[తాను రచిస్తున్న ‘తెలుగుబాల శతక పద్యాలు’ నుంచి కొన్ని ఆటవెలది పద్యాలను అందిస్తున్నారు శ్రీ తోకల రాజేశం. ఇది రెండవ భాగం.]
ఆ.వె.
సాగరమ్ము లోన చాల రత్నమ్ము లు
గలవటండ్రుగాని కాంచిరెవరు?
మనిషిలోని మంచి మరుగున పడరాదు
తెలిసి మెలగ వలయు తెలుగు బాల!
ఆ. వె.
పక్షిజాతిలోని బంధుత్వమును జూచి
పెంచుకొనగ వలయు ప్రేమ గుణము
కాకి బలగమనుట గమనించ లేదొకో!
తెలిసి మెలగ వలయు తెలుగు బాల!
ఆ.వె.
చీకటింటిలోని చిన్న దీపము వోలె
జీవితాన వెలుగు చిలకరించు
విద్య గూర్చు హితము వివరింప లేమయా!
తెలిసి మెలగ వలయు తెలుగు బాల!
ఆ.వె.
మట్టి చేత బిసికి పట్టెడన్నము జేసి
కన్న వారి వోలె కడుపు నింపు
రైతుకన్న మించు ఘనుడెవ్వడీధర!
తెలిసి మెలగ వలయు తెలుగు బాల!
ఆ. వె.
గంగనీటి మీది బంగారు పడవైన
తీరమందుకోదు తెడ్డు లేక
‘ఎరుక’లేక బతుకునురికింప లేమయా!
తెలిసి మెలగ వలయు తెలుగు బాల!
ఆ. వె.
చదువు వలన మనిషి సంస్కారమును నేర్చి
సాయ పడగ వలయు సంఘమునకు
చదువు లోని సారమిది కదా తెలియగా!
తెలిసి మెలగ వలయు తెలుగు బాల!
ఆ. వె.
కష్టసుఖములొక్క కైవడి భావించి
ముందు నడుచు వాడె పొందు జయము
ఎల్లవేళ తీపినొల్లునే నీ జిహ్వ?
తెలిసి మెలగ వలయు తెలుగు బాల!
