[3-10-2026 న తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లి ప్రాంగణంలో జరిగిన 2026 ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవంపై నివేదికతో పాటు యూనివర్సిటీ వారు చదివిన ప్రశంసా పత్రాలను అందిస్తున్నాము.]
సభ చకచకా, ముందే ఎన్నో రిహార్సళ్ళు వెసినట్టు పద్ధతి ప్రకారం సాగింది. తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు శ్రీ వెలుదండ నిత్యానందరావు, ముఖ్య అతిథినీ, బహుమతి గ్రహీతలను ఆహ్వానించారు. తమదైన చమత్కార రీతిలో పరిచయం చేశారు. ముఖ్యంగా, సమయపాలన పాటించే క్రమశిక్షణ కల అరుదైన నాయకుడు శ్రీ వెంకయ్యనాయుడు అనగానే ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో ఆమోదం తెలిపారు. పురస్కారాలపై ఒక వర్గం వారే గుత్తాధిపత్యం సాధించారని, అందుకని, ఎన్నోఏళ్ళుగా నిస్స్వార్ధంగా, బహుమతులపై ఎలాంటి ఆసక్తి చూపని ప్రతిభావంతులను వెతికిమరీ వారికీ అవార్డులిచ్చామని ఆయన ప్రకటించారు. బహుమతి గ్రహీతలు ఒక్కొక్కరిని, సుదీర్ఘంగా, సమగ్రంగా పరిచయం చేశారు వెలుదండ నిత్యానందరావు. వారి పరిచయంలోనే, బహుమతి గ్రహీతల ప్రతిభ నైపుణ్యాలు స్పష్టమయ్యాయి.
ఆ తరువాత చకచకా బహుమతి ప్రదానం సాగిపోయింది. ఆపై, ముఖ్య అతిథి తనదైన చమత్కార ధోరణిలో, ప్రయాసలేని సునాయాస శైలిలో, ప్రాసతో క్రీడిస్తూ, ప్రేక్షకులు తమ ఆనందం, ఆమోదం, అభినందనలను కరతాళ ధ్వనులతో వ్యక్తపరుస్తూండగా, సంస్కృతి సాంప్రదాయాలను పాటించటం, మాతృభాషను సంరక్షించుకోవటంలోని ఆవశ్యకతలను ఆయన వివరించారు. ఆ తరువాత బహుమతి గ్రహీతలు తమ అభిప్రాయాలను టూకీగ వ్యక్తపరిచారు. బహుమతి గ్రహీతలలో అధికులు ముఫై ఏళ్ళపైగా, తమ తమ రంగాలలో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శిస్తున్నప్పటికీ, ఇదే వారి ప్రతిభకు తొలి గుర్తింపు కావటం ప్రేక్షకులను ఆశ్చర్య చకితులను చేయటంతో పాటూ, ఎక్కడో తమ పని తాము నిశ్శబ్దంగా చేసుకుంటూ పోతున్నవారి ప్రతిభను గుర్తించి సత్కరించిన యూనివర్సిటీని బహుమతి గ్రహీతలతో సహా ప్రేక్షకులు కూడా మనసారా అభినందించారు.
3-10-2026 తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లి ప్రాంగణంలో జరిగింది. పురస్కారాలను ప్రదానం చేస్తూ యూనివర్సిటీ వారు చదివిన ప్రశంసా పత్రాలు (సైటేషన్స్):
1. కవిత: కోట్ల వెంకటేశ్వరరెడ్జి
నిత్యకవిగా సుప్రసిద్ధుడైన శ్రీ కోట్ల వెంకటేశ్వర రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1982- 84 మధ్యకాలంలో ఎంఏ తెలుగు విద్యార్థిగా ఉంటూ అధ్యయనం ఒకవైపు, కవిత్వ రచన మరోవైపు కొనసాగించారు. 1987లో వీరు రాసిన మొదటి కవిత సంపుటి గుండె కింద తడికి అమలాపురం వారి సమతా రచయితల సంఘం రాష్ట్రస్థాయి అవార్డు లభించి సాహితీ ప్రియుల మన్నన పొందింది. అక్కడి నుండి మొదలైన కవితా యాత్ర 2025 వరకు 17 కవిత సంపుటాలను, రెండు వయోజన విద్యకు అవసరమైన కథలను రచించేదాక విరామం లేకుండా కొనసాగింది.
నాలుగు దశాబ్దాలుగా వీరు రాస్తున్న కవితల్లో ప్రధాన వస్తువు వర్తమాన సామాజిక రాజకీయ అంశాలు. రూపం సరళ సుందరమైన వచనం. సహజంగా వారి వ్యక్తిత్వంలోని వ్యంగ్యం, హాస్యం వారి కవిత్వంలోనూ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ కాలంలో ఏకాంశ నానీలకు శ్రీకారం చుట్టిన నూరు తెలంగాణ నానీలు వారికి ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. అవి నినాదాలుగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో నినదించాయి. “నాన్నా! నాలా ఎదుగు” వంటి వారి దీర్ఘకవితలు కుటుంబ అనుబంధాలను, మానవీయ విలువలను ప్రతిఫలించాయి. “మనిషెల్లి పోతుండు”, “హరితస్వప్నం”, “అంతర్వాహిని”, “మనుమసిద్ది” వంటి కవితా సంపుటాలు ఆయన సున్నితమైన కవితా దృక్పథానికి, తనకంటూ నిర్మించుకొన్న ప్రత్యేక శైలికి నిదర్శనాలు
26 సంవత్సరాలు తెలుగు అధ్యాపకునిగా పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. కవిత్వం మాత్రం అవిశ్రాంతంగా రాస్తుండడం వీరి ప్రత్యేకత. సాహిత్యరంగంలో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ కవిత్వ ప్రక్రియలో 2026 ప్రతిభ పురస్కారాన్ని కోట్ల వెంకటేశ్వర రెడ్డి గారికి అందిస్తున్నాం. అభినందనలు.
