[ధనుర్మాసం సందర్భంగా ‘తెలుగులో తిరుప్పావై’ శీర్షికతో పాశురాలను అందిస్తున్నారు శ్రీమతి మరింగంటి సత్యభామ]
22వ పాశురము 06-01-26
అవతారిక:
ఈ పాశురంలో నంద వ్రజగోపికలందరూ పరమాత్మ అయిన శ్రీకృష్ణావతారుని పావన పాదముల చేర కరుణా, కటాక్ష, అష్టాంగ, యోగ విన్యాసము కోరి గోపికాసఖులు వచ్చి అర్థిస్తున్నారు.
వివరణ:
పాడిపంటలతో అలరారు విశాల భూభాగమునకు అధిపతివై పాలించు ప్రభువులు తమ అహము, స్వాతిశయము విడిచి ‘నీ దయ’, ‘కటాక్షము’ కోసరము ఎదురు చూసే పరమాత్మా! ‘విశ్వంభరాధీశ్వరా!’ అహము, స్వాతిశయం, దేహాభిమానం, ఆత్మాభిమానం వదిలి నీ పావన పాదముల నాశ్రయించుకొని ఉన్నాము. రవిబింబ, రాకేందు తేజోవిలాసా! నీ దర్శనమున సకల పాపప్రక్షాళన అయి పవిత్రులము అవగలము. అసుర, తామస గుణాలు నశించిపోగలవు స్వామీ! అనుగ్రహించమని స్తుతులు, స్తోత్రాలతో ప్రార్థిస్తున్నారు
కవితామాలిక:
ధనధాన్యసంపదల ‘కేదారమై’ భువి
‘సస్యశ్యామల’ ‘సుందరి’గ ప్రభవించు!
‘సిరిసంపదలు’ నిచ్చు ‘మాత ధాత్రీమాత!’
కెందామరమోవి, కింకిణీరవముల
కమనీయ నేత్రముల మము గాంచు దేవర!
‘విశ్వంభరాధీశ’ ‘వేదాంతవేద్యా!’
‘సృష్టి, స్ధితి, లయ విన్యాసకారకా!’
కాయమేల మాకు! ఆత్మాభిమానమేలా!
నేను నేనను, అహము మాకేల! సర్వేశ!
‘మమకారములు’ నీవే ‘ఆత్మార్పణ’ నీవే!
ఇహము కోరము! మేము పరము కోరెదము!
పరమాత్మ! ఇహలోక బంధములు వలదు!
‘ద్యుమణి’, ఒక నేత్రము ‘ఏణాంకు’ డొక అక్షి
‘మార్తాండతేజము’ నదనుజారివైనావు!
చంద్రచంద్రికల ఆశ్రితుల కరుణించినావు!
బ్రహ్మ కడిగిన పాదముల చేరినాము!
అఘమర్షణమునిమ్ము!
ఆత్మార్పణ తోడ నీ చరణ సన్నిధి
తావు కోరి నిను చేరవచ్చితిమి
సర్వాంతర్యామి! దేవకీపుత్రా!
నీ ‘పాదకమలము’ల చేర తావిమ్ము!
‘మరుజన్మ’ లేకుండ ‘మోక్షము’ నిమ్ము!
~
అఘమర్షణము = పాపములు పోగొట్టుమంత్రం
ద్యుమణి = సూర్య నారాయణుడు
మార్తాండ తేజం= మధ్యాహ్న సూర్యుని కాంతి
ఏణాంకుడు= జాబిలి
చంద్ర చంద్రికకౌముది= చల్లని వెన్నెల
కేదారము =వరిమడి, వరిపొలం, మాగాణి
హారతి:
నేత్రముల కరుణతో కాచు విశ్వంభరునకు
మంగళ హారతులీయరే గోపికా వ్రేతలార!
దశావతారునకు దశ విధ హారతులు
కర్పూర హారతులు మంగళము మంగళము
భువనములు పాలించు భువనమోహనునకు
మంగళాశాసనము మంగళము
జయమంగళము శుభమంగళం
23వ పాశురము 07-01-26
(సింహాసన పాశురం)
అవతారిక
పరంధాముడు నందనందనుడు తన ‘శేషశయనపాన్పు’ పైనుండి నేత్రాలు తెరచి మీకేం కావాలని అడుగుతున్నాడు.
వివరణ:
పరమాత్మ ‘నందనందనుడు’ తన పానుపుపై నుండి నేత్రాలు తెరిచి మీకేం కావాలి? అని గోపికలను అడుగగా వారు ఇలా అంటున్నారు!
23వ పాశురంలో స్వామి దివ్యచరణారవిందాలే తమకు ‘ఆలంబన’మని కోరుతున్నారు గోపికలు. ఆలంబన అంటే జీవుల జీవనానికి భగవంతుని ధర్మచింతనా మార్గం! జీవగమన కారణం! స్వామి ఆలంబన ఆశ్రయము వేద మార్గానుసంధానం, యోగానుసంధానము. ఆలంబనము అనీ యోగుల ఎరుక అష్టాంగ మార్గం అష్టాంగ ధ్యాన యోగమార్గ మీన నరసింహ వామన అవతారాలు గమనించవచ్చు
కవితామాలిక:
‘మేఘగర్జన’లకు ‘మృగరాజు’మేల్కోని
‘ఆగ్రహము’తోడ ‘గండి’నుండి
‘గండోలము’ దూకు ‘వడి’తోడ
‘సింహేంద్రమధ్యమ’ రాగ ‘శబ్ధ’మున
‘కంఠీరవము’ వోలె ‘ఠీవిగా’ వేంచేసి
‘మహోన్నత’ ‘స్వర్ణసింహాసనమున’
ఆసీనమై,(స్వర్ణ పీఠము)
మా కామితములను ఆలకించి
‘సింహేంద్రమధ్యమా’ ‘సింహమ్ము’వలె
మా ‘విన్నపము’ లనుమన్నించు తండ్రీ!
‘అరవిందనేత్రా’! అరమోడ్పుకనులతో
‘వీక్షించి’ మమ్ముల పావనము చేయుము!
