[2026 సెప్టెంబర్ 14 వినాయక చవితి పర్వదినం సందర్భంగా ‘తెలుగువారు – వినాయకునితో అనుబంధం’ అనే రచనని అందిస్తున్నారు శ్రీమతి చంద్రకళ దీకొండ.]
ఉపోద్ఘాతం
ఘన గణపతి
తెలుగువారు ఏ శుభకార్యం ప్రారంభించినా, ఏ పని తలపెట్టినా మొదటగా పూజించేది గణేశుడినే!
పసుపు, పిండి తదితర ఏ పదార్థమైనా గానీ, ఆతని ఆకారాన్ని పిల్లలు సైతం సులువుగా రూపొందించవచ్చు. హాస్యరసానికి ఆయనకే పెద్దపీట. ఆయన మీద ఎన్నో చతురోక్తులు మన తెలుగు పత్రికలలో చూడవచ్చును.
పూజల్లో అగ్రతాంబూలం అందుకునేది ఆయనే. గంటం పట్టి,వ్యాస మహర్షి చెప్పగా మహాభారతం వ్రాసిన మహాజ్ఞాని.
చేట చెవులు, కురచ కళ్ళు, భారీ శరీరం, తనకన్నా పరిమాణంలో చిన్నదైన మూషిక వాహనం- ఉండ్రాళ్ళు, మోదకాలు, కుడుములతో, పాయసాలతో నిండిన భారీ బొజ్జ – వింతైన ఆయన ఆకారం మానవులకు ఇచ్చే విలువైన మౌన సందేశాలెన్నో! కాంబోడియా, థాయిలాండ్ వంటి వివిధ దేశాల్లోనూ ఆయన భక్తులకు కొదువ లేదు.
తిరు తిరు గణనాథ తద్ధి తత్తయ్ -ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై అంటూ పరీక్షల్లో మార్కులు మంచిగా రావాలని తమ పుస్తకాలను విఘ్నేశ్వర పూజలో ఉంచే విద్యార్థులు, మంచి ఉద్యోగం దొరకాలని నిరుద్యోగులు కోరే సిద్ధి, బుద్ధి తోడుగా విఘ్నాలను పరిహరించే వినాయకుడు.
సంగీతసాధనకు ముందుగా శ్రీ గణనాథ సిందూర వర్ణ – కరుణసాగర కరివదనా/లంబోదర లకుమికరా-అంబాసుత అమరవినుత అంటూ సంగీతశిక్షకుల ప్రార్థనలందుకుంటాడు.
ఇలా ఏ కళకైనా,ఏ పనికైనా తొలి పూజలందుకునేది విఘ్నరాజే!
ఇక ప్రత్యేక పండుగ అయిన వినాయక చవితికి భక్తులు పదకొండు రోజులు చేసే హడావిడి అంతా,ఇంతా కాదు. చందాలు సేకరించడం, చలువ పందిళ్లు వేయడం, విద్యుద్దీపాలంకరణ, విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయడం, రోజుకో నైవేద్యం సమర్పించడం.. రోజూ రాత్రి భజనలు, పాటలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు, చివరి రోజు నిమజ్జన సందడి ప్రతి ఏటా కోలాహలంగా జరుపుతారు.
ఆ చవితి నాడు తప్పక చేయవలసిన ఏకవింశతి పూజ గురించి:-
21 రకముల పత్రితో గణేశుని పూజిస్తారు.
ఇవన్నీ వర్షాకాలంలో వచ్చే వివిధ రుగ్మతలను తొలగించేవి, నీటిని శుభ్రపరచేవి. వాటిని తెంపేటప్పుడు వెలువడే స్రావాలు రక్తశుద్ధిని, నరాల పుష్టిని కలిగిస్తాయి. ఈ ఔషధ వృక్షాల వద్ద వెలువడే ప్రాణవాయువు శ్వాసకోశ వ్యాధులను ఉపశమింపజేస్తుంది.
