[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]
~
911.
సేనాపతి ‘సిడ్ని’ డస్సి, దప్పిగొని, రణంబున నేలబడి
ప్రాణాపాయ స్థితి నున్న తరి, దాహమీయ, తనకంటెను
దీనావస్థనున్న భటుని దాహార్తి తీర్చమని యాదేశించి
ఆనందించిన యతని స్మరింపుము – మంకుతిమ్మ!
(సిడ్ని 1554-1586 మధ్య ఇంగ్లండ్ సేనాపతి. ఓసారి యుద్ధంలో గాయపడి, దప్పికగొని యున్నప్పుడు, ఆతనికి నీరమందిస్తున్న సమయాన, తనకంటె ఎక్కువగా, ప్రక్కనే పడియున్న భటునికి అవసరమని తలచి, ఆ నీటిని ఆ భటునకందించి తాను ఆనందించాడు సిడ్ని.)
912.
ఇంద్రియ రహిత జీవనమది యనూహ్యము
ఇంద్రియ సహితంబది పక్వంబొనరించు జీవనంబును
ఇంద్రియలోలత్వవశుడు గాక నిలుకడగ నున్న, పం
చేంద్రియ జితుడే స్థితప్రజ్ఞుడు – మంకుతిమ్మ!
913.
సంకుచిత మనోభావ చీకటి సందుల జేరక, సము
దంచిత విశాలహృదయుడవై చరించి యెల్లరన్ గూడి,
ఎంచగ భాస్కరానుగ్రహమే జీవంబులకు సత్త్వము; నీ
అంచుల జేర వెఱచు మృత్యువు – మంకుతిమ్మ!
914.
కెరటమవు నీవీ విశ్వజీవన దివ్యాబ్ధియందు; నేను
వేరనెడి తలంపు మరచి, కరిగి పొమ్మావార్ధియందు,
మారుతము బలంబుగ వీచినన్, తేలుచు ఓలలాడుచును
నేర్పుగ విహరించి సంభ్రమించుము – మంకుతిమ్మ!
915.
మానవుని సాధన యంతయు పొల్లని, అల్పమనిపించు
ఒనరించిన పుణ్యకార్యంబులును యహంకారమనిపించు
ఒనరగ వికసించెడి విరజాజి వోలె నగుచును, నవ్వించిన
అనువయిన సారమగు, లేకున్న భారంబగు – మంకుతిమ్మ!
916.
జన్మంబులవి వేనవేలు రానిమ్ము, నష్టంబదేమి?
కర్మంబులవి రానిమ్ము వేనవేలు కష్టంబదేమి?
బ్రహ్మలీల ఇది యని తెలియ, మాయ జేయునదేమి?
భామామణి సరసమది – మంకుతిమ్మ!
917.
నవ్వు, సహజ ధర్మము ఇతరుల నవ్వించునది పరధర్మము,
నవ్వు నాలకించి, నవ్వుచుండుట యది అతిశయ గుణము,
నవ్వుచు, నవ్వించుచు, తానవ్వునది యొక వరము,
అవ్వరము నతిశయంబుగ నిమ్మని వేడుము – మంకుతిమ్మ!
918.
గహనంబైనదీ జీవన రహస్యంబు, మనసున్ వేధించు
అహరహంబు; ఏకాంతంబున, మౌనంబున దీని తత్త్వంబును
మహిమన్ మదిన్ దలచినన్ గాని యవగతంబు గాదు,
మహిమాన్వితమిది, శరణాగతుడగుము – మంకుతిమ్మ!
919.
జీవి పుట్టుక ఓ రహస్యము, దాని విలయంబును రహస్యమే!
జీవన దృశ్యమిది కాననయ్యెడి మరుభూమిని ఎండమావి;
భావింపగ బ్రహ్మమాయాతత్త్వంబీ రీతి భ్రాంతియే.
కేవల మాత్మయే పరబ్రహ్మము – మంకుతిమ్మ!
920.
శాంతించి చల్లబడుగాక వాంఛాతప్తమైన నా ఎడద; సమ్మి
ళితంబగు గాక నా జీవనము విశ్వంబు జీవనంబున; నిదురబోనిమ్ము
ఈ తల్లి నేలతల్లి ఒడిలోన, నన్నింటిన్ మరచి యని యాశింపుము
అతనిని పరమాత్ముని – మంకుతిమ్మ!
(ఇంకా ఉంది)
శ్రీ కల్లూరు జానకిరామరావు రచయిత అనువాదకులు. వీరి తండ్రి కీ.శే. కల్లూరు అహోబళరావు ప్రముఖ కవి, బహు గ్రంథకర్త. కృష్ణదేవరాయ గ్రంథమాల వ్యవస్థాపకులు. తల్లి కీ.శే. సీతమ్మ గారు.
జానకి రామరావు గారి భార్య కీ.శే. సుభద్రమ్మ. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.
వీరి పుట్టిన తేదీ: 23(15) జూలై 1941. విద్యార్హత: B.A.Bed, M.A.( English)
హిందూపురం ఎంజీఎం హైస్కూల్లో 1964 నుండి 1990 వరకు 26 ఏళ్లు ఉపాధ్యాయుడిగానూ, 1990 నుండి 1999 వరకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు.
ప్రస్తుత నివాసం బెంగుళూరు. ఫోన్: 9740849084
