు భూప్రజకు సౌఖ్యము కలద యట్లు చేసినన్
ఒక్క యధికార మది లేకయున్కి తక్క
దక్కు సర్వభోగంబులు దర్పములును
రాణిగారికిఁ జెల్లు నిరంతరముగ
ప్రభువు మర్యాద లన్నియుఁ బరిఢవముగ
నిలచియుండి రాజప్రతినిధియు నపుడు
మొగుడుకొన్న యాజ్ఞాపత్రము వినిపించెఁ
దెగువఁ గోటలోని క్రిందియధికారి
రాణిగారికి శౌర్యసామ్రాజ్ఞి కట్లు
రాణి నేత్రంబు లను గంగరానిపూల
కంతలోఁ దెల్లవారిన దా పువులను
శివరలందున హిమము తోఁచినది నుంత
తీర్చి హేమంతఋతు వరుదెంచినట్లు
ప్రతిసమాధానమునకు ఫరంగి రాణి
మోమునందునఁ గాంచెను మోమునందు
రాణి గాండ్రించిపైదూఁకి రక్తనాళ
ములను బెకలింపఁ జను పులివలెను దోఁచె.
అంత రాణి యెదో ప్రసంగాంతరమున
నా ఫరంగిని గని యిట్టు లనియె భార
తావనికి నెప్పు డయ్యె మీదే ఫరంగి
రాజ్య మేలుచునుండిన రాజు రాజు.
ఈ లెక్కంబడి భారతావని యటం చే మున్న దాకాశ వీ
దీలోకంబులు మీవె సర్వమును మీదే యంచు నెచ్చోటనో
వీ లచ్చోటను బీట వెట్టికొని యా వీ లెచ్చటన్ లేదొ నీ
వాలోకంబున నున్నచుట్టుకొని యట్లై హెచ్చులున్ దగ్గులున్.
పోవుచు నుండఁగాఁ గడచిపోవుచునుండును గాల మెప్పుడో
యీ విలయప్రవాహ మిధి యెచ్చటొ ఠక్కున నాగిపోవు నా
పోవుటలోన నిక్క మొకబొట్టయినన్ మఱి నిల్వదే ఫరం
గీః విలయప్రవర్తన ల వెప్పుడు నిట్టులనే ప్రవర్తిలున్.
ఒక వందయేండ్లు కా, దిం
కొక వంద, మఱంతకంటె నుండదు, మీ తా
తకుఁ దాతలు మున్ను హిర
ణ్యకశిపుముఖ్యులు గడించిరాః కాలంబున్.
ఇట ధర్మమ్ము నధర్మ మియ్యవియు రెండే యీ యవంతత్వ వి
స్ఫుటకాలమ్మునయందు నొక్కనిముసంబుంబట్టి మీవంటి లం
వటు లేతాదృగనేకదుష్టకృతి సామ్రాజ్యంబు సాధించు దు
ర్ఘటముల్ కార్యము లాచరించెదరు దౌరాత్మ్యంబు నిత్యంబుగన్.
ఈ నేలంతయు మాది కా దనుట కిం దెవ్వాఁడుః చోరుండు కా
డేనిం జోరుఁడు నేఁడు కానియెడ రేపేన్ బద్ధుఁడున్ వధ్యుఁడౌ
నేనున్ నీవును నెట్లో వ్యక్తులము నట్లే జాతులున్ గ్రూరమా
ర్గానన్ సత్పథమందు నేగుట యహో కాలంబు సాక్ష్యంబుగాన్.
ఆ నిత్యమయిన సాక్ష్యమె
యీనేలఁ బురాణములుగ నెసలారు మహా
జ్ఞానస్థానములై యా
జ్ఞానము నీవంటి తెలివి చాల దెఱుంగన్.
ఈ కోట నేను వదలను
నా కోటమిఁ గలుగునేని నాకుఁ గలుగనీః
నాకుం బ్రాణము లుండిన
దాఁకన్ బోరాడెద నది ధర్మము నాకున్.
పండంగసయ్యె మీదయిన పాపము కొంతకుఁ గొంతగాంగ మా
ర్తాండుని కాంతి వంకవసుధా స్థలమందునఁ బోలె నేను మీ
గుండెలలోన క్రూరమగుఁ గ్రోల్పులివోలిక నిప్పులట్లు కూ
ర్చుండెద నీవు వ్రాసికొను మోయి ఫరంగులమూఁక నేతకున్.
అని వెడలిపోయె లక్ష్మియుఁ
గనుకని నొకకొంత తెలివిగాఁ దెలివగు నా
తననికి ఫరంగికి రాణి వ
చనముల్ మనసున యథార్థసరణిం దోఁచెన్.
కోటలోని ఫరంగులు కోటనుండి
పురుగుకూడఁ దప్పించుక పోవరాదు
వారి మనదైనయీ వ్యవహారమెల్లఁ
బోరొ పొం దో తేలిపోవువఱకు.
