[ధనుర్మాసం సందర్భంగా ‘తెలుగులో తిరుప్పావై’ శీర్షికతో పాశురాలను అందిస్తున్నారు శ్రీమతి మరింగంటి సత్యభామ.]
పరాశరభట్టర్తనియన్ 16-12-2025
నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్యకృష్ణం
పారార్ధ్యంస్వంశృతిశతశిరంసిధ్ధమధ్యాపయంతీ
స్వోఛ్ఛిష్టాయాంస్రజినిగళితంయాబలాత్కృత్య
భుంక్తే
గోదాతస్మైనమ ఇదమిదంభూయ ఏవాస్తు
భూయః
నీలాదేవి ఉత్తుంగస్తనశిఖరాలపై నిద్రలో మునిగి
యున్న ఆ శ్రీకృష్ణపరమాత్మను నిదురనుండి
మేల్కొలిపి, వేదతత్వార్థ సారమును
తెలియజేసి జ్ఞాన, కర్మ, భక్తియోగములు అను
ఉపాయముల వలన కృష్ణ సన్నిధాన భాగ్యము,
అనుగ్రహము సంపాదించవలెనంటే (వ్రేపల్లె
వ్రేతలు ఆచరించిన కాత్యాయనీ వ్రతా
చరణమువలె) మార్గశీర్ష వ్రతం ఆచరించమని
గోపికలను పెద్దలు నియమించిరి
గోదాదేవి వ్రేపల్లెపడుచులకు నాయకురాలి వలె
తలపోసి భగవదనుగ్రహ వ్రతానుష్ఠానమున
తోటివ్రేతలను ఆ వ్రతమునకు ప్రోత్సహించి
స్వామిసేవకు సుప్రభాత ప్రభోదము,
వాంఛితార్థ ప్రాప్తి ఇతివృత్తంగా గలిగిన ముప్పది
పాశురములతో దివ్య ప్రబంధము”తిరుప్పావై”
దైవసన్నిధిలోయోగములను ఉపాయములు,
జ్ఞాన,కర్మ,భక్తియోగములు
నీల ఘన జఘన గిరిపైశయనించిన
నీలమేఘశరీరుని మేల్కొలిపి వేద
తత్వార్ధసారమును తెలియజేసి
జ్ఞాన,భక్తి,ధర్మ సారముతెలిపి శ్రీకృష్ణ
సన్నిధాన భాగ్యము కావలెనని
మార్గశీర్ష వ్రతమాచరించ గోద
భగవదనుగ్రహ వ్రతానుష్ఠానమునకు
సుప్రభాతప్రబోధమ్ము వాంఛితార్ధప్రాప్తి
కొరకుసేవించవలె శ్రీరంగనాధుని
రండు!రండని పిలిచె వ్రేపల్లెలేమలను
వ్రతనియమముల పాశురముల
కీర్తించుచు గోదసఖులనుపిలచె!
హారతి
శ్రీరంగనాధులకు మంగళము మంగళము
పెరియపెరుమాళ్ళునకు ‘దీప’హారతులు
ఓం నమో నారాయణాయ
1వ పాశురం 16-12-2025
అవతారిక
గోదాదేవి వ్రతామాచరించుటకు తోటివారిని పిలుచుచున్నది.
వివరణ
సుందరరూపముగల గోపిక తోటి ఇష్టసఖులను సూర్యచంద్రులు వంటి ప్రకాశముగల యోధుని, తేజోవిలాసుని, మన యశోద తనయుడైన బాలకిశోరుని కొలువ పూనికతో నీరాడ పోవుదమా మార్గళీవ్రతముచేయ విలక్షణాభరణములుగల ముదితలారా! హరికీర్తనము స్మరణామృతములతో సేవించగారమ్ము! సఖులారా! అనిగోద మార్గళీవ్రతము చేయగాస్నానము చేయరమ్మని గోపికలను పిలుస్తున్నది.
కవితామాలిక
నీరాడపోవుదము రండు! లలనలార!
