[‘తెలుగు వెలుగు పెంచు!’ అనే శీర్షికతో పద్య కవితని అందిస్తున్నారు శ్రీ మాడుగుల మురళీధరశర్మ.]
1.
ఉమా:
చక్కని సాహితీసుధర
సామృతధారనుబాలబాలికల్!
మక్కువమీరనేర్చుకొని
మాన్యతనందిసభాంతరాళమున్!
చిక్కనితెల్గువెల్గును, వ
శీకర, శ్రీకరప్రౌఢజాగృతిన్!
దక్కెడురీతిపంచగల
దైవము నీవె మహా సరస్వతీ!
2.
చం.మా:
కరమునవాణివాగ్విభవ
కామన మానస మందు నింపి, శ్రీ!
కరమగు వర్ణమాలగొని
ఖచ్చితమౌవిధినేర్పగా; వశీ!
కరమగునుక్తలేఖనము
కంఠపుటుచ్చరణమ్మువల్ల; తా
వరముగ తెల్గువెల్గి మది
భాషగ నిల్చు మహా సరస్వతీ!
3.
శార్దూలము:
ధారాపాతమువాడుతెల్గుపదముల్
తావ్రాతలోవ్రాయుచున్!
పారావారవిహారతీరపలుకుల్
భావాంశసంభూతముల్!
సారాంశాంతరవర్తనాదిచణుకుల్
సంపద్ప్రదోద్యోతముల్!
ఏరీతిన్విడకుండగా, వదలకన్
యిప్పించుమో భారతీ!
4.
మత్తేభం:
తెలగాణమ్మునతీరుతీరుపదముల్
దివ్యార్థముల్తెల్పుచున్!
కలికాలమ్మునకల్కిమాయపలుకుల్
కాల్పానికత్వధృతిన్!
పలురీతుల్పయనించిమార్పుగనునా
ప్రజ్ఞానవిజ్ఞానిధుల్!
మలి, మాలిన్యమశుధ్ధగద్యములనే
మాన్పింపుమో భారతీ!
5.
ఆ.వె.:
బాలబాలికలకు
భాషింపనేర్పుడీ!
భాష, భావ, మలర
పరిణతిగను!
తెలుగుపండితులుగ
తెలుగు వెలుగు పెంచు!
మాతృ భాష తెలుగు
మధురిమగను!
6.
తే.గీ.:
అచ్చులును, హల్లులును, దీర్ఘ,
హ్రస్వ, ప్లుతము!
సున్న,యరసున్నయు, విసర్గ
సుందరమగు!
గుణితములుననునాసిక
గొంతునలర!
భాషమర్మములరయగా
మరులుఁగురియు!
