Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగు సాహిత్యంలో ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం – పరిశీలన-9

[డా. బి. మల్లయా చారి గారి ‘తెలుగు సాహిత్యంలో ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం – పరిశీలన’ అనే సిద్ధాంత గ్రంథాన్ని ధారావాహికగా అందిస్తున్నాము.]

3వ అధ్యాయం – తెలుగునాట భారత ప్రథమ స్వతంత్య్ర సంగ్రామం వాటి ప్రతిధ్వనులు

3.4. ఉత్తరాంధ్రలోతిరుగుబాటు:

రాజమండ్రి సమీపాన గల యెర్నగూడెంలో కొండరెడ్లు, కోయలు ఆంగ్లేయులపై తిరుగుబాటు చేశారు. ఆగస్ట్‌లో ప్రారంభమైన ఈ పోరాటం నవంబరు నాటికి ఉధృతమైంది. యెర్నగూడెం, తాడిమళ్ళ ప్రాంతంలోని ప్రతి గ్రామంలోను స్వతంత్ర జ్వాలలు ఎగిరాయి. ఈ పోరాటానికి కొరకొండ సుబ్బారెడ్డి నాయకత్వం వహించాడు. సుబ్బారెడ్డిది గోదావరీ తీరాన ఉన్న కరటూరు స్వస్థలం. సుబ్బారెడ్డి తన సైన్యాలతో నాగవరం, బుట్టయగూడెంలను చేజిక్కించుకున్నాడు. కోపల్లె జమీందారు కొర్లి వెంకట సుబ్బారెడ్డి, రేకపల్లి జమీందారు నూరెడ్డి వెంకయ్యలు మద్దతునిచ్చారు. క్రమంగా సుబ్బారెడ్డికి అన్ని వర్గాలు మద్దతిచ్చాయి. విషయం తెలిసిన ఆంగ్లేయులు హైదరాబాద్ నుండి రెండు కంపెనీల సైన్యాన్ని పంపించారు. జీలుగుమిల్లి వద్ద ఇరు పక్షాలకు పెద్ద యుద్ధం జరిగింది. సుబ్బారెడ్డి గెరిల్లా దాడులకు ఆంగ్ల సైన్యాలు చెల్లాచెదురైనాయి. పారిపోయినాయి. ఆంగ్లేయులు సుబ్బారెడ్డిని పట్టుకోటానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరికి 1858 జూన్‌లో కారకొండ సుబ్బారెడ్డి, కొర్ల సుబ్బారెడ్డి తదితరులు పట్టుబడ్డారు. విచారణలో “ఉత్తరాదిలో నానాసాహెబ్ పేష్వా విజయాలు తనకు స్ఫూర్తినిచ్చాయని, నానాసాహెబ్ పేష్వాలాగానే తాను కూడా స్వతంత్రం సాధించేందుకై పోరాటం చేశానని సుబ్బారెడ్డి చెప్పాడు. 7 అక్టోబర్ 1858 అందరిని తీసుకెళ్ళి ప్రజలందరి సమక్షంలో ఉరితీశారు.

“ఈ మహా సంగ్రామం సమయంలో ఆంగ్ల సామ్రాజ్యం భద్రత సన్నటి దారానికి వేలాడదీయబడింది. ఏ కొద్ది అదృష్టమో సిపాయిల పక్షాన ఉండి ఉంటే పరిస్థితి తారుమారయేది” అని ఆర్‌సి మజుందార్ రాశారు.

గుంటూరు జిల్లాలో కూడా ప్రజలలో తీవ్ర అసంతృప్తి రగిలి ఉంది. 1857 స్వతంత్ర సమరం ప్రారంభం కాగానే ప్రజలు ఆంగ్లేయులపై పోరాటాలు చేశారు. హర్సీబోల్, బసవడు అనే ఇద్దరు మాజీ సైనికులు ప్రజలను తయారుచేసేవారు. వీరిద్దరిని అక్టోబరులో ఆంగ్లేయులు అరెస్ట్ చేశారు. 7 నవంబర్ 1857న 400 మంది రోహిల్లాలు, హిందువులు కలిసి జగ్గయ్యపేటలో స్వతంత్ర పోరాటం చేశారు. ఆంగ్లేయులు కచేరీ ఆఫీసుకు కాపలాగ ఉన్న సైనికుల్ని హతమార్చి ఖజానా దోచుకున్నారు. నైజాం నవాబు సాయంతో హైదరాబాద్‌లోని రెసిడెన్సీలోని ఆంగ్ల సైనికులు విప్లవకారులందరిని పట్టుకొన్నారు. 12 మంది ఆజన్మాంత శిక్ష విధించి అండమాన్ పంపించారు.

