Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగు సాహిత్యంలో ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం – పరిశీలన-8

[డా. బి. మల్లయా చారి గారి ‘తెలుగు సాహిత్యంలో ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం – పరిశీలన’ అనే సిద్ధాంత గ్రంథాన్ని ధారావాహికగా అందిస్తున్నాము.]

3వ అధ్యాయం – తెలుగునాట భారత ప్రథమ స్వతంత్య్ర సంగ్రామం వాటి ప్రతిధ్వనులు

3.2. గుర్రాల గోపిరెడ్డి:

“గుర్రాల గోపిరెడ్డి పాట వింటుంటే
ఏలానది పొంగిన హోరు
తటాలను కమ్ముతూ తటాలున బాదుతోంది;
సెలవులలో నురుగలు క్రమ్ముతూ
కెరటాల గుండెల్లో మంటలు,
నది గట్లపై చెట్లుకురిసే పూవులు
కష్టాల కావిళ్ళు దింపుతున్న నింగి జ్ఞాపకాలు
కలలో కారిన కన్నీటి పొంగులు..
‘గుర్రాల గోపిరెడ్డీ
దాచేపల్లికి దహనమైతివా’
సంత చేసుకొంటున్న కల్పవల్లులను
నల్లగుండెల తెల్ల సిపాయీ, చెరబట్టి
బలాత్కరించిన దుష్టదగ్ధ హృదయులు
ఏటి అలల మూపులపై పండు కట్టెమోపులు
కష్టాల బండరాళ్ల దెబ్బలు కాస్తూ ఏలానది
శోక శైవలని, మాలిని, మానిని..
కలలను పాడడమంటే వేద వనన కాదు!
గుర్రాల గోపిరెడ్డి వీరమణి హారం!
సంత చేసుకొంటున్న తెలుగు అబలలను
ఒంటి పొగరు దింపుకునేందుకు
చెరబట్టిన తెల్ల సిబ్బంది
మెతుకులను మోసుకు పోయే
గండు చీమల బారు
కబురు తెలిసీ తెలియగానే
బురుజు పైకెక్కి చూశాడు
ఖడ్గం తీసి గుర్రమెక్కి
వడివడిగా సంతకు చేరగా
నేరం జరుగుతున్న స్థలం అది:
దుర న్యాయం పిగులుతుంది
ఎగరేసిన ఖడ్గంతో వరవర సరికాడు
వేటుకొక్క తలకాయ పడి దొర్లింది
క్రమ జీవితం తుపాకి గుండెకు అర్పించి
గోపిరెడ్డి అమరుడైతేనేం గాక
ఎందరు నిస్సహాయ
స్త్రీలను తెల్ల పురుగుల బారి నుండి రక్షించాడో?
అమరుడయిన ఆ మహావీరుడు
కాలావధులను అధిగమించాడు
నేలపై పడ్డ నెత్తురు ఆరకముందే
గోపిరెడ్డి అమరుడైతేనేం గాక
ఎందరు నిస్సహాయ
స్త్రీలను తెల్ల పురుగుల బారి నుండి రక్షించాడో?
అమరుడయిన ఆ మహావీరుడు
కాలావధులను అధిగమించాడు
నేలపై పడ్డ నెత్తురు ఆరకముందే
అతని చరిత్ర పాటలుగా
రచించుకున్నారు జనం
ఇలా ఆరంభమయి ‘ఓ గుర్రాల గోపిరెడ్డీ
దాచేపల్లికి దహన మయితివా!’
అనే పల్లవి వినేసరికి మ్రోడు బెడదలు
పల్లవించేవి; ఉత్తనేల వెన్నెలరేఖగా మెరిసింది!
వసంత ఋతువు రాకుండానే..!
అలా ఆ మహావీరుడు సజీవుడయి
ప్రవహిస్తూనే వున్నాడు
శోకంతో కంఠాలు శోషిల్లిన జనం
ఆగకుండా విసుగు, విరామం లేకుండా
ఆ వీరగాథ గానం చేస్తూనే వున్నారు
రెప్ప వాల్చని జాగరణలో కథలు
చెప్పుకుంటూనే వున్నారు.
దేశాభిమానం కాపాడుకున్నారు
యవ్వన పూర్ణ హృదయాన్ని
తృణప్రాయంగా త్యజించిన గోపిరెడ్డి
ఆ వీరుని జీవితం ముగిసినా
