[డా. బి. మల్లయా చారి గారి ‘తెలుగు సాహిత్యంలో ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం – పరిశీలన’ అనే సిద్ధాంత గ్రంథాన్ని ధారావాహికగా అందిస్తున్నాము.]
2వ అధ్యాయం – 1857 మహాసంగ్రామ యుద్ధవీరులు
సిపాయిల తిరుగుబాటు గురించి వచ్చిన సాహిత్యం-చారిత్రక గ్రంథాలు
భారతదేశ చరిత్రలో 1857 పూర్వరంగములందరు ఉద్భవించిన ఈ విప్లవాగ్ని భారతదేశ ప్రజలలో అన్ని వర్గములలోను, ప్రజ్వలించి తమ మత ధర్మములకు, సంస్కృతి, సంప్రదాయాలకు, అర్ద సంపదకు భంగం కలిగించిన బ్రిటిష్ కంపెనీ రాజ్యమును కూలద్రోయుటకై 1857లో జాతీయ స్వాతంత్య్ర సమరముగా పరిణమించింది. భారతదేశ ప్రజలలో అనేక వర్గములవారు ఏకమై స్వాతంత్య్రము కొరకు పోరాడి ప్రాణాలర్పించారు. అటువంటి తిరుగుబాటును భారతదేశ చరిత్రకారులు కాక కవులు, రచయితలు, మహావీరుల పోరాటాన్ని ఆవిష్కరించే భావనలు ఉదయించడంవల్ల మన స్వాతంత్య్రం సుసంపన్నమైనది. నాటి వివరాలను ఈ అధ్యాయంలో పరిశీలిద్దాం.
ఝండా గీత్:
అజీముల్లా రచించిన ఈ గీతం ఆనాడు సమరగీతమైంది. సిపాయిలు అందరు ఈ పాట పాడుకొనేవారు. ఆంగ్లేయులు ఈ పాట ప్రతులన్నీ ధ్వంసంచేసినా సిపాయిల హృదయాలలో మిగిలిపోయింది. వారి పెదవులపై నర్తించింది.
ఈ భూమిక మనమే ప్రభువులం – హిందుస్థాన్ మనదేనోయ్
ఈ జాతియొక్క పవిత్ర భూమిది – స్వర్గముకన్నమిన్నయిది
ఇదే మన సంపద-హిందుస్థాన్ మనదేనోయ్
ఇక్కడి జ్ఞాన సంపదచే-జగమంతా ప్రకాశించినది
ఎంత ప్రాచీనము ఎంతటి నూతనత్వం-ప్రపంచంకన్న ప్రియమైనది
గంగా యమున ధారలతో-నిత్యం సారవంతమవుచున్నది
ఉత్తరాన హిమాలయాలు-మనదేశపు రక్షణ దుర్గాలు
అడుగున పాదాలవద్ద- నిరంతర సాగరఘోష
ఈ దేశపు గనులనుండి-బంగారు రత్నాలు ఉబికి వస్తున్నాయి
ఈ పుడమి గౌరవాన్ని-ప్రపంచం కొనియాడుతున్నది
దూరంనుండి వచ్చిన తెల్లవారు-దొంగదెబ్బ వేశారు
రెండు చేతులతో మన పవిత్రదేశాన్ని-దోచుకుతిన్నారు
ఓ మహావీరులారా! గాయపడిన మన తల్లి -పిలుస్తోంది మిమ్ములనందరిని
నిప్పుకణాలు వెదజల్లుతు-బానిస సంకెలలు ఛేదించండి
హిందు, ముస్లిం, సిఖ్ఖు లందరం-ఆత్మీయ సోదరులం
ఇదే స్వాతంత్య్ర పతాక-దీనికే మన గౌరవ వందనం
“చుట్టు ముట్టినవి కరువు కాటకాలు
పాటలన్నీ మరచిపోయాం
ఏ అండ మమ్మల్నిప్పుడు
కదిలించలేడు”
– బ్రిటిష్ ఇండియా గురించి ఒక కవి వాఖ్యానం యిది.
సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమానికి 1857 ని ప్రారంభంగా తీసుకోవచ్చు. 1857 తిరుగుబాటుకి జాతీయ రాజకీయ లక్షణం వుంది. బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ కన్నింగ్ మొదట దీన్ని సిపాయిల పితూరి (sepoy mutiny) గా పేర్కొన్న, అనతికాలంలోనే ‘తిరుగుబాటు’గా పేర్కొనడం గమనించదగ్గది. ఆయన వాడిన విశేషణాలు ‘revolt rebellion’ బ్రిటిషు పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు డిస్రాయిలీ ‘ఈస్టిండియా కంపెనీ’ జాతీయతను నాశనం చేసే సూత్రానికి అనుగుణంగా ప్రవర్తించిన తీరుకు ప్రతీకారంగా వచ్చిన ‘తిరుగుబాటు’గా 1857ను పేర్కొంటాడు. లండన్ టైమ్స్ సుప్రసిద్ధ సంపాదకుడు రస్సెల్స్ 1857 ‘నూతన అగంతకుడినే కాడిబరువుని తోసివేసి స్వదేశీ ప్రముఖులు అధికారాన్ని, మతాల వికాసాన్ని పునరుద్ధరించే ‘జాతీయ సంకల్పం’గా పేర్కొంటాడు.
భారతీయులు దురాక్రమణదారులైన బ్రిటిష్ వాళ్ళని తెల్లచీమలని అనేవాళ్ళు. 1857 ప్రాథమిక లక్ష్యం విదేశీయుల్ని తరిమికొట్టడం, పరాయి ఫిరంగి పాలనకు భరతవాక్యం పాడటం, తిరిగి జాతీయ సార్వభౌమత్వాన్ని పొందడం అంటారు పూరణ్‌చంద్ జోషీ. బ్రిటిష్ అధికారం పరాయిపాలనను రుద్దడం ఒక్కటే చేయలేదు. సంప్రదాయ సాంఘిక నిర్మాణాన్నే నాశనం చేశారు. భూ వ్యవస్థను నాశనం చేశారు. ధామస్ మాటల్లో చెప్పాలంటే..
“Ruin, ruin, Poverty.. as though a leper had touched the land. It were hastening to decay…No one who has eyes and ears to use can doubt for a moment that we have almost totally neglected the resources of such a mighty country. While we have introduced our manufacturing towns in to every cranny of the land. It appears as though we had endeavoured to destroy every inherent useful production by western merchandise”.
లోవే అనే ఒక గ్రామీణ వృద్ధుని మాటల్ని కూడా కోట్ చేస్తాడు. “దోరా-అడవులు, చెట్లు, నదులు, బావులు, పల్లెలు అన్నీ సర్కారువే. అన్నింటినీ వాళ్ళు తీసేసుకున్నా ఏం చెయ్యాలె మేం.”
ఈ కాల్చే ఆకలి, కూల్చే వేదనే భారతీయ రైతాంగాన్ని ఈ ‘తిరుగుబాటు’లో పాల్గొనేలా చేసింది. బ్రిటిష్ వాళ్ళ పాలసీ, రాజుల్ని, రైతుల్ని, వర్తకుల్ని, వృత్తి పని వాళ్ళనీ అందరినీ దెబ్బతీసింది.
దెబ్బతిన్న అందరూ తిరగబడ్డారు. ఎదురు తిరిగారు. అందుచేతనే యిది సుప్రసిద్ధమైంది.
ఆధునిక హిందీ అప్పుడప్పుడే రేకులు విచ్చుకుంటోంది. హిందీ-దాని అనేకానేక మాండలిక భాషలే మాతృభాషలుగా వున్న ఉత్తర మధ్య భారత ప్రజానీకం.
భరతేందు ‘భారత్ దుర్దశా’అనే నాటకంలో బ్రిటిష్ పాలనని అభిశంషిస్తాడు.
“భరతభూమి దుఃఖం చూస్తే గుండె చెరువౌవుతుంది.
ప్రజలంతా భయంతో బిక్కచచ్చిపోయారు.
వాళ్ళంతా దరిద్రులూ అనాథలూ
బ్రిటిష్ పాలనలో ఎన్ని సౌకర్యాలని!
