[శ్రీ కోవెల సుప్రసన్నాచార్య గారి ‘తెలుగులో వచన కవిత – ఒక సమీక్ష’ అనే వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాము.]
తెలుగులో ఆధునిక కాలంలో పద్యాన్ని వదిలిపెట్టి వచన కవితను నిర్మించే ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నం ప్రధానంగా 1930లలో ప్రారంభమైంది. అర్థాన్ని అధ్వాన్నపు అడవిలో విడిచి, గద్యానికి పద్యానికి పెళ్లిచేద్దాం అని ఆరోజుల్లో సర్రియలిస్టిక్ బ్యాక్‌గ్రౌండ్‌లో వచన కవిత్వం పెరుగుతూ వచ్చింది. శ్రీశ్రీ మహా ప్రస్థానంలో లయబద్ధమైన రచనలే ఎక్కువ చేసినా వచన కవిత్వంలోకి ప్రవేశించాడు. శిష్ట్లా ఉమా మహేశ్వరరావు, పిఠాపురం యువరాజు వంటి వాళ్లు ఈ మార్గంలో ముందుకు వెళ్లారు. అర్థాన్ని విడిచిపెట్టి కవిత్వం ఎలా ఉంటుంది? అధ్వాన్నపుటడవి అంటే తన ఇంట్లో సుష్టుగా ఇష్టంగా భోజనం చేయడానికి బదులు ప్రయాణంలో తినడానికి తీసుకుపోయే భోజనంగా చెప్పుకోవచ్చు. దీని అర్థం పక్కనే అడవి అనే మాట ఉండటంతో ఎంత గజిబిజిగా ఉంటుందో ఊహించవచ్చు. మరొక పార్శ్వంలో చూస్తే.. అర్థము జీవన పరమార్థమని, ఈశ్వరాభిముఖ ప్రయాణమని భావించితే అధ్వాన్నము అంటే మనం అనుభవించే కర్మ బాహుళ్యమని అనుకోవాలి. అందువలనే తరువాతి పాదంలో గద్యానికి పద్యానికి పెళ్లి చేద్దాం అన్న మాటకు గద్య పద్యముల కలయిక చెంపూ కావ్యాన్ని స్ఫురింపజేస్తుంది. కొంచెం ఎదిగి చూస్తే పార్వతీ పరమేశ్వరులు వాగర్థములని చెప్పిన కాళిదాసు గుర్తుకు వస్తాడు. శబ్దార్థములు రెండూ పార్వతీ పరమేశ్వరులకు ప్రతీకలైతే, పార్వతీ పరమేశ్వరుల కల్యాణం స్ఫురించి జీవన పరమార్థం ఏమిటో తెలుస్తుంది. ఇది సర్రియలిస్టిక్ కవిత్వం కాబట్టి రచయిత తృప్తిగా ఉన్న మనసులోనుంచి ఉబికి వచ్చిన వాక్య పంక్తికి ఈ అర్థం చెప్పుకోవడం కూడా అసమంజసం కాదు.
వచన కవిత్వం రాకలో పద్యానికి వ్యతిరేకత స్పష్టంగానే కనిపిస్తుంది. పద్యము యొక్క నడుమును విరగ్గొట్టాలని తొలి వచన కవులు గట్టిగానే భావించారు. దానికి ప్రధాన కారణం గణ యతి ప్రాసల నియమంతో ఒక నిదురపోయిన సంగీతాన్ని ఆవహించుకున్న ప్రాచీన కవిత్వ సంప్రదాయాన్ని భంగింపజేయడం, నన్నయ్య నాటి నుంచి వస్తున్న సంప్రదాయాన్ని తెంచుకోవడం కావచ్చు. ఇలా సాగిన వచన కవిత్వం చాలామటుకు వాచ్యార్థ ప్రధానంగా వస్తు ప్రాధాన్యంతో కొనసాగింది. పఠాభి లాంటి కవులు దీన్లో చేరారు. అప్పటికే ప్రసిద్ధులైన బావ కవులు కూడా కీర్తి లోభంతో వచన కవిత్వాన్ని కూడా రాశారు. ఆ విధంగా పదిహేను సంవత్సరాలు వచన కవిత్వంలో ఈ ప్రయోగ వాద పార్శ్వం ఉప్పు సముద్రంలో నదీ జలాలు కలిసినట్టు చెదిరిపోయింది. అసలు వచన కవిత్వం రాయడమే కవిత్వానికి పరమార్థం అన్నట్టు ఒక ఉద్యమం ప్రారంభమైంది. ఆరుద్ర త్వమేవాహం, నయాగరా కవుల రచనలు దీనికి పునాది వేశాయి. కవిత్వ ధర్మం అయిన కావ్యానందం పక్కకు తొలగి వామపక్ష భావాలు ప్రధానమైన ప్రగతివాద కవులు ఈ మార్గాన్ని ఆవరించుకొన్నారు. 20వ శతాబ్దంలోని ఐదవ దశాబ్దంలో ఈ వచన కవిత్వం ఉద్యమస్థాయికి వచ్చింది. కుందుర్తి వచన కవిత్వ పితామహుడయ్యాడు. శేషేంద్ర కూడా వచన కవిత్వం రాశాడు. దాశరథి మొదలైన కవులు కూడా పునర్నవం మొదలైన కావ్యాలలో పద్యాన్ని పక్కకు పెట్టి వచన కవిత్వ మార్గాన్ని ఆశ్రయించారు. పద్యం రాసి మనం సాధించేదేమీ లేదని భావించిన మాదిరాజు రంగారావు వంటి కవులు వచనకవిత్వము తమ ప్రవృత్తిగా కొనసాగించారు. ఆ విధంగా 20 శతాబ్దం మధ్యకాలం నుంచి ఎక్కువ మంది కవులు ఈ త్రోవలో పయనించసాగారు.
