[హాంక్ థాంప్సన్ పాడిన ‘ది ఓల్డర్ ది వాయిలెన్, ది స్వీటర్ ది మ్యూజిక్’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]
- హాంక్ థాంప్సన్ – ది ఓల్డర్ ది వాయిలెన్, ది స్వీటర్ ది మ్యూజిక్
- ఆల్బమ్ – ది పాథ్‌వే ఆఫ్ మై లైఫ్ (1973)
- రచన – కర్లీ పుట్‌మాన్
~
అతని బ్యాకింగ్ బ్యాండ్, బ్రాజోస్ వ్యాలీ బాయ్స్, వరుసగా 14 సంవత్సరాలు టాప్ కంట్రీ వెస్ట్రన్ బ్యాండ్‌గా బిల్బోర్డ్ ద్వారా ఎంపిక చేయబడింది. తన గాత్రాన్ని మెరుగుపరచుకోవడానికి స్వింగ్ వాయిద్యాలను ఉపయోగించేవాడు హాంక్. అందుకే ఈయన పాటలు నిత్యం ఉత్సాహంగా ధ్వనిస్తూ ఉంటాయి. పార్టీ నృత్యాలకు అనుకూలంగానూ ఉంటాయి.
‘ది ఓల్డర్ ది వాయిలెన్, ది స్వీటర్ ది మ్యూజిక్’ హాంక్ థాంప్సన్ రికార్డ్ చేసి విడుదల చేసిన ప్రసిద్ధ కంట్రీ పాట. కర్లీ పుట్‌మాన్ రాసిన ఈ పాట మొదట 1973 జూలైలో విడుదలైంది. థాంప్సన్ ఉపయోగించే సాంప్రదాయ ‘హాంకీ-టాంక్’, ‘వెస్ట్రన్ స్వింగ్’ శైలికి చక్కని ఉదాహరణగా నిలిచిన ఈ పాట, 1974 వరకు కంట్రీ సంగీత చార్ట్‌లలో ప్రజలు మెచ్చే సింగిల్‌గా కొనసాగింది.
వయసు పైబడినవారు తమ ప్రేమాన్వేషణను సమర్థించుకుంటూ పాడుకునే ఈ పాట చాలా సరదాగా సాగుతుంది. ఈ పాట సాహిత్యం కన్నా దీన్ని హాంక్ పాడిన విధానం చాలా బావుంటుంది. నలభై ఐదేళ్ళ వయసులో తమకున్న అనుభవం దృష్ట్యా తమను గొప్ప ప్రేమికులుగా పరిగణించాలంటూ వయోలిన్ ఎంత పాతదైతే దాని నుండి అంత మధురమైన ద్వని వస్తుందన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఈ పాటకు గొప్ప ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని, హాస్యాన్ని జోడిస్తూ గానం చేస్తాడు హాంక్.