భూమి సంపద వలసపోయింది
తావూ రోగం కూడబలుక్కున్నాయి
దినదినగండం నూరేళ్ళాయుష్షు
పన్నులూ తన్నులూ
మిషన్లు పెట్టి దోచుకున్నారు
సంపదంతా వెళ్ళిపోతోంది
దుఃఖాలు ద్విగిణీకృతం ఔతున్నాయి
వాళ్ళ వత్తీ మజ్లిస్ లేంది పొద్దు గడవదు
మనమంతా విదేశీ నేత గాళ్ళకు బానిసలం
ప్రతి చిన్న వస్తువును పైనుంచి తెచ్చుకోవల్సిందే”
బద్రీ నారాయణ్ అన్న కవి – కరువు కాటకాల భారతాన్ని యిలా చిత్రీకరిస్తాడు
పరిగెత్తండి పరిగెత్తండి
విరుచుకుపడింది కరువూ-కాటకం
ప్రళయ కాల మేఘాలు భారతాకాశాన్ని కమ్ముకుంటున్నాయి
వర్తక వాణిజ్యాలన్నీ మాయమయ్యాయి
చిన్నచిన్న పరిశ్రమలు చెదిరిన దృశ్యాలయ్యాయి
వ్యవసాయమా! బీడయిపోయింది
ధరల మంటలాకసాన్ని తాకుతున్నాయ్!
తన ‘భారత దుర్దశ’ లోనే భరతేందు 1857 తిరుగుబాటుని
“సిపాయిల తిరుగుబాటు
అగ్నినార్పి వేశారు క్రూరంగా
తలపక్కకు తిప్పి చూడలేని
భయద భయద వాతావరణమంతా”
రాజస్థానీ సంస్థానకవి సూరజ్‌మల్-బుందీ దర్బార్ ‘కవి-1857 తిరుగుబాటుని భారత స్వాతంత్య్ర సంగ్రామంగా గానం చేశాడు. (ధాకూర్ పూల్ సింగ్‌కి రాసిన లేఖలో)
“రాజులారా! విదేశీయుల దయాదాక్షిణ్యాలు యాచించే
మిమ్మల్నింక ‘‘సింహా’లనటం తగదు
‘ఏనుగు కుంభస్థలాన్ని కొట్టే పంజాలుంటేనే’ సింహాలవి.
సోమరి దారుల్లో తుచ్ఛ సౌఖ్యభారాల్లో
మీ రోజులు తెల్లవారుతున్నాయ్”
సూరజ్‌మల్ రాజులనే తిరగబడమని అంటాడు. కానీ వాళ్ళ తిరోగమన స్వభావాన్ని చూస్తాడు. ప్యూడల్ కవే అయినా, బ్రిటిష్ వారి తొత్తులుగా మారుతున్న రాజులనే గర్హించే సూరజ్‌మల్ ప్యూడల్ పరిమితుల్లోనే ప్యూడల్ సామ్రాజ్యవాద వ్యతిరేక, కవిగా నిలుస్తాడు.
తిరుగుబాటు దారుల రాజకీయ దృక్పథాన్ని వాళ్ళ పతాకగీతంలో చూడవచ్చు. సమకాలీన ‘పయామీ అజాదీ’ పత్రికలో ఈ గీతం ప్రచురింపబడింది. తర్వాత నయాహ్రీందేలో పండిత్ సుందర్‌లాల్ చేర్చారు.
‘ప్రజల పాటల్లో 1857’ పుస్తక రచయితలు 1857 తిరుగుబాటులో జాతయ నేషనల్ సెంటిమెంట్ లేదనే రచయితల్ని ఒప్పుకోరు. 1857 పతాకగీతం వాళ్ళ వూహ తప్పని నిరూపిస్తుందంటారు. 1857 పతాకగీతం వాళ్ళ సాంఘిక స్థితిగతుల్ని సరిగ్గా అంచనా వెయ్యాల్సి వుందంటారు. ప్యూడల్ సమాజంలోనే దేశభక్తి ఎలా బద్ధలైందో ఈ 1857 ప్రజాగీతాలు తెలియచేస్తాయంటారు.
ఈ గీతాల నిండా బ్రిటిష్ ఫిరంగుల పట్ల క్రోధం-ద్వేషం-అసహ్యం కన్పిస్తాయి. ఫిరంగుల నెదుర్కోవడం విశేష కర్తనీయం అయ్యంది. లొంగిపోవడం అవమానకరం అయ్యింది. 1857 ని చరిత్ర రచయితలు-ప్యూడల్ పునరుద్ధరణను 1857 లో చూస్తారు. స్వదేశీ రాజుల్ని -బహదూర్‌షాని ఢిల్లీ గద్దె నెక్కించడమే దీని లక్ష్యం. కానీ ఇందులో ‘విదేశీయుని కంటే స్వదేశీయుడు కావాలి’ అన్న అంశం ముఖ్యమంటాడు జోషీజీ. రసెల్ అనే బ్రిటిషర్ ‘ఇండియా ప్రజలకిమన మీద నమ్మకం లేదు!’ అన్న మాటల్ని చూస్తే ఇది నిజమనిపిస్తుంది. బ్రిటిష్ రిపోర్టర్‌గా వున్న భారతీయ రిపోర్టర్ ‘మున్షిమోహన్‌లాల్’ తిరగబడిన ప్రజలు బ్రిటిష్ పాలకుల కంటే భారతీయ పాలకుల్నే ఇష్టపడుతున్నారంటాడు. “The people of those in sought territories were inclined to prefer Indians as their rules to the British”.
