మావి చిగురు తిన్న కోయిల పలుకులా, మనసున మల్లెల మాలల పరిమళంలా, గగనసీమల తేలే మేఘమాల అందించిన సందేశంలా, చల్లని రేయిలో మెలమెల్లని గాలిలో మూగే మమతలుగా, అప్సరసలు ఏతెంచిన పేరంటంలా ఉంటుంది ఆయన కవిత. ఆ కవిత ప్రతీరాత్రి వసంత రాత్రి చేయగలదు, జాబిలి కూనకి జోల పాడుతుంది. ఆ కవనం వినడానికి కోయిల ముందే కూస్తుంది, వెన్నెల విందులు చేస్తుంది. ఆ కలం మరెవరిదో కాదు… శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిది.
కృష్ణశాస్త్రిగారు తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురానికి సమీపంలోని చంద్రపాలెం గ్రామంలో నవంబర్ 1వ తేదీన 1897 సం. జన్మించారు. పిఠాపురం సంస్థానంలో ఆస్థానకవీశ్వరులు సోదరకవులుగా ప్రసిద్ధికెక్కిన సుబ్బరాయశాస్త్రులు కృష్ణశాస్త్రి గారి పెదనాన్న, తమ్మన్న శాస్త్రులు అనబడే వెంకటకృష్ణశాస్త్రి కృష్ణశాస్త్రి గారి తండ్రి. కృష్ణశాస్త్రి గారు అనువంశకరమైన ప్రతిభాపాండిత్యాలలో ఆధునిక యుగంలో తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధిపొందారు. ధీశాలిని వేంకట రత్నమ్మగారు కృష్ణశాస్త్రి సోదరి.
కృష్ణశాస్త్రిగారి తండ్రి, పెత్తండ్రులు కవీశ్వరులు కావడం వలన పండితులతోను, కవీశ్వరులతోను వారిల్లు కళకళలాడుతుండేది. విద్వద్గోష్ఠులతో మారుమోగుతూ ఉండెది. ఈ వాతావరణంలో పెరిగిన కృష్ణశాస్త్రిగారికి చిన్నతనం నుండే పండితుల, కవుల, సత్సంగమూ, సాహిత్యాభిరుచి, సాహిత్యాభినివేశమూ లభించాయి. అతని ఏడవ ఏటనే “నందనందన ఇందిరా నాథ వరద” అనే పద్యాన్ని సామర్లకోటలో ఆశువుగా చెప్పారు. పదో ఏట రామతీర్థంలో ఆశువుగా కవిత చెప్పారు.
కృష్ణశాస్త్రి 12వ ఏట వారి పెదతండ్రి, 14వ ఏట తండ్రి స్వర్గస్థులైనారు. కృష్ణశాస్త్రి వారిరువురు కవితలను క్షుణంగా పఠించారు. అందుకే ఆయన “నా కవితలో నాన్నగారి లిరికల్ ఫర్వర్, పెదనాన్నగారి జిగి వచ్చాయి” అని అంటారు.
పిఠాపురం హైస్కూలులో వారి విద్యాభ్యాసం సాగింది. పాఠశాలలో తన గురువులు కూచి నరసింహం, రఘుపతి వెంకటరత్నం ఆంగ్ల సాహిత్యంలో తనకు అభిరుచి కల్పించారని దేవులపల్లి చెప్పుకొన్నారు. 1918లో విజయనగరం వెళ్ళి డిగ్రీ పూర్తి చేసి తిరిగి పిఠాపురం చేరారు. పెద్దాపురం మిషన్ హైస్కూలులో ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు.
