[శ్యామ్ మైల్‌స్టోన్ గారి ‘ది స్కాటిష్ గర్ల్’ అనే నవలని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
శ్యామ్ మైల్‌స్టోన్ ఓ విభిన్నమైన ప్రేమకథని ‘ది స్కాటిష్ గర్ల్’ అనే పేరుతో నవలగా అందించారు. తాను ప్రేమించిన అమ్మాయి కోసం – ప్రపంచంలోని అనేక దేశాలు తిరిగి అక్కడి సంస్కృతులను అవగాహన చేసుకుని, కథనంలో భాగంగా అక్కడ జరిగిన చారిత్రక ఘటనలను క్లుప్తంగా వివరిస్తూ.. నవలను సృజించారు. అలాగే మూడు నెలల పాటు దక్షిణ భారతదేశమంతా తిరిగి ఆ ప్రాంతాలను, మనుషులను కథలో భాగం చేశారు. ఆయా యాత్రలను తానూ, తన ప్రేయసి పాత్రలుగా చేసిన ప్రయాణాలుగా పేర్కొన్నారు. ఇది ఆయన స్వీయ ప్రేమ కథ. ఒక రచయిత తన సొంత కథనే నవలగా మలచడం, తానే ప్రధాన పాత్ర అవడం మనం గతంలో కొన్ని పుస్తకాలలో చూసి ఉంటాం, కానీ ఇది భిన్నమైన నవల. తమది జన్మజన్మల బంధం అని నాయకుడికి తెలియడం, 2087లో ప్రారంభించి కాలంలో వెనక్కి వెళ్ళి 2018 వరకు విహరించడం.. ఆయా కాలాలలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలను సన్నివేశాలుగా మలచడం.. వంటివి నవలని ‘ఎంగేజింగ్’గా చేస్తాయి. తమ ప్రేమ కథ మామూలు ప్రేమకథలా మిగిలిపోకూడని భావించిన రచయిత, వివిధ దేశాల నడుమ ప్రయాణాలని నేపథ్యంగా మార్చి, ఒకే సమయంలో ప్రేమకథ, ట్రావెలోగ్ చదువుతున్న భావన కలిగించడంలో విజయవంతమయ్యారు. ప్రయాణాలంటేనే ఆసక్తికరంగా ఉంటాయి, ఇక ప్రేమ జంట చేసే ప్రేమయాత్రల సంగతి చెప్పాలా? ఈ జంటవి కాలంలో ప్రేమయాత్రలు!
తాను ఇష్టపడిన అమ్మాయి కోసం, ఆ అమ్మాయి ప్రేమని దక్కించుకోడం కోసం కథకుడు ట్రావెల్ ఏజన్సీ స్థాపించి జీవితంలో ఎదుగుతాడు. అలానే తనకి ఇష్టమైన క్రియేటివ్ ఫీల్డ్ లోనూ విశేష కృషి చేసి, నవల రాసి, సినిమాలు తీసి విజయం సాధిస్తాడు. కలలు కన్న జీవితాన్ని నిజం చేసుకుంటాడు. ఓ విజేతగా తన జీవితాన్ని తరచి చూసుకుంటూ, దాన్నే రచనగా పాఠకుల ముందుంచుతాడు. నవలలో నాయకుడికి పేరు లేదు. అతని ప్రేయసిని బేబీ అని వ్యవహరిస్తాడు.
~
బేబీ 91వ బర్త్ డే వేడుకలతో కథ 2087లో ఎడిన్బరా లో మొదలవుతుంది. అప్పటికి వాళ్ళ పెళ్ళై 65 ఏళ్ళు. తమ పాలస్‌లో ఆమె పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతాయి. తరువాత బేబీ, అతను కలిసి తమ సొంత విమానంలో Faroe Island కి వెళతారు. తాము ప్రేమికులుగా ఉన్నప్పుడు ఎన్నో ఏళ్ళ క్రితం అక్కడ గడిపిన అనుభూతులును గుర్తు చేసుకుంటారు. ఇష్టమైన ప్రదేశంలో, మనసైన నెచ్చెలి ఒడిలో ప్రాణాలు వదులుతాడు అతను. ప్రాణం పోయినా, ఆమె మనసునిండా అతనే నిలిచి, ఆమె తలపులలో బ్రతికి ఉంటాడు. ఆమె జ్ఞాపకాలోంచి ఊపిరిపోసుకుని.. తమ ప్రేమ కథని పాఠకులకు వివరిస్తాడు.
