[‘ద బర్డ్స్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]
[ఈ వ్యాసం కేవలం ఒక పరిచయమో, సమీక్షో కాదు. ఇది ఈ చిత్రం పై విశ్లేషణ. ఈ చిత్రం నాకు ఎందుకు నచ్చిందో చెప్పే ప్రయత్నమిది. చిత్రం కథ మొత్తం ప్రస్తావించబడింది. సినిమా కళని ఈ చిత్రం ప్రభావవంతంగా ఎలా ఆవిష్కరించిందో ఇందులో వివరించబడింది. చిత్రం చూసినవారు పూర్తిగా చదవవచ్చు. చూడనివారు కొంతవరకు చదవవచ్చు. వ్యాసంలో ఒక హెచ్చరిక (spoiler warning) ఉంటుంది. చిత్రం చూడాలనుకునేవారు అక్కడ చదవటం ఆపివేయవచ్చు. – వ్యాసకర్త]
మెలనీ డానియెల్స్‌కి ఇతరులని ఆటపట్టించటం అంటే సరదా. ఒక్కోసారి అది వికటిస్తుంది. అలాంటి ఒక సందర్భంలో ఆమె కోర్టుకి వెళ్ళాల్సివస్తుంది. అక్కడ మిచ్ బ్రెనర్ అనే లాయరు ఆమెని చూస్తాడు. ఆమెకి శిక్ష ఏమీ పడదు. ఆమె తండ్రి ఒక పత్రిక అధిపతి కావటం ఒక కారణం. తర్వాత మెలనీ, మిచ్ ఒక పెంపుడు జంతువుల దుకాణంలో కలుస్తారు. అతను ఆమెని గుర్తు పట్టినా కావాలనే ఆమె ఒక సేల్స్‌గర్ల్ అయినట్టు ఆమెతో మాట్లాడతాడు. లవ్‌బర్డ్స్ కావాలంటాడు. ఆమె కూడా తానెవరో చెప్పకుండా అతనికి రకరకాల పక్షులని చూపిస్తుంది. అతనికి నిజంగానే లవ్‌బర్డ్స్ కావాలి. తన చెల్లెలికి పుట్టినరోజున కానుకగా ఇవ్వటానికి. మెలనీ అజాగ్రత్త వల్ల ఒక పక్షి గూట్లో నుంచి తప్పించుకుంటుంది. చివరికి అతను “నువ్వెవరో నాకు తెలుసు. నీ ఆకతాయితనం తెలుసు. నీకో పాఠం చెప్పాలనే ఇలా చేశాను” అని వెళ్ళిపోతాడు. ఆమె ఉడుక్కుంటుంది. అతని కారు నంబరు చూసి పత్రికాఫీసుకి ఫోన్ చేసి అతనెవరో, ఎక్కడుంటాడో తెలుసుకుంటుంది. చిత్రం పేరు ‘ద బర్డ్స్’ (1963) అంటే పక్షులు అని అర్థం. లవ్‌బర్డ్స్‌ని సూచిస్తూ ఈ పేరు పెట్టారని అనిపిస్తుంది. కానీ విషయం అది కాదు. అదే హిచ్‌కాక్ తెలివి.
జంతువులని మనిషి తన ఆస్తి అయినట్టు చూస్తాడు. పులులు, సింహాలు లాంటి జంతువులని బంధించి జూలో పెడతాడు. పక్షులని పంజరాలలో పెడతాడు. కొన్ని జంతువుల మాంసం తింటాడు. మనిషికి ఏం అధికారం ఉంది? పైగా మనిషి తన బుద్ధిని రకరకాలుగా దుర్వినియోగం చేస్తాడు. మెలనీ తన తండ్రికి పత్రికాఫీసు ఉంది కాబట్టి మిచ్ సమాచారం సంపాదించగలిగింది. మిచ్ ఆమె పట్ల ఆకర్షితుడయ్యి ఆమెతో ఫ్లర్ట్ చేయటానికే ఆమెని ఆటపట్టించాడు. మనిషి ఇలా రకరకాల పోకడలు పోతాడు. జంతువులు మాత్రం తమకి ప్రకృతి విధించిన నియమాల్ని ఉల్లంఘించవు. ‘కాల్విన్ అండ్ హాబ్స్’ అనే కామిక్‌లో కాల్విన్ ఒక ఆరేళ్ళ పిల్లాడు. హాబ్స్ అతని దగ్గరున్న ఒక పులి బొమ్మ. కాల్విన్ ఆ బొమ్మతో మాట్లాడతాడు. ఆ బొమ్మ కూడా తనతో మాట్లాడినట్టు ఊహించుకుంటాడు. ఒకసారి కాల్విన్ “ఈరోజు జూకి వెళుతున్నాం. నువ్వూ వస్తావా?” అంటాడు. హాబ్స్ “జూ నుంచి జైలుకి వెళ్ళి అక్కడ బంధించబడిన మనుషుల్ని చూసేటట్టయితే వస్తాను” అంటుంది. అవును మరి. మనుషులందరూ జూకి వెళ్ళి జంతువుల్ని వింతగా చూసినపుడు జంతువులు జైలుకి వెళ్ళి ఖైదులో ఉన్న మనుషుల్ని చూస్తే తప్పేంటి? జంతువులు మనుషులకి దూరంగా ఉంటాయి. భయం వల్ల కావచ్చు. కానీ జంతువులకి కోపం వస్తే కష్టమే. ‘పక్షులకి కోపం వస్తే?’ అనే ఆలోచనతో ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్ తీసిన చిత్రమిది. ఈ చిత్రానికి డాఫ్నీ దు మారియే రాసిన ఒక కథ ఆధారం. ఆ కథ స్వరూపం వేరు. హిచ్‌కాక్ చెప్పటంతో కథలో ముఖ్యాంశాన్ని తీసుకుని కొత్త కథతో స్క్రీన్‌ప్లే రాశాడు ఎవన్ హంటర్.
