[ధనుర్మాసం సందర్భంగా ‘తెలుగులో తిరుప్పావై’ శీర్షికతో పాశురాలను అందిస్తున్నారు శ్రీమతి మరింగంటి సత్యభామ.]
15వ పాశురము 30-12-25
అవతారిక:
మరియెక యదుకుల కన్యకను నల్లనయ్య కీర్తులను స్తుతించి తన్మయభావమున గానము చేయుచూ వచ్చి మేల్కొల్పుతున్నారు.
వివరణ:
నిద్రపోవు గోపికలను మేల్కొలుపు పాశురములలో ఇది చివరిపాశురము. ముందు తొమ్మిది పాశురాలలో మేల్కొలుప వచ్చిన వ్రేతల మాటలు పదవ పాశురమున పవళించిన గోపిక మాటలు కలిపి ఉక్తి ప్రత్యుక్తి పాశురం. నీరాడ రమ్మని పిలుచు గోపికలు శయనించిన గోపిక సఖుల కొరకు ఎదురుచూపులతో వచ్చిన వారితో సంభాషణ.
కవిత:
ఇంత నిదురేలనే ఓ లేతకీరమా!
నిదుర మత్తేలనే ఓ మానినీమణీ!
కీరవాణి వోలె పలుకుచుంటివె జాణ!
హరికీర్తనలు కీర్తించుచూ వచ్చితిమి!
ముందు వచ్చెదనని రాకుండుటేలనే?
నీ ముంగిటున్నాము! వేవేగరావే!
సవ్వడి చేయకుము! ఎత్తిపొడవకుము!
ఆగుమాగుము! నేను వచ్చుచున్నాను!
ఎంత గడుసరివమ్మ! సొగసరివి నీవే!
నీతోటి మాటలు కొత్తవా మాకు?
ఏకాంతసేవలో మునిగియున్నావా!
అందరితో పొందేటి ఆనందమే ఘనము!
మది నొచ్చుకొనియేటి ఆ మాటలేలా?
వ్రేపల్లె వ్రేతలూ అందరూ వచ్చితిర?
స్వామి సేవించగా చెలియలందరునూ?
రావమ్మా కొమ్మా! విభును కొలువగను!
కువలయాపీడుని మర్దించినవాని,
కంస, చాణూర, ముష్టికాంతకుని సేవించ,
బాణాసురుని పీచమణచిన కేశవుని
మాయామానుషవిగ్రహుని సేవించ రావే!
హరికేసరి కీర్తి కీర్తించుచూ పాడగా రావే!
పన్నీట కాదమ్మా! చన్నీటి స్నానాలు!
చల్ల చల్లగ చేసి నల్లనయ్యను గొలువ,
అల్ల దేవళమునకు కొలువగా రావమ్మ!
రంగవల్లులతో మణిదీపములతో,
మొగలి పూ మొగ్గల అలంకారములతో
అలంకార ప్రియుని అలరించు మాలలతో
దేదీప్యమానముగ వెలుగుదేవళమునకు
హరిని సేవించగా కలిసిపోదము! రావె చెలియా!
హారతి:
మంగళము మంగళము యమునతటిదాటి
యశోద ముంగిట ముత్యమైననల్లనయ్యకు
శేషతల్పమున శయనించిన విష్ణుమూర్తికి
నిత్య శుభ మంగళం మంగళం జయమంగళం
ఓం నమో నారాయణాయ
16వ పాశురం 31-12-2025
అవతారిక:
పది పాశురాలలో గోపికలందరనూ మేల్కొల్పుట, గోపికలందరూ కలసి నందగోపుని వ్రేపల్లె వాడలో నగర ‘ద్వారపాలకుని’ నగరప్రవేశానుమతి కోరుతున్నారు గోపికా నెలతుకలు!
వివరణ:
విశ్వేశ్వరుడైన నందగోపాలుని ఆలయ ద్వారపాలకా! గరుడధ్వజ ప్రకాశముల ప్రభలతో, తోరణాలంకారములు గల దేవళ ద్వారకాపరీ! మణిమయమహాద్వారములు తాళములతో తెరువుము. ‘గోపికారమణుల’మయిన మాకు మేఘరూపుడైన ‘పరమాత్మ’ నిన్ననే ‘పర’అను ‘వాయిద్యం’ ఇవ్వగలనని మాట ఇచ్చెను.