‘నిను సేవించు’ ‘భాగ్యమ్ము’ కలుగనిమ్ము!
‘కాలగమనము’ లేక ‘రాతగున’ మీరు?
మా కడకు చేర ‘వేళ’ పాటింపరా?
‘ముకుళితహస్తు’లై, ‘ఆత్మార్పణము’తో
‘కాలగమనమ్మేమి? స్ధలనివాసమ్మేమి?’
‘తల్లిదండ్రుల’చేర, ‘సమయనియమ’మ్మేమి?
మా రాక మీకేమి ‘ప్రతిబంధకమ్ము!’
మీ కడ మాకేల ‘సమయపాలనము!’
‘అతసీసుమ’ శోభిత ‘తిరుమేనిస్వామీ!’
‘పరమ హంసల’ వోలె మీ కొరకు మా రాక!
‘అష్టాంగమార్గమున’ ‘సన్నిధి’ని చేరితిమి!
‘శరణాగతులమై’ నిను చేర వచ్చితిమి!
‘గంధమ్ము’ మేనిపై దాల్చు ‘దేవర’కు,
‘గంధకారమాల’ ‘కూర్చి’ తెచ్చితిమి!
నీ ‘పాదధూళులే’ మాకు ‘ఆలంబనము!’
‘సింహగమనమున’ వేంచేసి మమ్ము
‘వామనుడు’ దేవతల ‘కరుణించిన’ రీతి
‘దయ’ చూపవయ్య ‘దివ్యావతారా!’
‘నీ దివ్యచరణములు’ సేవించగ మేము
వేచి యుంటిమి స్వామి నీ దర్శనమునకు!
‘శరణాగతి’ కోరి వచ్చితిమి!
‘నీ పాద సలిలముల’ తరియించ ‘వర’మిమ్ము!
మంగళహారతి:
నరసింహావతార! జయ మంగళము
దుష్టశిక్షకునకు జయ మంగళము
భక్తులను కరుణించు కమలలోచనునకు
స్వర్ణకమలముల మంగళహారతి
నారాయణునకు శుభమంగళం
~
గండోపలం=మహోన్నత సింహాసన పీఠం
గండోలము=కుచ్చులమీను, మత్స్యావతారం
సింహేద్రమధ్యమం = ఒక రాగం
గంధకారిమాల =మడుగు తామరల మాల
అతసీపుష్పం = అవిసెపువ్వు
ప్రతిబంధకం= అవరోధం
హరిపాదసలిలము = విష్ణుపాదోద్భవగంగ
పరమహంసలు = పరిపూర్ణశరణాగతులైన సన్యాసులు
జీవన్ముక్తుడు=అవధూత
సింహేంద్రమధ్యమసింహం = సింహాల మధ్యన మృగరాజు
గండి = గుహ
ఈ పాశురం ప్రత్యేకనామం సింహాసన పాశురం.
24వ పాశురము
అవతారిక:
పరమాత్మునికీ యదుకుల దీపకుడైన స్వామికి మంగళహారతులు పాడుచూ స్వామిని అనుగ్రహము కోరుతున్నారు గోపికలు.
వివరణ:
రేపల్లెవ్రేతలు శరణాగతి భావనతో యదుకుల దీపకుడైన శ్రీకృష్ణపరమాత్మ యొక్క దివ్య సంకీర్తనము మంగళాశాసనము చేసి స్వామీ నీ దయామృతము చూరగొని నీ సేవాభాగ్యము ప్రసాదించ కోరుతూ వచ్చిన గొల్లకన్నెలము!
దివ్య మంగళా కారా!నీ దయాకౌముది మాపై ప్రసరింప జేయుము అని అరమోడ్పు కనులతో చేతులు రెండు పైకెత్తి నమస్కరించి భగవానునికి అవతార పురుషోత్తమునికి మంగళాశాసనము పలుకుతున్నారు గోపికలు. భక్తిమార్గములో వ్రేతలు సఖ్యము, ఆత్మనివేదన, అనన్యభక్తి మార్గం. కీర్తన పాదార్చన మార్గం అనుసరించి పరమాత్మను యోగుల వలె ధ్యానించి అయన దివ్య చరణారవిందాల నాశ్రయించారు.
కవిత:
మణిమయ సింహాసనమ్మున సింహమ్ము
వలె నున్న బ్రహ్మాండనాయకా నరసింహ
దేవర పాదారవిందములకు
మంగళాశాసనము దివ్యమంగళము
జన్మరహితుడవైన వైకుంఠవాసా
దేవతల రక్షింప అదితి గర్భమున
వామన రూపమున అవతరించి
బలి అహమ్మణచ మూడడుగుల
నేల దానము పట్టి నభోవీధి పైపైకి
విశ్వరూపమ్ముతో దివ్యతేజస్సుతో
సత్యలోకము దాటి బ్రహ్మలోకమున
నీ పాదకమలాలు బ్రహ్మ కడిగె!
భూమిపైనొక పాదము బలిశిరముపైనొక
పాదమున పాతాళలోకమునకు అణచి
సర్వ అహము మాపి అధోలోక సామ్రాజ్య
మిచ్చిన శ్రీచరణములకు జయమంగళం!
విశ్వాంతరాత్ముని పాదారవిందములకు,
మంగళము మంగళము జయమంగళం!
జలధి వారధి కట్టి వానరసేనతో లంకేశు
నణచిన శ్రీరామచంద్రునకు కోదండపాణికీ
శుభమంగళం! నిత్యశుభమంగళం!
శకట రూపున కీడు చేయగా వచ్చి
గోపకిశోరుని పాదతాడనమున స్వర్గము చేరె!
రక్షరక్షనే నందనందనుని మాత!
నందుడు శ్రీహరి కరుణయే రక్షయని అనియే!
శ్రీ మంగళాకారునకు జయమంగళం!
శ్రీచరణ కమలములకు శ్రీమంగళం!
వత్సరూపము దాల్చి వచ్చిన వత్సరక్కసు
వాలమ్ము తిప్పిహతమార్చిన
శ్రీవత్స చిహ్నునకు దివ్యమంగళము!
