[పోర్టర్ వాగనర్ పాడిన ‘ది లాస్ట్ వన్ టు టచ్ మీ’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]
- పోర్టర్ వాగొనర్ – ‘ది లాస్ట్ వన్ టు టచ్ మీ’ (1971)
- రచన – డాలీ పార్టన్
- ఆల్బమ్ – సింపిల్ యాజ్ ఐ ఆమ్
- ప్రొడ్యూసర్ – బాబ్ ఫర్గుసన్
~
కంట్రీ గాయకుల జోడీలలో అత్యంత ప్రజాదరణ పొందిన జోడి డాలీ పార్టన్, పోర్టర్ వాగనర్. వీరిద్దరూ కలిసి పాటలు పాడటమే కాకుండా చాలా పాటలను స్వయంగా రాసుకునేవారు. ఒకరు రాసిన పాటలను మరొకరు గానం చేసేవారు. ఈ ఇద్దరు కళాకారుల ప్రతిభను సంపూర్ణంగా అస్వాదించారు ఆ నాటి కంట్రీ అభిమానులు. నిజానికి పోర్టర్ ఎక్కువగా విషాద గీతాలను పాడేవాడు. డాలీ పార్టన్ సంగీత ప్రపంచంలో అడుగుపెట్టిన తర్వాత వీరిద్దరూ కలిసి ఇచ్చిన ప్రదర్శనలలో ఒకరితో మరొకరు ప్రభావితమై పోర్టర్ ఉత్సాహవంతమైన పాటలను పాడడం మొదలెట్టాడని సంగీతాభిమానులు చెప్తారు. పోర్టర్ గానం చేసిన ప్రేమ గీతాల సంఖ్య తక్కువే అయినా వాటిని కూడా అంతర్లీనంగా ఆనందంతో పాటు విషాదం అంటుకుని ఉండేది. అది బహుశా పోర్టర్ శైలి కావచ్చు కాని ఆ ప్రేమ గీతాల విషాదంలో ప్రేమ లోతులతో పాటు అసహాయత ధ్వనిస్తూ ఆ పాటలకు వింత ఆకర్షణను చేకూర్చేది. అలాంటి ఓ ప్రేమ గీతమే డాలీ పార్టన్ రాయగా పోర్టర్ గానం చేసిన ‘ది లాస్ట్ వన్ టు టచ్ మీ’.
If there ever was an angel then surely you must be one
If there ever was a perfect love when I look at you I see one
If there’s heaven on earth then this must surely be
And I want you to be the last one to touch me
మనుషులు తమ జీవితాలని ఎవరితో గడపాలో కోరుకుంటారు. తాము ప్రేమించే వ్యక్తి చేతుల్లోనే మరణించాలనే కోరిక అతి తీవ్రమైన ప్రేమోన్మాదంలో కలుగుతుంది. ఎవరితోనో జీవన ప్రయాణం మొదలెట్టాలని నిర్ణయించుకోవడం ఒక విషయం అయితే, అదే వ్యక్తితో జీవితాన్ని సంపూర్ణంగా గడిపి ఆ వ్యక్తి నీడన మరణించాలని కోరుకోవడం ఆ జంటకు ఒకరిపై ఒకరికున్న నమ్మకం, గౌరవానికి పరాకాష్ఠ. ఈ పాటలో గాయకుడు తన ప్రేయసిలో దేవదూతను చూస్తున్నాడు. తమది పవిత్రమైన ప్రేమ అని అతనికి గొప్ప నమ్మకం. ఆమె సమక్షంలో గడిపే జీవితం స్వర్గం అన్న నమ్మకం అతనిది. కాని ఏదో ఒక రోజు మరణం తమని విడదీస్తుందన్నది వారిద్దరికీ తెలుసు. అతను మాత్రం ఈ ప్రపంచం నుండి నిష్క్రమించే రోజున తనను తాకవలసిన ఆఖరి వ్యక్తి ఆమె అని, ఆమె స్పర్శ ఈ జన్మకు ఆఖరి మానవ స్పర్శ కావాలని కోరుకుంటున్నాడు. ఈ పల్లవిని పోర్టర్ గానం చేసిన విధానం చాలా బావుంటుంది. మనసును మెలి పెట్టిన భావన కలుగుతుంది. ఆ ప్రేమ తీవ్రత మనల్ని కూడా తాకి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ప్రేమ మాత్రమే కాక అమోఘమైన భక్తి భావం అతనిలో మనకు కనిపిస్తుంది. భౌతిక స్పర్శను ప్రాపంచిక ప్రేమ, ప్రశాంతమైన నిద్ర మరణానంతర జీవితం మధ్య వారధిగా పరిగణిస్తూ అన్ని సందర్భాలలో తన పక్కన తోడుగా ఆమె మాత్రమే నిలిచి ఉండాలని అతను కోరుకుంటున్నాడు. .
