[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]
~
861.
దివ్యపురుషుల దివ్యచరితల ప్రతిరూపమే మానవ చరిత్ర
కావ్య జ్ఞానంబులున్ నిగమంబుల ప్రతిరూపంబులే
నవ్య జ్ఞాన సంపదయు ఆర్ష సంపదావిర్భావమే, యుభయంబులున్
సవ్యంబులే యపేక్షనీయంబులే – మంకుతిమ్మ!
862.
పరమాత్ముని యావరణంబున ఇహంబునకున్ గల స్థానంబు దెలిసి
పరమాత్ముని లెక్కల తోడ ఇహంపు లెక్కల బేరీజు వేసి, లెక్కగట్టి;
నరులు తృప్తి జెందవలె ఉన్న వనరుల తోడన్, అపుడ
సరిపోవు లోకపు బాంధవ్యము – మంకుతిమ్మ!
863.
కానుగ విత్తనమున్ జూపి ‘బాదామికో’యని ఓ గ్రుడ్డి ముసలి
మనుమడికి కూరిమి దినిపించిన యది తీపియగునే!
మనసెంత మంచిగ నున్ననేమి? తెల్వియు జాణతనము కావలె
సునాయాసంబుగ లభించెనే సుధ – మంకుతిమ్మ!
864.
ఫల మదేమి సుఖాన్వేషణకై పరుగులిడ! ఫలము కలహమే!
కలహించు నరుడు వన్యమృగంబల పగిది ఆవేశంబున
అల కార్చిచ్చు కాల్చి బూడిద సేయదే యరణ్యంబుల
వలదు పగబూన – మంకుతిమ్మ!
865.
వేసవి తాపంబుపశమించిన తరి, వర్షింప చిగురించు
సస్యంబులు; పుటము వెట్టి కాగిన కనకమే కలకలలాడు
వేసట ననుభవించిన తరి శాంతిత్వంబు నొందు నరుడు
తోషంబగు జీవనము – మంకుతిమ్మ!
866.
ఆత్మసంతుష్టికిన్ గావలె దైహికారోగ్యంబు
భౌతిక విజ్ఞాన మందించు సౌకర్యంబు లనేకంబులు
నూతన ప్రయోగంబుల జేయ ప్రభుత్వంబులు సహకరించు
హితకరంబది జగమునకు – మంకుతిమ్మ!
867.
యత్నించుట కర్తవ్యము; సుశిక్షిత విద్య యది,
యతనముల ఫలితమే హిత పరిజ్ఞాన మరయ
సతత యతనంబుల చేత వర్ధిలు యాత్మశక్తి;
యతనమది నిను సుశిక్షితు జేయు – మంకుతిమ్మ!
868.
అర కొఱ యత్నమే మనదని నిరాశ చెందనేల?
చిరు ప్రయత్నంబులే జత గూడి సిరినించు జీవనంబున
పరిపోషించవే బాటసారుల దారి పొడవునన్ గల మానుల ఫలంబులు
చిరు సిరిజాజిమల్లె వెదజల్లదే పరిమళంబు – మంకుతిమ్మ!
869.
జీవికి సతతాన్వేషణమే ముఖ్యము, ఫలితంబటుండనిమ్ము,
దివిని భువికి దింపగల సమర్థుడెవడు; ఎడనెడ అడ్డగింపులు లేక
నందరు భువి సంపద సమముగ యనుభవించిననే శ్రేష్ఠము;
దివ్యతత్త్వ మిదియ – మంకుతిమ్మ!
870.
దేవామృత మది కేవలము మధువో లేక క్షార, ఆమ్ల మిశ్రణమో!
అవనిన్, నరుని ఆహారంబునన్ పడ్రుచులు తప్పవు గదా,
లవలేశమైన చేదు లేకుండిన, నరుండు సుఖంబున
పవళింపడే – మంకుతిమ్మ!
(ఇంకా ఉంది)
శ్రీ కల్లూరు జానకిరామరావు రచయిత అనువాదకులు. వీరి తండ్రి కీ.శే. కల్లూరు అహోబళరావు ప్రముఖ కవి, బహు గ్రంథకర్త. కృష్ణదేవరాయ గ్రంథమాల వ్యవస్థాపకులు. తల్లి కీ.శే. సీతమ్మ గారు.
జానకి రామరావు గారి భార్య కీ.శే. సుభద్రమ్మ. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.
వీరి పుట్టిన తేదీ: 23(15) జూలై 1941. విద్యార్హత: B.A.Bed, M.A.( English)
హిందూపురం ఎంజీఎం హైస్కూల్లో 1964 నుండి 1990 వరకు 26 ఏళ్లు ఉపాధ్యాయుడిగానూ, 1990 నుండి 1999 వరకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు.
ప్రస్తుత నివాసం బెంగుళూరు. ఫోన్: 9740849084