10, జూలై 1857న మచిలీపట్నంలో సివిల్‌ లైన్స్, పెరేడ్‌గ్రౌండ్స్‌లో స్వాతంత్ర జండాలను ఎగురవేశారు. జెండా పక్కనే ఆంగ్లేయులందరిని అంతంచేయాలని పిలుపునిస్తూ కరపత్రాలు లభించినాయి. ఆంగ్లేయులు ఉలిక్కిపడి తమ సైన్యాలతో నగరంలో కవాతు చేశారు.

షేక్‌ పీరేషా అని ఫకీరు విప్లవ కార్యకలాపాలు సాగించాడు. ఆంగ్లేయులను అంతం చేయటానికి హిందువులు-ముస్లింలు కలిసి పోరాడాలని నచ్ౘ్చెప్పాడు. సైనిక స్థావరాలకు వెళ్ళి సైనికులను తయారుచేశాడు. ఒక ముస్లిం సుబేదార్, జగ్గయ్య అనే జమీందార్ విప్లవకారులకు నాయకత్వం వహించారు. అయితే కొంత మంది సిపాయిలు ఈ విషయం ఆంగ్లేయులకు తెలియజేశారు. ఫీర్‌షాని సిపాయిలే స్వయంగా పట్టి ఇచ్చారు. సెప్టెంబర్ 1857లో పీర్‌షాని అరెస్టుచేసి 11 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు.

4వ అధ్యాయం – తెలుగు సాహిత్యంలో ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం

4.1. మంగళపాండే పద్యకావ్యం – పరిశీలన (అబ్బరాజు శ్రీనివాసమూర్తి):

కావ్యకర్త  ఆచార్య అబ్బరాజు శ్రీనివాసమూర్తి. 1857 ప్రథమ భారత సంగ్రామాన్ని ప్రత్యక్షంగా ప్రజలకు విశదం చేసి స్వాతంత్ర్య దీప్తిని, స్ఫూర్తిని కలిగించడానికి దేశభక్తుడైన అబ్బరాజు శ్రీనివాసమూర్తి తమ కలాన్ని ఝుళీపించారు. సిపాయిల తిరుగుబాటులో మంగళపాండేకు, తెల్లదొరలకు మధ్య జరిగిన పోరాటాన్ని ప్రజలకు ప్రత్యక్షంగా చూపడమే ఈ పద్యకావ్యం ప్రదాన ధ్యేయం. తెల్లదొరల నిరంకుశతను ఎదిరించిన విప్లవమూర్తిగా మంగళపాండే, అబ్బరాజు శ్రీనివాసమూర్తి గారి మూడవ కావ్యం. తొలి రచన చిన్నాదేవి, రెండవ రచన భాగమతి. అయితే కావ్యకర్త గారి మాటలో మంగళపాండే గురించి తెలుసుకుందాం.

“క్రీ.శ.1857లో సాగిన ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తొట్ట తొలిగా స్వేచ్ఛకై దాస్యవిముక్తి గోరి, తుపాకి బట్టి నిల్చి, తుదకాత్మ త్యాగం చేసిన మహనీయుడు. అతడెన్నుకొనిన మార్గమెటువంటిదైనను, నాటి పరిస్థితులలో అంతకంటే మరియొక మార్గం కనబడని కాలమది. అతని వ్యక్తిత్వం, కార్యశూరత వ్రేలిత్తి చూపడానికి ఆస్కారం లేదనేది నిర్వివాదాంశం! నాకు పూర్వం మహాకవులు, రచయితలు తొలి స్వాతంత్ర్య సమరాన్ని కావ్యాలుగా, చారిత్రక వచనరచనలుగా వెలువరించడం జరిగినది. పద్యకావ్యాలు వ్రాసిన పెద్దలు, కేవలం మంగళపాండే నొకటి ‘అరా’ పద్యపంక్తులలో స్పృశించటం జరిగినది. కానీ నాకెందుకో మంగళపాండే, ఈ దేశంలో విప్లవం ద్వారా చైతన్యాన్ని కలిగించిన వీరుడని, తగినంత గుర్తింపు చూపడం అవసరమనిపించింది. కేవలమొక సిపాయి తిరుగుబాటుగా భావించడం నిరుత్సాహం కల్గింది. అందుచేతనే చరిత్ర తెలిసి కొనేందుకు కృషిసాగించాను.