ఇంద్రయజ్ఞము మాని శిఖరోత్సవము
చేయ జంభారి కోపించి/కుంభవృష్టి
కురియ గోపాల బాలుడు ఆతపత్రము
వోలె గోవర్ధనమునెత్తి గోకులము
రక్షించిన దేవకీ సుతునకు మంగళము!
మంగళము మంగళాశాసనము!
మునులకు, ఋషులకు, దేవతల
కందని నీ మహిమల కొనియాడి
వాంఛితార్ధము బడయ వచ్చినాము!
అరిమర్దనము చేసి దుష్టులను
దునుమాడి నాది నేనను అహము
మమకార భ్రమల ద్రుంచి సర్వము నీవనే
ఎరుక యొసగిన వేలాయుధునకు
మంగళము అఖండ మంగళము
నీ దివ్యలీలలను కీర్తించి పూజించి
వాంఛితార్థము బడయగా వచ్చిన
గొల్ల కన్నెలము! నీ దయాచంద్రికలు
మాపైనే నిలిపి మము బ్రోచుస్వామికి
నీరాజనం మణిమయరత్న నీరాజనం!
మంగళము మంగళము జయమంగళం
గరుడధ్వజునకు శుభ మంగళము
సహస్రఫణముల ఆదిశేషునకు,
మంగళము కర్పూర మంగళము!
శ్రీమహావిష్ణు హస్తాయుధము,
సుదర్శన చక్రమునకు జయమంగళం!
పాంచజన్య శంఖమునకు శుభమంగళం!
హరిహస్తనిలయ కౌమోదకి జయమంగళం!
శారంగపాణికి సర్వమంగళము!
కౌస్తుభమణిధరునకు గోపికల మంగళము
శతానందమునకు శుభమంగళము
నందకీఖడ్గమునకు విజయ మంగళము!
వనమాలికి పరిమళ వన కుసుమ మంగళము
వైజయంతిమాలధారికి శ్రీమంగళం!
గరుడధ్వజునకు మంగళాశాసనము!
విష్ణపాదోధ్భవ పావనగంగకు మంగళము!
మోక్షకారక శ్రీచరణ యుగళమునకు
శ్రీరంగనాధునకు ‘వేదగానార్చన’ మంగళము
నిత్యమంగళము జయమంగళం!
శ్రీ గోదారంగనాథులకు శుభమంగళం!
నిత్య జయమంగళం శుభమంగళం!
~
వేలాయుధం = బల్లెము, శూలము
ఎరుక= జ్ఞానము
వాంఛితార్థము=మనోభీష్టము
ఆతపత్రము = ఛత్రము, గొడుగు
జంభారి = జంభాసురుని సంహరించిన ఇంద్రుడు
భవ్యమనోజ్ఞము
ఓం నమోనారాయణాయ
25వ పాశురము 09-01-26
అవతారిక
గోపికలు శ్రీకృష్ణపరమాత్మను స్తుతిస్తోత్రాలతో పొగుడుతూ కీర్తిస్తున్నారు.
వివరణ:
ఒకరికి పుత్రుడిగ జన్మించి, ఒక రాత్రివేళ వేరొకరి పుత్రుడై గోప్యంగా పెరిగిన కృష్ణా! కంసుని కంటిలో పొలుసులుగా, గర్భమున చిచ్చయిన గోపాలా!
దేవకీదేవి నీ బాల్యంలో లీలలు చూసే భాగ్యానికి నోచలేదు. నందయశోదల తపోఫలితమేమో! నల్లనయ్య చిద్విలాసలీలలను అనుభవించి ఆనందించి తరించినారు. వారెంత ధన్యులో! ఈ పాశురంలో గోపికలు శ్రీకృష్ణపరమాత్ముని కీర్తించి దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసి, నిరంతరం వైరభావంతో కృష్ణనామమే తలుస్తు, కృష్ణ శబ్ధం విని, ఉలిక్కిపడుతూ మనోధైర్యం చెడి వేదనాభరితుడై కలతపడే మేనమామ అయిన కంసుని సంహరించిన కంససంహారి, హరిని కీర్తించి ముక్తి సాధనమైన కృష్ణచరణాలే సాయుజ్య మార్గమని గోపికలు, ఆ భాగ్యం కలిగించమని ప్రార్థించారు.
కవిత:
పరమేశు సంకల్ప మాత్రముగ పృశ్ని
వరమున తనవంటివారు లేనందున
దుష్టశిక్షణ చేయ తానె జనియించెమ!
పృశ్నియే దేవకిగ కృష్ణుగర్భమున దాల్చ
దివ్య తేజమున అవతరించెను!
దేవదేవుని ఆనచే శిశువైన పరమాత్ము
కంసుభీతికి జడిసి ఆ రాత్రి నందపల్లె చేరగ
వసుదేవుడు శిశువుతో కాళింది నది దాటు
వేళా, హరిభక్తితో యమున ‘తోవ’ నిచ్చి
‘అభిషేకము’ చేయ ‘శేషుడే’ ఛత్రమై
కాళిందినది దాటి వ్రేపల్లెలో నంద
గోపుని ఇంట నల్లనయ్యను, విడచి
వారింటి పాపను గొనిపోయినాడు!
మాయమాణవకుని మురిపెము
నందునిది ‘నందగేహి’ నోముఫలము!
నంద వ్రజ ఏలిక తండ్రిగా ధన్యుడై
అల్లారుముద్దుగా తనయులను సాక
బలరామ, కృష్ణులు వ్రేపల్లె వ్రజమున
బాల్యలీలలు చూపి రక్కసుల
హతమార్చి క్రేపులలో ఒకనిగా
ఒక ఇంట నవనీతమొక ఇంట గోక్షీర
మొక ఇంట దధికుంభ ముచ్చెలించు
వ్రేతలిది చూసి ముసిముసిగ నవ్వుచు
అమ్మరో! గోపెమ్మ! గోపాలు చూడమ్మ!
మీ ఇంటి నవనీత చోరుడమ్మ!
మధురలో కంసునికి అలజడులతో
మనసు చెదరగ కృష్ణుడెచ్చట దాగె?
