Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-83

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

~

831.
ఘోర భీకర బీభత్స రూపంబుల జగములు కావడే
పరమాత్ముడు! సంతసింపడే వసింపగ దుర్గంధ
పరిసరంబుల! కశ్మల ప్రదేశంబుల క్రిమికోటి వసింపదే!
అరయ మనంబున నుండవలె శుచిత్వము – మంకుతిమ్మ!

832.
పూజల్సపుటో, హరికథాశ్రవణంబో, కీర్తించుటో, పేద
ప్రజల్సేవ సల్పుటో, నాటక ప్రదర్శనంబులో, దేనికైన
నుజ్జగింపుము, మనసును పీడించు గొడవల పారద్రోలి
ఇజ్జగంబున సుఖ శాంతుల నెలయజేయ – మంకుతిమ్మ!

833.
చిరునగవుల్చిందు లాడెడి జీవనంబుల చిచ్చురేపవలదు;
ధరన్గాల్చు ఘోర తపస్సులన్జేయ వలరు, తల్లిదండ్రుల
సరసన చిఱుతడు పరుగులాడెడి రీతిన్మసలుము
వేరు చింతలన్నియున్ ప్రేలాపనలే – మంకుతిమ్మ!

834.
అటులో, ఇటులో, ఎట్లో ముగిసిపోవు బ్రతుకు కథ
ఆట నేడో, రేపో ఏదో ఓనాడు సాగి ముగిసి పోవు
అటు పిమ్మట గుఱుతు లేక మరచుటే సుకృత మరయ
కాటిన్జేరి బూది యగుటే ముక్తి – మంకుతిమ్మ!

835.
మిత్తి న్గూర్చి భయమేల? దేశాంతరంబులకున్ గొనిపోకు
మిత్రుడాతడు; నూతనచిత్ర మొకటున్న దచట,
సాత్విక చరితున కెయ్యడమేని భయంపు చింత లేదు
సత్రమది వేరొండుగలదు కొత్తది – మంకుతిమ్మ!

836.
మిక్కిలి గుట్టయిన వీ సృష్టియు జీవనంబులున్, ఔగాదని
ఎక్కువగ వాదోప వాదంబు ల్సేయుట వ్యర్థ ప్రలాంబులే;
లెక్కకు మిక్కిలి తత్త్వంబులవి యడగి యున్నవి రహస్యంబుగ
తర్కమునకు లొంగవవి – మంకుతిమ్మ!

837.
సృష్టి గుట్టును రట్టుసేయ బూను వానికి ఎల్లెడల భూతములే
ఎట్టదుట గన్నట్టు, చీకట్ల పిశాచంబులే గన్పడు. జీవంపు
గుట్టు యట్లు ధరించియున్నది ముసుగున్, యది తొలంగి ఎటుల
గుట్టురట్టయి సత్యదర్శనమగునో – మంకుతిమ్మ!

838.
చావుపుట్టుకల కారణంబు లగోచరంబులు; దాగియున్న
వవి గుట్టుగ ముసుగు లోపల మనల విభ్రాంతి పరచుచు
రవి, చంద్రుల పుట్టుకలున్ దాగియున్నవి చీకట్ల వెన్క
నీవునున్ యరయ వీడని రహస్యమే – మంకుతిమ్మ!

839.
వీచెడి గాలి యది ఎంతటి ధూళి కణంబులు నిముడ్చుకొని
వీచునో! ఎయ్యది జడ కణంబొ, చైతన్యంబొ దెలియనెట్లు?
ఈ చోట నర్తించుచున్నారము సూత్రధారుని కీలుబొమ్మల వోలె
గోచరించకున్నవా సూత్రములు – మంకుతిమ్మ!

840.
ఎచట గలదో నీ ఓగిరము! ఎచట నున్నవో నీ తిండిగింజలు!
ఎచటి నీరమో! ఎచటి ఎరువో! ఎవరు పండింతురో? ఎవరో
ఎచటనో చెమటోడ్చినది చెందుచున్నది నీకు!
ఎంచగ ఋణము గుప్తగామిని – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

Exit mobile version