19వ శతాబ్ధంలో బ్రిటిష్‌వాళ్ళు భారతీయ రాజ్యాన్ని ఒకదాన్ని తర్వాత ఒకటి మింగేస్తూ వెళ్తున్నప్పుడు ప్రజల బాధలూ పెరిగిపోతున్నప్పుడు ఆ ప్రజలు వాళ్ళ వాళ్ళ పాలకుల్ని బలపర్చడం సహజమే. సమకాలీన బ్రిటిష్ పత్రికలు కూడా 1857 తిరుగుబాటుని ‘National rebellions’ అని పేర్కొన్నాయి. 1857 భారతీయ ప్యూడల్ పాలకుల మోసం వల్లే కూలిపోయింది. 1857 కార్యకర్తలు ప్రజల బాణీల్లోనే -భాషల్లోనే ప్రజలను ఉత్తేజ పరిచారు. తోలుబొమ్మలాటలు ఎక్కువగా కనబడతాయి. పన్వాడాస్ (బేలేడ్స్) లావణీయాలు (ఫోక్ మ్యూజికల్ ఆర్ట్) పోలీస్‌స్టేషన్ల వద్ద పాడేవారు. అల్‌హావుదాల్ అనే వీరసర గీతాలు కూడా పాడేవారు. కలకత్తా నుంచి పంజాబ్ దాకా’తమాషాలు’ (జానపదం నాటకం) ప్రదర్శించేవాళ్ళు. ఈ పాటలు దేశభక్తిని పెంచడానికి యత్నించాయి. ఈ పాటలు రాసిన వాళ్ళలో అత్యధికులు అందులో పాల్గొన్న ప్రజలే! ఝాన్సీ రాణీ, కున్వర్‌సింగ్ రాజీగులాబ్‌సింగ్, రాణాబేణీ మాధవ్ వీరాగ్రేసరులపై కట్టిన పదాలు శక్తివంతంగా వుంటాయి. ఖూబ్‌లడీ మర్‌దానీ జాన్సీవాలీ (మగవానిలా ఎంతో వీరోచితంగా పోరాడిందీ ఝాన్సీ రాణి. Sir Hugh Rose: Although a lady She was the bravest and the best military leader of the rebels. A man among the mutinees”-…
ఆధునిక కాలంలోనే ఏ జాతీయ ఘటన పైనా ఇన్ని గీతాలు వచ్చి వుండవు. కున్వార్‌సింగ్‌ను ‘భోజ్‌పురీపిత’ అని పిలుస్తారు. ఆడవాళ్ళు పాడే హోళీ పాటల్లో, సోహర్‌లలో కన్వర్‌సింగ్‌ను ప్రేమాభిమానాలతో కీర్తిస్తారు. లక్ష్మీభాయి కున్న పాపులారిటీ మరెవ్వరికంటే తీసిపోనిది. వాళ్ళు జాతీయ వీరులస్థానాన్ని ఆక్రమించారు..
1857 తిరుగుబాటు మొట్టమొదటి భారత జాతీయ తిరుగుబాటు. 1857కి వందేళ్ళు నిండిన సందర్భంగా మార్క్స్ ఎంగెల్స్ రచనల పుస్తకం తెస్తూ రష్యన్లు ఆ పుస్తకానికి ‘ప్రథమ భారత సంగ్రామం’ అనే పేరు పెట్టారు. మార్క్స్ ఎంగెల్స్‌ల వ్యాసాల్లో ఈ పేరు మనకు కనపడదు. జాతీయ తిరుగుబాటు అనే మాటే కనిపిస్తుంది. ప్రప్రధమంగా ఒక విశాల ప్రాంతంలో దీర్ఘకాలం జరగడాన్ని బట్టి దాన్ని ప్రథమ భారత స్వాతంత్య్ర పోరాటంగా పిలవడంలో తప్పేమీ లేదు. 1757లో బ్రిటిష్‌వాడు ఈ నేల మీద అడుగుమోపిన నాటి నుంచీ భారతదేశంలో విభిన్న ప్రాంతాల్లో విభిన్న వర్గాల ప్రజలు బ్రిటిష్ దమననీతికి విరుద్ధంగా పోరాడుతూనే వున్నారు. వాటన్నిటి పరాకాష్ట 1857. 1857 ప్రత్యేకత దాని సాయుధ పోరాట చైతన్యంలో కనపడుతుంది. రైతాంగ స్వభావంలో కనబడుతుంది. బ్రిటిష్ వ్యతిరేక సాయుధ పోరాటాలు 1794 ప్రాంతాల నుంచీ జరుగుతూ 1857 లో ఓ మలుపు తీసుకున్నాయి. తర్వాతి రైతాంగ పోరాటాలకు కూడా 1857 ఎంతో స్ఫూర్తి నిచ్చింది.
