[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]
~
391.
అది తాడె; కాదది పాము; కాని
యది కన్పడు సర్పంబు పగిది, మసక చీకటిలోన
యద్దాని జాడ బెదరు ఎడద, చెమటల్పట్టుట తథ్యము
గదా! యరసి చూడ జగమును నింతియె – మంకుతిమ్మ!
392.
సౌందర్య బాంధవ్యంబులు సరికాదన దగునే; యయ్యవి
పొందొనరించి సంధింపవే ప్రాణిసంఘంబుల; ప్రవాహము
నందు మునిగి తేలుచుండ, యొకరి కొకరు చేయూత నొసగి
ఆదుకొనరె తనవారిని – మంకుతిమ్మ!
393.
జనుల వికారంపు పరిణామంబు లన్నియున్ మన
మనో ఫలకంబులపై ప్రతిబింబించు; సత్యమిది
అనుభవంబున మనకవగతంబగు సత్యదర్శనము
అనుభవమే సత్యము – మంకుతిమ్మ!
394.
కల్లలు కావు కలలు; మన యనుభవంబులున్ కావు
కల్లలు; లో దాగి యాశల రేకెత్తించి నాట్యమాడించు ఆ విరులును
కల్లలు కావు; కలలును యనుభవంబులును సత్యంబులే
తెలియంగావలె – మంకుతిమ్మ!
395.
మన గణనకు చిక్కదీ జీవనంపు సంపూర్ణ సత్యము;
స్థాన మియ్యది, ప్రేమానురాగంబుల ప్రతిరూపము
అన్నింటను నిండి, అంబరపు సరిహద్దులు మీరిన, శంభుని
తానమియ్యది – మంకుతిమ్మ!
396.
కల్మషపూరిత వల్మీక మీ దేహమని చూడకు హీనంబుగ,
బ్రహ్మపురిదని వక్కాణించిరి ఋషిగణము,
దమ్మున్న యశ్వము నిమ్ముగ గాచి కళ్లెమేయుటే నీ పని
సుమ్ము, గురి చేరుటే నీ పని – మంకుతిమ్మ!
397.
దేహమిది హయము; దాని నారోహించు నాత్మ,
వాహనము నుపవసింప జేసిన సాగునే నడక!
రోహి యలసించిన సాగునే యాత్ర సుఖంబుగ
స్నేహముచితము రెండింటికి – మంకుతిమ్మ!
398.
ఉన్నంత వరకే మన జీవనము సత్యము; మనకేల
దాని వివరణా భారంబు; యద్దాని పొంది, శక్తియుక్తుల
ఇనుమడింప జేసికొనుటయె పురుషార్థము; యదియె
ఉన్నతము మనకు – మంకుతిమ్మ!
399.
కాయమాత్మల చేతనే కొనసాగుట లేదీ జీవయాత్ర
ఇయ్యవి రెండునుంగలసి యొకటైననే సాగునీ యాత్ర
కాయము నీయది, జననమిచ్చిన యతివ నీదు యాత్మ
నయము తోడ రెండింటిని సంధించు – మంకుతిమ్మ!
400.
దృశ్యము లన్నియున్ నశ్వరంబులే, కావవి శాశ్వతంబు; సా
దృశ్యంబుగ నున్న వాటిపై దృష్టి సారించుటే మన కార్యము
విశ్యానుభవమే విశ్వాత్మానుభవంబునకు మార్గ మరయ
నశ్వరంబు నుండియె వినశ్యము సాధ్యము – మంకుతిమ్మ!
(ఇంకా ఉంది)
శ్రీ కల్లూరు జానకిరామరావు రచయిత అనువాదకులు. వీరి తండ్రి కీ.శే. కల్లూరు అహోబళరావు ప్రముఖ కవి, బహు గ్రంథకర్త. కృష్ణదేవరాయ గ్రంథమాల వ్యవస్థాపకులు. తల్లి కీ.శే. సీతమ్మ గారు.
జానకి రామరావు గారి భార్య కీ.శే. సుభద్రమ్మ. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.
వీరి పుట్టిన తేదీ: 23(15) జూలై 1941. విద్యార్హత: B.A.Bed, M.A.( English)
హిందూపురం ఎంజీఎం హైస్కూల్లో 1964 నుండి 1990 వరకు 26 ఏళ్లు ఉపాధ్యాయుడిగానూ, 1990 నుండి 1999 వరకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు.
ప్రస్తుత నివాసం బెంగుళూరు. ఫోన్: 9740849084