***
2. విమర్శ/పరిశోధన: ఆచార్య ఎన్. భక్తవత్సలరెడ్డి
2026 సంవత్సరానికి విమర్శ ప్రక్రియలో ప్రతిభా పురస్కారానికి ఎంపికైన ప్రముఖ రచయిత ఆచార్య ఎస్ భక్తవత్సల రెడ్డి గారు కేరళ విశ్వవిద్యాలయ భాషాశాస్త్ర విభాగం, తిరువనంతపురం లో 1978నుంచి 1994 దాక పనిచేశారు. ఆ తరువాత – జానపద గిరిజన విజ్ఞానపీఠం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ వరంగల్లు ప్రాంగణం లో 2008 జూన్ దాక ఆచార్యులుగా, డీన్ గా, పనిచేసి ఆ పీఠాన్ని అధ్భుతమైన పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దారు. కొంతకాలం ఈ విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్ గా కూడా పని చేశారు. తెలుగు సాహిత్యంతో పాటు జానపద కళలు, మౌఖిక సంప్రదాయాల అధ్యయనం- పరిరక్షణలో విశేష కృషి చేశారు. గ్రామీణ జీవన విధానంలో అంతర్లీనంగా ఉన్న జానపద విజ్ఞానాన్ని వెలికితీసి భద్రపరిచారు.
జానపద గేయాలు, కథలు, ఆచారాలు, సంప్రదాయాలు, విశ్వాసాలను గ్రామీణ ప్రజల జీవనానుభూతులు, సంస్కృతి, భావోద్వేగాలు సాహిత్య రూపంలో భద్రపరుస్తూ శాస్త్రీయ దృక్పథంతో అధ్యయనం చేశారు. దక్షిణ భారతదేశపు జానపద సంప్రదాయాలు, గిరిజన సంస్కృతి, మౌఖిక కళారూపాల పరిరక్షణకు ఎనలేని కృషి చేశారు. కాకిపడిగెల, కొర్రాజుల కళాకారులు చెప్పే భారతంలో దాదాపు 74 గంటల వీడియో టెలికాస్ట్ చేయగల్గిన రూపంలో డాక్యుమెంట్ చేసి దానికి రాతప్రతులు కూడా తయారు చేయించారు.
1994- 2004 దాకా ఫోర్డ్ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో జానపదవిజ్ఞానంలో పరిశోధన చేయాలనుకునే వారికి ఆంగ్ల మాధ్యమంలో 5 శిక్షణా శిబిరాలు, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం మాధ్యమాల్లో మూడేసి శిక్షణా శిబిరాల నిర్వహించిన ఘనత వీరికి దక్కింది. అనుష్ఠాన సంప్రదాయంలో ప్రత్యేకంగా ఉపయోగించే పదాల్లోని సాంస్కృతిక వైవిధ్యాన్ని విశ్లేషిస్తూ వీరు రాసిన తిరుపతి గంగజాతర – చరిత్ర, సంస్కృతి, శాస్త్రీయత కు ఎంతో పేరు వచ్చింది.
ఒక్కమాటలో చెప్పాలంటే శాస్త్రీయ పద్ధతుల్లో జానపద సాహిత్య సేకరణలకు , అధ్యయనాలకు, ఆచార్య ఎన్. భక్తవత్సలరెడ్డి గారు చేసిన అపూర్వమైన సేవకు, అందించిన మార్గానికి సగౌరవంగా అందిస్తున్న పురస్కారమిది.
***
3. చిత్రలేఖనం: కూరెళ్ళ శ్రీనివాస్
“ఎప్పటికప్పుడు ఈ సమాజంలో చోటు చేసుకుంటున్న మార్పులను చిత్రాల ద్వారా ఆవిష్కరించి నప్పుడే నాకు ఆత్మసంతృప్తి.” అని భావించే కూరెళ్ళ శ్రీనివాస్ నల్గొండకు చెందినవారు. వీరు ప్రధానోపాధ్యాయులుగా ఈ సంవత్సరమే రిటైరయ్యారు. తెలంగాణ ప్రభుత్వంలో చిత్రకళకు రిసోర్స్ పర్సన్ గావున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖలో చిత్రకళకు సంబంధించి ఆస్థాన కళాకారుడు. పాఠ్యపుస్తకాలను తన చిత్రకళా నైపుణ్యం చేత జిగేలు మనిపించిన చిత్రకారుడు..!!
సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా 18 యేళ్ళకు పైగా 1వ తరగతి నుంచి నుంచి 10వ తరగతి వరకు పిల్లల పాఠ్యపుస్తకాలకు, రాజీవ్ విద్యామిషన్ కరదీపికలకు బ్యానర్లు రాయడం, చిత్రాలు గీయడం, ఇతర ప్రచార సామాగ్రికి డిజైన్లు చేయడం, మొదలైనవి చేశారు. రచయితల వివిధ పుస్తకాలకు వందకు పైగానే ముఖచిత్రాలు వేశారు.
శ్రీనివాస్ కు తెలంగాణ పల్లె జీవితం, మానవ సంబంధాలంటే ఎంతో ఇష్టం. ఆయన చిత్రాల్లో పల్లె ఓ తల్లి లాగా మనల్ని పలకరిస్తుంది. ఇక జాతరలు, పండుగలు, జనం కోలాహలం, వేషధారణలు, వీధులు, పచ్చని చెట్లు ఈయన చిత్రాలకు ప్రధాన వస్తువులు..! తెలుగుజాతికి, భాషకు, సాహిత్యానికి, సంస్కృతికి పేరుతెచ్చిన కవులు, కళాకారులు, రచయితలు సామాజిక సేవకుల చిత్రాలు ఈయన కుంచె నుంచి జాలువారాయి. మఖ్దూం మొహియుద్దీన్, కాళోజీ, దాశరథి, చలం, శ్రీశ్రీ, సురవరం ప్రతాపరెడ్డి, వట్టికోట ఆళ్వారుస్వామి, జాషువా, గురజాడ అప్పారావు, ఒగ్గు కళాకారుడు చుక్కా సత్తయ్య లాంటి ఎంతోమంది వైతాళికులు శ్రీనివాస్ చిత్రాల్లో కొత్తగా ఊపిరి పోసుకున్నారంటే అతిశయోక్తికాదు.
తెలంగాణ సాహిత్య అకాడెమి పూర్వ కార్యదర్శి ఏనుగు నర్సింహారెడ్డి గారి “తెలంగాణ రుబాయిలు” పుస్తకంలో150 బొమ్మలు గీశారు. సీవీ శ్రీనివాస్ రచన, “నానీల జీవధార” పుస్తకానికి శ్రీనివాస్ 100 బొమ్మలు వేశారు. అలాగే.. ఆ మధ్య బాలసాహిత్యానికి 60 చిత్రాలు గీశారు.
అబ్దుల్ రజా హుస్సేన్ గారు అన్నట్లుగా కూరెళ్ళ నవయవ్వన చిత్రకారుడు. ఆయన చిత్రాలన్నీ సజీవ చిత్రాలే. తన కుంచె నుండి జాలు వారిన ప్రతీ చిత్రం దేదీప్యమానమే. ప్రతీ చిత్రం మనసుకు దగ్గరయ్యేదే.. హృదయాన్ని దోచుకునేదే..!!
***
4. శిల్పం: ఏ.యస్. ప్రకాశ్
రెండున్నర దశాబ్దాలుగా తెలుగు చలనచిత్ర సినిమలో ఆర్ట్ డైరెక్టర్‌గా, ప్రొడక్షన్ డిజైనర్‌గా విజయపథంలో పయనిస్తున్న శ్రీ ఏ.ఎస్. ప్రకాశ్ గారికి ఈసారి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం శిల్ప రంగంలో ప్రతిభా పురస్కారం ఇచ్చి గౌరవిస్తుంది. శిలల ఆలంబనలతో చేసేది మాత్రమే శిల్పం కాదు, భిన్న భిన్నమైన వస్తువులతో చేసే ప్రతి రూపకల్పనలను కూడా శిల్పం కింద పరిగణించవచ్చునన్న విస్తృతార్థంతో ఈ పురస్కారాన్ని అందజేస్తున్నాం. ఒక సినిమా విజయం వెనక కేవలం నటీనటుల నటన మాత్రమే ఉండదు. ఆ సినిమా కథకు అవసరమైన పరిసరాలు, భవనాలు, గుడిసెలు రైళ్లు, విమానాలు యుద్ధాలు, చెరువులు చారిత్రక కట్టడాలు, గ్రామీణ పట్టణ భౌతిక రూపకల్పనలకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఈ రంగంలో విజయకేతనాన్ని ఎగరవేసిన ఏ.ఎస్. ప్రకాశ్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం విద్యార్థి అని కూడా చెప్పుకోవడానికి గర్విస్తున్నాం.
1997 లో బిఏ డిగ్రీ, 2001 లో ఫైన్ ఆర్ట్స్ లో ఎంఏ డిగ్రీ పూర్తి చేశారు. కొంతకాలం రామోజీ ఫిలిం సిటీలో శిక్షణ పూర్వకమైన అనుభవాన్ని పొందారు. 2004 నుంచి ప్రకాష్ సినిమా విజయవంతానికి మూలాధారంగా నిలిచే సాంకేతిక కళాత్మక సెట్టింగులు కలర్ కాంబినేషన్లు సినిమాలో కనిపించే ప్రతి చిత్రీకరణను సృజనాత్మక దృక్పథంతో వినూత్న ధోరణిలో నిర్మిస్తున్నారు. ప్రకాశ్ అగ్రశ్రేణి దర్శకుల దగ్గర నూటికి పైగా చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేశారు. కథానుగుణమైన వాతావరణ రూప కల్పనలో రెండుసార్లు ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్‌గా నంది అవార్డులు గెలుచుకున్నారు.
