Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మానవ జీవన యద్ధంలో పర్సనల్ అంతా పొలిటికలే అనే ‘ది ఇంగ్లీష్ పేషెంట్’

[బుకర్ ప్రైజ్ గెల్చుకున్న, ఫిలిప్ మైఖేల్ ఒండాట్జే రచించిన ‘ది ఇంగ్లీష్ పేషెంట్’ అనే నవలని పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి.]

1992లో బుకర్ గెలుచుకున్న ‘ది ఇంగ్లీష్ పేషంట్’ అనే నవలకు ఓ ప్రత్యేకత ఉంది. 2018లో, 50వ బుకర్ వార్షికోత్సవ సందర్భంలో, ప్రత్యేక గోల్డెన్ మ్యాన్ బుకర్ అవార్డును ప్రకటించారు. అప్పటి దాకా బుకర్ గెలిచిన నవలన్నిటిలో ఒకో దశాబ్దం నుండి ఒక పుస్తకాన్ని న్యాయనిర్ణేతల బృందం ఈ అవార్డుకు ఎంపిక చేసింది. అలా నైపాల్ రాసిన ‘ఇన్ ఎ ఫ్రీ స్టేట్’ (1971), లైవ్లీ రాసిన ‘మూన్ టైగర్’ (1987), ఒండాట్జే రాసిన ‘ది ఇంగ్లీష్ పేషెంట్’ (1992), మాంటెల్ రాసిన ‘వోల్ఫ్ హాల్’ (2009), సాండర్స్ రాసిన ‘లింకన్ ఇన్ ది బార్డో’ (2017) లు ఈ సందర్భంగా గోల్డేన్ మ్యాన్ బుకర్‌కు ఎంపిక అయ్యాయి. ఓటింగ్ ద్వారా విజేతగా ప్రకటించిన పుస్తకం ‘ది ఇంగ్లీష్ పేషెంట్’.

ఈ నవలకు ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానులున్నారు. దీని రచయిత ఫిలిప్ మైఖేల్ ఒండాట్జే, 12 సెప్టెంబర్ 1943న సిలోన్‌లో జన్మించిన కెనడియన్ కవి, రచయిత, వ్యాసకర్త కూడా. ఒండాట్జే సాహిత్య జీవితం మొదట కవిత్వంతో ప్రారంభమైంది: 1967లో వీరు రాసిన ‘ది డైన్టీ మాన్స్టర్స్‌’ , 1970లో రాసిన ‘ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ బిల్లీ ది కిడ్‌’ విమర్శకుల ప్రశంసలను పొందిన పుస్తకాలు. 1992లో బుకర్ బహుమతిని అందుకున్న ‘ది ఇంగ్లీష్ పేషెంట్’ నవలను 1996లో సినిమాగా కూడా తీశారు.

ఒండాట్జే 1943లో సిలోన్ (నేటి శ్రీలంక) లోని కొలంబోలో డచ్, సింహళ సంతతికి చెందిన మేజర్ మెర్విన్ ఒండాట్జే, డోరిస్ గ్రాటియన్ దంపతులకు జన్మించారు. తల్లిదండ్రులు విడిపోయిన తరువాత 1954లో ఈయన తన తల్లితో ఇంగ్లండ్ చేరారు. ఒండాట్జే తన రచనా జీవితంలో 13 కవితా పుస్తకాలను ప్రచురించారు. ‘ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ బిల్లీ ది కిడ్’ (1970), ‘దేర్ ఈజ్ ఎ ట్రిక్ విత్ ఎ నైఫ్ ఐ యామ్ లెర్నింగ్ టు డూ: పోయమ్స్ 1973–1978’ (1979) లకు గవర్నర్ జనరల్ అవార్డును గెలుచుకున్నారు. ‘అనిల్స్ గోస్ట్’ (2000), 2000 గిల్లర్ ప్రైజ్, ప్రిక్స్ మెడిసిస్, కిరియామా పసిఫిక్ రిమ్ బుక్ ప్రైజ్, 2001 ఐరిష్ టైమ్స్ ఇంటర్నేషనల్ ఫిక్షన్ ప్రైజ్, కెనడా గవర్నర్ జనరల్ అవార్డును గెలుచుకుంది.

