[ధనుర్మాసం సందర్భంగా ‘తెలుగులో తిరుప్పావై’ శీర్షికతో పాశురాలను అందిస్తున్నారు శ్రీమతి మరింగంటి సత్యభామ.]
8వ పాశురము 23-12-025
అవతారిక:
సఖులు చేరి మరియెక చెలికత్తెను నిద్ర మేల్కొలుపుతున్నారు.
వివరణ:
తూర్పుదిక్కున తిమిరపరదాలు తొలగి గగనమున వెలుగురేఖలు లేతగా పరచుకొంటున్నవి! ఇంత నిద్ర పోవుటేల? జ్ఞానము లేని గోవులు గోష్టము విడిచి మేతకు బయలుదేరినవి మన తోటి సఖులు గోవింద నామ సంకీర్తన చేయుచూ, వ్రతస్నానం చేయ నడచుచున్నారు. వారిని ఆపి నీ కొరకు నిదుర లేపవచ్చినాను. నీ ముంగిట ఇంత సమయమైనది. ఎంత లేపినా లేవకున్నావు. సమయము గడచిపోతున్నది. కాలహరణ మేలనమ్మ! శ్రీనారాయణ పెరుమాళ్ చేత ‘ఢక్క’ పట్టి, ధర్మసంస్ధాపనకు అవతరించినాడు! అశ్వాసుర, మల్ల యోధులను సంహరించిన పురుషోత్తముడు నందనందనుని సేవించ రావమ్మా నోరార పాశురములను కీర్తించి ధ్యానించిన మనలను అనుగ్రహించును లేచి వేగరావమ్మ! అని గోపికను పిలుచుచున్నది.
కవితామాలిక:
ఉదయగిరి పైన ఉదయాద్రిబింబమ్ము
ఉదయించుచున్నాడు లెమ్ము ఓ ఉవిదా!
వ్రతస్నానమాడగరమ్ము! సఖియా!
ఇంత నిద్రేలనే? లేవవేలనమ్మా?
‘సన్నుతాంగీ! వేకువజామువేళాయె!
వైళమేలేవవే వనితామణీ!’
గోగణములకు జ్ఞానమేమున్నది?
వేకువజామున గోష్టమును విడచి,
మేతకేగుచునుండె! గోపాలుర తోడ!
ఎరుక కలిగిన మానవజన్మమందు,
ధర్మార్ధ, కామ, మోక్షముల సాధించగ,
కృష్ణభక్తి, సుకృత భాగ్యమ్మున నిర్మలమగు
మదిన భగవంతుని కీర్తించ రమ్ము ఓ చెలీ!
నీ ఇంటి ముంగిట నిలిచినానమ్మా!
అశ్వాసురుని, మల్లయోధుల మద
మణచిన దామోదరుని సేవించ రావమ్మ!
చేత ‘ఢక్క’ను పట్టి మనసు సర్వాంతర్యామి
పాదపద్మములందు నిలిపి నుతించెదము!
దయాంతరంగుడు నవనీత చోరుని
అంతరంగమందు సేవించెదము రావే!
కాళింది హ్రదమున నీరాడ రావమ్మ నెచ్చెలీ!
హారతి
నవనీతచోరునకు నిత్యహారతిదే!
నందనందనునకు నవ్యహారతులు
మురిపాల వెన్నునకు ముత్యంపు హారతీ
మంగళము మంగళము శుభమంగళం
ఓం నమో నారాయణాయ
9వ పాశురము 24-12-25
అవతారిక: శ్రీమంతురాలైన మరొక కన్యను గోపవ్రేత లేపుతున్నది.
వివరణ:
శ్రీరామచంద్రుడే వచ్చి నన్ను రక్షించగలడని హనుమతో చెప్పిన సీతామాత వంటి గోపిక, శ్రీరంగనాధ పెరుమాళ్ మాత్రమే మోక్ష కారకుడని, ఆయనను సేవించుటే ఉపాయమనీ, గట్టి పూనికతో నమ్మిన గోపికను నిద్ర లేపుతున్నది. సిరిసంపదలు, భోగభాగ్యములకు, భగవంతుని చింతనకు పొంతన కుదరదు. ఆర్తులకు, దైవ భావనపై మనసు నిలచును. అంతర్గత అజ్ఞానము పోగొట్టు మార్గము అన్వేషించుటే మార్గాంతరము. దైవ నామ కీర్తనమే ఉపాయము.
కవితా మారిక:
లేచి రావమ్మా! ఓ లతాతన్వి!
ఇంత నిదురేలనే! సన్నుతాంగీ!
