Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగు సాహిత్యంలో ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం – పరిశీలన-6

[డా. బి. మల్లయా చారి గారి ‘తెలుగు సాహిత్యంలో ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం – పరిశీలన’ అనే సిద్ధాంత గ్రంథాన్ని ధారావాహికగా అందిస్తున్నాము.]

3వ అధ్యాయం – తెలుగునాట భారత ప్రథమ స్వతంత్య్ర సంగ్రామం వాటి ప్రతిధ్వనులు

దక్షిణాదిలో జరిగిన మహత్తరమైన పోరాటాన్ని జనానీకం దృష్టిలోకి తేవడం అవసరం. ఈ పోరాట గాధలు పాఠ్య పుస్తకాల్లో అంతర్భాగం కావాలి. కరకొండ సుబ్బారెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, సోనాజీపంత్, రంగారావు పాగే, జయగోపాల్ పిత్తీ, తుర్రేబాజ్‌ఖాన్ వంటి వీరులకు స్మారక చిహ్నాలు ఏర్పాటు చేయాలి. వారి పేరిట ప్రతి ఏటా ఆటల పోటీలు, వక్తృత్వ పోటీల వంటి కార్యక్రమాలు జరగాలి. ఇంకా అజ్ఞాతంగా పడివున్న వీరుల జీవిత చరిత్రలను, నాటి స్వాతంత్య్ర పోరాటాన్ని వెలుగులోకి తెచ్చేందుకు ప్రత్యేక ప్రయత్నాలు జరగాలి. 1857 నాటి విప్లవకారుల ఆదర్శాలను, వారి త్యాగనిరతిని, దేశభక్తిని తరువాతి తరాలకు అందించేందుకు చిత్తశుద్ధితో కృషి జరగాలి.

1857 నాటికి దక్షిణ భారతదేశం లావాలా కుతకుతలాడుతోంది. ఎక్కడ చూసినా ధిక్కారధోరణులు, తిరుగుబాటు స్వరాలు వినిపిస్తున్నాయి. జమీందార్లు, పాలెగాళ్లు, సాధుసన్యాసులు, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటాను ఎగురవేశారు. గిరిజన ప్రాంతాల్లోనూ విప్లవ బీజాలు మొలకెత్తాయి. రంప పితూరీ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తిరుగుబాటు, వీర పాండ్యకట్ట బొమ్మన రణ హుంకారం ఇవన్నీ ఆంగ్లేయులను గడగడలాడించిన స్వాతంత్య్ర పోరాటాలే!

ముస్లిం సమాజంలో అప్పటికే వాహబీ ఉద్యమం ప్రభావం ఉంది. 1838లో విలాయత్ అలీ, సలీం అనే ఇద్దరు వాహబీ ఉద్యమకారులు దక్షిణ భారతదేశంలో వాహబీ ఉద్యమానికి బీజాలు నాటేందుకు హైదరాబాద్ సంస్థానానికి వచ్చారు. కర్నూలు చివరి నవాబు గులాం రసూల్‌ఖాన్ వాహబీ ఉద్యమకారులతో చేతులు కలిపి పోరాటం చేశాడు. చివరికి ఆయన బ్రిటిషర్ల చేతిలో బందీ అయ్యాడు. బ్రిటిషర్లు కర్నూల్ సంస్థానాన్ని మద్రాస్ ప్రెసెడెన్సీలో విలీనం చేశారు. ఇటు హైదరాబాద్‌లో నవాబ్ ముబారిజుద్దౌలా వాహబీ ఉద్యమకారులకు ఆశ్రయం ఇచ్చాడు. ముబారిజ్ నిజామ్ నాసిరుద్దౌలాకి చిన్న తమ్ముడు. కాబట్టి రాచకుటుంబీకుల్లో, జన సామాన్యంలో ఆయన ప్రభావం చాలా ఉండేది. పర్యవసానంగా వాహబీ ఉద్యమం హైదరాబాద్‌లో వేళ్ళూనుకుంది.

దీన్ని గుర్తించిన బ్రిటిషర్లు నిజాంపై ఒత్తిడి తెచ్చి ముబారిజ్‌పై విచారణ జరిపించారు. ఇందుకు ఒక ప్రత్యేక ట్రిబ్యునల్‌ను కూడా ఏర్పాటు చేశారు. మేజర్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఈ ట్రిబ్యునల్ జడ్జిగా వ్యవహరించాడు. 1839 జూన్ 28న ట్రిబ్యునల్ ముబారిజ్ నిజాంకు, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నాడని, బ్రిటిష్ సైనికులను తిరుగుబాటుకై ప్రోత్సహించాడని నిర్థారించారు. 1840లో ఆయన్ని గోల్కొండ కోటలో బంధించాడు. ముబారిజుద్దౌలా 14 సంవత్సరాలు జైలులో గడిపాడు. 1854 జూన్ 25న ఆయన బందీగానే తుదిశ్వాస విడిచాడు. అందుకే 1857లో విప్లవం ప్రారంభం కాగానే హైదరాబాద్ తక్షణం ప్రతిస్పందించింది. 1857 మేలో ఉత్తరాదిన తిరుగుబాటు ప్రారంభం అయిన నెల రోజులలోనే, అంటే జూన్ 12న ఔరంగాబాద్‌లో ఉన్న హైదరాబాద్ ఫస్ట్ కావల్రీ, కంటింజెంట్ (అశ్విక దళం) తిరుగుబాటు చేసింది. ఆ మరుసటి నెల, అంటే జూలై 17న ప్రజలు బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేశారు. ఇవన్నీ ఎలాంటి ముందస్తు యోజన లేకుండా సహజంగా, తమంతట తాముగా ఉద్భవించిన తిరుగుబాట్లు.