అయితే వీరిని అంతర్జాతీయ ప్రజలకు చేరువ చేసిన నవల ‘ది ఇంగ్లీష్ పేషంట్’. నిజానికి ఇది ఒండాట్జే 1987లో  రాసిన ‘ఇన్ ది స్కిన్ ఆఫ్ ఏ లయన్’ నవలకు సీక్వెల్. ఈ నవల ప్రధాన పాత్ర పాట్రిక్ లూయిస్ మరణానంతరం హానా, కారవాగియో పాత్రల జీవితాలకు కొనసాగింపుగా ఈ నవల రాసారు ఒండాట్జే. అందుకే ‘ది ఇంగ్లీష్ పేషెంట్’ చదువుతున్నప్పుడు అందులో కొన్ని సంఘటనల ప్రస్తావన వచ్చినప్పుడు అవి త్వరత్వరగా జరిగిపోయినట్లు కొన్ని విషయాలు మనం ఎక్కడో మిస్ అయ్యామేమో అని అనిపిస్తుంది. ‘ది ఇంగ్లీష్ పేషెంట్’ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఒక ఇటాలియన్ విల్లాలో పరిస్థితుల కారణంగా కొంత కాలం కలిసి గడిపిన నలుగురు వ్యక్తుల కథ. ఈ నలుగురు నాలుగు దేశాలకు, నాలుగు భిన్న సంస్కృతులకు చెందినవారు. ఆ యుద్ధంలో రెండు పక్షాలకు పని చేసినవారు కూడా. యద్ధం ముగిసిన తరవాత మనుషులుగా తమ అస్తిత్వాన్ని తిరిగి పొందే ప్రయత్నం చేస్తూ తమ జీవితాలు ఏ దశకు చేరాయో గుర్తించి తమ ఉనికికి అర్థాన్నిమానవీయకోణంలో వెతుక్కుంటున్న నాలుగు గాయపడిన హృదయాల అనుభవాలతో నిండి ఉంటుంది ఈ పుస్తకం.

అయితే ఈ నవలను అర్థం చేసుకోవడానికి రెండో ప్రపంచ యుద్ధంలో ఏ దేశాలు ఎటు వైపున్నాయో తెలుసుకోవడం అవసరం. జర్మనీ, ఇటలీ, జపాన్, హంగేరి, రోమానియా ఆక్సిస్ పవర్స్‌గా ఉంటే మరో పక్క యూ.కె., యు.ఎస్., సోవియట్ యూనియన్, చైనా, బ్రిటీష్ కామన్‌వెల్త్ దేశాలు, ఫ్రాన్స్, పోలండ్ ఆలీస్‌గా కలిసి యద్ధం చేశాయి. ఈ కథ నడిచేది ఇటలీ దేశంలోని విల్లాలో.

ఈ నలుగురిలో గుర్తించలేని విధంగా కాలిపోయిన ఓ వ్యక్తి ఉంటాడు. అతని భాషను బట్టి అతన్ని ఇంగ్లీష్ వాడిగా గుర్తిస్తారు. చావుకు దగ్గరవుతూ శరీరం చాలా భాగం కాలిపోతే తానెవరో గుర్తుకు తెచ్చుకోలేని స్థితిలో ఉంటాడు ఆ బాధితుడు. ఇతనే ‘ది ఇంగ్లీష్ పేషెంట్’. అతన్ని చూసుకుంటూ ఉంటుంది హానా అనే ఓ కెనడియన్ ఆర్మీ నర్సు. ఆ ఇంట చేరతాడు భారతదేశానికి చెందిన ఒక సిక్కు సప్పర్. ఇతని పని భూమిలో శతృవులు దాచి పెట్టిన బాంబులను కనిపెట్టి వాటిని నిర్వీర్యం చేయడం. వీరి మధ్యకు వస్తాడు కారవాగియో అనే ఇటలీ మూలాలు ఉన్న కెనడియన్ దొంగ. ఇతని చేతి నైపుణ్యాన్ని గుర్తించి శత్రువుల స్థావరాలను కనిపెట్టే పని అప్పజెబుతుంది ఆర్మీ.

ఈ నవల నేపథ్యం రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఉత్తర ఆఫ్రికా, ఇటలీ దేశ వాతావరణం. ఈ కథ క్రమపద్ధతిలో సాగదు. ఈ పాత్రలు తమ గతాన్ని, గడిచిన జీవితాలను నెమరు వేసుకుంటూ ఉంటే, ముందుకు వెనక్కు ప్రయాణిస్తున్న వారి జ్ఞాపకాల ద్వారా మొత్తం కథను నడిపిస్తారు రచయిత. ఇటలీ, ఇంగ్లండ్, ఆఫ్రికా ఎడారి ప్రాంతాలు, భారతదేశం, కెనడా దేశాలలో జరిగిన సంఘటనలు కథలో ఒకొక్క పాత్ర జ్ఞాపకాలుగా కలగలసిపోయి  ఉంటాయి.

ఇంగ్లిష్ పేషెంట్ దగ్గర ఉన్న ఏకైక వస్తువు, హెరోడోటస్ రాసిన ‘ది హిస్టరీస్’ అనే ఓ పాత పుస్తకం. మండుతున్న విమానం నుండి క్రిందకు జారుతున్నప్పుడు ఈ పుస్తకం అతని చేతుల్లో ఉండిపోయింది. హానా ఈ పుస్తకాన్ని అతనికి అప్పుడప్పుడూ చదివి వినిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు అతనికి తన ఎడారి జీవితపు పూర్వానుభవాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. అయినా తన అసలు పేరు అతను చెప్పలేకపోతాడు. కారవాగియో మాత్రం ఇతను ఇంగ్లీష్ వాడు కాడని, అతని అసలు పేరు లాడిస్లాస్ డి అల్మాసీ అని అనుమానిస్తాడు. అతను బ్రిటిష్ కార్టోగ్రఫీ సమూహంలో భాగమైన హంగేరియన్ కౌంట్ అని, ఎడారి అన్వేషకుడు అని గుర్తు పడతాడు. ఇది క్రమంగా నిజమని ఆ తరువాత నిరూపితమవుతుంది.

