[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]
~
891.
జలనిధి జేరు నదులన్ని తమ గుణంబుల వీడి, క్షారమై
కలసినట్లు, నీ గుణంబులును బ్రహ్మంబున లీనమగు;
అల పుణ్యమో! పాపమో, హితమో, అహితమో, ఏదైన
వెలుగొందునవి మేలుగ – మంకుతిమ్మ!
892.
నీలాకాశంపు టావల, విశ్వంబున కవ్వల, సుదూరంబున
నెలసి యున్నాడా? లోన హృత్కుహరంబున మబ్బున
కలసి యున్నాడా పరమాత్మ? నిగూఢమైన ఈ రెంటిని
మేళవించి తెల్సినవాడె జ్ఞాని – మంకుతిమ్మ!
893.
స్వప్నలోక మది కల్లయను జాగృతావస్ధితుడు
సుప్తాస్థుడు జాగృతావస్థను కల్లయను
స్వప్న జాగృతావావస్థలకు నిర్లిప్తంబుగ నుండు
గుప్తంబుగ ఆత్మ, నిజమిది – మంకుతిమ్మ!
(జాగృదావస్థ = మేల్కొన్న స్థితి: సుప్తావస్థ = గాఢ నిద్రాస్థితి)
894.
సూర్యోదయాస్తమానాల కారణంబుగ మనకగు కాల
నిర్ణయంబు: సూర్యుడే లేకుండె నేని
అంత్యమే లేని పరిశుద్ధ బ్రహ్మమ్మే నిండియుండు
లీనమై పొమ్ము నీవు అందున – మంకుతిమ్మ!
895.
సంకేత భావమయ మీ జీవన వ్యాపార మరయ
అంకెల మయమై నిర్వహింపబడుతున్నవి కార్యములు
సంకేతంబుల, అంకెల మూలంబుగ ఏర్పడు సంబంధములు
అంకెలకు, సంకేతములకు మీరినది సత్త్వము – మంకుతిమ్మ!
896.
భౌతిక శాస్త్ర విజ్ఞాన వివరంబులు ఆత్మకేల?
ప్రేత ప్రయాణ కథ వివరంబులు ఆత్మకేల?
జాతి నీతి సమాజ వర్గ భేదముల కథ ఆత్మకేల?
ఆత్మకు లేదు హాని – మంకుతిమ్మ!
897.
శూన్యమే ఎల్లెడల యని యన్న దాని యర్థమేమి?
అన్యమేదియూ లేదను భావమా? ఆ ఆలోచన ఎట్లు కలుగు?
చిన్మయ స్వరూపంబదియని దెల్సి నాశ్రయింపుము
శూన్యవాదమే శూన్య మరయ – మంకుతిమ్మ!
898.
నరనారీ చిత్రంబులు, నాటకపు పాత్రలు
పరిపరి విధముల వేషములు, నానా భాషలు
మరి మరి వచ్చి విస్మయము పుట్టించి మెఱసి కనుమరుగగు
అరయ ఈ లోకమొక జాతర – మంకుతిమ్మ!
899.
మాయా ప్రపంచ మిది, ఇంద్రియ గోచరంబగు నానా విచిత్ర
మాయా కల్పిత రూపంబులన్ చెఱపి నెట్టివేయుమావల,
మాయ తొలగిన తరి గోచరించు నిరాకార పరతత్త్వము
పాయక సారించుము నీ దృష్టి అటువైపు – మంకుతిమ్మ!
900.
తనువు, నల్దిక్కుల నుండి వీచెడి గాలి ఒత్తిడికి గురియైనను
మనసు ఒత్తిడికి గురికాక స్థిరంబుగ నుండు; అచంచలమది
అనువుగ లోకపు భారము ఆత్మకు తెలియకున్న యదియ
మౌని లక్షణము – మంకుతిమ్మ!
(ఇంకా ఉంది)
శ్రీ కల్లూరు జానకిరామరావు రచయిత అనువాదకులు. వీరి తండ్రి కీ.శే. కల్లూరు అహోబళరావు ప్రముఖ కవి, బహు గ్రంథకర్త. కృష్ణదేవరాయ గ్రంథమాల వ్యవస్థాపకులు. తల్లి కీ.శే. సీతమ్మ గారు.
జానకి రామరావు గారి భార్య కీ.శే. సుభద్రమ్మ. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.
వీరి పుట్టిన తేదీ: 23(15) జూలై 1941. విద్యార్హత: B.A.Bed, M.A.( English)
హిందూపురం ఎంజీఎం హైస్కూల్లో 1964 నుండి 1990 వరకు 26 ఏళ్లు ఉపాధ్యాయుడిగానూ, 1990 నుండి 1999 వరకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు.
ప్రస్తుత నివాసం బెంగుళూరు. ఫోన్: 9740849084