వేకువనే లేచి యమునానదిలో పవిత్రస్నానము ఆచరించి ‘పర అను ఢక్క’ను కోరి వచ్చినాము అని ‘ఆరెకుని'(కాపరి)తో చెప్పి ప్రాధేయపడుతున్నారు. నీవు మహాద్వార వాకిలి తలుపు తెరచిన నియమము ప్రకారం వ్రతార్థము పరమాత్ముని సన్నిధికి చేర వచ్చి యున్నాము. సుప్రభాతము పాడగా వచ్చిన మమ్ము దేవళము లోనికి పోనీయుము అని వేడుకొంటున్నారు.
కవిత:
నందగోపుని, సౌధ, ప్రాకారధ్వజము వద్ద
విశ్వంభరుని దేవళమున ద్వారపాలకా!
గొల్లకన్యలము! మా వందనములు
అందుకొనుము! తలుపు తెరచి లోనికి
పోనిమ్ము! భక్తశిఖామణీ! గరుడ ధ్వజ,
తోరణాలంకృత మహాద్వారపాలకా!
మణిమయ ద్వారమును తెరువుము!
తాళము తీయుమయ్య! తలుపు తెరువు!
మాయ, మర్మమెరుగని వ్రేపల్లె వ్రేతలము!
నవనీతచోరుడు వేకువనె రమ్మనెను!
వ్రేతలమందరము చెలిమితో వచ్చితిమి!
వ్రతసంభారములీయ పిలచియున్నాడు!
సుప్రభాత సేవచేయ వేవేగ వచ్చితిమి!
తిరునామధారణతో, శంఖ, చక్ర
లాంఛనములతో వైకుంఠవాసుని,
స్తోత్రముల, కీర్తించుచూ వచ్చితిమి!
నిర్మల భక్తి భావనతో ‘సుప్రభాతగీతిక’ల
పాడగా వచ్చితిమి! శుభ సుప్రభాతము!
దేవాలయము లోనికి పోనీయవయ్య!
మా మనోకామనలు తీర్చగలవాడనని
గోవిందుడు మాకు మాటనిచ్చెను ముందు!
పొత్తుకత్తెలమంత కూడి వచ్చితిమి!
మందిరము లోనికి రానీయవయ్య!
నందనందనుని కీర్తించెదము మేము!
‘పర యనెడు ఢక్క’ కోరగా వచ్చితిమి!
ద్వారముతీయుమో! ఆలయ ద్వారకాపరీ!
‘విశ్వంభరాధీశు’ కొలువగా వచ్చియున్నాము!
హారతి:
దైవమందిరమందు దేవాధిదేవునకు
దివ్యప్రభ హారతుల జయమంగళము
భక్త పాలకునకు భవ్య మంగళము
మంగళము మంగళము
క్షీరాబ్ధివాసునకు శేషశయనునకు
జయమంగళము మంగళము
ఓం నమో నారాయణాయ
17వ పాశురము 01-01-2026
అవతారిక:
దైవమందిర ప్రవేశ ద్వారము దాటివెళ్ళిన గోపికలు నందుని, నందపరివారమును మేల్కొలుపుతున్నారు. నందుడు, యశోదా మాత, బలరామునికీ సుప్రభాతము పలుకుచున్నారు.