కొత్త బూర్జువావర్గం, పెట్టీ బూర్జువావర్గం చట్టబద్ద ఆందోళనా మార్గంలో కొనసాగుతూవుంటే భారతీయ రైతాంగం జమీందార్లు, సాహూకార్లు, వడ్డీ వ్యాపారస్తులకు వ్యతిరేకంగా సాయుధ పోరాట మార్గాన్ని ఎన్నుకున్నది. నీలి రైతుల పోరాటం (1859-60) జయంతి తిరుగుబాటు (60-63); కూకీ పోరాటం (60-90) పూలాగుడీ పోరాటం (1861), కూకాతిరుగుబాటు (69-72) పబ్‌నా రైతాంగ తిరుగుబాటు (72-73), మహారాష్ట్ర రైతాంగ పోరాటం (1875), పూనాలో బలవంత్ ఫాడ్కే తిరుగుబాటు (79) రంప తిరుగుబాటు (79-80) ఇవన్నీ భారతీయుల్లో బ్రిటిష్‌వారి పట్ల వ్యతిరేకతని అసహ్యాన్ని రగులుకొల్పడంలో, ప్రజాభిప్రాయాన్ని ఏర్పరచటంలో 1857 కి కొనసాగింపుగా మహత్తర పాత్రను పోషించాయి. బెంగాల్లో కొత్త మధ్యవర్గం, కొత్త జమీందారుల ద్రోహం కారణంగా 1857 జాతీయ తిరుగుబాటులో భాగం కాలేకపోయినా ‘నీలిరైతుల పోరాటంతో బెంగాల్ రైతులు అనతికాలంలోనే ఆ కళంకాన్ని తుడిచేసుకోగలిగారు.
నీలిరైతు పోరాటం బ్రిటిష్‌వారికి 1857ని మరోసారి గుర్తుకు వచ్చేలా చేసిన పోరాటం. నీలిరైతుల పోరాటంలో నాయకుల పేర్లు 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించిన పేర్లే కనబడతాయి. దాన్ని బట్టే తర్వాతి పోరాటాలపై ఎంతటి ప్రభావం చూపిందో మనం తెలుసుకోవచ్చు. 1857 తర్వాత వచ్చిన పోరాటాలు కూడా 1857 లోనే ఓడిపోవచ్చు. కాని అవి భావి తరాలకు అందించిన బలమూ సందేశమూ గొప్పవి.
1857 పోరాటం, ఆ తర్వాతి సాయుధ పోరాటాలూ భారతదేశంలో జాతీయ భావనను రగులుకొల్పటంలో సఫలీకృతం చెందాయి. 1880 కల్లా జాతీయ భావనలు మొగ్గ దొడగనారంభించాయి. క్రమంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదులు, భారత పారిశ్రామికాధిపతుల మధ్య, బ్రిటిష్ పరిపాలనా, మేధావివర్గం మధ్య, జమీందారులు రైతుల మధ్య వైరుధ్యాలు తీవ్రతరం కావడం ప్రారంభించాయి. నూతన బూర్జువా వర్గం, భారత సమాజ నాయకునిగా రంగ ప్రవేశం చేసింది. ఇది సంస్కరణవాద స్వభావం గలది. ప్రజల్నీ, యువజనుల్ని విప్లవ మార్గాన్నుంచి దూరంగా వుంచడానికే శతథాయత్నించింది.
