[కృత్తివాస తీర్థులు గారు వ్రాసిన ఈ వ్యాసం 1936 నాటి ఆంధ్రభూమి పత్రికలో ప్రచురితమైంది. అలనాటి ఈ వ్యాసాన్ని ప్రత్యేక వ్యాసంగా పాఠకులకు అందిస్తున్నాము.]
మన తెలుగుతల్లి నేటికి కధలు వ్రాయడం కూడా ఒక కళ అని తెలుసుకొన్నది. కధ సారస్వతంలో ఒక శాఖ క్రింద పరిణమించినది. కధ వ్రాయడమే కాకుండా చెప్పడం కూడా కళే. అసలు కధలంటే కధ్ = చెప్పు (వ్యక్తాయాం, వాచి) అ నే దాని మీద నుంచి వచ్చింది. కధలు వ్రాసేవారు తెనుగులో లెక్కకు మిక్కుటంగా వున్నారు. వారిలో చక్కగా వ్రాసే వారి సంఖ్య అల్పము, ఈ కధల్లో జాతి జీవనము, సంఘజీవనము, ప్రేమ, మానవ హృదయమ, దేశభక్తి మొదలైన విషయాలు ఉంటున్నవి. చక్కగా వ్రాసేవారి రచనలలో పరువమూ మెత్తదనమూ వున్నవి. ముఖ్యంగా కధల్లో అమృతమువంటి సజీవమైన వ్యవహారికాంధ్రము ఉపయోగింపబడుతూనే వుంది.
ఇక రెండో విషయం, అనుకరణాలు, అనువాదాలు, ఛాయల బాపతు. ఒక మంచి కధ ఎవరైనా వ్రాసివుంటే ఆ కధనే వస్తువుగా గ్రహించి, కించిత్తు మార్పులతోనో లేకపోతే ఆ విషయాన్ని తీసుకుని ఫొటోలు తీసినట్టు కధలు వ్రాస్తారు కొందరు. అలాగ కొన్ని వందలూ వేలూ వున్నాయి కధల సరకు. అంతా చెత్త. భాషకు గాని భావోన్నతికిగాని రవ్వంత కూడా తోడ్పడకుండా వుంటున్నాయి. ఆ చెత్త కథల్లో విషయం ఉదాత్తం కాదు, వ్యక్తీకరణలో కుంటూ, ట్రీట్మెంటులో చేతకానితనం వుంటున్నాయి. కొన్ని కధల్లో అ సందర్భంగా అర్థయుక్తము కాని మోటుహాస్యం ఉపయోగింపబడుతూ వున్నది. హాస్యం నర్మగర్భంగా పెద్దమనిషి తరహాగా ఉండాలి. ఇప్పుడు ప్రతివారికీ బూతులో హాస్యం కనిపించింది. ఆశ్చర్యం! హాస్యరసప్రధానాలైన కధల్లో మోటుహాస్యం కనపడుతూవుంది. అటువంటి రచన సంఘజీవనానికి సంఘాభ్యుదయానికీ ఏమీ తోడ్పడదు. కధల్లో వెర్రిగా ప్రబంధాలును మించిపోయి వచ్చి శృంగారం
అసభ్యతతో, అనౌచితితో ఉంటూవున్నది. ఇలాటి తుక్కు కధలు హాస్యపు పత్రికలనే పేరుతో ప్రకటింపబడే వాటిల్లో దిగుమతి అవుతాయి. స్వారస్య నిర్మాయకులు ఎవ్వరూ వీటిని అభిమానించరు, ఆదరించరు. పాడురకపు కధల మాట అలావుంచి మంచివాటి విషయం జాగ్రత్తగా విమర్శనాదృష్టితో పరిశీలన చేద్దాం.
