Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-44

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

~

431.
జలాశయంబుల మునిగి తేలు తరి, అలల
వలయంబులవి తీరంబును జేరు; నయ్య
లల పగిది నీ యాత్మయు నెల్లడల పయనించి
కలయ వలయు జగపు తీరంబుల – మంకుతిమ్మ!

432.
స్వార్థ సుఖంబది యల్పము, క్షణిక మశాశ్వతము
ఆత్మ విస్తారంపు సుఖమే నిత్యసుఖము; సమిష్టి ని
స్వార్థ సుఖం బిచ్చు సుఖమే నిజమైనది; యందర
జతగూడి జీవింపుము – మంకుతిమ్మ!

433.
నగవు లేడ్పులు రెండును హృదయ కవాటంబులే,
నగవు లేడ్పులు లేని కఠిన శిలామూర్తివే నీవు!
నగవు లేడ్పులే ఎడదలోని భావంబుల వ్యక్తీకరించు సులభ
మార్గంబులు – మంకుతిమ్మ!

434.
నగవు లేడ్పులు రెండును రసపాకంబులే,
నగవు పరిమళంబు గుప్పించు విరి; ఎన్నగా లోని
వేగంపు నుద్వేగంబును చిమ్ము వగపు: తోషమును పంచు
నగవు; రెంటినిన్ యనుభవించు – మంకుతిమ్మ!

435.
మనసు చలించు రమణీయమైన దాని గనినంతనే,
దాని, తనదిగ జేసికొన కాతర జెంది చలించి వికారమగు;
ఘనతర భీమబలంబున్నును, సాహసించక, రామప్రవృత్తి గలిగి
వినయ సంపత్తి చరించుట వివేకము మంకుతిమ్మ

436.
నాణ్యమైనదాని కనులు వీక్షింప, వశంబుగాని ఎడద
యున్న ఫలమదేమి? దేహము సుఖించిన యుప్పొంగని
మనసున్న ఫలమదేమి? తనువు, మనసు రెండును
తనివి జెందిన తప్పిదమదేమి? – మంకుతిమ్మ!

437.
పటుతరంబుగ నుండవలె ఇంద్రియ రస సంగ్రహణ శక్తి,
అటులె యుండవలె నింద్రియ నిగ్రహశక్తియు, భోగ విరక్తియు,
కటువైనను, నిగ్రహశక్తి కలిగియుండిన వారలె విరక్తులు
పటు సుకృతి పరులు – మంకుతిమ్మ!

438.
కెంజిగురుటాకుల సొంపు; చిరుగాలి కూగు పసరుటాకుల
వొంపు; కపట మెఱుగని యువత కనుల కాంతి మెఱుపు,
ఇంపు గొలిపెడి పసివాడి పెదవుల జారు ముద్దుమాటల సొంపుల
సంతసించని వారెవరు – మంకుతిమ్మ!

439.
సుడిగాలి యది ఎయ్యదియో నా ఎడద యందు రేగి
వడివడిగ నా ప్రాణంబుల తల్లడించి, వేర్ల నల్లాడించి
కడదాక నా జీవనంబునే యూగిసలాడించు; దీని రభసంబున
కడు ధూళి దూసరమగు – మంకుతిమ్మ!

440.
బాహ్య కిరణ కాంతి నా హృదయాంతరాళమున య
నూహ్యంబుగ నాటి జ్వలించ, నందెగసిన ధూమము కనుల గప్ప
మోహ విభ్రాంతి నా యంతరంగంబును కల్లోలపరచు
అహరహంబు వీడక – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

Exit mobile version