గోకులాంగనలార! రారమ్ము! రమ్ము!
వెన్నెలలు కురిసేటి మార్గశీర్షమున
ధనుర్మాస వ్రతము చేయుదము రారే!
శ్రీకరముగ వ్రేపల్లియ వ్రేతలందరము!
వ్రేపల్లె లోనున్న లేమలార! చెలువమ్ముతో
మెరయు రమణులార! పరమపదమైనట్టి
వైకుంఠవాసుడు మనోకామనలు తీర్చు!
నారాయణుని సేవించుటకు రారే! సఖులార!
చంద్ర కౌముదితో, సూర్య తేజమును,
కెందామరలబోలు, నయనయుగళము
నీలమేఘశ్యామలాంగుడైన వెన్నుని
నందవ్రజఏలిక నందగోపుని కొమరుడు,
యశోద ఒడిలోన కిషోరసింగమును
కీర్తించ నీరాడ పోవుదము! రండు!రారండు!
హరిభజనము, అర్చనము, యోగదాయకగ
విలక్షణాభరణముల ధరించి, తరించగ
యజ్ఞము, యాగము, దానము, సత్యము,
శీలము, నీతి, సౌశీల్యము, ఋజువర్తనము
తోడ, కల్లకపటము లేని గొల్లభామలము!
రమ్ము! ఓ చెలులార! ఓ సఖీమణులార!
వైకుంఠవాసుని కీర్తించగ నీరాడరారండు!
హారతి
పరమపదమునిచ్చు పరమాత్మకు
వైకుంఠవాసునకు వాసుదేవునకు
మంగళము నిత్యశుభమంగళము
ఓం నమో నారాయణాయ
స్నానములు
- నీటమునకలు వేయుట
- వాన నీట తడియుట
- గోధూళి శరీరమును సోకుట
- మంత్రోదకముల సంప్రోక్షణ
- పవిత్రతీర్థ స్నానము
శారీరిక, మానసిక తాపములను హరించి పవిత్రులను చేయును కనుక మార్ఘళీ స్నానమాచరించగ రమ్మని గోదాదేవి పిలుపు.
పాశురం 2 17- 12-2025
అవతారిక
గోదాదేవి మార్గళీమాసవ్రత నియమములను గోపికలకు వివరించుచున్నది.
వివరణ
వసుధలోన ఉన్నతమైన అభివృధ్ధి గల ఓ నెచ్చెలియలారా! ధనుర్మాస వ్రతానుష్ఠాన నియమ, నిష్ఠలను, చేయు కృత్యములను వినండి. సౌభాగ్యవతులారా! వేకువనే జలకమాడి క్షీరసాగరశయనుని పవిత్ర పాదములను అర్చించి, పాడి, స్తుతించి మేము నెయ్యితినము, పాలుతాగము, కనుల కాటుక దిద్దము అలరులను (పువ్వులను) తలలోముడుచుకొనము, చేయరాని పనులను చేయము. చెడు మాటలను పలుకము. యథాశక్తి యుతంగా దానము చేసి (పత్రం, పుష్పం, ఫలం, తోయం) ఆనందించెదము.
ఇదే మా మార్గళీవ్రతము. పాలకడలిలో ‘నారాయణుడు’ యోగనిద్ర యందున్నాడు. నిద్రించు పరమాత్ముని ఎట్లు మేల్కోల్పుట! సందేహ మేల? దివ్యదృష్టిచే అన్నియూ చూచుచునే యుండును. భక్తియుతముగ కీర్తించేదము రమ్ము!
కవితామాలిక
నిదుర మేల్కాంచరే! ఓ లలనలార!
నీరాడ రారండు! ఓ చెలియ లారా!
పాలకడలి యందు శేషపానుపున
యోగనిద్రపోవు యోగీంద్రు మేల్కొల్ప
సందేహమదియేల? యోగనిద్రయందు
సకలమ్ము కనుస్వామి చైతన్యమును
మరచు నిదురకాదు! నిరాకార రూపుడు!
