Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-94

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

~

941.
మంకుతిమ్మన యనుపేరు సొగసుగ లేదన్న వారికి నామాట
వెంకన్న, ధర్మన్న, శంకరణ్ణ యని మీరు భావించుడు,
అంకిత భావంబున దీనిన్ జనులు చదివిన చాలు,
శంకలు, వంకలు నీకేల – మంకుతిమ్మ!

942.
వరమదేమి కోరెదవు? కోరుకొనునదేమో నీకవగతమే!
సరియనిపించినది నేడు, రేపటికది సరియగునే?
చిరకాలమది సరిగ నుండవలెననెడి నిరీక్ష సాధ్యమే!
అరయ దాని దెల్సినవాడు దైవమొకడే – మంకుతిమ్మ!

943.
వేడిన యన్నింటినిన్ ఈశ్వరుడొసంగునని నమ్మకమే!
వేడిన వరంబులవి యుచితంబులనెడి బుద్ధి గలదే!
కూడి వచ్చినదెదో యదియ భగవత్ప్రసాదమని దెలిసి
ఎడదన్ గట్టి చేసికొనుము – మంకుతిమ్మ!

944.
అందరి కోర్కెలు దీర్పగా, అందరున్ ఒక్కరి కొఱకు, ఒక్కడు
అందరి కొరకని, సమానత్వంబున, అన్యోన్యత మెలగుచు
అందరిని బ్రోవగ నున్నాడా బ్రహ్మయని దెలివినొంది
అందరున్ నెమ్మదిన్ గడపవలె జీవనంబును – మంకుతిమ్మ!

945.
శరణాగతుడగుము జీవన సత్త్వంబునకు
శరణాగతుడగుము జీవనమొక సుమమని దలచి
శరణాగతుడగుము అంతరాత్మ గంభీర ప్రశాంతి కొఱకు
శరణాగతుడగుము విశ్వాత్మయందు – మంకుతిమ్మ!

(సమాప్తం)

ముగింపు:

మా జనని కీ.శే. సీతమ్మ, మా జనకులు కవితిలక, కవిభూషణ, కవిశేఖర కీ.శే. కల్లూరు అహోబలరావుగారి ఆశీస్సుల బలంతో నేనీ కార్యమునకు పూనుకున్నాను. హనుమంతుని ముందు కుప్పిగంతులు వేసినట్టు, శ్రీయుత గుండప్పగారి కవితా కౌశల్యమెక్కడ, అల్పజ్ఞానవంతుడనైన నేనెక్కడ! ఇది అంతయూ ఆతని పరోక్ష ఆశీస్సుల బలమే.

పోతనగారు చెప్పినట్టు  – పలికెడిది ‘మంకుతిమ్మనకగ్గ’, పలికించినవాడు శ్రీమాన్ డి.వి.జి.గారు, నే పలికిన ఆంధ్రసాహితీ ప్రియులకు ప్రియమగునని ఎంచి, సాహసించి తెలుగునకు అనువదించినాను. ఈ నా ప్రయత్నమున నేనెంత వరకు కృతకృత్యుడైతినని చెప్పగలిగినవారు సాహితీప్రియులే.

తొలుత 501 కగ్గలను ఆంధ్రీకరించి, పుస్తక రూపకంగా విడుదల చేసినపుడు చదివి, తమ అభిప్రాయాలను ప్రశంసల రూపకంగా ప్రకటించిన వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ప్రారంభం నుండీ, సమాప్తం అయ్యేదాకా, ఒక్క వారం కూడా తప్పక 95 వారాలపాటు ప్రతి ఆదివారం ప్రచురించిన సంచిక డాట్ కామ్ వారికి నా ప్రత్యేక అభినందనలు. ఇందలి గుణములన్నియు శ్రీయుత గుండప్పగారివి. దోషములన్నియు నావి. దోషముల గుర్తెరిగి చూపిన, వాటిని సవరించుకోగలనని మనవి. ఏదో కొంతవరకు భాషాజ్ఞానమున్నవాడినే గాని కూలంకషమైన ప్రజ్ఞ ఉన్నవాడిని కాను.

గీతాచార్యుడు చెప్పినట్లు:

“తస్మాదసక్త స్సతతం కావ్యం కర్మ సమాచర।
అసక్తోహ్యా చరన్ కర్మ పరమాప్నోతి పురుషః॥”
(కర్మయోగం 19వ శ్లోకం)

సక్త భావం లేకుండా, అసక్తుడనై ఈ కార్యాన్ని నిర్వర్తించాను. ఆత్మ తృప్తి కంటే వేరే ఆపేక్ష లేదు నాకు.

ఓం తత్సత్
హరిః ఓం శ్రీ గురుభ్యోనమః..

కల్లూరు జానకిరామారావు

Exit mobile version