కారావాగియో యుద్ద సమయంలో బ్రిటిష్ నిఘా సంస్థలో పనిచేస్తుంటాడు. ఇతను హనా తండ్రి పాట్రిక్, ఆమె సవతి తల్లి క్లారాకు స్నేహితుడు. జర్మన్ దళాలు నియంత్రణ సాధించి ఇటలీకి బదిలీ అయినప్పుడు గుఢాచారిగా ఇతను ఉత్తర ఆఫ్రికాలో పని చేస్తాడు. అక్కడే అతన్ని పట్టుకుని, విచారించి, హింసిస్తారు శత్రు సైనికులు. ఆ సమయంలో ఇంటరాగేషన్‌లో ఇతని బొటనవేళ్ళు నరికేస్తారు శత్రు సైనికులు. యద్ధం ముగిసాక నాలుగు నెలలకు పైగా ఆసుపత్రిలో ఉండి కోలుకుంటాడు కారావాగియో. అక్కడ ఉన్నప్పుడే ఒక ఇటాలియన్ విల్లాను ఆసుపత్రిగా మార్చి కొన్నాళ్లు పని చేశారని, యద్ధం ముగిసిన తరువాత ఆ ఆసుపత్రి నుండి అందరూ బైటపడ్డారని కాని హానా అనే ఒక నర్సు, ఆ హాస్పిటల్‌లో పడకకే పరిమితమయిన ఓ కాలిపోయిన ఇంగ్లీష్ పేషెంట్‌ను చూసుకోవడానికి ఉండిపోయిందని, ఎవరెంత చెప్పినా అతన్ని వదిలి రానని మొండికేసిందని, ఆమె ఒక్కత్తే ఆ రోగితో ఆ విల్లాలో ఉండిపోయిందని అతనికి తెలుస్తుంది. ఆమె తన స్నేహితుని కూతురు హానా అని గుర్తించి కారావాగియో ఆమెను వెతుక్కుంటూ ఆ విల్లాకి చేరతాడు.

ఫిలిప్ మైఖేల్ ఒండాట్జే

ఓ తుఫాను రాత్రి ఆ ఇంట్లో, హనా పియానో వాయిస్తుంటుంది.  కిర్పాల్ సింగ్ అనే ఓ భారతీయ సిక్కు సైనికుడు తన స్నేహితుడితోపాటు ఆ శబ్దం విని విల్లాలోకి వస్తాడు. ఇతన్ని అందరూ కిప్ అని పిలవడంతో ఆ పేరుతోనే తనను పరిచయం చేసుకుంటాడు. అక్కడ భూమిలో శత్రువులు బాంబులు ఉంచారని అతని నమ్మకం. పేలని మందుగుండు సామగ్రిని తొలగించడానికి కిప్ ఆ విల్లాలోనే కొన్నాళ్లు ఉండాలని నిర్ణయించుకుంటాడు. ఈ మందు గుండు సామగ్రి పై, బాంబులను నిర్వీర్యం చేసే విద్యపై కిప్‌కి ఎంతో పట్టు ఉంటుంది. ఇంగ్లిష్ పేషెంట్ కూడా మంచం మీద ఉంటూనే ఆయుధాల గురించి ఎంతో సమాచారం అందిస్తూ ఉంటాడు. దీనితో వీరిద్దరికీ స్నేహం కుదురుతుంది. ఒకసారి ఆ విల్లా పరిసర ప్రాంతంలోనే ఓ పెద్ద బాంబ్‌ను గుర్తిస్తాడు కిప్. దాన్ని నిర్వీర్యం చేయడానికి హానా అతనికి సహాయపడుతుంది. ఏ మాత్రం భయం లేకుందా ఆమె ప్రవర్తీంచడం కిప్‌ను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ సమయంలో తామిద్దరం చనిపోతామనే తాను అనుకున్నానని దానికి తాను సిద్ధంగా ఉన్నానని, కాని అలా జరగలేదని అతనికి చెబుతుంది హానా.

