[డా. జి.వి. పూర్ణచందు గారు రచించిన ‘తెలుగుతో అంటకాగండి!’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
ఇప్పుడు తెలుగులో వ్రాస్తున్నవారిలో నూటికి ఒక్కరు కూడా సంస్కృతం నేర్చినవారు కాదు. పద్యాలు వ్రాస్తున్నవారిలో కూడా చాలామంది సంస్కృత పండితులు కాదు.
నన్నయతో మొదలిడి వెనకటి కవులకు తెలుగు సంస్కృతం నుడుల మీద ఉన్నంత పట్టు ఇప్పటిని మనం కొద్దిమందిలోనే చూస్తున్నాం. ఇప్పటిమన వ్రాతలకు సంస్కృతంలో అంతటి ‘నేర్పు’తో పని కూడా లేదు.
అలాగని, సంస్కృతం లేకుండామన వ్రాతలు సాగుతున్నాయా అంటే అదీ లేదు. వందమాటలు వ్రాస్తే అందులో అరవైకి పైగా సంస్కృతం మాటలే వాడేస్తున్నాం. అంతగా సంస్కృతం మందిలోకి పాకిపోయింది.
వెనకటి కవులు సంస్కృతంలోనే కాదు, ప్రాకృతం, పైశాచీ లాంటీ నుడుల్లో కూడా నేర్పరులే! సంస్కృతం కవుల్ని పొగిడి మొక్కిన వారే అంతా! అప్పట్లో సంస్కృత కావ్యాలను తెలుగులోకి తెచ్చి, కవులుగా వాసికెక్కిన వారే ఎక్కువ. సొంతంగా వ్రాస్తే మన్నన లేకుండా పోయేది. “భాషలెన్నేని గలవహో భాషలందు సంస్కృతంబుత్తమంబు తత్సరణి బోల నితర భాషల కించుక యేని గాదు..” అని నమ్మినవాళ్లే మన వెనకటి కవుల్లో చాలామంది.
తెలుగుకి సొంతంగా నుడి కలిమి ఉన్నప్పటికీ వాటికి నుడికట్టు (వ్యాకరణం) గానీ, నుడువుల మాల (వర్ణమాల)గానీ మనం సంస్కృతాన్ని బట్టే ఏర్పాటు చేసుకున్నవే! సంస్కృతం కన్నబిడ్డలా తెలుగుని పాలిచ్చి పెంచింది. కాబట్టి సంస్కృతాన్ని కాదని మనం ఎక్కడికీ పోలేము. సంస్కృతం ‘మన్నన’ను సంస్కృతానికిస్తూనే, తెలుగు నుడువులకు తగిన ‘కూరిమిని కూడా ఇవ్వవలసి ఉంది.
పని జరిగిపోతోంది కాబట్టి సంస్కృతం మాటనో కాదంటే ఆంగ్లం మాటనో వేసి వ్రాతను పూర్తి చేసేస్తున్నాం. ఒకింత ఓపికపట్టి దీనికి తగిన తెలుగు మాట ఏదైనా ఉన్నదేమో అని వెదకటం మానేశాం.
ఇటీవల కవుల్లో ఈ సంస్కృతం వాడకం మరీ పెచ్చుమీరింది. ఇప్పుడు కొందరు నూటికి 80 మాటలదాకా సంస్కృతం వాడేయటానికి వెనుకాడటం లేదు. ఇలా వ్రాయటం వలన మనం తెలుగు నుడుల్ని వాడకంలోంచి తప్పించి మరుగున పడేస్తున్నామని, అలా తెలుగుకి చెడు కలిగిస్తున్నామనే ఎరుక లేకుండా పోయింది.