ఈ చిత్రంలో రకరకాల పాత్రలు ఉంటాయి. మెలనీ ధనవంతురాలు. ఇచ్ఛ వచ్చినట్టు ఉంటుంది. మిచ్ ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు. ఆకతాయి పిల్లని ఇష్టపడే బలహీనత అతనిది. అతని తల్లి లిడియాకి కొడుకు తనని వదిలి వెళ్ళిపోతాడేమో అని భయం. జంతువులు అలా భయపడవే? పిల్లలు వదిలిపోయినా హాయిగా బతుకుతాయి. మరి మనిషికి ఏం రోగం? మిచ్ మాజీ ప్రియురాలు యానీని లిడియా మిచ్‌కి దూరం చేసింది. మిచ్‌కి దగ్గరగా ఉండాలని యానీ అతని ఊరిలో టీచర్‌గా పని చేస్తుంది. యానీ మిచ్ నుంచి విడిపోయాక లిడియా ఆమెని ఆదరిస్తుంది. ఏమిటీ మనస్తత్వాలు? అందరూ తమ తమ భయాల, బలహీనతల పంజరాలలో పక్షులే. వాళ్ళ కథ విని మనం నవ్వుకోవచ్చు. ‘మన కథనే ఎవరైనా నాటకంలా ప్రదర్శిస్తే మనమే పడీపడీ నవ్వుతాం’ అంటారో తత్వవేత్త. మనుషుల మనస్తత్వాలు చూసి ప్రకృతికి కోపం వస్తే ఏమైనా జరగవచ్చు.
గత వ్యాసంలో ‘సైకో’ గురించి చెబుతూ హిచ్‌కాక్ సినిమాల్లో కొన్ని సంభాషణలు చాలా లోతుగా ఉంటాయని చెప్పాను. అలాంటి సంభాషణలు ఈ చిత్రంలో రెండు ఉంటాయి. ఒకటి మెలనీ, యానీల మధ్య జరుగుతుంది. రెండోది మెలనీ, లిడియాల మధ్య జరుగుతుంది. ఈ సంభాషణల్లో మానవ సంబంధాలు ఎంత క్లిష్టంగా ఉంటాయో దర్శింపజేశాడు దర్శకుడు. ‘సైకో’కి, ‘ద బర్డ్స్’కి మరో పోలిక కొడుకుని వదులుకోలేని తల్లి పాత్ర. తల్లి ప్రేమని ఎంతో గొప్పగా చెబుతారు గానీ స్వార్థపరురాలయిన తల్లి ఉంటే బతుకు ఎలా ఉంటుందో ఈ చిత్రాలలో చూస్తాం. ఈ మధ్యనే ఒక ప్రవచనంలో విన్నాను – రాముడు అడవికి వెళుతుంటే కౌసల్య అడిగిన మొదటి ప్రశ్న “నువ్వు వెళితే నా పరిస్థితి ఏమిటి?” ఎవరికైనా తమ బాధే ముఖ్యం. కొందరు తల్లులలో అది క్షణికమైన స్వార్థం. కొందరు తల్లులలో అది ప్రమాదకరమైన మమకారం.
కథలోకి మళ్ళీ వెళితే మెలనీ మిచ్ వివరాలు తెలుసుకుని, లవ్‌బర్డ్స్ కొని పంజరంలో పెట్టి అతని అపార్ట్‌మెంట్‌కి తీసుకువెళుతుంది. ఆరోజు శనివారం. అతను వారాంతాలలో సొంతూరికి వెళతాడని ఆమెకి తెలుస్తుంది. అక్కడితో వదిలేయొచ్చుగా? వదలదు. కారులో అతని ఊరికి బయల్దేరుతుంది. డబ్బుంటే ఏం చేసినా చెల్లుతుంది. ఆ ఊరు సముద్రం ఒడ్డున ఉంటుంది. మిచ్ ఇల్లు ఎక్కడుందో తెలుసుకుంటుంది మెలనీ. అక్కడికి పడవలో వెళ్ళొచ్చు లేదా చుట్టు తిరిగి కారులో వెళ్ళొచ్చు. కారులో వెళితే శబ్దం వల్ల తన రాక తెలిసిపోతుందని పడవలో వెళుతుంది. ఇంట్లో ఎవరూ లేరు. మిచ్ గ్యారేజ్‌లో పని చేసుకుంటూ ఉంటాడు. ఆమె ఇంట్లో లవ్‌బర్డ్స్ పంజరం పెట్టేసి తిరిగి పడవలో బయల్దేరుతుంది. కాస్త దూరం వెళ్ళి పడవ ఆపి ఇంటి వైపు చూస్తుంది. మిచ్ ఇంట్లోకి వెళ్ళి లవ్‌బర్డ్స్ చూసి పరుగున బయటకి వస్తాడు. బైనాక్యులర్స్‌లో మెలనీని చూస్తాడు. ఆమె పడవలో అవతలి ఒడ్డుకి వెళుతుంటే అతను కారులో ఆమెని కలుసుకోవటానికి వస్తాడు. ఆమె ఒడ్డు చేరేలోగా అక్కడికి చేరుకుంటాడు. ఆమె ఒడ్డుకి చేరుకుంటుంటే ఒక సీగల్ (సముద్రపక్షి) ఆమె మీద దాడి చేస్తుంది. ఆమెకి నుదుటి మీద గాయం అవుతుంది. మిచ్ ఆమెని దగ్గరున్న రెస్టారెంట్‌కి తీసుకెళ్ళి ప్రథమ చికిత్స చేస్తాడు.