‘నేను మేజినీపై ఉపన్యాసం వచ్చేవాణ్ణి. ఆ ఉపన్యాసంలో మేజినీ విప్లవ ధర్మాన్ని కాక ఆత్మత్యాగ భావనని, దృఢ నిశ్చయాన్ని స్వీకరించి చట్టబద్ధ మార్గాల్లో పోరాటమంటూ యువజనుల్ని వుద్బోధించేవాణ్ణి’ అని చెప్పే సురేంద్రనాథ్ బెనర్జీ అడుగుజాడల్లోనే నడిచి 1947లో అధికారాన్ని స్వీకరించింది. ఆ వెన్నెముక లేని పెట్టుబడిదారీ వర్గం కొంతకాలం సంస్కరణల మార్గంలో నడిచి తొంబయ్యో దశకం నాటికి అమెరికా దిక్కు జరగటం ప్రారంభించింది. కథ అందరికీ తెలిసిందే. సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రపంచ బ్యాంకు వేగంగా భారత జన జీవితంలోకి ప్రవేశించి అన్ని రంగాలను అతలాకుతలం చేశాయి. స్వదేశీ విదేశీ రాబందులకు దేశాన్ని ఆహారంగా చేసేశాయి. పల్లె వల్లకాడైంది. పట్నం మురికి కూపమైంది. అన్ని వర్గాల ప్రజలను వాళ్ల అదృష్టానికి వాళ్లను వదిలేశారు.
“ఇంటింట చీకటే/ప్రతికంట కన్నీరే”
చేతి వృత్తులు కోల్పోయిన జనాలు పకక్షులైపోయారు. వలస రైతు నొసటి రాతై నిలిచింది. ఆత్మహత్యలు నిత్యకృత్యాలయ్యాయి. పేద మధ్య తరగతి జనాలకు చదువు అందరాని మానిపండైంది. ఉపాధి శూన్యమైంది. సంక్షోభం నుంచి సంక్షోభంలోకి అన్ని రంగాలు పయనిస్తున్న తరుణం. సామ్రాజ్యవాదం, ముఖ్యంగా అమెరికన్ సామ్రాజ్యవాదం మన జీవితాలతో ఆడుకుంటున్న తరుణంలో 1857 జ్ఞాపకం మనలో సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట చైతన్యాన్ని పెంచుతుంది.
1857 తిరుగుబాటుని నడిపిన యోధులు కార్యకర్తలూ ప్రజల్ని చైతన్యపరచడానికి అనేక కళారూపాలను ఉపయోగించుకొన్నారు. ‘తమాషా’లని పిలవబడే ఒక రకమైన తోలుబొమ్మల్లాంటి నాటకాలు ఆడేవాళ్లు. పవ్‌వాడాలు(పాటలు), లావణియాలు (జానపద సంగీత కళారూపం) పోలీస్‌స్టేషన్ల దరిదాపుల్లోనే పాడేవారు, ప్రదర్శించేవాళ్లు ‘అల్హావుదల్’ ఓ వీరగాథలాంటిది. రక్తాన్ని ఉడుకెత్తించే పాట అది.
కలకత్తా నుంచి పంజాబు దాకా రాత్రివేళల్లో ప్రమాదకర తమాషాల ప్రదర్శనలు కొనసాగేవి. ఈ ప్రదర్శనలు బ్రిటిష్‌వాళ్లపై అసహ్యాన్ని కలిగించేవే. 1857కి సంబంధించిన జానపద గీతాల్లో బ్రిటిష్‌వాళ్ల పట్ల తీవ్రమైన వ్యతిరేకత అసహ్యమూ కానవస్తాయి. 1857ని తీవ్రాతితీవ్రంగా అణిచి వేసింతర్వాత దీర్ఘకాలం కొనసాగిన నిర్బంధ, హింసలు కొనసాగినాయి. 1857ని జ్ఞాపకం చేసుకోవడమంటే జైలుకి పోవడమే. చావుని వరించడమే. అయినా ప్రజలు తమ జ్ఞాపకాల్లో 1857ని పదిల పరచుకున్నారు. మౌఖిక గీతాల రూపంలో ఆధునిక కాలంలోని ఏ జాతీయ ఘటన మీదా ఇన్ని గీతాలు వచ్చి వుండవు. 1857లో పాల్గొన్న నాయకులు అశేష ప్రజాదరణవున్న నాయకులు. కున్వర్‌సింగ్ 75 ఏళ్ళ వయస్సును లెక్కచేయకుండా రణరంగంలోకి దూకి పోరాడిన వీరుడు. భోజపురీలతన్ని ‘భోజ్‌పురీపిత’గా పిలుచుకుంటారు. ఆడవాళ్లు పాడుకొనే హోలీ పాటల్లో సోహర్ అనే జానపద సంగీత కళారూపం లాంటివి ఆయన్ను ప్రేమతో, గౌరవంతో కీర్తిస్తాయి. లక్ష్మీబాయి సంగతి చెప్పనవసరంలేదు. భారతదేశంలో ఆమెకున్నంత పాపులారిటి విఖ్యాతి మరెవ్వరికీ తీసిపోనివి. వీళ్ళు జాతీయ వీరుల స్థానాలాక్రమించారు.
