Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-81

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

 

~

811.
జీవనంపు భారమును భరింప సులువు జేసికొనగ
కావలె నంతరంగశుద్ధి, లోన కలుగు సంకటపు సెగల న
నువుగ శమయింప జేసికొనవలె; బహిరంతరంగంబుల సు
లువుగ సమంబుగ జేసికొనుటె పరమ జీవన యోగము – మంకుతిమ్మ!

812.
ఏడ్వవలె, నవ్వవలె, సమత సంయమము లుండవలె,
వడివడి యురకలెత్తు సెలయేరు వోలె ఎడద స్రవించవలె;
కడలి తరగలకు చెదరని శిలవోలె చిత్తము దృఢంబుగ నుండవలె
పండగలవాని లక్షణములవి – మంకుతిమ్మ!

813.
విడనాడితి గదా యన్నింటిని యనుచు హృదయ శోషణ ఏల?
విడనాడక యన్నింటినిన్ కట్టుకొంటిని గదా యను శిరఃపీడనమేల
దృఢ నిరహంకార కవచమున్ దొడిగి పోరాడుము
పడదు నీపై ఈ ఇహలోకపు కత్తి – మంకుతిమ్మ!

814.
ఆస్తి పంపక కలహంబు లొచ్చిన వేళ, న్యాయాధిపతి, వాది
ప్రతివాదులకు న్యాయ మొదిగించ, తన బుద్ధి కుశ
లతల వెచ్చించు గాని స్వలాభంబు నపేక్షించునే! యాతని
రీతి నీవునుజ్జగింపుము జగపు శ్రేయస్సును – మంకుతిమ్మ!

815.
పౌరుషాశ్వమునకున్ ఆశ చర్నకోలు, భయంబు కళ్లెము,
పరుగుల్దీయు నది ఈ రెంటి వేధలన్ భరియించి –
ధీరుడైన రౌతు నధిరోహించి స్వారి జేయ, యా రెండింటిన్
భరించెడి భయంబు లేక గురి చేరదగు – మంకుతిమ్మ!

816.
మన శరీర యారోగ్య భాగ్యంబునకున్ గలవు, మన
మనుసరించదగు కొన్ని నీతినియమంబులు; మాటలు, చేతలు
మన మనసు నారోగ్యంబుగ నుంచు సాధనములు – వాటి
ననుసరించ సుడిగుండముల జిక్కుకొనవు – మంకుతిమ్మ!

817.
మానుల గూర్చి తెలియదలంచితి వేని; వేర్ల నూడబెరక నేల?
ఈనెల, కొమ్మల, రెమ్మల ఆకుల నుత్తరించనేల?
మానుగ పాదు జేసి, కలుపు దీసి, ఎరువు నీర మందించి
అనువు జేసి చూడుము దాని యందము – మంకుతిమ్మ!

818.
అడవి మెకములు ఆహారౌషధంబులుగ జేసికొన్న
అడవి మొక్కలన్, నరుడు తన రుగ్మతల ప్రోదోల వాటినిన్
వాడి వైద్యుడాయె; శుష్క తర్కంబుల నేమి ఫలము
కడు అనుభవమే జీవనతత్త్వమరయ – మంకుతిమ్మ!

819.
తరువుల, పరీక్ష కొరకై ఖండించ, మిగులునదేది? మృతకణములే!
ఎరువుల, నీరము నందించ చిప్పిల్లు నందు జీవరసము; దేనికీ
తరగని చర్చ: వీడుము: వాటిని పెంపు జేయ నుజ్జగించు,
అరయ నదియ మేల్గాదె – మంకుతిమ్మ!

820.
జీవన వ్యాపారంబునన్ గలరు భాగస్వాములు మువ్వురు;
నీవును, ఇజ్జగంబును, యదృష్టంబును: మూడింటన్
లావు గలది యదృష్టంబే; దాని కోర్కెయె బలమైనది: ఇ
వ్వివరంబు ల్దెసిననే సుఖము – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

Exit mobile version