కిప్ అన్న ఆంగ్లేయుల వ్యతిరేకి. భారతదేశంలో స్వాతంత్ర్య సమరంలో పాల్గొంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తూ జైల్లో ఉంటాడు. కిప్ అన్నకు బదులుగా సైన్యంలోకి చేరి ఇంగ్లీషువారి విజయం కోసం పని చేస్తూ ఉంటాడు. ఇతనికి బాంబులను నిర్వీర్యం చేయడంలో శిక్షణ ఇస్తాడు లార్డ్ సఫాల్క్ అనే బ్రిటీషరు. అయితే ఆయనే ఓ బాంబును పని చేయకుండా చేసే క్రమంలో చనిపోతాడు. తన గురువు మరణ వార్త తెలిసిన వెంటనే కిప్ అదే ప్రాంతానికి వెళ్లి తన భావోద్వేగాలను నియంత్రించుకుంటూ గురువు సగంలో వదిలేసిన పని పూర్తి చేస్తాడు. యద్ధంలో తాము చేయవలసినది చేస్తూ పోవడం తప్ప మరో దారి లేదని, తమ భావావేశాలను వ్యక్తీకరించే వాతావరణం ఉండదని ఆ నలుగురి అనుభవాలు తెలియజేస్తాయి. అందుకని ఎవరి దుఃఖాలని వారు వెనక్కు నెట్టి రోజులు నెడుతూ ఉంటారు. అందులో ఒక మొండితనం ఉంటుంది.

కాని తమ ఆలోచనలను, దుఃఖాలను అణిచివేసుకుంటూ రోజులు నెడుతున్న ఆ నలుగురిని ఆ భావోద్వేగాలే నడిపిస్తూ ఉంటాయి. ఇది వారికి క్రమంగా అర్థం అవుతుంది. తన గురువు చావు తరవాత కిప్  మొండితనంతో తన పని చేసుకుంటూ వెళతాడు. ఆ బాంబులను నిర్వీర్యం చేయడమే తన పని అని తాను అందుకోసమే ఉన్నానని నమ్ముతూ దాని కోసమే జీవిస్తున్నట్లుగా అన్నీ మరచి పని చేసుకుంటూ ఉంటాడు. ఇది తన గురువు మరణం తనలో రేకెత్తించిన విషాదంలో నుండి పైకి లేచిన మొండితనం అన్నది అతనికి ఎప్పుడో కాని అర్థం కాదు.

హానా ప్రేమించిన ప్యాట్రిక్ మరణం ఆమెను మౌనంలోకి నెట్టేస్తూంది. తాను దగ్గరయిన వారందరూ తనకు దూరం అవుతారని ఆ ఇరవై ఏళ్ళ యువతి నమ్ముతుంది. అందుకే హాస్పిటల్‌లో నర్సుగా పని చేస్తున్నంత కాలం ఎవరికీ చేరువ కాకుండా ఒక బండలా ఏ భావాద్వేగాలు ప్రదర్శించకుండా పని చేసుకుంటూ వెళుతుంది. తన చేతిలో మరణించిన సైనికులందరినీ మర్చిపోయే ప్రయత్నం చేస్తుంది. అయితే ఆమె తండ్రి కూడా యద్ధంలో కాలి మరణించాడని, అతని చివరి క్షణాలు ఎవరూ దగ్గర లేకుండా ఒంటరిగా గడిచాయన్న విషయం ఆమెకు తెలిసిన తరువాత ఆమె ఒక ఉన్మాద స్థితిలోకి వెళుతుంది. అందుకే ఇంగ్లీష్ పేషంట్‌ని ఒంటరిగా వదిలి రానని తన సిబ్బందితో చెబుతుంది. ఒక్కతే ఆ హాస్పిటల్‌లో ఉండిపోతుంది. తోటి గ్రామస్థుల వద్ద తిండి పదార్ధాలు కొనుక్కుంటూ సగం కూలిపోయిన ఆ భవనంలో కరెంట్ లేని పరిస్థితుల మధ్య ఒంటరిగా ఉండిపోతుంది. ఎంతో శ్రద్ధతో ఇంగ్లీష్ పేషెంట్‌కు సేవలు చేస్తుంది. చివరికి ఆ పేషెంట్ తన గ్రామంపై దాడి చేసిన జర్మన్ శత్రువుల పక్షాన పని చేసిన వ్యక్తి అని తెలిసినా, అది ఆమెకు పెద్ద విషయంగా అనిపించదు. యద్ధంలో అందరూ గాయపడినవారే. యద్ధం ముగిసిన తరువాత అందరి అనుభవాలు ఒకటే. గెలిచిన పక్షమయినా ఓడిన పక్షం అయినా వారికి మిగిలింది యద్ధం మిగిల్చిన విషాదమే. హానా, కిప్‌ల ఈ విషాదం వారిద్దరినీ దగ్గర చేస్తుంది. వారి మధ్య శారీరిక సంబంధం కూడా ఏర్పడుతుంది.

హానా గురించి విని కారావాగియో ఆమెను వెతుక్కుంటూ ఆ విల్లాకి వస్తాడు. హానా సవతి తల్లి క్లారా ఇటలీలో నివసిస్తూ ఉంటుంది. ఆమె హానాకు ఉత్తరాలు రాస్తూనే ఉంటుంది. కాని హానా వేటికీ బదులివ్వదు. తనకు కొత్త జీవితం ఉంటుందన్నదే ఆమె నమ్మదు. కాని కారావాగియో హానా, ఇటలీలోని తల్లి దగ్గరకు వెళ్లిపొమ్మని జీవితాన్ని మళ్ళీ మొదలుపెట్టమని చెబుతూ ఉంటాడు.