1920లో వైద్యంకోసం రైలులో బళ్ళారి వెళుతూండగా చుట్టూ ఉన్న పొలాల సౌందర్యానికీ, రైలు లయకూ పరవశించి “ఆకులో ఆకునై, పూవులో పూవునై” అని పలవరించారట. అది తెలుగు భావకవితా యుగంలో ఒక ముఖ్య క్షణం. ఆ విధంగా ప్రకృతి నుండి లభించిన ప్రేరణ కారణంగా “కృష్ణపక్షం కావ్యం” రూపు దిద్దుకొంది. 1929లో రవీంద్రనాధ టాగూరును కలసిన తరువాత ఆయన కవిత్వంలో భావుకత వెల్లివిరిసింది. 1945లో ఆకాశవాణిలో చేరి అనేక పాటలు, నాటికలు రచించారు. 1947 నుండి మద్రాసులో ఉంటూ సినిమాలకు పాటల, మాటల రచనను కొనసాగించారు. ఆయనకు మొట్టమొదట పేరు తీసుకొచ్చిన సినిమా “మల్లీశ్వరి”. పూలు, సెలయేరులు, ఆకులు, మేఘాలు, కొంగలు, పారిజాతాలు, వెన్నెల, అనిర్వచనీయమైన ప్రేమ, సున్నితమైన స్తుతిమెత్తని శృంగారం ఆయన సొంతం. పాట ఎంత హుందాగా ఉంటుందో అంతే గిలిగింతలూ పెడుతుంది. మనసు పొరలలో నిద్రాణమైపోయి ఉన్న మధుర స్మృతులను తట్టిలేపుతుంది. వియోగంలో మాధుర్యాన్ని, విషాదంలో సౌందర్యాన్ని అన్వేషించి దర్శించిన భావకవి కృష్ణశాస్త్రి. కవితా రచనలలోనూ, కవితా పఠనంలోనే కాదు ఆయన వేషధారణలోనూ ఆ రోజుల్లో యువతకు మార్గదర్శకులు కృష్ణశాస్త్రి గారు.
గలగల గలగల కొమ్ముల గజ్జెలు
ఖణఖణ ఖణఖణ మెళ్ళో గంటలు
ఈ చరణం వింటోంటే కళ్ళ ముందు మెడలో గంటలతో, కొమ్ములకు అటూ ఇటూ లయబద్ధముగా కదులుతున్న గంటలు, ఆ గిత్తల పరుగుకి రేగిన ధూళి, మబ్బులు నల్లగా కమ్ముకొని ఎక్కడో దూరంగా పడుతున్న వర్షం, ఆ వర్షానికి వచ్చే మట్టి వాసన,
బారులుగా కొంగలు, ఆకులు, కొమ్మలు ఎక్కడడికక్కడే స్తబ్ధుగా ఉన్నట్టు కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది.
ఇటు వంటి వాతావరణాన్ని ఆస్వాదించిన మది పురి విప్పి నటనమాడదా?
ఈ పాట వింటూ ఉంటే మనసు పల్లెటూరి వైపు పయనిస్తుంది, పకృతితో పరిహాసాలాడుతుంది.
ఆయన పాట ఆకాశవీధిలో హాయిగా తిరిగే మేఘమాలకి కూడా జాలి గుండె కలిగించి వానజల్లుగా కరిగిస్తుంది, కోతిబావకు అల్లరి మల్లికి పెళ్ళి చేస్తుంది, గాలుల తేలెడి గాఢపు మమతలతో బిగువు చూపేవారిని పిలిచి వశీకరించుకుంటాయి.
“నాకై వేచే నవ్వులు పూచే
నా చెలి కన్నుల కాచే వెన్నెల..”
అని ఆ వెన్నెలకి నెలవు ఎక్కడితో చెప్పకనే చెప్పారు కృష్ణశాస్త్రి గారు, “పక్కనా నీవుంటే… ప్రతిరాత్రి పున్నమి రా” అని వెన్నెల హాయిని చూపించారు, “నిన్ను తలచుకోనీ నా కన్ను మూసుకోనీ మోయలేని ఈ హాయిని మోయనీ”
ఆ హాయి మోయలేనిది అంటూనే, మోయని అని అనుమతి అడిగే ఆరాటం, తలచుకుంటేనే కనులలో మెదిలే రూపం, ఆ రూపాన్ని కనులలోనే బంధించాలన్న స్వార్థం ఈ పాట సొంతం.
“నీ రూపము దాచి దాచి
ఊరించుటకా స్వామీ…
నీ కన్నుల తోడు నీ కలికి నవ్వుల తోడు
నీ కోసం ఎంత వేగిపోయానో కృష్ణా”
బృందావనంలో గోపికల విరహవేదనని ఆ రోజుల్లో జయదేవుడు కళ్ళకు కనపడగా చాలా చక్కగా రాశాడు, అది సంస్కృతంలో ఉండటం చేత కొందరికి సరిగ్గా అర్ధమవ్వకపోవచ్చేమో, ఆ లోటు భర్తీ చేయడానికేనేమో కృష్ణ శాస్త్రిగారు ఆ వేదనని ఇంత చక్కగా చూపించారు ఆయన మాటలతో..
“ఏనాటిదో గాని ఆ రాధా పల్లవ పాణీ
ఏమాయెనో గాని ఆ పిల్లన గ్రోవిని విని
ఏదీ ఆ యమున
యమున హృదయమున గీతిక
ఏదీ బృందావన మిక
ఏదీ విరహ గోపిక”
కృష్ణుడు లేని బృందావనం ఎంత వెలవెలబోతుందో కదా! ఆ బృందావనం ఊహించుకుంటేనే ఒక గుబులు, బెంగ, ఆ తపనే పాటలో చూపించారు కృష్ణశాస్త్రి గారు.