“కొత్తకవుల్లోనూ తెలుగు గిట్టమి
తెలుగు తెలుగని యద్దాన దిగుడె గాని
సంస్కృతమ్మునకన్న కష్టంబు హెచ్చు
ఒక్కదాన పరిశ్రమమ్మున జాలు దాని
కిద్దానితో రెండడుగుల వలయు”
అని శ్రవణానందంలో తిరుపతి వేంకటకవులు సంస్కృతంలో వ్రాయటమే తేలికన్నారు. అంటే, సంస్కృతం ఒక్కటి వస్తే చాలు, ఎంత కవిత్వం అయినా వ్రాయొచ్చు. కానీ తెలుగున వ్రాయాలంటే అటు సంస్కృతం ఇటు తెలుగు రెండూ రావాలి. రెట్టింపు చెమట కక్కాలి.. అని!
“సంస్కృత గ్రంథ వాసనయె లేకున్నచో తెలుగు గాదది పెద్ద తెగులు గాని” అని కూడా అన్నారు.
“బావా! ఎప్పుడు వచ్చితీవు?” లాంటి పద్యాలు వ్రాసి గొడ్లుకాసే బుడ్డోడిక్కూడా నోటికొచ్చేలా చేసిన ఆ మహాకవులు తెలుగుని అంతమాట యథాలాపంగా అన్నారో, కావాలని అన్నారో తెలీదు. “తెలుగున దిగకండి” అని కూడా అన్నారు.
ఆ మహాకవుల శిష్యులైన విశ్వనాథవారు “నీచభాషాకలిశ్యమానావస్థయై జగన్ముక్త్యేక రహితమైన దేశభాషయుంబోలె..” అంటూ రక్కసి మూక నడుమ పడి ఉన్న సీతను తెలుగుభాషలా ఉన్నదంటూనే ఆ మాటల్ని ఆయన తెలుగు మాట లేకుండా అచ్చం సంస్కృతంలోనే చెప్పారు. చాలా మందిలో ఇప్పటికీ సంస్కృతం అండ లేకపోతే తెలుగుకు వేరే బతుకు లేదనే తలంపు ఎక్కువని దీన్ని బట్టి తెలుస్తోంది.
‘తెలుగు కవుల సంస్కృతప్రయోగాలు’ అనే పొత్తంలో దీని మీద వ్రాస్తూ, ఆచార్య జాస్తి సూర్యనారాయణగారు ఇలా అన్నారు: “నవీనయుగంలోకవులు ఛందోబందోబస్తులను నిరసించారే గాని సంస్కృత భూయిష్ఠమైన ఆంధ్రాన్నాదరించారు. ఇంతకు మునుపున్న కవుల రచనల్లో కన్నాఈనాటి వారి రచనల్లో సంస్కృతం అధికంగా ప్రయుక్తమైంది. మహాప్రస్థానం అనే నామకరణం నుంచి భిక్షువర్షీయసి మొదలయిన శీర్షికల వరకు అంతా సంస్కృత భూయిష్ఠమే! అల్లసాని పెద్దనార్యుడు అడిగిన నిరుపహతి స్థలేత్యాధులు అనవసరం, సదాకృతిః ప్రభవతి అని చెప్పిన శ్రీశ్రీ తన రచనలో సంస్కృత పదాలనే గాక సంస్కృత సమాసాలను వాక్యాలను గూడ ప్రయోగించారని తెలుస్తుంది” అని వ్రాశారు.
ఇద్దరమ్మల ముద్దుల కొడుకులాగా తెలుగు కవి సంస్కృతాంధ్రాలను బియ్యం పెసరపప్పు కలిపిన పులగంలా తమ వ్రాతపనిని ’జాయి’(నేర్పు)గా సాగిస్తున్నారు. 60 వంతులు సంస్కృతం తల్లి దగ్గరా, 20 వంతులు తెలుగు తల్లి దగ్గర, ఇంకో 20 వంతులు పర్షియన్ పోర్చుగీసు తల్లుల దగ్గరా పెరిగిన వాళ్లం మనం అందరం.