భారతదేశంలోని వివిధ ప్రాంతాల భాషా సాహిత్యాలను దేశభక్తి మార్గం పట్టించడంలో 1857 అజేయ పాత్ర నిర్వహించింది. అణచివేతలు, దారిద్య్రాలూ, దౌర్జన్యాలూ, దోపిడి, పోరాటాలు, త్యాగాలు లాంటి వస్తువులను ప్రదానంచేసి 1857 జాతీయ సాహిత్యాన్ని ఉన్నతోన్నతంగా నిలిపింది.
తెలుగు సాహిత్యంలో 1857 ప్రతిధ్వనులు ఇంకా పరిశీలించాల్సిన అంశమే. విశ్వనాథవారి ‘ఝాన్సీలక్ష్మీబాయి’. పుట్టపర్తివారి ‘సిపాయిల పితూరీ’ ఆ వీరుల గొప్పదనాన్ని కీర్తించేవి.1857 కి ఆ తర్వాతి జాతీయోద్యమం కొనసాగింపు దేశభక్తియుత సాహిత్య మంతటిలో సామ్రాజ్యవాద వ్యతిరేక 1857 ప్రతిఫలనాలు కనిపించక మానవు. ఒక దేశభక్తియుత పోరాట అవసరాన్ని మనముందుంచేది. 1857 తిరుగుబాటును జ్ఞాపకం చేసుకోవడం మనలో చైతన్యాన్ని రగులు కొలిపేది. ఒక రాజీలేని పోరాట స్ఫూర్తిని అందించేది.
2.7 కొన్ని చారిత్రక గ్రథాలు:
- Sir John Kaye, A History of the Sepoy War in India, 3 Vols.
- G.B. Malleson, History of the Indian Mutiny, 3 Vols
- G.B. Malleson, Indian Mutiny of 1857
- Charles Ball, History of Indian Mutiny, 2 Vols
- T.R. Holmes, History of Indian Mutiny.
- Lord Roberts, An Eyewitness Account of the Indian Mutiny.
- G.W.Forrest, History of the Indian Mutiny, 3 Vols.
- M.R. Gubbins, An Account of the Mutinies in Oudh.
- H.H. Dodwel, The Cambridge History of the India, Vol. 5
- V.D. Savarkar, The Indian War of Independence, 1857.
- S.N. Sen, 1857
- R.C. Majumdar, British Paramountcy..
- R.C. Majumdar, The Sepoy Mutiny and the Revolt of 1857
- R.C. Majumdar, Three Phases of India’s Struggle for Freedom.
- B.D. Basu, Rise of the Christian Power in India.
- Tarachand, History of Freedom Movement in India, Vol. II.
- K.P. Bahadur, History of Freedom Movement in India, Vol. II.
- Bisheshwar Prasad, Bondage and Freedom, Vol. I.
- Marx–Engels, The First Indian War of Independence 1857-1859
- P.C. Joshi, India in 1857
- M.L. Bhargava, Saga of 1857
- Ainslee T.Metcalfe, Indian in 1857.
- Sir T.Metcalfe, Two Native narratives of the Mutiny of Delhi.
- G.S. Cheema, The Forgotten Mughals.
- K.C. Yadav, Delhi in 1857, The Trail of Bahadur Shah.
- K.C. Yadav, Rao Tula Ram- A Hero of 1857.
- W.M. Torrens, Empire in Asia.
- S.B. Chaudhuri, English Historical Writings on the Indian Mutiny.
- Sir Syyid Ahmad Khan, History of Bijnor Rebelion.
- Asoka Mehta, 1857.
- S.N. Sinha, Rani Lakshmi Bai of Jhansi.
- Sir John Smyth, The Rebellious Rani.
- Mahasweta Devi, Rani of Jhansi.
- S.N. Sinha, The Revolt of 1857 in Bundel Khand.