చేతి గాయాలతో కారావాగియో తీవ్రమైన నొప్పిని భరిస్తూ ఉంటాడు. క్రమంగా మార్ఫిన్‌కి అలవాటు పడతాడు. ఇంగ్లీష్ పేషెంట్ గాయాల నొప్పికి కూడా హానా మార్పిన్ ఇస్తూ ఉంటుంది. అతను ఇంగ్లీషు వాడు కాదని కారావాగియో నమ్మకం. నిజం తెలుసుకోవడానికి అతనికి ఎక్కువ మోతాదులో మార్ఫిన్ ఇచ్చి అతని కథ తెలుసుకుంటాడు కారావాగియో.

నిజానికి ఇంగ్లీష్ పేషెంట్‌గా అందరూ పిలిచే ఈ రోగి అసలు పేరు కౌంట్ లాడిస్లాస్ డి అల్మాసీ. ఆఫ్రికా ఎడారిలో అగ్నిప్రమాదానికి గురయ్యి మూడొంతులు కాలిపోయిన శరీరంతో అక్కడి స్థానికులను దొరుకుతాడు ఇతను.  ఈయన పుట్టుకతో హంగేరియన్ కాని ప్రభుత్వ గుర్తింపు లేకుండా జీవిస్తాడు. ఒకరకంగా చెప్పాలంటే ఏ దేశానికి చెందని వాడిగా ఆఫ్రికా ఎడారి ప్రాంతంలో గడిపేస్తాడు. యుద్ధానికి ముందు ఇతను బ్రిటిష్ వారితో కలిసి ఎడారి అన్వేషకుడిగా పనిచేసాడు. ఆ ఎడారి ప్రాంతపు మ్యాప్ మేకర్‌గా పని చేస్తున్న ఇతని బృందం గురించి తెలుసుకుని జెప్రీ క్లిఫ్టన్ అనే బ్రిటీష్ వ్యక్తి ఈయన క్రింద పని నేర్చుకోవాలనే ఉద్దేశంతో వచ్చి చేరతాడు. అయితే అతను ఒంటరిగా కాకుండా తన భార్య కేథరీన్‌తో కలిసి వస్తాడు. వారి వివాహం జరిగిన రెండో రోజే ఎడారి ప్రయాణం పెట్టుకున్న జెఫ్రి అతని భార్య కేథరిన్ పట్ల ఈ బృందంలో ఆసక్తి పెరుగుతుంది. తన కన్నావయసులో ఎంతో చిన్నదయిన కేథరిన్‌తో ప్రేమలో పడిపోతాడు అల్మాసి. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడుతుంది. కొన్నాళ్లకి తన భర్తకు ఇది తెలిస్తే పరిస్థితి విషమిస్తుందని కేథరిన్ అల్మాసితో తన బంధాన్ని ముగిస్తుంది.

ఇంతలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుంది. పురావస్తు యాత్ర ఎడారి శిబిరాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది. అప్పుడే కాథరిన్ భర్త జెఫ్రి, అల్మాసీతో ఆమెకున్న సంబంధాన్ని గురించి తెలుసుకుంటాడు. అతనిలో కోపం అసూయ పెరుగుతాయి. నిర్లక్ష్యంగా, జాఫ్రీ కాథరిన్‌తో పాటు తాను ప్రయాణీస్తున్న విమానం నడిపి, ఉద్దేశపూర్వకంగా అల్మాసీ శిబిరంలోకి ఆ విమానంతో ఢీకొడతాడు. ఈ ప్రమాదంలో జాఫ్రీ వెంటనే మరణిస్తాడు. అల్మాసీ బతికి బయటపడతాడు. కాథరిన్ తీవ్రంగా గాయపడుతుంది.

అల్మాసీ గాయపడిన కాథరిన్‌ను అక్కడే ఉన్న ఓ గుహలోకు తీసుకువెళతాడు. ఆమెను అక్కడే ఉంచి తాను నగరంలోకి వెళ్లి సహాయంతో తిరిగి వస్తానని, ఆమెను రక్షించుకుంటానని హామీ ఇస్తాడు. ఎడారిలో ఒంటరి ప్రయాణం చేస్తూ బ్రిటిష్ నియంత్రణలో ఉన్న ఎల్ ట్యాగ్ పట్టణానికి ఎన్నో కష్టాలను ఓర్చుకుంటూ చేరతాడు. అక్కడ బ్రిటిష్ అధికారులు అతన్ని ప్రశ్నించినప్పుడు, అల్మాసీ తన స్వంత పేరును చెబుతాడు కాని కేథరిన్ పేరు బైట పెట్టడు. ఆ ప్రమాదంలో తన భార్య గాయపడిందని ఆమెకు సహాయం కావాలని వాళ్లని అర్థిస్తాడు. అక్కడే అతను కేథరిన్ పేరు చెప్పి ఉంటే బ్రిటీష్ సైనికులు తమ పౌరురాలి ప్రాణాలను కాపాడడానికి తక్షణ సహాయం చేసి ఉండేవారు. గుహలోకి తనను తీసుకెళుతున్న అల్మాసీతో తాను నిజంగా అతన్ని ప్రేమించానని కేథరిన్ అన్ని గాయాల మధ్యన చెబుతుంది. దానితో ఆమె పేరు పక్కన జెఫ్రీ పేరుని కలపడానికి అల్మాసి ఇష్టపడడు. దీనితో అతని కథను సీరియస్‌గా తీసుకోదు బ్రిటీష్ సైన్యం. అతనికి సహాయం అందించదు.