మామ కూతుర! నీవు మేల్కాంచవమ్మ!
నీరాడ రావేమె! వ్రతము వేళాయే!
సుందరమయమగు భవనప్రాంగణము!
మాణిక్యమణిమయ దీపకాంతులతో,
పరిమళ భరిత ధూపములతోడ,
మెత్తని తల్పమున శయనించినావేమొ!
మణికవాటపు గడియ తీయవమ్మ!
స్నానమాడగరావే చిలుకలకొలికీ!
అత్త కూతుర! నీవు నిదుర లేవవేమమ్మ!
ఓ అత్త! నీవైన నిదురలేపమ్మ!
చెవిటియా! మూగయా! మాట వినదేమి?
ఎవరైనా నీ ఇంట కావలున్నారా?
నిదుర మంత్రమ్ము మంత్రించినారా!
నీలమేఘశ్యాము! ద్వారకానిలయుని,
కీర్తించుచూ పాడేటి కీర్తనలు వినవేల?
లెమ్ము! విరిబోణీ! హరిని కీర్తించెదము!
సిరిసంపదల, భోగ, భాగ్యమ్ముల తేలిన,
దేవదేవుని యందు మనసు నిలిచేనా!
ఆర్తులమై వైకుంఠధామము చేరగలమమ్మ!
అజ్ఞానతిమిరమును పోగొట్టుకొని దైవ
భావనతోడ కీర్తించగా వేవేగ రావమ్మ!
నిదుర చాలించి నీరాడరావే ఓ గోపబాలా!
మార్గళీ నోమునకు రమ్ము! రారమ్ము!
హారతి:
రాసలీలావిలాసునకు మంగళము
గోపికాలోలునకు జయమంగళం
ద్వారకా నిలయునకు శుభమంగళం
ఓం నమో నారాయణాయ
10వ పాశురము 25-12-2025
అవతారిక:
నవనీతచోరునికి ప్రియమైన మరియెక గోపికను ‘గోద’ పరమాత్మను చేరు మార్గమైన ఆ ప్రభువుని సేవించి, కీర్తించి, అధికముగ విశ్వసించి, 5వ గొల్లకన్నెను నిదుర మేల్కొల్పుతున్నది.
వివరణ:
సేవించు సమయమున నిదురపోవుచు, నిదురలో కుంభకర్ణునితో ‘పందెము’ వేసితివా? వరప్రభావ నిదుర నీకు ధారపోసినాడా! నిద్ర చాలించి మత్తు వదలి వేగమే లేచిరా గోపికా! బదులు పలుక కున్నావు! నోట ముత్యాలు రాలునా చెలియా! తులసీమాలికల ధరించిన, వంశీమోహనుని, ఆ వైకుంఠవాసుడు విష్ణువును స్తుతించిన పుణ్యఫలము, ఐహికాముష్మిక సౌఖ్యమీయ గలడు! మనసార స్వామిని స్తుతించవలెను! ఐహికసుఖములు శాశ్వతము కావు! ఇంద్రియచాపల్యమునకు లోనుగాక భగవంతుని సేవించుటకు పూనుకొందము! నిద్రమత్తు వదలి తలుపు తెరచి స్నానానికి రమ్మని తమ గోష్టిలో చేరి వ్రతము పూర్తి చేయమని గోపికను మేల్కొల్పుతున్నది!
కవితామాలిక:
నిదురేలనే నీకు ఇందువదన!
నీరాడ రావమ్మ యమున కడకు!
పరమాత్మ సేవకు సమయమాయె!
తలుపు తీయకేల నిదురించుచున్నావు?
నోము ఫలముల దివ్యభోగములనందేవ!
లోకమంతయు ఆ పరమాత్మ లీలయే!
బదులైన పలుకవే చారునేత్ర!
మాటలాడిననోట ముత్యములు రాలునా!
పరిమళించు తులసిమాల ధరించిన
గళాంకార శోభితుని సన్నుతించెదము!
కుంభకర్ణుడు నీకు నిదుర వరమిచ్చెనా!
పురుషార్థ సాధనకు పురుషోత్తముని
కీర్తించి పాడెదము! నిదుర మైకము వదలి
రావమ్మ వెలుపలకు! కాళింది హ్రదమున
గ్రుంకులిడెదమురావె! వాకిట గోపికలు వేచి
యున్నారే! స్వామి సేవకు వేళాయెనమ్మ!
మేల్కొనవే! గోపికా! రమ్ము! వేవేగమే!
నీరాడు వేళాయె! జాగు సేయక రావె!రమణీ!
