Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-67

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

~

671.
తిరుపమెత్తి తినువాడికి కడుపు మంట యేల, కోపమేల,
తిరుపమేయువారు కనలి కసరుకొని మాటలాడ!
వారిన్ చురచుర జూచుచు దురుసు మాటలననేల?
గరువమేల నీకు – మంకుతిమ్మ!

672.
యాత్రికులము మేము, దివ్యక్షేత్రమీ లోకము
సత్రంపు నియమంబుల పాటించి తరల వలయు, మూడు
రాత్రులు గడచినంత పారు పత్తేదారు నిను పంపివేయు, నితర
యాత్రికులకు యనువుసేయ – మంకుతిమ్మ!

673.
అన్నంపు ఋణమున్నంత వరకే నీ యునికి ఈ భువిని
ఎన్నగ యొక మెతుకు ఎక్కువ తక్కువగాక, ఋణము
లన్నింటినిన్ తీర్చి, తక్షణంబు నిష్క్రమించవలె, ఒక్క నిమిషం బేని
మన్నింపడా లెక్కలు గట్టు విధాత – మంకుతిమ్మ!

674.
పిల్లల నూపు నూయలలవెన్నో అన్ని వల్లకాడులు ఈ భువిని
ఎల్లెడల సంతస మింట నూయల లూగ, వల్లకాడు త్రేన్చు పాడిరాగ
కొల్లలుగ పుట్టిన వారందరున్ చావక యుందురేని
అల్లన స్ధలమేది కొత్తగా పుట్టువారికిన్ – మంకుతిమ్మ!

675.
జీవనంబునకున్ దొరకు సుఖంబది పరిమితంబె యగు
జీవి తనివి జెందక చపలత చేత అట్టిట్టాలకించి ఆశపడిన
ఏవియును మిగులక నష్టపోవుటే మిగులు; వలదు విపరీతపు
యావ; జీవికి – మంకుతిమ్మ!

676.
ఎన్నగ జీవన సార మపారంబైనను పరిమితంబె దలప
అనుభవించు వాడు మితి నెఱిగిన, సఫలుడగు
అన్ని ఫలంబుల స్వారస్యము, రుచియు యుండునె యొక తీరుగ!
అనుభవించుము దొరికిన దానిని కాదనక – మంకుతిమ్మ!

677.
ఎంత యతిగ భుజించిన నేమి? నీ శరీర పుష్టికి తగి
నంతయె జీర్ణమగు: మిగిలినదంతయు కుడితి పాలె
ఎంత గణించిన నేమి? దక్కున దెంత నీకు? ముష్టి
యంత యన్నమే గద – మంకుతిమ్మ!

678.
ధన్యమా క్షణము, పుణ్యతమమా క్షణము, యేవేళ
మాన్యత నీ మమతాను పాశంబుల నుత్తరించు యా విధి
ధన్యత చెందెడి వేళ, యాత్మోన్నతి వడయు వేళ యది
ఖిన్నత నొందనేల పాశంబులు తొలగు వేళ – మంకుతిమ్మ!

679.
పిల్లలు బెల్లపు యటుకులన్ దిని సంభ్రమించు వేళ, చూచి, యా
పిల్లల తాత తనకు గావలెనని యాచించునే వారిని!
అల్లన సంతసించు గాని; అనాసక్తత తోడ విషయ వాంఛల
కల్లంత దూరంబున నుండువాడె నేర్పరి – మంకుతిమ్మ!

680.
నిండార భుజించిన వాడు సంతసంబున గాంచు దినువారల గాంచి;
పండితుడున్ నయంబున గరిపించు విద్య విద్యార్థులకున్
నిండు మనసున, జనుల గాంచి సంతసించి జ్ఞాని
మెండుగ జూచునందరిని తనలోన – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

Exit mobile version