కృష్ణుడున్నాడని పెరుగుచున్నాడని
మాయ తెలిపీ మాయమైపోయె!
నిదుర కరవాయె! బెదురు మొదలాయె!
కలలోన, మెలకువన కృష్ణస్మరణయే!
కంటిలో చిచ్చాయె! మరణచిహ్నములతో!
కృష్ణశబ్ధము విని ఉలికిపడసాగే!
శత్రుసంకటమున అదిరి బెదిరి కడకు
పరమాత్మ సన్నిధిని ముక్తుడాయె!
మధురలోనున్న గోవిందు రాకకు
నందరాజనుమతిన వ్రతము చేసి
కోరిన మాత్రమున పరవాద్య
మర్ధించి నీవె మా కాంక్షితము!
మా సౌభాగ్య వైభవము నీవే!
దేహి యని వచ్చితిమి దేవాధిదేవా!
భవ్యసౌభాగ్య వైభవములేల?
నీ చరణారవిందాల చేరనిమ్ము!
ఓం నమో నారాయణాయ నమః!
ఓం నమో వాసుదేవవాయ నమః!
ఓం నమో గోవిందాయ నమః!
హారతి:
పద్మముఖబింబము పద్మపాదునకు,
పద్మనయనునకు జయమంగళం!
కౌస్తుభాలంకారునకు శుభ మంగళం!
నీరాజనం కర్పూర నీరాజనం!
ఓంనమో వాసుదేవాయ
~
ముచ్చెలించు=దొంగిలించు
వ్యాజము=తగవు
26వ పాశురము 10-01-26
అవతారిక:
ఈ పాశురంలో గోపికలు, పరమాత్మను ఆత్మ యందు నిలిపి పాంచజన్యము వంటి శంఖములు, దీపస్తంభములు, ధ్వజము, మేల్కట్టు అనుగ్రహించు వటపత్రశాయికి మంగళము పలుకుతున్నారు.
వివరణ:
వటపత్రశాయి అయిన పరమాత్ముని మోక్ష విషయ జ్ఞానము కలిగి పరంధాముని వైకుంఠవాసుని సన్నిధిని కోరి ప్రార్థిస్తున్నారు.
(వితానము=మేల్ కట్టు, యజ్ఞము=సమూహము, కంబము=స్తంభము)
ఈ మార్గళీ వ్రతనియమాలతో దివ్యసన్నిధి అష్టాక్షరీ మంత్రదర్పణము కోరి గోపికా సమూహము వ్రత నియమాలను ఆచరించి శ్రీహరిని, దర్శించి భవబంధములను తొలగించి దివ్యధామము నారాయణుని వితానము దయ చేయమని కోరి ప్రార్థిస్తున్నారు.
కవిత:
మార్గశిర వ్రతమున నదీ స్నానము చేసి,
నియమమున మార్గళీ వ్రతమాచరించి,
మది లోని కామనలు విన్నపము చేసి,
వ్రేపల్లె వ్రేతలము శరణు కోరితిమి!
నీలమేఘశ్యాము దర్శన భాగ్యము!
నీ దర్శనము మా పూర్వ పుణ్యమ్ము!
ఇంద్ర మణిమయ రమణీయ రూపా!
మా కామనలను విన్నవించెదము!
దివి మెరయునట్లు, భువియదరునట్లు,
క్షీరశ్వేతఛ్ఛాయ పాంచజన్యము!
కమనీయ శంఖముల మధురనాదమ్ము!
సన్నాయి మేళముల సంగీత రాగముల,
భేరీ, మృదంగ, దేవదుంధుభులతో,
కీర్తనలు పాడుతూ, భజనలు చేయుచూ,
మంగళగీతికలు పాడెడి గోపికలము!
కోటి సూర్యతేజ దీపస్తంభములతో,
దివ్యగరుడ ధ్వజమేల్కట్టు కోరి,
సేవించ వచ్చితిమి పరమహంసల వలె!
శరణాగతులమై నిను చేర వచ్చితిమి!
కంబ దివ్వియల ధ్వజ వితానము,
దయసేయుమో దివ్యమంగళాంగ!
వటపత్రశాయి ‘పర’ వరము నీవయ్య!
కరుణాంతరంగా వైకుంఠవాసా!
పీతాంబరధారి వనమాలి మంగళము!
మణిమంగళమ్ము కరుణాసముద్రునకు!
నీరాజనములు శ్రీనిలయవాసునకు!
మంగళహారతులు భక్తజనప్రియునకు!
విజయహారతులు దుష్టశిక్షకునకు!
రత్ననీరాజనాలు అష్టాక్షరీ మంత్రమునకు!
జయమంగళమ్ము పరవాసుదేవునకు!
కర్పూర నీరాజనాలు వటపత్రశాయికీ!
పద్మహారతులు పరంధామునకు!
ఓం నమో నమో నారాయణాయ
మంగళహారతులులివే భువనముల కర్తకు
భువనముల పాలించు భువనమోహనునకు
భవభయహరునకు భక్తపరిపాలకునకు
మంగళము మంగళము జయమంగళం
27వ పాశురము
అవతారిక:
గోపకన్యకలు కాత్యాయనీ వ్రతానుష్ఠానానికి మాకు జరిగే సన్మానం కీర్తించే విధంగా వుండాలని, మంగళకరమైన ద్రవ్యములను ఇవ్వవలసినదిగా కోరుతున్నారు.
వివరణ:
‘సింహాసనారూఢుడై’ ’సుప్రసన్నవదనం’తో ‘మందస్మిత దృక్కుల’తో గోపికలను చూస్తున్న‘పరమాత్మను’ గోపకన్యకలు ఈ విధంగా కోరుతున్నారు.