It seems you think that 45 is just a little too old now
But I’m not ready yet to be put out in the cold now
I got plenty of good love left woman if you’ll just use it
You know the older the violin the sweeter the music
(నాకు 45 ఏళ్లు అంటే, అది మరీ ఎక్కువ వయసు అని నువ్వు అనుకుంటున్నట్లున్నావు కానీ, నన్ను చల్లదనంలోకి నెట్టేసే సమయం ఇంకా రాలేదు. నాలో ఇంకా ఎంతో ప్రేమ మిగిలే ఉంది, నువ్వు దాన్ని స్వీకరిస్తే చాలు. వయసు మళ్లిన వయొలిన్ నుండే, మధురమైన సంగీతం వస్తుందని నీకు తెలుసు కదా)
And I can play a symphony of love
Like a thousand violins singing from above
You’re gonna really miss my loving one day when you lose it
You know the older the violin the sweeter the music
(పైనుండి వెయ్యి వయోలిన్‌లు గానం చేస్తున్నట్లుగా నేను ప్రేమ సింఫనీని వాయించగలను. ఏదో ఒక రోజు నా ప్రేమను నువ్వు కోల్పోయినప్పుడు, దాని లోటు నీకు తెలుస్తుంది. వయోలిన్ పాతబడే కొద్దీ, దాని సంగీతం మరింత మధురంగా ఉంటుందని నీకు తెలుసు కదా)
సింఫనీ అంటే పూర్తి ఆర్కెస్ట్రాతో జరిగే ఒక పెద్ద సంగీత కచేరి. అంత గాఢతతో తాను ఆమెను ప్రేమించగలనని అతను వాగ్దానం చేస్తున్నాడు. తాను ఆమెకు అందించబోయే శారీరిక తృప్తిని గురించి అతను చెప్పుకుంటున్నట్లు దీన్ని విశ్లేషించుకుంటారు శ్రోతలు. కాని దాన్ని వ్యక్తీకరించే తీరులో ఇక్కడ అసభ్యత ఉండదు. ఇక్కడ భావోద్వేగం పాలు ఎక్కువగా ఉండేటట్లు రచయిత, గాయకుడు ఇద్దరూ జాగ్రత్తపడిన విధానాన్ని మెచ్చుకోవాలి. శారీరిక క్రియను పచ్చి శృంగారంగా, జంతు వాంఛగా, కేవలం ఓ అవసరంగానో, లేదా దాన్నే ప్రేమాస్వాదనగానూ సౌందర్యానుభూతిని రంగరిస్తూ కూడా వ్యక్తీకరించవచ్చు. క్రియ అదే, కాని దాన్ని ప్రస్తావించే విధానంలోనే అనుభూతి స్థాయి మారుతుంది.
ఈ పాటలో ఓ మధ్యవయసు వ్యక్తి మళ్లీ ప్రేమను ఆస్వాదించడానికి సిద్దపడుతూ తన వయసు తనకు అడ్డు కాదనీ, అదే తనను గొప్ప ప్రేమికుడిగా మారుస్తుందని చెప్పడంలో వెకిలితనం కన్నా సౌందర్యోపాసనే ద్వనించేటుగా చాలా జాగ్రత్తగా ఈ పాటను గానం చేసాడు హాంక్. అందుకే ఇది అందరూ సరదాగా నవ్వుకుంటూ ఆస్వాదించే గీతం అయింది.
These specks of gray that’s in my hair just make me look distinguished
They don’t mean I’m over the hill baby I’m not extinguished
There’s plenty of young girl’s waiting for my love honey they won’t refuse it
They know the older the violin the sweeter the music
(నా జుట్టులో కనిపిస్తున్న ఈ తెల్ల వెంట్రుకలు నాకు ఒక ప్రత్యేకమైన హుందాతనాన్ని ఇస్తాయి. అవి నా కాలం చెల్లిపోయిందని కాదు నాలో తరగని ఉత్సాహాన్ని సూచిస్తున్నాయి. నా ప్రేమ కోసం ఎంతోమంది యువతులు వేచి చూస్తున్నారు, వారు నన్ను కాదనరు. ఎందుకంటే, వయసు మళ్ళిన వయోలిన్ నుండే మధురమైన సంగీతం వస్తుందని వారికి తెలుసు)
అతని తెల్ల జుట్టు అతన్ని హుందాగా మారుస్తుండట. తన వయసయిపోయిందని కాక తనలో తరగని ఉత్సాహానికి అది ప్రతీక అట. అతని ప్రేమ కోసం ఇప్పటికీ ఎందరో యువతులు వేచి చూస్తున్నారని అతను గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే పాత వయోలిన్ నుండి ఎంత మధురమైన సంగీతం వస్తుందో వాళ్ళకు తెలుసట.