వివరణ:
ఈ పాశురమున శ్రీ ఆదివరాహమూర్తినీ, శ్రీ నరసింహస్వామినీ, శ్రీరామచంద్రునీ, త్రివిక్రమునీ కీర్తించుచున్నారు. అన్నోదకములను, వస్త్రదానమును చేయుట, పుణ్యాత్ముడైన ‘రేపల్లె ఏలిక’ ఉన్నతతత్వము అని గోపికలు తెలుపుతున్నారు. అన్నము, జలము, వస్త్రము ఉన్నతదానములు. ఆ దానములు చేయు నందుని ధర్మాత్ముడవని, నిదురలేవమనీ కీర్తిస్తున్నారు. మంగళరూపిణి యశోదమ్మా! నిదుర లేవవమ్మా! జ్ఞానరూపుడు పరమాత్ముడు నీ తనయుడే కాని, లోకోధ్ధరణ కోసం అవతరించిన నారాయణుడు! మాతా! నీవు లేచి స్వామిని లేపవమ్మా! ఆదిశేషుడవైన బలరామదేవా! యమునలో కలిసే హస్తినాపురాన్నే అరకతో పెల్లగించిన నీ బలం పొగడగా సాధ్యమా! నిదుర లేచి గోపాలుని మేల్కొల్పవయ్యా! బలరామా! అని కీర్తిస్తున్నారు గొల్లవనితలు.
కవిత:
నందవ్రజ ఏలికా! సుప్రభాతము నీకు!
దాతృత్వము గల యదుకుల నాయకా!
అన్నోదకములను, వస్త్రములను
దానమ్ము చేసేటి దానశీలివి నీవు!
మేలుకోవయ్యా! రేపల్లె ఏలికా! నందరాజా!
మంగళకరమగు గోపికా దీపికా!
తల్లి యశోదా! నందుని ఇల్లాల!
యాదవ కులదీపకుని నిదురలేపమ్మ!
మిమ్మలను సేవించు మము కాంచవమ్మ!
సౌజన్యమూర్తీ! చెలువంపు రాయుడా!
స్వర్ణగండపెండేరపు పాదమ్ముగల దేవ!
హేమకంకణధారి! బలరామ స్వామి!
ఇంద్రాది దేవతల కాపాడు ఎకిమీడ!
రావణుని వధియించ శ్రీరామచంద్రునివై, ఆ
దుష్టశిక్షణకు ఆదివరాహరూపివైనావు
ప్రహ్లాదు రక్షింప నారసింహునివైన
విరాట్ స్వరూపునివి కురుచగా మారి,
మూడడుగులనేల దానమడిగి,
అణిగిమణిగి బలి గర్వభంగమ్ము చేసి,
అనుగ్రహించినావే అత్యున్నత హస్తమైన
హస్తము చాచి దానమడుగుటే వింత!
సర్వ లోకములును నీయందె గలవు!
త్రివిక్రముడైన వేదస్వరూపుడు హరి!
బ్రహ్మ కడిగినపాదముల సేవింతు!
అట్టి ‘పరమాత్మ’ను కన్న మాతవు నీవు!
అవతార పురుషుని మేల్కొలుపు తల్లీ!
హారతి:
విశ్వముతానైన ఆ దివ్యపాదమునకు మంగళము
విధాత కడిగిన పావన బ్రహ్మమయిన
అవతార పురుషుని చరణములకు మంగళము
మంగళము దివ్యమంగళము
నరసింహ స్వామికి మంగళారతులు
ఆదివరాహ స్వామికి కర్పూర హారతులు
మూడడుగుల లోకాలు కొలిచిన
త్రివిక్రమునకు మంగళారతులు
ఓం నమో నారాయణాయ
18వ పాశురము 02-01-2026
అవతారిక:
నీలాదేవి శ్రీకృష్ణుని మేనమామ కుమార్తె. నీల సన్నిధిని నిద్రించు కృష్ణుని రప్పించవలెనన్న నీలను ప్రసన్నము చేసుకొనవలెను కావున, శరణు కోరుతున్నది.
వివరణ:
జగన్మాత శ్రీమహాలక్ష్మిని శరణు కోరి భగవదనుగ్రహమునకు పాత్రులైనారు భాష్యకారులందరూ!జగజట్టిఐన నందనందనుని మా కొరకు నిదుర లేపమని పిలిచినా, కరుణించమని కోరినా పలుకకున్నది. అమ్మ అనుగ్రహించిన స్వామి అనుగ్రహము కలుగును కనుక ‘పాలేటిరాచూలి’ని కొలిచి, హరి కరుణ పొందవలెనని గోపికలు సుగంధభరిత పరిమళములు నీ ఉనికి తెలుపుచున్నవి, కోళ్ళు కూయుచున్నవి, కోకిలల కుహూరవములు కర్ణానందముగ వినపడుతున్నవి. క్రూర రాక్షసులనణచిన బాహుబలశాలిని బాహువుల బంధించి మురియుచున్నావు! బంధనము సడలించి భగవతీ సహిత దర్శనమీయగా రావమ్మా! అని ద్వారము తలుపు తెరవమని ప్రార్థిస్తున్నారు గోపికలు.