భరముగ వంకదారికడ బంటుల గుండెలు తీయుజోదులన్
దిరముగ నిల్పి భద్రమగు తీరును నాలుగు దిక్కులందులన్
బురుజులపై ఫిరంగులను మోసినవానిని బార్లు చేసి సం
గరమున కంత సిద్ధమునుగాఁ బొనరించెను రాణి నేత్రియై.
పాతరలం దుంచఁబడిన విఘ్నేశ్వరు
కోసమో యెలుకలు కుద్దలించె
ఒక కన్ను గ్రుడ్డిదయ్యును గాక మెండఁబో
సిన ధాన్యలక్ష్మి ముక్కున విదిర్చే
గందియు, జనుమును గాయ లెండిన లోని
గింజలు గలగల గిలకరించె
బచ్చి పనపుదుంప బాలెంతరాలు నాఁ
బసిమితో నందమ్ము బాదరించె
మింట మంచున కిలమీఁద మెట్టపంట
పసిమి కొడుగక తప్పకవత్చెఁగాని
గండుటెండలు పట్టఁ బగ్గాలు గల
మహిత హేమంతమెల్ల గ్రీష్మముగఁ జేయ”.
గతించిన తండ్రికి ఉత్తర క్రియల కర్మకాండలయితే దత్తపుత్రుడు శాస్త్రోక్తంగా చేశాడు. రాజ్యాధికారానికి అతడి వారసత్వాన్ని తెల్లవాళ్లు అంగీకరిస్తారా లేదా అన్నది తేలలేదు. మేజర్ ఎల్లిస్ ఇచ్చిన మాట ప్రకారం గట్టిగానే సిఫారసు చేశాడు. కాని గవర్నరు జనరల్‌కు ఏజంటు అయిన మేజర్ మాల్కోం దత్తుడి వారసత్వాధికారాన్ని వ్యతిరేకించాడు. గవర్నర్ జనరల్ డల్హౌసీ కలకత్తాలో లేడు. ఆయన తిరిగి వచ్చి, ఈ వ్యవహారంపై దృష్టి సారించి, నిర్ణయం ప్రకటించడానికి కొంత సమయం పడుతుంది. ఈలోగా పరిపాలన కుంటుపడటానికి వీలులేదు. రాజ్యం అనాథ అయిందని తెలిస్తే అరాజకం ప్రబలుతుంది. ఆక్రమించేందుకు తెల్లవారికి వాటమైన సాకు దొరుకుతుంది. చుట్టుపక్కల పొంచి ఉన్న శత్రువులూ తల ఎగరవేస్తారు. రాజు మరణానంతరం రాజ్య బాధ్యతను కంపెనీ ఏజంటు లాంఛనంగా స్వీకరించినా, రోజువారి పాలనా వ్యవహారాలను ఎవరో ఒకరు చూసుకోవాలి. వారసుడు ఐదేళ్ల పసివాడు. బరువు మోసేందుకు వేరెవరూ లేరు. దాంతో పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి లక్ష్మీబాయే ఆచారాలను పక్కకు నెట్టి రాచకార్యాలను చక్కబెట్టింది. వెంటనే ఝాన్సీని హస్తగతం చేసుకుని తామే నేరుగా పరిపాలించడానికి కావలసిన సైనిక బలం, ఇతర హంగులు అప్పటికప్పుడు సమకూరవు కనుక కంపెనీవారూ ఆ ఏర్పాటుకు అనుమతించారు.
మేజర్ ఎల్లిస్ అడపాదడపా వచ్చి, రాణితో మాట్లాడుతూ అంతా సవ్యంగానే జరుగుతుంది లెమ్మని భరోసా ఇస్తూనే ఉన్నాడు. దత్త స్వీకారం ఏ విధంగా ఆమోదయోగ్యమో, బుందేల్‌ఖండ్ లోనే గల ఓర్చా వంటి ఇతర రాజ్యాల విషయంలో అనుమతించిన ఏర్పాటును ఝాన్సీకి నిరాకరించటం ఎంత అన్యాయమో, మరణించిన రాజు అభిమతం ఎందువల్ల ఆచరణీయమో వివరంగా విన్నవిస్తూ, రాణి లక్ష్మీబాయి పంపుకున్న ఆర్జీలు గరవ్నర్ జనరల్‌కు చేరాయి. రాణి తరుపున కలకత్తా వెళ్లిన దూతలూ తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు. రాజు లేని లోటు కనబడకుండా, రాణిగారు చాలా బాగా పరిపాలిస్తున్నదని జనంలో మంచి పేరూ వచ్చింది. దత్తుడికి రాజ్యాధికారాన్ని వ్యతిరేకించిన మేజర్ మాల్కోం కూడా.. (ఆమె గొప్ప గుణవతి, ఝాన్సీలో ప్రతివారికీ ఆమె అంటే గౌరవం) అని రాణి గురించి పై వారికి మంచిమాట చెప్పాడు.