నిజానికి ఇక్కడి ఇది ఓ వయసు మళ్ళిన పురుషుడు పాడుతున్న పాటే కాని ఎక్కడా ఇది ఆ జెండర్‌కే పరిమితం అయినట్లు కనిపించదు. అప్పటి పరిస్థితులలో ఇది స్త్రీలు బిగ్గరగా పాడుకోలేని గీతం కాని నేడు చాలా మంది స్త్రీలు సరదాగా ఈ పాటను తమకు అన్వయించుకుంటూ పాడుకుంటున్నప్పుడు కాలంతో సమాజంలో కొన్ని వర్గాలలో వచ్చి చేరిన మార్పులు మనకు ప్రస్పుటంగా కనిపిస్తూ ఉంటాయి. ప్రేమకు వయసుతో సంబంధం లేదని ఇప్పుడు చాలా మంది నమ్ముతున్న సందర్భంలో కంట్రీ సంగీతాన్ని అభిమానించే వారందరికీ ఈ పాట దగ్గరయింది. ఈ పాట సాహిత్యాన్ని ఓరగా వింటూ విమర్శించే వారికి కూడా హాంక్ దీన్ని గానం చేసిన తీరుకు పెదవులపై చిరునవ్వు రాకుండా ఆపుకోవడం అసాధ్యమే. అది హాంక్ గొప్పతనం. పచ్చి శృంగారంతో నిండి ఉన్న ఈ సాహిత్యాన్ని తన గంభీరమైన గొంతుతో ప్రజల ఆమోదం అందుకునే ప్రేమగీతంగా మార్చగలిగాడు.
And I can play a symphony of love
Like a thousand violins singing from above
You’re gonna really miss my loving one day when you lose it
You know the older the violin the sweeter the music
(పైనుండి వెయ్యి వయోలిన్‌లు గానం చేస్తున్నట్లుగా నేను ప్రేమ సింఫనీని వాయించగలను. ఏదో ఒక రోజు నా ప్రేమను నువ్వు కోల్పోయినప్పుడు, దాని లోటు నీకు తెలుస్తుంది. వయోలిన్ పాతబడే కొద్దీ, దాని సంగీతం మరింత మధురంగా ఉంటుందని నీకు తెలుసు కదా)
రెండు సార్లు ఈ చరణం మళ్ళీ రిపీట్ అవుతున్నప్పుడు హాంక్ గొంతులోని చిలిపితనం, కోరిక, సరదా, అన్నీ కలగలిసి వినిపిస్తూ ఉంటాయి.
And I can play a symphony of love
Like a thousand violins singing from above
You’re gonna really miss my loving one day when you lose it
You know the older the violin the sweeter the music
(పైనుండి వెయ్యి వయోలిన్‌లు గానం చేస్తున్నట్లుగా నేను ప్రేమ సింఫనీని వాయించగలను. ఏదో ఒక రోజు నా ప్రేమను నువ్వు కోల్పోయినప్పుడు, దాని లోటు నీకు తెలుస్తుంది. వయోలిన్ పాతబడే కొద్దీ, దాని సంగీతం మరింత మధురంగా ఉంటుందని నీకు తెలుసు కదా)
హాంక్ పాడిన చాలా పాటలు ఇదే రీతిలో, ఇంతే ఉత్సాహంగా సాగుతాయి. అమాయకంగా ఏమీ ఎరగనట్లు స్వరాలు పలుకుతూ, ఇలాంటి మర్మగర్భమైన శృంగార గీతాలను ప్రజల మధ్యకు తీసుకురావడంలో అతను నేర్పరి. స్త్రీ పురుష పొందు గురించే ఎక్కువ గీతాలున్నా, వీటిని క్లాస్ మాస్ శ్రోతలందరూ ఇష్టపడడానికి ముఖ్య కారణం అతను పాడే శైలి. ఆ అమాయక గొంతులో ద్వనించే అమాయకత్వం మాటున దాగున్న కొంటెతనాన్ని ఆస్వాదించడానికి హాంక్ పాటలను మళ్లీ మళ్ళీ వినాలి. ఇవేం పాటలంటూ కొట్టిపడేయలేం, అతని ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేం.
ఈ పాటను క్రింది లింక్‌లో వినవచ్చు.
https://www.youtube.com/watch?v=ywVDIlxg7Xc