కవిత:
గజగమనా! నందుని మేనగోడల!
నందనందనుని ప్రియసతివి!
మారుమాటాడవే? దోబూచులాడకే!
కోమలాంగీ! ఏకాంతసేవ చాలు రావమ్మ!
ద్వారము తెరువ వేడుకొనుచున్నాము!
మాధవీలతలపై పికకూజితముల,
రవము వీనులవిందుగా ఆలకించావా!
శిఖిక్రేంకరించె! తొలిజాము వేళాయె!
చెవిసోకలేదా! మారుపలుకవేమె!
ఏకాంతసేవలు చాలించి రావేమే!
స్వామి కౌగిలిలో అలసినావేమో!
నీవు లేవని మేము తలపోయమమ్మ!
గంధ, పరిమళభరిత, కుంతలముల,
సౌరభము పట్టజాలక మందిరమున
తావి ప్రసరించె! నీ ఉనికి తెలిపె లెమ్ము!
సొగసు నయనముల అన్నులమిన్న!
ఏకాంతసేవ చాలించి రాగదే! నాధువీడి!
కెందామరతూడులే! నీ హస్తయుగళము!
కంకణరవముల సవ్వడులతో తలుపు
తీయవమ్మ! గోపికాతిలకమా!
వ్రేపల్లె వ్రేతలము భక్తితో వచ్చితిమి!
శేషశయనుని వీడి కరుణించి రావమ్మ!!
ఓ చెలియ! ఓ జాణ! ప్రియ సఖీ! రావేల!
మణిమయ ద్వారము తెరువుమా!
సుప్రభాత మంగళగీతికల
ఆలకాపరికై ఆలపించెదము!
హారతి:
క్షీరసముద్రరాజ తనయకు మంగళము
కమలాసన నీకు శుభ మంగళము
కరుణించు కమలనయన మంగళహారతులివే
సహస్ర ఫణియుత శేషశయనునా
జయమంగళ నీరాజనములు హారతులివే!
మంగళహారతులివే నీరజాలయా!
శ్రీమహాలక్ష్మీ మణిమయ హారతులు!
ఓం నమో నారాయణాయ
19వ పాశురము 03-01-2026
అవతారిక:
ఈ రోజు నీలాదేవి కృష్ణపరమాత్మ ఇద్దరినీ మేల్కొలుపు పాశురం.
వివరణ:
శ్రీవారి పాన్పుని పంచశయనపాన్పుగా వర్ణన!
శ్రీహరి పాన్పు ఏనుగుదంతాల నాలుగుకోళ్ళతో పానుపు చుట్టు మణిమయ దీపతోరణాలు వెలిగిపోతూ జ్షానకాంతులు వెదజల్లుతూ గంధ, కుసుమ పరిమళ ‘సుమహారం’లా అంతటా కమ్మతావి కమ్ముకొని సుగంధభరితమై ఆదిశేషుని పాన్పు మెత్తగా, నదీతీర పవనాలతో చల్లదనం పరుచుకుని, ఆహ్లాదకరంగా సుఖతరంగా వున్నది నీలాదేవీ! స్వామిసేవతో తరించిపోతూ మా మొర వినకున్నావా! కాటుక కనులతో మాపై దృష్టి సారించవమ్మా! నీలాగే పరమాత్ముని అనుగ్రహం కోసం వేచి నిలచి ప్రార్థిస్తున్నాము! మా గోపకన్యలము నీకు విన్నవించుకుంటున్నాము.
