Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-87

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

~

871.
ఏరికేది తగినది? ఏరికేది దక్కునో! రహస్యంబది.
అరయన్ సులువగు తెల్సినన్, తెలియునదే సంస్కారము
తారతమ్యంబు తెలియని యెడన్ మనకు తగనిదాని నింకొకడు
చౌర్యంబు సేయుటకు సులువగు – మంకుతిమ్మ!

872.
గుడిస ఇది, ఎండుగడ్డి, పాత మట్టి ఇల్లని ఛీత్కరించి
బడుగు జీవిని కించపరచు కార్యము గొప్పదే?
వారి సుఖ జీవనంబున అశాంతి రేపిన, మరల
బడుగువాడి ఆ ప్రశాంతత మరల రాగలదే – మంకుతిమ్మ!

873.
అలసి సొలసి మైమరచి హాయిగా నిదురించువాని గని
నేలపై యేల, పానుపుపై పరుండుమని వానికదిపిన, నయ్యది
చాల, యుపకారంబు చేసినట్టుగునే? ప్రశాంతత పాడగు,
సులభమేమి కాదు మంచి పనిచేయ – మంకుతిమ్మ!

874.
మట్టి కుండను పగులగొట్టి, నీకిచ్చెద బంగరు కుండ యన్న
గట్టి బంగారంబు నిచ్చు గని ఏదైనను గలదే నీకు? ఎ
ప్పట్టున సంతోషంబు గల్గు నీటిని పారబోసి పాలు తాగమన్న,
ఎట్టైన ఉన్నదే సుఖము నిచ్చు – మంకుతిమ్మ!

875.
బహు ప్రాచీన లోకమిది, బహు పురాతనమైనది
బహు రసంబులన్ సేవించి ఎదిగినదీ లోకము
బహు కష్టతరంబు దీని స్వభావంబున్ మార్చ
సాహసంబు వలదు దీని మార్చ – మంకుతిమ్మ!

876.
ఆనతి నీయగలవే సింధు నదికి, హిమగిరికి వేరొక చందంబున
వెనుదిరిగి ప్రవహించమని; మూఢతనంబు గాదే యది;
జనచైతన్య ప్రవాహమది తన దారిన్ పయనించు, అంధ
తనంబు గాదది – మంకుతిమ్మ!

877.
మతివంతులు లేకుండిరే మనకంటెను మన ముందువారు! జనుల
హితంబున్ కోరరే వారలు, శ్రమించలేదే వారలు,
అతి వైద్యంబు చేత కొత్త రుగ్మతలుదయించునో ఏమో!
మితి యుండవలె నవీకరణంబునకు – మంకుతిమ్మ!

878.
సరిజేసెదనను నెపంబున్ బునాదుల పెకలించనేల?
మరల దానిన్ నిర్మింప నీ తరమే? కౌశలంబు గలదే నీకు?
తరువున్ మరల సరిజేసెదనని వేర్లనూడ బెరుక వెర్రితనమేల?
దురుసుతనమేల మార్పుల జేయ – మంకుతిమ్మ!

879.
మృగ లక్షణంబులు నరులలో ఉన్నంతవరకు తప్పవు కలహంబులు;
పగ కారణంబే కాదు, ఆకలియు హత్యలకు దారితీయించు,
తగరు, కుస్తీ పందెములు, సభావాగ్వివాదములు, అన్నియున్
సొగసైనవే కలహంబులకు – మంకుతిమ్మ!

880.
తన మనోరథంబులు చక్రగతిన్ ఈడేర్చబూను నరుడు,
తన మణిహారంపు ముడి తన కుత్తుకన్ బిగియించునొకతరి,
తన సంకల్పంబులు విపరీతమైన తరి యాతని
వెన్ను విరుగు గాదె – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

Exit mobile version