The last thing I remember before I go to sleep
Is the touch of your sweet lips softly kissing me
And I go to sleep a thinking how happy you make me
And I want you to be the last one to touch me
అతని రోజు ఆమెతో మొదలయి ఆమెతోనే ముగుస్తుంది. ఆమె తీయటి పెదవుల స్పర్శను గుర్తు చేసుకుంటూ అతను ప్రతి రోజు నిద్రిస్తాడు. ఈ ప్రపంచం నుండి నిష్క్రమించే ఆఖరి క్షణాలలో అమె స్పర్శే వీడ్కోలు పలకాలని అతని కోరిక. గాయకుడు తన భాగస్వామిని దేవదూతగా, సంపూర్ణ సురక్షితమైన స్వర్గ నిర్మాతగా వర్ణిస్తూ, ఆమె స్పర్శను ‘భూలోక స్వర్గం’తో పోలుస్తున్నాడు. నిద్రను రూపకాలంకారంగా మరణంతో ముడిపెడుతూ, ప్రియురాలి చివరి స్పర్శతోనే తాను ‘శాశ్వత నిద్ర’లోకి జారుకోవాలని బలంగా కోరుకుంటున్నాడు. అదే మరణానంతర జీవితంలోకి తాను ప్రశాంతంగా ప్రవేశించేలా చేస్తుందనే నమ్మకం అతనిది.
And when it’s time to lay me down for my eternal sleep
Once more let your fingers softly touch my cheek
If I know that you have touched me then I can sleep in peace
And I want you to be the last one to touch me
(నన్ను శాశ్వత నిద్రలోకి నెడుతున్నప్పుడు, ని చేతి వేళ్లు మెత్తగా నా బుగ్గను నిమరాలని నా కోరిక. నువ్వు నన్ను స్పృశించావన్నది నాకు తెలిసినప్పుడే నేను ప్రశాంతంగా నిద్రించగలను. అందుకే నన్ను తాకే ఆఖరి వ్యక్తివి నువ్వే కావాలని కోరుకుంటున్నాను)
ప్రతి రోజు నిద్రిస్తూ ఆమె తన పక్కనే ఉండలని కోరుకుంటున్న అతనికి శాశ్వత నిద్రలోకి జారే సమయాన కూడా ఆమె తోడే కావాలని, ఆమె తన చెంతనుండి తనకు వీడ్కోలు పలకాని, తన చేతులతో మెత్తగా తన ముఖాన్ని స్పృశించాలని, అలా జరిగినప్పుడే ఆ శాశ్వత నిద్రలోకి తాను ప్రశాంతంగా జారుకోగలనని అతను నమ్ముతున్నాడు.
And when the night is over and time will be no more
They say that we shall meet again upon the golden shore
And so when I awaken from my eternal sleep
I want you to be the first one to touch me
I want you to be the first the last the only one to touch me
(రాత్రి గడిచిపోయి ఇక మనకంటూ సమయం మిగలనప్పుడు, ఆ బంగారు తీరం ఆవల మనం తిరిగి కలుస్తాం అంటారంతా. అక్కడ నేను నా శాశ్వత నిద్ర నుండి మేల్కొన్న వెంటనే నన్ను ముట్టుకునే మొదటి వ్యక్తివి నువ్వే కావాలని కోరుకుంటున్నాను. నువ్వు నన్ను స్పృశించి మొదటి వ్యక్తివి, చివరి వ్యక్తివి కూడా కావాలన్నదే నా కోరిక)
మరణం తర్వాత వైతరణీ దాటాక ఆవలి ఒడ్డున తాము తిరిగి కలుసుకుంటాం అని అతను నమ్ముతున్నాడు. అప్పుడు కూడా ఆమే తనను స్పృశించే మొదటి వ్యక్తి కావాలని అతని కోరిక. తనను ముట్టుకునే మొదటి చివరి వ్యక్తి, మొదటి వ్యక్తి కూడా ఆమే కావాలన్న తన కోరిక బయటపెడుతూ ఆమె తనకెంత ముఖ్యమే చెప్పడం గాయకుని ఉద్దేశం.
డాలీ పార్టన్ ఈ పాటను గాఢమైన, శాశ్వతమైన ప్రేమను ప్రతిబింబిస్తూ రాశారు పోర్టర్ వాగోనర్ దీనిని తన ‘సింపుల్ యాజ్ ఐ యామ్’ ఆల్బమ్‌లో విడుదల చేశారు. ఇది 1971 ప్రారంభంలో US కంట్రీ చార్టులలో 18వ స్థానానికి చేరుకుంది. వాగోనర్ మొదట దీనిని సింగిల్‌గా రికార్డ్ చేసినా, పార్టన్ కూడా తన సొంత వెర్షన్‌ను తర్వాత పాడారు. తరువాత జార్జ్ జోన్స్, కాన్వే ట్విట్టీ, కిట్టీ వెల్స్ లాంటి కంట్రీ దిగ్గజాలు ఈ పాటను తమ గాత్రంలో తిరిగి రికార్డు చేసారు. ఇంత మంది ఈ పాటను గానం చేసినా పోర్టర్ గాత్రంలో ధ్వనించే ఆనందపు విషాదం శ్రోతలను అలరిస్తుంది. ప్రతి పదాన్ని స్పష్టతతో హృదయ లోతుల్లోంచి వెలికి తీసినట్టుగా పోర్టర్ పాడిన గీతం ఉంటుంది. నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టమయిన ప్రేమ గీతాలలో ఇది ఒకటి. డాలి ఈ పాటను రాసినా, ఆమె గానం చేసిన వెర్షన్ కన్నా పోర్టర్ గొంతులో ఈ పాటకొక నిండుతనం వచ్చిందన్నది నా అభిప్రాయం.
ఈ పాటను క్రింది యూ ట్యూబ్ లింక్ ద్వారా విని ఆనందించండి.
https://www.youtube.com/watch?v=0XXipHg3t60