నిరంజన స్వరూపుని సేవించుట కొరకు!
వ్రతానుష్ఠానమున నీమముల తోడ,
భౌతికాలంకారములు, భోగవస్తువుల
నాశింపము! కాటుక రేఖలదిద్దము!
పూలు ముడువము! నిర్మల మానసమున
శాంతి, దాంతి, క్షమ, కరుణ, సత్శీలమున
చేయరాని పనులు చేయబోము!
అనృతము పలుకము! కొండెములు చెప్పము!
ఘృత, క్షీరముల స్వీకరించబోము!
శక్తియుతముగ దానమిచ్చు వారలము!
దివ్యమంగళస్వరూపు కీర్తించి, సేవించి
తరియించగలము! ఇదియె ఆచరించు
మార్గశీర్ష వ్రతము! పరమపద ప్రాప్తిపథము!
రారమ్మ! రారమ్మ! గోపికా వ్రేతలార!
రమ్ము! రారమ్ము! యమున మడుగున
నీరాడ రండు! హరిని కీర్తించ రారమ్ము!
హారతి
మంగళాకారునకు జయమంగళం
సకలశుభరూపునకు శుభమంగళం
గొల్ల గోపాలునకు గోపికల మంగళము
ఓం నమో నారాయణాయ
3వ పాశురము 18-12-2025
అవతారిక
ధనుర్మాస వ్రతానుష్ఠానమున తమకే కాక, ఇతరులకూ ఫలము గలదని గోదాదేవి చెప్పుచున్నది.
వివరణ
శ్రీమహావిష్ణువు దేవతల కార్యార్ధము కురుచ వామనునిగ అవతరించి త్రివిక్రముడై (బలి గర్వమణచి అనుగ్రహించిన స్వామి) లోకములు కొలిచిన విశ్వస్వరూపుని పావన నామము స్తుతించి మా వ్రతమున పవిత్ర స్నానం చేసినాము. దేశము సుభిక్షమై నెలకు మూడు వానలు కురిసి, కేదారమున, వరిపైరు మధ్య నీటిలో చేపలు తుళ్ళింతల ఈదుతూ, కలువపూవుల మధ్య ఎగురుతూ కనిపించు తుమ్మెదలు మకరందంగ్రోలి మత్తుగా చలించకున్నవి. పాలతో పొదుగులు నిండిన ఆవులు ఎడతెగని పాలధారలతో ‘ఘటములు’ పొంగుతున్నవి. మా వ్రతానుష్ఠానమున, దేశము పాడిపంటలతో భద్రత పొందియున్నది. శోభాయమానమైన వ్రతము మోక్షానుకూలమై, అకారత్రయ సిధ్ధి కలుగును.
(1. అనన్యార్హత్వము 2. అనన్యభోగత్వము 3.అనన్యశేషత్వము)
కవిత
రండు! రండు! ఓ కోమలాంగులార!
గోపికారమణులార! నీరాడగ రండు!
అదితినందనుడు కురుచ వామనుడు!
లోకములన్ని కొలచి త్రివిక్రముడు ఆయెనే!
హరిపాద స్పర్శచే లోకములే పావనమాయే!
బలి అహమణచి వరములనిచ్చిన దేవర!
విష్ణునామ స్మరణ వలన నెలకు మూడు
వానలు కురిసి సస్యశ్యామలమై సమృధ్ధిగ
పాడిపంటల వృధ్ధి, క్షీరములే ధారలుగా
కుంభములే పొంగిపొరలె! సౌభాగ్యకరము!
మా మేలినోముఫలము మాగాణి పొలములలో
మీనముల తుళ్ళింత కమలములు, కలువల
సొంపారగ మధువ్రతల, మత్తుతో మంద
గమనమున, సిరిసంపదల, భాగ్య,భోగముల
వృధ్ధికాగ! పూని వ్రతము చేయగా రండు!