అమరగాథ ప్రవహిస్తూనే వుంది
నిరంతరాయంగా కాపాడుతూనే వుంది
పీడిత జన హృదయాలను
వారి మౌన ఘోషలను
అతని శౌర్యాన్ని దొంగచాటు తుపాకీ
నేల కూల్చింది. దుర్గార్గుల విజయం క్షణత్ప్రభ!
అంతే ! హతం చేయలేకపోయింది
గోపిరెడ్డి పుణ్య జీవితాన్ని..
దేశమాతకు హారతి పట్టిన
మహానీయ జీవన గీతాన్ని..
వనితల గౌరవాన్ని సంరక్షించిన
పుణ్యాత్ముడు జాతి కమలకు
రెప్పల వంటి వాడు, ధర్మానుగ్రహమే తప్ప
మనుష్యులపై కోపం ఎరుగడు
పరిపాలన సాగనీయక
అరాచకాన్ని అంతం చేయ సమకట్టిన వీరుడు
కనుకనే పాటై వెలిశాడు
సంయమించని జన దుఃఖాగ్నులు
సెగలై రెక్కలెత్తిన నిట్టూర్పులు
శోక నది తరంగాలై
ప్రవహిస్తునేవున్నాయి..
దెబ్బతిన్న గుండెలు చల్లబడలేదు
బలాత్కరింపబడిన అవమానితులు
స్త్రీలు బ్రతుక లేదు, మొగం చూపలేదు
ప్రజ్వలిత కాల కార్కశ్యం
యోధుడు గోపిరెడ్డిని తలుచుకొని
అతని పాట పాడుకుని జనం
నమస్కరించుకొని గాని నిద్రపోవడం లేదు
సముజ్వల కాంతిముఖుడు గోపిరెడ్డి
ఆ గుర్రాలు ఎటుపోయాయొ తెలియదు
ఆ దేహయష్టి సాందర్యాన్ని
దాచుకున్న పుడమి పసిడి విగ్రహమిచ్చిందో?
ఎన్నెన్ని కొత్తపూలు పూచిందో?
పరిమళించిందో? ఎన్నెన్ని హృదయాలలో
వీర రసం నింపిందో? కంపెనీ దొంగల్ని కూల్చిందో?
హృదయాలలో ఉత్తేజం జీవించింది.
ఆనాటి ఖడ్గాలే నేలగుండెల్లో
దాగిపోయాయో తెల్లవాళ్ళ నికృష్ణ బానిసత్వాన్ని
అంగీకరించలేదు; ఊడిగాలు ఊడగొట్టింది
మనజాతిలో ఆ దొరతనం
నాశనానికి శపథం పట్టింది
కాని ఇంకా మన జాతిలో
భావదాస్యం అంతరించలేదు
కామన్‌వెల్త్ – ప్రపంచబ్యాంకు – గ్లోబలైజేషన్
పేరులు ఏమైతేనేం – తుపాకీ, తుపాకీయే.
మన స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం
దాచేపల్లికి దహనం అయ్యాడు గోపిరెడ్డి!
జాతి చేతిలో కాలం కలమై నడిచింది
కలకండై నోరూరించింది,
నాలుకలనే ఆకులపై వీరగాథ రచించింది.
తెల్లవారికి సేవలందించిన ఎంగిలి మెతుకులు
మృష్టాన్నం అనుకున్న పిరికి జాతికి ఎన్నటికి ముక్తి లేదు
స్వేచ్ఛ స్వాతంత్య్రాలు కోల్పోయిన జాతి
బానిసాళ్ల బ్రతుకు కుక్కబ్రతుకు కన్న హీనం
ససేమీరా బ్రతుకలేమని
శపథం చేసింది జాతి, దీక్ష పూనింది!
అతని గుర్రం విజయగర్వంతో
సకిలించింది వెంబడించిన
పెంపుడు జాగిలం తెల్లవాళ్లను దొంగలుగా
గుర్తించి భోయ్య్ బోయ్య్ మంటూ తెగ మొరిగింది
అప్పుడే వెనకపాటుగా తుపాకి ఢాం అంది
గోపిరెడ్డి డొక్క చీరుకుపోయింది
అతని చేతిలోని ఖడ్గం
అప్పుడే తెల్లతలకాయ నరికి పడేసింది
నేల కొరుగుతున్న గోపిరెడ్డి చేతిలో
ఎర్రగా మెరుస్తున్న ఖడ్గం అలానే వుంది
అతని శరీరం వురలించిన రక్తం ప్రాకుతూ ప్రాకుతూ
పామై బుసగొట్టింది
గోపిరెడ్డి ప్రాణకాంతులు
దిగంత కాంతులలో లీనమయ్యాయి