హారతి:
కాళిందిమర్దనునకు మంగళము మంగళము
లోకరక్షకునకు శుభ మంగళము మంగళము
ఎల్లరకు దిక్కయిన కేశవునకు మంగళము
ఓం నమో నారాయణాయ
11వ పాశురము 26-12-2025
అవతారిక: బృందావనమున వెన్నునికి ఇష్టసఖిని మేలుకొలుపుట
వివరణ:
మెయిలునకు, మయూఖమునకు గల చెలిమి వంటి స్నేహితురాలా! ఇంకా నిదురేనా! స్వధర్మం పాటించు గొల్లవారు సురభులకు స్నానము చేయించి మేతపెట్టి, పాలుపిండుట, వనములలో మేపుటలో జాగుచేయరు. శత్రువుల నణచుటలో తామసించనివారి వంశమున పుట్టినదానవు. సంకల్పించిన వ్రతాచరణమున తామసించ తగునా! నీ ఇంటివాకిలిలో నందనందనుని కీర్తించుచున్నాము ఓ హల్లిక లేమా! నీకేమి పట్టనట్లు ఉలుకవు! పలుకవు! నీ ఆలోచనలేమి? ఆ యశోవిభుడు, నీ అందచందముల చూసి వలచి, వరమాల వేయగలడని గర్వముతో వున్నావేమో! ఆ గర్వము వదలి కీర్తించ రావే! ‘అనన్యభక్తి’ భావనతో సేవించగా కరుణించును, వేగమే నిదుర లేచి నీరాడ రావే! శ్రీరంగనాధుని సేవించగ ఆముష్మిక ఫలమీయగలడు అని నిద్ర మేల్కొల్పుతున్నారు (హల్లిక లేమ=ఎర్రకలువ వంటి ముగ్ధ)
కవిత:
యమునాతీరమునకు నీరాడరమ్ము!
ఓ రమణి! ఎలనాగ! మోహనాంగీ!
ఎంత మేల్కొల్పినా లేవవేమే!
అంత వగలేలనే? మగువరో నీకు!
ఆలకాపరులెంత ధర్మయుతులో!
కపటమెరుగని యదువంశీయులు,
జాగుసేయక పాలు కడవల్లో పిండుదురు!
నిత్యకృత్యములకు తామసింపనివారు!
శత్రువర్గ పీచమణచేటి వారు!
వీరింట జన్మించి జాగేలనే నీకు?
నీలమేఘశ్యాము సేవించ రావమ్మ!
చెలువముతోనున్న నిండు జవరాలా!
చెలికత్తెలందరూ వచ్చియున్నారే!
సిరిసంపదలు గల సంపన్నురాలా!
గోపాలకులవంశ స్వర్ణలతికా!
పురుషోత్తముని నామ కీర్తనలు
పాడుతూ, నీరాడ పోయెదము!
రావేమె! గోపికా! రమణీలలామా!
నీ సొగసు చూసి వరమాల వేయునా!
నీ నిదుర వివరము తెలుపవమ్మ!
వేగమే ఏతెంచి తలుపు తీయమ్మ!
అనన్యభక్తితో సేవించ రావమ్మ!
శ్రీరంగనాథుని కీర్తించరావమ్మ!
నీలవేణీ! నీలాటి రేవులో నీరాడరావే!
హారతి:
నవనీతచోరా మంగళములు నీకు
మురళీధరా నీకు దివ్య మంగళము
గోపికా వస్త్రాపహారా! భవ్య మంగళము
ఓం నమో నారాయణాయ
12వ పాశురము 27-12-25
అవతారిక: యదువంశభూషణుని చెలికాని సోదరిని గోపవనిత మేల్కొలుపుతున్నది!
వివరణ:
ఓ సిరిగల గోపికా! లేగలు ఆకలితో ‘అంబా’ అని పిలిచేవేళ, ఆవులు లేగలపై మమకారముతో పాలు చేపి, పొదుగుల పాలధారల చేత నీ ముంగిలి అంత బురద అయినది సిరిగలదానా! మంచులో తడిసి, బురదలో నిలిచియున్నాము. నీ రాకకై వేచివున్నాము. దేవ కార్యనిర్వహణకై హరిరామావతారుడై జన్మించినవాడు రావణుడు వనవాస సమయమున సీతాపహరణ చేయగా, కడలికి వారధి కట్టి, కపి వీరులతో రావణ సంహారము చేసి, తాపసులను ఆనందపరచెను! ఆ శ్రీరాముని కీర్తించుచూ నీ వాకిట నిలిచాము. మా కీర్తనలు విని కూడనిద్ర లేచి రాకున్నావు. ఇదేమి నిదుర? లేచి వేగమే రావమ్మ! ఈ సందర్భములో లేగదూడలు జీవకోటిగా, తల్లులైన ‘సురభులు’ పరమాత్మగా భావించిన, దూడలు కట్టు తెంచుకోలేనివని కరుణచే పాలు స్రవించిన విధమున సంసారజలధిలో మునిగిన మనను కరుణించు భౌతిక బంధనములు తొలగించు పరమాత్ముని దయ లభించును.