ఏకవింశతి పత్రముల సంస్కృత నామం, తెలుగులో వ్యావహారిక నామం, ఆంగ్ల భాషలో వ్యవహారనామం మరియు శాస్త్రీయ నామం వరుసగా..
| 1) | మాచీపత్రం | చేమంతి ఆకు | mugwort | Artemesia vulgaris |
| 2) | బృహతీపత్రం | వాకుడాకు | Indian night shade (poison berry) | Solanium xanthocarpum |
| 3) | బిల్వపత్రం | మారేడుదళం | Bengal quince | Aegle marmelos |
| 4) | దూర్వాయుగ్మం | గరిక | Bermuda grass | Cynodon dactylon |
| 5) | దత్తూరపత్రం | ఉమ్మెత్త | Thorn apple leaf | Datura metel |
| 6) | బదరీపత్రం | రేగు | Chinese date(red date) | Zizyphus jujuba |
| 7) | అపామార్గ పత్రం | ఉత్తరేణి | Prickly chaff leaf | Achyranthus aspera |
| 8) | తులసీ పత్రం | తులసి | Holy Basil leaf | Ocimum sanctum |
| 9) | చూతపత్రం | మామిడాకు | Mango leaf | Mangifera indica |
| 10) | కరవీరపత్రం | గన్నేరు | Oleander leaf | Nerium odorium |
| 11) | విష్ణుక్రాంత పత్రం | విష్ణుక్రాంత | Slender dwarf morning glory | Evolvulus arvensis |
| 12) | దాడిమీ పత్రం | దానిమ్మ | Pomegranate | Punica granatum |
| 13) | దేవదారు పత్రం | దేవదారు | Deodar cedar | Eeythroxylum monogynum |
| 14) | మరువక పత్రం | మరువం | Marjoram leaf | Marjorana hortensis |
| 15) | సింధువార పత్రం | వావిలి | chaste leaf | Vitex negundo |
| 16) | జాజీ పత్రం | జాజి | Jasmine leaf | Jasminum auriculatum |
| 17) | గండకీ పత్రం | దేవకాంచనం | Camel’s foot | Bauhimia variegata |
| 18) | శమీపత్రం | జమ్మి | Indian mesquite leaf | Prosopis cineraria |
| 19) | అశ్వత్థ పత్రం | రావి | Sacred fig leaf | Ficus religiosa |
| 20) | అర్జున పత్రం | తెల్ల మద్ది | White marudah | Terminalia arjuna |
| 21) | అర్కపత్రం | జిల్లేడు | Sodom apple | Calotropis procera |
ఇక ఆ రోజు చేసే తెలంగాణ ప్రాంతానికి మాత్రమే ప్రత్యేకమైన వంటకం- తుమ్మి కూర గురించి..
తుమ్మి ఆకు శాస్త్రీయ నామం Leucas aspera
కామెర్లు, జలుబు, శారీరక నొప్పులు, ఉబ్బసం, అజీర్ణం, పక్షవాతం వంటి రుగ్మతలను తొలగించే ఔషధ గుణాలు కలది ఈ ఆకు. కడుపులో పురుగులను సంహరిస్తుంది.
చింతకాయ (చిన్న చింత లేదా ఓనగాయ), పచ్చిమిరపతో కలిపి, పెసరపప్పును జోడించి చేసే ఈ ప్రత్యేక వంటకం బలవర్థకం మరియు ఆరోగ్యదాయకం కూడా!
తెలుగు రాష్ట్రాలలో వినాయకుని ప్రసిద్ధ దేవాలయాలు
కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం
ఈ దేవాలయం తిరుపతినుండి దాదాపు 75 కిలోమీటర్ల దూరంలో ఉంది.
పురాతన, చరిత్రాత్మకమైన ఈ దేవాలయం అంతర్గత డిజైన్లకు ప్రసిద్ధి. వినాయకుని నుదుటిపై తెలుపు, పసుపు, ఎరుపు.. మూడు రంగులు తీర్చిదిద్దబడి ఉంటాయి. 11వ శతాబ్దంలో చోళరాజు నిర్మించారు దీనిని. ప్రజల మధ్య వివాదాల పరిష్కరణకు, పాపాలు తొలగించుటకు ఈ వినాయకుని ప్రజలు ప్రార్థిస్తారు. పవిత్ర జలస్నానం చేస్తారు.