నీరాడగ రారే! శ్రీరంగనాథుని సేవించగ భక్తితో!
వేవేగరా రండు! రారే ఓ రమణీమణులార!
స్నానమాచరించ ముక్తిపథము కోరి రారమ్మ!
హారతి
దశావతారునకు తులసీదళమాలికాహారతి
వైకుంఠధామునకు సంపంగి హారతులు
శ్రీమహావిష్ణువుకు కనకాంబరం నీరాజనాలు
మంగళము మంగళము జయమంగళం
ఓం నమో నారాయణాయ
4వ పాశురము 19-12-2025
అవతారిక
వ్రతానుష్ఠానమున జలసమృధ్ధి కొరకు ‘వరుణదేవుని’ ప్రార్థించుచున్నది గోద!
వివరణ
వర్షములకు నియామకుడవైన వరుణదేవా! పర్జన్యుడా! వర్షములు లేనిదే సస్యములు లేవు! ప్రాణులకు ఆహారము వుండదు. శ్రీమన్నారాయణుడు ‘లోకరక్షణ’ బాధ్యత వహించినట్లు పర్జన్యుడు ‘అన్నప్రసాదము’ను ప్రజలకు అనుగ్రహిస్తున్నాడు! ఓ పర్జన్యుడా! వర్షమును కురిపించుటలో లోభత్వము చూపక ఉదారముగా వానలు కురిసి మమ్ములను అనుగ్రహించుము. కొంచెమైన నీరు దాచకుము.
‘వారాశి’లో వున్న నీరు కడుపునిండ కరువు లేక తాగి గర్రుమని తేల్చి గర్జించి గగనమునేగి మేఘ లక్షణమైన వాన కురిపించుము. ఆదివిష్ణువు ఆకారమున నీలమేఘస్వరూపివై సుందర కరములెత్తి పద్మనాభుని చేతనున్న చక్రాయుధముమించి దక్షిణావర్త శంఖమువలె గర్జనలతో ఆగక పాంచజన్య బాణవర్షము వోలె లోకముల ‘జల’సమృధ్ధి పొందునట్లు వానలు కురిపించుము. జలవర్షధారల కురిపించుటలో లోభత్వముచూపకు. మేము మార్గళీ స్నానము సంతోషముగ చేయునట్లు వర్షించుము.
సముద్రజలరాశి లవణీయతవల్ల ప్రయోజనమేమి లేదు కదా!ఆ క్షారజలమే మేఘములు గ్రహించుటచేత మంచితీర్థ స్వభావం సంతరించుకొని అమృతప్రాయమౌను. పంటలు పండి షకములనిచ్చు పావనగంగగా మారుతున్నది.
కవితా మాలిక
నీరాడ రండోయి! గోపికా రమణులార!
పొంగిపొరలు వాగుల స్నానమాడగ రండు!
వర్షాధినాథుడు వర్షహర్షమున జలవరమిచ్చె
రారమ్ము! రమ్ము! ఓ యోషితామణులార!
సాగరుని గర్భమున జలము కడుపార గ్రోలి
నింగి పైకెక్కి గర్జించి, ఉరిమి రెండు చేతులు
చాచి గంభీరగ మనమున మెరుపు మెరియు
పర్జన్యుడా! నీలమేఘశ్యాము చక్రవేగమున,
విష్ణు పాంచజన్య శబ్ధశోభలతో, బాణవడితో
వర్షధారల కురిసి మాగాణుల సస్యవృద్ధి
చేయుమయ్య మా సస్యకేదారముల,
లోకకల్యాణముల కోరి ఆకాక్షించి మేము
గోగణముల, సంపదల కోరి మార్గళీవ్రత
స్నానమాచరించగ రమ్ము! ఓ చెలులార!
నీరాడగా మీరు వేగమే రమ్ము! సఖులార!
చెలువమ్ము తోడ స్నానమాడగ రండు!