“బింకాలు బిడియాలు, పొంకాలు పోడుములు, జయ మదీయ మధురగేయ చుంబిత సుందర చరణ, గురివింద పొదకింద గొరవంక పలికె, జాబిలి కూనా” ఈ పద ప్రయోగాలు తెలుగు భాషకే ఆభరణాలు.
“జిలి బిలి పడగల శేషాహి తెలిమల్లె శయ్య శయనించి
ముజ్జగములు మోహంబున తిలకింపగ.. పులకింపగ
ముజ్జగములు మోహంబున తిలకింపగ.. పులకింపగ
శ్రీ రంగ మందిర నవసుందరా పరా (కొలువైతివా రంగ సాయి)” అన్న పాట కూచిపూడి వారి సంప్రదాయ కీర్తనే అనుకుంటాము, కానీ అది రాసినది కృష్ణశాస్త్రి గారే!
“నిదుర చెదిరిందంటే నేనూరుకోనే” అన్న జాణత్వం,
“అసలే ఆనదు చూపు.. ఆ పై ఈ కన్నీరు
తీరా దయ చేసిన నీ రూపు తోచదయ్యయ్యో” అన్న శబరి బేలతత్వం… దేవలపల్లి కవిత్వం.
ఆయన తెలుగు సినిమాకి రాసిన పాటల సంఖ్య 170 కానీ అన్నీ పాటలు జనరంజకాలే, అన్నీ ఆణిముత్యాలే! తెలుగులో అధునిక సాహిత్యం క్షేత్రంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం మధుర స్వప్నంలాంటిది, మహతీ స్వరలాపనలాంటిది.
కృష్ణశాస్త్రి కవి, గేయకర్త, గేయనాటికా కర్త కూడా! వారు కృష్ణ పక్షము, ప్రవాసము, ఊర్వశి, పల్లకి అనే కవితా సంపుటాలు రాశారు. క్షీరసాగర మథనం, విప్రనారాయణ చరిత్ర, మాళవికాగ్నిమిత్ర మొదలైన యక్షగానాలు, కృష్ణాష్టమి శర్మిష్ఠ, ధనుర్దాసు, సాయుజ్యము, గుహుడు, శివక్షేత్రయాత్ర మొదలైన నాటికలు ప్రధానమైనవి.
మంచి వక్తగా, రచయితగా, భావకవులకు ప్రతినిధిగా కవిగా, గేయకారునిగా, గేయనాటికా కర్తగా తెలుగు దేశపు నాలుగు చెరగులా కీర్తి ధ్వజాన్ని ఎగురవేశారు కృష్ణశాస్త్రి గారు. కృష్ణశాస్త్రి గొంతు 1963లో అనారోగ్యకారణంగా మూగవోయింది. కాని అతని రచనా పరంపర కొనసాగింది. “నాకు ఉగాదులు లేవు ఉషస్సులు లేవు” అని ఆ సందర్భంలోనే అన్నారు. వీరికి 1975లో ఆంధ్రవిశ్వవిద్యాలయం “కళాపూర్ణ” బిరుదు ఇచ్చి సత్కరించింది.
కృష్ణశాస్త్రి భావకవితోద్యమానికి మూలస్థంభం, ప్రతినిధి. ఆంగ్లంలో కాల్పనిక(రొమాంటిక్) కవులైన షెల్లీ, కీట్సుల ప్రభావం కృష్ణశాస్త్రి గారిపై చాలా ఉంది. 1980 ప్రిబ్రవరి 24న మావి చిగురు తినే కోయిల మూగవోయింది, మల్లెల కన్నీరు మున్నీరయ్యాయి, కార్తీక రాతిరిలో కరిమబ్బు కమ్మింది, ఊర్వశి ఒంటరిదైపోయింది, చేతికి పెట్టుకొన్న గోరింటాకు రంగు ఇచ్చి పోయినట్టుగా, తన కవిత్వపు అమృతాన్ని మనకిచ్చి వెళ్ళిపోయారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. తెలుగు భాష ఉన్నంతవరకు ఆయన కవితలు, పాటలు నిలచి ఉంటాయి. ఆ పాటలు, కవితలు మనల్ని అలరింస్తొన్నంతవరకు కృష్ణశాస్త్రి గారు చిరంజీవే!