మిచ్ ఇంటికి వెళ్ళే ముందు మెలనీ అతని చెల్లెలి పేరు తెలుసుకోవాలని స్కూల్ టీచర్ యానీ ఇంటికి వెళ్ళింది. ఇప్పుడు మిచ్ “ఇక్కడికి ఎందుకు వచ్చావు?” అంటే “నా స్నేహితురాలు యానీని కలుసుకోవటానికి వచ్చాను” అని అబద్ధం చెబుతుంది. కానీ అతనికి తెలుసు ఆమె తన కోసమే వచ్చిందని. అతనికి తెలుసని ఆమెకి తెలుసు. ఇక్కడితో ఈ ప్రహసనం ముగిసేదే కానీ మిచ్ తల్లి లిడియా అక్కడికి వస్తుంది. చెల్లాయి కోసం లవ్‌బర్డ్స్ తెచ్చిందని మిచ్ చెబుతాడు. లవ్‌బర్డ్స్ అనగానే లిడియా ముఖం గంభీరంగా మారుతుంది. ‘నా కొడుకుని వలలో వేసుకోవటానికి వచ్చింది’ అనే భావం ఆమె ముఖంలో కనపడుతుంది. మిచ్ మెలనీని తన ఇంట్లో డిన్నర్‌కి ఆహ్వానిస్తాడు. “అంత దూరం నుంచి మన కోసం వచ్చిందిగా” అంటాడు. వద్దనటం లిడియాకి మర్యాద కాదు. మెలనీ తప్పించుకుందామని చూస్తుంది కానీ ఇరకాటంలో పడిపోతుంది. యానీతో ఉంటున్నానని మరో అబద్ధం చెబుతుంది. సాయంత్రం భోజనానికి రమ్మని చెప్పి మిచ్ తల్లితో కలిసి వెళ్ళిపోతాడు. మెలనీతో కలిసి మరి కొంచెం సమయం గడపాలని అతని ఆశ.
యానీ తన ఇంట్లో ఒక గది అద్దెకి ఇవ్వాలని అనుకుంటుంది. అది చూసి మెలనీ ఒక రాత్రికి అక్కడ ఉంటానని అడుగుతుంది. యానీ ఒప్పుకుంటుంది. మెలనీ, మిచ్‌ల మధ్య ఏదో ఉందని యానీకి అర్థమమవుతుంది. సాయంత్రం మెలనీ మిచ్ ఇంటికి వెళుతుంది. మిచ్ చెల్లెలు లవ్‌బర్డ్స్ తెచ్చినందుకు థ్యాంక్స్ చెబుతుంది. లిడియా తాము పెంచే కోళ్ళు మేత తినటం లేదని మేత అమ్మిన దుకాణదారుడికి ఫోన్ చేస్తుంది. ప్రతి సన్నివేశంలో ఇలా ఏదో ఒక పక్షి వింతగా ప్రవర్తించటం ఉత్కంఠని పెంచుతూ ఉంటుంది. కోళ్ళకి ఏదో జబ్బు చేసిందని లిడియా అనుకుంటుంది. మిచ్ చెల్లెలు మెలనీతో కబుర్లు చెబుతుంది. భోజనం అయిన తర్వాత మిచ్, లిడియా వంటగదిలో ఉంటారు. లిడియా మెలనీ గురించి తాను పేపర్లో చదివానని అంటుంది. సోషలైట్ కాబట్టి ఆమె గురించి పేపర్లో వస్తూ ఉంటుంది. మెలనీ రోమ్‌లో ఒక ఫౌంటెన్లో నగ్నంగా తడిసిందని పేపర్లో వచ్చిందని లిడియా అంటుంది. మిచ్ “ఆమె సంగతి నాకు వదిలెయ్” అంటాడు. లిడియా “నీ ఇష్టం” అని ఊరుకుంటుంది. ఏదో ఒక సాకు చెప్పి కొడుకుని మెలనీకి దూరం చేయాలని ఆమె ప్రయత్నం.
మిచ్ మెలనీని సాగనంపటానికి వస్తాడు. రోమ్‌లో జరిగిన విషయాన్ని నర్మగర్భంగా ప్రస్తావిస్తాడు. ఆమె “నన్ను ఆ ఫౌంటెన్లోకి తోశారు. బట్టలు వేసుకునే ఉన్నాను. మా వ్యతిరేక పత్రిక చిలువలు పలువలుగా రాసింది” అంటుంది. “అయ్యో పాపం. నీకు యానీ నిజంగా తెలుసా?” అంటాడతను వ్యంగ్యంగా. తెలియదని ఒప్పుకుంటుంది ఆమె. “అబద్ధాలు చెప్పావన్నమాట. పోకిరీలతో స్నేహం చేస్తున్నావన్నమాట” అంటాడతను రెచ్చగొడుతూ. ఆమెకి చిర్రెత్తుకొస్తుంది. “అది అప్పటి మాట” అంటుంది. “ఏదెలా ఉన్నా సిటీకి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం. సరదాగా ఉంటుంది” అంటాడతను ఆటపట్టిస్తూ. “నాకేం సరదా లేదు” అని ఆమె వెళ్ళిపోతుంది.