హారతి
పాంచజన్యధారికి శుభ మంగళము
దశావతారునకు జయమంగళము
చక్రధారికి చందన మంగళము
ఓం నమో నారాయణాయ
5వ పాశురము 20-12-2025
అవతారిక-
మోక్షప్రాప్తి కొరకు (కర్మలే కారణము, వాటినినిర్మూలించుకొనుటకు) 1. భగవంతుని ధ్యానించుట, 2. సేవించుట,3. కీర్తించుట. ఇవి కర్మవిహీనతకు సులభమార్గములు.
వివరణ
మాయామానవుని వలె మధురలో అవతరించి, అధిపతియైన, పావన యమునానదీ తీరమున, గొల్లకులమున యశోదాదేవి ఇంటితేజమైన దామోదరునికి తావి గల పువ్వుల మాలికలతో, పూజించి, హరికీర్తనముల కీర్తించి ధ్యానించిన చేసిన పాపములునశించును.
కవితామాలిక
రారేమె! రారేమె! చెలియ లారా!
నీరాడ రారేమె! యోషితామణులార!
మా యమాణవకుని కొలువ రారండీ!
నందగోకులమున నందుని లోగిలిలో
జనియించినాడమ్మ! యశోదమ్మ ముద్దు
తనయుడు నల్లనయ్య! కరిమేనిసామిని
సుగంధ భరిత ‘పూలపానుపు’ పరచి
అర్చనలు చేయుదము! రారే సఖులార!
గోవిందు కీర్తించి మాసమున నిలిపి!
గోపాలబాలుని మది దేవళమున నిలిపి
తొలి నోము నోచెదము గోవిందుకీర్తించ
‘పాపకర్మలన్ని’యు ‘అనలమున’ దూదివలె
మాయమౌను! విశ్వంభరాధీశునీ
సేవించగా రారే! వేగిరమే లేచి నీరాడ రండు!
హారతి
గోపబాలకునకు గోపికలమంగళము
గోవర్ధనగిరిధారికి చందన మంగళము
గోవిందునకు గోమేధిక మంగళము
మంగళము మంగళము జయమంగళము
ఓం నమో నారాయణాయ
6వ పాశురము 21-12-25
అవతారిక
ఇది మొదలు పది పాశురముల వరకు భగవత్ కైంకర్యమునకు కలసిరండని పిలుపుల వర్ణన.
వివరణ
ఓ బాలా! పులుగులు శబ్దము చేయుచున్నవి! విని చూడవమ్మా! వైనతేయుడు సేవించు విష్ణాలయమున శ్వేతవర్ణ శంఖారావ రవము వినలేదా! ఆ సవ్వడి నీ చెవి సోకలేదా! నిదుర లేవవమ్మా పూతన స్తన్యము తాగి ముక్తిపథము చేర్చిన కృష్ణుని, శకటాసురుని అణచిన దేవరను, కొలువగా స్వామి సేవకు అర్చకులు వచ్చి, శంఖనాదమున భక్తులను ఆహ్వానించుట వినపడలేదా?
మునివరులు యోగులు వేకువన, హరినామ సంకీర్తన చేయుచున్నారు. క్షీరసాగరమున ‘శేషతల్పము’పై, యోగనిద్రలో నున్న, పరమాత్మ భక్తులను ఏ దుష్టులు కష్టముల పాలు చేయుచున్నారో! అని గమనించుచున్నాడు! విశ్వంభరుని నిద్ర మన నిద్ర వంటిదికాదు. విశ్వేశుని సేవించరండని గోపికల మేల్కొల్పుతున్నది గోపిక!
కవితామాలిక
నిదుర లేవవేమె! ఆరాళకుంతలా!
నీరాడు వేళాయె రావేమి చెలియా!
పక్షి గణముల కిలకిలారవముల,
వైనతేయుని గమన శబ్దము వినలేద!
నిదుర లేవమ్మా! పూతనను స్తన్య
పానము చేసి ముక్తిపథమును చేర్చె!
