Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

స్త్రీల పక్షాన డాలి పార్టన్ సంధించిన ఆయుధం ‘ది బార్గెయిన్ స్టోర్’ పాట

[డాలి పార్టన్ రచించి, పాడిన ‘ది బార్గెయిన్ స్టోర్’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

డాలి పార్టన్ రాసిన పదిహేనవ సోలో స్టూడియో ఆల్బమ్ ‘ది బార్గెయిన్ స్టోర్’. దీనిని ఫిబ్రవరి 17, 1975న RCA విక్టర్ విడుదల చేశారు. ఈ పాట అప్పట్లో సంచలనం సృష్టించింది. కొన్ని రేడియో స్టేషన్లలో ఈ పాటలోని కొన్ని వాక్యాలు అభ్యంతరకరంగా ఉన్నాయని బాన్ చేశారు. ప్రేమ, వివాహం పేరుతో జీవితంలో దెబ్బతిన్న ఓ స్త్రీని వాడిన వస్తువులను విక్రయించే డిస్కౌంట్ స్టోర్‌తో పోలుస్తూ అందులోనూ పనికివచ్చే, సంతృప్తిపరిచే వస్తువులు ఉంటాయని అవి అర్హత ఉన్నవారి వద్దకు చేరుకోవాలని కోరుకుంటాయని పాట రూపంలో డాలి ప్రస్తావిస్తారు. కొందరికి ఇది నచ్చలేదు. స్త్రీ శరీరాన్ని వస్తువుతో పోల్చినట్లు, ఉపయోగించబడిన సెకెండ్ హాండ్ వస్తువుగా ఓ బంధం నుండి బైట పడిన స్త్రీని ఉదహరించినట్లు అనిపించి ఈ పాటను బాన్ చేశారు. అయినా ఈ పాట ఏప్రిల్ 1975లో US కంట్రీ సింగిల్స్ చార్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచింది.

తాను ప్రేమ గురించి అసభ్యకరంగా ఎప్పుడూ ఆలోచించలేదని, విరిగిన హృదయానికి కూడా తిరిగి ప్రేమను పొందే హక్కు ఉందనే ఉద్దేశంతో తానా వాక్యాలు రాసానని డాలి తర్వాత పేర్కొన్నారు. మహిళలు తమ లైంగికత, జీవిత అనుభవాలను నిర్భయంగా చర్చించడానికి తమ చుట్టూ ఉన్న సామాజిక అడ్డంకులను ఛేదించడానికి పార్టన్ రాసి, గానం చేసిన ఈ గీతం ఓ ప్రమాణంగా కంట్రీ మ్యూజిక్‌లో నిలిచిపోయింది.

My life is likened to a bargain store
And I may have just what you’re looking for
If you don’t mind the fact that all the merchandise is used
With a little mendin’ it could be as good as new

(నా జీవితం ఓ చౌకబేరాల దుకాణంగా మారిపోయింది. అయినా నువ్వు వెతుకుతున్నది నాలో దొరకవచ్చు. ఇవి వాడబడ్డవన్న వస్తువులన్న విషయంపై నీకు పట్టింపు లేకపోతే, వీటిని సరిచేస్తే ఇవి కొత్తగా మారగలవు)

ఈ పాటలో ఒక అంతులేని విషాదం అంతర్లీనంగా ధ్వనిస్తుంది. సాధారణంగా ఓ బంధం నుండి స్త్రీ విడిపోయిన తరువాత ఆమెను సమాజం వాడుకోబడిన స్త్రీగానే చూస్తుంది. ప్రపంచంలో అన్ని చోట్ల స్త్రీ పరిస్థితి ఇదే. పురుషుడిని మాత్రం ఈ విధంగా సమాజం పరిగణించదు. స్త్రీ శారీరిక సంబంధాలు, బంధాల చుట్టూనే నైతికత అనే చర్చ సాగుతుంది. ఒక పురుషుడి నుండి విడిపోయిన స్త్రీని స్వీకరించడానికి ముందుకు వచ్చే ఏ పురుషుడు అయినా ఆమెను వాడివేయబడిన వస్తువుగానే చూస్తాడు. ఇక్కడ ఈ స్త్రీ ఓ బంధం నుండి బైటపడింది. మళ్లీ జీవితాన్ని మొదలుపెట్టాలని, ప్రేమను అందుకోవాలని, తిరిగి ప్రేమించాలని కోరుకుంటుంది. కాని సమాజం తనను ఎలా చూస్తుందో ఆమెకు తెలుసు. అందుకే ఇప్పుడు నా జీవితం చౌకబేరాల దుకాణంగా మారిపోయింది అని ఆమె ప్రకటించుకుంటుంది. అయినా తనకీ ఓ విలువ ఉందని. కాస్త బాగు చేసుకోవడం అవసరమని తన మనఃస్థితిని వివరిస్తుంది. ఈ చరణం సమాజంలో స్త్రీ స్థానాన్ని ప్రకటిస్తుంది.