ఈ కొనసాగిన కృషిలో నాకు ఉత్సాహం కల్గించిన సమాచారం అందే వ్యాసం ఆంధ్రజ్యోతి (9-4-1945) లో లభించటం నా అదృష్టం! తద్వారా పాండే వంశచరిత్ర కొంత వరకు లభించినట్లయింది! తర్వాత భారత స్వాతంత్ర్య సమరజ్వాలలు ‘నవభారత ప్రచురణ’ పాండే విప్లవ విశేషాలు లభించాయి. దీనితో హృదయంలో పాండే జీవనహేల దృశ్యమానమైనది. మిగిలిన కావ్య శరీరం నాటిస్థితి గతులనుబట్టి సాగించాను.

సమకాలీన జనవ్యవహారంలో చోటు చేసికొన్నవి, పత్రికా ప్రపంచంలో ప్రాచుర్యం పొందిన పదాలను, పదబంధాలను సమాసాలను యధాతధంగా స్వీకరించడం జరిగిందని పెద్దలకు విన్నవించుకొంటున్నాను. సహృదయ పాఠకుల హస్తాలలో ‘మంగళపాండే’ కావ్యం ఉంది! ఆస్వాదించండి.”

4.1.1  మంగళపాండే పద్యకావ్య ఇతివృత్తము:

అది అఖండ భారతదేశం ఈస్టిండియా కంపెనీ దొరల పాలనలో మ్రగ్గిపోయిన కాలం. దాస్యాంధకారంలో బానిస బ్రతుకులు వెళ్ళదీస్తున్న ఘడియలు, దొరల అధికారానికి అహంకారానికి హద్దూపద్దు లేదు. సంస్కృతీ వైభావాన్ని, దేశాన్ని మరచిపోయి కొందరు దొరల సేవలో తలలొంచిన సమయం. ఆనాటి (ఉత్త్తర ప్రదేశ్ రాష్ట్రంలో) బలియా మండలం (జిల్లా), అందులో ‘నగవా’ గ్రామం వీరమంగళ పాండే జన్మస్థలంగా ప్రసిద్ధమైనది. మంగళపాండే క్రీ.శ. 1831లో చంద్రావత బ్రహ్మాణవంశంలో జన్మించాడు. ‘నగవా’ నివాసమైన శివనారాయణ పాండేకు మొదటి భార్యవల్ల కలిగిన సంతానం ముగ్గురు, జగన్నాధ పాండే, వైజనాధపాండే, హరనాథ పాండేలు. ఇందు జగన్నాథ పాండే కుమారుడు ఠాకూర్ పాండే! అతని ఏకైకపుత్రుడే మంగళపాండే! చంద్రావత వంశీయులు జన్మరీత్యా బ్రాహ్మణులైనప్పటికీ, వారిలో చాలామంది క్షాత్రధర్మాన్నే స్వీకరించడం జరిగింది.

ఠాకూరు పాండే నగవా గ్రామానికి పెద్దగాను, హితుడుగా, కాళీమాత దేవాలయంలో అర్చకునిగా అందరితలలోని నాలుకగా ఉండేవాడు. కంపెనీ దౌర్జన్యంలో జనులు నిర్వీర్యులౌతున్నారని ఆయన గ్రహించాడు. ఆత్మవిశ్వాసం లేని జాతి దాస్యాన్నేం పోదోలుతుంది? ముందు భారతీయులు తమ సంస్కృతీ వైభవాన్ని తెలుసికోవాలి! అందుకు బృహత్తర ప్రణాళిక అవసరం! జాతి చైతన్య చకచ్ఛకితం కావాలి! స్వాతంత్ర్య భావావేశం జాతి రక్తంలో ఉప్పొంగాలి! అందుకు తగిన శక్తినీ, చేతనను కల్గిన యువతరం అవసరం! అటువంటి శక్తి సంపన్నుణ్ణి మార్గదర్శకం చేయితల్లీ! అంటూ నిత్యం దైవాన్ని ప్రార్థిస్తూ, గ్రామస్థులలో నిరంతరం చైతన్య జ్వాలను రగిలించేవాడు.