ధనుర్మాస వ్రతానుష్ఠానానికి కీర్తించే విధంగావుండాలి కనుక మాకు తగిన ‘ఆభరణాలు’, ‘పట్టువస్త్రాలు’ సమకూర్చమని కోరారు. భగవంతుని సేవించడానికి అలంకారమేల? ‘ఆత్మార్పణభావము’ చాలునని అనుకోవచ్చు! కాని ‘దేవళము’ ‘పరిశుభ్రంగా’ తుడిచి, కడిగి, ‘నయనానందకరం’గా, ‘రంగవల్లు’లు తీర్చి పువ్వులు, పసుపు, కుంకుమలతో అలంకరించి శుభప్రదంగా ‘దీపకాంతుల’తో ఆహ్లాదంగా, కనులకింపుగా, ‘ఆలయము’ ‘పరిమళభరిత’ పుష్పాలంకార శోభలతో, సేవాభాగ్యం పొందే భక్తులను కాపాడే దైవం వారి భక్తిభావనను స్వీకరిస్తాడు. కుబ్జ కురూపం ‘ఆ భావన’ తో పోగొట్టి ‘సుందరరూపం’ అనుగ్రహించాడు.
పూతన ‘విషక్షీరం’ తాగి ఆ మాతృభావనకి ‘పరమపదప్రాప్తి’ కలిగించాడు. అలంకరించిన ‘దేవళమే’ ‘దేహము’. ఆ భావనతో గోద అలంకార, ‘ఆభరణాలు’ ధరించి పట్టువస్త్రధారణతో,‘పరమాత్మునితో’ కలిసి భుజించే ‘ప్రసాద’మైన ‘క్షీరాన్నపాయసమే’ ‘సాయుజ్య’మని గోద మనసులో ‘భక్తిభావన’ అలంకారములు, ఆడంబరములు, అహంకార, మమకారములు ముక్తిమార్గ ప్రతిబంధకాలని ఆత్మార్పణ భావమే భక్తితత్వం అని ఎరుక. ‘పరమపదమైన’‘పావన పాదముల’ సేవించు భాగ్యమే ‘ముక్తిప్రదమ’ని ‘సర్వసమర్పణాభావన’ కూడారై పాశురము.
కవితామాలిక:
క్రూరకర్మలు చేయు దుష్టులను కూడ నీ వారినీ
అణచు పురుషోత్తమా! నందగోపాలుడా!
గోపకన్యలము నీ కీర్తి కీర్తించి ‘ఢక్క ’గ్రహియించీ
నిఖిల లోకములు సంకీర్తనము చేయునట్లు
కాత్యాయినీ వ్రతానుష్ఠాన సన్మానమును కోరి
మంగళ ద్రవ్యముల పూజించి పరమాత్ము
స్తుతియించు వాయిద్యములనిమ్ము!
అకార త్రయ రూప జ్ఞాన, భక్తి, ప్రపత్తుల తత్వమిమ్ము
సౌభాగ్యకరమగు ‘కర కంకణములు’ మువ్వలతో
‘ఘల్లుఘల్లు’మను ‘చరణమంజీరాలు’
‘దండకడియములు’ ‘కర్ణతాటంకములు’,
మంగళచిహ్నమగు ‘ఆభరణము’లిమ్ము!
‘పీతాంబరధారీ!’, ‘దసలివస్త్రము’లిమ్ము!
‘మంగళ స్నానము’ ‘నవ్యవస్త్రము’ ధరించి
‘రామదర్శనము’నకు వేచి చూసిన ‘శబరి’
తీయని పండ్లను శ్రీరామునికిచ్చిన రీతి!
ఇంద్రుని ’అహమణచి’ ‘గోవర్ధనమెత్తి’ వ్రేతల,
గోవుల అనుగ్రహించిన గోవింద! గోవింద!
పూతన విషక్షీరమిచ్చె! ‘మాతృభావన’ తోడ!
‘పావన’ ‘పరమపదము’ను చేరుకొనియె!
‘హరికటాక్షము’ వలన శతృభావన తోడ
కంసరాజు నిత్య ‘కృష్ణస్మరణ’ చేసి ‘పరమాత్మ’లో
ఐక్యమందె! ‘అరి’ భావనాస్మరణ వలన!
స్వామి నిను కీర్తించి గోపికలు ’ముక్తిపధము’ కోరి
స్వామి సరసన చేరి ‘భక్తిభావన’చే పరవశించీ
‘షడ్రసోపేతము’గా విందారగించి,
కరమంత జారేటి ‘గోఘృతము’తో!
‘క్షీరాన్నమే’ ‘పరమాత్మ’ ‘ప్రసాదము!’
‘క్షరఘృతాన్నమే’ ‘యజ్ఞకృతామృతమ్ము!’
‘పరమాత్మ’తో కలసి ‘భుజియించు’
‘క్షీరాన్నమే’ మాకు ‘సాయుజ్యము!’
ఈ తనువుయే ఒక్క ‘దేవాలయము!’
‘దేవళము’ భక్తులు చిమ్మి శుభ్రము చేసి,
‘రంగవల్లులు’ పెట్టి ‘తోరణములు’ కట్టి,
‘చలువపందిరుల’తో ‘సుగంధ సుమ
మాలికాలంకారముల’ ‘ముత్యాలపందిరి’
‘ప్రాంగణ’మంతా ‘శోభాయమాన’మై
‘దివ్యదీపప్రభలతో’ ‘మంగళ’వాద్య
మహోత్సవముల ‘నృత్య, గాన లీలా
వినోదముల’ ‘భక్తిరససంగీత’ రాగ గానముల
‘సకల వైభవముల’ ‘భోగభాగ్యముల’ తోడ
కస్తూరి, సుగంధ మంగళ ధూపములతో,
‘రత్నగరుడధ్వజ’ ‘దీపదివ్యతేజముల’,
‘నారద, తుంబుర, దివ్యగానములతో,’
‘యజ్ఞములు,’ ‘హోమములు’, ఆగమ’,
‘నిగమముల ‘’ఆహుతులు’ ‘ముక్కోటి
దేవతలు’ ‘స్తుతి, స్తోత్రముల’తో
‘షోడశోపచార’ సేవలతో ‘శృతుల’తో సేవించి
‘హరినామస్మరణ’మే ‘ప్రణవమంత్రమ్ము!’