“ఎవ్వరు స్వరాజ్యనిమిత్తమెన్ని రక్త
బిందువులు ప్రీతి వసుధకర్పింపగలుగు
వాడు భూలోకమున నన్ని వర్షశతము
లనురుడై యముండు కీర్తి కాయంబుతోడ”

ఎవ్వరు జాతీయ సంగ్రంమలో ఎన్ని రక్తబిందువులు చిందిస్తారో అన్ని సంవత్సరాలు వారి కీర్తి భూలోకంలో నిలుస్తుందని పై పద్యం భావం. 1857 భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో అసువులు వీడిన అమరవీరుల ఘనతను భారతీయులు నిరంతరం పాడుతూ వుంటారు. ఆ అమరవీరుల కీర్తి కలకాలం నిలిచిపోతుందని ప్రజల్లో ఉత్సాహం రేకెత్తింపచేసేలా అనేక మంది కవులు రచయితలు అనేక రచనలు చేశారు. ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామంపై ప్రస్తుతం లభిస్తున్న కావ్యాలు నాలుగు. ఈ నాలుగు కావ్యాలలోని ఇతివృత్తాన్ని చారిత్రక వాస్తవిక కథతో పోలుస్తూ ఈ అధ్యాయంలో పరిశీలించడం జరుగుతుంది.

ఐరోపా వారు (పోర్చుగీసు, డచ్, ఇంగ్లీషు, ఫ్రెంచ్) వర్తకం కోసం భారతదేశానికి వచ్చారు. అయితే బ్రిటిషువారు మిగతా ఐరోపా వారందరినీ తొలగించి భారతదేశంలో తమ ఆధిపత్యాన్ని నిలుపుకొన్నారు. 1857 సిపాయిల తిరుగుబాటులో బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా దేశంలోని అనేక ప్రాంతాలలో అల్లర్లు చెలరేగాయి. బ్రిటిష్‌వారు భారతీయులపై కాల్పులు, దౌర్జన్యాలు ప్రజలను రెచ్చగొట్టాయి. బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా భారతీయులు సాగిస్తున్న జాతీయ సంగ్రామం తెలుగు ప్రజలు కూడా సమర్థించారు. దక్షిణాదిలోని అనేక పట్టణాలు, గ్రామాలు ప్రతీకారేచ్ఛను ప్రదర్శించింది. స్వాతంత్య్ర పతకాన్ని ఎగరేసింది. సమర శంఖాన్ని పూరించింది. 1857 స్వాతంత్య్ర సమరయోధులు నానాసాహెబ్‌పేష్వా, తాత్యాతోపేలను తమ నేతలుగా తెలుగు ప్రజలు భావించేవారు. ఈ నేపథ్యంలో 1857 కాలంలో తెలుగునాట ఏం జరిగిందో అధ్యయనం జరపవలసిన అవసరం ఎంతైనా వుంది.

3. 1. స్వాతంత్య్ర వీర ఉయ్యాలవాడ నరసింహారెడ్డి:

కారణంలేని కార్యం ఉండదు. బలమైన ప్రేరణ ఏదో లేకుండా పెను విప్లవం సంభవించదు. సాధారణంగా ఏ కాలంలోనైనా ఎవరైనా కష్టాలకోర్చుకుని, అన్యాయాలను భరించి, తమ బతుకులు తాము ప్రశాంతంగా వెళ్లదియ్యాలనే కోరుకుంటారు. ఇంకేమాత్రమూ సహించి ఊరుకోజాలని గడ్డు సవాళ్లు ఎదురైతేగానీ, తాము ప్రాణం కంటే మిన్నగా తలిచే విశ్వాసాలకూ, విలువకూ, సెంటిమెంట్లకూ తీవ్ర విఘాతం కలిగి, దుర్మార్గానికి తలొగ్గటం కంటే ప్రాణత్యాగం మేలన్న తెగింపు వస్తేగానీ జనం సంఘర్షనకు దిగరు.