చింతా దీక్షితులు:
నేటి కధకులలో శ్రీ చింతా దీక్షితులు గారు ఉత్తమశ్రేణికి చెందినవారు. వీరి కధలు సాహితీపత్రికాముఖంగా ఆంధ్రలోకానికి అందచేశారు. కధలలో మార్దవం సహజత్వం కనిపిస్తుంది. బాలుర మానసిక ప్రవృత్తులు ఎంతో రమ్యంగా చిత్రించగల ఎదురుతిరిగిన అనుభవంగల చెయ్యి. ఎక్సుప్రెషన్ చాలా క్లుప్తంగా చక్కగా అర్థవంతంగా నాజూకుగా వుంటుంది. సహృదయుల హృదయాలను వీరి కధలు చూరగొంటాయి. ‘ఏకాదశి’ అనే పదకొండు కధలు పుస్తకరూపంలో వేశారు. ప్రతి కధా కూడా ఒక కళాఖండమన్నమాట. శివశింకరశాస్త్రిగారు అన్నట్లు వీరు నిజంగా ‘కధక చక్రవర్తు’లు, ప్రతి కధ కూడా ఒక ప్రత్యేక సాధన వంటిది. దీక్షితులు గారు వ్యుత్పన్నుడు. ఆంధ్రవాఙ్మయంలో వీరికి మంచి స్థానం వున్నది. ‘తాటివనంలో’, ‘చెంచు దంపతులు’ అనే రెండు అద్భుతమైన రచనలు అద్భుతమైన వారి కృషి. ‘సఖి’ ఆ పంట నోచుకొన్నది. ఆంధ్ర పఠితలు చాలామంది ఆనందించారు. వీరు చాలా కధలు వ్రాశారు. అముద్రితాలు చాలా వున్నాయి.
మొక్కపాటి నరసింహశాస్త్రి:
ఉత్తమ శ్రేణిలో చెందినవారు, ఆంధ్రులకు హాస్యరసభరితమైన నవలను, కధలనూ వ్రాయడంవల్ల చిరపరిచితులైనారు శ్రీ మొక్కటిపాటి నరసింహశాస్త్రి గారు. వీరి ‘బారిష్టరు పార్వతీశం’ ఒక ప్రత్యేక వ్యక్తి ఆంధ్రులలో. అందరికీ నవ్వు పుట్టిస్తూ వుంటాడు. వీరు కధలు అసంఖ్యాకములు వ్రాయకపోయినా వ్రాసిన కొద్దీ కూడా చాలా విలువైనవి. కధలు వ్రాయడంలో దక్షత గోచరిస్తుంది. మానసిక ప్రవృత్తిని చక్కని తూలికతో కథలలో చిత్రిస్తారు. అయితే అక్కడక్కడ వర్ణనలు సందర్భశుద్ధితో వున్నా, కొంత ప్రాచీనంగా కనబడతాయి. సఖి పత్రికాముఖంగా ‘చిత్తరువు’, ‘శిల్పిద్వయం’ ఆంధ్రులకు అందినవి. కధానకములను ప్రతిబింబములనే పేరుతో ముద్రించారు. అన్ని కథలూ ఒకసారి చదివిన తరువాత మళ్ళీ చదువవలెనని అనిపిస్తుంది. శైలి మనోహరంగా వుంటుంది. చిన్న పిల్లలు చదువుకున్నా అర్థమయ్యే తేట తెలుగులో వుంటుంది రచన. వారి నవలలు రెండూ ఇందుకు ఉదాహరణ (పార్వతీశం, ఏకోదరులు). రసవ్య క్తీకరణ బాగా చేయగలరు, ఏకోదరులు అనే పెద్ద కధలో (నవల అని నేను అనను దాన్ని) కరుణరసము చక్కగా వ్యక్తీకరించి పోషించారు. పాత్రపోషణ బాగావుంది. వీరి రచనలవల్ల కొంత నవీన ప్రాచీన సంప్రదాయాలను అనుసరిస్తారని తోస్తుంది. హిందూ మతం మీద విశ్వాసం దృఢంగా కనపడుతుంది. సంఘసంస్కారమంటే కొంచెం వప్పుకోనట్టు కనపడుతుంది. భారతిలో ముద్రితమైన ‘న్యాయం’, ‘రంగగ్రామసింహరత్తయ్య’ అనే కధలు వీరి అద్భుత ఉపజ్ఞకు ఫలితాలు, ‘న్యాయం’ అనే కధ వల్ల సామాన్య దరిద్రుణ్ణి ధనవంతుడు ఎలా నీచంగా చూస్తాడో, ధనవంతుడి మాటనే లోకం విశ్వసిస్తుంది. కాని బీదవాడి మాట లెక్క చెయ్యదనీ, న్యాయం అనే పేరుతో జరిగేదంతా అన్యాయమనీ, జాతివివక్షత వుంటున్నదనీ మొదలైన విషయాలన్నీ ద్యోతకమవుతాయి. రచనలో వైవిధ్యం వుండి ఆనందం కల్గిస్తుంది మన హృదయాలకు.