2013లో మిర్చి, 2016 లో జనతా గ్యారేజ్ 2022లో సర్కారు వారి పాట చిత్రాలకు అట్లాగే దుబాయ్ శీను, వాల్తేరు వీరయ్య, గుంటూరు కారం, అలవైకుంఠపురం లో.. భరత్ అనే నేను మొదలైన ఎన్నో సినిమాలకు సృష్టించిన హంగులు, ఆర్భాటాలు ఆకర్షణలు ఆ సినిమాల విజయవంతానికి, ఆ నిర్మాతల విజయానికి దోహదం చేశాయి. కొరటాల శివ , త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను, లాంటి నిర్మాతలు, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రవితేజ, నందమూరి బాలకృష్ణ, వెంకటేశ్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, అక్కినేని నాగార్జున లాంటి నటులు ప్రకాశ్ చిత్రీకరణ రీతిని ఎంతో ప్రశంసించారు.
సన్నివేశోచితమైన భావోద్వే గాలను పండించడానికి కావలసిన కలర్ కాంబినేషన్స్ , రంగుల పొందిక ను కల్పించడం లాంటి విశేషాలతో తనదైన విలక్షణముద్రతో, సృజనాత్మక ప్రతిభతో దూసుకొని పోతున్న ప్రకాశ్ గారికి మరెన్నో విజయాలు కలగాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం.
***
5. నృత్యం: డా. హెచ్. అనిత
భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయాల్లో విశిష్టమైన కూచిపూడి కళకు తన ప్రతిభతో సేవలందిస్తున్న ప్రముఖ నృత్యకళాకారిణి, కొరియోగ్రాఫర్ డా. హెచ్. అనిత గారు. కూచిపూడి నృత్యాన్ని కేవలం కళగా మాత్రమే కాకుండా, ఒక శాస్త్రీయమైన అధ్యయన అంశంగా భావించి తెలుగు విశ్వవిద్యాలయంలో కూచిపూడి నృత్యంలో బి.ఏ., ఎం.ఏ.లే కాక కూచిపూడి భాగవతుల సంప్రదాయ పరిణామ కళారూపాల వికాసాలపై . 2009లో పరిశోధన పూర్తి చేసి డాక్టరేట్‌ను సాధించారు. కూచిపూడి నృత్యంలోని శాస్త్రీయత, అభినయం, తాళం, లయ, హావభావాలను సమన్వయపరుస్తూ తనదైన శైలిని రూపొందించుకున్నారు. పీహెచ్.డీ గ్రంథాలు ముద్రణ రూపం పొందడం సర్వ సామాన్యం. కానీ అనితగారి సిద్ధాంతగ్రంథం ప్రదర్శనా రూపాన్ని పొందడం చాలా అరుదైన విషయం. Ph.D గ్రంథానికి 2011 లో ప్రదర్శనా రూపాన్ని కల్పించి తరువాతి తరాలకు “కూచిపూడి మహత్వము” అనే నృత్య రూపకం ద్వారా కూచిపూడి చరిత్రని అవలీలగా అర్థం చేసుకునే వీలుని కల్పించడం జరిగినది. ఈ ప్రదర్శనకి వీరికి 2012 లో National Best Choreographer Award లభించింది. డిల్లీలో తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించిన నృత్యోత్సవాల్లో ఇది ప్రదర్శితమై ప్రేక్షకుల మన్ననలు పాత్రమైంది,. జయ జయహే తెలంగాణా, డా. బాబా సాహెబ్ అంబేడ్కర్, బతుకమ్మ, గంగిరెద్దు, రాజ్యాంగ నిర్మాణం ఇలా ప్రతీ రూపకాన్ని వినోదంతో పాటు విజ్ఞానాన్ని కల్పించే విధంగా డా. అనితగారు రూపొందించారు
1998 నుండి నేటివరకు అంటే గత 28 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలలోని వేల మంది బాలికలకు నృత్య విద్యని నేర్పుతూ అనేక వేదికల మీద నృత్యాన్ని ప్రదర్శింపజేస్తూ భవిష్యత్ తరాలకు భారతీయ సాంస్కృతిక మరియు కళా వారసత్వాన్ని అందించడంతో పాటు వారిలో స్టేజ్ fear ను పోగొట్టి ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తున్నారు. వీరి కృషిని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం 2021 లో వీరికి Best Teacher Award ను అందించింది.
నృత్య విద్యని అభ్యసిస్తున్న విద్యార్థులు సిద్ధాంత పరంగా పడుతున్న ఇబ్బందిని గ్రహించి వారి స్థాయికి తగినట్లు Instagram, facebook వంటి social media వేదికగా తెలుగు మరియు English భాషలలో సిద్ధాంతాన్ని వివరిస్తున్నారు
కూచిపూడి నృత్య రంగానికి, తెలుగు కళా సాంస్కృతిక రంగానికి అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తూ నృత్య ప్రక్రియలో 2026 ప్రతిభా పురస్కారాన్ని డా. హెచ్. అనిత గారికి అభినందన పూర్వకంగా అందిస్తున్నాం.