అయితే ఇంత సంక్షోభంలోనూ కవిత్వానికి అవసరమైన సౌందర్య పార్శ్వం తిలక్ కవిత్వంతో ముందుకు వచ్చింది. ఆయన అమృతం కురిసిన రాత్రి, కవిత్వ శోభాయాత్రకు ప్రస్థాన గ్రంథం అయింది. ఈ దశలో కవిత్వ భాషలో మార్పు వచ్చింది. రాయప్రోలు సుబ్బారావుతో ఆధునిక కవిత్వంలో కవిత్వ భాష ఎట్లా మారిందో నూతన మైన పలుకుబడిని సృష్టించిందో, తిలక్ కవిత్వం కూడా ఆ విధంగానే వచన కవిత్వంలోకి సౌందర్య భావనను పాదుకొనేట్లు చేసింది. కుందుర్తి, తాను విశ్వనాథ మార్గంలోనుంచి బయటకు వచ్చినా, ప్రాచీన పద్య భాగాన్ని వదలి వచన కవిత్వ ఏకైక ప్రచారకుడైనాడు. ఆయన తెలంగాణ కావ్యం రూపకాలంకార ప్రాచుర్యంతో గొప్ప కావ్యాన్ని నిర్మించే స్థితిని వచన కవిత్వానికి చేకూర్చింది. కుందుర్తి వైపు నుంచి వచ్చిన కవులలో వచన కవిత్వ పార్శ్వం ప్రధానమైనా, పద్య కవిత్వాన్ని ద్వేషించే స్థాయి లేదు. నేను విన్నంతలో నయాగరా కావ్యాన్ని తెనాలిలో ఆవిష్కరించారు. ఆ ఆవిష్కరణ సభకు ప్రసిద్ధ నటి కాంచనమాల వస్తుందని ప్రకటన చేశారట. కానీ ఆమె రాలేదు. అప్పుడు తనకు శిష్య ప్రాయులైన కుందుర్తి, రెంటాల, ఏల్చూరి సుబ్రహ్మణ్యం ఈ ముగ్గురూ రచించిన నయాగరాను తెనాలిలో విశ్వనాథ ఆవిష్కరించారు. ఈ విషయాన్ని ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారి కుమారుడు మురళీధర్ రావు నాతో చెప్పారు.