అతని ఉఛ్వాస నిశ్వాసాలు
అనంత వాయువుల్లో
లీనమయ్యాయి గాలి బొబ్బరించింది
సిగ్గు, సిగ్గు అని దగ్గరలో
చెట్టుపై కూర్చొన్న చిలక
‘దొంగ దెబ్బతీసావురా వెధవా’ అని నిందించింది.
చనిపోయిన ప్రతి మనిషీ వీరుడు కాదు
వీరుడు చనిపోయినా బ్రతుకుతూనే
వుంటాడు.. అతని త్యాగాలు అనవరతం
సత్ఫలితాలు కలిగిస్తూనే వుంటాయి
వీరులు కార్చిన నెత్తురు
పగబట్టి జనాన్ని లేపుతుంది
వీరులు నేల కొరిగిన చోట
ఏరులు పుట్టి దాహాలు తీరుస్తాయి
గోపిరెడ్డి ఖడ్గ ధారల నుంచి
రాలిపడిన శ్వేత జాతి శిరస్సులు
కుక్కలు పీకిన పునుకులై మిగిలాయి
గోపిరెడ్డి ఊపిరులు ఏలపాటలై
వెలిశాయి, ప్రజల గుండెల్ని తాకుతూ
గొంతుల్ని కలిపి పాడించాయి…
పడమటి ఆకాశంలో తారలు నిష్క్రమించాయి
తొలకరి గగనం ఎరుపెక్కి తెరతీస్తూ
పలకరించింది; గోపిరెడ్డి గాధను
స్మరిస్తూ తెల్లని ఎండగా కాచింది
రక్తంతో తడిసిన నేల గొంతెత్తి ఘోషించింది
పొలిమేరలలో తొలికోళ్లు మెడలుసాచి
నిద్రలను తరిమాయి;సుస్వరాలు జాగరించాయి..
ఆకులు రాల్చడం మర్చిపోయిన చెట్లు
కన్నీరు కారుస్తూ నిలబడిపోయాయి.
గుర్రాల గోపిరెడ్డి మాత్రం
అక్షరాలలో పలుకుతున్నాడు
దాచేపల్లికి చరిత్రలో
మరువని స్థానం కల్పించారు
ఈ జాతి పీల్చెగాలిలో
త్రాగే నీటిలో, కన్నుల కద్దుకునే
కాంతిలో అతని దర్శనమే
విశ్వరూప సందర్శనమై బాసించింది
మహవీర సాక్షాత్కారమై మేల్కొల్పింది
తెల్ల సైనికుల దౌర్జన్యాన్ని
నిందిస్తూనే, ఆదురంత అమానుషత్వాన్ని
గొంతెత్తి శపిస్తూనే; శపథం పట్టారు స్త్రీలు
వీరుల్ని మాత్రమే కంటామని!
తెల్ల పురుగులను భస్మం చేయ
గర్జించారు స్త్రీలు.. ఈ మట్టిని
‘సారవంతం చెయ్యండి’ బిడ్డలారా!
ఈ నేలపై ఆరోపణ చెయ్యండి
కొత్త విత్తులను వెలుగులీనే కొత్త పాటలను
జనత కంఠాలలో వీర గీతాలను
ఏల పాటల నవశ్రుతిలో
నవ రాగాలు సంతరించండి
గుర్రాల గోపిరెడ్డి దాచేపల్లి మట్టిలోంచి
తెలుగుదేశమంతటికీ
పరుచుకున్నాడు, ప్రవహించాడు!!”
భారతభూమి స్వరంకన్న మిన్నయని ఇటువంటి పుణ్యభూమిని ఆంగ్లేయులు మోసంచేసి ఈ దేశాన్ని తమ రెండు చేతులా దోచుకుంటున్నారని, పౌరుషం కలిగిన యువకులను ఈతల్లి తన సంకెళ్లను ఛేదించమని కోరుతోందని అజీముల్లా ‘ఝండాగీత’ లో వర్ణించాడు. (ఈ గీతాన్ని రెండవ అధ్యాయంలో 2.6 లో వివరించడం జరిగింది.) స్వధర్మాన్ని, స్వరాజ్యమును సంరక్షించుకోవటానికి భారతదేశంలో అనేక ప్రాంతాలలో సిపాయిలతోపాటు, అనేక సంస్థానాదీశులు ఈ సంగ్రహాన్ని ప్రారంభించారు. భారతదేశంతోపాటు దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాలలో ప్రథమ భారత సంగ్రామం మంటలు రేగటం ప్రారంభమైంది. అందులో ముఖ్యమైన ఘట్టాలను మాత్రమే క్లుప్తంగా పరిశీలించడం జరిగింది.