ఇక్కడే మెలనీ, యానీల మధ్య ఓ సంభాషణ వస్తుంది. యానీ తానూ, మిచ్ సిటీలో డేటింగ్ చేసేవాళ్ళమని చెబుతుంది. మిచ్ తండ్రి చనిపోయాక లిడియా కుంగిపోయింది. ఒకసారి మిచ్ యానీని సొంతూళ్ళో ఇంటికి తీసుకువెళ్ళాడు, తల్లికి పరిచయం చేద్దామని. లిడియాకి యానీ నచ్చింది. కానీ యానీని పెళ్ళి చేసుకుంటే కొడుకు తనని వదిలిపోతాడని ఆమె భయం. భర్త లేడు, కొడుకు వెళ్ళిపోతాడని ఆమె భయం. భర్త పోయి బాధపడుతున్న తల్లిని ఇంకా బాధపెట్టటం ఇష్టం లేక మిచ్ యానీకి దూరమయ్యాడు. యానీ మిచ్‌ని మర్చిపోలేక అతని ఊరిలో టీచర్‌గా పనిచేయటం మొదలుపెట్టింది. ఇప్పుడు లిడియా యానీకి స్నేహితురాలు. మిచ్, మెలనీల మధ్యకి తాను రానని యానీ అంటుంది. మెలనీ “మా మధ్య ఏమీ లేదు” అంటుంది. వాళ్ళ మధ్య ఆకర్షణ ఉంది, కానీ బయటపడరు. నిజానికి వాళ్ళిద్దరూ కలిసి రెండు రోజులే అయింది. లిడియా ప్రవర్తన గురించి విశ్లేషిస్తే కొందరు తల్లులు ఇలాగే ఉంటారు అని చెప్పకతప్పదు. గత శతాబ్దంలో మన దేశంలో పెళ్ళి అనేది ఒక అనివార్యమైన విషయం కానీ అమెరికాలో పెళ్ళి మీద నమ్మకం తగ్గింది. పెళ్ళి చేసుకోకుండా ఉండటం అక్కడ సమాజంలో దృష్టిలో లోపమేమీ కాదు. కొడుకు పెళ్ళి చేసుకోకుండా తనకి తోడుగా ఉండాలని లిడియా లోలోపల కోరుకుంది. అది స్వార్థమే. మెలనీ అల్లరిపిల్ల అని మిచ్‌కి చెప్పబోయింది సరే. మరి యానీలో ఏం లోపముంది? ఏమీ లేదు. ఆమెకి కొడుకు తనని వదిలి వేరే కాపురం పెట్టటం ఇష్టం లేదు.
ఇంతలో మిచ్ ఫోన్ చేస్తాడు. తాను అన్న మాటలకి మెలనీకి సారీ చెబుతాడు. మర్నాడు ఆదివారం. మిచ్ చెల్లెలికి పుట్టినరోజు పార్టీ. పార్టీకి రమ్మని ఆహ్వానిస్తాడు. తన చెల్లెలి కోసం రమ్మంటాడు. ఆమె ఒప్పుకుంటుంది. ఇంతలో తలుపు చప్పుడయితే యానీ వెళ్ళి చూస్తుంది. ఒక సముద్ర పక్షి తలుపుని గుద్దుకుని చచ్చిపడి ఉంటుంది. “చీకట్లో దారి తెలియలేదేమో” అంటుంది యానీ. “అదేంటి? పున్నమి అయితే?” అంటుంది మెలనీ. మనుషులు కూడా అంతే. తెలిసి తెలిసి తప్పులు చేస్తారు. యానీ తిరిగి ఆ ఊరికి రావటం ఆమె తప్పు. మెలనీ లిడియా గురించి తెలిసి కూడా పార్టీకి వెళ్ళాలనుకోవటం ఆమె తప్పు. ఆశ మనిషి చేత ఎన్ని పనులైనా చేయిస్తుంది. ఎవరికి శిక్షపడుతుందో, ఎవరు తప్పించుకుంటారో కాలమే చెబుతుంది.
మర్నాడు మధ్యాహ్నం ఆరుబయట పార్టీ జరుగుతుంటే మిచ్, మెలనీ దూరంగా వెళ్ళి మాట్లాడుకుంటారు. మెలనీ రోమ్‌లో తాను కాస్త విచ్చలవిడిగా ఉన్నట్టు ఒప్పుకుంటుంది. కానీ ఇప్పుడు ఏదైనా లక్ష్యం కోసం పని చేయాలని ఉందని అంటుంది. ఇప్పుడు ఆమె వాలంటీర్‌గా పని చేస్తోంది. ఒక కోర్సు చేస్తోంది. ఒక కొరియన్ అబ్బాయికి స్కూల్ ఫీజు కోసం విరాళాలు సేకరిస్తోంది. అంటే ఆమె ఆకతాయితనం మాని బాధ్యతగల యువతిగా మారుతోందన్నమాట. కానీ ఇంతలోనే తన మేనత్తకి మాటలు నేర్చిన మైనా పక్షిని బహూకరిస్తున్నానని, ఆ మైనాకి కొన్ని అభ్యంతరకర పదాలు నేర్పిస్తానని అంటుంది. మిచ్ నవ్వుతూ “నీకు తల్లి సంరక్షణ అవసరం” అంటాడు. అతని ఉద్దేశం తల్లి ఉంటే మంచీ చెడూ చెబుతుందని. మెలనీ గంభీరంగా మారిపోతుంది. ఆమె తల్లి ఆమె చిన్నప్పుడే ఇల్లు వదిలి ప్రియుడితో వెళ్ళిపోయింది. ఇప్పుడామె ఎక్కుడుందో కూడా మెలనీకి తెలియదు. మెలనీ ఎందుకు ఆకతాయిగా ఉంటుందో ఇక్కడ తెలుస్తుంది. తల్లి ప్రేమ దక్కని పిల్లలు కొందరు అలాగే తయారవుతారు. మిచ్‌కి ఆమె స్వభావం అర్థమవుతుంది. ఆమె ఈ వ్యక్తిగత విషయాలు అతనికి చెప్పిందంటే అతని మీద నమ్మకం ఉందనే అర్థం. వారిద్దరినీ చూసి యానీ, లిడియా ఎవరి ఆలోచనల్లో వారు పడిపోతారు.