నదీనాథ్ గణపతి
ఇరవై నాలుగు గంటలూ దర్శన సౌలభ్యం కల ఈ దేవాలయం జుమ్మేరాత్ బజార్, అఫ్జల్ గంజ్, హైదరాబాద్ లో ఉంది. 400 సంవత్సరాల పురాతన, ఆధ్యాత్మిక, శక్తివంత ప్రదేశంలో ఉన్న దేవాలయం. నది పక్కనే ఉండడం వల్ల నదీనాథ్ అనే పేరు వచ్చింది. స్వయంభూ దేవాలయం. 16 బుధవారాలు ప్రదక్షిణలు చేస్తే, కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మిక.
ఖైరతాబాద్ గణేశుడు
భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి పొందిన భారీ గణేశుని విగ్రహం హైదరాబాద్ లోని ఈ ప్రాంత ప్రత్యేకత. 1954 లో స్వాతంత్ర్య సమరయోధుడు శ్యామసుందర్ మార్గదర్శకత్వంలో ప్రారంభమై, దశాబ్దాలుగా పరిమాణం మరియు ప్రజాదరణతో గణనీయంగా పెరిగింది. ప్రజల సమిష్టి భక్తిని సూచిస్తుంది. దాదాపు 61 అడుగుల వరకు ఎత్తుండే (ప్రతి ఏటా ఎత్తు పెరుగుతూ ఉంటుంది) వినాయక విగ్రహం వందలాది నైపుణ్యం కలిగిన కళాకారులచే రూపుదిద్దుకుంటుంది. ఈ ఏడాది పర్యావరణ అనుకూలమైన బంకమట్టి, వెదురు మరియు ఉక్కుతో రూపొందించబడిన విశ్వశాంతి మహాశక్తి గణపతి విగ్రహాన్ని వేలాదిమంది భక్తులు దర్శించుకున్నారు. 2016వ సంవత్సరంలో 29,465 కేజీల లడ్డూ ప్రసాదం గిన్నిస్ బుక్‌లో నమోదు చేయబడింది.
బాలాపూర్ గణేశుడు
ఇక్కడి లడ్డూ వేలం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఏడాది 21 కేజీల బరువున్న లడ్డూ, 2 అడుగుల పొడవు, చిన్న కిరీటంతో ఉండి, 35 లక్షలతో వేలంపాట ముగిసింది. 18 అడుగుల విగ్రహం 7 గంటల సుదీర్ఘ ఊరేగింపు అనంతరం నిమజ్జనం చేయబడింది.
సికింద్రాబాద్ శ్రీ గణేశుడు
1824వ సంవత్సరంలో మద్రాసు రెజిమెంట్ సైనికులచే నిర్మించబడిన అతి పురాతన ఆలయమిది. మనోకామ్యార్థ సిద్ధికై భక్తులు ఎర్రని వస్త్రంలో చుట్టబడిన కొబ్బరికాయలను ముడుపులుగా సమర్పించుకుంటారు.
గడ్డ గణేష్ సిద్ధి వినాయకుడు
జహీరాబాద్ నుండి పటాన్‌చెరువుకు వెళ్ళే దారిలో రుద్రారం వద్ద ఈ ఆలయం ఉంది. 11 వారాలపాటు 108 ప్రదక్షిణలు చేస్తే, సంకటాలు, గండాలు తొలగి, కోరిన కోర్కెలు ఈడేరుతాయని భక్తుల విశ్వాసం. బీజాక్షర శక్తిని దాచే సిందూర వర్ణంలో దర్శనమిచ్చే గణపతి ఈ ఆలయ ప్రత్యేకత. అంతేకాక, ప్రతి సంకష్టహర చతుర్దశికి విగ్రహం ఎత్తు పెరిగి, పాదాలు మరియు భుజాల వద్ద తేడా తెలుస్తుందట. అక్కడ నల్లని రంగు కనిపిస్తుందట. రెండు అడుగులు ఉన్న ఈ విగ్రహం ఇప్పుడు నాలుగు అడుగులు పెరిగిందని ఇక్కడి పూజారి వివరిస్తారు.