ఒకనాడు ఉదయానే దేవలయమునకు ఠాకూరు, మాతని అర్చించడానికి వెళ్ళడం జరిగింది. నిత్యార్చనకు క్షీరమందించే ధేనువు గోశాలలో అగపడలేదు. దూడ కన్నీరు పెడ్తోంది. గుడి ప్రక్కనున్న కోనేరులో ‘ధరణి’ శవమై అగుపించింది. రేపోమాపో బిడ్డకు పెండ్లి జేసి పంపించగలననే ఆనందంతో నున్న తల్లి, కూతురుకు జరిగిన ఘోరాన్ని భరించలేక ఆత్మాహుతి చేసికొన్నది. కన్న కూతురుకు జరిగిన ఘాతుకం, తల్లి ఆత్మహత్య దేవాలయ గోవు తెల్ల దొరల విందులో భక్ష్యమైపోవడంతో ఊరు ఊరంత కన్నీరుమున్నీరుగా దుఃఖించింది. ఠాకూరు బండెడు దుఃఖాన్ని దిగమ్రింగి, చండీ విగ్రహం ముందు మొరపెట్టుకోసాగాడు. ఆ సమయంలో, మంగళపాడే ఆవేదనతో రగలిపోతూ, తండ్రి పాదాలంటి “ఈ దుర్మార్గాన్నెదిరించి, దొరల పొంగునణచడానికి నేను మిలటరీలో చేరుతాను తండ్రి! బందూకు లేకుండా, ఈ తెల్లదొరల నెదురుకొనలేం! వేరే మార్గంలేదు! ముల్లును ముల్లుతోనే తీయాలి” అని ప్రార్థించాడు. ఠాకూరు పాండే ఒక పర్యాయం శక్తివంకా, తనబిడ్డ వంక జూచి అనుజ్ఞ యిచ్చాడు. తథాస్తు అన్నట్లు గుడి గంటలు మార్మోగినవి. చండి కూడా ఆమోదించిందని ఆ తండ్రి కొడుకులు సంబరపడ్డారు.

ముందుచూపుతో మంగళపాండే బారక్‌పూరు చేరి, మిలిటరీ పదాతిదళంలో సిపాయియైనాడు. ఈతని నెంబర్ 14/846. మదిలో వందేమాతరం అనుకొని బందూకు చేతబట్టుకొన్నాడు. దేశంలో క్రమక్రమంగా స్వాతంత్ర్యోద్యమ రాగం అలముకొనసాగింది. పలువురు దేశభక్తులు, మారువేషాలలో తిరుగుతూ దేశభక్తిని ప్రబోధించసాగారు. దేశమాతకు సంకేతంగా ఎర్రతామర పూవును గౌరవించారు. ఒక ఊరినుండి మరియొక గ్రామానికి రొట్టెల పంపించే నెపంతో, ఎర్రతామర పూవులు కూడా పంపబడేవి. ప్రజలు దేశమాత ప్రతీకగా నున్న అనుమధుర రాగరంజిత పద్మపూరేకులను హృదయాలకు హత్తుకొని,  మాత పాదాలనంటినట్లు ప్రభావితులు కాగలిగారు. తెల్లదొరల నెదిరించే సమరంలో, ఆహుతి కావడానికి కూడా వెనుకాడేదేలేదని మనస్సులోనే ప్రతిజ్ఞ దీసికొన్నారు. జనత క్రమక్రమంగా చైతన్యవంతమౌతోంది. ఈ భావాలు మిలటరీ క్యాంపులకు గూడ రహస్యంగా చేరసాగాయి.