~
బేబీకి తన ప్రేమని తెలియజేయడానికి 18 జూలై 2019 నాడు, భావుకత నిండిన ఒక అద్భుతమైన ప్రేమ లేఖ వ్రాసి బేబీకి ఈమెయిల్ చేస్తాడతను. రెండు మూడు రోజుల తర్వాత ఆమె నుంచి రిప్లయ్ ప్రతికూలంగా వస్తుంది.
జూలై 2020. కారులో వెళ్తుండగా, మార్చ్ నెలలో తనకి కోవిడ్ సోకడాన్ని గుర్తు చేసుకుంటాడు. ఓ బిజినెస్ పని మీద ముంబై వెళ్ళాల్సి రావడం, ఫ్లయిట్స్ లేకపోతే, కార్లో బయల్దేరడం, అక్కడికి చేరాకా కరోనా పాజిటివ్ అని తేలడం, అక్కడివాళ్ళు క్వారంటైన్ చేయమనడం చెప్పుకొస్తాడు. కానీ, తనకేదన్నా అయి పరాయి ప్రాంతంలో పోవడం ఇష్టం లేక, రిస్క్ చేసి, కారు నడిపి, ఎక్కడా ఆగకుండా హైదరాబాద్ చేరుకుంటాడు. గాంధీ హాస్పటల్‌లో కరోనా వార్డులో చేరి, నానా ఇబ్బందులు ఎదుర్కుని, చిక్కి శల్యమై బయటపడతాడు.
అక్టోబర్/నవంబర్ 2020. తన ప్రేయసి జ్ఞాపకాలను గుర్తు చేసుకునేందుకు దుబాయ్ వెళ్తాడు. అక్కడ కోవిడ్ RT PCR టెస్ట్ చేసి, రిపోర్ట్ వచ్చేవరకూ హోటల్‌లోనే ఉండాలని ఆదేశిస్తారు అధికారులు. రెండో రోజున నెగటివ్ రిపోర్ట్ రావడంతో ఊపిరి పీల్చుకుని మిత్రుడితో కలిసి నగరంలోకి వెళ్తాడు. చూడాలనుకున్న ప్రదేశాలు చూసి, ఒక చోట స్కై డైవింగ్ చేస్తాడు. కుదిరినప్పుడు బేబీతో కూడా ఈ స్కై డైవింగ్ చేయించాలని భావిస్తాడు. ఒక మాల్‌లో ఉన్న కాఫీ షాప్‍లో కూర్చుంటాడు. మది అంతా ఆమె తలపులతో నిండిపోవడంతో, ఆమె తన ఎదురుగా ఉన్నట్టు భావిస్తాడు. ఇంతలో కాఫీ తెచ్చిన వెయిట్రెస్ పిలవడంతో, ఆ మాయ వీడుతుంది. దుబాయ్‍లో దిగిన ఫోటోలు ఆమెకు పంపుతాడు. ‘నా కోసం దుబాయ్ వెళ్ళావా’ అంటూ ఆశ్చర్యపోతుందామె.
ఆగస్ట్ 2021. బేబీని కలవడానికి బయల్దేరి, దుబాయ్‌లో ఆగుతాడు. ఆమెను కలవడానికి, ఆమె ప్రేమను పొందడానికి చేసిన ప్రయత్నాలను గుర్తు చేసుకుంటాడు. తొలిసారిగా Edinburgh లో అడుగిడతాడు. క్యాబ్ డ్రైవర్ ఇండియాని తక్కువ చేసి మాట్లాడితే సహించడు, గట్టిగానే కౌంటర్ ఇస్తాడు. క్యాబ్ డ్రైవర్ సారీ చెప్పి తన ఉద్దేశమది కాదని అంటాడు. Edinburgh లో మంచుని, ప్రకృతి అందాలని ఆస్వాదిస్తాడు. దాదాపు ఏడాది తర్వాత ఆమె అతని ప్రేమని అంగీకరిస్తుంది.