కొంచెం కుదుట పడ్డాం; కంపెనీ నిర్ణయం మనకు అనుకూలంగానే రావచ్చునని లక్ష్మీబాయి ఒకింత ఆశపడుతుండగా 1854 మార్చి 16న మేజర్ ఎల్లిస్ చల్లగా వచ్చి గవర్నర్ జనరల్ వారి పిడుగులాంటి ఉత్తర్వును చదివి వినిపించాడు. ఎల్లిస్ సిఫారసులనూ, లక్ష్మీబాయి విన్నపాలనూ తెల్లదొరతనం కొట్టిపారేసింది. ఝాన్సీ మున్నెన్నడూ స్వతంత్ర రాజ్యంగా లేదు కనుక, స్వతంత్ర ప్రభువులకు అనుమతించే వారసత్వ హక్కులు ఈ విషయంలో వర్తించవనీ, నేరుగా బ్రిటిష్ పరిపాలన కిందికి వస్తే ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతుందనీ చెప్పుకుని.. కావున ఝాన్సీని మా రాజ్యంలో కలిపేసుకుంటున్నామన్నది గవర్నర్ జనరల్ ఉత్తర్వు సారాంశం. తండ్రి ఆస్తిపాస్తులపై దత్తపుత్రుడి అధికారానికి తాము అడ్డురాబోమని, దత్తుడు మేజరయ్యేదాకా అవి తమ చేతుల్లో భద్రంగా ఉంటాయనీ, రాణిగారికీ అన్యాయం చేయబోమనీ, ఆమెకు సాలుకు అరవై వేల భరణానికో, ఊళ్లోని పాలెస్లో నివాసానికీ ఏర్పాటు చేస్తాము లెమ్మనీ దయామయులు వరాలు కూడా ఇచ్చారు. రాణి నిర్ఘాంతపోయింది. అంతా విని ఆమె ఒకటే అంది. మేరీ ఝాన్సీ దూంగీ నహీఁ (నా ఝాన్సీని నేను ఇచ్చేది లేదు).
అధికారం పోయిందన్న దుగ్ధతోనో, ఏమైనా సరే గద్దె వదలకూడదన్న రాజ్యకాంక్షతోనో పలికిన అహంకారపు పలుకులు కావని, తమ బాధ్యత తీసుకున్న పసివాడి ధర్మబద్ధమైన హక్కుకు అతడి భవిష్యత్తుకు తీరని అన్యాయం.. ఇంత కాలంగా తన భర్త, తాను నిష్ఠతో చేస్తున్న రాజ్యానికి, అందులోని ప్రజలకు, వారి ధార్మిక జీవనానికి ఇకపై తీరని అపకారం.. జరగగలదన్న చిత్తక్షోభనుంచి తన్నుకొచ్చిన మాటలవి.
అప్పటి ధర్మాగ్రహంలో అలా అన్నా లక్ష్మీబాయి ఆ క్షణంనుంచీ తెల్లవారిపై కత్తిగట్టి యుద్ధభేరి మోగించిందేమీ లేదు. స్వతహాగా ఆమె సాత్వికురాలు. సామంతో కార్యం సాధించడానికి ఏమాత్రం అవకాశం ఉన్నా కడదాకా ప్రయత్నించాలని ఆమె భావన. గవర్నర్ జనరల్ చేసిన నిర్ణయం ఎంత దుర్మార్గమైనదైనా ఇంగ్లీషువారి న్యాయ బుద్ధిమీద ఆమెకు ఇంకా నమ్మకం ఉంది. చెప్పవలసిన వారికి చెప్పే తీరున చెబితే వింటారన్న ఆశ ఆమెలో చావలేదు. లక్ష్మీబాయి చేసిన ధర్మోపన్యాసం: దత్తత చెల్లనేరదని వార్త తెల్పిన ఫరంగితో లక్ష్మీబాయి –
ఇట ధర్మమ్ము నధర్మ మియ్యనియు రెండే యీ యనంతత్వని
స్ఫుట కాలమ్మున యందు నొక్క నిముసంబొం బట్టి మీ వంటిలం
పటులే తాదృగనేక దృష్టకృతి సామ్రాజ్యంబు సాధించు దు
ర్ఘటముల్ కార్యము లాచరించెదరు దౌరాత్మ్యంబు నిత్యంబుగన్.
ఆ నిత్యమైన సాక్ష్యమే
ఈ నేల పురాణములుగ నెసలారు మహా
జ్ఞాన స్థానములై యా
జ్ఞానము నీ వంటి తెలివి చాల దెఱుంగన్ (5-43)
ఈ మాటలనగల జాతి స్వభావమేలాంటిదో! ఆ స్వభావం మీద ఆధారపడి కవి ఆ పాత్ర నిర్మాణం చేయడం ఆలోచనామృతం. (ఇక్కడ పురాణ శబ్దం కవి వాడటంలోని ఔచిత్యం కూడా చూడదగిందే. కాల లేశ లేశ ఖండాలను ఏకం చేసి అఖండ కాలంగా చూడగల దృష్టికి కాల సనాతనత్వం-మహాకాల (శివ) స్వరూపం- అవగతమౌతుంది. ఈ దృష్టి- అఖండ – ఏకదృష్టి. దాని పేరే జ్ఞానం. ఇది పురాణం. తద్వైరం ఖండదృష్టి ఇక్కడ అఖండ భావన లేదు. అవయవ దృష్టి తప్ప- అవయవి దృష్టి లేదు. “ఆధునిక కాలంలో పరిశోధన పేరు మీదుగా జరుగుతున్న విద్యా వ్యాసంగమంతా ఖండదృష్టి మీద ఆధారపడినట్టిదే ఇది మంచిది కాదు” అని ఒక చోట కీ॥శే॥ ఆనంద కుమార స్వామి గారన్న మాటలోని అంతర సత్యాన్ని భావించి చూచిన వారికీ ఖండాఖండ దృష్టి తెలుస్తుంది).