కవితామాలిక:
‘పంచశయనపాన్పు’ సుందర కోమల,
పరిమళ, ‘దీపస్తంభకాంతుల’, శైవల, పవన
వీచికలతో, ఆహ్లాదకర దివ్య ‘శేషశయన
పాన్పు’, ‘కరిదంతశోభిత’ పాన్పు, మనోజ్ఞ
‘శయ్యయై’, దీపతోరణ ‘జ్ఞానకాంతి’ మెరయ
‘గంధపరిమళ’మైక మావహింప హరికరుణ
వోలె కోమల ‘పంచశయనపాన్పు’ పై శీతల
మారుతము వీచే వివిధ ‘సుమతావి’ వెదజల్ల
నిదురించు విభుని మేల్కోల్పవే మోహనాంగి!
నీ సన్నిధిని శయనించిన ‘దేవర’ పలుకలేదేమె!
మందగమన! ‘యదుభూషణుని’ నీవు మాతోడ
పంపవమ్మ! విభునకు మాకును ‘సంధాన
కారిణి’వి! సుప్రభాతము పలుకు వేళాయె!
నందనందనుని మదిని, నిలిపినామమ్మ!
కాటుక లలదిన, నయనములతో దయ
చూపవమ్మ! ఓ సుందరాంగీ! ‘శ్రీనాథు’విరహము
సైపజాలని నీవు మము కనికరించవమ్మ!
ఓ కమల నయన! ‘హరి’ హృదయాంతరంగ!
హారతి:
మంగళము! మంగళము! మోహనాకారునకు!
మంగళము! మంగళము! కంససంహారునకు!
మంగళము! మంగళము! నిత్యమంగళము!
దీప తోరణ మంగళము! దశావతారునకు
మంగళము! దివ్యమంగళం! భవ్య మంగళము
20వ పాశురం 4-1-2026
అవతారిక:
ఈ పాశురంలో గోపికలు నీలాదేవినీ, శ్రీకృష్ణుని మేల్కొలుపుతున్నారు.
వివరణ:
దేవతలనందరను రాక్షసులు బాధిస్తుంటే అడగకుండానే అసురులను శిక్షించి సురలను కాపాడి శతృవులను వణికిస్తున్నావు. అట్టి ధీరోత్తమా! నిద్రలెమ్ము! స్వామీ! మా కోరిక తీరుస్తానని నిన్ననే మాట ఇచ్చి ఉన్నావు. నీమాటలు నమ్మి వేకువజామునే వచ్చియున్నాము. నిన్ను లేపినా లేవకున్నావు. పిలచినా పలుకకున్నావు. నీకిది భావ్యమేనా! తగునా పరమాత్మా! పరంధామా! తల్లీ! నీలా సుందరీ! పగడకాంతుల వెలిగే ‘కెమ్మోవి సౌరభము’ గల ‘గోపికారత్నమా’!
నిద్ర లేచి నాధుని నిద్ర లేపవమ్మ! మాతో కలిసి నీరాడనీయమ్మ! కరుణించవమ్మా! అంతర్లీనంగా గజేంద్రమోక్షం, త్రివిక్రమావతారం గోపికలు ప్రస్తావించి ముఫ్ఫైమూడుకోట్ల దేవతలని అసురుల నుండి కాపాడిన, విష్ణువుని స్తుతించి, శరణాగతులమైన మేము నిన్ను వేడుకుంటున్నాము. మాపై కరుణతో భగవంతుని నిద్ర లేపవమ్మా! అని అర్థిస్తున్నారు.
పరమాత్మకు మాకు సంధానకారిణివి.’తట్టోళి’, ‘ఆలవట్టము’ మేము కోరుతున్నాము!
‘అష్టాక్షరీమంత్రం’ జీవ పరమాత్మ స్వరూప స్వభావాలు వెల్లడించే హరిమూలమంత్రం. గోపికలు కోరిన ‘మించుటద్దము’ సంసారతాపాన్ని హరించే మూలమంత్రం ‘అష్టాక్షరి మంత్రం’!