వచన కవిత్వానికి ప్రేరణ ఇచ్చిన వాళ్లలో గుడిపాటి వెంకటచలం పేరు ఎందుకో విస్మృతమవుతున్నది. నలభైలలో ఆయన చింతాదీక్షితులుగారి ప్రేరణతో వచన కవిత్వం రచించారు. ‘యశోదా గీతాలు, భగవాన్ రమణ మహర్షి పాదాల చెంత’ మొదలైన రచనలు ఆయన పరతత్త్వ అన్వేషణను తెలియజేస్తూ ఆయన కవిత్వపు పారమ్యాన్ని వెల్లడిస్తుంది. చలం వచనమే చాలా సందర్భాల్లో కవిత్వం లాగా ప్రవహిస్తుంది. తరువాతి కాలంలో దాశరథి అత్యంత ప్రతిభావంతుడైన కవి. ఆయనలో సంస్కృత, ఆంగ్ల సాహిత్యాల వైదుష్యం, ఉర్దూ, పారశీక కవితల సంక్షిప్తత, లయబద్ధమైన రచన సృష్టి మూలాల్లో దర్శించే ధోరణి కనిపిస్తాయి. ఆయనకు పద్యం కూడా జనచైతన్యాన్ని మేలుకొలిపే సాధనమైంది. పునర్నవం లాంటి రచనల్లో ఆయన మార్మిక దృష్టి కూడా కనిపిస్తుంది. దాశరథి పలుకుబడిలో అనుభూతి సాంద్రత ఎంత ఉంటుందో భాషా సారళ్యం కూడా అంతగా మనకు కనిపిస్తుంది. అట్లాగే జ్ఞానపీఠ పురస్కారం పొందిన సినారే తన తొలి రచనలో మంచి పద్యాలు రాసినా, ఆ తరువాత ఆ మార్గాన్ని విడిచిపెట్టి అనేకమైన వచన కవిత్వ సంపుటాలను వెలువరించారు. నారాయణ రెడ్డి కవిత్వంలో ఊహ విశ్వతోవ్యాప్తమైంది. మార్మికత అంతగా లేకపోయినా స్వాప్నికత నిత్య జీవనంలో చెలరేగే విశిష్ట సన్నివేశం ప్రబలంగా కనిపిస్తుంది. ఆయన భూమిక, విశ్వంభర మొదలైన కావ్యాలు ఆనాటి కవిత్వ మార్గంలో విశిష్టమైన రచనలు. విశ్వంభరలో ప్రపంచ చైతన్య ప్రసారంలోని వివిధ దశలను బలంగా వ్యక్తీకరించారు.
తరువాతి కాలంలో దిగంబర కవులు, చేతనావర్త కవులు, ఇంకా అనేక కవుల సమూహాలు వచన కవిత్వ సరస్వతికి ఆలంబనగా నిలిచారు. సౌందర్య భాగం లేకపోగా అశ్లీలాన్ని జోడించి వర్తమాన సమాజం పట్ల నిరసనతో దిగంబర కవులు రచన చేశారు. ఆ తరువాత అరిపిరాల విశ్వం మొదలైన కవులు వచన కవిత్వ మార్గాన్ని పరిపుష్టం చేశారు. వీరి రచనలలో రహస్యవాద ధోరణి స్పష్టంగానే కనిపిస్తుంది.
చేతనావర్త కవిత్వంలోని నా రచనల్లో శ్రీఅరవిందుల దివ్య జీవన మార్గం ఎలా ఈ సృష్టిని ఉన్నత భూమికల మీదకు నడిపించగలదో తెలిపే ప్రయత్నం జరిగింది. పేర్వారం జగన్నాథం తన రచనల్లో వ్యంగ్య ధోరణిలో సమ సమాజ స్వరూపాన్ని మనసును పట్టుకునే ప్రతీకలుగా చిత్రించారు. వామపక్ష ధోరణి కవులలో భారతీయ సంస్కృతికి వ్యతిరేకమైన ధోరణులు ఎన్ని ఉన్నా అనిశెట్టి సుబ్బారావు లాంటి వారు వచ్చాను వచ్చాను వ్యాస సంతతి వాణ్ణి అని భారతీయ సంస్కృతి పార్శ్వాన్ని బలమైన భూమికగా చిత్రించారు. వేగుంట మోహన ప్రసాద్ వంటి కవులు కొంతవరకు సర్రియలిస్టిక్ ధోరణిలో కవిత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు.
బలమైన పద్య నిర్మాణం చేయగలిగిన శేషేంద్ర వర్తమాన కాలపుటొత్తిడి వల్ల వచన కవిత్వ పార్శ్వంలోకి ప్రవేశించి నా దేశం నా ప్రజలు, గొరిల్లా మొదలైన కావ్యాలు శేషజ్యోత్స్న వంటి ప్రణయ కావ్యాలు నిర్మాణం చేసి ఈ కవిత్వం అప్పటికే కోల్పోయిన కావ్యానంద మార్గాన్ని బలపరచి కొత్త ప్రతీకలతో భావనలతో దేశీయ సంస్కృతి లోని గొప్పతనాన్ని వివరించే ధోరణిలో ఈ మార్గంలో నిలువెత్తయిన గొప్ప కవిగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఈ మధ్యలోనే వస్తు ముఖంగా దళితవాదము, స్త్రీవాదము, ప్రాంతీయ వాదము.. ఇలా సమకాలీన ఉద్యమాల ప్రతిఫలనం పేరుతో కవిత్వ రచన కొనసాగింది. ఈ సందర్భంలో తెలంగాణ ఉద్యమం ఒక బలమైన అభివ్యక్తిగా అనేకమంది కవులను సృష్టించి వారి అభివ్యక్తి పార్శ్వాలను సంపన్నం చేసి దానికి ఒక ప్రేరణ శక్తిగా నిలబడింది.
