Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-92

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

~

921.
విశ్వాత్మ సాగరంబున కాలిడి, మునక లిడుచు
విశ్వంబు వేరని తలంపక మునిగి గడిపెద; భూ, యా
కాశ సౌందర్యంబుల గని మైమరచి నాట్యమాడెడి యవ
కాశంబిది యని తలచి – మంకుతిమ్మ!

922.
బంధువులకు, భాగస్థులకు ఎల్లరకున్ నా నమస్సులు
అందందు నన్నుల్లాసపరచి నాడెందమున్ క్షాళణ జేసి
పొందదు నీకీ నశ్వరంపు జగమని దెల్పి గురువులైన వారికి
వందనముల నర్పింతు – మంకుతిమ్మ!
(నేను ఈ కగ్గలను ముగించి సెలవు తీసుకొనే సమయం దగ్గర పడిందని చెబుతున్నారు మాన్య డి.వి.జి.గారు)

923.
గురువెవ్వరు నీకు? అనాథ అనామకుడవు నీవు
దారిన్ దొరికిన ఎంగిలి మెతుకులన్ దినుచు గడుపుము;
గురు, శిష్యులనెడి పట్టంబులేల నీకు; నీకు నీవే
గురువు తెలియుము – మంకుతిమ్మ!
(మహాత్ముడైన పెద్దల నుండి శాస్త్ర సంస్కారాలను నేను పొందలేకపోతిని, విద్వాంసులైన గురువుల వద్ద అభ్యసించలేకపోతినని శ్రీ డి.వి.జి.గారు వాపోయారు; ఎంగిలి మెతుకులు = గురువుల ద్వారా కాక ఎంతో కొంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాను అని చాల నమ్రతతో విన్నవించారు.)

924.
సదనమునకు దూలమై, మెట్లై యుపయోగపడు ఓ తరువు
మధుర ఫలంబుల నిచ్చునో తరువు, పూతీగె సతి సిగకిచ్చు శోభ
ఏదియన్ నీక ఎండిన తరువు వంటచెఱకుగ నుపయోగపడు
ఎద్దానికిన్ పనికిరాక నుండదగదు నీకు – మంకుతిమ్మ!

925.
జోలి నొక సంక దగిలించి, యూరూర నడచి
లీలగ పాటల్ పాడుచు భారంబు లెల్ల మరచి
మేలుకీడులన్నింటి మరచి, మనసు నూరడించుచు
ఉల్లాసంబుగ నుండుట ఎన్నడో నీవు – మంకుతిమ్మ!

926.
తొలగి పొమ్ము నీ గేహంబును నీ మనసు వట్టిపోయిన నాడు,
మలినంబుల తొలగింప నీ భుజబలంబు చాలని నాడు,
తొలగిపొమ్ము దూరంబుగ, భూమికి భారంబుగాక
తొలగి అదృశ్యుడగుము – మంకుతిమ్మ!

927.
మరలుము నిర్జనంపు దిశకు, రుద్రభూమి వైపునకు
చేరుము దుఃఖంబు రాని అనాపేక్షిత ప్రేమానురాగము
దొరకు చోటునకు, మనసును విలయంబు జేసి
నోరు మూసుక చేరుమచటికి సుఖనిద్ర తీయ – మంకుతిమ్మ!

928.
తన కాల మాసన్నమైనదని తెలియ, అడవి ఏనుగు, అడవి
లోన గుహ నొకదాని జేరి, మౌనంబున త్యజించు తన
ప్రాణంబుల నని జెప్పెదరు లోకులు; అవసాన కాలంబున
మనమును జేరవలయు నచటికి – మంకుతిమ్మ!

929.
సద్దుసేయక వచ్చిన వాడవే నీవీ భువికి? ఏడ్చుటయు
సద్దుసేయుటయు గుద్దులాడుటయే నాయె నీ బదుకు
సద్దుల గుద్దుల విడనాడుటన్ తుదినాడైన సాధ్యమగునె!
నిద్దుర బోలిన మిత్తిని పొందుము – మంకుతిమ్మ!

930.
నిను, విధి పిడికెడన్నంబునకై నితరుల యాచింపనీక
పెను భారంబు నీ ఉనికి యనువారికి భారంబుగాక
మనగ ఏ తలంపులు నిన్నంటుకొనకుండు గాకయని
దీనత వేడుమా పరమాత్ముని – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

Exit mobile version