ఇదే సమయంలో కంపెనీ దొరలు, సిపాయీలు వాడే తూటాలకు ‘ఆవుకొవ్వును’ ‘పందికొవ్వును’ పూతగా వాడిన విషయం సిపాయిలకు తెలిసిపోయింది.  హిందువులకు ఆవు దైవసమం, మహమ్మదీయులకు ‘పంది’ నిషిద్ధం. సిపాయిలలో తీవ్ర వ్యతిరేకత కల్గింది. తూటాలకు వాడేముందు వాటిని నోటితో కొరకాలి! ఇది భారతీయులను అవమానించేందుకే దొరలీ పని చేశారని భావించారు సిపాయిలు. ఈ వ్యతిరేకత గూర్చి క్రింది అధికారులుపై వారికి తెలిపినా “అయినా వాళ్ళేం చేస్తారు. తెల్లదొరనెదిరించి బ్రతకగలిగేనా!” అంటూ కొట్టిపారేశారు.

దొరల అహంకారానికి మంగళపాడే అగ్రహోదగ్రుడైనాడు. తోటివారిలో స్వాతంత్ర్య జ్వాలను రగిలించసాగాడు. వారిలో తిరుగుబాటుకు ప్రోత్సహిస్తూ అనల పతాకాన్ని ఎగురవేశారు. దొరలీ విషయాన్ని ఆలస్యంగా గ్రహించి, ఎక్కడైతే పటాలంలో తిరుగుబాటు అగిపించిందో, ఆ పటాలన్ని యావత్తూ రద్దు చేయసాగారు. కేసులు పెట్టి వేధించసాగారు. రద్దు చేయబడిన పటాలంలోని సైనికులు తదితర మిలిటరీ క్యాంపుల్లో జొరబడి వారిని తమ వైపు త్రిప్పుకోవడం మొదలెట్టారు. తెల్లదొరలు మంగళపాండే ఉన్న పటాలాన్ని కూడా రద్దుచేసే సంగతిని పాండే గ్రహించడం జరిగింది. పాండే ఉన్న ప్లాటూను చుట్టూముట్టి ఒక్కొక్కరినే ఏరివేయసాగారు. అంతటితో మంగళపాండే ఓర్చుకొనలేకపోయాడు.

త్రిపురాసురసంహారం చేసిన ముక్కంటిగా మారి (1857 మార్చ్ 29వ తేది) తుపాకి చేత బట్టి కేకపెట్టాడు. అతని తీవ్ర భీషణరూపం తెల్లదొరకే భయం కలిగించింది. తుపాకీ చేతబట్టి బరిలో నిల్చిన వీరపాండేను చూచి ‘హ్యూనన్’ దొర “ఆ నల్లకుక్కను పట్టుకోండి” అని తెల్లసైనికులను ప్రోత్సహించాడో లేదో, పాండే తుపాకీ వాడ్ని పిట్టను కాల్చినట్లు కాల్చేసింది. ఆ తర్వాత సార్జెంట్ ‘మేజర్‌ హ్యూనన్’, ఆ పైన లెప్డినెంట్‌ బేంక్, వరుసగా కాల్చడంతో తెల్లదొర గుండె పగిలినంత పనైంది. ఒక తెల్ల సైనికుడు  పాండేను కాల్చడానికి తుపాకి గురిపెట్టగా, చటుక్కున తన కత్తితో వాణ్ణి తల తెగనరికేసరికి రెండు ముక్కలై, బొటబొట నెత్తురు చిమ్మింది. ముగ్గురు తెల్లపీనుగుల మధ్యలో తుపాకీతో నిలబడ్డ పాండేను పట్టుకోవాలని మందీ మార్బలంతో ‘కల్నల్ మీలర్’ రాగా, భారతీయ సిపాయీలు ఒక్కుమ్మడిగా “ఠైరో! కల్నల్! కబడ్దార్! పాండేకీ ఏ మాత్రం గాయమైందో నీవిక్కడ్నుంచి పోలేవు! జాగ్రత్త!” అని అరవడంతో అతను కూడా వెనక్కు తగ్గి పై అధికారులకు పరిస్థితిని తెలియజేశాడు.