ఆంగ్లేయులు మద్రాసు ప్రాంతానికి చెందిన 1,044 మందిని శిక్షించారు. దీన్నిబట్టి దక్షిణ భారతదేశంలో కూడా స్వతంత్ర సమరం బాగా జరిగిందని అర్థం చేసుకోవచ్చు. పూణేకు చెందిన చరిత్ర పరిశోధకులు డా. దివేకర్, పూణాలోని తిలక్ స్మారకసమితి సహాయంతో చాలా లోతుగా అధ్యయనం చేశారు. అండమాన్ దీవుల్లో శిక్షించబడిన 850 మంది అజ్ఞాతవీరుల పేర్లు సేకరించారు. వీరిలో 250 మంది దక్షిణాదివారు.

3.3. బ్రిటీష్ రెసిడెన్సీపై దాడి!

హైదరాబాద్ కోఠీలోని మహిళా కళాశాల ఒకప్పుడు బ్రిటీష్ రెసిడెన్సీ, హైదరాబాద్ నవాబు, ప్రధానమంత్రి సాలార్జంగ్ బ్రిటీష్ వారికి విధేయులు. నిజాం సంస్థానంలో ఎటువంటి విప్లవాలు జరుగకుండా నవాబు గట్టి భద్రతా ఏర్పాటు చేశాడు. కానీ 1857 జూన్ 12న ఔరంగాబాద్ లోని ఫస్ట్ కేవల్రీ దళం, బుల్దానా లోని మరొక దళం తిరుగుబాటు చేసినాయి. ఇవి రెండు హైదరాబాద్‌కి చెందినవి కావడంతో సహజంగా హైదరాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది. జూన్ 24న ‘చిదాఖాన్’ అనే వ్యక్తి నేతృత్వంలో తిరుగుబాటుదారులు హైదరాబాద్‌లో ప్రవేశించారు. సాలార్జంగ్ వారిని నిర్భందించి రెసిడెన్సీకి పంపాడు. జూలై 17న ముస్లింలు మక్కామసీదులో సమావేశమయ్యారు. బ్రిటీష్ రెసిడెంటుకు నచ్చచెప్పేందుకు మౌల్వీలు వెళ్ళాలని నిశ్చయించారు.