ఒకవైపు వాదాల అభిమానాల సంవాదాల చర్చలు సాగుతుండగా ఈ కవిత్వ మార్గాన్ని సుసంపన్నం చేసిన వారిలో ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, శీలా వీర్రాజు, సీవి కృష్ణారావు, అద్దేపల్లి రామమోహన్ రావు, వరవరరావు, దుర్గానంద్, ముదిగొండ శివప్రసాద్, రామగిరి శివకుమారశర్మ, పెన్న శివరామకృష్ణ, రామా చంద్రమౌళి, పృథ్వీరాజు, దర్భశయనం శ్రీనివాసాచార్య, సంపత్కుమారాచార్య, వే.నరసింహారెడ్డి, శివారెడ్డి, సీతారాం, అఫ్సర్, ప్రసేన్, విన్నకోట రవిశంకర్, విఆర్ విద్యార్థి, లంకా శివరామ ప్రసాద్, పొట్లపల్లి శ్రీనివాసరావు, దీవి సుబ్బారావు, విహారి ఇంకా అనేకులైన కవులు తాము పలుకుబడులతో నూతన ప్రతీకలతో, వాక్య విన్యాసంతో ఈ ధోరణికి స్థిరత్వాన్ని కలిగించారు.
వచన కవిత్వ మార్గంలో శేషేంద్ర, తిలక్ మొదలైన వారి తరువాత కవిత్వ భాషను తన సృజన శక్తితో నూతనంగా పరిణమింపజేసి దాని శోభను, వైషద్యాన్ని ప్రకటిస్తున్నవారు రామాచంద్రమౌళి. బన్న అయిలయ్య తన రహస్య చిత్రం మొదలైన కావ్యాల ద్వారా సున్నితమైన బింబములకు ప్రాధాన్యమిచ్చి దళిత జనుల హృదయ ఘోషకు కవిత్వ రూపాన్ని సంతరించారు. ఇటీవలే పరమపదించిన రాళ్లబండి కవితాప్రసాద్ పద్యము, గద్యము వెలిగింపజేస్తూ కవిత్వానికి నూతన సమన్వయ మార్గాన్ని ప్రతిష్ఠించారు. రామ్ నారాయణ కవిత్వం అందమైంది. సంగ్రహమైంది. ప్రతీకాత్మకమైంది. దాదాపు ఎనభై సంవత్సరాలుగా సాగివస్తున్న వచన కవిత్వం కృష్ణశాస్త్రి, విశ్వనాథ వంటి కవులను కూడా మోహ పరచి ఒకటి రెండు రచనలు చేసేట్టు చేసింది. 1950లలో అబ్బూరి ఛాయాదేవి సంపాదకత్వంలో కవిత అనే ఒక సంచికలు రెండు వెలువడ్డాయి. వీటిల్లో వచన కవిత్వానికే ప్రాధాన్యం లభించింది. అబ్బూరి రామకృష్ణారావు గారు ప్రగతివాద కవిత్వోద్యమాన్ని అపసవ్య మార్గంగా పేర్కొని పొరపాటీ తిరుగుబాటు అనే రచన చేశారు. అబ్బూరి వరద రాజేశ్వరరావు, రాజశేఖర్, కవిరాజమూర్తి, బెల్లంకొండ రామదాసు, కుందుర్తి మొదలైన కవుల కవితలు ఈ సంపుటాలలో అచ్చు అయి ఈ ఉద్యమానికి ప్రసిద్ధ కవుల ఆమోదాన్ని అందజేశాయి.
బౌద్ధమార్గం నుండి మనకు సంక్రమించిన కవిత్వశాఖ ప్రక్రియ హైకూలు. దీనిలో మూడు పాదాలు, ఉచ్చ్వాస నిశ్వాస, కుంభకాలకు ప్రతీకలు. ఇది సంక్షిప్తంగా ఒక ప్రాకృత గాథ వలె రచింపబడుతుంది. కుంభక ప్రతీక అయిన మధ్య పాదం చిన్నది. మొదటి పదం, మూడో పాదం సమానాక్షరాలు కలవి. ఈ ప్రక్రియ చాలా బలంగానే వచ్చింది. ప్రముఖ కవి అయిన ఎన్. గోపి నానీ అనే ఓ ప్రక్రియ ను సృజించి వ్యాప్తి లోకి తీసుకొచ్చారు. ఇది కూడా స్వల్ప పాదాలతో నిర్వహింపబడే రచన.
కోవెల సుప్రసన్నాచార్య ప్రఖ్యాత కవి, విమర్శకులు. పలు గ్రంథకర్త. శ్రీ అరవిందో తత్వ చింతానామృత పానమత్తుడు. ప్రౌఢ గంభీరం వారి కవితా విమర్శ.