అమెరికాలో ఇతరులు వాడిన వస్తువులన్నీ మళ్లీ తక్కువ ధరలకు ఈ బార్గెయిన్ స్టోర్స్‌లో అందుబాటులో ఉంటాయి. చాలా సందర్భాలలో ఉపయోగపడే వస్తువులు అతి తక్కువ ధరలకు ఈ దుకాణాలలో దొరుకుతాయి. ఓ బంధం నుండి విడిపోయిన స్త్రీ జీవితం చౌక ధరల దుకాణమే అని సమాజం ముద్ర వేసినా దాన్ని అంగీకరిస్తూనే ఆమె మరో మగవాడితో నేను చౌకధరల దుకాణాన్నే కావచ్చు కాని నీకు కావలసింది నాలో నీకు లభించవచ్చు. నేను వాడుకోబడిన వస్తువునే అయినా కాస్త బాగు చేసుకుంటే కొత్తదానిగా మారిపోగలను అంటూ తనకూ జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టే అవకాశం ఉందని, ఉండాలని కోరుకుంటుంది.

ఈ సమాజంలో స్త్రీ జీవితం, అస్తిత్వాన్ని ఎంతో విషాదంగా గుర్తుకు తీసుకువస్తాయి ఈ వాక్యాలు. ఒక బంధం నుండి విడిపోయినంత మాత్రాన స్త్రీకి మరో సారి జీవితాన్ని కొత్తగా మొదలెట్టే అర్హత ఉండదా? ఆమె గాయాలకు కాస్త లేపనం పూస్తే ఆమె మళ్లీ మామూలు స్త్రీ కాలేదా? ఆమె మరో పురుషుడిని ప్రేమించలేదా? ఆ అర్హత ఆమెకు ఎందుకుండకూడదు అని ఎంతో విషాదంగా ఈ వాక్యాల నడుమ ఓ ప్రశ్న వినిపిస్తుంది.

Why you take for instance this old broken heart
If you will just replace the missing part
You would be surprised to find how good it really is
Take it and you never will be sorry that you did

(నా పాత పగిలిన హృదయాన్నే తీసుకో. ఇందులో పోయిన భాగాన్ని సరిచేస్తే అది ఎంత బాగా మళ్లీ పని చేస్తుందో చూస్తే నువ్వే ఆశ్చర్యపోతావు. దీన్ని తీసుకున్నందుకు నువ్వు బాధపడే సందర్భం ఎప్పుడు రాదు)

ఆమె హృదయం గాయపడింది. జీవితంలో ఎంతో కోల్పోయింది. కాని ఆ పగిలిన హృదయాన్ని అతికించగల స్నేహ హస్తం, ఆమె కోల్పోయినవాటిని తిరిగి ఇవ్వగలిగే ప్రేమ ఆమెకు దొరికితే అందరివలే ఆమె ఉత్సహంగా జీవించగలదు. తనతో జీవితాన్ని పంచుకునేవారికి అన్ని ఆనందాలను ఆమె తిరిగి ఇవ్వగలదు. తనను ఈ సమాజంలో వస్తువుగా ఒప్పుకుంటూనే పోయిన భాగాలని సరి చేస్తే తాను మళ్లీ పని చేయగలనని ఆమె చెప్పుకోవడం ఈ ప్రపంచంలో స్త్రీల వాస్తవ స్థితిని దాని మాటున నలిగిపోతున్న స్త్రీల అస్తిత్వాన్ని వివరిస్తుంది.