ఇంతలో సముద్ర పక్షులు పిల్లలపై దాడి చేస్తాయి. పెద్దలు వారిని ఇంటిలోకి తీసుకువెళతారు. వరుస సంఘటనలు జరగటం చూసి పక్షుల్లో ఏదో కలవరం పుట్టిందని పెద్దలు అనుకుంటారు. ఆరోజు సాయంత్రం మిచ్, మెలనీ, లిడియా, మిచ్ చెల్లెలు ఇంట్లో ఉండగా చిమ్నీ గొట్టంలో నుంచి పిచ్చుకల్లాంటి పక్షులు గుంపుగా కిందకి వచ్చి ఇంట్లో హడావిడిగా తిరగటం మొదలుపెడతాయి. మిచ్ వాటిని తరమటానికి ప్రయత్నిస్తాడు. మెలనీ ఆడవాళ్ళని వేరే గదిలోకి తీసుకువెళుతుంది. కాసేపటికి పక్షులు వెళ్ళిపోతాయి. పోలీసులని పిలిస్తే వాళ్ళు ఏమీ చెయ్యలేమని చెబుతారు. లివింగ్ రూమ్ చిందరవందర కావటంతో లిడియా నిర్విణ్ణురాలై ఉంటుంది. పైగా పిల్లల మీద దాడి జరిగింది. ఆమె కోసం మెలనీ ఆ రాత్రికి ఉండిపోవాలని నిర్ణయించుకుంటుంది. అలాంటి పరిస్థితిలోనూ లిడియా మెలనీ ఉద్దేశాన్ని అనుమానిస్తుంది. మనిషి నైజం అంతే. ఇక్కడ దర్శకుడిని, లిడియా పాత్ర పోషించిన జెసికా టాండీని మెచ్చుకోకతప్పదు. కేవలం ఆమె క్లోజప్‌తోనే ఆమె భావాలు తెలిసిపోతాయి.
ఘోరాలు చేసే వాళ్ళ మీద ప్రకృతి ప్రకోపించటం మనం కథల్లో, సినిమాల్లో చూశాం. కానీ ఇక్కడ ఘోరాలేం లేవు. మనిషిలో ఉన్న బలహీనతలు, వాటికి లొంగి వారు ఒకరినొకరు బాధపెట్టటం మాత్రమే ఈ చిత్రంలో చూస్తాం. అంటే ఘోరాలు చేసే ఏ కొద్దిమందో కాక చిన్న చిన్న స్వార్థాలతో ప్రవర్తించే కోట్ల మంది ప్రజల మీద ఎక్కుపెట్టిన బాణం ఇది. మెలనీ చిలిపి పనులు చేస్తుంది. మనసు చెప్పినట్టు చేస్తుంది. దాని వల్ల కొంతమంది బాధపడతారు. మిచ్ యానీని వదిలేశాడు పెద్ద కారణం లేకుండానే. యానీ అతన్ని మరచిపోలేక తనకి తాను శత్రువైంది. లిడియా కొడుకుని మమకారం అనే పంజరంలో బంధించింది. యానీని బాధపెట్టింది. మెలనీని శత్రువులా చూసింది. బుద్ధిజీవి అయిన మనిషి ఇలా అల్పంగా ప్రవర్తించటంతో ప్రకృతి కన్నెర్ర చేసింది అని అనుకోవచ్చు. కానీ పక్షులు ఎందుకు అలా దాడి చేశాయనేది శాస్త్రీయంగా ఎవరైనా వివరించగలరా?
ఈ చిత్రంలో ఒక విశేషమేమిటంటే సంగీతం ఉండదు. ‘సైకో’ చిత్రానికి సంగీతం ప్రాణమని హిచ్‌కాక్ స్వయంగా ఒప్పుకున్నాడు. కానీ ఈ చిత్రంలో సంగీతం లేకపోతేనే భయం కలుగుతుందని భావించాడు. ఒక గొప్ప దర్శకుడికే ఇలాంటి నిర్ణయం తీసుకునే సాహసం ఉంటుంది. శిక్షణ పొందిన పక్షులని ఈ చిత్రంలో వాడారు. కొన్ని చోట్ల యంత్రం పక్షులని వాడారు. కానీ గ్రాఫిక్స్ లేకుండా పక్షుల దాడి సన్నివేశాలు ఎలా తీశారా అని ఆశ్చర్యం కలుగకమానదు. ఈ చిత్రంలోని స్పెషల్ ఎఫెక్ట్స్‌కి ఆస్కార్ నామినేషన్ వచ్చింది. మెలనీగా టిప్పి హీడ్రన్ నటించింది. ఆమెకి ఇదే తొలి చిత్రం! హిచ్‌కాక్ ఆమెకి తెలియకుండా ఒక దాడి సన్నివేశంలో యంత్రం పక్షుల బదులు నిజమైన పక్షులు వాడాడని చెబుతారు. ఇలాంటివి శోచనీయమైన విషయాలే. కళ కోసం కళాకారుల్ని వేధించవచ్చా? ఇప్పుడైతే ఎన్నో సౌకర్యాలు వచ్చాయి. గ్రీన్‌మాట్, గ్రాఫిక్స్, ఏఐ అన్నీ వచ్చాయి. కళాకారులే అక్కర్లేని రోజులు కూడా వస్తాయి. మిచ్‌గా రాడ్ టేలర్, లిడియాగా జెసికా టాండీ నటించారు. జెసికా టాండీ 1990లో 80 ఏళ్ళ వయసులో ‘డ్రైవింగ్ మిస్ డెయిసీ’ చిత్రానికి ఉత్తమ నటి ఆస్కార్ గెలుచుకుంది. ఇది ఒక రికార్డు.
Spoiler warning: ఈ క్రింద మిగతా చిత్రకథ, ముగింపు ప్రస్తావించబడ్డాయి. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపివేయగలరు. ఈ చిత్రం యూట్యూబ్‌లో అద్దెకి లభిస్తుంది.
