Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-23

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]


~
221.
ఒక అర నిమిష యానుభవము మనసుల కరగించు, పరి
పక్వ మొనరించు నయ్యది జీవరసంబుల; తాప
ప్రకోపంబు, శాంత ప్రవృత్తి, – మయ్యవి ఆత్మ
సంస్కారంబులు – వీటిని కాదనదగునె – మంకుతిమ్మ!

222.
అదేదో మంచిదని, యదేదో సొగసైనదని
పల్దిక్కులకున్ వెదకి కొంచు బోవు నీ జీవి,
ఏ దారియు గానకుండిన వేళ అంతరంగ ప్రవృత్తి దారి మళ్ళించి
అదుపున నుంచు గాదె – మంకుతిమ్మ!

223.
తన యజమాని ఎక్కడి కేగెనంచు యా
తని యడుగు వాసనల బసికట్టు శునకంబు రీతి,
పనివడి పరమాత్మ తత్త్యము దెలియ నటునిటు
మనం తిరుగ జేయడే శివుడు – మంకుతిమ్మ!

224.
అది కావలె, నిది కావలె, మరొక్కటి కావలె నంచును
వెదకబోదుము పలు చోట్ల సుఖము కొరకు; మరి
యది దాగియున్నది పదిలంబుగ మన
హృదయాంతరాళముననేయని తెలియక – మంకుతిమ్మ!

225.
పరగ జలనిధిలోని వస్తువులన్ చెరగి జాలించి, జాలించి
వేరుచేయు యలల రీతి; విశ్వసత్త్వపు లహరి,
కరము అంతరంగ బహిరంగంబుల కదిపి కదిపి
పారుచుండు మనలోన – మంకుతిమ్మ!

226.
అనుక్షణము లోనికి బయటికి బోయివచ్చుచు
అనిలము జీవికి నూతనోత్సాహ మిచ్చునట్లు
మనుజుడీ జగతికి తన సేవల నిచ్చు పగిది
యనవరతము ప్రోత్సహించు యా దివ్యశక్తి – మంకుతిమ్మ!

227.
నూత్నత, పరిపూర్ణత నన్యోన్యతల పొందు
యత్నమే పురుష కార్యము, యదియె ప్రకృతి
విజ్ఞాన శాస్త్ర కళ, కావ్య విద్యలెల్ల
ధన్యతను పొందు ప్రయత్నములే – మంకుతిమ్మ!

228.
ధీయుక్తి, శక్తి సత్యార్థముల నన్వేషింప జేయు
ప్రయత్నమే నిజమైన పురుష కార్యము; కించి ద్వి
జయమ్ములవి నరుడు సాంధించిన మత, నీతి శాస్త్ర
రాజ్య సంధానంబులు – మంకుతిమ్మ!

229.
అలయక సొలయక నిరతము పడి లేచి చలించు
యలల రీతి ప్రవహించు పురుష చైతన్యలహరి
తెలియదు దానికి నిలకడ, విడువదది దాని
చలనగతి, పరమేష్ఠి నుయ్యల యది – మంకుతిమ్మ!

230.
జీవ చైతన్యమది యలయై యుప్పొంగు మనయందు
దైవ సత్త్వమది నిండుగ మనయందున్నతరి; విధి ఎదురైన
జీవసత్యమది క్రుంగు; పొంగు క్రుంగుల ననుసరించి
జన చైతన్య నది సాగిపోవలె మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

Exit mobile version