కవితామాలిక:
ఓ గోపికా! ఓ భామినీ! మేల్కాంచవమ్మ!
లెమ్ము! నీరాడ రమ్ము! దైవారాధన వేళాయె!
నిదుర లేవవేమె! బాగులాడి!
యమునా తటికి స్నానమాడగ రావె!
ఆకొన్న లేగల అంబారవములు విని
గోమాతల కొడులు చేపునకు వచ్చె
(కొడులు= దుగులు)
లేగలు మూతులతో పాలు దూటినయట్లు,
క్షీరధారలను కురిపించె సురభులు!
నీ ఇంటి వాకిలి తడిసి అడుసాయె!
ఆ మత్తడిలో నిలచి మంచులో తడసి
నిలిచి యున్నామమ్మ! నీ రాక కొరకు!
సిరులతో అలరారు సంపన్నుని భగినీ!
సంపదలరాణీ! తామసమ్మది ఏల?
నీ రాకకై మేము పిలచుచున్నాము!
‘ధరణిజ’ను చెరబట్టి, ఇడుములు పెట్టిన
లంకేశు శిక్షించి విభవావతారుడై,
శ్రీరామచంద్రుడు అవతరించి,
కపివరుల సేనతో అనంతవారాశిపై
సేతువును కట్టి సుగ్రీవు సాయమున
లంకేశు వధియించి మునివరుల
మనసున ఆనందమును నింపి
ధర్మరక్షణచే యు అవతారమూర్తినీ
కీర్తించగారావె విమలనయన!
నిదుర లేవమ్మ! నీరాడ రావమ్మ!
అపరంజిబొమ్మా! హేమాంగి రావే!
పరమాత్మ సేవించగా వేవేగ రావే!
హారతి:
భవ్యావతారునకు మంగళము మంగళము
జగన్మోహిన కృష్ణా! జయమంగళం మంగళము
కోదండపాణికి నిత్య శుభమంగళము
ఓం నమో నారాయణాయ
13వ పాశురము 28-12-2025
అవతారిక:
ఈ పాశురమున మరియొక గోపికాసఖిని మేల్కొల్పుతూ, యమునానదీ స్నానము చేయ రమ్మంటున్నది కోదై (గోదాదేవి).
వివరణ:
ధార్మికకాంతులతో ప్రకాశించే నయన కాంతిగల గోప బాలికా! వేగమే నిదుర మేల్కొని రావే! విభవావతారుని సేవించు సమయము, ఆసన్నమైనది! ఆలస్యమేలనమ్మా! ఆలసించిన ముందు పోయినవారికే, పరమాత్మదర్శన భాగ్యము లభించును త్వరపడి లేవవమ్మ! సత్కార్యములకు త్వరపడవలెను అని హితవు పలికి మేల్కొల్పుతున్నది.
కవిత:
నిదురేలనే నీకు? గోపికా దీపికా!
సూర్యోదయవేళ పక్షిగణముల
కలకూజితములు వినలేద సఖియా!
గాఢ నిదురన నీకు తెలియరాలేదా!
ఏకాంతధ్యానమున బాహ్యము గనలేద!
విరిసిన సొంపైన పద్మనయనా!
కనులు మూసి నీవు నిద్రించ తగునా!
బకుని చీల్చిన వెన్నుని లీలలను,
లంకేశు గూల్చిన ధీరరాముని చరిత
కీర్తించుచు, సాగుచుండిరి గోపికలు!
స్తుతి కీర్తనలు నీకర్ణమున పడలేద!
ఓ చెలీ! హరిని కీర్తించువారేరీ?
ఆ ప్రశ్నలేలమ్మ? తగున ఈ రీతి?
గురుడస్తమించె! శుక్రుడుదయించె!
చెలులందరు నోముపట్టుట కొరకేగిరి!
ఏకాంత, ధ్యానసంధానము ఏల! రమ్ము!
కృష్ణ విరహ చింత చల్లారునట్లుగా,
యమున సలిలమున స్నానమాడెదము!
పాన్పుపై పవళించి నిద్రించుటేల?
లెమ్ము! త్వరపడుము! రమ్ము రమణీ!