సంస్కృతం అడకువని (దాస్యం) నన్నయ తెచ్చిపెట్టాడని కొందరు తిడతారు గానీ, నిండా సంస్కృతం లేదా ప్రాకృతంలోనే కవిత్వం ఉన్న ఆ పొద్దుల్లో నన్నయ దూర్చగలిగినన్ని తెలుగు మాటల్ని తన వ్రాతలో దూర్చే పని చేపట్టాడు. వెనుకటి కవులంతా కలిసి అలా నూటికి 20 -40 మాటల వరకూ చేర్చగలిగారు..!
తెలుగు మక్కువతోన్నవి కాదు కాబట్టి, వాళ్ళకారణాలు వాళ్ళకి ఉన్నాయి కాబట్టి, నన్నయని తిట్టటం ఒక గొప్ప అనుకునే వాళ్లని అలా ఉంచితే, ఇంత తెలివిడి ఉన్నవాళ్లం కదా.. నన్నయ తెచ్చిన నూటికి 40 తెలుగు మాటలకు కొసరుగా మరో 10 తెలుగు మాటలన్నా మనం పెంచి వాడగలిగామా..? పెంచాలని పిలుపు నిచ్చామా..? అచ్చంగా తెలుగులో ఇలా వ్రాయవచ్చని వ్రాసి చూపించామా?
సంస్కృతం లేని తెలుగుని వ్రాయగల నేర్పరికే, వెనకటి తెలుగు వ్రాతలను వెక్కిరించే దొరతనం దక్కుతుంది.
సంస్కృతంతో అంటకాగితే..?
సంస్కృతం నుడువులలో ఆడ,మగ,పేడి నుడువులు తెలుగు నుడువులకన్నా కొన్ని వేరుగా ఉంటాయి. “అలవడ సంస్కృత శబ్దము తెలుగుబడి విశేషణంబు తేటపడంగా పలుకునెడ లింగవచనంబుల భేదింపమికి మెచ్చు బుధజనుడు..” అని నన్నయగారు ఏనాడో చెప్పారు. తిక్కనగారు ఇలాంటి ఇక్కట్టు రాకుండా తెలుగు దోవలోనే వ్రాత సాగించాలని చూశాడు.
తిక్కనలో సంస్కృతం నుడువులకు జోడైన మాటల్ని ఎలా పుట్టించుకోవాలనే పనిగా పెట్టుకుని ఈ తెలుగులోకి మళ్ళించటం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగని ఆయన సంస్కృతాన్ని వదిలాడని కాదు.
ఒకవేళ తెలుగు మాట ఏదీ దొరకక సంస్కృతమే వాడాల్సి వస్తే, దాని వరకూ ‘సంస్కృతం కట్టుపాటు’ (భాషా మర్యాదలు)నే పాటించాల్సి ఉంటుంది. సంస్కృతం పలుకుల వరుస (వాక్యం) కట్టుబాటు (నిర్మాణం) ఒక్కోసారి తెలుగుకి సాజమైనదిగా ఉండదు. అందుకని, మితిమీరిన సంస్కృతం వాడకాం “మర్యాద విజాతీయము” అంటారు పెద్దలు.
తెలుగు కుదురులో సంస్కృతాన్ని నాటాలంటే కొన్ని పట్టుల్లో కుదరకపోవచ్చు. అందుకని సంకరం చేయకుండా అచ్చతెలుగులోకి మళ్ళటం మేలుకదా!
ఈ ఇక్కట్టును తప్పించుకోవటానికి సంస్కృతానికి ఈడైన మాటలను (తత్సమాలు) వాడుకోవటం మొదలు పెట్టారే గానీ, తీరైన తెలుగు మాట ఏదైనా ఉన్నదేమో వెదికే పని చెయ్యలేదు.
‘దధితోడి చలిదిముద్ద’ లాంటి మాటలు శ్రీనాథుడు పుట్టించినవి కొల్లలుగా కనిపిస్తాయి. ‘భుజ’ధాతువుకు ‘కించు’ చేరి ‘భుజించు’ అని తతత్సమధాతువు ఏర్పడుతుంది, కానీ, శ్రీనాథుడు అన్నం తినటాన్ని “భుజిక్రియ” అని శృంగార నైషధంలో వాడాడు. సంస్కృతం నుడులతో అంత గొప్పగా ఆడుకున్నవాళ్లే మన కవులంతా!