ఈ దృష్టితోనే కవి లక్ష్మీబాయి-ఆంగ్లేయుల యుద్ధాన్ని దైవాసుర సంగ్రామంగా పేర్కొన్నాడు. దైవాసుర సంపద్విభాగమన్న గీతాధ్యాయం మానవ మనోగత ధర్మాధర్మ భావ సంకేత వర్ణనమే. దైవం Centripetal force అసురుడు Centrifugal force (Petnes-Seeking. Fugus-Flying). కేంద్ర బిందువున కున్ముఖంగా బాహ్య ఖండాలను అన్వయించేది దైవం. ధర్మం. అది అనేకత్వాన్ని ఏకోన్ముఖంగా చేసే శక్తి కేంద్ర బిందువు నుండి బహిర్గమనం చేసి అనేక దృష్టి కంటిపెట్టుకొని కేంద్రాన్ని విస్మరించి అనేకత్వాన్ని సత్యమనుకొనే దృష్టి అసురీయం. అజ్ఞాన-అధర్మ-సంకేతం. ఒకటి బాహ్యాంభ్యంతర సమన్వయవాదం. మరొకటి కాదు. అది అనురాగ దృష్టి. ఇది ద్వేష దృష్టి. భిన్నత్వంలో ఏకత్వం చూడడం పేరే ధర్మమూ-దైవమూ. కానిది చీకటి. అసురుడు. ద్వేషమంటే సమన్వయం లేకపోవడం. దేనికదిగా చూచుకోవడం. ఇతరంతో విరోధపడటం.
ఇదే భౌతిక-నాస్తికదృష్టి (అస్తి-ఉన్నది) అది అవిజ్ఞేయమూ- అంతరమూ భావాతీతమూ-శబ్దాతీతమూ. కనుక దర్శన యోగ్యమే తప్ప లౌకిక ప్రజ్ఞ కందదు. దాని పేరు అస్తి.
“వాక్, మనో నేత్రాలకది అందదు. అది ‘ఉన్నది’ అంతే”. ఇది కేంద్రంగా బాహ్యజీవితాన్ని అనేకత్వాన్ని తదున్ముఖంగా దానికిది ప్రతీకగా భావించి మలుచుకొనేవాడు ఆస్తికుడు. అది భావమైతే ఇది శబ్దం. శబ్దం భావ ప్రతీక. లేక వ్యంజకం. శబ్దంలో నిగూఢంగా ఉన్న వ్యంజన శక్తిని సూత్రాన్ని దర్శించగలమే తప్ప- అనుభవించగలమే తప్ప – వ్యాఖ్యానించలేం ఇందుకే ధ్వనికారుడన్నాడు. “కేవల శబ్ద శాస్త్ర పరిజ్ఞానంచేత ధన్యర్థ దర్శన భావన లేదు” అదొక వేరే శక్తిచేత లభిస్తున్నది. ధర్మంమీద జరిగే దానిని సహిస్తూ కూచోటమా? ఎలా దీనికి ముగింపు చెప్పాలి. మహారాణి లక్ష్మీబాయిలో ఆలోచన ప్రారంభమైనాయి.
షష్ఠాశ్వాసము:
యుద్ధానికి సన్నద్ధం:
చిన్నప్పుడేదో గుర్రపుస్వారీ, కత్తిసాము నేర్చుకుని, పెళ్లయ్యాక పరదాల మాటున పూజలు చేసుకుంటూ గడిపి, వితంతువయ్యాక తప్పని సరై కత్తిపట్టి యుద్ధానికి సిద్ధమైన అభాగిని లక్ష్మీబాయి. నిండా పాతికేళ్లులేని ఆడపడుచును తలచుకుంటే కొమ్ములు తిరిగిన ఆంగ్లేయ అతిరథమహారథులకు పీడకలలొచ్చేవి. ఆమెను ఎలాగైనా పట్టి బంధించి ఉరికంభమెక్కిస్తే తప్ప మనసుకు శాంతిలేదు. తమ రాజ్యానికి క్షేమం కాదు అని కుంపిణీ సర్కారు గ్రబగబలాడింది. ఈ ఆశ్వాసములో భారతీయులకు ఆంగ్లేయులకు కల్గిన వైషమ్యాలు వివరింపబడ్డాయి.