మర్నాడు లిడియా కూతుర్ని స్కూల్లో దిగబెట్టి ఊళ్ళో ఉన్న ఒక ఆసామి ఇంటికి వెళుతుంది. అతని కోళ్ళు కూడా మేత తినటం లేదని, ఆ సంగతి అడుగుదామని వెళుతుంది. అతని గదిలోకి వెళ్ళేసరికి అక్కడంతా చిందరవందరగా ఉంటుంది. కిటికీ అద్దాలు పగిలి ఉంటాయి. కొన్ని పక్షులు చనిపోయి ఉంటాయి. ఒక మూల ఆ ఆసామి చనిపోయి పడి ఉంటాడు. అతని కళ్ళని పక్షులు పీకేశాయి. అది చూసి లిడియా భయభ్రాంతురాలై ఇంటికి వస్తుంది. మిచ్‌కి, మెలనీకి జరిగింది తెలిసి లిడియాని విశ్రాంతి తీసుకోమంటారు. పోలీసులు కబురు పంపటంతో మిచ్ వెళతాడు. మెలనీ లిడియాకి తోడుగా ఉంటుంది. కూతురు ఎలా ఉందో అని లిడియా ఆందోళన. ఆ అందోళనలో తన కథ చెబుతుంది. “నాలుగేళ్ళ క్రితం మావారు పోయారు. ఆయనే నా బలం. ఒక్కసారిగా బలమంతా పోయింది. శాంతి లేదు. నిద్ర రాదు. మావారికి పిల్లలతో ఎలా ప్రవర్తించాలో తెలుసు. నాకు ఆ ప్రతిభ లేదు. ఒక్కోసారి ఉదయం ఆయనకి బ్రేక్‌ఫాస్ట్ సిద్ధం చెయ్యాలి కదా అనుకుంటాను. అప్పుడే గుర్తొస్తుంది.. ఆయన లేని లోటు. నా కూతురు ఇంకా చిన్న పిల్ల. మిచ్ జీవితం మిచ్‌ది” అని కాస్త తేరుకుని “నీ గురించి తెలుసుకోవాలని ఉంది. మా అబ్బాయికి నువ్వంటే ఇష్టంలాగుంది. నీ మీద నా అభిప్రాయం ఏమిటో తేల్చుకోలేకపోతున్నాను” అంటుంది. “మీకు నా మీద మంచి అభిప్రాయం ఉండటం అంత ముఖ్యమా?” అంటుంది మెలనీ. ఇది వింత ప్రశ్నలా అనిపిస్తుంది. భారతీయుల్లో ఇది ముఖ్యమే. కానీ అమెరికన్లు అలా కాదు. ఒకరికొకరు నచ్చితే చాలు.
లిడియా “మిచ్ నాకు ముఖ్యం కాబట్టి అతను ఎన్నుకునే అమ్మాయిని నేనూ ఇష్టపడాలని కోరుకుంటాను” అంటుంది. “ఇష్టపడకపోతే?” అంటుంది మెలనీ. “అప్పుడు అది నా ఒక్కదాని సమస్యే అవుతుంది. మిచ్ ఎప్పుడూ తాననుకున్నదే చేస్తాడు” అంటుంది లిడియా. యానీ ఏమో లిడియా కోసం మిచ్ తనని వదులుకున్నాడని చెప్పింది. లిడియా ఏమో మిచ్ సొంతంగానే నిర్ణయాలు తీసుకుంటాడు అంది. నాకెందుకో లిడియా చెప్పింది అబద్ధమనే అనిపించింది. మిచ్ తల్లిని దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకున్నాడు. కానీ ఇప్పుడు మారుతున్నాడు. అందుకని ఆమె ‘ఎప్పుడూ’ తాననుకున్నదే చేస్తాడు అంది. మనలో చాలామంది ఇలాగే ఉంటారు. ఎన్ని నచ్చిన పనులు చేసినా ఒక్క నచ్చని పని చేసేసరికి ‘నువ్వెప్పుడూ ఇంతే’ అంటారు. ఈ స్వభావాన్ని పట్టుకున్న స్క్రీన్‌ప్లే రచయిత పరిశీలనా దృష్టి అమోఘం. మెలనీకి తల్లి ప్రేమ లేదు. కాబట్టి ఆమె కొడుకు ప్రేమ వదులుకోలేని లిడియాని చూసి సానుభూతి చూపిస్తుంది. ఆమె అన్న మాటలను తప్పుగా అనుకోదు. చివరికి లిడియా “కానీ నేను ఒంటరిగా ఉండలేను. ఒంటరితనం భరించలేను. ఈ పక్షుల అలజడి నన్ను కలవరపెడుతోంది. మిచ్ లేకపోతే ఏం చేసేదాన్నో?” అని కన్నీరు పెట్టుకుంటుంది. తోడు కోసం అల్లాడేవారు భగవంతుడి మీద ప్రేమ పెంచుకుంటే పుణ్యమూ, పురుషార్థమూ. ముసలి వయసులో భర్తో, భార్యో ముందు వెళ్ళిపోవటం సహజం. మనకి ఎప్పుడూ అండగా ఉండేది భగవంతుడే.