మంగళపాడేను పట్టుకోవడానికి తెల్లసైన్యంతో జనరల్ హియరస్ వచ్చి తన అనుచరులతో చుట్టూ చక్రవ్యూహం పన్నడం జరిగింది. పాండేకు పరిస్థితి అర్థమైపోయింది. తెల్లసైనికులు వందలాది మంది తనను ప్రాణంతో బందీచేసి తీసుకొని పోవలెనని స్థిరపడినారు! ‘ప్రాణంతో నేను దొరకకూడదు!.. తల్లీ! భారతీ.. ఈ బిడ్డడు శత్రువులకు లొంగబోడు!’ అంటూ తుపాకీతో కాల్చుకున్నాడు. కానీ దురదృష్టం, ఆ తుపాకీ తూటా పాండేను గాయపరచిందే కానీ ప్రాణం తీయలేకపోయింది. ప్రాణమాత్రావశిష్టుడైన మంగళపాండేను దొరలు పట్టి బంధించారు. సైనిక న్యాయస్థానం విచారణకు సిద్ధమైంది.

జైలు గదిలో, వైద్యుడిచ్చిన మందు కూడా, పనిజేయలేకపోయింది. బాధపడుతున్న వీరునకు కిటికీ గుండా చంద్రదర్శనమైంది. అతనిలో భావావేశం! చంద్రుని స్వాతంత్ర్యాన్ని, విశ్వబాంధవ మర్యాదను ప్రశంసించి, తన తండ్రికి జరిగిన గాథనంతయూ జెప్పవలసిందిగా ప్రార్థించాడు.

మరికొద్ది సేపటికి వీరమంగళపాండే గదిలో, కనుముందొక స్త్రీమూర్తి సాక్షాత్కరించింది. ఎవరా! అని తలపోసి చివరకామె దేశమాతగా గుర్తించాడు. ఆ తల్లి ఈ బిడ్డను ఒడిలోనికి తీసుకొని కన్నీరుపెట్టింది. “ఇందరు బిడ్డలను కన్నతల్లిని నా యింటిలో నేను దాసిగా బ్రతుకుతున్నాను. అదరి మాదిరే నీవూ ఉండక ఎందుకీ సాహసం చేసి ప్రాణం మీదికి తెచ్చుకొన్నావు?” అని బోరుమంది! ఆమె శృంఖలాలను చూచి పాండే “అమ్మా! ఈ సంకెళ్ళు, నీ బిడ్డల దోషం వల్లనే కదా కల్గింది! నీ బిడ్డనైయుండి నా వంతు ప్రయత్నించడం తప్పు కాదు! నా కర్తవ్యం” అని సమాధానమిచ్చాడు. బిడ్డను జూచి తల్లి, తల్లి ఒడిలో బిడ్డడు కన్నీరు మున్నీరైనారు. మంగళుని శిరస్సును కన్నీటితో తడిపివేసింది భారతమాత. అది అనుభవైక వేద్యమైన భావనాలోకం! సైనిక న్యాయస్థానం, మంగళపాండేను “నేరం అంగీకరించు తప్పు ఒప్పుకొని క్షమించమని ప్రార్థించు. శిక్ష కొంత తగ్గుతుంది” అని పలికింది. పాండే తను చేసింది సరైనేదనని, నా ప్రాణం పోకుండా మీకు చిక్కినందునే నాకీ చింతనీ, అప్పుడు కూడా వారి అకృత్యాలను చెరిగిపారేశాడు.

మిలిటరీ న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. మంగళుని వంటి దేశభక్తుని ఉరివేయడానికి బరక్‌పూర్‌లో ఒక్క తలారీ దొరకలేదు. దొరలకు తలగొట్టినట్టైంది. కలకత్తా నుండి తలారులను పిలిపించారు. ది. 8-4-1857న వీరమంగళపాండే వీరస్వర్గమలంకరించాడు. ఆపైన స్వాతంత్ర్య సమరం, బాపూజీ నాయకత్వంలో విజయం సాధించి, మన భారత దేశం స్వతంత్య్రమైన దేశంగా ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేయడం మనందరికీ తెలిసిన విషయమే!