భారతదేశాన్ని ఆక్రమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఉప్పెనలా ముంచెత్తిన ప్రజా వెల్లువకు బలమైన కారణం.. మహత్తర ఆదర్శం, పరమాశయం ఏదీ లేకుండా దానికది గాలిలోంచి పుట్టలేదు. ఉదాహరణకు ఎక్కడో అవధ్‌లో ఒక నవాబు రాజ్యాన్ని లాగేసుకున్నారనో ఒక నానాసాహెబ్‌కు భరణం ఎగ్గొట్టారనో, సిపాయిల చేత ఆవుకొవ్వు, పందికొవ్వు తూటాలు కొరికించారనో విశాల దేశంలో అసంఖ్యాక జనం ప్రాణాలకు తెగించి పోరుకు దిగరు. తాము అనాదిగా అన్నిటికంటే మిన్న ప్రాణం కంటే ఎక్కువగా తలచే ధర్మానికి, దైవ సంబంధ మత విశ్వాసాలక వాటిల్లింది కనుకే స్వధర్మాన్ని రక్షించుకోవడానికి, దాన్ని కాపాడగల స్వరాజ్యాన్ని సాధించడానికి వివిధ మతాల, వివిధ వర్గాల దేశవాసులు బలిష్టమైన బ్రిటిష్ సామ్రాజ్యంతో నిర్భయంగా పోరాడారు. వీరిలో తెలుగునాట తిరుగుబాటు చేసిన ప్రప్రథమ స్వాతంత్య్రవీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. చరిత్రాత్మక సంఘర్షణలో పళ్ళ బిగువున కడదాకా పోరాడి నేలకొరిగిన అమరవీరుల్లో రాయలసీమ మహావీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846లో నరసింహారెడ్డి ప్రారంభించిన విప్లవం తెల్లవారి గుండెల్లో దడ పుట్టించింది. అతని పోరాట పటిమను తెలుసుకుందాం.

“శ్రీలు విలసిల్లు రాయల సీమయందు
రెడ్డి కులజులు మహిత నిర్ణిద్రమతులు
బాహుశక్తి ప్రజారక్తి పరిఢవిల్లి
ఏలుచుండిరి పూర్వంబు పాళెములను”

“వీరి కులములోని పెంపొందు పెక్కు శాఖ
లందు, మోటాటి శాఖ యందవతరించి
నట్టి వీరాధివీరుడుయ్యాలవాడ
నగర నిలయుండు మన కథానాయకుండు.”

ఉత్తరాన గంజాం నుంచి, దక్షిణాన నెల్లూరు దాకా కోస్తా జిల్లాల్లోనూ, రాయలసీమ, తెలంగాణాల్లోనూ విదేశీ దురాక్రమణల పట్ల తొలి నుంచీ తీవ్ర వ్యతిరేకత ఉంది. రాజులు జమీందార్లు, పాలెగాళ్లతో పాటు సవర, ఖోండ్ వంటి గిరిజన తెగలు సైతం తెల్లవారిపై రాజీలేని పోరు సలిపాయి. బ్రిటీష్ వారి దాష్టీకానికి తలవంచక తెలుగునాట నాలుగు చెరగులా రాజులు, జమీందార్లు, పాలెగాళ్ళు, గిరిజనులు ఎన్నో యుద్దాలు చేశారు. వీటిలో రాయలసీమ ప్రాంతంలోని ‘నొసము’ సంస్థానాన్ని జయరామిరెడ్డి పాళిగాడు పరిపాలిస్తున్నాడు. అయితే పాలెగాళ్ళ గురించి స్థూలంగా తెలుసుకోవాల్సిన అవసరం ఈ సందర్భంగా ఎంతైనా వుంది.

తళ్ళికోట యుద్ధంలో విజయనగర రాజులు ఓడిపోయారు. వారికి సామంతులుగా ఉన్న పాలెగాళ్ళు స్వతంత్రులయ్యారు. ఎవరికి వారే రాజులుగా చలామణి అయ్యారు. 1799వ సంవత్సరములో టిప్పు సుల్తాన్ ఆంగ్లేయుల చేతుల్లో ఓడిపోయాడు. రాయలసీమ నైజాం నవాబు చేతుల్లో ఉండేది. బ్రిటిష్ వారి సైన్య సహకార పద్ధతిలో రాయలసీమ జిల్లాలను నిజాం తెల్లవారికి అప్పగించాడు. ఈ దెబ్బతో పాలెగాండ్రందరు బ్రిటిషు వారి పాలనలోకి వెళ్ళిపోయారు. కడప – కర్నూలు జిల్లాల్లో ఆరోజుల్లో వందమంది వరకు పాలెగాండ్రుండేవారు. ఆనాటి బ్రిటిష్ కలెక్టర్ సర్‌ థామస్‌ మన్రో పాలెగాళ్ళ హక్కులన్నీ రద్దు చేసాడు. వారికి నెలసరి పింఛన్ ఏర్పాటు చేశాడు.

