[భట్టు వెంకటరావు గారు రచించిన ‘తెరమరుగైన మన సామెతలు – నానుడులు’ అనే రచనని అందిస్తున్నాము]
నానుడులు, సామెతలు భాషకు అలంకారముల వంటివి. ప్రసంగాలలో, సంభాషణలలో విషయాన్ని సందర్భానికి సరిపోయే నానుడులతోను, సామెతలతోను అలంకరించి ప్రసంగిస్తే, సంభాషిస్తే ఆ ప్రసంగము, సంభాషణ అందగిస్తాయనడంలో సందేహించాల్సింది లేదు.
కాలగమనంలో చోటు చేసుకున్న మార్పులకు లోనై, భాషలో వచ్చిన మార్పులకు అనుగుణంగా పూర్వం కావ్యాలలో కవుల ప్రయోగాలలో కనిపించిన మన నానుడులు, సామెతలు కొన్ని ఇప్పుడు ప్రయోగంలో లేవు. కొన్నిటికి పూర్వ రూపాలలో బేధం కనిపిస్తుంది. అటువంటి కొన్ని నానుడులకు, సామెతలకు సంబంధించిన చిన్న వ్యాసం ఇది. భిన్న కావ్యాలలోంచి గ్రహించి సందర్భానికి సంబంధించి సంక్షిప్త వివరణతో ఈ చిన్న వ్యాసంలో ఇవ్వబడినాయి.
ఆపదలు వైరమణచునుగాదే!
గోపాలుని సింగయ రచించిన ‘కిరాతార్జునీయము’ కావ్యం, చతుర్థాశ్వాసంలోనిది క్రింది పద్యం.
కం.
మెకములు పక్షులు భయపడి
ప్రకటంబుగ నొక్కత్రోవ బఱచెను వైరం
బొకటైనను మదిఁదలఁపక
యకటా యాపదలు వైరమణఁచునెకాదే!
అర్జునుడిని పరీక్షించేందుకు శంకరుడు బోయదొరవేషంలో వచ్చాడు అడవికి. ప్రమథగణాలు బోయసైన్యంగా మారి అడవిలో అట్టహాసంగా పలు ఉపకరణాలు, వాయిద్యాలతో పెద్దగా శబ్దం చేస్తూ తిరగసాగాయి. ఆ శబ్దానికి అడవిలోని మృగములు, పక్షులు భీతి చెంది పరుగెట్టసాగాయి. భయం వాటిని పూర్తిగా ఆవహించడంతో అవి పెట్టే పరుగు ఎలాగుందంటే వాటిలో వాటికి సహజంగా ఉండే వైరం తాత్కాలికంగా మరిచిపోయి ‘ప్రాణంతో ఉంటే చాలురా దేవుడా!’ అని దొరికిన దారిని పట్టి, ఒకదానిని అనుసరించి వేరొకటి, అన్నీ ఒకే దారిలో పడి భయంతో పరుగెడుతూన్నాయట!
ఆ సందర్భంగా వ్యాఖ్యగా చివరి పాదంలో చేర్చబడిన తెలుగు సామెత ‘ఆపదలు వైరమణచునె కాదే!’ అన్నది. ‘సమిష్టిగా వచ్చిన ఆపద తమలో తమకుండే వైరాన్ని తాత్కాలికంగానైనా మరిచిపోయేట్లు చేస్తుంది కదా!’ అని ఆ సామెతకు అర్థంగా చెప్పుకోవచ్చు.
కాకి మెడకు దొండపండు!
కూచిమంచి తిమ్మకవి రచించిన ‘రుక్మిణీ పరిణయము’ ప్రథమాశ్వాసం లోనిది క్రింది పద్యం.
కం.
మీ కిష్టంబని వరచా
మీకరనిభగాత్రి నెట్లు మీఁదెఱుగక నే
డా కఱిగొల్ల కొసగుదురు
కాకి మెడం దొండపండు గట్టిన భంగిన్.