“నేను ఝాన్సీని వదిలివేయాలా? ఎవడు సాహసిస్తాడో రాని చూస్తాను!” అంటు గర్జించిన వీరనారి ఝాన్సీలక్ష్మీబాయి. ఆంగ్లేయుల నుండి ఝాన్సీ విముక్తమైన తరువాత ఏ క్షణంలోనైన ఆంగ్లేయులు దాడి చేయవచ్చునని లక్ష్మీబాయి ఊహించింది. అక్రమణను తట్టుకొనేటట్లుగా ఝాన్సీని తయారు చేయసాగింది. ఝాన్సీలోని ప్రతి పురుషునికి ఆయుధం పట్టడం నేర్పింది. తాను స్వయంగా యువతులకు శిక్షణ నిచ్చింది. ఝాన్సీ నగరంలోని ప్రతి యిల్లు ఒక దుర్గంగా తయారుచేసింది. కోట గోడలను పటిష్ఠం చేసింది. బురుజులపైన ఫిరంగులు నిలిపింది. మంచి నైపుణ్యం ఉన్న వ్యక్తులను బురుజులపై ఉంచింది. మందరాబాయి కాశీ ఆమెకు అంతరంగిక అనుచరులు. యుద్ధానికి ఒకవైపు సంసిద్ధం అవుతూనే పాలన వ్యవస్థను పటిష్ఠం చేసింది.
ఆమె దినచర్య ఈ విధంగా ఉండేది. ఉదయం 5 గంటలకే లేచేది. సుగంధ జలంతో స్నానం చేసేది. శుభ్ర వస్త్రములు ధరించి పూజ చేసుకొనేది. స్నిగ్ధ ధవళ వస్త్రాలనే ధరించేది. భర్త చనిపోయిన తరువాత శిరోజములను ఉంచుకొన్నందు పవిత్ర జలాలను తలపై చల్లుకొనేది. తులసి కోటకు వెళ్ళి తులసి పూజ చేసేది. తర్వాత పార్థివ పూజ చేసేది. ఆస్థాన గాయకులు గానం చేసేవారు. పౌరాణికులు పురాణాలు చెప్పేవారు. తర్వాత సర్దారులు, అశ్రితులు ఆమె దర్శనం చేసుకొనేవారు. తన వద్ద నున్న 750 మందిలో ఎవరు రాకపోయినా మర్నాడు వారు కనబడగానే నిన్న రాలేదేమని అడిగేది. ఆమె జ్ఞాపకశక్తి అంత గొప్పది. భోజనానంతరం ఏదైన ముఖ్యమైన పని ఉంటే తప్ప ఒక గంట విశ్రాంతి తీసుకొనేది. ఆ తరువాత ఉదయము తెచ్చిన కానుకలు తెప్పించేది. తనకు నచ్చినవాటిని ఉంచుకొని మిగిలినవి సేవకులకు ఇచ్చేది.
మూడు గంటలకు దర్బారుకు వెళ్ళేది. ఆ సమయంలో ఆమె పురుష వేషం ధరించేది. పైజామా, నల్లనికోటు, టోపీ, దానిపై అందమైన తలపాగా ధరించేది. నడుముకు అందమైన వస్త్రపు పటికా ధరించేది. దానికి రత్నాలు పొదిగిన కత్తి ఉండేది. ఆనాడు స్త్రీలు చేసుకొనే అనేక అలంకారాలు భర్త మరణానంతరం మాని వేసింది. చేతికి వజ్రాలగాజులు, మెడలో సన్నని ముత్యాలహారం, చిటికెన వ్రేలుకు ఒక వజ్రాల ఉంగరం మాత్రం ఉంచుకొనేది. ఆమె ధరించే నగలు అవి మాత్రమే! శిరోజములను ముడి వేసుకొనేది. తెల్లని చీరను, తెల్లని రవికను ధరించేది. ఒకసారి పురుష వేషములోను, ఒకసారి స్త్రీ వేషములోను దర్బారుకు వచ్చేది. దర్బారులో అందరికి ఆమె కనపడేది కాదు. దర్బారులలో ఒకవైపు అలంకరింపబడిన మంటపములో ఆసీనురాలై ఉండేది. అందమైన జరీ తెరలు ఆ మంటపం చుట్టు ఉండేది. ఎదురుగా దివాన్ లక్షణరావ్ ఉండేవారు. అనేక ముఖ్య పత్రములు ఆయనవద్ద ఉండేవి. లక్ష్మీబాయి ప్రతి విషయాన్ని చురుకుగా పరిశీలించేది. ఆమె చేసే ఆజ్ఞలు, ఇచ్చే తీర్పులు ఎంతో స్పష్టంగాను, విజ్ఞతతోను ఉండేవి. ప్రతి మంగళ, శుక్రవారాలలో మహాలక్ష్మీ ఆలయానికి పూజకు వెళ్ళేది. లక్ష్మీదేవి ఆమె ఆరాధ్యదేవత.
