Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగు సాహిత్యంలో ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం – పరిశీలన-5

[డా. బి. మల్లయా చారి గారి ‘తెలుగు సాహిత్యంలో ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం – పరిశీలన’ అనే సిద్ధాంత గ్రంథాన్ని ధారావాహికగా అందిస్తున్నాము.]

2వ అధ్యాయం – 1857 మహాసంగ్రామ యుద్ధవీరులు

2.8. 1857 తిరుగుబాటు వలన గుణపాఠాలు:

మహత్తర 1857 తిరుగుబాటు అనేక విలువైన, ప్రాధాన్యత కలిగిన గుణపాఠాలను అందిస్తోంది. అందులో ముఖ్యమైన వాటిని క్లుప్తంగా పరిశీలిద్దాం.

భారతదేశం కర్మ భూమి అనీ, హింసాయుత విప్లవాలు రావనీ, అవి మన ప్రజల తాత్విక స్వభావానికి విరుద్ధమనీ చేసే వాదనలూ, సిద్ధాంతాలూ తప్పని 1857 ప్రజా తిరుగుబాటు మరోసారి నిర్ద్వంద్వంగా నిరూపించింది.

దేశంలో ఇతర దేశాలకు భిన్నంగా అనేక కులాలున్నాయనీ, అనేక మతలున్నాయనీ, విభిన్న భాషలు, ప్రాంతాల వలన ప్రజలలో చీలికలున్నాయి కనుక, ప్రజలు ఐక్యం కారనే వాదనలూ, సిద్ధాంతాలూ, తప్పని ఆచరణలో తిరుగులేకుండా రుజువు చేసింది. ఉమ్మడి శత్రువుకు వ్యతిరేకంగా కుల, మత, భాషా ప్రాంతీయ భేదాలు మరచి ఐక్యంగా పోరాటాలూ, ఉద్యమాలూ, హింసాయుత యుద్ధమూ చేయగరనీ, చేస్తారనీ ఆచరణ ద్వారా రుజువు చేసింది.

పోరాటాలూ, ఉద్యమాలూ, తిరుగుబాటు యుద్ధానికీ మతం అడ్డురాదనీ, పైగా మత భావాలు కూడా వీటికి ఉపయోగపడతాయనీ, ఆచరణ, అనుభవం నేర్పుతోంది. ప్రజల మధ్య మత విద్వేషాలు లేవు. తిరుగుబాటులో హిందువులు, ముస్లింలు భుజం భుజం కలిపి పోరాడారు. ముస్లిం అయినా బహదూర్‌ షాను ఢిల్లీకి సార్వభౌఃముడిగానూ, బిర్జిస్‌ ఖాధర్‌ను అయోధ్యకు నవాబుగానూ, హిందువులైన నానాసాహెబ్‌ను కాన్ఫూర్‌కు పీష్వాగానూ, లక్ష్మీభాయిని ఝాన్సీకి సంస్థానాధీశురాలిగానూ ప్రకటించుట ద్వారా హిందూ, ముస్లింల ఐక్యతను చాటి చెప్పింది. తిరుగుబాటు సమయంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి, మత ప్రాతిపదికగా ప్రజలను చీల్చుటకు బ్రిటీషు వారు ఎంత ప్రయత్నించినా మత విద్వేషాలకు గురికాకుండానూ, మత ఘర్షణలు లేకుండానూ, హిందూ, ముస్లింలు ఐక్యంగా తిరుగుబాటులో పాల్గొన్నారు.

సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జాతీయ విముక్తి యుద్ధంలో ఎంతో ధైర్యంగానూ, ఎంతో సాహసంతోనూ పోరాడి, ఎన్ని త్యాగాలు చేసినా, సరైన న్యాయకత్వం, పోరాడే శ్రేణుల మధ్య సమన్వయం, ఐక్యత, స్పష్టమైన లక్ష్యం, తగిన వ్యూహం లేకుండా విజయం సాధించుట సాధ్యం కాదనీ, విఫలమవుతుందనీ స్పష్టపరచింది.