కూతురి గురించి లిడియా ఆందోళన పడుతోండని మెలనీ ఆ అమ్మాయిని చూసి వస్తానని స్కూలుకి వెళుతుంది. అక్కడ కాకులు గుమిగూడతాయి. మెలనీ కీడు శంకిస్తుంది. పిల్లలను ఇళ్ళకి పంపిస్తే మంచిదని టీచరయిన యానీకి చెబుతుంది. పిల్లలని తీసుకువెళుతుంటే పక్షులు మళ్ళీ దాడి చేస్తాయి. పిల్లలు పరుగుపెడుతుంటే వాళ్ళని ముక్కులతో పొడవటానికి ప్రయత్నిస్తాయి. మెలనీ మిచ్ చెల్లెల్ని తీసుకుని తన కారు ఎక్కుతుంది. యానీ, మిగతా పిల్లలు పరుగెత్తి వెళ్ళిపోతారు. కొంతసేపటికి పక్షులు వెళ్ళిపోతాయి. మనిషి ఎంత బలవంతుడైనా కొన్ని సందర్భాలలో నిస్సహాయుడైపోతాడు. ‘బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ’ అన్నట్టు పక్షులు దండులాగ దాడిచేస్తే మనిషి ఏం చేయగలడు? ఎన్ని తుపాకీలుంటే మాత్రం ఏం లాభం? ప్రకృతి శక్తి ముందు తల వంచాల్సిందే.
మిచ్ చెల్లెల్ని యానీ ఇంటిలో దించి మెలనీ రెస్టారెంట్‌కి వెళ్ళి తన తండ్రికి ఫోన్ చేస్తుంది. పక్షుల దాడి గురించి చెబుతుంది. అప్పుడే ఒక పెద్దావిడ అక్కడికి వస్తుంది. ఆమెకి పక్షి శాస్త్రం తెలుసు. ఆమె ద్వారా చిత్రంలో శాస్త్రీయ కోణాన్ని కూడా ప్రవేశపెట్టారు రచయిత, దర్శకుడు. ఆమె “పక్షులు మూకుమ్మడి దాడులు చేయవు. అవి అందమైన జీవులు. మనిషే ఇతర జీవుల్ని ఈ భూమ్మీద బతకనీయకుండా చేస్తున్నాడు” అంటుంది. అక్కడే ఉన్న ఒక తాగుబోతు “యుగాంతం వచ్చింది” అంటాడు. మరో పక్క పిల్లలతో రెస్టారెంట్‌కి వచ్చిన ఒక తల్లి వెయిట్రెస్‌తో “వాళ్ళని నెమ్మదిగా మాట్లాడమని చెప్పు? పిల్లలు భయపడుతున్నారు” అంటుంది. ఇంకో అతను “ఆ అసహ్యపు జీవుల్ని కాల్చిపారేయాలి” అంటాడు. ఒకే సమస్య. ఇన్ని దృష్టికోణాలు. మెలనీ మిచ్‌కి ఫోన్ చేస్తుంది. అతను వస్తాడు. ఇంతలో పక్షులు దగ్గరున్న పెట్రోల్ స్టేషన్ కార్మికుడిపై దాడి చేస్తాయి. పెట్రోల్ లీక్ అయ్యి రోడ్డు మీద పారుతుంది. ఒకతను సిగరెట్ వెలిగింది అగ్గిపుల్ల పారేయటంతో మంటలు రేగుతాయి. కార్లు పేలిపోతాయి. పెట్రోల్ బంకు పేలిపోతుంది. ఇక్కడ ఆకాశం నుంచి ఒక షాట్ ఉంటుంది. దూరాన కింద మంటలు రేగిన రేఖ కనపడుతుంది. పక్షులు మళ్ళీ మూగుతాయి. ఈ షాట్ అప్పట్లో తీయటం కష్టమే. అబ్బురంగా ఉంటుంది.
మళ్ళీ పక్షి దాడి మొదలవుతుంది. ఈ సారి మంటలతో మరీ అల్లకల్లోలంగా ఉంటుంది. మిచ్ ఏదైనా సాయం చేద్దామని బయటకి వెళతాడు. మెలనీ ఫోన్ బూత్‌లోకి వెళుతుంది. పక్షులు భీకరంగా దాడి చేస్తాయి. బూత్ అద్దాలు పగిలిపోతాయి. మిచ్ వచ్చి ఆమెని తీసుకుని మళ్ళీ రెస్టారెంట్‌లోకి వెళతాడు. అక్కడ ఆడవాళ్ళందరూ ఒకచోట చేరి ఉంటారు. పక్షి శాస్త్రం తెలిసిన ఆవిడ కూడా భయపడి నక్కి ఉంటుంది. మనిషికి తెలియని రహస్యాలెన్నో ప్రకృతిలో ఉన్నాయి. ‘సినిమాలో అలా చూపించారు. అలా జరుగుతుందేమిటి?’ అని కొందరు ప్రశ్నించవచ్చు. కళాకారులకి ఊహాశక్తి ఉంటుంది. ఇలా జరిగితే ఎలా ఉంటుంది అని ప్రశ్నించటమే ఇక్కడ ఉద్దేశం. ఒకామె మెలనీతో “నువ్వు వచ్చాకే ఇవన్నీ జరుగుతున్నాయి. నువ్వు దుష్టురాలివి” అని నిందిస్తుంది. ఇలాంటివారు కూడా ఉంటారు. ఎవరో ఒకర్ని బాధ్యులని చేయాలనుకుంటారు. కాసేపటికి పక్షుల దాడి ఆగిపోతుంది. ఈ దాడి సన్నివేశం లింక్: https://www.youtube.com/watch?v=vnzBiG8C8hk
మిచ్ చెల్లెలి కోసం మిచ్, మెలనీ యానీ ఇంటికి వెళతారు. అక్కడ యానీ గుమ్మం బయట చనిపోయి పడి ఉంటుంది. మిచ్ చెల్లెలు ఏడుస్తూ బయటకి వస్తుంది. మిచ్‌కి పక్షుల మీద కోపం వస్తుంది. ఒక రాయి తీసుకుని అక్కడున్న పక్షుల్ని కొట్టబోతాడు. మెలనీ వారిస్తుంది. ఒక శత్రువు ఉంటే దెబ్బ తీయొచ్చు. వందలలో ఉంటే ఏం చేస్తాం? పైగా ఎగిరిపోగల పక్షులవి. మిచ్ యానీ దేహాన్ని ఇంట్లో పెట్టి చెల్లెల్ని, మెలనీని తీసుకుని ఇంటికి వెళతాడు. తర్వాత కిటికీలన్నిటీ చెక్కలు బిగిస్తాడు. చిమ్నీలో నుంచి పక్షులు రాకుండా మంట మండుతూ ఉండేలా కట్టెలు ఏర్పాటు చేసుకుంటాడు. “ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం” అంటుంది లిడియా. “ఎక్కడికి వెళతాం? ఇప్పటికి ఇక్కడే ఉందాం. కట్టెలు ఉన్నంతవరకు పర్వాలేదు” అంటాడు మిచ్. “కట్టెలు అయిపోతే?” అంటుంది లిడియా. “తెలియదు. ఫర్నిచర్ వాడొచ్చు” అంటాడతను. “నీకేం చేత కాదు. మీ నాన్న ఉండి ఉంటే” అని అరుస్తుంది లిడియా. అంతలోనే “సారీ. భయంలో అన్నాను” అని ఏడుస్తుంది. కుటుంబసంబంధాలు ఇంత పెళుసుగా ఉంటాయి. ఒక కష్టం వస్తే డొల్లతనమంతా బయటపడుతుంది.