బహదూర్ షా, నానాసాహెబ్ వారిలాగే లక్ష్మీబాయిది కూడ ఫ్యూడల్ వర్గమే. ఆమెదీ కాలం చెల్లిన రాజరిక సంప్రదాయమే. తెల్లవారితో ఆమెకు పేచీ వచ్చిందీ వారసత్వ హక్కుల దగ్గరే. కాని పోరాటానికంటూ ఆయత్తమయ్యాక కేవలం తన బాగుకోసం తన పెత్తనం కోసం అని కాకుండా విశాల జాతీయ విముక్తి పోరాటంలో తనదే ఒక భాగమని భావించింది. రాజ్యక్షేమం, ప్రజాక్షేమం అన్నిటికంటే మిన్నగా తలచింది. తనకోసం ప్రజలు కాక, ప్రజల కోసం తాను ముందుండి సంఘర్ణణ సాగించింది. తన నిజాయితీతో, చిత్తశుద్ధితో సైనికులను, సామాన్యులను ఉత్తేజపరిచి కార్య రంగంలోకి దూకించింది. వారసత్వ హక్కుల కోసం ఘర్షణను స్వాతంత్య్ర సంగ్రామం స్థాయికి తీసుకువెళ్ళింది. అందుకే జనం ఝాన్సీరాణి ధర్మపోరాటానికి బాసటగా పిడికిలి బిగించారు.
ఏ సూత్రంబున రాణి పెద్దపులి యయ్యెన్ హూణసంవ్యాప్తమై
యా సూత్రంబునయందు సింహనిచయం బాసేతుశీతాచల
క్ష్మా సృష్టింపఁబడెన్ సమస్త మృగరాజశ్రేష్ఠుఁడై యొప్ప నా
నాసాహే బొకరుండు నా విలయసంధ్యాకాలకంఠాకృతిన్.
ఆ సూత్రముక్రిందికె నా
నాసాహెబుకూడ వచ్చినాఁ డా వీరుం
డాసూత్రమె హూణుల గ్రీ
వాసంయోజనపటిష్ఠబంధము చేసెన్.
ఆయన కుమ్మువెట్టె సకలావనియందున లోన నా
గ్నాయి విభుండు పుంజుకొనఁగా నొక రోజున సర్వదేశసం
స్ఫాయతఁ బండి విచ్చికొని భగ్గున మండి దహింప భారత
క్ష్మాయుతమౌ ఫరంగి యవసం బదియు న్నుసియౌచు రూపఱన్.
ఒకపిడక యకాలంబున
వొకచోటను విరిసి కుమ్మునునికిఁ దెలియఁగా
వకటః కలిపురుషున కది
యొకయనుకూలమ్ముకాల మొప్పిన గుఱుతై.
నెలతక్కువబి డ్డైనది
జ్యలియించిన విప్లవాగ్ని జ్వలియించిన ని
ప్పుల విడిలు మంటలోననె
మలమల మాడెను ఫరంగి మత్తశలభముల్.
ఆ కుమ్మంతటి భద్ర
మా కుమ్మును బెట్టినతఁడు నతఁ డని యెఱుగం
గాకయ నానాసాహెబు
నాకాన్పూరున సహాయ మడిగిరి హూణుల్.
హూణనృగాలముల్ కడుపు లుబ్బి పదంబులు బిఱ్ఱసాచి ని
ద్రాణము లయ్యె మాఱట కిరాతుఁడు నుచ్చులత్రాళ్ళు లాగినన్
బ్రాణు లసాధుశీలురయి పాపములం బొనరింప వ్యాఘ్రము
ల్లా నయి తప్పివచ్చిన నృగాలము లౌదురు నీచభావులై.
అపరిణతమ్ము విప్లవమమాగ్నియు లంకెగ నందుకోక ఱం
పపుఁబొడితోడివొ చెదరు మంటలుగా నయి యారిపోవుచో
నిపుణుఁడు నానసాహెబును నెక్కొనఁజేయుచుఁ గూర్చి కూర్చి నే
రుపుమెయి నెంత చేసినను ద్రోహపు వల్ల మోయిళ్ళు మూగెడున్.
తదనంతర భావిత మై
న దేశముల జన మేకనాళము సృష్టిన్
మెదలి యిట బ్రహ్మ యుంచిన
పదివేలగు విత్తనముల ప్రజలై యున్కిన్.
విడివిడి లక్షణాలుగల వీఱిడిమూఁక లిటం జనించుచున్
విడివిడియైన జాతులుగఁ బృథ్విని నేర్పడి రచ్చటచ్చటన్
గడువడి నన్యదేశములఁ గల్గినవారలు జాతు లైరి యా
పుడమిని ధర్మ మొక్కఁడు బ్రభూతమ యైక్యకృదేకభావమై
అమరన్ ధర్మము చిచ్చువంటిది తదభ్యాసంబునన్ దూర దూ
రముగాఁ బోదురు మానవావళి యధర్మంబున్ శరీరంబు నై
జముగాఁ జొచ్చు నధర్మ సంచయమునం జొ నొప్పు నొక్కండు ధ
ర్మముగా నేగెడు జాతి యైక్యమున మర్మం బిద్ది లోకంబునన్.