సాక్షి గణపతి
కూర్చుని వ్రాసే భంగిమలో వినాయకుడు దర్శనమిచ్చే ఈ దేవాలయం శ్రీశైలంలో ఉంది.
మల్లికార్జున స్వామి, భ్రమరాంబికలను దర్శించుకునే ముందుగా ఈ సాక్షి గణపతిని దర్శించుకుంటే, తమ రాకకు సాక్ష్యమిస్తాడని భక్తుల విశ్వాసం.
తెలుగు సాహిత్యంలో వినాయకుడు
అధర్వణ వేదం, ఉపనిషత్తుల నుండి కవుల పద్యాలదాకా గణపతిని స్తుతించిన వారెందరో!
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్స్వర్వవిఘ్నోపశాంతయే
ఈ శ్లోకాన్ని రెండేళ్ల బుడతలు సైతం తెలుగు దేశాల్లో వల్లెవేస్తారు. అలాగే వాతాపి గణపతిం భజే కీర్తన వినని తెలుగువారుండరు.
శ్రీ గణపతి మహామంత్రము
ఓం గం గం గం గణపతయే నమః
కవులు తమ రచనలలో, ముఖ్యంగా పద్యాలలో విఘ్నాలను తొలగించే, జ్ఞానప్రదాత అయిన గణపతిని స్తుతించడం, స్మరించడం, ఆశీస్సులు కోరడం – రచనలు విజయవంతం కావాలని, ఎలాంటి అడ్డంకులు లేకుండా కావ్యరచన సాగాలని ప్రార్థించడం పరిపాటి.
ఒక గంటలో 34 శ్లోకాల పాండవ ధార్త్రరాష్ట్ర సంభవ ఖండికను, 18 శ్లోకాలలో భారత కథాసారాన్ని వివరించిన బహుగ్రంథ కర్త, పండితుల పరీక్షలో ఆశువుగా సమాధానాలను ఇచ్చిన కావ్యకంఠ గణపతి ముని; జంటకవులుగా పేరొందిన తిరుపతి వేంకట కవులు తమ రచనలలో గణేశుని స్తుతించారు, నుతించారు.
ఉదాహరణకు:-
మూషిక వాహన మోదక హస్తా
చామరకర్ణ విలంబిత సూత్రం, వామనరూప
మహేశ్వర పుత్ర, విఘ్న-వినాయక పాద నమస్తే
వంటి శ్లోకాలు, పద్యాల ద్వారా వినాయకునిపై తమ భక్తిని, అభీష్టాన్ని వ్యక్తపరిచారు.
తొండము నేకదంతమును-తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్లనొజ్జయై
యుండెడి పార్వతీతనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్
అనుచు వినాయక వ్రత కల్పమును వినాయక చవితి రోజున ప్రతి ఏడూ, ప్రతి తెలుగువారు పఠిస్తారు.
అలాగే కావ్యాలలో కందపద్యాలు
తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటీనందన నీకు
మ్రొక్కెదన్
ఫలితము సేయవయ్య నిను ప్రార్థన జేసెదనేకదంత
నా
వలపటి చేతి ఘంటమున వాక్కుననెపుడు
బాయకుండుమీ
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప
లోకనాయకా!
అటుకులు కొబ్బరి పలుకులు
చిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్
నిటలాక్షు నగ్రనుతునకు
బటుతరముగ విందు చేసి ప్రార్థింతు మదిన్
తలచెదనే గణనాథుని
తలచెదనే విఘ్నపతిని దలచినపనిగా
దలచెదనే హేరంభుని
దలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్
మనం గమనించవచ్చు.