శకటాసురునకు మోక్షమిచ్చిన హరి
పక్షిరాజ్పత్ర ‘దేవళ’ శ్వేత శంఖనాదము
కర్ణమున సోకలేద! స్వామిసేవకు
అర్చకులు వచ్చు సవ్వడి వినలేద!
పాంచజన్యధరుని సేవించు వేళాయె!
యోగులూ, మునివరులు, ఋషులు
సంకీర్తనము చేయ, క్షీరసాగరమున
శేషతల్పమున శయనించి, యోగ
నిదురపోవు విశ్వంభరాధరుడు!
విశ్వవిభుడు గమనికతోనుండేటి,
భక్తపరి ‘రక్షకు’ని సేవించు వేళాయె!
నిదుర చాలించి నీరాడ రావే నీలవేణి!
_______________________________
పక్షిరాజు వైనతేయుడు గరుడాళ్వార్
పక్షిరాట్పత్త పక్షిరాజుపత్రవాహనుడు విష్ణువు
_______________________________
శేషశయనునకు శుభమంగళహారతులు
లక్ష్మీ నిలయునకు జయమంగళములు
మంగళము మంగళము శుభమంగళము
ఓం నమో నారాయణాయ
7వ పాశురము 22-12-2025
7వ పాశురము నుండి దేవదేవుని సేవించుటకై కలసి రమ్మని మార్గళీ వ్రతాచరణ చేయుదమని వ్రేపల్లె వ్రేతలను పిలుచుట వర్ణించబడినది.
వివరణ
ఓ గోపికా రమణీ! పక్షిగణములు రవములతో వేకువనే సందడి చేయుచున్నవి. భరద్వాజ పక్షుల కీచు కీచు ధ్వనులు వినబడలేదా?సాంబ్రాణి ధూప పరిమళములు నాసికల సోకలేదా! గొల్లెతల చేతి గాజుల గలగల, పెరుగు చిలుకు కవ్వపు గరగరలు, కంఠహారముల రాపిడి ధ్వనులు వినపడలేద?
మా నాయకివి నీవు! కేశవుని కీర్తనలు వినుచు నిద్రపోయెదవ! నీకింత నిద్ర మత్తేలనే! ధూప, విరి, తావి నాసికకు సోకలేదా! దధి చిలుకుతూ పాడు కృష్ణలీలలను వినలేద! దైవ సంకీర్తనల వలన వాక్పరిశుధ్యము, ధ్యానానుసంధానము, నిర్మలమైన మనసు ఏర్పడును. మానసికశాంతి కలుగును.పరమాత్ముని యందు మనసు మగ్నమగును!
కవితామాలిక
ఓ గోపిక! మా నాయక! రాకేందుముఖీ!
నిదుర మేల్కాంచవే! హంసగమన!
నీరాడు వేళాయె! లేచి రావే రమణి!
కీచు మనియెడి *సారసముల సవ్వడి
నీ చెవి సోకలేద! భరద్వాజ పక్షుల కల,
కలారవములు! దధిమథన వేళ కవ్వపు
గరగరలు వినలేద! గోపికా రమణుల
ఇంట ధూపపరిమళములు నాసికల
సోకలేదా? చెలువంపు సుందరాంగుల
హారముల సవ్వడి మధురముగ వింటివా!
సిరివల్లభుని కీర్తించు మధుర రాగరవళి!
వినరాగదే! చంద్రబింబాననా! కోమలాంగి!
దైవసంకీర్తనలు భక్తియుతముగ పాడి
సేవించగా రావమ్మ! గోపికా వల్లభి!
ధనుర్మాస వ్రత స్నానము చేయ రావమ్మ!
రమ్ము! రారమ్ము! నీరాడగా రావె చెలియా!
——————————–
*సారసములు పక్షులు ఖగములు
———————————
హారతి
జయహారతులివే శ్రీరంగపురవాస
శ్రీ రంగనాయకీ సమేత మంగళహారతులు
పదుమనాభునకు రత్నదీపహారతులు
ఓం నమో నారాయణాయ.
(సశేషం)