ఆ ధర్మంబును సన్నగిల్లిన కలివ్యాపారవేళన్ సవి
త్రీధర్మాభిరిరంప కల్గిన ధరిత్రిన్ జాతితాలక్షణ
వ్యాధూతిం జన భారతక్షితిని నైక్యం బుండ దా హేతునై
సాధింపంబడు నీ ధరిత్రియుఁ బరక్ష్మాలోక ధర్మంబుచే
వరగం దొల్తను గూడుగుడ్డలకు లోపం బంచు లేకుండ ని
ద్ధర నిర్మాణము చేసి సంఘపువ్యవస్థన్ బైన ధర్మంబు ని
ల్పిరి యీ భారతధాత్రి నా ద్వయము లోపింపించి తత్పాధనా
దరబుద్ధిన్ నిలుపంగ ధర్మము వ్యవస్థాదూరమై తోఁ చెడున్.
బ్రదుకు మొదలియవసరము లన్నవస్త్రమ్ము
లందఱకును నవ్వి యమరియున్న
యవనియందుఁ బెద్దయాసలు కల్పించి
యవి హరించి దాసు లట్ల చేసి.
ఒక యెవఁడైన దానిఁ బునరుద్ధరణం బొనరింప నెంచు వా
నికి నెదు రొడ్డి యీ జనము నిల్చిన నిల్కడలేని మోహవా
రికిని బ్రవాహభావ మురరీకృతి చేసి సనాతనంబు ధ
ర్మ కళకు స్వస్తి చెప్పెడు సమాయక సేవలచేత వ్యర్థమై.
నానాసాహెబు మార్గము
నానామార్గముల నేగినను ధర్మం బ
స్తోకము తత్కాలా ధ
ర్మాకృతి హరియంపకుండునా కృతి మగుచున్.
అనుకొనిన రోజు రాలే
దనుకొన్నది ముందె తెలిసె నరిసేనకు నా
డును జాగ్రత్తపడిరి మఱి
కొనకొని యీధర్మసేనకున్ సూటి చెడెన్.
ఆగుటా తొలిపదగంబు ననుసరించి
తూగుటా ముందునకు రెండు తోఁచవయ్యె
కొంద రిట్టులఁ జేయంగఁ గొంద జట్టు
భిన్న దేశంబుల ఫలంబు భిన్న మయ్యె.
అది సుశిక్షితమై వ్యవహార మెల్ల
నద్ది బహిరంగముగఁ జేయునట్టి సేన
యిది యశిక్షితమై చేయనెద్ది తలంచె
నిది రహస్యంబుగాఁ జేయ నెంచు సేన.
ఇది తూరు నద్ది పడమర
కదిపిన మలుసంజ దైత్యమట రిపుసైన్యం
బు దివాకాలము కడ చని
నది మిన్నది మీఁదఁ గదలినది రక్తంబున్.
పలుచోట్ల పరంగుల వరు
పులు తీరిచి మెడలు వఱకి చంపిరి మును నా
రలు చేసిన ఘోరంబులు
తలఁచి తలంచి యావరాని దగు కోపమునన్.
దైత్యులకు దేవతలకు భేదంబు నిదియ
దేవతాభావ మెపుడు దైతేయజాతి
పొందదును దైత్యభావంబు పొందు దిజిజ
వితతి ప్రతికారకరణ దుర్వేశయందు
తనువుం దాల్చిన ధర్మదేవత తనంతన్ నానసాహేబు నుం
చినదౌ కుమ్మున లోనిభాగమగు ఝాన్సీకూడఁ దానంతఁ బె
ల్చన మండెన్ దెసలందు విప్లవమహాజ్వాలా ప్రచండంబుగాఁ
గనదాశాతరుణీమణీ కుచతటీ కాశీర పంకంబునాన్.
లలితాకారుఁడు నీతిమెత్త యజముల్లాఖానుండున్ మంత్రియై
నలువౌ చారణదక్షుఁడై సకలసేవన్ దాంతియాటోపి సం
ధిలు ధాత్రీపతి నానసాహెబయి ఝాన్సీలక్ష్మి సామంత భూ
ములు చూడంగ స్వతంత్రతాచటుల మంభోరాశి యుప్పొంగెడున్.
అల పూర్వంబగు నెన్నొవేళలను బ్రహ్మావర్త భూపాల మౌ
శిలసద్గూఢ రహస్య సౌధముల వల్లీవ్యూహ నిర్మాణ ద
క్షులు నీ నల్వుకు నీతిఖండిత వివక్షుల్ పెల్లు కూర్చుండి హూ
ణులకుం గుంపటి తెచ్చి పెట్టిరి శిఖానూత్నాగ్ని సంపుష్టమున్?
ఎలుఁగై కోటను వీడిపొమ్మనిననాఁడే రుద్రకాళింబలెన్
విలయాభీల మహాగ్నిగోళముగ నావిర్భూతయై తా ఫరం
గుల కచ్చోటనె కట్టియుండెడిదయో గోరీలు నిర్ణీతమై
పొలుచున్వేళయుఁగాని వేళ యగుటన్ ముగ్ధాత్మయై యుండెడిన్.
అచ్చట నిచ్చట నంచును
బెచ్చుపెరిగి వచ్చుచున్న విప్లవనార్తల్
విచ్చిన ఝాన్సీపురమునఁ
జిచ్చు విజృంభించెఁ బరవశీకృత మగుచున్.