తరువాతి సంవత్సరాల్లో, అల్మాసీ ఉత్తర ఆఫ్రికాలో జర్మన్ గుఢాచార దళాలకి సహకారం అందిస్తాడు. ఈ సమయంలో అతను జర్మన్ ఏజెంట్ జోహన్నెస్ ఎప్లర్‌ను కైరోలోకి చేర్చడంలో సహయం చేస్తాడు. ఈ మిషన్ పూర్తి చేసిన తర్వాత, అల్మాసీకి ఎడారికి తిరిగి వెళ్ళే అనుమతి లభిస్తుంది. అక్కడ ఇసుకలో పాతిపెట్టబడిన సహోద్యోగి విమానాన్ని తిరిగి వెలికి తీసి కేథరిన్‌ను విడిచి వచ్చిన గుహకు తిరిగి వెళ్తాడు. అక్కడ కాథరిన్ అప్పటికే చనిపోయి చాలా సంవత్సరాలు అయి ఉంటుంది. అల్మాసీ కాథరిన్ మృతదేహాన్ని ఎత్తుకుని, ఆమెను ఎడారి నుండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. వారి విమానం ప్రయాణిస్తున్న సమయంలో, అది యాంత్రిక వైఫల్యానికి గురై మంటల్లో చిక్కుకుంటుంది. శరీరం మొత్తం కాలిపోతుండగా అల్మాసీ కాక్‌పిట్ గాజును పగలగొట్టి, పారాచూట్‌తో నేలపైకి దూకుతాడు. బెడౌయిన్ గిరిజనులు అతన్ని రక్షించారు, మొదట తమ నాటు వైద్యం చేసి అతన్ని బతికించి సైనిక ఆసుపత్రికి అప్పగిస్తారు.

నిజానికి అల్మాసి ఓ ప్రేమోన్మాది. హంగేరి నాగరికుడిగా ఎంచితే అతనిది బ్రిటేన్‌కి విరుద్దంగా యద్ధం చేస్తున్న దేశం అవుతుంది. అంటే కేథరిన్ దేశానికికి ఇతనిది శత్రుదేశం. కాని తాను ఏ దేశానికి చెందని వాడు అన్నది అతని వాదన. ఈ యద్ధంతో అతనికేమీ సంబంధం లేదు. అతను యద్ధం చేస్తుంది ప్రేమ కోసం. కేథరిన్ విమాన ప్రమాదంలో కొనఊపిరితో బైటపడి తాను అల్మాసిని మనస్పూర్తిగా ప్రేమించానని, అతన్ని మర్చిపోలేకపోయాకని చెప్పినప్పుడు అల్మాసి ఆమె పూర్తిగా తనది అనే భావంలోకి వెళ్లిపోతాడు. అందుకే ఆమె అసలు పేరు బ్రిటీష్ సైన్యానికి చెప్పడు. అదే ఉన్మాదావస్తలో జర్మన్ సైనికులతో కలిసి పని చేస్తాడు. కొంత కాలం తరవాత కేథరీన్ మరణించే ఉంటుందని తెలిసినా, ఆమె కోసం ఆ గుహకు వెళ్ళి ఆమె కళేబరాన్ని తీసుకువచ్చే ప్రయత్నంలో విమాన ప్రమాదానికి గురయ్యి శరీరం కాలిపోయి మంచానికి పరిమితం అవుతాడు. తానే దేశంవాడిని కానని ఎడారి ప్రాంతంవాడినని, ఎడారి ఎవరికీ చెందదని నమ్ముతాడు. అందుకే తన అవసరార్థం రెండు పక్షాల సైనికులతోనూ పని చేస్తాడు. ఇది అతనికి తప్పుగా అనిపించదు. అయితే జెఫ్రీ నిజానికి బ్రిటీష్ సీక్రెట్ ఏజంట్ అని యుద్ధ సమాచారం కోసం ఎడారి ప్రాంతంపై పట్టు సంపాదించడానికి బ్రిటీష్ ప్రభుత్వం అతన్ని అక్కడకు పంపించిందని బ్రిటీష్ ఇంటేలిజెన్స్‌కు అల్మాసి కేథరిన్‌ల సంబంధం గురించి పూర్తిగా తెలుసని కారవాగోయో అప్పుడు చెప్తాడు. ఆ గుహలో ఉంది కేథరిన్ క్లిఫ్టన్ అని తెలిస్తే ఆమెను వాళ్ళు తప్పక రక్షించి ఉండేవాళ్లని అతని మాటలవల్ల ఈ కథ వింటున్న ఇతరులకి అర్థం అవుతుంది.

