Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-74

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

~

741.
నిండుకుండ తలపై మోసి, చురకత్తిని చేతబట్టి, దొమ్మ
రీడు, తూగాడు పగ్గంబుపై నడయాడు నటునిటు కౌశలంబు
తోడ, తడబడక, క్రిందికిన్ బడక: మనమున్ యనుసరించవలె
వాడి కుశలత, జీవనము సాగింప – మంకుతిమ్మ!

742.
జీవనంపు భారమున్ తగ్గించి, మోయ సులభతరంబు జేయ
కావలె, సహన సమరసా భావంబు లంతః పరీక్షలె గాని; బహు
ధీ విద్యలు, తర్కంబులు, బహు నేమంబుల్ గాదు; యయ్యవి
కావలె హితంబులైన విషయంబులాత్మకున్ – మంకుతిమ్మ!

743.
అన్నియుం నశించు, కాలవశంబగు; కాలపురుష నెదుట
యందరున్ అల్పులే; సంతోష సల్లాప ఉల్లాసంబులే ధర్మమరయ!
అంత మొందించువాడె నుద్ధరించు మరల మరల; ఎండివాడిన
తృణం బది పునః చిగురించదే – మంకుతిమ్మ!

744.
గ్రీష్మంబున యణగి యుండి, వర్షఋతువున యంతటన్
భీమంబుగు, మిట్టపల్లముల, కొండ కోనల చిగురించి, తంపుజేసి
విశేషంబున పశువులకు అశనమై, పృథికాహ్లాదంబున్ గూర్చునట్టి
అశేష గుణంబులున్న తృణము, సాధువు గాదె – మంకుతిమ్మ!

745.
పరహితంబు గోరెడిమాట యటుండనిమ్ము; పరభాగ్యోప జీవియే
నరుడు జంతు పశు, పక్షి, కీటక, మీనంబుల వోలె; తరులవి
పరుల కుపకరించు; నవి అనాపేక్షిత పుణ్యజీవులు;
నరుడే యపాయకారి ప్రకృతికి – మంకుతిమ్మ!

746
నీడ నొసంగి, తరువు తన చెంతను జేరిన బాటసారుల
బడలిక దీర్చి, వారి మరుప్రయాణంబునకు వీలు కల్పించు;
వేడదది ప్రతిఫలము; నీవును, ఇంటన్, బయటన్ తరువై
కడు చరించిన యదియ పరమ ధర్మము – మంకుతిమ్మ!

747.
వారెంతటి ధనవంతులో! అబ్బో! వీరెంతటి బలవంతులో!
వారెంతటి యశోవంతులో యనెడి ఈ సునసూయ లేల?
ఏరి కెంత శివుడ నుగ్రహించినంత తనివి జెందవలె గాని
ఆరడి జేసిన పరమాత్మన కింపగునేయది – మంకుతిమ్మ!

748.
అన్నంబు నారగించునెడ ప్రశ్నించుకొనుము, దాని నుడికించిన
యన్నీరంబేది యని? నీ శ్రమంపు స్వేదమో! ఇతురుల కన్నీరో!
అన్యులకు నీవెంత ఇచ్చితివో, అంతియే నీ యన్నంపు బుణము
అన్యథా యది జీర్ణించని ఋణశేషము – మంకుతిమ్మ!

749.
మూలధనం బదేది ఈ జీవిత వ్యాపారంబున లాభంబు గడింప
మూలధనం బది తత్త్వదృష్టి; జగదాత్మ లీలా విహారసుఖమే
మేలుగు చిరలాభంబు; ధరన్ యనుభవించు సుఖమే
అల లభించు వడ్డి – మంకుతిమ్మ!

750.
ఈదులాడుము జీవనంపుటలలపై తేలియాడి; మునుగక;
ఏది మంచి చేయు నద్దాని నితురలకిచ్చి నీవును సంతసింపుము;
మదిన కలత జెందక ముందుకు సాగిపొమ్ము; హాయిగ మనుమున్నంత కాలము
వ్యథ జెందక తరలుము పిలుపు వచ్చిన తరి – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

Exit mobile version