కాసేపటికి పక్షుల దాడి మళ్ళీ మొదలవుతుంది. ఈసారి అందరూ ఇంటిలో ఉంటారు. పక్షుల శబ్దం మాత్రం వినపడుతుంది. కాసేపటికి సద్దు మణుగుతుంది. అందరూ కూర్చుని ఉంటారు. అలాగే నిద్రలోకి జారుకుంటారు. మెలనీ ఒక్కతే మేలుకుని ఉంటుంది. కాసేపయ్యాక ఏదో శబ్దం కావటంతో మెలనీ పై అంతస్తుకి వెళుతుంది. అక్కడ గది తలుపు తీస్తుంది. కప్పులో పెద్ద కన్నం కనపడుతుంది. ఆమె తప్పించుకునే లోగా పక్షులు దాడి చేస్తాయి. ఆమె గదిలో ఇరుక్కుపోతుంది. పక్షులు ఆమె ముఖం, చేతులు, కాళ్ళ మీద దాడి చేస్తాయి. ఆమెకి గాయాలవుతాయి. స్పృహ కోల్పోతుంది. మిచ్ వచ్చి ఆమెని గదిలో నుంచి బయటకు లాగుతాడు. ఆమెకి కాసేపటికి తెలివి వస్తుంది. ఇంకా పక్షులు దాడి చేస్తున్నట్టే అనిపించి చేతులతో వాటిని తరమటానికి ప్రయత్నిస్తుంది. మిచ్ ఆమెని సముదాయిస్తాడు. ఆమె శాంతిస్తుంది కానీ స్తబ్ధుగా ఉండిపోతుంది. గాజుకళ్ళతో చూస్తుంటుంది. మిచ్, లిడియా ఆమె గాయాలు తుడిచి కట్లు కడతారు. ఆమె మెలకువగా ఉన్నా కదలిక లేకుండా ఉండిపోతుంది.
చివరికి ఆమెని ఆసుపత్రికి తీసుకువెళ్ళాలని నిర్ణయించుకుంటారు. ఇంటి బయట వందలాది పక్షులు ఉంటాయి కానీ శాంతంగా ఉంటాయి. రేడియోలో వార్త వస్తుంది – ఆ ఊరి సరిహద్దులు మూసి వేసినట్టు. సరిహద్దులు మూసేస్తే పక్షులు ఆగుతాయా? మిలటరీని పంపించాలా అనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తుంది. మెలనీని ఇంటిలో నుంచి బయటకు తీసుకురాగానే ఆమె పక్షులని చూసి భయపడుతుంది. ఆమెని సముదాయించి కార్లో కూర్చోబెడతారు. లిడియా మెలనీని పొదివి పట్టుకుంటుంది. మెలనీ ఆమె వంక కృతజ్ఞతగా చూస్తుంది. మిచ్ చెల్లెలు “లవ్‌బర్డ్స్‌ని తీసుకొస్తాను. అవి ఎవరినీ ఏం చేయలేదుగా” అంటుంది. సరేనంటాడు మిచ్. పిల్లలలో ప్రకృతి పట్ల ఉన్న ప్రేమ పెద్దలలో ఉండదు. పెద్దయ్యాక ఆ ప్రేమ ఎందుకు మాయమవుతుందో ఆలోచించాలి. అందరూ కలిసి వందలాది పక్షులు చూస్తుండగా కారులో బయల్దేరగా చిత్రం ముగుస్తుంది.
చిత్రం ముగింపులో కూడా హిచ్ కాక్ ముద్ర కనిపిస్తుంది. నిర్మాతలు పక్షులు ఎగిరి వెళ్ళిపోయినట్టు చూపించమన్నా ఆయన ఒప్పుకోలేదు. జీవితంలో అనిశ్చితి ఎప్పుడూ ఉంటుంది అనటానికి సూచనగా పక్షులు అలాగే ఉంటాయి. లిడియా, మెలనీ కలిసిపోయారు కాబట్టి ఇక అంతా సవ్యంగా ఉంటుంది అనిపించవచ్చు. కానీ ఆ పరిస్థితిలో వాళ్ళు ఒకరికొకరు అండగా ఉన్నారు కానీ తర్వాత వారి మనఃస్థితి ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు? స్వభావాలని మార్చుకోవటం అంత తేలిక కాదు. మనుషుల స్వభావాలు అంత తేలికగా మారితే పక్షులు దాడి చేసేవే కాదేమో!