‘పురుషోత్తముని’ కలిసి ‘భుజియించు’,
‘మా మనోభీష్టకామనల తీర్చేటి’
‘గోక్షీరాన్నమే’ మాకు ‘పరమపదము!’
‘గోక్షీరాన్నమే’ మాకు ‘ఉన్నతోన్నతము!’
‘క్షీరసాగర’ మందు ఉద్భవించిన ‘సురభి’,
‘క్షీరఘృతాన్నమే’ మాకు ‘సాయుజ్యము!’
‘వైకుంఠవాసుడే’ మాకు ‘ఆరాధ్యము!’
హారతి:
మంగళహారతి వటపత్రశాయీ!
మంగళము! మంగళము! నవనీత చోరా!
మంగళము! మంగళము! శ్రీహృదయ నిలయా!
మంగళము! మంగళము! వసుదేవపుత్రా!
క్షీరసాగరశయన శ్రీరంగనాయకా!
మంగళము! మంగళము! శ్రీమంగళం!
28వ పాశురం 11-01-26
అవతారిక:
పరమాత్మను ఆత్మ యందునిలిపి సేవించిన గోపికలు జగన్నాధుని మేము చేసిన తప్పులను మన్నించి మా సేవలను అంగీకరించమని ప్రార్థించుచున్నారు.
వివరణ:
ఆవుదూడలతో అడవులలో తిరిగే అజ్ఞానులము గొల్లకులములో పుట్టి నీతో కలిసి జీవించే భాగ్యం, పుణ్యము మేము పొందివున్నాము. లౌకిక జ్ఞానశూన్యులము, నీతో కలిసి సంచరించిన మా అనుబంధం విడదీయడానికి ఎవరికీ సాధ్యం కాదు!
మా తోటివారిని పిలిచినట్లు కన్నా, కృష్ణ, రమ్ము, ఏమి! అని పిలిచి అగౌరవపరచిన అజ్ఞానులం, మాపై ’కినుక’ వద్దు. మా కోరికలు తీర్చమని వ్రేపల్లె వ్రేతలు కోరుతున్నారు.
వాసుదేవా! గజేంద్రుని మొర విని, వెంటనే ఒక్క ఉదుటన వెళ్ళి కాపాడావు కదా!నీ వెంట సిరి, గరుడుడు, శంఖం, చక్రం, గదా, నందకం, రథం, విష్వక్సేనుడు పరుగులతో రాగా మకర బాధ నుండి విముక్తి కలిగించావు. మమ్ములను ఆ విధంగా కాపాడి నీ సన్నిధి చేర్చుకో స్వామీ అని ప్రార్థించారు.
కవితామాలిక:
గోవింద! గోవింద! గోవర్ధనోధ్ధార!
వ్రేపల్లె వ్రేతలము! పశుల కాచేము!
గోసంరక్షణమె జీవనము మాకు!
జ్ఞానములేని ‘అజ్ఞాన’ యాదవులము!
‘అతిశయములు’ లేవు! ‘అహము’ లేదు!
మా తోడ ఆడేటి ’గొల్ల’వనుకొని మేము,
స్ధాయిబేధము లేక నడచుకొనినాము!
ఓరోరి రార! ఓ బాల! ఓ కృష్ణ! కన్నయ్య!
ఓ సఖా! గోపాల బాల! గోవింద రార!
ఆటలాడగ రార! నందుని కొమరుడా!
అని చనువుగా మేము నడచుకొంటిమి!
నీ ‘ఘనత’ ఎరుగని ‘మూర్ఖుల’ము!
‘గొల్లకులమున’ పుట్టుటే మా ‘భాగ్యము!’
ఆవుదూడలలో దూడవై ఆడితివి!
లేగక్రేపులతో పరుగులెత్తితివి!
మా తోడ చద్ధులు ఆరగించితివీ!
నీటిలో పాముపై నాట్యమాడితివి!
‘కాళీయుమద’మణచి పారద్రోలితివి!
రాతివర్షము వచ్చి అల్లకల్లోలమై
గోకులము రక్షించ గోవర్ధనము
నెత్తి ‘ఇంద్ర వర్షము’ నుండి కాపాడి,
‘గోవింద’ నామముతో అలరారిన హరీ!
గోపికలు ‘కాత్యాయనీవ్రత’ మాచరించ
యమున గట్టున వస్త్రములనుంచి
‘నీరాడయమున’లో మునకలు వేయు
సమయాన కన్నయ్య వలువలతో
కడిమి చెట్టెక్కి రారా! గోపికలార!
‘వలువలు’ లేకుండా వ్రతస్నానమేల?
‘నోము నీమము’లను పాటించరేల?
‘కరములెత్తి మొక్కి’ ‘యమున’
తటిపై కొచ్చి నీవె మా ‘కర్త’వు!
మా ‘పతి’యు నీవే! ‘కృప’ చూపుగోవింద!
యని వేడుకొని ప్రార్థించినారు!
‘అక్రూరవరద!’ ‘నవనీతచోర!’
దుష్టకంసుని అణచి మధుర ప్రజల
కాపాడి మధురలో జనులకు
హర్షవర్షము కురియ ‘దేవకీ, వసుదేవు’
‘మానసమ్ములు’ మురియ ‘గోవిందు’
నకు ‘మంగళాశాసనములు’ చేసిరి!
‘గోవిందులీలల’కు నవ్య శుభమస్తు!
హే ‘కంసాంతక!’ గోవింద! శుభమస్తు!
‘మంగళా శాసనము’ ‘గోవిందస్వామి’కీ!
‘వనమాలి’ ‘నవనీతచోరు’నకు శుభమస్తు!
‘గోవిందనామము’కు ‘శ్రీకర’ శుభమస్తు!
‘పరమయోగీంద్రు’నకు జయ మంగళం!
హౄషీకేశా నీకు విజయ మంగళము!
మంగళము మంగళము!
కృష్ణావతారునకు నిత్యశుభ మంగళము!
ఓం నమో నారాయణాయ నమః
29వ పాశురం
శాత్తుమురై పాశురం
అవతారిక:
గోపికలు శరణాగతి భావముతో పరమాత్మా గోవిందా మేము కాత్యాయనీ వ్రతము చేసినది లౌకిక వాయిద్యముల కోసం కాదు.