“అమితోద్దండ దురంత పీడనకులోనై, భారతీయ ప్రజా
సముదాయం బొనరించినట్టి, ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామరం
గము కన్నం బదియేండ్లకున్ మునుపె యాంగ్ల ప్రాజ్య సామ్రాజ్యసై
న్యముపై కత్తిని దూసినట్టి నరసింహారెడ్డి సామాన్యుడే?”

“అరువది యాఱు గ్రామముల కాతడు నాయకుడై ప్రజాహితం
బరయుచు, పేద సాదలకు నాదరు విచ్చుచు, రాజధర్మసు
స్థిరుడయి రాజ్యపాలనము సేయుచు, హాయిగ నుండె, నింతలో
కఱకు బ్రిటిషు వణిక్కులకు కన్నుపడెన్ తదధీనమౌధరన్.”

ఉయ్యాలవాడ నసింహారెడ్డి భారత స్వాతంత్య్ర సంగ్రామ వీరుల్లో ప్రప్రథముడు 1857 నాటి ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం కన్నా 11 సంవత్సరాలు ముందుగానే బ్రిటిష్ ప్రభుత్వంపై రేనాటి సీమలో స్వాతంత్య్ర ధ్వజమెత్తిన మహీవీరుడు శ్రీ రెడ్డి కేవలం రేనాటి సీమకో రాయలసీమకో పరిమితమైన వీరుడు కాదు. ఆయన భారత స్వాతంత్య్ర సమరవీరుడు.

వీరి సంస్థానం క్రింద అరవై ఆరు గ్రామాలు ఉన్నాయి. ఇతడు పేద సాదలకు దానధర్మాలు చేస్తూ అన్ని గ్రామల ప్రజల దాన విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటూ ఉత్తమ పరిపాలకునిగా పేరు ప్రఖ్యాతలార్జించాడు. అదే సమయంలో బ్రిటిష్ వారి దృష్టి నొసము సంస్థానంపై పడింది.

పరిసర ప్రాంతాల్లో, ఈ దేశంలోని ఎందరో సంస్థానాదాధిపతులు రాజులు బ్రిటిష్‌వారిని ఎదిరించి తమ సంస్థానాల్లో రక్తం పారేట్టు చేయడం కంటే సంధే ముఖ్యమని భావించి ఏవేవో ఒడంబడికలు చేసుకొని తమ రాజరికం కాపాడుకొంటున్నారు. అయితే నరసింహారెడ్డి వ్యక్తిత్వం అటువంటిదికాదు.

“కలికితురాయి గీల్కొలుపు పట్టు రుమాలు
కట్టిన యుత్తమాంగంబు తోడ
వైష్ణవ భక్తి భావము చాటు నూర్థ్వపుం
డ్రమునీటు గొలుపు ఫాలంబుతోడ”

“క్రేతల కెంజాయరేక లింపారు, నా
తత దీర్ఘధవళ నేత్రముల తోడ
చిరు నిమ్మకాయల నిరువైపు నిల్పుకో
జాలిన గుబురు మీసముల తోడ”

“వైరిహంవీర విదళన ప్రళయకాల
దండ నిభ ఖడ్గ కలిత హస్తంబు తోడ
ప్రజకు భయభక్తి సంభ్రమ భావములను
గొలుపు వర్చస్సు తోడ నబ్బలియుడలరు.”

సాము గారిడీల్లో ఆరితేరిన నరసింహారెడ్డి పుక్కిటబట్టి ఊదిన గులకరాళ్ళు తగిలి చెట్టుమీది పిట్టలు క్రిందపడేవి. నెత్తిన కాషాయ వర్ణసుశోభితమైన పట్టురుమాలు, ఫాలభాగం మీద దీటైన వైష్ణవ నామం, సుదీర్ఘ ధవళనేత్రాలు, నిమ్మకాయలు నిలిచే గుబురు మీసాలు, చేత శత్రుమస్తక విచ్చేదనార్థమై సర్వథా సంసిద్ధమై ఉన్నట్లు కనిపించే ఖడ్గం. ముఖంపై అపూర్వకాంతి ఇదీ.. ఆయన రూపం. కొట్టవచ్చే నిండైన విగ్రహం. ఆయనలోని దీక్ష పనివేగం చూసేవారికి ఆయనొక మహోదాత్తవీరునిగా కనిపించేవాడు. ఆయనతో సాన్నిహిత్యంగా మెలగిన వారికి పరమశాంత మూర్తిగా కనిపించేవారు. శత్రువుకు శివుడు; తనను ఆశ్రయించినవారికి కల్పవృక్షం.