పద్యంలో ఛందస్సు అవసరాలకు అనుగుణంగా తెలుగు మాటలను, జనసామాన్యంలో ప్రసిద్ధమైయున్న నానుడులను, కావలసిన విధంగా మార్చి కొత్త రూపాలలో ప్రయోగించచడం అన్నది సంప్రదాయ పద్యసాహిత్యంలో ఎప్పటినుంచో ఉంది. రుక్మిణిని కృష్ణునకు ఇచ్చి వివాహం చేయనిచ్చగించని రుక్మి మాటలు పై పద్యంలో సందర్భం. ‘కాకి ముక్కుకు దొండపండు’ అని జనసామాన్యం సంభాషణలలో దొర్లే నానుడి. నాలుగవ పాదంలో కందపద్యం ఛందస్సుకు కుదరని కారణంగా, దొండపండును కాకి మెడలో వేశాడు మూర్తికవి. చామీకరము అంటే బంగారం. ‘బంగారుమేని ఛాయతో మెరిసే శరీరం కలిగినటువంటిదైన రుక్మిణిని, నల్లనివాడైన కృష్ణునికి ఎలా కట్టబెట్టము? కాకి ముక్కుకు దొండపండు చందం కాదా అది?’ అని భావం.
చింతామణి విడిచి గవ్వఁ జేకొను భంగిన్!
కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన అనంతరం ధర్మరాజును అశ్వమేధయాగం చేయమని సలహా ఇచ్చాడు వ్యాసమహాముని. యౌవనాశ్వుడి దగ్గర ఉన్న అశ్వం యాగం కోసం ఉత్తమమైనదిగా వ్యాసులవారు చెప్పగా దానిని తేవడానికి భీముడు సిద్ధమయ్యాడు. భీముడికి తోడుగా కర్ణుడి కొడుకైన వృషకేతుడు వెళతానన్నాడు. ఆ సందర్భంలో, దుర్యోధనుడిని ఆశ్రయించి జీవితం సాగించిన కర్ణుడి ప్రస్తావన వచ్చింది. ఆ సంభాషణలో వృషకేతుడు తన తండ్రి చేసిన అవివేకపు పనికి బాధపడుతూ అన్న మాటలు క్రింది పద్యం. పిల్లలమఱ్ఱి పినవీరన రచించిన జైమిని భారతము, అశ్వమేధపర్వం, ప్రథమాశ్వాసం లోనిది.
కం.
అంతరము దప్పి లక్ష్మీ
కాంతునిఁ గృష్ణునిఁ భజింపక దయారహిత
స్వాంతు సుయోధనుఁ గొలిచె
జింతామణి విడిచి గవ్వఁ జేకొను భంగిన్.
‘మంచి చెడుల మధ్య అంతరం గ్రహించకుండా, లక్ష్మీవల్లభుడితో సమానుడైన శ్రీకృష్ణుడిని పూజించి ఆయన మాటలను వినకుండా – కోరిన కోరికలను తీర్చగలిగే చింతామణిని వదిలిపెట్టి దేనికీ పనికిరాని గవ్వను చేతిలోకి తీసుకున్న చందంగా – పాండవులను వదిలి దుర్మార్గుడైన సుయోధనుడిని సేవిస్తూ కాలం గడిపాడు మా తండ్రి’ అని తన తండ్రియైన కర్ణుడు చేసిన అవివేకపు పనిని ఒక అర్థవంతమైన పోలికతో పోల్చి చెప్పాడు వృషకేతుడు.
పూతకడియం
పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడి రచనయైన ‘శృంగారశాకుంతలము’, ద్వితీయాశ్వాసంలోని పద్యం ఈ క్రిందిది.
కం.
కానీ సంశయమెల్లను
మానీ బరిపాటి వీరిమాటలవలనన్
లోనున్నరాగి వెలుపలఁ
గానంగావచ్చు పూఁతకడియము భంగిన్.
