Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-84

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

~

841.
మన ఎంగిలి మెతుకులే కాల్వ చేరునో! ఆ నీర
మెన్నగ ఏ మట్టి జేరి ఏ పంటను పండించునో!
అన్నమది ఎవరినుండి ఇంకెవరి కడుపు నింపునో!
వర్ణించున దెవరు దానిన్ – మంకుతిమ్మ!

842.
ఎవరి నేలనో గడ్డిమేసి, ఇంకెచటనో నీరు తాగి ఇం
కెవరికో ఆవు తన పాలనిచ్చి, ఆ పాల నింకెవరో త్రాగి, మ
రెవరికో బలము నిచ్చు; త్రాగిన వాడేమిచ్చునో లోకమునకు
భావింపగ నిదెంతటి ఋణమో దెలియ – మంకుతిమ్మ!

843.
జీవాణువులవెన్ని చేరియుండునో మన యూపిరుల! గాలి
వీవ, ధూళికణంబులవెన్ని చైతన్యయుతమై యుండునో!
జీవగతి వ్యవహారంబది రహస్యంబు; తెల్సినవార
లెవరు? నమస్కార మర్పించుటే సరైనది – మంకుతిమ్మ!

844.
ప్రసరింపబోకు నీ యజ్ఞానంపు నీడల నితరులపైన, వారల
నుసరించు మార్గంబుల వారిని నడువ నిమ్ము; ఏ దారులన
నుసరించ, వాటి మేల్గీడులు నీకవగతంబులే! అన
వసర పెద్దరికము వలదు నీకు – మంకుతిమ్మ!

845.
ఇతరుల జీవనపు తీరుపై నీదగు పెత్తనము చెలాయించనేల?
మోత నీయది చాలదే మోయ? ఇతరుల మోత నీకేల?
హితమగు గాదె నందరికి, మొగ్గ సహజంబుగ వికసించినన్,
హితమా! క్షేమమా చెఱసాల జీవనము – మంకుతిమ్మ!

846.
మరణమైన తరి ముందేమి? ప్రేతమో? భూతమో?
పరలోకమో? పునర్జన్మమా? మరేమో తెలియదు
తిరిగి వచ్చిన వారెవరు? వార్త తెచ్చిన వారెవరు?
ధరన్ జననంబు నడపువారికి మరణపు చింతయేల – మంకుతిమ్మ!

847.
తగు ఫలసాయంబున్ పొందడే కృషీవలుడు మేలగు రీతి
సాగు జేసినన్; సంశయమేల? మేలగు రీతి నీ
దగు జీవనంబునన్ నడపిన మేలగు గాదె నీకును; మే
లు ఇహమే పరలోకంబునకు దారి – మంకుతిమ్మ!

848.
స్థిరమా పరబ్రహ్మ హిమాద్రి వోలె, మాయ జాహ్నవి వోలె
చరము; ఘనరూప పరసత్త్వపు ద్రవరూపమీ జగము
పరమార్థమున కొక యక్షి, జగద్వ్యవహారంబుల కొకటి
సారూప్యంబులే రెండునున్ – మంకుతిమ్మ!

849.
స్థిరచిత్తంబునన్ గ్రహింపుము ఈ తత్త్వంబును, అనిర్దిష్ట, అ
నిర్వచ, అగణనీయమీ పరబ్రహ్మ లీల లరయ
నోరు విప్పక, మౌనంబు వహించి వర్తించుచు నుండుము
దారి యది నీ మనము శాంతి బొంద – మంకుతిమ్మ!

850.
నాట్యరంగమీ జగము, ఆ నటరాజుని రూప మరయ
నాట్య రీతులవి జీవనంపు వివిధ దిశలన్ సూచించు తీరులు,
నాట్యమిది విశ్వమాయా లీల, సత్య సత్త్వపు జ్వాల, జగ
న్నాటకంబున నీవొక ఆత్మ స్వరూపంబవు – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

Exit mobile version