- Hariprasad Thapliyal, The Life and Work of Peshwa Nana Saheb.
- Rudrangshu Mukherjee, Awadh in Revold, 1858-1858.
- Pandit Sundarlal, British Rule in India.
- F. Gaekwad, Sayaji Rao of Baroda.
- Ritambhari Devi, Indian Mutiny :1858 in Bihar.
- V.D. Divekar, South India in 1857.
- Moulvie Syed Mahdi Ali, Hyderabad Affairs, Vol.III.
- Sarojini Regani, Niza-British Relations 1724-1857.
- R.Palme Dutt, India Today.
- పి. శ్రీరామశర్మ, 1857 తిరుగుబాటు
- కె.మహంకాళిరావు, 1857 తెలుగునాట తిరుగుబాటు
- దిగవల్లి వెంకట శివరావు, 1857 పూర్వ రంగములు.
Hindus and Mohammadans of India! Arise! Brethren, arise! Of all the gifts of God, the most gracious is that of Swaraj. Will the oppressive Demon who has robbed us of it by deceit be able to keep it away from us forever?.. The English have committed so many atrocities that the cup of their sins is already full. To add to it, they have got now the wicked desire to destroy our holy religion! Are you going to remain idle even now?..
“భారతదేశంలోని హిందువులారా! మహమ్మదీయులారా! లేవండి. సోదరులారా, లేవండి. దేవుడిచ్చిన వరాలన్నిటిలోకీ అపురూపమైనది స్వరాజ్యం. మోసం చేసి దాన్ని మన నుంచి కాజేసి మనల్ని పీడిస్తున్న రాక్షసి దానిని మనకు శాశ్వతంగా దూరం చేయగలదా?.. ఇంగ్లీషు వాళ్లు ఎన్ని అఘాయిత్యాలకు పాల్పడ్డారంటే వారి పాపాల పాత్ర ఇప్పటికే నిండిపోయింది. దానికితోడు మన పవిత్ర మతాన్ని నాశనం చేయాలన్న దుర్మార్గపు ఆలోచన వారికి వచ్చింది. ఇప్పుడు కూడా మీరు వట్టిగా ఊరుకుంటారా? మీరు అలా ఉండాలని భగవంతుడు కోరడు. ఇంగ్లీషు వాళ్లను దేశంనుంచి తరిమివేయాలన్న కాంక్షను హిందువులు, మహమ్మదీయులు అందరి హృదయాల్లో ఆయన రగిలించాడు. దేవుడి దయవల్ల, మీ పరాక్రమం వల్ల వారిని త్వరలోనే పూర్తిగా ఓడించి ఈ మన హిందుస్తాన్‌లో వారి జాడ లేకుండా చేద్దాం. మన మధ్య చిన్నా పెద్దా విభేదాలను మరచిపోదాం. మతాన్ని రక్షించుకునే పవిత్ర యుద్ధంలో కత్తిదూసిన వారందరూ ధన్యులే.” మొగల్ పాదుషా బహదూర్‌షా పేర పోరాటపు తొలినాళ్లలో జారీ అయిన బహిరంగ ప్రకటన ఇది. బహదూర్‌షా ఒక కవి. విప్లవ సమయంలో అతడొక గజల్‌ను వ్రాశాడు. ఎవరో ఆయనతో అన్నారు:
డుంబుమాయ్ మే ఏ దమ్ నహీఁ ఖైర్ మాంగోజాన్‌కీ
హై జఫర్ థండీ హుయీఁ షంషేర్ హిందూస్తాన్ కీ
“క్షణక్షణము మీరు బలహీనపడుతున్నారు. మీ ప్రాణాలకై ఆంగ్లేయులను ప్రాధేయపడండి. ఓ పాదుషా, భారతీయుల ఖడ్గం శాశ్వతంగా విరిగిపోయింది” అని. దానికి బహదూర్‌షా ఇలా జవాబిచ్చాడట:
ఘాజియోం మే బూ రహేగీ జబ్‌తక్ ఈమాన్ కీ
తబ్ – తోలండన్ తక్ చలే తేగ్ హిందూస్థాన్ కీ
“మా వీరుల హృదయాలలో విధేయత మిగిలి ఉన్నంతకాలం హిందూస్థానపు ఖడ్గం తీక్షణంగానే ఉంటుంది. ఒకానొకరోజున అది లండన్ వరకు దూసుకుపోతుంది.”
(సశేషం)