కణ్వాశ్రమంలో కనపడిన శకుంతల మునికన్య అని నమ్మేందుకు ఇచ్చగించని దుష్యంతుడు, ఆమెను చూడగానే తన హృదయం మోహంతో నిండిపోయిందంటే ఆమె తప్పనిసరిగా రాజకన్య అయివుండాలని నిశ్చయించుకుని, ‘నిజమేదో వారితో సంభాషణలో బయటపడుతుందిలే!’ అని మనసులో అనుకుంటున్న సందర్భంలోనిది పై పద్యం. ఈ సందర్భంలో ఒక మంచి నానుడిని ఉపయోగించి చేతికున్నది నిజంగానే బంగారు కడియమైతే బంగారంగానే కనపడుతుంది, అలా కాకుండా పూతకడియం అయితే గనుక కాస్త గోకి చూస్తే లోపలున్న రాగి వెలుపలికి కనిపిస్తుంది; నిజం బయటపడిపోతుంది అనే నిత్య సత్యాన్ని ఆధారంగా చేసుకుని, శకుంతలను ఆమెకు తోడుగా ఉన్న చెలికత్తెలను పలకరించి వారిని కాసేపు మాటలలో పెడితే తనకు కావలసిన సమాచారం బయటపడే అవకాశం ఉంటుందని దుష్యంతుడు తలపోయడాన్ని పద్యంలోని చివరి రెండు పాదాలలో సహజ సుందరంగా చెప్పాడు పినవీరభద్రుడు.
బాలురు పుట్టుభోగులు!
తరిగొప్పుల మల్లనమంత్రి రచించిన ‘చంద్రభాను చరిత్రము’ తృతీయాశ్వాసం లోని పద్యం ఇది. ,
ఉ.
బాలురు పుట్టుభోగులు నృపాలతనూభవు లెండకాఁకచేఁ
దూలినవారు నిద్రతమిఁ దోఁగెడువా రొకతప్పు సేసినం
దాళక యేల కావరమున న్శపియించితి వోయి యిట్టినీ
కేల మునిత్వ మేల జప మేల జటాభర మేల నేమముల్.
‘నృపాలతనూభవులు’ అన్నది సందర్భానికి సరిపోవాలన్న తలంపుతోనే తప్ప, రాజుకి పుట్టినవారైనా, రైతుకు పుట్టినవారైనా, కూటికి కటకటలాడే పేదకు పుట్టినవారైనా బాలురు బాలురే! వాళ్ళకున్న హక్కులు వాళ్ళవాళ్ళ ఆర్ధిక స్థితిని బట్టి కాక, అందరి విషయంలోనూ సమానమైనవేనని చెప్పడమే ఇందులో ఉద్దేశం.
ఒక సందర్భంలో అర్ధంపర్ధంలేని కోపానికి పేరుమోసినవాడైన దుర్వాసుడు విచక్షణను కోల్పోయి పిల్లలని కూడా చూడకుండా శపిస్తాడు. అది తెలుసుకున్న వ్యాసుడు ఆ పనిని గర్హిస్తూ అన్న మాటలు పై పద్యం. ‘ఇలా విచక్షణను పోగొట్టుకునే నీకు జపతపాలు, జటాభర నియమాలు ఎందుకు?’ అంటాడు.
పుట్టుకతో పిల్లలకు అబ్బే భోగం అందరికీ సమానమైనదే. ఆ అర్ధంలో చెప్పిన మాటే ‘బాలురు పుట్టుభోగులు’ అనే మాట. అందులో వారు వీరని తేడాలేమీ ఉండవు.
పాలొల్లని పిల్లి కలదే పరికింపంగన్?
తెలుగులోని రాజ కవులలో ఒకరైన గట్టు ప్రభువు రచించిన ‘కచేలోపాఖ్యానము’, తృతీయాశ్వాసములోని పద్యం ఇది.
కం.
ఈ లోకంబున రాజ్యము
లేలన్ గల్గినను జాలు నెంత విరక్తుం
డేల విసర్జనసేయును
బాలొల్లని పిల్లి గలదె పరికింపంగన్.