సామ్రాజ్య వ్యతిరేక పోరాటంలో ప్రజలే నిర్ణయాత్మక శక్తి అనీ, అందులో రైతాంగం ప్రధాన శక్తి అనీ నిరూపించింది. తర్ఫీదు పొంది అత్యంత క్రమశిక్షణతో వ్యవహరించే సైన్యం కూడా ప్రజలలో భాగమేననీ, వారు కూడా ప్రజలతో తిరుగుబాటులో పాల్గొంటారనీ, వాళ్లు తమ స్వంత సమస్యలకే పరిమితం గాక, ప్రజల సమస్యలను కూడా పట్టించుకొని, వ్యవస్థ మార్పుకై ప్రజలతో భుజం భుజం కలిపి సాయుధ తిరుగుబాటు చేస్తారని కూడా రుజువు చేస్తోంది. తిరుగుబాటులో అన్ని తరగతుల ప్రజలు, ముఖ్యంగా రైతాంగం పాల్గొనుట ద్వారానే తిరుగుబాటుకు సార్వజనీన స్వభావం వచ్చింది.

శత్రువు ఎంతటి బలవంతుడైనా, ఎంత ఆర్థిక, ఆయుధ సంపత్తి ఉన్నా ప్రజలు యుద్ధం ప్రజా యుద్ధం ద్వారా ఓడించగలరనీ, ప్రజలలో ఐక్యత లేనప్పుడూ, ప్రజలలో గణనీయమైన భాగం శత్రువుకు మద్ధతు ఇస్తున్నప్పుడూ లేక తిరుగుబాటులో ప్రత్యక్షంగా పాల్గొనకుండా ప్రేక్షకులుగా ఉన్నప్పుడు కూడా విజయం సాధ్యంకాదని రుజువు చేస్తోంది.

బ్రిటీషు సామ్రాజ్యవాదం లాంటి బలమైన శత్రువును ఓడించుటకు గెరిల్లా యుద్ధ తంత్రం ద్వారా దీర్ఘ కాల పోరాటాన్ని కొనసాగించాలనీ, గ్రామీణ ప్రాంతం అందుకు ఎక్కువ అనుకూలమైనదనీ నిరూపించింది. శత్రువుకు బలమైన కేంద్రాలుగా మిలటరీ స్థావరాలు ఉన్నాయి. తిరుగుబాటు ప్రారంభం కాగానే విశాలమైన గ్రామీణ ప్రాంతంలో బ్రిటీషు పాలన కుప్పలా కూలిపోయింది.

దేశంలోని సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలకు ఈ తిరుగుబాటు స్ఫూర్తిగా పనిచేసింది. జాతీయోధ్యమానికీ, ముఖ్యంగా గదర్‌ పార్టీ తిరుగుబాటుకూ, భగత్‌సింగ్ నాయకత్వాన హిందూస్థాన్‌ రిపబ్లిక్‌ అసోసియేషన్‌ కార్యక్రమాలకూ, అజాద్‌ హింద్‌ఫౌజ్‌కూ, నావికా తిరుగుబాటుకు స్ఫూర్తిగానూ, మార్గదర్శకంగానూ పనిచేసింది.

దేశానికి నిజమైన స్వాతంత్య్రం, ప్రజలకు నిజమైన ప్రజాస్వామ్యం కొరకై సాగుతున్న నూతన ప్రజాస్వామిక విప్లవోధ్యమంలో భాగంగా సాగుతున్న విప్లవోధ్యమాలకు ఉత్తేజకరంగానూ, స్ఫూర్తిదాయకంగా పనిచేస్తూ ఉంది. దేశంలో సామ్రాజ్యవాద ఆధిపత్యం, పెత్తనం, దోపిడీలకు వ్యతిరేకంగా నిజమైన స్వాతంత్య్రం కొరకు సాగే పోరాటాలకు స్ఫూర్తిదాయకంగానూ, ఉత్తేజకరంగానూ, మార్గదర్శకంగానూ పనిచేస్తూనే ఉంటుంది.

బ్రిటీషు వలస విధానం నాడు దేశంలోని వ్యవసాయం, చేతి వృత్తులను నాశనం చేసింది. రెండింటి మధ్యగల సమతుల్యతను ధ్వంసం చేసింది. నేడు సామ్రాజ్యవాద ప్రపంచీకరణలో భాగంగా ప్రభుత్వాలు చేపట్టిన నూతన ఆర్థిక, పారిశ్రామిక సరళీకరణ విధానాలు, సాంప్రదాయ వృత్తులను నాశనం చేసి, వ్యవసాయాన్ని దెబ్బతీస్తున్నాయి. ప్రభుత్వరంగ పరిశ్రమలను ప్రైవేటీకరిస్తూ, కార్మికులను వీధుల్లోకి గెంటివేస్తున్నాయి. నిరుద్యోగం పెరుగుతోంది. అస్థిర మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోనికి నెడుతూ, రైతాంగాన్ని ఆత్మహత్యలకు నెడుతూంది. కొత్త స్వేచ్ఛాయుత పోటీలో ఆదివాసులు, దళితులు, ఇతర బలహీన వర్గాలు, ఉపాధి వనరులను కోల్పోతున్నారు. వీటికి వ్యతిరేకంగా వివిధ తరగతుల ప్రజలు సమరశీల పోరాటాలు చేస్తున్నారు. దేశంలో సామ్రాజ్యవాదం ముఖ్యంగా అమెరికన్‌ సామ్రాజ్యవాద ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిజమైన స్వాతంత్య్రం కొరకు మరో 1857 తరహా ప్రజా విప్లవయుద్ధం చేయాల్సిన పరిస్థితులు మన ముందున్నాయి.

ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలలో వలసవాద సామ్రాజ్య వ్యతిరేక పోరాటాలలో 1857 తిరుగుబాటు 19వ శతాబ్ధంలో ముందు వరుసలో ఉంది. అంతేగాక నేడు నయా వలస దోపిడీకి వ్యతిరేకంగా భారత ఉపఖండం వివిధ ప్రాంతాలలో జరుగుతున్న పోరాటాలకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. నాడు బ్రిటిషు సామ్రాజ్యవాదం దురాక్రమణ ద్వారా వలస విధానాలను చేపట్టి, ప్రపంచ వలసాధిపత్యాన్ని ఏర్పరచుకుంది. నేడు అమెరికన్‌ సామ్రాజ్యవాదం నయావలస విధానాల ద్వారా ప్రపంచ మార్కెట్టును, వనరులను కొల్లగొడుతోంది. ప్రపంచాధిపత్యాన్ని ఏర్పరచుకొని, కొనసాగించుటకు మిలటరీపై ఆధారపడుతోంది. జాతీయ ప్రతిఘటనలు, జాతీయ విముక్తి ఉద్యమ పోరాటాలను పాశవికంగా అణచివేస్తోంది. 1857 తిరుగుబాటు విఫలమైన తర్వాత బ్రిటీషు పాలక వర్గాలు అమలు జరిపిన అత్యంత క్రూరమైన అణచివేత విధానాలను ఇరాక్‌, ఆఫ్ఘనిస్థాన్‌లలో అమెరికన్‌ సామ్రాజ్యవాదం అమలుచేస్తోంది.

1857 ప్రజా తిరుగుబాటు భారతదేశ చరిత్రలో చిరస్మరణీయమైనది. దేశంలో సామ్రాజ్యవాద ఆధిపత్యం, పెత్తనం, దోపిడీ కొనసాగినంత కాలం సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలకు స్ఫూర్తిదాయకంగానూ, మార్గదర్శకంగానూ ఉంటూనే ఉంటుంది. బ్రిటీషు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, స్వాతంత్య్రంకై ప్రజలు అత్యంత ధైర్యంగానూ, సాహసంతోనూ పోరాడి తమ అమూల్యమైన ప్రాణాలు ధారపోశారు. 1857 ప్రజా తిరుగుబాటు జరిగి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వారిని స్మరిస్తూ, హృదయ పూర్వక నివాళులు అర్పిద్దాం. దేశంలో విదేశీ సామ్రాజ్యవాదుల పాలన అంతం కావాలనే వీరి మహత్తర ఆశయాన్ని పరిపూర్తి చేయడానికి సామ్రాజ్యవాదం, ముఖ్యంగా అమెరికన్‌ సామ్రాజ్యవాదం దోపిడీ అధిపత్యాల నుండి బైటపడి నిజమైన స్వాతంత్య్రసాధనకై కంకణబద్ధులై, దేశానికి నిజమైన స్వాతంత్య్ర సాధనకై కంకణబద్ధులై, దాని సాధనకై శాయశక్తుల కృషి చేయుట దేశ భక్తిగల ప్రతి భారతీయుని పవిత్ర కర్తవ్యం.