అల ఫరంగీల గూడెము నాక్రమించి
వారి విగతాయుధులఁ జేసి వారి నెల్ల
శృంఖలాబద్ధులను జేసి చేర్చి యొకటి
వారిని విచారణము చేసినారు ప్రజలు.”
1857 ప్రారంభంలో ఝాన్సీరాణి తన కుమారుడి ఉపనయనం నిర్వహించింది. నానాసాహెబ్ పేష్వారావు సాహెబ్, రంగో బాపూజీ, అజీముల్లా, తాంత్యాతోపీ మొదలైన వారందరు ఆ వేడుకలలో పాల్గొన్నారు. ఝాన్సీరాణి మహల్ నందు ఒక రహస్య సమావేశం జరిగింది. ఆ సమావేశంలో శ్రీమంత్ నానా సాహెబ్ పేష్వా, ఝాన్సీరాణి, రావు సాహెబ్ పేష్వీ, తాంత్యాతోపే, అజీముల్లా, రంగోబాపూజీ తదితరులు పాల్గొన్నారు. మహా సమరానికి జరుగుతున్న ఏర్పాట్లపై సమీక్ష జరిగింది. అందరు సంతృప్తిని వ్యక్తం చేశారు. సమరం ఎప్పుడు ప్రారంభం కావాలి అనే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ‘మే’ మాసం ఎండలు విపరీతంగా ఉంటాయి. ప్రధాన అధికార్లందరు, ఎండలకు తట్టుకోలేక సిమ్లావంటి ప్రదేశాలకు వెళతారు. మిగిలిన ఆంగ్లేయులకు కూడా ఎండలలో పోరాటం కష్టమే. అలాగే ఆదివారం నాడయితే ఫిరంగీలందరు చర్చికి వెళతారు. అందరు ఒకే సమయంలో దొరుకుతారు. యుద్ధానికి సిద్ధంగా ఉండరు. కనుక ‘మే 31’ ఆదివారం నాడు దేశమంతా సమరం ప్రారంభం కావాలని నిర్ణయించటమైంది.
పెనంమీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది ఝాన్జీరాజ్యం పౌరుల పరిస్థితి. బ్రిటిష్ వారి చేతిలో ఝాన్సీ నగరంలో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. తెల్లదొరల దోపిడీలకు, అఘాయిత్యాలకు గురి అయిన అభాగ్యులు ఎంతోమంది ప్రాణాలను తీసుకొన్నారు. ఏనాడు పరదా వీడి ఎరుగని గొప్పింటి ఇల్లాళ్ళు ఎందరో తమ మాన మర్యాదలకు ఎక్కడ భంగం వాటిల్లుతుందోనన్న భయంతో తెల్లవాళ్లు రాకముందే పెరట్లోని బావిలో దూకి ప్రాణాలు తీసుకున్నారు. సైనికులు మిడతల దండులా విరుచుకుపడి ఇళ్లల్లో కనిపించిన వారిని కనిపించినట్లు క్రూరంగా నరికేశారు.
అలా బ్రిటిష్ వారి బారిన పడ్డ ఉర్దూ మహాకవి గాలిబ్ గారి మాటల్లో ఇలా వర్ణించాడు. “సైన్యం నగరంలోకి వస్తూనే కనబడిన వారినల్లా కాల్చేశారు. ఆస్తులన్నీ దోచుకున్నారు. నా ముందు ఇక్కడ రక్త సముద్రం ఉంది. ఇంకా ఏమి చూడాల్సి వస్తుందో దేవునికెరుక. నా స్నేహితులు వేలమంది మరణించారు. బాధ చెప్పుకుందామన్నా ఎవరూ లేరు. నేను కన్ను మూస్తే కన్నీటి బొట్టు విడవటానికి ఎవ్వరూ లేరు. ఎంతమందిని చంపారో, ఎందరిని ఉరితీశారో దేవుడికే తెలుసు. నేను కూడ తుపాకీ గుండుకు గురి కావలసిన వాడినే కాని వెంట్రుకవాసిలో బయటపడ్డాను” అని గాలిబ్ కవి అన్నాడు.
“తనవంక నిర్భయంబుగ జూచెనని యెంచి యొక డొక్క భారతీయుని వధించె” “క్రొత్త తుపాకి మ్రోగునో లేదోయని చూడనొక డొక్క భారతీయుని వధించె” పై పద్యంలో మనం గమనిస్తే బ్రిటిష్ వాళ్లు భారతీయుల ప్రాణాలను ఎంత తేలికగా తీసేవారో అర్థమవుతుంది. వాస్తవంగా ఝాన్సీ వీధుల్లో ఎక్కడ చూసినా పీనుగుల పోగులు కనిపించేవని, కుళ్లిన శవాలను కుక్కలు, రాబందులు పీక్కుతింటున్న దృశ్యాలు ఎక్కడపడితే అక్కడ దర్శనమిచ్చేవని లార్డ్ రాబర్ట్స్ తన గ్రంథంలో పేర్కొన్నది అక్షర సత్యం.
(సశేషం)