కిప్ తన హెడ్‌సెట్ ద్వారా అమెరికా హిరోషిమా, నాగసాకిపై బాంబు దాడి చేసిందని తెలుసుకుంటాడు. ఇది అతన్ని తీవ్రంగా కలిచివేస్తుంది. అన్నీ మరచి, తన అన్న స్వాతంత్ర స్పూర్తిని పక్కకు పెట్టి తాను ఇంగ్లండ్ సైన్యంతో చేరి పని చేయడం, ఇక్కడ ఇటలీలో బాంబులను ఏరి ప్రాణాలకు తెగించి పని చేస్తూ పోవడం, ఇదే పనిలో తన గురువు మరణించడం అతనికి మరోసారి గుర్తుకు వస్తాయి.

నిజానికి కిప్ తన ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తుంది ఇటలీ ప్రాంతంలో తమ వర్గపు సైనికులు పాతి పెట్టిన బాంబులను ఏరేసి ఇటలీని శుభ్రపరచడానికి. ఒక పక్క తన లాంటి సిప్పర్లతో అప్పటిదాకా శత్రుదేశంగా భావించిన ఇటలీని శుభ్రపరుస్తున్న దేశాలు, శత్రుదేశం అంటూ జపాన్‌పై ఇంత దారుణంగా దాడి చేయడం భరించలేకపోతాడు కిప్. నిజానికి ఇటలీ, జపాన్ రెండూ దేశాలు జర్మనితో కలిసి ఇతర దేశాలతో యద్ధం చేశాయి. మరి ఇటలీలో తాము పెట్టిన బాంబులను తీసేస్తూ ప్రాణాలతో తాము నిత్యం చెలగాటం ఆడుతుంటే అటు జపాన్‌పై శత్రుదేశం అంటూ అమెరికా బాంబులు విసరడం వెనుక కారణం ఏంటీ? ఇటలీ తెల్లజాతివారి దేశం, జపాన్ ఆసియా దేశం అవడమేనా. ఈ ఆలోచన అతనిలో కోపాన్ని పెంచుతుంది. అప్పటిదాకా మిత్రుడిగా భావించిన ఇంగ్లీష్ పేషేంట్ పై తుపాకి ఎక్కుపెడతాడు. కాని అతను ఇంగ్లీష్ వాడు కాదే. హంగేరికి చెందినవాడు. ఈ కోపంలో, అయోమయంలో కిప్ అల్మాసిని గాయపరచబోతాడు. హానా అతన్ని ఆపుతుంది.

కిప్ వేసే ప్రశ్నలకు అతనిలోని సంఘర్షణను అర్థం చేసుకున్న కారవాగియో తెల్ల జాతి దేశాలపై ఆ రకమైన బాంబును ఏ యూరోపియన్ దేశం వేయలేదని బదులిస్తాడు. ఇటలీలో పుట్టీ కెనడాలో జీవించి ఈ రెండు దేశాలు శత్రుదేశాలుగా మారి యద్ధం చేస్తుంటే అందులో కెనడా పక్షాన నిలిచి, ఇటలీ సైనికుల క్రూరత్వాన్ని చవి చూసిన కారవాగియో ఈ యుద్ధోన్మాదానికి మౌన సాక్షి. అతను చెప్పిన ఈ సత్యం కిప్‌కు యద్ధంలోని మరో కోణాన్ని, మరో రకమైన వివక్షను చూపిస్తుంది. తెల్లవారి కోసం తన దేశ ప్రజల మనోభావాలను పక్కన పెట్టి తాను పని చేయడం నిరర్ధకమని, తాను ఎప్పటికీ అక్కడ పరాయివాడినే అని అర్థం అవుతుంది. విరక్తితో ఆ విల్లా నుండి బయలుదేరి, తన శ్వేతజాతి సహచరులకు దూరంగా, భారతదేశానికి తిరిగి వచ్చేస్తాడు. అక్కడే అతను వివాహం చేసుకుంటాడు. ఇద్దరు పిల్లలకు తండ్రి అవుతాడు. అయినా అతనికి అక్కడ హనా గుర్తుకొస్తూనే ఉంటుంది. కిప్ వెళ్లిపోయాక హానా తన మారుటి తల్లికి ఉత్తరం రాస్తుంది. కెనడాలో పుట్టిన ఆమె ఇటలీలో మారుటి తల్లి నీడలో ఉండడానికి మానసికంగా తనను తాను సిద్దం చేసుకుంటుంది.