***
6. సంగీతం: శ్రీ దుడ్డు సీతారామయ్య
రాష్ట్రపతి భవన్ నుంచి రాజ్‌భవన్ వరకు, దేశాధినేతల సమక్షం నుంచి అంతర్జాతీయ వేదికల వరకు, దుడ్డు సీతారామయ్య గారి వీణ పలికిన ప్రతి స్వరం భారతీయ సంగీత వైభవానికి ప్రతినిధిగా మారింది. సంప్రదాయపు పరిమళాన్ని కాపాడుకుంటూనే, సృజనాత్మకతకు రెక్కలు తొడిగి సంగీతమే ఊపిరిగా, వీణానాదమే హృదయస్పందనగా జీవిస్తున్న మహనీయ వైణికులు ‘వీణా ప్రవీణ’ దుడ్డు సీతారామయ్య గారు.
సంగీత సుగంధాలు వెదజల్లిన కుటుంబంలో జన్మించిన ఆయనకు, బాల్యమే స్వరాలకు తొలి పరిచయమై, వీణా సాధనకు తొలి వేదికగా మారింది. సంగీత, సాహిత్య, గణిత అష్టావధానాలతో అసమాన ప్రతిభ కనబరిచిన తాతగారు సంగీత మహామహోపాధ్యాయ దుడ్డు సీతారామ శాస్త్రి గారి వారసత్వం, తండ్రి శ్రీ దుడ్డు రామకృష్ణ శాస్త్రి గారి వద్ద గాత్రసంగీతానికి శ్రీకారం, పినతల్లి శ్రీమతి డి.వి. శేషమ్మ గారి వద్ద లభించిన నిరంతరవీణా విద్య శిక్షణ , మహావైణికుడు డా. సి. చిట్టిబాబు గారి నుంచి అందిన సంగీత స్ఫూర్తి సీతారామయ్యగారిలోని కళాసంస్కారానికి బలమైన పునాదిగా నిలిచి సంగీత ప్రపంచంలో తనదైన స్థానాన్ని నిలుపుకొనేలా చేసింది.
ఒకనాటి వైణిక సంప్రదాయంలో వెలుగొందిన ఊర్ధ్వముఖంగా వీణ వాయించే శైలిని తన కచేరీల ద్వారా సజీవంగా నిలిపిన అరుదైన కళాకారుడు ఆయన. కళ్ళు మూసుకున్నా స్వరాన్ని మాత్రం మరువని ఏకాగ్రతతో, కళ్లకు గంతలు కట్టుకొని వీణ వాయించే అసాధారణ ప్రతిభ ఆయన సాధనకు సాక్ష్యంగా నిలుస్తుంది. ఆకాశవాణి, దూరదర్శన్లలో గ్రేడెడ్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన ఆయన, దేశవ్యాప్తంగా 2,400కు పైగా ప్రదర్శనలతో తన వీణానాదాన్ని అనేక వేదికలపై వినిపించారు.
‘వీణా ప్రవీణ’, ‘వీణా భార్గవ’, ‘వీణా వాదన శిరోమణి’ వంటి బిరుదులు ఆయన కళాతపస్సుకు అలంకారాలైతే, లభించిన పురస్కారాలు ఆయన సంగీత సేవకు మంగళహారతులు.
ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం నుంచి కాంచీ కామకోటి పీఠం ఆస్థాన విద్వాన్ గౌరవం వరకు, ఆయనకు లభించిన సత్కారాలు వీణా సేవకు లభించిన గౌరవముద్రలు.
పారంపర్యంగా వచ్చిన స్వరసంపదను హృదయంలో పదిలపరచి, గురువుల నుంచి పొందిన విద్యను సాధనతో పరిపుష్టం చేసి, తన వీణానాదంతో తెలుగు వైణిక సంప్రదాయానికి చిరస్మరణీయ స్వరచిహ్నంగా నిలిచిన కళాతపస్వి – దుడ్డు సీతారామయ్య గారు.
***
7. పత్రికారంగం: డా. వై.నాగేశ్వరరావు
సీనియర్ జర్నలిస్ట్,గా 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వై. నాగేశ్వరరావు గారు వార్తా తెలుగు దినపత్రిక స్టేట్ బ్యూరో చీఫ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రంగా రెడ్డి జిల్లా, యాచారం మండలం, కోహెడ గ్రామంలో 1964లో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు, పిహెచ్డి, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం విజయవంతంగా పూర్తి చేశారు. జర్నలిజంపై మక్కువతో 1989లో మన తెలుగు విశ్వవిద్యాలయంలోనే బ్యాచులర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం (బిసిజె) మొదటి బ్యాచ్‌లో చదివారు. ఆ తరువాత అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంఎ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ చదివారు.