2.9. 1857 తిరుగుబాటు అనంతర క్రమంలో:

1857 మహాసమరం ఎప్పుడు పూర్తయింది? అని ప్రశ్నిస్తే 1947 ఆగస్ట్‌లో స్వరాజ్యం వచ్చినప్పుడు పూర్తయిందని సమాధానం వస్తుంది. 1857 తరువాత జరిగిన స్వతంత్ర పోరాటంలో అనేకమంది నేతలకు, విప్లవకారులకు ప్రేరణ ఈ మహా సంగ్రామమే. “అసలు ఆంగ్లేయులతో పోరాటం చేయాలనే ఆకాంక్షకు విత్తనం వేసింది 1857 మహా సమరమే” అని ఆర్‌సి మజుందార్‌ విశ్లేషణ. ‘ఆంగ్లేయులు ఒకవేళ 1857 చరిత్రను వక్రీకరించి ఉండకపోతే, తక్కువచేసి చూపకపోతే, ఆ జ్ఞాపకాలు ఆంగ్లేయులకు తరువాత చాలా ఎక్కువ నష్టాన్ని కలిగించి ఉండేవి’ అని ఆయన అభిప్రాయపడతాడు. పంజాబులో రామసింగ్‌ కూకా ఉద్యమం కాని, వాసుదేవ బలవంతఫడ్కే పోరాటానికి గాని ప్రేరణ కేంద్రం ఈ మహా సమరమే. సావర్కార్‌ వ్రాసిన ‘1857-ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం’ అనే పుస్తకం విప్లవ వీరులందరికి భగవద్గీతలాంటిది. ఆనాడు అనేకమంది విప్లవవీరులు అధిక ధరకు ఆ పుస్తకాన్ని కొని చదివేవారు. భారతీయుల హృదయాలలో పోరాటపటిమను, ధైర్యాన్ని నింపినది ఈ మహా సంగ్రామ గాథలే. మహా సంగ్రామం జరిగిన ప్రదేశాలలో ‘మహా సమరంలో మా పూర్వీకులు పోరాడారు’ అని సగర్వంగా చెప్పుకునేవారు. స్వతంత్ర వచ్చిన తరువాత కూడా ఉండేవారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ద్వార ఆజాద్‌ హిందుఫౌజ్‌ నిర్మాణానికి ప్రేరణ నిచ్చింది ఈ సమరమే. తన సైన్యంలోని ప్రతి సిపాయి సావర్కార్‌ వ్రాసిన ఈ గ్రంథం చదవమని నేతాజీ చెప్పేవారు. ఆజాద్‌ హిందు ఫౌజ్‌లో మహిళా దళానికి ‘లక్ష్మీబాయి’ పేరు పెట్టారు నేతాజీ.

1942 ‘క్విట్‌ ఇండియా’ ఉద్యమంలో ప్రజలు అనుసరించిన పద్ధతులన్ని 1857 సమర పద్ధతులే. ప్రభుత్వ కార్యాలయాలు స్వాధీనం చేసుకొనుట. టెలిగ్రాప్‌, టెలిఫోన్‌, వైరులను తెంచి వేయటం, ఆంగ్లేయులను బందీలు చేయటం, స్వతంత్రం పొందామని ప్రకటించటం. ఇవన్నీ 1857 నాటి సమర విధానమే. స్వతంత్రం వచ్చిన తరువాత, గోవా విముక్తి పోరాటానికి, పాండిచ్ఛేరి విముక్తి పోరాటానికి ప్రేరణ నిచ్చింది 1857 సమరమే. 150 సంవత్సరాల తరువాత యిప్పటికి ఆ నేతలు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఝాన్సీరాణి పేరు తలచుకోగానే హృదయం ఉపొంగనిది ఎవరికి? ఆ నేతల తలపులే జాతిజనుల హృదయాలలో దేశభక్తిని రగిలించే చిరుదీపికలు.

హిందు ముస్లిం ఐక్యత:

1857 మహా సమరంలో స్పష్టంగా కనిపించిన అంశం హిందు ముస్లిం ఐక్యత. హిందువులు ముస్లింలు పరస్పరం గౌరవించుకుంటు కలిసి పనిచేశారు. ఒకరి సంప్రదాయాలను వేరొకరు గౌరవించారు. భావాత్మక ఐక్యత అది. గోహత్యను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బహదూర్‌షా, ఖాన్‌ బహదూర్‌ఖాన్‌, హజ్రత్‌ మహల్‌, మౌల్వీ అహ్మదుల్లాలు హిందువుల మనోభావాలు గౌరవించాలని ముస్లింకు హితవు చెప్పారు. అయోధ్యలో రామజన్మభూమిని హిందువులకు అప్పగించాలని ముస్లింలు తీర్మానం చేశారు. 1858 తరువాత ఆంగ్లేయులు అయోధ్యలో హిందు-ముస్లింల మధ్య సయోధ్య కుదిర్చిన ఇద్దరు నేతలను చెట్టుకు కట్టివేసి, కొరడాలతో కొట్టి చంపారు. ఆంగ్లేయుల వలన ఇద్దరికి తమ ధర్మం, సంప్రదాయాలు ప్రమాదంలో పడిపోయాయని అర్థమైంది. మౌల్వీలు, ఫకీర్లు, పండితులు అందరు ఇదే విషయం ప్రచారం చేశారు.

