[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]
~
321.
భూనభోమండలముల పరిధికి మించిన జీవన పరి
పూర్ణ దర్శన మొకటున్నది యాహింపింపగా దేవ
మానవ పశుపక్షి సంఘంబు లెల్ల నర్తించునచట
మనోనేత్రాన దర్శింపు మా చిత్రమును – మంకుతిమ్మ!
322.
ఆ విశ్వరూప సందర్శనమునకు చెందియున్నవి
జీవ నిర్జీవములు క్రమానుగత యాదృచ్ఛిక
అవశ్య వశ్య స్వాచ్ఛంద్య నిర్బంధములు
కైవల్య దృష్టి యది – మంకుతిమ్మ!
323.
సార సుఖ రసనిధియై యా పరబ్రహ్మ యుండగా
స్వారస్యహీన మీ జీవనమనదగునే నెవరికైన
పౌరుష ప్రేమ సౌందర్యంబులును యంతియే – దాని దెలియు
స్వారస్యమది రహస్యము – మంకుతిమ్మ!
324.
ఏది సత్యమైనను, యదేమి యసత్యమైనను, ‘నే’ నను
నది యనుభవైక వేద్యము, యయ్యాత్మకు సరి
కాదు చెఱుపు సేయ నెవ్వరికేని
సదా ధ్యానింపు మాత్మగతిని – మంకుతిమ్మ!
325
మర యంత్రంబుల నెన్నింటినో బడి, ఎన్నో మిశ్రణాల
మరెన్నో యాది భూతాల గలసి పరిపక్వమొంది
పరిపరి విధముల పరిణతి చెందిన ఈ
నరుడు నేడధివసించె సృష్టి శిఖరాగ్రాన – మంకుతిమ్మ!
326.
ఊరక నుండ నోపక తనకొక ఆడ జోడునున్
సరియొనరించుకొని మాయాంగనన్ గలసి
మరియొక జగజ్జాలంబున విహరించుచున్న
పరమాత్ముడి బొమ్మలాట యిది తెలియర – మంకుతిమ్మ!
327.
లోకము నడుచు తీరెట్లనిన, మూడు ముక్కల యాట పగిది,
ఒకరు కాదు మువ్వురు, దైవ పురుష పూర్వజన్మ వాసనలు,
ముక్కలు చెదరగ మరల కలుపుచు నాడుచుందురు – పేక
ముక్కలే మనమందరము – మంకుతిమ్మ!
328.
పేకముక్కల నన్నింట సరికట్టియుంచు సృష్టి, ఏ
పేక లెవరి చేత జిక్కునో ఎవరికెరుక? ఏ
పేక ముక్క ఏ దిక్కున జేరునో, ఎవ్వడికుపయోగపడునో? తెలి
యక సతమతమై పోవుటే మన వంతు – మంకుతిమ్మ!
329.
ఆద్యంతములే లేక నడచి పోవుచున్నదీ యాట నిలువక
అందే గడచి పోవుచున్నవి మన జన్మము లన్నియున్
ఇందు గెలుపెవ్వరికో, ఓటమి ఎవ్వరికో, లెక్కలు తేల్చుటెప్పుడో
ఇందు ఆడిన యాటయే లాభము – మంకుతిమ్మ!
330.
ఇక ఫలిత మదేమి నీ యాటకనిన, కౌతుక రుచియే ఫలితము
పేక ముక్క యది క్రిందబడకున్న యాట సాగునే? మరల
ఇక గెలుపెవరిది, ఓటమి ఎవరిదని యడుగట వ్యర్థము; విడు
వక కొనసాగవలయు నియ్యాట – మంకుతిమ్మ!
(ఇంకా ఉంది)
శ్రీ కల్లూరు జానకిరామరావు రచయిత అనువాదకులు. వీరి తండ్రి కీ.శే. కల్లూరు అహోబళరావు ప్రముఖ కవి, బహు గ్రంథకర్త. కృష్ణదేవరాయ గ్రంథమాల వ్యవస్థాపకులు. తల్లి కీ.శే. సీతమ్మ గారు.
జానకి రామరావు గారి భార్య కీ.శే. సుభద్రమ్మ. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.
వీరి పుట్టిన తేదీ: 23(15) జూలై 1941. విద్యార్హత: B.A.Bed, M.A.( English)
హిందూపురం ఎంజీఎం హైస్కూల్లో 1964 నుండి 1990 వరకు 26 ఏళ్లు ఉపాధ్యాయుడిగానూ, 1990 నుండి 1999 వరకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు.
ప్రస్తుత నివాసం బెంగుళూరు. ఫోన్: 9740849084