నాటి దినపత్రిక ఉదయంలో(1994) సచివాలయ రిపోర్టర్‌గా చేరి వివిధ శాఖల్లో పలు స్కామ్‌లను బయటకు తీశారు. ఉదయం అనుభవంతో వార్తా దినపత్రికలో సీనియర్ రిపోర్టర్‌గా చేరి ఎన్నో ప్రత్యేక కథనాలు రాశారు. 31 ఏళ్లుగా వార్త దినపత్రికలో పొలిటికల్ ఇన్చార్జ్గా, స్టేట్ బ్యూరో చీఫ్‌గా డాక్టర్ వై. నాగేశ్వరరావు పనిచేస్తున్నారు. భారత్, అమెరికా, బ్రిటన్ దేశాల ప్రెస్ చట్టాలపై రీసెర్చ్ రిపోర్టును రాశారు. గడిచిన 30 ఏళ్లుగా ముఖ్యమంత్రుల కార్యకలాపాల వార్తలు, గవర్నర్ల కార్యకలాపాలు, ప్రధాన రాజకీయ పార్టీల వార్తలు రాస్తూనే ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2004 నుండి అసెంబ్లీ మీడియా అడ్వయిజరీ కమిటీ సభ్యులుగా వరుసగా అన్ని ప్రభుత్వాల సమయాల్లోనూ కొనసాగుతున్నారు. మీడియా కమిటీ సభ్యుడిగా, సీనియర్ జర్నలిస్ట్‌గా 2005, నవంబర్‌లో పార్లమెంట్లో వారం రోజుల పాటు శిక్షణ పొందారు. విదేశాలలో అభివృద్ధి కార్యకలాపాలను అధ్యయనం చేయడానికి ఆయా ప్రభుత్వాల తరఫున విస్తృతమైన స్టడీ టూర్లు చేశారు. 2002లో దక్షిణాఫ్రికా, చైనా, మలేషియా, థాయిలాండ్, సింగపూర్ దేశాలు, 2005లో మరోసారి సింగపూర్ మలేశియా పర్యటనకు వెళ్లి అధ్యయనం చేశారు. 2012లో ప్రభుత్వం తరపున సింగపూర్‌కు వెళ్లి అక్కడ సింగపూర్, మలేషియా పట్టణాభివృద్ధి, విదేశాంగ శాఖల మంత్రుల సమావేశాలలో పాల్గొన్నారు. ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాంచల్, హర్యానాలకు వెళ్ళి పలు దఫాలు ఎన్నికల రిపోర్టింగ్ చేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల పనితీరుపై అనేక కథనాలు రాశారు. జర్నలిజంలో ఆయన విశిష్ట సేవలను గుర్తించి 2018లో నాటి ప్రభుత్వం డాక్టర్ వై. నాగేశ్వరరావుకు రాష్ట్ర స్థాయి ఉత్తమ జర్నలిస్ట్ పుస్కారం అందజేసింది. ఈ క్రమంలో 2024లో పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు సంవాహనా స్టేట్ అవార్డును డాక్టర్ వై. నాగేశ్వరరావుకు అందజేశారు.
***
8. నాటకరంగం: సురభి వెంగమాంబ
తెలుగు నాట నాటకమనగానే పెదవులపై అసంకల్పితంగా మెదిలే అక్షరాలు సురభి. శతవసంతాలు దాటిన సురభి నాటకసమాజం పౌరాణిక, చారిత్రక నాటకాలు ప్రదర్శించని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, తండ్రులు, తల్లులు, చిన్నమ్మలు, చిన్నాన్నలు, అన్నలు, అక్కలు, బావలు, మరదళ్ళు చెల్లెళ్లు, ఇలా అన్ని వయసులవారు, అన్ని వరుసలవారు కలిసి మెలిసి కష్టసుఖాలు పంచుకొంటూ నలుమూలలా నాటకప్రదర్శనలతో ఉర్రూత లూగించిన చరిత్ర బహుశా ప్రపంచంలోనే ఒక్క సురభికే చెందుతుంది.
సురభి వంశానికి చెందిన 60 ఏళ్ళ సురభి/ఆవేటి వెంగమాంబ బాల్యంనుంచి నాటకాల్లో వేషాలు ధరించారు. వీరి తల్లిదండ్రులు పనారస జోగులాంబ, పనారస వెంకటరమణారావు. భర్త ఆవేటి గజపతిరావు. 2024లో వీరినటనా కౌశలానికి, వాచక సాత్విక అభినయానికి మెచ్చి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన నంది అవార్డ్ ఇచ్చి సత్కరించింది. 5 గరుడ పురస్కారాలు, తెనాలి వారి 3 వీణ పురస్కారాలు తిరుపతి వారి 2 అశ్వం అవార్డులు వీరు పొందారు. 2026 సంవత్సరానికి గాను నాటకప్రక్రియలో అభినందన పూర్వకంగా తెలుగు విశ్వవిద్యాలయం సురభి వెంగమాంబ గారికి ప్రతిభా పురస్కారమిచ్చి సత్కరిస్తుంది.
