[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]
~
851.
సచ్చిదానంద మూర్తి నృత్యంబున్ గాంచుము నేత్రము ల్దెరచి
నిశ్చల శుద్ధ; స్వరూపంబున్గనుము, కన్నుల్ మూసి
అచల, చల రూపంబున్గనినంత ధన్యత బొంద
అచిర శాంతి హృదయుడ వౌవుదువు – మంకుతిమ్మ!
852.
దివస, వత్సర యుగ చక్రంబు దిరిగినంత
నవ నవ ప్రశ్నలున్, పరీక్షలున్ యుదయించుచు నుండు
ప్రవహించు వాటి తోడ పౌరుషహిత ప్రజ్ఞయున్, చైతన్యంబ
నవరతంబు – మంకుతిమ్మ!
853.
లోకులందరికిన్ సౌఖ్యంబు లభించినగాని
‘లోకాః సమస్తాః సుఖినోభవంతు’ అని గట్టిగ
వక్కాణింప వీలగునే! ఒక్కడి వేడి నిట్టూర్పులు
లోకంబున్ గ్రమ్మి అసౌఖ్యంబు పాల్జేయు – మంకుతిమ్మ!
854.
సర్వుల హితంబ దేది? దానిన్ జేర మార్గంబు గలదె?
నిర్వహించెడి సాధనంబు లేవి? తెలియజేయ గురువెవ్వరు?
పూర్వము నరులొనరించిన కార్యములన్ సవరింపబోవ
అర్వాచీనంబున యవి వక్రత నొందునో ఏమో! – మంకుతిమ్మ!
855.
సులభంబేమి కాదు, లోకులందరికిని హితమైన పని జేయ,
పలు రీతులు లోకుల స్వభావంబులు, ఎడ్డెమనిన తెడ్డెమందురు,
నిలకడయే లేక విలవిల తన్నుకులాడెడి మానవ స్వభావంబులకు
నెలవేది? వెల యేది? హితమేది – మంకుతిమ్మ!
856.
భూమి భారంబు తగ్గించి సుఖశాంతుల నెలకొల్ప, రాముని
కార్ముకమునకు, కృష్ణుని యుక్తికి, గౌతముని కరుణకున్
వమ్మయ్యెనన్న, సామాన్యులైన మనమెంత గింజుకున్న నేమగు!
క్షేమంబు మృగ్యంబే కదా – మంకుతిమ్మ!
857.
శోధన, శోధన సతత శోధనమే జీవమీ జగమునకు,
సిద్ధించు వరకు శోధించుటే మానవ జీవితంపు గురి,
లబ్ధించిన తరి శోధించన గత్యమేది? కథ
స్తబ్ధంబగు గాదె – మంకుతిమ్మ!
858.
ప్రియంబైన వాటనిన్ బొంద నన్వేషించు నరుడు కర్మల,
క్రియ ఇది, జన్మాంతర పారంపర్య చర్య; ఈ
నియమంబు కారణంబగు జగత్ప్రవర్ధనమునకు; పూర్ణ
జయం బదెన్నడు సిద్ధించునో! – మంకుతిమ్మ!
859.
ప్రకృతి సతతము మనుజుని దిద్ది తీర్చుచుండ
వికృతి పరచుచున్నాడాతడామె అంగాంగంబుల
భూకృషీవలుడు రసాయనంబుల(1) శిల్పి (2) తన యంత్రంబుల
వ్యాకృతి (3) నొనరించుచున్నాడామెను – మంకుతిమ్మ!
(1. కృత్రిమ ఎరువులు మొ॥ 2. ఇంజనీయర్లు సాంకేతిక నిపుణులు మొ॥ 3. మార్పు)
860.
సృష్టి ప్రచోదన చేతనే యుదయించు నరుని ఇష్టంబులు,
ఇష్టసిధ్ధి కతడు యంత్ర శక్తుల నుపయోగింప
సృష్టి వికృత రూపంబు నొందినన్, తనకనుకూలంబుగ నరుడు
సృష్టి తోడ అన్యోన్యతను పెంచుకొను – మంకుతిమ్మ!
(ఇంకా ఉంది)
శ్రీ కల్లూరు జానకిరామరావు రచయిత అనువాదకులు. వీరి తండ్రి కీ.శే. కల్లూరు అహోబళరావు ప్రముఖ కవి, బహు గ్రంథకర్త. కృష్ణదేవరాయ గ్రంథమాల వ్యవస్థాపకులు. తల్లి కీ.శే. సీతమ్మ గారు.
జానకి రామరావు గారి భార్య కీ.శే. సుభద్రమ్మ. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.
వీరి పుట్టిన తేదీ: 23(15) జూలై 1941. విద్యార్హత: B.A.Bed, M.A.( English)
హిందూపురం ఎంజీఎం హైస్కూల్లో 1964 నుండి 1990 వరకు 26 ఏళ్లు ఉపాధ్యాయుడిగానూ, 1990 నుండి 1999 వరకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు.
ప్రస్తుత నివాసం బెంగుళూరు. ఫోన్: 9740849084