ఎన్నెన్నో అర్ధవంతమైన సామెతలకు నెలవైవుంది తెలుగు భాష. లోకానుభవంలో గ్రహించిన కాలాతీత సత్యం సామెతై చిరకాలం నిలిచిపోతుంది. పై పద్యం చివరి పాదంలోని సామెత ఇందుకో ఉదాహరణ. ‘పాలను ఎదురుగా పెడితే తాగని పిల్లి ఎలాగైతే లోకంలో చూడమో, అలాగే రాజ్యాధికారం చేతికి చిక్కితే కాదనుకునే విరక్తుడిని కూడా అలాగే చూడం’ అని చెప్పడం ఇందులో విషయం.
బెండులు మునిగి గుండులు తేలాయి
నాచన సోమనాథుడు రచించిన ఉత్తరహరివంశం కావ్యంలోని పంచమాశ్వాసంలోని పద్యం ఈ క్రింది పద్యం.
కం.
మనుజాంగనలం బట్టుట
దనుజులకుం జెల్లుఁ గాక దనుజాంగనలన్
మనుజులు పట్టుటకును దొరఁ
గొనిరే బెండులు మునింగి గుండులు దేలెన్.
కాలంతోపాటు కనపడకుండా, విననడకుండా పోయిన సామెతలు మనకు చాలానే వున్నాయి. ఈ పద్యంలోని చివరి పాదంలో ‘బెండులు మునిగి గుండులు తేలాయి’ అనే సామెత అలాంటిదే. ఇప్పుడు ఎక్కడా వినపడదు. బాణాసురుని కూతురు ఉషకు మనుజపతియైన అనిరుద్ధునికి మధ్య వలపులోని విచిత్రాన్ని తలపోస్తూ చెప్పినది ఈ సామెత. విపరీతాలు జరుగుతూండడాన్ని ఆశ్చర్యంగా చెప్పడం ఇందులో చూస్తాం. సాధారణంగా ఒక అసురుడు సుందరాంగియైన మానవ కన్యను మోహించి పట్టుకోవడం కథలలో వింటాం. కాని అందుకు విరుద్ధంగా అసుర కన్యను మానవుడైన అనిరుద్ధుడు మోహించడంతో, ఇలా కూడా జరగడం మొదలైంది కదా! అని ఆశ్చర్యం ప్రకటింపబడే సందర్భం ఇందులోది. అది అసహజమైనదైనా జరుగుతున్నది కదా! అని చెప్పే క్రమంలో ‘బెండులు నీటిలో మునుగుతున్నాయి, దానికి విరుద్ధంగా ఇనుప గుండులు నీటిలో తేలడం మొదలెట్టాయి, కాల వైపరీత్యం కాక మరేమిటి?!’ అని వ్యాఖ్యగా చెప్పడం ఇందులో ఉద్దేశం.
మిత్రుడవస్యపు చుట్టము
ఎఱ్ఱయకవి రచించిన ‘సకలనీతికథానిదానము’ చతుర్ధాశ్వాసములోని పద్యం ఇది.
కం.
మిత్రుడవస్యపుఁ జుట్టము
మిత్రునిఁ బోషించు కంటె మేలునుఁ గలదే
మిత్రులఁ బాయుట మిక్కిలి
ధాత్రిం బాతకము గాఁగదలపుదు రార్యుల్.
బంధువు కంటే కూడా తప్పనిసరిగా ఉండాల్సిన బంధువు వంటివాడు స్నేహితుడు. కష్టాలలో స్నేహితుడికి సహాయం చేయడాన్ని మించిన ఉత్తమ కార్యం మరొకటి ఉండబోదు. అలాగే నిజమైన స్నహితుడిని వదిలేసుకోవడాన్ని మించిన పాపకర్యం కూడా మరోటి ఉండబోదని విజ్ఞులు భావిస్తారు.
ప్రస్తుతానికి ఇవి కొన్ని. మరొకసారి మరికొన్ని సామెతల, నానుడుల సంగతులను మరో వ్యాసంలో వివరిస్తాను.
A retired employee. Interested in Telugu literature.