తనను దర్శించడానికి వచ్చిన పండితులతో కవులతో కవితాగోష్టి నిర్వహించే సాహితీప్రియుడు నరసింహారెడ్డి. కృష్ణపాడు నివాసి అయిన వెంకట సుబ్బయ్య పంతులు రెడ్డితో కళాతత్త్వ విషయాలు మాట్లాడేవారు. ఓబుళాచార్యులు సంస్కృతాంధ్రాలు నేర్పిన సాహిత్యగురువు. గుఱ్ఱమెక్కి, ఖడ్గం చేత బట్టి ప్రజల కాత్మ బంధువుగా మంచిచెడ్డల నరసికొంటూ అందరినీ పలకరించి తోడ్పడే ఆర్తత్రాయణుడన్న పేరు ఆయనకున్నది. ఆంగ్లేయుల దౌష్ట్యాలకు ఆగ్రహం చెందుతున్నా కాలం కొరకు ఎదురుచూస్తున్నాడు.

నరసింహారెడ్డి కోట తలుపులు తీయించి సైన్యంతో ముందుకు దూకాడు. మహా వేగంతో పరుగెత్తే గుఱ్ఱమెక్కి ఇంగ్లీషువారి సేనపై పడ్డాడు. ఎందరినో సంహరించి మధ్యందిన సూర్యుడిలా వెలిగిపోయాడు. ఆయనకు సహాయంగా బోయదండు నిలిచింది. యుద్ధరంగం పీనుగుపెంటగా మారింది. రెడ్డి శత్రువుల పాలిటి కాలరుద్రుడయ్యాడు. వీరభద్రుని అవతారంగా వెలిగిపోయాడు.

బ్రతికి ఉంటే బలుసాకు తినవచ్చుననుకొన్నాడు వాట్సన్. సైనికులకు ఎవరికీ ఏ మాత్రం చెప్పకుండా బళ్ళారి దిక్కుగా పారిపోయాడు. వాట్సన్ వెళ్లిపోవడంతో బ్రిటీషు సైన్యం చెల్లాచెదరైపోయింది. ఎందరో రెడ్డి కరవాలానికి బలి అయిపోయారు. బోయదండు బ్రిటీష్ సైన్యాన్ని చీల్చి చెండాడింది. నరసింహారెడ్డి విజయోత్సవంతో నొసము కోటలో ప్రవేశించాడు. కాని, మైదాన ప్రాంతంగా ఉన్న నొసముకోట శత్రువు తొందరగా రావడానికి అనుకూలంగా ఉందని, అందువల్ల అక్కడి నుండి తన నివాసం మార్చి శత్రుదుర్భేద్య స్థలంలో తానుండి విజయాలు సాధించాలని నిర్ణయించాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.

భారతీయ సైనికులు క్షమాభిక్ష:

కోవెలకుంట్ల ఆ రోజుల్లో కడప మండలంలో ఉన్నది. వెంటనే కడపలోని పై అధికారులకు ఈ వార్త అందింది. ఆంగ్లేయాధికారులు సమావేశమయ్యారు. వెంటనే నరసింహారెడ్డిని అణచివేయాలని నిశ్చయించారు. తాత్సారం చేస్తే మరో పదిచోట్ల ఇటువంటి ఉద్యమాలే పుట్టుకొని వస్తాయని, హిందూ దేశంలో ఒక్క ఆంగ్లేయుడు కూడా బ్రతికి బట్టకట్టడని బెంబేలు పడిపోయారు. ఆ మండలానికి అధికారి కాక్రేన్. తన చేతిక్రింది సైన్యాధికారిని పిలిపించాడు. హైకమాండుకు తెలియజేశాడు. పైనుండి పర్మిషన్ తనకనుకూలంగానే వస్తుందని తెలుసు. వందలాది మంది రక్షక భటులను, సైనికులను సమకూర్చుకొమ్మన్నాడు. వారిని తీసుకొని ఉయ్యాలవాడలో గాని, నొసంకోటలోగాని ఎక్కడ ఉన్నా నరసింహారెడ్డిని బంధించాలని ఆజ్ఞ జారీ చేశాడు.

ఓ అధికారి నేతృత్వంలో అందరు భారతీయ భటులే బయలుదేరి వెళ్లారు. ఉయ్యాలవాడ సమీపంలో విడిదిచేశారు. రెడ్డి ఆ గ్రామంలోనే ఉన్నట్టు సమాచారమున్నది. కాని ఉయ్యాలవాడలోకి అడుగు పెట్టడానికి ఎవరికీ ధైర్యం చాలడం లేదు. గ్రామంలోని ప్రజలు కూడా ఊరు వదలి వెలుపలికి రావడం లేదు. నరసింహారెడ్డికి సంగతి తెలిసింది. వారి భయం అర్థమయింది. తన వారిని (ఉద్యోగార్థం ఆంగ్లేయుల సైన్యంలో ఉన్నవారిని) తానే చంపడం సమంజసం కాదనిపించింది. వారికి నచ్చజెప్పి పంపించడం గానీ, లేదా వారు ఒప్పుకొంటే తన సైన్యంలో వారిని చేర్చుకోవడం గాని చేయాలని నరసింహారెడ్డి నిశ్చయించి రెండు రోజుల తర్వాత తెల్లవారుజామున హఠాత్తుగా దాడి చేశాడు.