The bargain store is open, come inside
(The bargain store is open, come inside)
You can easily afford the price
(The bargain store is open, come inside)
Love is all you need to purchase all the merchandise
And I can guarantee you’ll be completely satisfied
(The bargain store is open, come inside)

(ఈ చౌకబేరాల దుకాణం తెరిచే ఉంది. లోపలికి రండి. థరలు మీకు అందుబాటులోనే ఉన్నాయి. ఇందులో వస్తువులను కొనడానికి మీకు ప్రేమ మాత్రమే చాలు. మీరు పూర్తి సంతృప్తిని పొందగలరన్న పూచి నాది)

జీవితంలో సెకెండ్ చాన్స్ తీసుకోవాలని, జీవించాలని కోరుకునే స్త్రీ ఎంత అసహాయ స్థితిలోకి తోసివేయబడుతుందో ఈ వాక్యాలు వింటే తెలుస్తుంది. తాను మళ్ళీ మరో బంధానికి ఎదురు చూస్తున్నానని చెప్పడాన్ని ఆమె ‘దుకాణం తెరిచే వుంది’ అని చెప్పడం వింటుంటే మనసు బాధతో మూలుగుతుంది. ఇందులో కనపడని వ్యంగ్యం ప్రపంచంపై తిరుగుబాటు కూడా అంతర్లీనంగా ద్వనిస్తాయి. పైగా నన్ను కొనడానికి ఎక్కువ ధర అక్కర్లేదు. ప్రేమకే అమ్ముడుపోయే వస్తువును నేను. నన్ను ప్రేమతో కొనుక్కున్నవారి జీవితంలో ఎప్పుడూ అసంతృప్తిని రానివ్వను అని ఆమె చెప్పుకోవడం వెనుక విషాదం అర్థం అయితే తప్ప ఈ పాటలోని భావం దరి చేరదు.

Take these old used memories from the past
And these broken dreams and plans that didn’t last
I’ll trade them for a future, I can’t use them anymore
I’ve wasted love, but I still have some more

(ఈ పాత వాడుకున్న జ్ఞాపకాలను తీసేసుకో, మిగలిన ఈ పగుళ్లు పడిన నా కలలు, ప్రణాళికలను తీసుకెళ్లిపో. వీటిని ఇక వాడలేను. అందుకే ఇవి ఇచ్చేసి, వీటికి బదులుగా నా భవిష్యత్తుని కొనుక్కుంటాను. ఇంతకాలం నా ప్రేమను వృథాపర్చుకున్నాను. అయినా పర్లేదు నా దగ్గర పంచగల కొంత ప్రేమ మిగిలే ఉంది)

ఆమె గడిచిన జీవితపు జ్ఞాపకాలు ఆమెతోనే ఉన్నాయి. వాటిని తనను స్వీకరించబోయే వ్యక్తి, తన నుండి తొలగించాలని ఆమె కోరుకుంటుంది. పాత జీవితపు కలలు, ప్రణాళికలను వదిలించుకుని భవిష్యత్తులోకి అడుగుపెట్టాలని ఆమె కోరుకుంటుంది. ఆ పాత జీవితంలో ఆమె ప్రేమను పెట్టుబడిగా పెట్టింది. అది వృథా అయిపోయింది. అయినా ఆమె పూర్తిగా ఖాళీ కాలేదు. ఇంకా కొంత ప్రేమ ఆమెలో మిగిలే ఉంది. పాత గాయాలను వదిలించుకుని కొత్త జీవితాన్ని ఆ ప్రేమతో మొదలుపెట్టాలని ఆమె కోరుకుంతుంది. అయితే దీనికి ఆమెకు అతని సహాయం అవసరం..

The bargain store is open, come inside
You can easily afford the price
Love is all you need to purchase all the merchandise
And I can guarantee you’ll be completely satisfied

(ఈ చౌకబేరాల దుకాణం తెరిచే ఉంది. లోపలికి రండి. థరలు మీకు అందుబాటులోనే ఉన్నాయి. ఇందులో వస్తువులను కొనడానికి మీకు ప్రేమ మాత్రమే చాలు. మీరు పూర్తి సంతృప్తిని పొందగలరన్న పూచి నాది)