***
9. జానపదకళారంగం: తూర్పాటి సాలమ్మ
తూర్పాటి సాలమ్మగారు ప్రముఖ జానపద కళాకారిణి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కట్టుగుడెం గ్రామంలో జన్మించింది. వీరి భర్త తూర్పాటి కృష్ణయ్యగారు కూడా గొప్ప జానపద కళాకారుడు. సాలమ్మ బేడ బుడిగ జంగం కులానికి (ఎస్సీ సామాజిక వర్గానికి) చెందినవారు. అయినప్పటికీ బిసి సామాజిక వర్గమైన యాదవులకు ఆశ్రితకథా గాయకులు. వీరిని పొడపోత్రపు కళాకారులు లేదా మందహెచ్చులు అని పిలుస్తారు.
సాలమ్మ ప్రధాన కథకురాలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంచి పేరు సంపాదించారు. గత 30 సంవత్సరాలుగా లెక్కలేనన్ని ప్రదర్శనలు ఇచ్చారు. ఆద్యంతం తాళానికి అనుగుణంగా కథ చెప్పుతూ ప్రేక్షకులను రంజింప చేయగల సమర్ధురాలు. కలంకారి పటం మీద కాటమరాజు కథలకు చెందిన కథాంశంలో వచ్చే సన్నివేశాలకు అనుగుణంగా చూపుడు కర్రతో బొమ్మలు చూపిస్తూ ప్రేక్షకులను రంజింప చేయడంలో సాలమ్మ దిట్ట. సాలమ్మ చెప్పే కథల్లో పెద్దిరాజు కథ, పోలురాజు కథ, కరియావుల రాజు కథ, వలరాజు కథ, కాటమరాజు కథ, గంగురాజు కథ, పాపమ్మ కథ, ఎర్రన్న కథ, బొల్లావు కథ మొదలైనవి ఉన్నాయి. ఒక్కొక్క కథను ఐదు నుండి ఆరు రోజుల వరకు చెప్ప గల నిపుణురాలు. మొత్తానికి సేవలందిస్తూ భవిష్యత్ తరాలకు యాదవుల చరిత్రను అందించడంలో మేటిగా నిలిచిన సాలమ్మగారిని తెలుగు విశ్వవిద్యాలయం అభినందిస్తోంది.
***
10. అవధానం: డా.ఎం.వి. పట్వర్ధన్
చివరి వరకూ మనషిగా జీవించాలని తలపోసే డాక్టర్ మారేపల్లి వెంకట పట్వర్ధన్ ఒకే రోజు ఆరు అష్టావధానాలను ధారణాసహితంగా చేసి ఆశ్చర్యపరిచారు. వారి శతావధానానికి వేదికగా నిలిచింది మన సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయమే. గతసంవత్సరం ఎప్రిల్ 12,13, 14 తేదీల్లో అంగరంగవైభవంగా వందలాది విద్వజ్జనసమూహం కరతాళ ధ్వనులమధ్య పట్వర్ధన్ శతావధానం విజయవంతంగా చేయడం కళ్ళారా చూశాం. 136 అష్టావధానాలు, 6 శతావధానాలు చేశారు. వాసర సరస్వతీస్తవం, షిరిడీ సాయి మహిమామృతం లాంటి కావ్యాలు పట్వర్ధన్ గారు రాయడంలో ఆశ్చర్యపోవలసిందేమీ లేదు. కానీ జలాంతర్గామి పేరుతో తెలంగాణా ఉద్యమ దీర్ఘకావ్యం వెలువరించడం వారి లోని వర్తమాన కాలిక స్పృహకు నిదర్శనం,
మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్‌గా ఎన్నో బాధ్యతలతో తలమునకలుగా ఉంటూనే అవధానాలు వదలలేదు. సివిల్స్‌లో తెలుగును ప్రధానాంశంగా, ఐచ్ఛికాంశంగా ఎంచుకొన్న విద్యార్థులకు ఉచితంగా బోధన, శిక్షణ ఇస్తున్నారు. అలాగే వ్యక్తిత్వ వికాసంపై తరగతులు, శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆరవతరగతి నుంచి అరవై ఏళ్ళకు చేరువవుతున్న నేటి దాక పద్యరచన శ్వాసగా జీవిస్తున్న శతావధాని డా. మారేపల్లి వేంకట పట్వర్ధన్ గారికి మైత్రీపూర్వక పురస్కారం అందిస్తున్నాం.