కాని 1858 తరువాత ఆంగ్లేయులు ఈ ఐక్యత వల్ల తమకు ప్రమాదం సంభవిస్తుందని తెలిసి వైషమ్యాలు రెచ్చగొట్టారు. ఒక మతం వారిని బుజ్జగించటం ప్రారంభించారు. 19వ శతాబ్దం మొదటి సగంలో కనపడని మత కలహాలు 19వ శతాబ్దం చివరి 25 సంవత్సరాలలో మొదలైనాయి. 20వ శతాబ్దం ప్రారంభం నుండి అవి విపరీతంగా పెరిగిపోయాయి. ఆంగ్లేయుల, మరియు స్వాతంత్య్రోద్యమాన్ని నడిపిన నేతల సంతుష్టీకరణ, బుజ్జగింపు విధానాల వలన భావాత్మక ఐక్యత దెబ్బతిని ఇద్దరిమధ్య వ్యాపార ధోరణి ప్రబలింది. ఇద్దరి మధ్య అగాధం పెరిగిపోయింది. ఫలితంగా దేశం విభజించబడింది. స్వతంత్య్రం వచ్చిన తరువాత ఇప్పటికీ ఆ బుజ్జగింపు ధోరణి కనపడుతోంది. అంతేకాదు! పెరిగిపోతుంది. రాజకీయనాయకులు స్వార్థం కోసం, మూకుమ్మడి ఓట్లకోసం కొద్ది మతస్తుల పెడసరి ధోరణిని బుజ్జగిస్తున్నారు కదా! దేశ సమగ్రతకు మరల భంగం వాటిల్లే ప్రమాదం కనపడుతోంది కదా!

1857 తిరుగుబాటు సందేశం:

1857 మహా సమరంలో ఎంతోమంది పోరాడారు. బలిదానాలు చేశారు. మరణించారు. ఆంగ్లేయులు కిరాతకాలకు బలైపోయారు. 2 లక్షల మంది సైనికులు, కోటి మంది ప్రజలు మరణించారు. ఇంతమంది ప్రజలు ఆంగ్లేయుల కిరాతకాలకు ఎందుకు బలైపోయారు? ఆ రోజున వారు తమ మతం మారి ఉంటే బ్రతుకగలిగే వారు కాదా? క్రైస్తవ మతం పుచ్చుకొన్న వారిని ఏ విధంగా ఆంగ్లేయులు పైకి ఎత్తేసేవారో మనం పరిశీలిద్దాం. “దొరగారు! మేమందరం మీ మతం పుచ్చు కుంటాం. మమ్మల్ని వదిలేయండి!” అని ఎవరైన సామాన్య ప్రజలు ఆంగ్లేయుల కాళ్ళమీద బడ్డారా! ఏ ప్రదేశంలోనైనా ఇలాంటి ఉదాహరణ కనిపించిందా? లేదే! పైగా తమ నేతలు ఓడిపోయిన తరువాత, తమ ప్రాంతాలు,రాజ్యాలు ఆంగ్లేయుల స్వాధీనమైన తరువాత, తమను, తమ ఆడవారిని ఎక్కడ ఆ పిశాచాలు మతభ్రష్టులని చేస్తాయో అని ముందుగానే, తమంత, తామే తమ ఆడవారిని చంపి, తమను తాము చంపుకున్నారు. ఢిల్లీలోను, లక్నోలోను ఇంకా చాలచోట్ల అదే జరిగింది. ఇంతమంది మరణించింది. మన ధర్మాన్ని సంస్కృతిని రక్షించుకోటానికే కదా! ఆ స్ఫూర్తి మరల ఇవాళ అవసరం ఉంది కదా! నాగరికత పేరుతోనో, ఫ్యాషన్‌ పేరుతోనో మన యువతను విచ్చలవిడితనానికి ప్రోత్సహించటం కనపడుతోంది కదా! ‘రక్షాబంధన్‌’ వంటి పవిత్ర సంబంధాల స్థానంలో ‘వాలంటైన్‌ డే’ లు, ఫ్రెండ్‌షిప్‌ బాండ్‌’లు ఎక్కడకు తీసుకెళ్ళుతున్నాయో ఆలోచించాల్సిన అవసరం ఉందేమో?