వివరణ:
‘సదా’ భగవానుని కైంకర్యసేవా ‘సౌభాగ్యం’ ‘ప్రసాదించమని’ కోరుతూ ప్రార్థిస్తున్నాము. ప్రతి దినము నీ సన్నిధానమునకు వచ్చి స్తుతి స్తోత్రాలు చేస్తూ నీ చరణాలను ఆశ్రయించ కోరుతున్నాము. మాయ మర్మములు తెలియవు, మేము కల్లకపటమెరుగము. వ్రేపల్లెలో గొల్ల పడుచులము మనసులో ఒకటి పైకొక మాట మాట్లాడేవారిమి కాదు. నంద గోకులంలో పుట్టీ మమ్ము దూరం చేయకు. మా సేవలు అంగీకరించు!
గోవిందా! నందనందనా! శంఖం, ఢక్క, ఛత్రం, వీటి కోసం చలిలో, నిద్ర మాని, ఉదయాత్పూర్వం రావడం ఎందుకు? మాకు కావలసినవి ప్రసాదించు! జన్మజన్మలకు యుగయుగాలకు నీ సేవాకైంకర్యాల సౌభాగ్యం మనోచాపల్యం వల్ల, లౌకికకామనలు కలగకుండ మమ్ములను అనుగ్రహించు గోవిందా!
నీ సేవా భాగ్యము మా మనోభీష్టము! భవబంధాలు బాపి మా కాంక్షితములు నెరవేర్చు! ‘పరమాత్మా’ అని ప్రార్థించారు!
సృష్టి, స్ధితి, లయకారకుడవైన, బ్రహ్మ, విష్ణు పరమేశ్వర రూపుడు, వేదస్వరూపుడవైన విశ్వేశ్వరునివి! అవతార పురుషా! సకల లోకాలనకు రక్షణకర్తవైన పరమాత్ముని, రక్షణార్థులమై, కీర్తించి, ప్రార్థిస్తున్నాము. నీ పాద సేవే పరమపదప్రాప్తి కలిగించే ‘ఉపాయం’ అని నిన్నాశ్రయించి ‘అనన్యశరణాగతి’ కోరుతున్నాము.
కవితామాలిక:
రాకేందు మనోహర వదన నీలమోహనా!
గోవింద! గోపాల! నీ అనుగ్రహమునకు
మార్గళీ మాసమున భక్తి,శ్రధ్ధలతో
వ్రతానుష్ఠానమున వాంఛితార్థప్రాప్తి
బడయ వ్రేపల్లె వ్రేతలము నీమములతో
నీ చరణ కమలముల కడ చేరినాము!
‘కల్లకపటము’ లేని ‘గొల్లపడుచు’లము!
శంఖ, చక్ర, చామర ఢక్కలు, తప్పెటలు,
తాళములు హంగులు మాకేల స్వామీ!
నీ పాద యుగళముల తావు చాలు!
నీ సేవ సౌభాగ్యసంపదయె మా భాగ్యము!
‘జితేంద్రియులము’ కాదు! చాపల్యము బాపి
‘పరమపద’ నీ ‘పాదసేవ’ భాగ్యమిమ్ము!
గరుడ, విష్వక్సేన సేవలందుకొను ‘పరాత్పరా!’
మత్స్యావతారమున ‘వేదరక్షణ’ చేసి
‘బీజముల’ కాపాడి, ‘భూమాత’ బాధలను తీర్చి,
‘కూర్మ’మై ‘మంధరగిరి’నెత్తి సాగరమథనమున
సురల ‘కామితముల’ తీర్చ, హరుడు,
‘హాలాహలము’ స్వీకరించి ప్రజల కాపాడగా,
‘సిరి’ని చేపట్టి ‘సుధ’ను సురలకిచ్చి, వామనునివై
బలి గర్వమణచి, పాతాళమున స్థిరపరచిన
‘హరీ, సృష్టి, స్ధితి, లయ’ కారకుడవు ‘పరమాత్మ!’
వసుదేవనందనా! విశ్వంభరా! పుండరీకాక్షా!
గోదాలంకార’ తులసీదామము ‘ఆత్మార్పణతో
శ్రీరంగనాథుని అర్చించిన శ్రీరంగనాథునకు
‘గోద’ను సమర్పించ ‘పెరియాళ్వారు’ల జన్మ
ధన్యమాయె!మంగళాంగిగోదమంగళ
గళమున ‘శ్రీరంగేశుడు’ కట్టెను ‘మంగళసూత్రము’
మంగళ స్తుతులు, మంగళవాద్యములు,
మంగళకరముగ మ్రోగెను ముక్కోటి
దేవతలు, ఋషులు, యక్షకిన్నెరలు, గంధర్వులు
వీక్షించి ముత్యాల తలంబ్రాలు సొంపార
పోయించి, అరుంధతీ దర్శనము చేయించి,
భక్తులందరూ గోవింద! గోవింద! గోవింద!
స్మరణచే పరవశమున పులకించి,
శ్రీరంగనాథునికు, ఆండాళ్ళు తల్లికి! మంగళము
లీలావిలాసునకు జయమంగళం!
మంగళమని హారతులిచ్చి పరవశించేరు.
మంగళాశాసనము:
సకలలోకేశునకు విష్ణువుకు, జిష్ణునకు మంగళము
వైనతేయునకు వజ్రముల హారతీ
పాంచజన్యము పూరించిన హరికి మంగళము
‘కౌమోదకీ, గదాధారునకు’ స్వర్ణమయ మంగళము
‘సుదర్శనచక్రరాజము’నకు పద్మరాగ
మణిమంగళం రత్నమణి మంగళం
‘నందకము’ చేబూను ‘నందనందను’నకు
‘మరకతమణి’ ‘మంగళము’
‘ధ్వజనీకాంతునకు’ ముత్యాలహారతుల మంగళం
‘శతానందరధ’మారోహించు నీలోత్పలునకు
నవరత్న మంగళము
‘కోదండరామునికి’ కోదండ మంగళము
వైకుంఠవాసునకు నారదముని మంగళాశాసనము
కోటీందుప్రభలతో వెలుగొందు జిష్ణునకు మంగళము
మంగళము మంగళము మంగళాశాసనము
30 వ పాశురం 14-1-2026
గోదా శ్రీ రంగనాథ స్వామి కల్యాణం
అవతారిక:
సృష్టి, స్థితి, లయకారక, పరమాత్మ మాధవుని, ఎక్కడెక్కడ వెతికితే అక్కడ కనిపించే పరమాత్మను మనసారా కీర్తించి, సేవించి, ఫలశృతి ప్రతిపాదించు పాశురము.