జనవరి 2022లో మళ్ళీ Edinburgh వెళ్తాడు. ఆమె తన కుటుంబ నేపథ్యం చెప్తుంది. తల్లిది స్కాట్‌లాండ్ అనీ, తండ్రి ఇరాన్ దేశస్తుడనీ, స్కాట్‌లాండ్‌లో స్థిరపడ్డామని చెప్తుంది. వాళ్ళ కుటుంబం పెళ్ళికి ఒప్పుకుంటుంది. ఇరాన్ పద్ధతులలో ఇరాన్ లోనూ, తెలుగు పద్ధతిలో ఇండియాలోనూ పెళ్ళి చేసుకోవాలని అనుకుంటారు. ఎంగేజ్‌మెంట్ జరుగుతుంది. తల్లిని తీసుకుని బేబీ కుటుంబంతో ఇరాన్ బయల్దేరుతాడు. టెహ్రాన్ లోని అన్ని పర్యాటక ప్రాంతాలు చూస్తారు. స్థానిక ఆహారం రుచి చూస్తారు. కానీ టెహ్రాన్ అజాదీ టవర్ దగ్గర కారు బాంబు పేలడం, దుండగులు ఎకె47 గన్స్‌తో కాల్పులు జరపడంతో, బేబీ కుటుంబంలోని వ్యక్తి చనిపోతాడు. మిగతావారు గాయాలతో బయటపడతారు. తర్వాత కొద్ది రోజులకి Edinburgh చేరుతారు. అతను వాళ్ళమ్మతో ఇండియా వచ్చేస్తాడు.
ఆగస్ట్ 2022లో మళ్ళీ Edinburgh వెళ్తాడు. బేబీని కలుస్తాడు. తన పట్ల అతని ప్రేమని బేబీ తన నాయనమ్మకు వివరిస్తుంది. అక్కడ ఓ హోటల్‌లో తమ కోసం ప్రత్యేకంగా సీట్స్ రిజర్వ్ చేయించి – ఆమె ఊహించిన రీతిలో ఒక సర్‌ప్రైజ్ ఇస్తాడు. ఆమె అబ్బురపడుతుంది. ఇండియాలో పెళ్ళి చేసుకోడానికి వాళ్ళంతా అంగీకరిస్తారు.
2022 నవంబర్. బేబీ బంధువులంతా ఇండియా వస్తారు. భద్రాచలం రామాలయం, విజయవాడ కనకదుర్గ గుడి సందర్శిస్తారు. షాపింగులు చేస్తారు. అనుకున్న ముహూర్తానికి అతనికీ, బేబీకి పెళ్ళవుతుంది. పెద్దలంతా ఆశీర్వదిస్తారు. దంపతులు తిరుమల వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోడం తమ కుటుంబం ఆనవాయితీ అని తల్లి చెప్పడంతో, మొదట తిరుపతి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నాకా, దక్షిణ భారత యాత్రకి బయల్దేరుతారు దంపతులు. కాణిపాకం, వెల్లూరు, కాంచీపురంలలో పలు ఆలయాలు దర్శిస్తారు. అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు. తర్వాత మహాబలిపురం చూసుకుని అరుణాచలం చేరుకుంటారు. గిరిప్రదక్షణ చేస్తారు. అరుణాచలేశ్వరుని పూజిస్తారు. అక్కడ్నించి రామేశ్వరం చేరి ఆలయ దర్శనం చేసుకుని సముద్ర తీరం చేరి, అక్కడ కాసేపు గడుపుతారు. తరువాత, మున్నార్, పొలాచ్చి, మైసూర్, మడికేరి, మంగుళూరులోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను దర్శిస్తారు, గొప్ప అనుభవాలను ప్రోది చేసుకుంటారు. అక్కడ్నించి ఉడిపి, గోకర్ణ మీదుగా ప్రయాణించి, గోవా చేరుకుంటారు. అక్కడ కొన్ని రోజులు గడిపి, యాత్రలకు ముగింపు పలికి ఎవరిళ్ళకి వాళ్ళు చేరుకుంటారు. అతనికి సినిమా రంగంలో అవకాశాలొస్తాయి, దర్శకుడిగా రాణిస్తాడు.
జూలై 2023. బేబీ గర్భవతి అవుతుంది. సీమంతం కోసం ఇండియాకి తీసుకువస్తారు. కార్యక్రమం పూర్తి కాగానే, కాశీ, ప్రయాగ, బుద్ధ గయ చూపించి, ఆమెను Edinburgh లో దింపేసి వస్తాడు. అర్జెంటు షూటింగులు ఉండడంతో, ఇరవై రోజుల తర్వాత Edinburgh బయల్దేరుతాడు. బేబీకి ఆడపిల్లలు కవలలు జన్మిస్తారు. 2024లో పిల్లలతో తొలి ఉగాదిని జరుపుకుంటాడు.