ఆ మంత్రం ప్రసాదించమని ‘శరణాగతి’ కోరుతున్నారు గోపికలు. ‘వీవన’, ‘ఆలవట్టము’ తాపాన్ని హరిస్తుంది. ‘సంసారతాపం’ హరించే మంత్రం ఆ ‘అష్టాక్షరీమంత్రం’. ప్రేమ భక్తిభావంతో కోరారు. ‘ఆత్మార్పణ’ గానంగా అర్థం చేసుకోవాలి. అష్టాక్షరీమంత్ర దర్పణము మాకీయమని గోపికలు ఆర్తితో కోరుతున్నారు
కవితామాలిక:
అరమోడ్పు కన్నులతో స్వామి దర్శనమున,
ఆశ్రిత రక్షకా! శ్రిత పారిజాత!
శ్రీరంగనాయకా! మేలుకోవయ్యా!
సుప్రభాతము! నీకు! మేలుకోవయ్యా!
సాధుసంరక్షకా! మేల్కొనుము స్వామీ!
దివ్య తేజస్సుతో, ధీమంతులు, సురల,
దివిజేంద్రు రక్షింప ‘కురుచవామన’ రూపివై
‘పరమపదము’ను వీడి వచ్చినావే!
నందవ్రజములో లీలా వినోదివై
తల్లిచే రోటికి కట్టుబడినావు!
ఇతరములు మేము కోరబోము!
గజరాజు రక్షించి బలిరాజు శిక్షించి
మోక్షమార్గమ్మునే చూపించినావు!
ఓ దేవ! ‘శ్రీహరీ’! ఓ జగద్రక్షక!
నీల కౌగిటిలోన బంధింపబడితివ?
పరమాత్మ నిను చేర ‘శుచు’లమై,
నీ రాకకై మేము వేచియున్నాము!
పిలిచినా పలుకవు ఏల స్వామి?
గోపవల్లభి వంటి కెమ్మోవి నీల!
చైతన్యస్తన్యమే స్వామి ‘కటాక్షమ్ము’!
‘క్షీరాబ్ధి’లోనున్న ‘జ్ఞానక్షీరమ్ము’!
పరమాత్మ కరుణయే ఆ ‘క్షీరము’!
ఆ క్షీరమే మాకు ‘జ్ఞానదర్పణము’!
‘మించుటద్దము’ మాకు ‘అష్టాక్షరీ’!
ఓం ఓం నమో నారాయణాయ!
ఓం ఓం నమో నారాయణాయ!
పట్టు వీవనమే ‘ఆలవట్టమ్ము’!
నీలాపురంధ్రీ! ‘ఆలవట్టము’ తెమ్ము!
‘నారాయణ మంత్ర’ ‘దర్పణము’ నిమ్ము!
మమ్ములను మీ తోడ నీరాడనిమ్ము!
~
పురంధ్రి= వివాహిత స్త్రీ, గృహిణి, ఇల్లాలు
ఆలవట్టమ్ము= పట్టువస్త్రపు వీవన
ఛత్రము=గొడుగు, బ్రహ్మోత్సవాల సమయంలో పరమేశునకు పట్టు ఆతపత్రము
దర్పణము = అద్దము, అష్టాక్షరి అనే దర్పణము
అష్టాక్షరీ మంత్రము = ఓం నమోనారాయణాయ
హారతి:
జగదీశ్వరునకు జయమంగళము
జగన్నాథునికి శ్రీమంగళం
శ్రీదేవి, భూదేవి సహిత నారసింహునకు
నవ్య మంగళము దీపతోరణ మంగళం
జగన్మోహనాకార! లోకరక్షకా శ్రీ మంగళము
ఓం నమో నారాయణాయ
21వ పాశురము 05-01-2026
అవతారిక:
ఈ పాశురంలో గోపిక కృష్ణ పరమాత్ముని మేల్కొలుపుతూ ప్రార్థించింది
వివరణ:
పానుపుపై శ్రీ కృష్ణ పరమాత్మను నిదుర లేవమని గోపికలు మేల్కొల్పుతున్నారు!
సహస్రకోటి సూర్య తేజ ప్రభలతో ప్రకాశించే పరంధామా! మేము దర్శించగలిగే విధంగా విభవావతారునివై అవతరించిన నందనందనా! సుప్రభాతము పలుకవచ్చిన గోపికలను కరుణించి నిదుర లెమ్ము! అని ప్రార్థిస్తున్నాము!