భుజిక్రియ అంటే ‘కూటిపని’. మనిషి బతుకును నిలిపే మేటిపని కూడా! కానీ, తెలుగులో కూటిపని అంటే తూకానికి చాలదని, సంస్కృతం వాడితే ‘అబ్బో’ అంటారని కవులకు బులుపు (ఆశ) ఎక్కువ! ఈ ‘అబ్బో బులుపు’ తెలుగు కొంప ముంచింది.
పోతనగారు తెలుగు సంస్కృతం కలబోతగా ఎందుకు వ్రాస్తారో ఆ గుట్టు విప్పాడు: “కొందరికి దెనుగు గుణమగు, కొందరికిని సంస్కృతంబు గుణమగు” అంటూ తాను ఇద్దరికీ తనివి కలిగిస్తానని చెప్పుకున్నాడు. ‘బూడిదలో పోసిన పన్నీరు’ అనే తెలుగు నుడికట్టుని ‘భసితక్షిప్తాజ్యము’ అనటానికి పోతనగారు కూడా వెనకాడలేదు.
“ఆంధ్ర మహాభాగవతంలోని చతుర్ధస్కంధము 723 పద్యంలో గల ‘పనించు’ అనే తత్సమ ధాతువునకు అర్ధ మంత సులువుగ నిర్ణయించలేము, ఈ ధాతువులో చివరి అవయవం ‘ఇంచు’ అనేది. ఇందులో సమస్య లేదు. పోతే, పూర్వావయవం స్వరూపంలో ప్రశ్న ఉదయిస్తుంది. దీన్ని పన (పన+ఇంచు) అనుకుంటే సరి పోతుంది. కాని, దీనిక’ర్ధ నిర్ణయం చేయటం ఎలా? ఇలాంటి ధాతువుగాని, తజ్జన్య మైన నామంగాని మనకపరిచితం, సంస్కృతంలో గూడా ఇలాంటి ధాతువుగానీ, తజ్జనుఅమైన కృదంతరూపంగాప్రచారంలో రూఢిగాంచినట్లు తోచదు, తెలుగు కవులైన పోతనాదులు తెలుగు వ్యాకరణ నియమాల్ని ఖాతరు చేయకుండ రచన గావించారంటారు, అంటే, వ్యవహారానికి దగ్గరగా తన రచనలోని భాషను నడిపించాడని సారాంశం. అలాంటి కవి సంస్కృతంతో మారుమూల ఉండే ధాతు వును గ్రహించి తత్సమ ధాతువును నిష్పన్నంచేసి దాన్ని తన రచనలో ప్రయగించటం తెలుగువారికి సంస్కృతే భాషపై గల అభిరుచిని వ్యక్తం చేస్తుందని తలంపగలం,” అని ఆచార్య జాస్తి సూర్యనారాయణ ‘తెలుగు కవుల సంస్కృత ప్రయోగాలు’ పొత్తంలో అన్నారు
“తగ సంస్కృతము తెనుగుగ జేయ దెనుగు సంసత్కృతముగ జేయను జతురమతిని” అని చెప్పుకున్న తెనాలి రామకృష్ణుడు తెలుగుని సంస్కృతంలోకే కాదు సంస్కృతాన్ని తెలుగులోకి కూడా తేగల తన అలవిని కొలవిని గట్టిగా చెప్పుకున్నాడు. సంస్కృతాన్ని తెలుగులోకి తెచ్చినవి తక్కువే అయినా రామకృష్ణకవి సంస్కృతంలోనే ఎక్కువ కొత్తమాటలు కూడగట్టాడు. అప్పటి పొద్దులు అలా గడిచిపోయాయి. ఇప్పటి సంగతేవిటి..?
