Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-93

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

~

931.
వేదాంత విన్నాణముల, నమక చమక పఠనంబుల
కేదారగౌళ మణిరంగారభి సంగీత సరస మాధుర్య
నాదంబుల మనసును మేళవించి, నిష్క్రమించిన
సాధనమది ముక్తి ప్రాప్తికి – మంకుతిమ్మ!

932.
మోహన, ఆనందభైరవి, శంకరాభరణ, కాపి
శాహన, కురంజి, కేదారగౌళ రాగంబుల స
మ్మోహ సర్వ స్వరాబ్ధి ఆ పరబ్రహ్మ; మునిగి తేలుము
అహరహంబు అందు – మంకుతిమ్మ!

933.
జీవన పరిపక్వతకు కారణంబులు కష్టంబులు – ధర్మంబు
లవి యతి సూక్ష్మంబులు, దెలియ కష్టంబె – కష్టంబు వాటి
నన్వయింప – వినిన చదివినంత మాత్రన గాదు వాటి నరయ
కావలె బుద్ధి సూక్ష్మత వివేకము – మంకుతిమ్మ!

934.
లోక భాండాగారంబున నున్నవి వేనవేలు మతంబులు
ఎన్నుకొనుము నీ అభిరుచి కనువైన వాటిని: ఎన్నుకొని
అన్నింటిని విచార మనెడి అగ్నిన్ పక్వంబు జేయుము;
ఎన్నో మతులు, మతములు ఈ లోకాన – మంకుతిమ్మ!

935.
మిరియము, పిప్పిలి, శొంఠి, జీలకర్ర – అవి
పరిపరి విధముల రోగముల కుపశనంబు కలుగజేయు;
మరియు నీతి సూత్రములు గలవు లెక్కకు మిక్కిలి
ఏరి కోరి ననుసరింపుము నీ కనువైన దాని – మంకుతిమ్మ!

936.
విశద జీవన ధర్మ దర్శనంబు నా మది నెలకొనంగ
విశద గ్రంథావలోకనంబున, ఆత్మానుభవంబున
విశదమొనరించితి కగ్గల రూపంబున నా యనుభవంబుల
విషయ సంగ్రహణము మీయది – మంకుతిమ్మ!

937.
హృదయంబునకు హృద్యంబై బరగు రాగతాళ సంగీతము,
గద్యము, లౌకిక తాత్త్వికంబు ప్రతిపాదించెడి సరళ సాధనము,
మధ్యేమార్గంబున నిల్చి, నేలవిడిచి, నింగిని ముట్టలేనిది
పద్య మరయ అధిక ప్రసంగి – మంకుతిమ్మ!

938.
కవిని గాను నేను, విజ్ఞానియును గాను, అటు నిటు తారాడి
అవి, ఇవి కొంత జ్ఞానంబున్ వడసి గడిపితి జీవనంబు
ఇవి, ఈ కగ్గలు పామరజన యుక్తమై సులభగ్రాహ్యంబులు;
కవనము మనసు నాకర్షించు – మంకుతిమ్మ!

939.
సందేహాస్పదమైనవీ కృతియందు లేవని నే చెప్పజాల,
ఇందు కాననగు నన్నియు దోషరహితంబులని చెప్పజాల
అందందు కాననగు దోషంబుల దిద్దుకొన మనసు గలదు,
ఇందల విషయములీనాటి కుచితంబులు – మంకుతిమ్మ!

940.
వ్యాకరణ, కావ్యలక్షణంబులన్ గణుతింపగా లేదు
లోకంపు కష్ట కార్పణ్యంబులకున్ జిక్కి నలిగి, విముక్తి వాంఛించు
లోకులకీ కగ్గలు నెమ్మదిన్ కలుగుజేయునని తలంతు
స్వీకరింతురుగాక వాటిన్ వలసినవారు – మంకుతిమ్మ!

(ముగింపు వచ్చే వారం)

Exit mobile version