వారు తమ గుఱ్ఱాలను, ఆయుధాలను వదలిపెట్టి పారిపోతున్నారు. నరసింహారెడ్డి దండులోని బోయలు వారిని తరిమి తరిమి పట్టుకొన్నారు. ఊరి నడుమ కచేరికి అందరినీ చేర్చారు. నరసింహారెడ్డిని చూస్తూనే బ్రిటీషువారి జీతగాళ్ళయిన భారతీయ భటులు వణికిపోయారు. “వాడెవడో చెప్పినంత మాత్రాన మీరిలా బయలుదేరి రావడం మీ ఉద్యోగ ధర్మమే కావచ్చు గాక. మన వ్రేలుతో మన కన్నునే పొడిచే రాజనీతి ఈ కుటిల కిరస్తానీ దేశీయులు అవలంభిస్తున్నారు. కన్ను మనదే; వ్రేలు మనదే.నష్టపోయేది మనమే. వాడి సొమ్ము ఎక్కడా పోదు. మీరు ఈ ఉద్యోగాలు వదలిపెట్టి మీమీ వృత్తులు చేసుకొంటూ బ్రతకండి. ఇది మొదటి అపరాధంగా భావించి మిమ్మల్ని వదలిపెడుతున్నాం” అన్నారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. సైనికులందరు గుఱ్ఱాలను ఆయుధాలను వదలి, కడపవైపుగా బయలుదేరి వెళ్లిపోయారు. రెడ్డి ఉయ్యాలవాడ నుండి నొసం కోటవైపుగా సాగిపోయాడు.

3.1.1. నరసింహారెడ్డి యుద్ధ వ్యూహం:

హిందూదేశం మొత్తం ఆక్రమించుకొని, కొన్ని సంస్థానాలకు పరిమిత స్వాతంత్య్రమిచ్చి, ఎన్నిటినో తమలో కలుపుకొని పాలిస్తున్నారు బ్రిటిషువారు. వాడు హిందూ దేశానికి శత్రువు. వాడిప్పుడు ప్రభుత్వం నెఱపుతున్నాడు. చిన్న ప్రయత్నమైనా సరే తన సంస్థానం తానే ఏలాలి. తన ప్రజల పరిపాలన తానే చూచుకోవాలి.

ఇలా ఆలోచించి ఉయ్యాలవాడ సురక్షిత స్థలం కాదని పైగా ఇక్కడి ఉప్పునీళ్ళతో ఇబ్బందులు వస్తాయని, ఈ పోరాటంలో నొసం కోటనే కేంద్రంగా చేసుకోవాలని సైన్యంతో అక్కడికి వెళ్ళిపోయాడు నరసింహారెడ్డి. ఈ యుద్ధం ఇంతటితో ఆగేదికాదు. ఏ సంధి ఒడంబడికలకు తావులేదు. బ్రిటీషువాడు తన ఆధిపత్యాన్ని ప్రశ్నించని విధంగా తానే పరిపాలించుకోవాలి. ఆ తర్వాత రేనాడు అనబడే ఈ నడిగడ్డ వైపుగానే వాడు కన్నెత్తకుండా చేయాలి.

నొసము కోటను పటిష్టం చేశాడు. ఆహార పదార్థాలు నిల్వ ఉండే ఏర్పాట్లు చేయించాడు. ప్రజలందరు వ్యవసాయాది వృత్తి పనులను వదలిపోకుండా ధాన్యాదుల ఉత్పత్తి పెరిగేట్టు పనిచేయాలన్నాడు. బ్రిటీషువారిచ్చే భరణంతో కోటవరకే పరిమితమైన జీవనం గడుపుతున్నా ఎక్కడ పంచాయితీలైనా, ఎవరు బాధల్లో ఉన్నా అక్కడ ప్రత్యక్షమై సమస్యలు పరిష్కరిస్తూ పరమ ప్రశాంతంగా కాలం గడిపే నొసం వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాంతం పోరాడడానికే నిర్ణయం తీసుకొన్నాడు. అందుకే ఆకుమళ్ల గ్రామంలో ఉన్న పరమభక్తుడు అంజనం వేసి ఎక్కడేది జరుగుతుందో తెలుసుకొనే శక్తి ఉన్న అంజనసిద్ధుడు గోసాయి వెంకన్నను తన దగ్గరికి పిలిపించుకొని గూఢచార వ్యవస్థకు అతణ్ణి అధిపతిగా నియమించి, బ్రిటీషువారి కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకొని తనకు తెలియజేసే ఏర్పాట్లు చేయించాడు.

