Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగు తేజరిల్లు!

[ఆగష్టు 29 తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘తెలుగు తేజరిల్లు!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

1.
తెలుగన్న బాస యమృతము
తెలుగుననే గలవు మధుర దివ్యమహత్తుల్
ఇలలో నిలుచును నిరతము
సలలితమగు తెలుగు వెలుగు సంపత్కరమై.
2.
కష్టంబైనది మిక్కిలి
యష్టవ ధానంబు యనెడు ప్రక్రియ తెలుగున్
స్పష్టము చేసెను, భాషా
పుష్టిని; ఘన యాశుధార భూతిని పొందెన్.
3.
ద్వ్యర్థి మహాకావ్యంబులు
సార్థకమును జేసె తెలుగు సాహిత్యమునే
అర్థములవి రెండొకపరి
వ్యర్థపు పదమొకటి లేక వనరుగ యొదిగెన్.
4.
పలు భాషలు నేర్చిన నృపు
డల చెప్పెను కృష్ణరాయ డన్నిట తెలుగే
వెలుగును లెస్సగ యని, తా
నలఘుడు; వినుతించు జగము లన్నియు తెలుగు.
5.
తమిళుండగు కవివర్యుడు
అమితముగా ‘సుబ్రమణ్య భారతి’ వొగడెన్
సుమధుర సుందర తెలుగని
కమనీయము తెలుగు భాష కమ్మని సుధ యౌ
6.
ఇటలీ భాషను బోలుచు
మాటలు యచ్చులతో ముగిసి మధురపు ధ్వనులన్
పటుతర లయ శోభిలునని
చాటెను ‘నికొలో డి కోంటి’ సన్మతి తోడన్
7.
శతకపు సాహిత్యమ్మది
వితతముగా వ్యక్తిగతపు వికసన నేర్పెన్
రీతిగ వచన కవిత్వము
చేతములను పరవశింప జేయును మిగులన్.

Exit mobile version