Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-78

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

~

781.
తొలి సంజె విత్తిన విత్తనమది పైరుగునే మలిసంజె!
కాల వ్యవధి వలయు మన కృషి ఫలితంబులకు
వలయు తగినంత కాలము; ఆతురత జెంద పక్వమగునె వంట
తాలిమి వలయు పరిపక్వతకు – మంకుతిమ్మ!

782.
అందందాచరించెడి కార్యము లాచరించి, అందినంత తనివి
జెంది, ఫలితం బదేదైన క్రుంగక, యుబ్బక, నిబ్బరముతోడ
బాంధవ్యం బెల్లడ జూపి, పరము పదంబును బొందు, ముందు చర్యన్
పొంది యుండుట సుకృత మరయ – మంకుతిమ్మ!

783.
బుద్ధి మాటొకటున్నది నీకు తెలియ; దేనినేని ఎదురింప
సిద్ధంబుగ నుండుము: దైవంబు వేరొండు తలంచుగాక; కర్మ నీ
హద్దుల లేకుండుగాక, అద్భుతంబు లెన్నో జరుగు దైవికంబుగ
సిద్ధంబుగ నుండుమన్నింటికిన్ – మంకుతిమ్మ!

784.
ఏ నిమిషాన ఏదేని సంభవించగ వచ్చు; సిద్ధంబుగ నుండుము
భాను కిరణంబులు శీతల౦బై చంద్రకిరణయబులు కాల్చగ వచ్చు,
క్షోణి కరగి నీరుగ మారవచ్చు, జగంబు శూన్యంబు కావచ్చు
మౌనంబున సిద్ధంబుగ నుండు – మంకుతిమ్మ!

785.
‘క్రుంగదీ మనః క్లేశ మెన్నటికిని’ యని దిగులు చెందగనేల?
క్రుంగనేల? యయ్యది తాత్కాలికంబె; శాంతించు తనకు దానె; కారు
మేఘములన్ చీల్చుకొని రవి ప్రకాశింపడే! శాశ్వతంబు కాదేది,
బెంగ పడనేల: ఆ దినపు సుఖమే సుఖము – మంకుతిమ్మ!

786.
ముగింపు గలదన్నింటికిన్: విషయేంద్రిములకున్
ముగింపు గలదేని యయ్యది పుణ్యఫలంబె తలంపగాన్,
ముగింపు ఎటులో! నీ నిగ్రహంబుననో! అయ్యవియే విసుగు జెందెనో!
ముగిసిన చాలు, శాంతి దొరకు – మంకుతిమ్మ!

787.
రోగంబులు – తట్టు, అమ్మవారు, శిశువులన్ కుదిపి వెళ్లు
రాగ మనురాగంబులున్ మోహితులైన వారి కుదిపి, కుదిపి, అనా
రోగ్య యాతనలకున్ గురిచేసి, జీవనంబును పక్వంబు జేసి తరలు
వ్యగ్రత తీరిననే సుఖము – మంకుతిమ్మ!

788.
జ్వర పీడితంబైన వేళ తనువు తపించి యాతనబొందు
జ్వరంబుపశమించిన తరి నవనవలాడు నరుడు
కారణ మేదైన నేమి! ఇంద్రియ తాపంబులు చల్లార
మరుజన్మ మది యాత్మకు – మంకుతిమ్మ!

789.
పర్వత సానువుల, పసరంబులకు పచ్చని గడ్డివై,
సౌరభమ్ముల విరజల్లు మల్లెల వోలె ఇంటను, విధి వర్షించు
క్రూరతకు గిరివై, దీన దుర్బలుల పాలిట మధుర తర
శర్కరమవై, ఎల్లరనొకడవై పొందియుండుము – మంకుతిమ్మ!

790.
చిక్కిన యుద్యోగ మదేదైన వదలక చేయుము: నేనేడ? నే
నొక గడ్డిపోచయని యనబోకు, అందరున్ అర్హులే కృషికి; ఈ
లోకపు వ్యవహారంబుల హీనమైన పని యదేదియున్ లేదు;
నీకున్ స్థానమున్నదీ లోకమందున – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

Exit mobile version