అచ్చతెలుగు కదలిక
కొరవి గోపరాజు పొన్నెగంటి తెలగన్న లాంటి ‘తెలుగు ఎలమి’ గల కవులు వచ్చాక అచ్చతెలుగు మాటల కదలిక మొదలయ్యింది.
మనం తెలుగువాళ్లమని, మనం వ్రాస్తున్నది తెలుగని, తెలుగు మాటల్లోనే తెలుగు కబ్బాలు ఉండాలని తెలుగు ఎలమి ఉన్నవాళ్లంతా కోరుకోవటం మొదలు పెట్టారు.
పేర్లకు, తెలుగులో లేని మాటలకు మాత్రమే సంస్కృతాన్ని వాడాలని ఒట్టు పెట్టుకోవటం చెప్పుకోదగినది. తెలుగు మాటల్ని సంస్కృతం లోకి మార్చటానికి వెనకాడని కవులు సంస్కృతం మాటల్ని తెలుగులోకి తేవటానికి అచ్చతెలుగు పూనిక అలా మొదలయ్యింది.. ఇదంతా 400 యేళ్లనుండీ మొదలైన తెలుగు కదలిక.
త్రినేత్రుణ్ణి ముక్కంటి అనగలిగారు. సంస్కృత అడియరి తనంలోంచి తెలుగుదనాన్ని నిలబెట్టేందుకు అచ్చతెలుగు కవులు బాగా చెమటోడ్చారు. కావ్యాలంకార చూడామణిలో విన్నకోట పెద్దన ‘సంస్కృతపదాలు దర్భముళ్లు లాగా తెలుగు చదువరులకు నొవ్వ కలిగిస్తున్నాయ’న్నాడు. ఆ పొద్దున అలా చెప్పగలగటానికి కవికి చాలా ఎదలు కావాల్సి ఉంది.
ఇవన్నీ మనకు ఒక మెలకువని కలిగిస్తాయి. కవికి చదువరే వేలుపు. ఆయనకు తనివిని కలిగించాలనేదే నోముగా పెట్టుకుంటే మనం వాడే నుడులు ఎలా ఉండాలో మన ఎదకు తడుతుంది. అలా కాక, ఎవరో కొందరు పెత్తనం చేసేవారి మెప్పుకోసం మనం వ్రాయకూడదు.
కొంచెగాడికి (సామాన్యుడు) బుర్రకెక్కించటానికే వ్రాస్తున్నాననుకునేవాడు సంస్కృతం మీద నిలబడిపోడు.
“దీనిని నీ భుజస్కంథాలపైన వహించు”, “దీనిని నీ తలకెత్తుకో” ఈ రెండు మాటల్లో ఏది కొంచెగాడికి తేలికగా తెలుస్తుందో ఒకసారి ఎదపెట్టి చూడండి. మన పెద్దలు కొత్తకొత్త పోకడలన్నీ తెలుగులో చేసి ఉంటే నుడికే కాదు కవికి కూడా ఎక్కువ నిండుదనం దక్కి ఉండేది.
ఇదంతా తెలుగు వాడకం పెంచండనే మొత్తుకోలే! సంస్కృతం పెద్దమ్మ నుంచి మనం నేర్చుకున్నది తక్కువే! ఎంత సంస్కృతం వస్తే అంత.. ఎంత తెలుగు ఎలమి ఉంటే అంత.. వెనకటి కబ్బాలను ఎంత చదివితే అంత.. అచ్చతెలుగులో వ్రాయగలుగుతాం. ఇప్పటినుండే తెలుగుతో అంటకాగుదాం రండి!
డా. జి. వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, వివిధ సాహిత్య ప్రక్రియలలో సృజనాత్మక, సామాజిక, వైఙ్ఞానిక రచనలు చేసిన సాహితీవేత్త. 130 పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురితం అయ్యాయి. 50 అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న ‘హంస’ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, సద్గురు శివానంద మూర్తి వికారి నామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆర్కాటు ప్రసాదరావు ధర్మనిథి పురస్కారం ఇంకా 50కి పైగా సంస్థల పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 4 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు.