గుడిపాటి వెంకటచలము:
గుడిపాటి వెంకటాచలంగారు చాలా కధానకములు, నవలలు, నాటకములు వ్యాసములు సంఘమరమ్మతు కోసం వ్రాశారు. వీరి ఆశయాలు చాలా విపరీతంగా; మామూలుగా వుండే జనులకు కొంచెం తీవ్రంగా, తుపాకీ షాట్ లాగ చురుకుగా వుంటాయి. ఈయన వక ప్రత్యేక వ్యక్తి. అంతా హేతువాదం
మీద వుంటుంది ఈయన రచన. అందులో వకీలు కావడం వల్ల మరీ ఎక్కువ ఈ హేతువాదం. సెక్సుప్రోబ్లెం గూర్చి ప్రత్యేకంగా చదివి కొంత లోకానుభవం వల్ల, కొంత స్వానుభవంవల్ల ఈ చెప్పబోయే విషయాలను కధ రూపేణా వ్యక్తీకరిస్తారు. మన సంఘంలో స్త్రీలను ఎలా బానిసలు వలె నీచంగా చూస్తారో, మనం అనుకొనే పతివ్రతలు పతివ్రతలు కారని, ప్రాచీన సంప్రదాయాలు వినవద్దనీ, సంఘంలో వెర్రినమ్మకాలూ ఆచారాలూ చచ్చుమతం, పురుషుడికి వక నీతీ స్త్రీకి వక నీతీ ఏర్పాటు చేసిన చచ్చు నాయనమ్మసంఘం, వివాహం గూర్చిన అభిప్రాయం, స్త్రీ స్వేచ్ఛ, వివాహం జన్మాంతర సంబంధమూ, ఐహికాముష్మికాల కోసం ధర్మచరణకనీ పవిత్రమనీ అన్న అభిప్రాయం కాదని, మనం అనుకొనే నీతికి అసలు నీతికీ వ్యత్యాసం – ఈ విషయాలన్నీ వారు హేతువాద రీత్యా కధలలో వెలువరించారు. ‘కన్నీటి కాల్వ’, ‘దైవమిచ్చిన భార్య’ ‘మా కర్మం ఇలా కాలింది’, ‘శశిరేఖ’ మొదలైనవందరూ చూచే వుంటారు. కధలు చాలా సెన్సేషనల్‌గా వుంటాయి. బలహీనుడి హృదయాన్ని వెంటనే లొంగదీసుకొంటాయి. కధలలో కొంత వైపరీత్యము, అనౌచితి, అసందర్భము కూడా కనపడుతుంది. ‘ఆడాళ్ళగుట్టు బయట పడవేసి’ దాహం తీరకుండా అమూలాగ్రం ప్రబంధకారుడిలా వర్ణిస్తారు. ఆర్టు కన్సీల్సు ఇన్ అర్టు. కళ నగ్నరూపంగా వుంటేనే కళ అవుతుంది. అంతేకాని నగ్నత పోయాక జుగుప్స కలుగుతుంది. అయితే వర్ణనలన్నీ కళ్ళకు కట్టినట్లు వుంటాయి. కధ నడపడంలో నేర్పువున్నది. భాష కొంచెం వక్రగతికి పోతూవుంటుంది. శైలి సరళం, ధారాళంగా వుంటుంది.