ఆ తర్వాత ‘ఔకు’ నగరాన్ని పరిపాలించే నారాయణరాజు దగ్గరికి వెళ్లాడు. రాజు అళియ రామరాయల వంశీయుడు. బుద్ధిశాలి, నీతి విశారదుడు; ప్రజల్లో మంచి పేరున్నవాడు. అతనితో నరసింహారెడ్డి ఇలా అన్నాడు. “వర్తకం పేరిట వచ్చిన ఈ హూణదేశీయులు దేశాన్ని కొల్లగొట్టారు. హిందూ రాజుల మధ్యన కలహాలు సృష్టించారు. మొత్తం దేశానికే ప్రభువులై పోయారు. వ్యాపారం నెపంతో దేశ దేశాలను ఆక్రమించే రాజనీతి ఇది. వారి పాలన ఎన్నేళ్ళు సాగాలి. మనం ఊరకుంటే మరో వెయ్యేళ్లకు కూడా మనకు స్వాతంత్య్రం రాదు. ఈ దేశాన్ని దరిద్ర దేవత వదలి పెట్టిపోదు.

నీవు ఔకు పరిపాలకుడవు. వీర అళియ వంశంలో పుట్టిన వాడవు. నాతో చేయి గలుపు. ఆ విదేశీ వ్యాపార ప్రభువులను దేశం నుండి పంపించివేద్దాం” అన్నాడు నరసింహారెడ్డి. అప్పుడు నారాయణ రాజు కొంతసేపు ఆలోచించి ఇలా అన్నాడు.

“మీరన్నది సత్యమే. ఆ బ్రిటీషువారి అపారసైన్యం ముందు మనం ఒకరిద్దరం నిలవలేము. మనతోనే మన స్వాతంత్య్రోద్యమం అంతమైపోతుంది. మనం ఇప్పుడు యుక్తినుపయోగించి స్థిరంగా నిలచి ఉండేట్టు చూచుకోవాలి. ప్రజల్లో ఉద్యమాన్ని నిర్మించాలి. మిగతా రాజులందరినీ కలుపుకోవాలి. మన ప్రయత్నాలు మనం చేయాలి. కాని ఇప్పుడు యుద్ధానికి పూనుకొంటే మనమిరువురం అంతమవుతాం. వాడు మరీ బలోపేతుడవుతాడు…ఆలోచించు” అన్నాడు నారాయణరాజు.9

“మీరు కలిసి రాకపోతే నేను ఒంటరిగానే పోరకతప్పదు” అన్నాడు రెడ్డి. “అయితే మీ ఇష్టం. మీ సాహసాన్ని కాదనను. నా తోచినంత సహాయం చేస్తాను. ప్రస్తుతానికి ఈ ధనం తీసుకోవలసిం”దని, మర్యాద చేసి, గుఱ్ఱాలమీద ధనం మూలం కట్టించి నొసం కోటకు సాగనంపాడు నారాయణరాజు. ఔకు రాజు విషయంలో అసంతృప్తి ఉన్నా తనకతడు ఏ విధంగానైనా సహాయపడే మిత్రుడే అని సంతోషిస్తూ కోటకు వెళ్ళిపోయాడు నరసింహారెడ్డి. అనేక గ్రామాల నుండి లెక్కలేనంతమంది సైన్యంలో చేరుతామని వచ్చారు. అందరినీ అక్కడక్కడ దళాలుగా పెట్టి శిక్షణ నిప్పించే ఏర్పాటు చేశాడు నరసింహారెడ్డి. తెల్లవాడు రెడ్డి పరాక్రమానికి భయపడిపోయాడని ప్రజలకర్థమై పోయింది. అప్పటికప్పుడే రెడ్డి కీర్తిని కథలుగా గాథలుగా గేయాలుగా చెప్పుకోవడం మొదలు పెట్టారు జానపదులు.

గేయం:
రాజారావు రాజబహాదురు నారసింహారెడ్డి
రెడ్డి కాదు బంగారపు కడ్డి నారసింహారెడ్డి
ములుకోలకట్టె చేతుల ఉంటే మున్నూటికి మొనగాడు
కరువు వచ్చినా కాటక మొచ్చినా ఆదరించే రెడ్డి
రెడ్డి కోసమూ ప్రాణం పోయిన స్వర్గం వస్తుంది.
ఈ పొద్దిదియా, రేపు తదియరా, నరుని ప్రాణమోయి
నీటిమీదను బుగ్గవంటిది నరుని శరీరంబు
పదరా-పదరా తెల్లవారిని తెగనరుకూదాము

ఊరూర ఇవే పాటలు; పాటలు పాడుతూ ఊరూరా తిరుగుతున్నారు యువకులు. ముక్కమళ్ల, ముంగోడు, కానాల,సంజమల తదితర ప్రాంతాలనుండి పిల్లలు,యువకులు, పెద్దలు ఎందరో సైన్యంలో చేరుతామని వస్తున్నారు. తన పరిధిలోని గ్రామాలే కాదు. నడిగడ్డలోని గ్రామాలన్నిటి నుండి వస్తున్నారు. అందులో పరీక్ష చేసి మెరికల్లాంటి వారినే ఏరి సైన్యంలో చేర్చుకొన్నాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆ విధంగా మొత్తం తొమ్మిదివేల సైన్యాన్ని రెడ్డి సమకూర్చుకొన్నాడని కొందరు, కాదు ఆరు వేలే అని కొందరు అంటున్నారు.