స్వామీ! నీ వెవరవు? మేమెవరిమి! నీవు మాకు పరమాత్మునివి! పరమేశ్వరా! మేము నీ సొత్తులమే కదా స్వామీ! చతుర్ముఖ బ్రహ్మ, సనకసనందనాదులు నుతించే పరమ పురుషోత్తమా! మేము స్తుతి స్తోత్రాలతో నీ పావన పాదములు పూజిస్తూ వున్నాము!
సహాస్ర ఫణయుత శేష శయనా! కేశవా! అహము, మమకారములు విడిచి నీయందే మనసు నిలిపి శరణు కోరుతున్నాము! శరణాగతియే కదా జీవ మోక్షప్రాప్తికి సాధనము! ఓ నంద గోపుని ప్రియ నందనుడా! నిదురలెమ్ము! భక్తులను కరుణించు పరమేశా! తేజస్వరూపా! మేల్కాంచ వయ్యా!
సుప్రభాతము నీకు శుభసుప్రభాతము!! స్వామిని కని గోపికలు పరవశమ్ముతో పులకించి మైమరచి అరయోడ్పు కనులతో సేవించుచూ సుప్రభాత గీతికల నాలపించిరి!
కవితామాలిక:
మేల్కొనుము! శ్రీరంగశాయి మేల్కొనుము!
రేపల్లె వాసుడా! నందనందనుడా!
వ్రేపల్లె వ్రేతలు మేల్కోలుపు గీతములుపాడగా
అరమోడ్పు కనులతో స్వామి దర్శనమున
ఉప్పొంగిపోయినవి గోమాతలన్నియు!
సురభులన్నియు ‘క్షీరధారల’ను కురిపించె!
క్షీర ధారలా! ‘సుధా,క్షీరవర్షములు’!
క్షీరమా! ‘భక్తి రసామృత’ క్షీరవాహిని!
ఘటనా ఘటన సమర్థు తిలకించి
ఘటములన్నియు నుప్పొంగి పొరలె!
క్షీరకలశములగని మానసముప్పొంగ
గోపికా లలనలు గోవిందుగాంచిరి!
గోపాలపాలకుడ! నేత్రములు తెరువు!
‘భక్తుల’ను రక్షించి ‘దుష్టుల’ను శిక్షించి
‘క్రూరదైత్యుల’నణచు దేవదేవ!
‘శతకోటిభాను’ తేజస్వరూపుడా!
లోకముల పాలించు ‘లోక రక్షకుడా’!
ఆలమందలరేని ముద్దులసుతుడవు!
‘యాగకర్తవు’ నీవు! ‘యాగభోక్త’వు నీవు!
‘యోగనిద్ర’ చాలించి మేలుకొనవయ్య!
‘మంగళా శాసనములు’ పాడగా వచ్చితిమి!
విభవావతారా! మేలుకో! మేలుకో!
సుప్రభాతము! శుభ సుప్రభాతము!
హారతి:
గోవర్ధనగిరిధారీ గోపికావిహారీ మంగళము
మాధవా! దేవకీనందనా! హరీ మంగళము
గోపికావల్లభా! గోవిందా! జయమంగళము
శుభమంగళముల నిచ్చు మంగళ రూపునకు
మంగళము! జయమంగళ హారతులు స్వామీ!
ఓం నమో నారాయణాయ
————————————-
సూచన:
తిరుప్పాలై పాశురములను వ్రాయుటకు ఆధారము
- శ్రీ జీయర్ వారి పాశురములు
- శ్రీ కుంటిమద్ది శే షక వి గారి పాశురములు
- మాతండ్రి గారు కీ శే శ్రీ మరింగంటి షట్ చక్రసీతారామాచార్యులు గారు ధనుర్మాసంలో ఉదయమే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పాడి వివరించి చెప్పేవారు.
ఆ స్ఫూర్తితో నేను పాశురాలు వ్రాసే ప్రయత్నం చేయడం వారి ఆశీర్వాదములే ! 🙏🙏🙏
(సశేషం)