మునిమాణిక్యం నరసింహారావు:
మునిమాణిక్యం నరసింహారావుగారి పేరు అందరికీ తెలిసే వుంటుంది. సంసారిక కధలను అద్భుతంగా వ్రాస్తారు. కధలలో నర్మహాస్యం వుంటుంది. ‘వినోదిని, సాహితీ, సఖి’ మొదలైన చాలా పత్రికలలో వీరి కధలను చూస్తూ వుంటాము, ఒకరిలాగన్నారు: ‘మీ కధలు నన్ను గార్హ్యాసాసాభిముఖం చేస్తున్నాయి’ అని. అంతేచాలు వీరిని గూర్చి చెప్పడానికి. ‘కాంతం కథలు’, ‘నేనూ మా కాంతం’ వీరి ఉపజ్ఞకు ఫలితాలు, ‘కాంతం’ సామాన్య ఆంధ్రుల ఇళ్ళలో వుంటూనే వుంటుంది. కాంతాన్ని చక్కగా పోషించారు మునిమాణిక్యంగారు. ఎలాగయితేనేం కాంతం కాటుక్కాయ కావ్యగోష్ఠిలోకి వచ్చింది.
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి:
శ్రీపాద సుబ్ర్మణ్యశాస్త్రిగారు ప్రబుద్ధాంధ్ర పత్రికా సంపాదకులు. రాష్ట్ర భక్తి, జాత్యాభిమానం కలవారు. భావదాస్యానికి ఏమీ వప్పుకోని ప్రత్యేక వ్యక్తులు. గొప్ప కధకులు, వీరి కధలు సంఘజీవనాన్ని ముఖ్యంగా ఆంధ్రదేశీయుల ఆచారవ్యవహారాదులు చక్కగా చిత్రిస్తాయి, ‘యావజ్జీవం హేష్యామి’, ‘కన్యా కాలేయత్నాద్వరితా’ వీరి ప్రత్యేక కృషి. భాష కోనసీమ తెలుగు. కొంచమెక్కువ యాస కనపడుతుంది. గుణవిషయం అయ్యాక అవగుణాలు కూడా చూతాం.
ఇప్పుడిప్పుడు వ్రాసే కధలు నిండా సంభాషణ. సంభాషణకు కొన్ని హద్దులు, అవసరాలూ వున్నాయి. అది వారు గమనించి సంభాషణ నడిపించాలి. అయితే సంభాషణ నడిపించడంలో వీరికి పెట్టిన పేరు, రచనలో వైవిధ్యం లేదు. ఎంతసేపటికీ తెలుగుదేశపు వితంతువు – ఎవడో దానిమీద కన్ను వేసిన పెద్ద మనిషి – మధ్య పిట్టగోడ – ఇక కధ నడుస్తుంది. ఫొటోగ్రాఫులు తీసినట్లు కొన్ని పుంజీలు కధలు వ్రాశారు, వెరైటీ లేకుండా. ‘పూలదండ’ మొదలైనవి చూడండి. వాసన చూడండి. వీరు నేరేషన్ కూడా ఉంచి వీలయినంతవరకు సంభాషణ తగ్గించి, ప్రొపోర్షన్ ఆలోచించి చూచుకొని మరీ కధలు వ్రాయాలి. వెరైటీ ఉండి తీరాలి. లేకపోతే అస్తమానం ‘వితంతువు’ కధావస్తువైతే తలనొప్పి వేస్తుంది. అందువల్ల ఈ విషయాలు వారు గమనించి చక్కగా కథలు వ్రాస్తే నయం. అలా వ్రాయాలని మా అందరి కోరిక.