మత స్వేచ్ఛ పేరుతో కొన్ని మతాల దురాక్రమణ ప్రవృత్తి పెరుగుతున్నట్లుంది కదా! మరల ఈ దేశపు స్వధర్మము, స్వసంస్కృతిలు ప్రమాదంలో పడిపోతున్నట్లున్నది కదా! 1857 మహా సమరంలో హుతాత్యులైన మహానుభావులు, మన పూర్వీకుల నుండి మనకు అందుతున్న దివ్య సందేశం ఒకటే! మన ధర్మాన్ని సంస్కృతిని సంరక్షించుకొనుట. ప్రపంచంలో ఏ జాతి యొక్క సార్వభౌమత్వము, స్వతంత్రములకైన ‘శ్రీరామ రక్ష’, ఆ సమాజంలో ఆ జాతికోసం పరిశ్రమించే,ఉద్యమించే కష్టాలను, నష్టాలను సహిస్తూ జాతికోసం త్యాగాలు చేయగల ప్రజల యొక్క సంఘటిత శక్తి మాత్రము.

తీవ్రవాదుల పేరుతో మనదేశంలో విధ్వంసం జరుగుతోంది. పొరుగుదేశాలు మన భూభాగాలను కబళించి కూర్చున్నాయి. బహుళజాతి కంపెనీలు ఆర్థిక పెత్తనం చేస్తున్నాయి. రాజకీయ నాయకులు ఓట్ల రాజకీయ ఊబిలో కూరుకుపోతున్నారు. ఇవాళ దేశానికి కావాల్సింది మరల ఆనాటి స్ఫూర్తి. మరల సమాజం ఉద్యమించాలి. ప్రజలు సాంస్కృతిక విలువలకై నడుం కట్టాలి. వ్యక్తిగత ఇష్టాయిష్టాలను అధిగమించి స్వధర్మాన్ని, స్వసంస్కృతిని, స్వదేశాన్ని కాపాడుకొనేందుకై ఒకే స్వరంతో నినదించగలగాలి. అదే ఈ మహా సమరం మనకందించే సందేశం!

ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామము జరిగి 150 ఏళ్ళు పైబడింది. ప్రపంచంలోనే ఏక కాలంలో మీరట్‌ ఢిల్లీ, పంజాబ్‌, అలీఘర్‌, ఇటావా, అయోధ్య, రోహిల్‌ఖండ్‌, అవధ్‌ అజీమ్‌ ఘర్‌, వారణాశి, నాగపూర్‌, అలహాబాద్‌, కాన్పూర్‌, ఝాన్సీ, లక్నో, హైదరాబాదు, రాజమండ్రి, గుంటూరు, మచిలీపట్నం, మొదలైన ప్రదేశాల్లో జరిగిన మహా సంగ్రామం మరొకటి లేదు. ఇంగ్లీషువారి కుటిలనీతి వల్ల, దమన కాండవల్ల పోరాట యోధుల సమన్వయ లోపం వల్ల స్వాతంత్య్రాన్ని సాధించలేకపోయింది. కాని తర్వాత జాతీయ మహోద్యమానికి 1857 తిరుగుబాటు ప్రేరణనిచ్చింది. “ఏ కొద్ది అదృష్టమో సిపాయిల పక్షాన ఉండి ఉంటే పరిస్థితి తారుమారయ్యేది” అని ఆర్‌.సి. మంజుదార్‌ అన్నారు. నానాసాహెబ్‌ పీష్వా, ఝాన్సీ లక్ష్మీభాయి, కుంవర్‌సంగ్‌ మైల్వీ అహ్మదుల్లాషా, తాంత్యతోపే మొదలైన సంగ్రామ సారథులు ఈ మహా సంగ్రామంలో పాల్గొని అత్యద్భుతమైన పోరాట పటిమను చూపించారు. ఎందరో ఆహుతలయ్యారు. ఇటువంటి పోరాట యోధుల గురించి తెలుగు సాహిత్యంలో అనేక పద్య, పద్యేతర కావ్యాలు వచ్చాయి. వాటిని గురించి తెలుసుకొనే ముందు తెలుగు దేశంలో ప్రథమ భారత సంగ్రామం గురించి స్థూలంగా తెలుసుకుందాం.

(సశేషం)

Exit mobile version