***
11. ఉత్తమ రచయిత్రి: ఆచార్య కాత్యాయనీ విద్మహే
కాకతీయ విశ్వవిద్యాలయంలో 1977 నుంచి 2015 వరకు 38 ఏళ్ళ సుదీర్ఘకాలం అధ్యాపకురాలిగా, శాఖాధ్యక్షురాలిగా, పాఠ్యప్రణాళికాసంఘం అధ్యక్షురాలిగా, వివిధ హోదాల్లో పనిచేసిన ఆచార్య కాత్యాయనీ విద్మహేగారు ప్రగతిశీల రచయిత్రి. విశేషించి నిరంతర మహిళాభ్యదయ పరిశోధకురాలు. వారు రాసిన ‘సాహిత్యాకాశంలో సగం – స్త్రీల అస్తిత్వ సాహిత్యం, కవిత్వం, కథ’ విమర్శన గ్రంథానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ గ్రంథవురస్కారం, ఇచ్చింది. ఆ తరువాతనే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారమిచ్చి గౌరవించింది. అలంకార శాస్త్రం సాహిత్య విమర్శ , నిరంతర చింతనా విషయాలు, మార్క్సిజం, తెలంగాణ సాహిత్యం-ప్రాంతీయత’, ‘తెలుగు నవలా కథానిక విమర్శ పరిణామం’, ‘ఆధునిక తెలుగుసాహిత్యం స్త్రీవాద భూమిక’ వంటి 20 రచనలు చేశారు. స్త్రీవాద దృక్పథం, సామాజిక సిద్ధాంతాలు తదితర 285 వరకు వ్యాసాలు రాశారు. 275 పరిశోధన పత్రాలు సమర్పించారు. కాత్యాయని ఇంకా మహిళా సాధికారత – సవాల్, ఆధునిక తెలుగు సాహిత్యం – స్త్రీల భూమిక, లింగ సమానత్వం దిశగా సమాజ సాహిత్యం, కన్యాశుల్కం – సామాజిక సంబంధాలు, జెండర్ స్పృహ తదితర పుస్తకాలు ఆమె రాశారు.
కాత్యాయనీ విద్మహే గారి తండ్రిగారు ఆచార్య కేతవరపు రామకోటిశాస్త్రి గారు ప్రముఖ విమర్శకులు. వారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొన్న విదుషీమణి. తండ్రిగారి మరణానంతరంవారి అముద్రిత రచనలనన్నింటిని పరిష్కరించి 22 పుస్తకాలుగా వెలువరించారు. ఇది చాలా గొప్పపని. ప్రస్తుతం ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక రాష్ర్ట కార్యదర్శిగా, మానవహక్కుల వేదిక సభ్యురాలిగా ఉన్నారు.
***
12. కథ/నవల – కస్తూరి మురళీకృష్ణ
కస్తూరి మురళీకృష్ణ గారు సాహిత్య సృజనరంగంలో నాలుగు దశాబ్దాల అనుభవసంపన్నులు. భయానక కథలు, చారిత్రకకథలు, అపరాధ పరిశోధక కథలు, పౌరాణిక కథలు, సైన్సఫిక్షన్ కథలు, ఇలా ఎన్ని వైవిధ్యభరితమైన కథలు రాయవచ్చో అన్ని రకాల కథలకు నిదర్శనంగా 11 సంపుటాలను వెలువరించి సాహిత్యలోకాన్ని ఆశ్చర్య పరిచారు. అసిధార, మర్మయోగి, శ్రీకృష్ణదేవరాయలు, ద్రౌపది లాంటి మార్మిక తాత్విక పౌరాణిక, చారిత్రక నవలలు తొమ్మిది వెలువరించారు. అసంఖ్యాకంగా అనువాదాలు, విశ్లేషణలు, కాల్పనికేతర రచనలు చేశారు. కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలుః(2009) కల్హణ రాజతరంగిణి ఆధారంగా చారిత్రిక కాల్పనిక కథలు రాయడమేకాక రాజతరంగిణిని పూర్తిగా ఆంధ్రీకరించి సీరియల్ గా ప్రకటిస్తున్నారు. గత కొన్నేళ్ళుగా సంచిక అన్న అంతర్జాల వారపత్రిక నడుపుతున్నారు. వివిధ భాషల్లోని విశిష్ట రచనల రచయితల పరిచయాలు, అనువాదాలు, పదునైన నిర్మొహమాటమైన సమీక్షలు, అందిస్తున్నారు.
భారతీయ ప్రాచీన వాఙ్మయం ఆధారంగా భారతీయులకు ప్రత్యేకమైన వ్యక్తిత్వ వికాస పద్ధతులను ఆవిష్కరిస్తూ రాసిన భారతీయ వ్యక్తిత్వ వికాసం(2010); భారతీయ తత్వాన్ని సామాన్యుడికి కూడా అర్ధమయ్యే రీతిలో సరళంగా వివరించిన భారతీయ తత్వచింతన(2016); భారతీయ దృక్కోణంతో భారత ప్రథమ స్వతంత్ర సంగ్రామాన్ని విశ్లేషిస్తూ రాసిన . 1857, మనం మరవకూడని మహాయుద్ధం;(2007) కస్తూరి ముళీకృష్ణగారికి బాగా పేరు తెచ్చి పెట్టాయి. నిరంతరం సాహిత్య ప్పపంచంలో మునిగి తేలే కస్తూరి మురళీకృష్ణ వృత్తిరీత్యా రైల్వేలో పనిచేసి ఇటీవలే రిటైరయ్యారు.
అనువాదకునిగా, విశ్లేషకునిగా, వ్యాఖ్యాతగా, సృజనశీలిగా, పత్రికల్లో కాలమిస్టుగా, సంపాదకునిగా, సహసంపాదకునిగా , కథకునిగా, నవలాకారునిగా బహుముఖాలుగా పోషించిన కస్తూరి మురళీకృష్ణగారికి కథా నవలారంగంలో సురవరం ప్రతాపరెడ్జి తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం పొందుతున్నందుకు సాదరంగా అభినందనలు.
***