4.1.2 మంగళపాండే పద్యకావ్యం – ఖండికలు – విశ్లేషణ :

ఇందులో 17 ఖండికలున్నాయి. అవి. 1. నేను 2. యశోగీతి 3. మాతృశ్రీ 4. మునుమాపు 5. అరుణోదయం 6. ఆవాహన 7. ప్రతిజ్ఞ 8. ఉదయరాగము 9. అనలపతాకం 10. చైతన్య తరంగం 11. సింహగర్జన 12. ఆత్మోజ్జ్వలనం 13. ఆవేదన 14. మాతృదర్శనం 15. ఆశావిపంచి 16. బలిదానం 17. విజయపతాక

1857 సిపాయిల తిరుగుబాటు ప్రభావంతో భారతదేశంతో పాటు తెలుగు సాహిత్యంలో అనేక సాహిత్య ప్రక్రియలు వెలిశాయి. రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక రంగాల్లో అత్యున్నతమైన అభివృద్ధి సాధించడానికి ఆనాడు ఎంతో మంది కవులు కళాకారులు పూనుకొన్నారు. ఈ ప్రభావంతో ప్రజలందర్నీ చైనత్యవంతుల్ని చేసి జాతీయతా భావ పరిపుష్టమైన పద్యకావ్యాలు, ప్రబోధగీతాలు, నవలలు, నాటకాలు వెలిశాయి. ఈ మార్గంలో వచ్చినదే అబ్బరాజుగారి మంగళపాండే పద్యకావ్యం. ఈయన పద్యకావ్యకర్తగా, నాటకకర్తగా, సంఘసంస్కర్తగా ఆంధ్రులకు చిరస్మరణీయుడు. ఈ ప్రసిద్ధ మంగళపాండే పద్యకావ్యం సిపాయిల తిరుగుబాటు అనంతర కాలంలో బహుళాదరణ పొందింది.  వాటి విశేషాలు విపులంగా పరిశీలిద్దాం.

“దేశపు దాస్య శృంఖలల ద్రెంచిన భారత వీరయోధగా
దాశతివ్రాసినన్ బ్రతుకు ధన్యము, నాకవితా సుమమ్ములీ
దేశపదాంకితమ్మగు, సుధీజన చిత్తము మెచ్చు మెచ్చులో
కేశుడటంచు బూనితి బ్రకీర్తిత విపల్వగాథ దెల్పగన్”

ఈ పద్యంలో కవి భారతీయుల స్వేచ్ఛకే దాస్య విముక్తి కోరి తుపాకి పట్టిన విప్లవ వీరున్నీ స్మరిస్తూ, దేశం కోసం రక్తం చిందించే విప్లవ యోధుల గాథలను ఒక పవిత్ర కార్యముగా భావించి భారతీయులను స్వాతంత్ర్య సమరోన్ముఖులను గావించేదిగా ఉంటే నా బ్రతుకు ధన్యమని తలచారు.

“ఇది నాయూపిరి రూపుగొన్న రసభావేచ్ఛాను శిల్పమ్ము, నె
మ్మది చెర్లాడిన త్యాగ మూర్తుల కథామ్లానార్ర్చ వృత్తము, శ్వే
త దురాధర్మ మదేభ కుంభ విదళత్పంచాస్యగర్జాస్పందం
బిది, దీప్యంబిది వీరపాండె మృగరాజేంద్రాఖ్యు చారిత్రమై”

కవి కూడా దేశభక్తుడే కాబట్టి భారతమాత చరణ వేదికపై బలిపుష్టాలుగా తమను తాము సమర్పించుకున్న అమరవీరుల చరిత్రను భావావేశంతో తన కలం బలంతో ఆవిష్కరిస్తానని, అతడే ఈ దేశంలో విప్లవం ద్వారా చైతన్యాన్ని కలిగించిన మంగళపాండే అని, అటువంటి దేశభక్తితత్పరుడి చరిత్రను వివరిస్తానని అన్నారు. వీరపాండే పూరించిన విప్లవ శంఖారావాన్ని భారత స్వాతంత్ర్య సమరజ్వాలల్ని ఈ పద్యకావ్యంలో సహృదయ పాఠకులకు అందించారు. యావత్ దేశమంతా జరిగిన మహాసంగ్రామమది. లక్షలాది సిపాయిలు తెల్లవారి కుతుకలు ఖండించడానికి తమ కత్తులు తీసిన సంగ్రామం. బ్రిటిష్ పాలకుల గుండెలను బ్రద్దలు చేసి తెల్లవారి పాలన అంతమొందించడానికి బ్రిటీష్ యోధులను ముప్పు తిప్పలు పెట్టి కొదమ సింహంలా పోరాడిన యోధుల వీరగాథలను వివరించి భారత ప్రజల్లో తీవ్ర స్వాతంత్ర్య కాంక్ష కలిగిస్తానని ఈ క్రింది పద్యం ద్వారా ప్రబోధించారు.