“అతడు ప్రారంభమొనరించినట్టి యుద్య
మమ్మె రవులుచు, నొక దశాబ్దమ్ము నకును
క్షితి సిపాయి పితూరిగా కింపదంతి
గన్న స్వాతంత్య్ర సమరంబుగా జ్వలించె.”

‘1857 తిరుగుబాటు’ కంటే పదేళ్లు ముందే తెల్లవాళ్ల దాష్టీకానికి తలవంచక స్వేచ్ఛాస్వాతంత్య్రాల కోసం నారసింహారెడ్డి నడిపిన మహాపోరాటం ఎంత విస్తృతమైనదో, దానికిగల ప్రజాబలమెంతో, ‘రేనాటి సూర్యచంద్రులు’ లో ఉటంకించిన ఈ కింది మద్రాసు ప్రెసిడెన్సీ రికార్డులను బట్టే అర్థం చేసుకోవచ్చు. “In 1846, a descendant of the dispossessed Poligars of Nassam, dissatisfied with the pension he received, attempted to excite a general rebellion, and collected on the frontiers two forces of several thousand men.” “Ooyalavanda.. in 1847, a disturbance was caused by Narasimha Reddy, pensioned Poligar.. At Giddalur he gave battle to Lieutenant Watson and killed the Tahsildar of Cumbum.. He was subsequently captured near Perusumala in Koilkoontla taluk and hanged. His head was kept hung in the fort on the gibbet till 1877.”

(1840లో నొస్సం పాలెగాళ్ల వంశీకుడొకడు తనకొచ్చే పెన్షనుకు అసంతృప్తి చెంది ప్రజా తిరుగుబాటును రెచ్చగొట్టాలని ప్రయత్నించాడు. పొలిమేరల్లో కొన్ని వేలమందిని పోగుచేశాడు.. ఉయ్యాలవాడ.. 1847 లో భరణం పొందే పాలెగాడు నారసింహారెడ్డి అల్లరి లేపాడు.. గిద్దలూరు వద్ద అతడు లెఫ్టినెంట్ వాట్సన్‌తో యుద్ధం చేసి కంబం తాసిల్దారును చంపాడు.. ఆ తరువాత అతణ్ణి కోయిలకుంట్ల తాలూకా పోరుసోమల వద్ద పట్టుకుని ఉరితీశారు. అతడి శిరస్సును 1877 వరకూ కోట ఉరికొయ్యకు వేలాడతీసి ఉంచాం.)

ఈ విషాద దృశ్యాన్ని చూస్తూ రెండువేల మంది కంటికి మంటికి ఏకధారగా ఏడిచారు. కాని ఒక్కరు కిమ్మనలేదు. వారి నోళ్లకు తాళాలు పడ్డాయి. బ్రిటీషు వారంటేనే ప్రపంచంలోని పరమ రాక్షసుల్లో ఒకరని అభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఆ మహావీరుని కోయిలకుంట్ల దగ్గరి బురుజుమీద తూకుమానుకు వ్రేలాడదీయవలసినదిగా కూడా తీర్పు ఇచ్చిన తీరు చరిత్రలో మరెక్కడా జరగకపోవచ్చు. బ్రిటీషు వారికి ఎదురు తిరిగిన భారతీయులందరి శిరస్సులు ఈ విధంగానే వ్రేలాడదీయబడతాయి అన్న బెదిరింపే ఇదంతా. ఆంగ్ల న్యాయమూర్తుల తీర్పుల్లో ఎంత కర్కశత్వం ఉందో చరిత్ర సాక్షిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉరితీత, శిరఃఖండనమే నిదర్శనం.

“అతని జీవాత్మ భౌతికమైన తనువు
వదలి యంతట వ్యాపించి, బహుమహోద్య
మమ్ములొనరించి, యొకశతాబ్దమ్మునకును
మాతృభూమికి స్వాతంత్య్రమహిమ గూర్చె.”

1845-47 మధ్యకాలంలో స్వాతంత్య్ర వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉరితీత శిరఃఖండనం అ రేనాటి (రాయలసీమ) కాదు కాదు భారతీయ ప్రథమ స్వాతంత్య్ర వీరుని బలిదానం ఊరకేపోలేదు మరో వంద సంవత్సరాలకు స్వాతంత్య్రం తెచ్చిపెట్టింది.

(సశేషం)

Exit mobile version