***
కొన్ని జ్ఞాపకాలతో కాలంలో వెనక్కి వెళ్ళి సెప్టెంబర్ 2022లో జరిగిన సంతోషకరమైన, బాధాకరమైన ఘటనలను స్మరించుకుంటాడు. Edinburgh Festival Fringe పాల్గొనడానికి వెళ్తే, అక్కడి పోలీసులు అరెస్టు చేస్తారు. బేబీ ఫోటోని చూపించి, ఈమెను ఎందుకు చంపావు, ఎవరు నువ్వు, నీది ఏ టెర్రరిస్టు గ్రూపు అంటూ ప్రశ్నిస్తారు. నేరారోపణ చేస్తారు. ఇంతలో ఒకడు అతనిపై కాల్పులు జరుపుతాడు. చివరికి నేరం చేసింది అతను కాదనీ, ఓ పాకిస్తానీ తీవ్రవాది అని తేలడంతో అతన్ని వదిలేస్తారు. గాయం నయమయ్యాకా, అతను అక్కడ్నించి వచ్చేస్తాడు. చనిపోయినది బేబీ కాదు!
నవంబర్ 2021. బేబీ కుటుంబాన్ని దుబాయ్‌కి ఆహ్వానిస్తాడతను. ఆమె పుట్టిన రోజు సందర్భంగా, బుర్జ్ ఖలీఫా టవర్ మీద గ్రీటింగ్స్ ప్రకటన వేయించి అబ్బురపరుస్తాడు.
ఆమె ప్రేమని దక్కించుకున్న తరువాత, ఆమెతో కలసి ప్రపంచంలోని గొప్ప గొప్ప ప్రదేశాలను సందర్శిస్తాడు. ఇద్దరూ తమలోని ప్రేమతో తాదాత్మ్యం చెందుతారు.
ఇక్కడితో నవల ముగుస్తుంది. రచయిత సినిమా రంగానికి చెందినవారు కాబట్టి నవలని కూడా ఒక ‘ఫీల్ గుడ్ మూవీ’లా మలచాలని ప్రయత్నించారు. ప్రేమ కథకు నప్పేటి భాష, యాత్రాగాథలకి అవసరమైన ప్రకృతి వర్ణన, భావుకత ఉండడం; ఆయా ప్రాంతాలు, ప్రదేశాల గురించి చెప్తున్నప్పుడు సంబంధిత చరిత్ర అందించడం వల్ల నవల పఠనీయత పెరిగింది.
ప్రేమ గురించి రాసేటప్పుడు, ప్రేమికురాలిని స్మరించుకున్నప్పుడు – కొన్నిసార్లు రచయిత సుదీర్ఘ వాక్యాలు రాసారు.
కథలో వచ్చే కొన్ని ముఖ్యమైన ఘట్టాలకు అందించిన చిత్రాలు చాలా బావున్నాయి. ఈ బొమ్మలు అందించిన ఆర్టిస్టు గురించి శ్యామ్ గారు తన ఇంటర్వ్యూలో చెప్పారు. వర్ణ చిత్రాలు, అద్భుతమైన ప్రింటింగ్ క్వాలిటీ, అందమైన ముఖచిత్రం ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణలనడంలో సందేహం లేదు.
~
విస్తృతమైన కాన్వాస్ పై సృజనాత్మక చిత్రణ ఈ నవల! స్థలకాలాదుల హద్దులను దాటిన ప్రేమ కథ అని రచయిత వెనుక అట్ట మీద పేర్కొన్న వాక్యాలు నిజమేనని భావిస్తారు పాఠకులు ఈ పుస్తకం చదవడం పూర్తి చేశాకా.
***
రచన: శ్యామ్ మైల్‌స్టోన్
ప్రచురణ: మైల్స్ పబ్లికేషన్స్
పేజీలు: 250
వెల: ₹ 499/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా,
హైదరాబాద్: ఫోన్: 9000413413
~
మైల్స్ పబ్లికేషన్స్, ఫోన్: 9966332681
ఆన్‍లైన్‍లో:
https://www.amazon.in/Scottish-Girl-Telugu-Original-Romance/dp/8199430990/
~
శ్యామ్ మైల్‌స్టోన్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-shyam-milestone/
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.
