Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-17

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]


~

161.
విధి వ్రాత భరంబుల దప్పించుకొనువాడిలను గలడే;
నద్దాని దప్పింప గల వాడొక్కడే, వాడు నీ సఖుడు
పెదవుల బిగించి, ఎడద నుక్కుగ జేసి వీపు దృఢంబుగనుంచు
విధి యతండు చాకి, నీవతని గాడిద – మంకుతిమ్మ!

162.
టగరుల రెంటినిన్ బెంచి, మదింప జేసి పురిగొల్పి
జగడంబు జేయించి, దైవ సృష్టియని పేరిడి
నగుచు తిలకించు ఆ బమ్మ విర్ర
వీగకు నీవహంకరించి – మంకుతిమ్మ!

163.
మానవ చరితంబిది యవిచ్ఛిన్న ప్రవాహము; సాగు
చున్నది కర్మ ఋణశేషముల తనలోన నింపుకొనుచు
తానిచ్ఛ వచ్చినట్లు; పౌరుష పరాక్రమాల దీని కట్టడి జేయవలె
ఏనుగునకు అంకుశంబు పగిది – మంకుతిమ్మ!

164.
పురాతనమైనవే ధరయును గిరియున్, ఈ రెంటిపై
కురియు వర్షము సనాతనముగ జేయవే నదీ తటాక సలిలంబుల
పురాతన కర్మమది సనాతనము చేత కోతకు గురియగు గాదె
పురుష యత్నమది నవీనమగు గాదె – మంకుతిమ్మ!

165.
వర్షము చేత జలాశయము అన్నియు క్రొత్తరూపు సంతరించుకొన్నను
పూర్వపు వాసనల నవి పోద్రోలగలవె; జన్మస్థాన
గిరి ధరల వాసనల మరచి పోగలవే, క్రొత్తవవి
మరల పాతబడవె – మంకుతిమ్మ!

166.
పురుగు నశించు తానది పుట్టిననాడె; నేల క్షయమై
కరగి కడలిం జేరి, తేలు నింకొక చోట ద్వీపమై,
తరుగు నొక చోట, పెరుగు నింకొక చోట
విరుగు తెలియనిదీ విశ్వము మంకుతిమ్మ!

167.
నియమమున్నది భూభ్రమణ, సూర్యచంద్ర గతుల, ఋతు మార్పులకు
నియమమున్నది నరుని కర్మ ప్రవృత్తికిని
నియమములు లేనివి ప్రకృతి వైపరీత్యములు, గ్రహణంబులును
నియమానియమాను వర్తనమే జీవనము – మంకుతిమ్మ!

168.
అనుబంధమున్నది జీవజీవములకు పురాకృతము చేత
మనసులోని రాగద్వేషవాసనాది విషయంబుల చేత
తనుకాంతి, మోహ విభ్రాంతులన్నియు వాటి వాసనలే, అంతము
లేని యనుబంధములే యన్నియును – మంకుతిమ్మ!

169.
పూర్వార్జిత మిదియని, ఋణంపు మూటను మోపించి
కర్మానుపాశంబుల దాని నీ మెడకు బిగించి కట్టి,
మార్దవంబుగ నడిపింప నీ మూతికి కసపు వాసన జూపించి
గార్దవంబుగ నిన్నా విధి – మంకుతిమ్మ!

170.
కుడుచునది, యుడుపుల్ గట్టునది, పడరానిపాట్లు
పడు నీ ఋణంబు లన్నియు పూర్వ సంచితంబులు
వీడవు, లలాట లిఖితంబు లివి, వీటినిన్ చదివిన వారలెవ్వరు?
తుడుపున దెవ్వరీ వ్రాతల – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

Exit mobile version