కవికొండల వెంకటరావు:
ఇక కవికొండలవారు ‘ఉదయిని’లో వ్రాసిన కధ చక్కగా వుంది. వీరు తమ రచనలో మానవుల నిరాడంబర జీవితము, కర్షకులు, గ్రామజీవనము చక్కగా చిత్రిస్తారు.
వేలూరి శివరామశాస్త్రి:
వేలూరి శివరామశాస్త్రిగారు వ్యుత్పన్నులు, కధకులు, పండితులు, వీరి రచనలో వెరైటీ ఎక్కువగా కనిపిస్తుంది. వాడుక భాషకు దగ్గరగా వున్న గ్రాంథికంలో వ్రాస్తారు. కధలు బాగా వ్రాస్తారు, ‘ఓబయ్య’, ‘పిత్తల్ కా దర్వాజా’ మొదలైనవి అంతా చదివే వుంటారు.
తాత కృష్ణమూర్తి:
తాత కృష్ణమూర్తిగారు సంసారిక కధలు వ్రాస్తారు. ముద్దుమూటలు కడుతూ వుంటాయి. ‘రామప్రియ’ అనే పుస్తకం రచించారు.
ఇంకా కొంతమంది:
వెంపటి నాగభూషణంగారు, మల్లాది రామకృష్ణశాస్త్రిగారు కూడా ఒక మాదిరి మంచి కథలు వ్రాస్తారు.
స్త్రీలలో వ్రాసేవారు ఎక్కువమంది లేరు, కనుపర్తి వరలక్ష్మమ్మగారు నానా విషయాల మీద మెళుకువతో బుద్ధికుశలతతో సంఘానికి పనికివచ్చే కధలు వ్రాశారు. గుమ్మిడిదల దుర్గాబాయిగారు కధలు వ్రాస్తారు కానీ అంతా హిందీ నుంచి రవాణా.
ఇంకా కొంతమంది ఒక మాదిరి కధలు వ్రాస్తారు. వారిలో పూడిపెద్ది వెంకటరమణయ్య, చిరుమామిళ్ళ శివరామకృష్ణప్రసాద్, కొడవటిగంటి కుటుంబరావు, బొడ్డు బాపిరాజు, ‘గిరి’, కృత్తివాస తీర్థులు, వజ్ఝల కాళిదాసు, గూడూరి చలం, మల్లాది వెంకటకృష్ణశర్మ, మల్లాది అవధాని, టేకుమళ్ళ కామేశ్వర్రావు, జనమంచి కామేశ్వర్రావు, ముద్దా విశ్వనాధం, కలగ సత్యనారాయణ, పురాణం కుమారరాఘవశాస్త్రి, కాళూరి రామారావు, క. గోపాలరావు, కపిల కాశీపతి, మొదలి మబ్రహ్మణ్యశర్మ, మొదలి సీతారామస్వామి, రఘుపతిరావు, ఆచంట సూర్యనారాయణ మూర్తి, సాంబమూర్తి, పమ్మి రామశాస్త్రి, ఇంద్రగంటివారు, కాంచనపల్లి రంగరావు, జానకీరామచౌదరి గార్లు కలరు.
మరొక విషయం. నీతిబాహ్యమై సంఘ దౌర్బల్యమునకు తోడ్పడే అసభ్యతతో కూడిన కధలు వ్రాయకూడదు. ఉన్నత భావములతో లక్ష్యశుద్ధితో చమత్కృతితో కధలు వ్రాస్తే సారస్వతములో స్థిరంగా వుంటాయి. ప్రయోజనములేని కధలు వ్రాసి నిష్ప్రయోజనం. సారస్వత సేవ చేయడానికి గద్యపద్యాదులతోపాటు కధలు కూడా చక్కగా రాయాలని రచయితలను కోరుతాం.
కృత్తివాస తీర్థులు

