[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]
~
731.
దేనినో కంటన్ గను, మరిదేనినో గని బెదరు
దేనినో దలంచి తుర్రుమని పారు, గగ
నాన, విహరించు విహంగమున కియ్యది నిత్యానుభవము
మన జీవనమును ఎక్కుడుగ లేదు – మంకుతిమ్మ!
732.
ఏఏ దిక్కునకున్ బోవునో, ఏ దిక్కునకు దారి మళ్లించునో!
ఏఏ వేళన నే దిక్కునకో తన పయనము విహంగమునకు;
ఏఏ సమయంబున మన జీవనగతి మారునో; అనూహ్యము
వేయేల జెప్ప! విధి కీలుబొమ్మలమే మనము – మంకుతిమ్మ!
733.
మావి మొలక నాటి వేము దినగ సిద్ధముగ నుండు;
భూ విశేషత చేత రుచులు మార్పులు చెందగవచ్చు,
ఆ వివరములన్నియు నీకేల? తోట యజమానివా నీవు?
సేవకుండవు నీవంతియె; – మంకుతిమ్మ!
734.
సైనికుడవు నీవు; సైన్యాధ్యక్షు డెచటనో యుండు,
ఆనతిచ్చు నాతండు, పాలించుటే నీ వంతు;
ఘనతను పోరాడుము, గెలుపోటముల నెంచక
కానిపించని యాజ్ఞ యిది – మంకుతిమ్మ!
735.
రణ జయాపజయంబు లరయ సేనాధిపతికె చెల్లు;
రణ శిక్షణానుభమే లాభము భటునకు; నద్దాని నాతడు
గణనీయంబుగ తన సత్త్వ వికసనం బొనరించుకొను;
ఎన్నగ యాతడి శ్రేయస్సునకు సోపానమది – మంకుతిమ్మ!
736.
విధిని నిర్వహించుచు, మదిని సంతసింప జేయుచు
వేదనల పాల్జేయక యంతరాత్మను, యుద్వేగంబు లేక,
విధి మాయలకున్ లోబడక, విధాతన్ మది దలచుచు
వేదన చెందక సాగింపుము జీవనము – మంకుతిమ్మ!
737.
ఎందైన నీ పూర్వ జన్మ ఋణంబుల లెక్కలు దీర్చవెంచితివేని
ఇందే మొదలిడుము దాటవేయక ముందునకు,
అందించు మితరులకు నీ హృదయ స్పందనము
పొందుగ సాగించుము జీవనము – మంకుతిమ్మ!
738.
తనకున్ లభ్యంబు కాని యశస్సు, తనయునకున్ లభించిన
జనకుండది తనకె లభించెనని సంతసించు తెఱంగున;
జనులకేయే సుఖంబులవి గల్గిన, యవి తనకాయెనని
తనివి జెందు జ్ఞాని – మంకుతిమ్మ!
739.
తన మనోచంచలతలన్ గని తాను నవ్వుకొనుచు
తనలో నెలసిన ద్వంద్వంబుల గుట్టెరిగి మసలుచు
తన చిన్మాత్మ చైతన్యంబున్ వేరుగ నుంచు వాడు చతుర
మానవుండరయ వాడే ధన్యజీవి – మంకుతిమ్మ!
740.
జీవనమది యొక కళ; దాని నేర్పించుటెట్లు? వేన వేల
యవకాశంబు లుపాయంబులు నీతి నియమ యుక్తులున్నను
కావవన్నియు సరి; యందొక్కటే చేకూర్చు విజయంబు
ఆ వివరము లున్నవి నీలోన – మంకుతిమ్మ!
(ఇంకా ఉంది)
శ్రీ కల్లూరు జానకిరామరావు రచయిత అనువాదకులు. వీరి తండ్రి కీ.శే. కల్లూరు అహోబళరావు ప్రముఖ కవి, బహు గ్రంథకర్త. కృష్ణదేవరాయ గ్రంథమాల వ్యవస్థాపకులు. తల్లి కీ.శే. సీతమ్మ గారు.
జానకి రామరావు గారి భార్య కీ.శే. సుభద్రమ్మ. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.
వీరి పుట్టిన తేదీ: 23(15) జూలై 1941. విద్యార్హత: B.A.Bed, M.A.( English)
హిందూపురం ఎంజీఎం హైస్కూల్లో 1964 నుండి 1990 వరకు 26 ఏళ్లు ఉపాధ్యాయుడిగానూ, 1990 నుండి 1999 వరకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు.
ప్రస్తుత నివాసం బెంగుళూరు. ఫోన్: 9740849084