పోతన వ్రాసిన పద్యం
ఆదరమొప్ప మ్రొక్కిడుదు
నద్రిసుతా హృదయానురాగ సం
సాదికి దోషాభేదికి బ్రసన్న వినోదికి
విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి
సశేష జగజ్జననందవేదికిన్
మోదక ఖాదికిన్ సమద
మూషిక సాదికి సుప్రసాదికిన్
కవయిత్రి మొల్ల పద్యం
చంద్రఖండ కలాపుజారు వామనరూపు
గలిత చంచలకర్లు గమలవర్లు
మోదకోజ్వలబాహు మూషికోత్తమవాహు
భద్రేభవదను సద్భక్తసదను
సన్ముని స్తుతిపాత్రు శైలరాడ్దౌహిత్రు
సమదినామోదు విద్యాప్రసాదు
బరశువరాభ్యాసు బాశాంకుశోల్లాసు
సురుతరఖ్యాతు నాగోపవీతు
లోకవందిత గుణవంతు నేకదంతు
నతుల హితంబు సత్కారుణావలంబు
విమల రవికోటితేజ శ్రీవిఘ్నరాజ
బ్రధిత వాక్ప్రౌఢియై యెప్డు ప్రస్తుతింతు
కరుణశ్రీ జంధ్యాల పాపయ్య గారి అచ్చతెనుగు పదములు కూర్చిన పద్యం
ఎలుక గుర్రము మీద నీరేడు భవనాలు
పరుగెత్తి వచ్చిన పందెకాడు
ముల్లోకముల నేలు ముక్కంటి యింటిలో
పెత్తనమ్ము నరించు పెద్దకొడుకు
‘నల్లమామా’ యంచు నారాయణుని పరి
యాచకాలాడు మేనల్లుకుఱ్ఱ
వడకు గుబ్బలి రాచకారి బిడ్డ భవాని
నూటేoడ్లు నోచిన నోముపంట
అమరులందగ్రతాంబూలమందు మేటి
ఆఱుమోముల జగజెట్టి అన్నగారు
విఘ్నదేవుడు వాహ్యాళి వెడలివచ్చె ఆంధ్ర విద్యార్థి!
లెమ్ము జోహారులిడగ!
ఉపసంహారం
ఈ విధంగా తెలుగువారికి వినాయకునితో గల అనుబంధానికి గల దృష్టాంతాలెన్నో!
వినాయక మంగళాచరణము
ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండు పంపు
కమ్మని నేయియు కడు ముద్దపప్పును బొజ్జవిరగగదినుచు
పొరలుకొనుచు-జయమంగళం నిత్య శుభమంగళం/
ఏకాదంతమును ఎల్లగజ వందనంబు బాగైన తొండంబు కడుపుగలుగు
తోడైన మూషికము సొరదినెక్కాడుచు భవ్యముగ
దేవ గణపతికినిపుడు-జయమంగళం-
నిత్యశుభమంగళం/
చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు తామర తంగేడు తరచుగాను
పుష్పజాతూ దెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధీ గణపతికి
బాగుగాను-జయమంగళం-నిత్య శుభమంగళం/
ఓం గణాధిపయ నమః
మీకు ప్రణామములు/నమో నమో నమో నమః
చంద్రకళ దీకొండ గారు విశ్రాంత ఉపాధ్యాయిని. రచనా వ్యాసంగం వారి ప్రవృత్తి. కవితలు, వ్యాసాలు, గేయాలు పేరడీ వంటి ప్రక్రియల్లో ముందుకు సాగుతున్నారు. వీరి కవితలు పలు ప్రింట్, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురితమయ్యాయి. పలు రేడియో ఎఫ్.ఎమ్. ఛానెల్స్‌లో ప్రసారమయ్యాయి. సున్నిత చంద్రికలు అనే లఘు కవితాసంపుటి, సాహితీచంద్రికలు అనే శత వచనకవితా సంపుటి, కవితా చంద్రికలు అనే వచనకవితల సంపుటి వెలువరించారు. నవభారత్ నిర్మాణ సంఘం వారి సాహితీరత్న పురస్కారం, తపస్వీ మనోహరం వారి రైటర్ ఆఫ్ ది ఇయర్ 2021-2022 పురస్కారం, విశ్వ సాహితీ కళావేదిక వారి కీర్తి పురస్కారం పొందారు. పలు కవిసమ్మేళనాలలో పాల్గొన్నారు. తమ కవితలకు అనేక బహుమతులు పొందారు.
