Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-90

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]


~

901.
నిండు చిన్నమట్టికుండ, అపార పారావారమున్ మఱచి
నిండు గర్వంబున ‘నేనే నేనే’ యనచు గానంబు జేసిననేమి?
నిండు కడలిన్ దానినుంచ తన యస్తిత్వంబు గోల్పోయి లీనమై
నిండుతనంబున్ కోల్పోవు; గర్వంబు వలదు – మంకుతిమ్మ!

902.
జారిపడు పొత్తము నిద్రావస్థ నున్న చదువరి చేతినుండి;
వేరుపడు తరువు నుండి పక్వంబైన ఫలంబు; జీవవ
చరమాంక మందున సడలిపోవు సంబంధ నియమంబులు,
జారిపోవునన్నియు బ్రతుకు మాగినపుడు – మంకుతిమ్మ!

903.
మోక్షంబు వడయ నభిలాషింపు ఆతురతయే ఎల్లరకున్
శిక్షితుడై బహుకాలంబు నడచినగాని మోక్షంబు సున్న;
లక్ష్యంబు తప్పక నాచరించవలె సామాన్య ధర్మముల నెల్లన్
మోక్షంబు స్వతస్సిద్ధ మపుడు – మంకుతిమ్మ!

904.
వహించుము కొన్ని జీవనంపు భారంబుల; సహించుము బాధల,
ప్రహరించుము శత్రువుల యుక్తి యుక్తుల చేత; ఇ
మ్మహి నాటకంబున మనసు బెట్టి కుప్పించి గంతులు వేయుచు
విహరించుము పరమేశు ఆత్మాలయంబున – మంకుతిమ్మ!

905.
శునక మొకటి తిప్పగుంట నిదురించగ, పూర్వజన్మ వా
సన జ్ఞానంబు చేత పశ్చాత్తాప మొందిన దానివలె,
వెనువెంటనే లేచి చెవుల్గొట్టుకొనుచు పరుగులిడు;
మన మనసును అంతియే – మంకుతిమ్మ!

906.
చిత్తశుద్ధి లేక అగునే పరమాత్మ సాక్షాత్కారము
చిత్తశుద్ధి చమత్కారంబున కానేరదు
విస్తారపు లోక హితంబు కొఱకై సత్కర్మాచరణ యందా
సక్తియు, శుద్ధతయు వలయు – మంకుతిమ్మ!

907.
తను రుగ్మతలకే పథ్యము, జిహ్వాచాపల్యంబునకు గాదు,
మనశ్శిక్షణకే లోక సంపర్కము, కాదు మమకారంబులకు, త్రి
గుణ చర్య, సమరసాభావంబునకే, కాదు కామితంబునకు
మును లాచరించిన విధానమిది – మంకుతిమ్మ!

908.
పస్తులుండియు, అతిథుల కాహారమొసగి, తాదినువాడు
ఉత్తముండు; తన కుక్షిం నింపుకొనునే తొలుత గృహలక్ష్మి,
భర్తయు బిడ్డలు కడుపునిండ ఆరగించ, తాను నేతి ముద్దల్దిని
నంతగ సంతసించు: ఆ మార్గమ్మున నడువుము నీవును – మంకుతిమ్మ!

909.
చిన్నతనాన, ఆటబొమ్మకై_ఏడ్చి, పెద్దల నేడ్పించి
చిన్న చిరుతిళ్లెన్నో తిని పెరిగినవాడు – తానిపుడు
చిన్నారులు పెంచి యజమానత్వంబు వహించు
ఎన్నగ వాడె జగంబులేలెడి జాణ – మంకుతిమ్మ!

910.
సామాన్య కుటుంబమునన్ పుట్టె, సామాన్య జనులతో పెరిగె,
అమెరికను లాయనకు రాజ్యపట్టంటు గట్టగ, అతి
సామర్థ్యంబున నేలె ఆబ్రహం లింకన్ మహనీయుడు
అమరుడాయెనా యోగి లోకవంద్యుడాయె – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

Exit mobile version