నిజానికి యుద్ధమే ఒక ఉన్మాదం. ప్రేమ మరో రకమైన ఉన్మాదం. యుద్ధోన్మాదం నడుమ ప్రేమోన్మాదాన్ని  మేళవించి రెండు కథలను, రెండు రకాల ఉన్మాదాలను దాన్ని అంటుకుని ఉన్న మానవ అహం, నాది అన్న స్వార్థం, గెలుపు కోసం చరిత్రలో జరిగిన పోరును రచయిత చెప్పిన విధానంలో చాలా లోతు ఉంది. జెఫ్రి, అల్మాసి నడుమ కేథరిన్ గురించి యద్ధం నడుస్తుంది. జెఫ్రీ అల్మాసిపై అక్కసుతో అతన్ని చంపబోయి మరణిస్తాడు. కేథరిన్ గాయల పాలవుతుంది. ఆమె తనదే అన్న భావంతో జెఫ్రీ ఆమె మరణానికి పరోక్షంగా కారణం అవుతాడు. మరణానంతరం ఆమెను తనదానిగా సాగనంపాలనే ఉన్మాదంతో తిరిగి ప్రమాదానికి గురయి మరణానికి చేరువవుతాడు.

రెండవ ప్రపంచ యద్ధంలో కనిపించేదీ మానవ ఉన్మాదమే. జర్మనీని నియంత్రించడానికి యద్ధం చేసిన దేశాలు చివరకు యద్ధం ముగిసే సమయంలో జపాన్‌పై దాడికి దిగడం గురించి రకరకాల వాదనలు ఉన్నాయి. సాంప్రదాయవాదులు ఈ బాంబు దాడి అవసరం అని వాదించినా రివిజనిస్టులు, జపాన్ సరెండర్ అవబోతున్న సమయంలో ఈ బాంబు దాడి మిలిటరీ పరంగా అనవసరం అని రాజకీయ కారణాలతో అమెరికా ప్రయోగించిందని చెబుతారు. కాని ఒక ఆసియా దేశంపై జరిగిన ఈ దాడి వెనుక జాత్యంకారాన్ని, తమ అహాన్నీ ప్రదర్శించుకోవడానికి తమకన్నా తక్కువ స్థాయిగా భావించిన వారిపై జరిగే బల ప్రదర్శననూ ఈ నవల ప్రశ్నిస్తుంది. ఇలాంటి బాంబు దాడి ఓ యూరోపియన్ దేశం మరో తెల్లజాతి దేశంపై చేయగలదా? అన్న ప్రశ్నే కిప్ పాత్రలోని సంఘర్షణకు కారణమవుతూ అంతర్లీనంగా ఉన్న జాతి వివక్ష వైపుకు, మానవ ఉన్మాదం వైపుకు చర్చ దారితీసేలా చేస్తుంది.

కిప్‌కు పశ్చిమ తూరుపు దేశాల నడుమ ఉన్న ఈ మరో వివక్ష అర్థమయిన తరువాత హానాతో తన సంబంధం అర్థరహితంగా కనిపిస్తుంది. కొన్నిసార్లు వ్యక్తిగతం అంటూ ఏదీ ఉండదు, అంతా రాజకీయమే. యద్ధం నడుమ మానవ సంబంధాలలో పర్సనల్ అంటూ ఏమీ ఉండదు, అంతా పొలిటికలే అన్న వాదానికి బలం చేకూర్చే నవల ఇది. మానవ అహం యద్ధం ప్రేమ రెంటిలోనూ ప్రధాన పాత్ర వహిస్తుందన్న నిజాన్ని చాలా విశ్లేషణాత్మకంగా చర్చించిన నవల ‘ది ఇంగ్లీష్ పేషెంట్’.

ఈ కల్పిత కథలో రచయిత కొన్ని నిజ జీవిత పాత్రలను ఆధారం చేసుకున్నారు. 1930ల ఈజిప్టులో ప్రసిద్ధ ఎడారి అన్వేషకుడిగా, రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మన్ వైపుకు సహాయం చేసిన లాస్లో అల్మాసీ ఆధారంగా ప్రధాన పాత్రను మలిచారు. కాని నిజానికి అల్మాసీ ఇటలీలో కాలిన గాయాలకు మరణించలేదు. యుద్ధం నుండి బయటపడి 1951 వరకు జీవించాడు. అలాగే కిప్ గురుపు సఫోల్క్ పాత్రను రచయిత చార్ల్స్ హవార్డ్ అనే వ్యక్తి ఆధారంగా సృష్టించారు ఆయన సఫోల్క్ అనే ప్రాంతానికి 20వ అర్ల్. ఈయన బాంబులను నిర్వీర్యం చేసే సమయంలోనే ప్రమాదానికి గురయి మరణించారు. కారవాగియో వివరించే యుద్ద ఘట్టాలు కూడా నిజంగా జరిగినవే. ఇలా వాస్తవ సంఘటనల నడుమ కల్పిత కథను అల్లిన రచనలను చారిత్రిక రచనా సాహిత్యం (Historiographic metafiction) గా సాహితీకారులు అభివర్ణిస్తారు. ఈ శైలిలో వచ్చిన గొప్ప నవల ‘ది ఇంగ్లీష్ పేషెంట్’.

Exit mobile version