మేలినోము నోచ రావమ్మ! త్వరతోడ!
హారతి:
మంగళము! మంగళము! మంగళాంగునికి!
మంగళము! మంగళము! దేవకీ పుత్రునికి!
మంగళము! మంగళము! వాసుదేవునకు!
ఓం నమో నారాయణాయ
14వ పాశురము 29-12-2025
అవతారిక:
అందరికన్నా ముందుగా మేల్కొని మిగిలినవారిని నిద్రలేపెదనని చెప్పిన వ్రేతను ఒక వల్లవలేమ నిద్ర లేపుతున్నది.
వివరణ:
ఓ అన్నులమిన్నా! ఎంత గడసరిదానవు! వేకువనే వచ్చి మమ్ములను మేల్కొల్ప రాగలనని మాకు చెప్పి రాకున్నావే! తెల్లవారలేదనే నేర్పు గల జాణా శత్రు సంహారక చక్రధారిని, అజ్ఞానాంధకారము పోగొట్టు ‘పాంచజన్యధారి’ని సేవించరావేమె యదుకుల రమణీలలామా! శంఖ, చక్ర శోభిత చతుర్భుజుని ఆశ్రయించి, కీర్తించి, అర్చించి శరణు కోరుటకు శుభములు బడయుటకు సమయమా సన్నమాయెనమ్మ! నిదుర లెమ్ము! కాళింది తటాకమున నీరాడరారమ్ము వేగపరచు చున్నది ఆత్మార్పణ భావముతో ఆ గోపిక. కలువలు, కమలములు క్షణభంగురాలనీ, సూర్యకాంతికి ముడుచుకొని చంద్రచంద్రికల వికసించు స్వభావము గలవి కలువలు. కమలములు భానుకిరణములకు విరిసి వెన్నెలకు ముకుళించు రీతిగా కాక అనన్యపూరిత భక్తితో పరమాత్ముని సేవించిన దైవానుగ్రము లభించ గలదని శరణాగతి కోరి రమ్మని గోపిక పిలుపు.
కవిత:
రమణీ రావమ్మ! నీరాడ! వేవేగ!
రావమ్మ! వేడ్కతోను! కంబుజాక్షి!
లేచి రావమ్మ! యమున తటి కడకు!
పూదోట యందుగల నడబావి!
లోన కలువపుష్పాలు ముకుళించె!
ఇందీవరమ్ములే విరిసి విప్పారె!
కలువలు, కమల పుష్పాలు క్షణ
భంగురములే లేచి రావేలనే!
రాజీవనేత్రీ! వ్రేపల్లె విరిబోణి!
ఇందీవరాక్షుని స్మరియించి చేరగ!
వేవేగ రావేల జాగేల నీకు?
కాషాయాంబరములు ధరించి
ఆచార్య స్వాము లేతెంచినారే!
వైరాగ్యభావనతో జీయరుస్వాములు
మోక్షమార్గమైన దేవళము తెరువ!
జ్ఞానబోధనమను కుంచికతో వచ్చె!
అష్టాక్షరీమంత్ర జ్ఞానమ్ము తెచ్చె!
శేషశయనుని పూజించు వేళాయె!
లేచి వేగమే రావమ్మా! రావేలనే నీవు!
శంఖ, చక్ర, గదాధారి, పాంచజన్యము
తోడ వేంచేయు పరమాత్ము సేవించు,
వేళాయె! స్వామిని సేవించి అర్చించి,
శరణు కోరెదము త్వరతోడరావే! చారునేత్రా!
హారతి:
దివ్యదీప మంగళము! మంగళప్రదునకు!
వైనతేయుడు నిత్యము సేవించు స్వామికీ!
మంగళము! మంగళము! నిగమరూపునకు!
మంగళము! మంగళము! వైకుంఠధామునకు!
జయమంగళము! నిత్య శుభ మంగళము!
_____________________________________
కుంచిక=బీగము, తాళంచెవి
మోక్షారామము ద్వారపు తలుపులు తెరచే శంగ్ అనే తాళంచెవి అదే నారాయణ అష్టాక్షరిమంత్రం కాషాయాంబరాలు ధరించిన ఆచార్యులను శరణుకోరిన శ్రీమన్నారాయణుని పరమపదము చేరు మార్గోపాయమును అనుగ్రహించగలరు.
నళిన నయన=తామరల వంటి కన్నులు గల
తామరపువ్వులు రాత్రి ముకుళిస్తాయి, పగలు వికసిస్తాయి. కలవలు రాత్రి విరిసి ఉదయమే ముడుచుకుంటాయి.
ఓం నమో నారాయణాయ
(సశేషం)