“అదియొక నాటి భారతమహాద్భుత శక్తి దేశమున్
గుదిపి బ్రిటీషు పాలకుల గుండెలు బ్రద్దలు జేసి, దాస్యమున్
బదముల మట్టి వెల్గిన ప్రభాకర మూర్తుల వీరగాధలిం
పొదవగజేయు భారతి మహోద్ధతి బొంగిన వేశ చెప్పగన్”

‘నేను’ అనే ఖండికలో కవియే మంగళపాండేగా అవతరించి భావావేశంతో విప్లవ చైతన్య జ్వాలను రగిల్చారు. మంగళపాండే రూపంలో ప్రస్తుతించిన మాటలు భారతీయుల్లో నూత్నోత్సాహాన్ని నింపేవిగా భావం ధ్వనిస్తుంది. అబ్బరాజు శ్రీనివాసమూర్తి తన పద్య కావ్యం మంగళపాండే మొదటి ఖండికలో దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల గాదలను వివరించే అవకాశం దొరకడం ఒక గొప్ప అదృష్టంగా భావిస్తానని ఉద్దేశించి పలికిన మాటలివి.

“శ్రీమద్భారతదేశ మాతృపద సంసేవాభిలాషైక దీ
క్షామార్గమ్మున ఇనండు జీవములసంక్యాతమ్ము లర్పించి, తా
బూమాలంచురితాడు జిర్నగవునన్ ముద్దాడు స్వాతంత్ర్యతే
జోమూర్థన్యుల దివ్వగాధలకివే జోహారులర్పించెదన్”

భారతమాత దాస్య బంధనాలు తొలగించడానికి పూనికొని చివరికి ప్రాణాలర్పించిన స్వరాజ్య సంగ్రామ వీరులు, దేశభక్తుల దివ్యగాధలకు ఇవే నా జోహార్లు అంటు కవి రెండవ ఖండిక ‘యశోగీతి’ మొదటి పద్యంలో వారికి జోహారులర్పించారు.

“ప్రథమ భారత స్వాతంత్ర్య ప్రధనమందు
కుంపిణీ పెత్తనమ్మును గూలదోయ
వేడి నెత్తుట దోగాడి వీరమరణ
మందినట్టి యోధవరుల నాత్మనెంతు”

1857 ప్రథమ భారత సంగ్రామంలో బ్రిటిష్ పెత్తనాన్ని కూలద్రోచే ప్రయత్నంలో దేశం కోసం పోరాడి వీరమరణం పొందిన యోధులను వారి ఆత్మలను స్మరించి వారికి హృదయ పూర్వకంగా నివాళి ఇవ్వాలని ఈ పద్యంలో కవి భావనగా కనబడింది.

“స్ఫారోదారభుజ ప్రతాప విలసత్సామగ్రిమై హూణులన్
బారంద్రోలగ దాస్య శృంఖలల రాపాడంగ యుద్ధమ్ములో
రారమ్మంచును దున్మినట్టి ‘బహదూర్షా’ మాన్యునా ‘తాంతియా’
వీరశ్రేష్ఠుని ‘నాన’ వీరుదలతునీ వీరత్రయిన్ ధన్యులన్”

భరత మాత దాస్య శృంఖల విచ్ఛేదనకు పూనుకున్న బహదూర్‌షా, నానాసాహెబ్ పీష్వా, తాంతియాతోపే వీరత్రయాన్ని పేర్కొంటూ వారు సాగించే యుద్ధాన్ని పవిత్ర స్వాతంత్ర్య సమరంగా పేర్కొన్నాడు కవి. ప్రథమ స్వాతంత్ర్య సమర పోరులో అమరులైన వారు ధన్యులుగా తలచారు.

(సశేషం)

Exit mobile version