వివరణ:
అలలతో అల్లకల్లోలమైనట్టి సాగరము మథించిన మాధవా! శ్రీలక్ష్మీపతివై నీవు చతుర్ముఖ బ్రహ్మ చంద్రమౌళీశ్వరుల, కారణభూతునివి (బ్రహ్మ, విష్ణు, శివాత్మకునివి సర్వాంతర్యామీ)
త్రిమూర్తిరూపా! శాంతి స్వరూపా! మోక్షకారకా! కేశవా! మధుసూదనా! వాసుదేవా! గోవిందా!
వ్రేపల్లె గోపికలము నిన్ను స్తుతించి ‘పర’ అనే ఢక్కను కోరినాము. ‘పర’ అనుగ్రహించిన ‘గరుడవాహనారూఢి’ని, వటపత్రశాయిని ఆరాధించే భాగవతోత్తముడు, విష్ణుచిత్తుడు, పరతత్వాన్ని స్థాపించి, మంగళాశాసనము చేసినాడు.
తన కుమార్తె ‘గోదాదేవి’ని, శ్రీరంగనాథునకు సమర్పించి ‘దేవాధిదేవునకు’ మామ అయి ‘పెరియాళ్వార్’గా ప్రసిధ్ధికెక్కినాడు. విష్ణుచిత్తునకు భూదేవి అంశతో అవతరించిన గోదాదేవి భక్తి భావనతో సేవించి ‘వటపత్రశాయి’ అయిన ‘శ్రీరంగనాథస్వామి’నే ప్రాణనాథునిగా వరించింది.
భగవంతుని అనుగ్రహము లేక భవసాగరము ఈది తరించలేము. ఆ పరమాత్ముని సేవించి అనుగ్రహమునకు పాత్రులమై తరించుటే మార్గం.
సృష్టి, స్ధితి, లయకారకునివి ఐన బ్రహ్మ, విష్ణు, పరమేశ్వర రూపునివి! సకలలోకనాయకా!
ఆగమ, నిగమ వేదస్వరూపా! పరంధామా! చతుర్వేదముల నిలయ స్వరూపా!
విశ్వంభరాధీశా! శరణు!శరణు! గోదారంగనాథస్వామికి కల్యాణ మంగళహారతి.
కవితామాలిక:
కళ్యాణ వైభోగం అంగరంగ వైభవము
కళ్యాణ వైభోగమే గోదారంగనాథుల
కల్యాణ వైభోగము భువిలోన
ముక్కోటి దేవతలు వీక్షించుచుండగా
వేద విదులు వేదమంత్ర ఘోషలతో
ఆగమ నిగమ శాస్త్రయుక్తముగ
గోదారంగనాథుల కళ్యాణ వైభోగమే
పెరియాళ్వారుల సుత గోదా మార్గళి
మాస వ్రతమాచరించి శ్రీరంగనాథునికి తన
గళమున ధరించిన తులసిమాల సమర్పించి,
అర్చించి శ్రీరంగనాథస్వామిని వరియించె!
ఆత్మార్పణ భావమున ‘విష్ణుచిత్తుని’ తనయకు
పెరియ పెరుమాళ్ళునకు అంగ, రంగ, కల్యాణ
వైభోగమే ‘గోదాశ్రీరంగనాయకుల’ కల్యాణ
మానందమే నయనానందమే!
దేవదుంధుభులు మ్రోగుచుండ మేళ,
తాళముల, నారద, తుంబుర భక్తిగానముల
నృత్య, గాన విలాసములతో, వేదయుతముగ,
దేదీప్యమానముగ స్వామి కల్యాణ వైభోగమే
రత్నకాంతులతో మాణిక్య మంగళము
ముత్యాల తలంబ్రాలు ముద్దు ముచ్చటల,
మంగళస్వరముల జయజయ ధ్వనుల
చతుర్వేద సహిత స్తుతుల నుతించగ,
ఋషిలందరకు ముక్తినొసగు వైకుంఠధాముడు
శ్రీరంగనాథునందు లీనమాయెను గోద!
మంగళము మంగళము కల్యాణగుణ
ధామునకు గోదాశ్రీరంగనాయకుల
ఆనంద కల్యాణ వైభోగమే!
మా ‘నయనాల’కానందమే! మహానందమే !
శ్రీ గోదా శ్రీరంగనాయకుల కల్యాణ వైభోగమే!
లోకనాయకుని మరకత మణిహారతులు!
శేషశయనుని ఆనందవైభవములకు మంగళం!
శ్రీరంగనాథునికి గోదావిదూషికి మంగళహారతిదే!
నవరత్న మణిమయ శుభ మంగళహారతులివే!
కర్పూర హారతిదే జయమంగళ హారతిలివే!
సౌగంధిక కుసుమ హారతులివే!
భూజనమందారునకు భవ్యహారతీ!
రాజీవలోచనునకు పద్మరాగ మణిహారతి!
జనవినుత నీలోత్పలునకు ముజ్జగాల హారతీ!
జయము జయము జయము!
దివ్య మంగళ హారతిదే !
పరమ పురుషోత్తమునకు పుష్యరాగ హారతీ!
శుభ మంగళము! భవ్య మంగళము!
కరుణాసాగరునకు మంగళహారతులు
వైకుంఠవాసా నిత్య శుభమంగళము !
నమస్తే నమస్తే నమో నమః
~
ఆండాళ్తిరువడిగళే శరణం
(సమాప్తం)