ఆ విధంగా మౌల్వీలు వెళ్ళారు. చర్చలు విఫలమయ్యాయి. సాయంత్రం నాలుగింటికల్లా 200 మంది రొహిల్లాలు సాయుధులై మౌల్వీ అల్లాఉద్దీన్, జమీందార్ తుర్రెబాజీఖాన్ నేతృత్వంలో రెసిడెన్సీపై దాడిచేశారు. పక్కనున్న ఇద్దరు వ్యాపారులు మేడలపైకి ఎక్కి తుపాకులతో కాల్పులు జరిపారు. పోరాటం 18వ తేదీ ఉదయం వరకు జరిగింది. బ్రిటీషర్లు విప్లవకారుల్ని చెదరగొట్టారు. చాలామంది చనిపోయారు. అల్లావుద్దీన్ తప్పించుకున్నాడు. తుర్రెబాజీఖాన్ పట్టుబడ్డాడు. ద్వీపాంతరవాస శిక్ష విధించారు. 1859 జనవరి 8న తప్పించుకున్నాడు. జనవరి 24న మహబూబ్నగర్ జిల్లాలోని మొగిలివద్ద భారీ పోరాటంలో ఆంగ్లేయులు మరల పట్టుకున్నారు. తుర్రెబాజీఖాన్‌ని కిరాతకంగా చంపి, నేడు సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ ఉన్నచోట బహిరంగంగా వేలాడదీశారు. మౌల్వీ అల్లాఉద్దీన్‌ను కూడా 28 జూన్ 1858 న పట్టుకొని అండమాన్ పంపించారు. 1884 లో అండమాన్లోనే ఆయన చనిపోయాడు. 1957లో స్వతంత్ర సమరం వందేళ్ళ ఉత్సవాల సందర్భంగా రెసిడెన్సీ భవనంపై తిరుగుబాటు జరిగిన స్థలంలో స్మారక స్థూపం నిర్మాణం చేశారు. నాఖేడ్ పట్వారే రంగారావు రత్నాకర్ పాగే, కౌలాస్ జమీందారు రాజా దీపి సింగ్, సప్తరుద్దాలాలు నైజాం ప్రాంతంలో ఆంగ్ల వ్యతిరేక భావాలు వ్యాప్తి చేయసాగారు. 1857 ఫిబ్రవరిలోనే హైదరాబాద్‌కు చెందిన సోనాజీ పండిత్ నానా సాహెబుకు ఉత్తరం వ్రాశాడు. రంగారావు రత్నాకర్ సాగే ఆ ఉత్తరాన్ని తన తలపాగలో పెట్టుకొని నానాసాహెబ్‌ను కలవటానికి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడో, ఎక్కడ కలిశాడో తెలియదు. కాని 1858, ఏప్రియల్ 18న నానాసాహెబ్ దక్షిణ భారతదేశవాసులకు జారీచేసిన ఫర్మానా తీసుకువచ్చారు. ఆ ఫర్మానాలో “దక్షిణ భారతదేశానికి చెందిన సమస్త జాగీర్దార్లు, దేశముఖ్‌లు, దేశ్‌పాండేలు, పాటిల్, కులకర్ణిలు, సైనికులారా! ప్రజలారా! ఉత్తరాదిలో హిందువులు, ముస్లింలు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఆయుధాలు చేతబూని, ధర్మ రక్షణకై పోరాడుతున్నాం. ఆంగ్లేయులను కనిపించిన వారిని కనిపించినట్లుగా వధిస్తున్నారు. దక్షిణాదిలో ఈ పోరాటం ఇంకా ఊపందుకోవలసి ఉంది. కాబట్టి మేము రంగారావు రత్నాకర్ పాగే, సోనాజీ పంత్లకు తిరుగుబాటుకు కావలసిన ఏర్పాట్లు చేసే బాధ్యతను అప్పగిస్తున్నాం. ధర్మరక్షణ కోసం మీరు వారికి సహకరించండి! ఆంగ్లేయులను వధించండి! స్వతంత్ర వీరులకు తగిన ప్రతిఫలం లభిస్తుంది” అని ఉంది. దక్షిణాదిలో కనీసం 5 వేల మంది అశ్వదళాన్ని 10 వేల కాల్బలాన్ని తయారు చేయాలన్నదే నానా సంకల్పం.

రంగారావు ఉత్తరాదినుండి దక్షిణాదికి వచ్చేసరికి సోనాజీపంత్ హఠాన్మరణం చెందారు. (1859 ఫిబ్రవరి) తరువాత రంగారావు పాగే కౌలాన్ వెళ్ళి రాజాదీప్‌సింగ్‌ను కలుసుకున్నాడు. అక్కడ నుండి సప్తరుద్దాలను కలుసుకున్నాడు. తరువాత హైదరాబాద్ దగ్గరలోని మాదాపూర్ చేరాడు. మాదాపూర్ గ్రామ పెద్దను కలుసుకున్నాడు. అలాగే హళ్ళి, తరువాత సిలివార్, అంబార్గా, బయార్గా, పరిగి, పాదర్ప్ వంటా గ్రామాలు వెళ్ళి ఆ గ్రామ పెద్దలను కలిసి విప్లవంవైపు తిప్పాడు. ఆంగ్లేయులు ఆ ప్రయత్నాలన్ని పసికట్టి అంబాల్లా గ్రామం వద్ద రంగారావును పట్టుకొని ఆ జన్మకారాగారం శిక్ష విధించి అండమాన్ పంపించారు. రంగారావు 1860లో అండమాన్‌లో చనిపోయాడు. మిగిలిన నేతలను కూడా బంధించి ఆంగ్లేయులు శిక్షించారు. ఈ ప్రయత్నం ఆ విధంగా విఫలమైంది.

(సశేషం)

Exit mobile version