ఒకరి నీడలో జీవితాన్ని గడిపిన స్త్రీ అతని నుండి విడిపడి మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కోరుకోవడాన్ని హర్షించే పరిస్థితులు ప్రపంచంలో పూర్తిగా లేవు. ఆమె పట్ల సమజంలో ఓ చులకన భావం, అనుమానం ఉండిపోతాయి. వీటి నడుమ కొత్త జీవితాన్ని నిర్మించుకోవడాని సిద్ధపడిన స్త్రీ కొన్ని అవమానాలను దిగమింగుకోవాలి. అనుమానపు చూపులకు అలవాటు పడాలి, పాతలోని చేదును వదిలించుకుని గాయాలను మాన్పుకుంటూ తనను మరో జీవితానికి సిద్ధం చేసుకోవాలి. దీనికి సహకరించే భాగస్వామి తనకు దొరకాలన్నది ఆమె కోరిక. పలక మీద ఓ పేరు తుడిచేసి మరో పేరు రాసేటంత సులువుగా హృదయాన్ని తయారు చేసుకోవడం జరగదు. దీనికి ఓపిక, ఓర్పుతో పాటు పక్కవారి తోడ్పాటు కావాలి. కాని ప్రపంచం ఆ తోడ్పాటు స్త్రీ విషయంలో అందించదు. అప్పుడు ఆమె మనఃస్థితిని అచ్చంగా ఈ పాటలో వలే ఉంటుంది. తన గతాన్ని అంగీకరిస్తూ, తనలోని మంచిని ప్రకటించుకుంటూ తాను భవిష్యత్తులోకి ప్రయాణం చేయాలనుకుంటున్నానన్న కోరికతో పాటు తనకు తోడ్పాటు అందించమనే అభ్యర్థననూ ఆమె ప్రకటించుకోవాలి. అందరూ అనుకుంటున్నట్లు జీవితంలో సెకెండ్ చాన్స్ తీసుకోవడం తేలికయిన విషయం కాదు. ముఖ్యంగా స్త్రీకి.

My life is likened to a bargain store
And I may have just what you’re looking for
If you don’t mind the fact that all the merchandise is used
With a little mending it could be as good as new
The bargain store is open, come inside
(The bargain store is open, come inside)
The bargain store is open, come inside
(The bargain store is open, come inside)

(నా జీవితం ఓ చౌకబేరాల దుకాణంగా మారిపోయింది. అయినా నువ్వు వెతుకుతున్నది నాలో దొరకవచ్చు. ఇవి వాడబడిన వస్తువులన్న విషయంపై నీకు పట్టింపు లేకపోతే, వీటిని సరిచేస్తే ఇవి కొత్తగా మారగలవు)

ఈ పాటను డాలి పాడిన విధానంలో చాలా గంభీరత ఉంటుంది. అలాగే ప్రతి చరణంలో ఆ స్త్రీ అసహాయత ధ్వనిస్తూనే అంతర్లీనంగా ఆమె వేసే ప్రశ్నలు శ్రోతలను ఇబ్బంది పెడతాయి. స్త్రీని వస్తువుగా వర్ణించే సమాజ వ్యాఖ్యలు మనకు కొత్త కాదు. వాటిని కొంత వరకు భరిస్తాం. కాని అదే స్త్రీ తనను వస్తువుగా ప్రకటించుకుంటే భరించడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇది సమాజంలో నాగరికుల హిపోక్రసి. దాన్ని దెబ్బదీస్తుంది ఈ గీతం. పితృస్వామ్య సమాజం స్త్రీని ఎక్కడ ఉంచిందో దాన్ని ప్రతిఘటించకుండా స్త్రీ ఆ స్థితిని అంగీకరిస్తూ, తన ఉనికి కోసం అభ్యర్ధించడంలో ఓ విషాదం ఉంది. దీని నుండి తప్పించుకోవడం కష్టం. అందుకే ఈ పాట చాలా మందిని బాధించింది. ఇది ఈ శైలిలో రాయకుండా ఉండి ఉంటే బావుండేదని చాలా మంది అన్నారు. కాని ఈ పాట ఎందరినీ చేరడానికి, ఎన్నో ఆలోచనలను రేపడానికి ఈ శైలే దోహదపడిందని ఇది విన్నవారికి అంగీకరించక తప్పదు. “మీరు నా ధరను సులభంగా భరించగలరు” అనే వాక్యం వ్యభిచారానికి సన్నని సూచనగానూ, వినపడకూడని తప్పుగానూ కొందరు భావించడంతో ఈ పాట నిషేధానికి గురి అయింది. కాని స్త్రీని పొందడాన్ని తమ సామాజిక విజయంగా, స్త్రీని ఏ బంధంలోనయినా వస్తువుగా మాత్రమే పరిగణించే పితృస్వామ్య వ్యవస్థ పై, స్త్రీల పక్షాణ నిలిచిన డాలి సంధించిన ఆయుధంగా దీన్ని చూడగలిగితే ఈ పాటలోని మార్మికత అర్థం అవుతుంది.

~

ఈ పాటని యూట్యూబ్‌లో వినవచ్చు/చూడవచ్చు:

https://youtu.be/YAjFn4VmS7A?si=cApU-B7sPYEZEvz9

Exit mobile version